అనంతపురం

రక్షక తడులేవీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం : ఓవైపు తీవ్ర వర్షాభావం.. మరోవైపు ఎండుతున్న పంటలు.. వెంటాడుతున్న వరుస కరవు.. ఈపరిస్థితుల్లో జిల్లా రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉంది. వేసిన పంటలు దిగుబడి రావాలంటే ఈనెలాఖరులోగా ఖరీఫ్ వేరుశెనగ సాగు చేసుకోవాల్సి ఉందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అయితే మేఘాలు ఊరిస్తుండగా, వరుణుడు కరుణించకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు కేవలం 65 వేల హెక్టార్లలో మాత్రమే ఖరీఫ్ వేరుశెనగ వేశారు. మరికొద్ది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ముగియనుంది. ఆగస్టులో వర్షాలు కురిసినా వేరుశెనగ సాగుకు అంతగా ఉపయోగం ఉండదు. అధికారుల లెక్కల మేరకు ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 20వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. కాగా 5 రోజుల్లో 20వేల ఎకరాల్లో పంటలు కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 24న అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా ఇన్‌చార్జి, జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లా మంత్రి కాలువ శ్రీనివాసులు, టిడిపి నేతలు పెనుకొండ, పామిడి ప్రాంతాల్లో బుధవారం రెయిన్‌గన్లతో వేరుశెనగకు రక్షకతడులిచ్చి హడావుడి చేశారు. ప్రభుత్వం ఆదేశించిన గడువు మేరకు ఇప్పటికే నాలుగు రోజులు గడిపోయాయి. ప్రణాళికాబద్ధంగా రక్షక తడులు ఇచ్చేందుకు మరో వారంరోజులు పట్టేలా ఉంది. కాగా అధికారిక లెక్కల మేరకు 49 మండలాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే రెయిన్‌గన్ల నిర్వహణపై వర్క్‌షాపుతోపాటు జిల్లా అధికారులు, వివిధ కంపెనీలతో ఇన్‌చార్జి కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు చేశారు. రక్షక తడుల నిర్వహణలో 15 కంపెనీలను ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిలో 2 కంపెనీలు విముఖత చూపుతున్నాయి. ఇన్‌చార్జి కలెక్టర్ నిర్వహించిన సమావేశానికి వీటి ప్రతినిధులు గైర్హాజరయ్యారు. కాగా గతేడాది 5,890 రెయిన్‌గన్లను తెప్పించారు. ఈ ఖరీఫ్‌కు 10వేల రెయిన్‌గన్లతో రక్షక తడులిచ్చి పంటలు కాపాడాలన్నది లక్ష్యం. కాగా పంటలు ఎండుతున్న 49 మండలాల్లో ఒక్కో కంపెనీకి 3, 4 మండలాలు కేటాయించనున్నారు. ఎపిఎంఐపి ఆధ్వర్యంలో పని చేసిన కంపెనీలూ ఇందులో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కార్యచరణ ప్రణాళిక సిద్ధం కాలేదు. రక్షక తడులు ఇచ్చేందుకు మరికొన్ని రోజులు ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. ఈలోగా రైతులు ఎవరైనా ఫోన్ చేసి చెబితే వారి పంటలకు రక్షక తడులిస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. నీటి వసతి ఉంటేనే సాధ్యమని పేర్కొంటుండటం గమనార్హం. ఇప్పటికే ఎండిపోతున్న ఖరీఫ్ వేరుశెనగ, బోర్ల కింద వేసిన ఇతర పంటల్ని కాపాడుకునేందుకు రైతులు నానాతంటాలు పడుతున్నారు. వరుణుడు కరుణించక పోతాడా అనే ఆశతో కొందరు ఖర్చుకు సైతం వెనుకాడకుండా ట్యాంకర్లతో నీటిని తోలుకుని రక్షక తడులు పెట్టుకుంటున్నారు. వర్షంపైనే ఆధారపడిన రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. జూన్‌లో సగటున 63.9 మి.మీ సాధారణ వర్షపాతానికి 59.2 మి.మీ మాత్రమే నమోదయింది. జూలైలో 67.4 మి.మీకు ఇప్పటి వరకు 56.6 మి.మీ వర్షం కురిసింది. గురువారానికి 48 మండలాల్లో వర్షం జాడే లేదు. 14 మండలాల్లో 2.5 మి.మీ పడగా, 2.5 నుంచి 5 మి.మీ వరకు ఒక్క మండలంలో మాత్రమే వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితుల్లో రక్షక తడులు ఎలా ఇస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా కంటి తుడుపు చర్యగానే మారుతుందని భావిస్తున్నారు.