ఖమ్మం

ముంచి తెంచే హక్కు మీకెక్కడిది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్: పోలవరం ముంపు ప్రాంతాలను తెంచి ముంచే హక్కు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎవరిచ్చారని భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి నాయకులు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం కట్టుకోవడం తప్పుకాదని, ఆ సాకుతో ముంపులో ఉన్న ఏడు మండలాలను పూర్తిగా జల సమాధి చేయాలని చూస్తున్నారని వారు తప్పుబట్టారు. తలాతోకా లేని పెద్ద మనుషులు చేసిన విభజనతో మొండెం లేని తలకాయగా భద్రాద్రి మిగిలిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక రెడ్ల సంత్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి అధ్యక్షుడు బూసిరెడ్డి శంకర్‌రెడ్డి, సభ్యులు ఎస్కే అజీం, దామెర్ల రేవతి, కూనారపు రాము, గంజి సంపత్ మాట్లాడారు. పోలవరం ఎత్తు పెంచుతామని ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబునాయుడు ప్రకటించారని, అదే జరిగితే భద్రాద్రి రామలయమే జల సమాధి అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే ముంపు ప్రాంతాల ప్రజల ఆవేదనను అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, మెరుగైన ప్యాకేజీ అంటూ సర్వం లాక్కుంటోందని ధ్వజమెత్తారు. రైతుల నుంచి పొలాలు సేకరించి ముష్టి వేసినట్లు పరిహారం ఇస్తున్నారని, అక్కడ ఎకరాకు ఇచ్చే పరిహారంతో మైదాన ప్రాంతంలో 10 సెంట్ల భూమి కూడా కొనుగోలు చేసే వీలుండదని పేర్కొన్నారు. ఏడు మండలాలను ఆంధ్రాలో కలుపుకున్నది జల సమాధి చేయడానికి కాదని, ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంబిస్తున్న విధానం సరైంది కాదన్నారు. పోలవరం ఎత్తు పెంచితే ఊహించని ముంపు ఉంటుందని, రాముడు నడయాడిన ఆనవాళ్లు కూడా జల సమాధి అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఆనాడు అధికారంలో ఉన్న దద్దమ్మలు శాస్ర్తియత లేకుండా విభజించి ఏడు మండలాల ప్రజల జీవితాలతో చెలగాడమాడారని అన్నారు. విభజనతో భద్రాద్రి, ముంపు ప్రాంతాలు తలలేని మొండెంగా మిగిలాయని, ప్రధాని మోడీ జోక్యం చేసుకుని ఈ ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఆయన కోరారు. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఈ ప్రాంత ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. భద్రాచలం, ముంపు మండలాల పరిరక్షణ కోసం భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మలి దశ ఉద్యమాన్ని నిర్మిస్తామన్నారు. ఆగస్టు 1వ తేదీన కార్యచరణ రూపొందించి, ఆగస్టు 3వ తేదీ నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడతామని వారు తెలిపారు. పాలకులు పట్టించుకోకపోవడం వల్ల ఈ ప్రాంతం అనాథగా మిగిలిందని, అటు తెలంగాణ ప్రభుత్వం మాయమాటలతో కాలక్షేపం చేస్తుంటే, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విలీన ముంపు మండలాల ప్రజల సమస్యలను గాలికొదిలేసిందన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయని, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు. పోలవరం నిర్మాణంతో ముంపునకు గురేయ్య ప్రతి ఎకరాకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని, అప్పుడే రైతులు చేసిన త్యాగాలకు ఫలితం ఉంటుందన్నారు. ప్రధాని నరేంద్రమోడీ భద్రాచలం పట్టణం, విలీన ముంపు మండలాల సమస్యలపై స్పందించాలని, ఈ ప్రాంతానికి కేంద్ర పాలిత హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.