డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 64

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉంగరం పెడుతున్నంత సేపు తేజా వంక చూస్తున్నా వౌళి కళ్ళల్లో సీరియస్‌నెస్ కనిపించింది. అది చేస్తున్న పనిమీద శ్రద్ధో లేక జరుగుతున్న వివాహానికి కమిట్‌మెంట్ అవ్వచ్చు కానీ తేజ పూర్తిగా, హాయిగా, స్వేచ్ఛగా సంతోషంగా కనిపించింది. వౌళి చేతికి ఉంగరం పెట్టి ఎడం చేతిలో ఉన్న వౌళి కుడి చేతిని మృదువుగా నొక్కి వదిలింది. ‘రిలాక్స్’ అవడానికి సంకేతమేమో!
మన దేశంలో పెళ్లిళ్లలాగా సుముహూర్తం అవగానే అక్షతలు వేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. వేసి వేయడంలో పెళ్లి హాలులోనుంచి నిష్క్రమించాలని తొందరపడలేదు. పెళ్లి పూర్తి అయ్యాక, వౌళి, తేజా మండపానికి ముందుగా నుంచుని సభాసదులందరికి నమస్కారం చేస్తూ నిలబడ్డారు.
తేజ చెలెళ్ళు ఇద్దరూ వెండి పళ్ళాలు అక్షింతలు పట్టుకు నిలబడ్డారు.
ఆహుతులయిన అతిథులందరూ, రెండు పక్కలనుంచి, పళ్ళెంలో ఉన్న అక్షతలు అందుకుని కొత్త దంపతులమీద చల్లి ఆశీర్వదించి మధ్యగా ఉన్న దోవ వెంట వెళ్లిపోతున్నారు సరాసరి డైనింగ్ హాల్లోకి, అక్కడ మూర్తిగారి తరఫున నిలబడిన వారి సూచనలు అందుకుంటూ.
స్టేజి పక్కగా వేలాడున్న కర్టెన్ పక్క నుంచుని శాస్ర్తీగారి చేతిలో ఉన్న మైక్ ఇవ్వమని అడిగాను. ఆయన ఆశ్చర్యంగా చేతికి అందించాడు.
ఆ క్షణంలో నా మనసు ఎంత తేలికగా అనిపించిందో. ఆనందంతో ఉయ్యాలలూగుతున్నట్లు అనిపించింది. ఏదో తెలియని సంతృప్తి ఆవరించింది. ఆనందాతిశయంలో హృదయంలోంచి ఒక మధురమయిన భావం బయటికు వచ్చింది. ఎవరూ అడగకపోయినా, ముందుగా అనుకోకపోయినా ఒక చక్కని పాట నా గొంతులోంచి మైక్‌లోకి వెళ్లింది. ‘‘ఆకాశమే పందిరాయే! ఆనందమే వెల్లువాయే!’’ నా మనసులో భావం ఆ పాటగా మారిపోయింది.
చేతులు జోడించి నుంచున్న వౌళి తల తిప్పి చూశాడు ఆశ్చర్యంతో. ఇందాక కనిపించిన సీరియస్‌నెస్ ఇపుడు ముఖంలో వ్యక్తం కావడంలేదు.
అది నా పాట విన్నాకో, ముందుగానే అలా ఉందో నాకు తెలియదు.
ప్రసన్నంగా ఉన్న వాడి వదనం నాలో మరింత ప్రశాంతత చేకూర్చింది.
సశాస్ర్తియంగా జరిగిన పెళ్లి, సర్వోపేతంగా ఉన్న విందు, చూస్తూ అనుకున్నాను, ఇప్పుడు మన దేశంలో కనిపించడం మానేసిన పదార్థాలు ఎన్నో కనిపించాయి. పూర్తిగా పూర్వకాలపు పెళ్లి భోజనంలా ఉంది. ఇక్కడున్న భారతీయులు సాంప్రదాయాల్లో ఎక్కడా కాంప్రమైజ్ అవడంలేదు. తెలియనివాటిని కూడా తెలుసుకుని జరిపించుకుంటున్నారు.
