మహబూబ్‌నగర్

జూరాలకు సాగునీరు విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి: జూరాల కుడి, ఎడమ కాలువలకు సాగునీటిని ఈ నెల 28వ తేదీ నుండి విడుదల చేయాలని, పై నుండి వచ్చే వరదను దృష్టిలో ఉంచుకొని భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలకు కూడా సాగునీటిని విడుదల చేయాలని జిల్లా సాగునీటి పారుదల సలహాబోర్డు సమావేశం నిర్ణయించింది. గద్వాల జిల్లా కలెక్టర్ రజిత్‌కుమార్ షైని అద్యక్షతన గురువారం వనపర్తి జిల్లా పెబ్బేరు పిజెపి అతిథిగృహ ఆవరణలో నిర్వహించిన జిల్లా నీటిపారుదల సలహాబోర్డు సమావేశంలో నిర్ణయించారు. జూరాలతో పాటు ఎత్తిపోతల పథకాలకు ఈ ఖరీఫ్‌లో సాగునీటి విడుదల విషయమై ముందుగా ప్రజాప్రతినిధులు, అధికారుల అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఆల్మట్టి నిండేందుకు 18 టిఎంసిల నీరు మాత్రమే అవసరం ఉండటం, అలాగే వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఆగస్టు 3,4 తేదీల నుండి మంచి వర్షసూచన ఉన్నందున జూరాల కింద లక్షా 2వేల ఎకరాలకు 28 నుండే నిర్ణయించడం జరిగిందని, ఆగస్టు 3,4 తర్వాత పైన కురిసే వర్షాలకు వచ్చే వరదను దృష్టిలో ఉంచుకొని అన్ని ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత యేడాది కంటె ఈ యేడాది కెఎల్‌ఐ ద్వారా వంద శాతం ఆయకట్టుకు నీరు అందించే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. చిన్న చెరువులను పెద్దచెరువులుగా మార్చడంతో పాటు కెఎల్‌ఐ ప్రధాన కాల్వలకు లైనింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రైతుల పొలాలలో ట్రెంచ్ ఏర్పాటు చేసుకొని కూరగాయలు, ఇతర పంటలు వేసుకోవాలన్నారు. రాష్ట్ర ఫ్రణాళికా సంఘం ఉపాద్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా కెనాల్స్‌కు నీరు ఇవ్వాలని, తర్వాత ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేయాలని, శంకర సముసద్రం సెటర్లను త్వరగా బిగించి నీటి విడుదల చేయాలని, భీమా 27వ ప్యాకేజి కింద పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని, ఎత్తిపోతల పథకాల కింది రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని ఆయన కోరారు. జిల్లా పరిషత్ చైర్మెన్ బండారి భాస్కర్ మాట్లాడుతూ తక్షణమే వరినారు మల్లకోసం కాలువల ద్వారా నీటిని వదలాలన్నారు. వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ వరినారు మల్లకు సరిపడా నీరు ఉన్నందున తక్షణమే నీరు వదలాలని, శంకరసముద్రం గేట్లపైన శ్లాబ్‌వేసి ఈ సంవత్సరం పూర్తి స్థాయి నీరందించాలని, ప్దె వర్షాలు వస్తే ఎత్తిపోతల పథకాలకు కూడా నీరివ్వాలని, జూరాల సమాంతర కాలువకు బైనింగ్ చేయించాలని, జూరాలలో 12 టిఎంసిల నీరు నిలువ ఉంచాలని, రామన్‌పాడు తాగునీటి పథకాల ద్వారా తాగునీటికి ఆటంకం కలుగ కుండా చూడాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీయర్ ఖగేందర్, జూరాల ఎస్‌ఇ రఘునాథ్‌రావు, భీమా, నెట్టెంపాడు ఎస్‌ఇ భద్రయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

పేదల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
వనపర్తి: రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆర్థికాభివృద్ధి సాధించి హాయిగా జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అందుకే వివిధ రకాల సహాయ సహాకారాలను అందిస్తున్నదని వాటిని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులతో పాటు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారిన ప్రస్తుత పరిస్థితుల్లో పేద, మధ్య తరగతి ప్రజలు ఆడపిల్ల పెళ్లిళ్లకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తున్నదని దీన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కెసి ఆర్ వారికి చేయూతనిచ్చేందుకు అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉండేలా కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాలను ప్రవేశ పెట్టి రూ.75,116లు ఇస్తున్నట్లు తెలిపారు. వనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాలను నిక్కచ్ఛిగా అమలు చేయాలని వీటి అమలుల్లో లభ్ధిదారులు ఎవ్వరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల గురించి ఆయన మాట్లాడుతూ సంపాదించే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం రూ.6లక్షలు ఇస్తున్నదని వీటి ద్వారా పిల్లలను చదివించుకోవాలని, ఆర్థికంగా నిలదొక్కుకునే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆర్డీ ఓ చంద్రారెడ్డి మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి, షాదిముబారక్‌ల కింద జిల్లాలో 331 మందికి చెక్కులు అందజేస్తుండగా ఒక్క వనపర్తి నియోజకవర్గంలో 191 మందికి ఇస్తున్నట్లు తెలిపారు. షాదిముబారక్ కింద 20మందికి చెక్కులు ఇస్తున్నామని, ఆత్మహత్యలకు పాల్పడ్డ 8 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.6లక్షల చొప్పున ఇవ్వడం జరుగుతుందన్నారు. లబ్ధిదారు, తహశీల్దార్ జాయింట్ ఖతాలో రూ.5లక్షలు, ఆర్డీ ఓ ఖతాలో రూ.లక్ష వేయడం జరుగుతుందని అనంతరం వీటిని లబ్ధిదారులకు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జె.సి నిరంజన్, ఎంపిపి శంకర్‌నాయక్, మున్సిపల్ ఛైర్మన్ రమేష్‌గౌడ్, వైస్ ఛైర్మన్ బి.కృష్ణ, మార్కెట్ కమిటీ అధ్యక్షులు రవి, గ్రంథాలయ ఛైర్మన్ లక్ష్మయ్య, కౌన్సిలర్లు లోక్‌నాథ్‌రెడ్డి, గట్టుయాదవ్, భువనేశ్వరి, శంకర్, మున్సిపల్ కమిషనర్ వీరబుచ్చయ్య, తహశీల్ధార్ పాండునాయక్ ఉన్నారు.

నడిగడ్డ ప్రాంతంపై ప్రభుత్వం నిర్లక్ష్యం
గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయిగా ఉన్న జూరాల ప్రాజెక్టు నిర్మాణానికి ఈ ప్రాంత ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారని, భూములు, ఇళ్లు కోల్పోయి వారి త్యాగాల ఫలంగా జూరాల ప్రాజెక్టు నిర్మాణం పెరిగితే ఈ ప్రాంత ప్రజలకు సాగు, తాగునీరు అందించకుండా టిఆర్‌ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ మండిపడ్డారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటి సలహా మండలి సమావేశం జిల్లా కేంద్రంలో జరిగేదని, కొత్తగా ఏర్పడిన జిల్లాల పునర్విభజన సందర్భంగా జూరాల ప్రాజెక్టు ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లాలో సమావేశాలు నిర్వహించాల్సి ఉందన్నారు. గతేడాది గద్వాలలోని బాలభవన్‌లో సమావేశం నిర్వహించిన సంగతి గుర్తు చేశారు. గత కొంత కాలంగా ఈ ప్రాంతం రైతాంగంతో పాటు తాము సాగునీటి కోసం జూరాల కాలువలకు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి నీటిని విడుదల చేయాలని కోరుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తాగునీటి పేరిట కోయిల్‌సాగర్‌కు 2 టిఎంసిల నీటిని అక్రమంగా తరలించిన అధికారుల, నేతల బండారం బయటపడుతుందని, గద్వాలలో ఏర్పాటు చేయాల్సిన సమావేశం పెబ్బేరులో ఏర్పాటు చేసి పోలీసుల పహారా మధ్య నిర్వహించడం సిగ్గుచేటన్నారు. నడిగడ్డలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉండడంతో ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాంతంపై పెత్తనం చలాయించడంతో పాటు కక్ష్యసాధింపు చర్యలకు దిగుతున్న రాష్ట్ర మంత్రులకు, తెరాస నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. సాగునీటి సలహా సంఘం సమావేశం గద్వాలలో ఏర్పాటు చేయకుండా తమకు కేవలం ఫోన్‌లో మెసేజ్ పెట్టి అవమానపర్చారని, అందుకు నిరసనగా ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో పాటు తాము హాజరు కాలేదని ఆమె చెప్పారు. త్వరలోనే జూరాల ఆయకట్టు రైతులకు సాగునీటిని విడుదల చేయడంతో పాటు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా అన్ని రిజర్వాయర్లను నీటితో నింపి కాలువలకు సాగునీటిని విడుదల చేయాలని, లేని పక్షంలో నడిగడ్డ రైతులకు ఆగ్రహానికి గురికాక తప్పదని ఆమె హెచ్చరించారు. ఈ ప్రాంతానికి చెందిన అధికారులు, పోలీసులు గులాబి నేతలకు తొత్తులుగా మారారని, ఇది మంచి పద్ధతి కాదని...చట్టానికి ఎవరు అతీతులు కారన్న సంగతి గ్రహించి మసలుకుంటే మంచిదని హితవు పలికారు.
మానవ జాతి మనుగడకు మొక్కలు నాటాలి
పెబ్బేరు: మానవ జాతి మనుగడ సాధించాలంటే మొక్కలను నాటాలని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడవ విడుత హరితహారంలో భాగంగా ఆయన గురువారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు, పోలీస్ క్వార్టర్స్ ప్రాంగణం, భీమా కార్యాలయం వద్ద మొక్కలను జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శినితో కలిసి మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరు కలిసికట్టుగా మొక్కలు నాటినట్లే వాటి సంరక్షణ బాద్యత కూడా చేపట్టాలన్నారు. మొక్కలు పెంచడమే కాకుండా వాటిని బాగోగులు చూసే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. నాటిన ప్రతి మొక్కను పెంచే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి నిధులు కూడా అందజేస్తుందని ఆయన తెలిపారు. ఉపాధి కూలీలకు డబ్బులు రావడం లేదని అక్కడే ఉన్న ఉపాధి కూలీలు నిరంజన్‌రెడ్డి దృష్టికి తేవడంతో ఆయన స్పందిస్తూ వెంటనే డబ్బులు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఇ భద్రయ్య, ఇఇ ఉమాపతి రావు, జిల్లా వ్యవసాయ అధికారి సుజాత, ఎక్సైజ్ సిఐ ఓంకార్, కొత్తకోట సిఐ శ్రీనివాసులు, ఎంపిడిఓ సుజాత, జిల్లా మార్కెటింగ్ అధికారి స్వరణ్‌సింగ్, జడ్పిటిసి ప్రకాష్, ఎంపిపి పద్మావతి, మార్కెట్ ఛైర్మన్ గౌని బుచ్చారెడ్డి, సర్పంచు అక్కి సుశీల, విండో ఛైర్మన్ కోదండరాంరెడ్డి, ఎంపిటిసిలు, టిఆర్‌ఎస్ నాయకులు హరిశంకర్ నాయుడు, జలీల్, శ్రీనివాస్‌గౌడ్, లారీ ఓనర్స్ అసోసియేషన్, హమాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఉద్యమంలా హరితహారం
నవాబుపేట: హరితహారం కార్యక్రమం ఉద్యమంలా నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర హరితహారం ఓఎస్‌డి , ముఖ్యమంత్రి పేషీ ప్రియాంక వర్గీస్ అన్నారు. గురువారం మండల కేంద్రంతో పాటు, మండల పరిధిలోని గురుకుంట, కాకర్లపహడ్ గ్రామాలల్లో నిర్వహించిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో వివిధ రకాల మొక్కలు నాటిన ఆమె గత సంవత్సరం ఇదే కార్యక్రమంలో భాగంగా తాను నాటిన మొక్కలు ఏపుగా ఎదగడాన్ని చూసి పులకరించి పోయారు.ఈసందర్బంగా గురుకుంట ప్రాథమికోన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడలను ఆమె మంజూరీ చేశారు. కార్యక్రమాలల్లో ఎంపిపి శ్రీనయ్య, జడ్పిటిసి ఇందిరాదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహాచారీ, ఎంపిడిఒ సాయిలక్ష్మి, తహశీల్‌దార్ శ్రీనివాస్, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహులు, నాయకులు ప్రతాప్ సంజీవరెడ్డి, గోపాల్‌గౌడ్,సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.