అక్కడ మనం నార్త్ ఇండియన్ వెరైటీస్, వెస్ట్రన్ వెరైటీస్‌తో భోజనం పెడుతూంటే వీళ్ళు సిసలైన తెలుగు పెళ్లి భోజనం ఏర్పాటుచేసుకుంటున్నారు. వీరిలో మన భాషా నిలపాలన్న తపన బాగా కనిపిస్తోంది. చివరకు పాత సాంప్రదాయాలు ఇక్కడే నిలబడిపోతాయేమో అనుకున్నాను. చాలాకాలం ముందు అమెరికా వచ్చిన వారంతా ఒక టైం ఫ్రేమ్‌లో నిలబడిపోయారు. వారితో తెచ్చుకున్న జ్ఞాపకాలను, వదులుకోవడానికి సిద్ధంగా లేరు. కాలంతో తోసుకొస్తున్న మార్పులు వీరి మీద పడి ప్రభావితం చేయడంలేదు.
వారు వదిలి వచ్చిన భారతీయతను బలంగా ప్రతిష్ఠాపన చేసుకున్నారు. పిల్లలకు అందించాలని తాపత్రయపడుతున్నారు. కానీ దాంతోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయేమో! తల్లిదండ్రులు చెప్పిన సాంప్రదాయాలు, సంస్కృతి, నిజాయితీ ఏవీ ఇప్పుడు కనిపించడంలేదు.
వాటిని ఎదురుచూస్తూ వెళ్లిన రెండవ తరంకు కొంచెం నిరుత్సాహమే ఎదురవుతుంది.
ఆ సాయంత్రమే రిసెప్షన్. అది డిట్రాయిట్ నగరంలో ఉన్న పెద్ద రెన్ సెంటర్ అనే చోట ఏర్పాటుచేసుకున్నారు. ఎలివేటర్ ఎక్కి లోపలికి అడుగుపెట్టగానే- మంచుతో తయారుచేసిన శివపార్వతి శిల్పం ఎదురుగా నిలబడి ఉంది. క్రింద పెద్ద పళ్లెం దాని మధ్యగా క్రిస్టల్ క్లియర్ ఐస్. రూంలో వెచ్చదనాన్ని మెల్లిగా కరుగుతూ నీటిచుక్కలు పళ్ళెంలో జారిపడుతున్నాయి. కరుగుతున్న మంచు మరింతగా మెరుస్తోంది. పక్కనున్న లైట్స్ ప్రతిబింబించడంతో శిల్పంమీద అన్ని రంగులు గోచరిస్తున్నాయి.
కొద్ది నిమిషాలు ఆ విగ్రహాన్ని చూస్తూ నిలబడిపోయాను. ఎంత అందంగా మలిచారు. అమెరికాలో అంత అందమయిన శివ పార్వతులను, అందులోను మంచుతో. అభినందించకుండా ఉండలేకపోయాను.
సాయంత్రం 6 గంటలనుంచి సోషల్ అవర్ మొదలైంది. రకరకాల స్నాక్స్‌తో, బీరు, వైన్, డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ అన్నింటిని ఆఫర్ చేశారు. మళ్లీ అందరూ అటెండ్ అయ్యారు. మధ్యాహ్నం దాకా టెంపుల్‌లో గడిపి, సాయంత్రం మళ్లీ అందరూ వచ్చారు. వాళ్ళందరినీ చూస్తుంటే మూర్తిగారంటే ఎంత గౌరవం ఉందో అనుకున్నాను.
ఈ రిసెప్షన్ మధ్యహ్నానికి పూర్తిగా వ్యతిరేకం. ఇది పూర్తిగా సోషల్ ఫంక్షన్. తేజ క్లాసుమేట్స్, వౌళి క్లాసుమేట్స్ చాలా మంది వచ్చారు. మూర్తిగారి ఆఫీసులో పనిచేసేవారు, కొలీగ్స్, అందరూనూ. అందరిని వేరు వేరు టేబుల్స్‌మీద పేర్లుతో సహా కేటాయించారు. వౌళి, తేజాతో పాటు మూర్తిగారు, సావిత్రి, నేను అందరం నిలబడ్డాం. వచ్చిన అతిథులు అంతా మా అందరికి కంగ్రాట్యులేన్స్ చెప్పి షేక్‌హ్యాండ్ ఇచ్చి, తక్కినవారితో గడపసాగారు, ఫలహారాలు తింటూ.
సరిగా 7.30 అయ్యేటప్పటకి ఆ హాలు తాలూకు పార్టీ కోఆర్డినేటర్ వచ్చి సన్నగా బెల్ మోగించింది. అందరూ వెళ్లి కూచోమనడానికి సూచనగా.
ఎవరికివారు వారికి కేటాయించిన టేబుల్‌మీదకు వెళ్లారు. లోపల నుంచి మ్యూజిక్ వినిపిస్తోంది. ఎం.సి పిలిచేవరకు అందరం ఆగిపోయాము.
మొదటగా ఎం.సి తేజ చెల్లెళ్ళు ఇద్దరినీ పిలిచాడు. బ్యూటిఫుల్ బ్రైడ్ సిస్టర్స్ అంటూ అతిథులు కరతాళ ధ్వనులు చేస్తూ ఉంటే అందరి మధ్య నుంచి నడుస్తూ వెళ్లి ఎదురుగా ఉన్న హెడ్ టేబుల్ మీద కూర్చున్నారు. తరువాత నన్ను, చంద్రశేఖర్‌ని పిలిచారు. శ్రీలక్ష్మి పిల్లాడు గొడవ చేస్తాడని, హెడ్ టేబుల్‌మీద కూర్చోనంది.
మేమిద్దరం వెళ్లాం. ఆ పెద్ద హాల్‌లో అడుగుపెట్టగానే ఆశ్చర్యపోయాను. అంత అందంగా అలంకరించిన హాల్‌ని నేనే పెళ్లిలోనూ చూడలేదు. విశాలమైన హాల్.
ఆ హాల్ చుట్టూ పెద్ద పెద్ద విండోస్ ఉన్నాయి. విండోస్‌లోంచి బయట డిట్రాయిట్ రివర్ కనిపిస్తుంది. ఆ రివర్‌లో దూరంగా అంబాసిడర్ బ్రిడ్జి, పెద్దగా లైట్లతో వెలుగునిస్తోంది. రూం నిండా టేబుల్స్. టేబుల్స్ మధ్య పెద్ద పెద్ద గులాబీలతో కూర్చిన ఫ్లవర్ బొకేస్. అన్ని కుర్చీలు అందంగా అలకరించిన పీచ్ కలర్ కవర్స్. వెనుకనుంచి వినిపిస్తున్న చక్కని మ్యూజిక్.
ఎం.సి నన్ను గురించి మోస్ట్ ఎలిగెంట్ యంగ్ ప్రిన్సిపాల్ ఫ్రమ్ ఇండియా అంటూ పరిచయం చేశాడు.
అవర్ గ్రేసియస్ హోస్ట్ మిస్టర్ అండ్ మిసెస్ మూర్తి అని పిలిచారు. తరువాత మూర్తిగారు, సావిత్రి నడుస్తున్నంత సేపు చప్పట్లతో మారుమోగిపోయింది. తరువాత కొంతసేపు పూర్తిగా విరామం.
తరువాత మంచి ఇంగ్లీష్ పాట వచ్చింది. అది పూర్తవుతుంటేనే ఎం.సి ఎనౌన్స్ చేశాడు- నౌ ది న్యూలీ వెడ్స్!
డా.చంద్రశేఖర వౌళి అండ్ తేజస్విని. ఫస్ట్ టైమ్ మిస్టర్ అండ్ మిసెస్ చంద్రవౌళి అన్నాడు గట్టిగా. ఫుల్ సూట్‌లో వౌళి, పూర్తిగా ఎంబ్రాయిడరీతో మెరిసిపోతున్న జార్జెట్ గాగ్రచోళితో తేజ ఒకరి చేతిలో ఒకరు చెయ్యి కలుపుకుని రెండో చేత్తో అతిథులందరికి వేవ్ చేస్తూ నడుస్తూ బయలుదేరారు. రూం అంతా కరతాళ ధ్వనులతో నిండిపోయింది. అతిథులు అందరూ నుంచుని సంతోషంగా స్వాగతం పలికారు.
ఎం.సి మాట్లాడుతూనే ఉన్నాడు. వౌళిని గురించి తేజాని గురించి చెప్తూనే ఉన్నాడు.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి