అనంతపురం

వేసవిని తలపిస్తున్న నీటి ఎద్దడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం : వాణిజ్య కేంద్రం హిందూపురం ప్రజలను నీటి సమస్య పట్టి పీడిస్తోంది. రూ.వందల కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన శ్రీరామరెడ్డి తాగునీటి పథకం (పిఏబిఆర్) అస్తవ్యస్తమైంది. దీనికితోడు వర్షాభావంతో రోజురోజుకూ మున్సిపల్ బోర్లు ఎండిపోతున్నాయి. తద్వారా వేసవి తరహాలో నీటి ఎద్దడి తీవ్రతరమవుతుండటంతో ప్రజలు అగచాట్లు వర్ణణాతీతంగా మారుతున్నాయి. లక్షలాది రూపాయల వ్యయంతో పలువురు దాతలు మున్సిపాలిటీకి ట్యాంకర్లను వితరణగా ఇచ్చినా బోర్లలో నీటిమట్టం తగ్గిపోవడంతో ప్రయోజనం లేకుండాపోతోంది. ఓవైపు మున్సిపాలిటీ మరోవైపు దాతలు రెండు నెలల క్రితం నీటి ఎద్దడి నివారణకు ముందుకొచ్చినా మళ్లీ నీటి సమస్య జఠిలమవుతోంది. పిఏబిఆర్ నుంచి శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా రోజూ హిందూపురానికి 10 ఎంఎల్‌డిల నీరు సరఫరా కావాల్సి ఉండగా ఇందులో కనీసం మూడో వంతు కూడా రావడం లేదు. దీనికితోడు ఈనెల 27వ తేదీ నాటికి పదిరోజులపాటు అసలు ఏమాత్రం నీరు సరఫరా కాలేదు. ఈనెలలో ఇప్పటి వరకు సగటున 2 ఎంఎల్‌డిలకు మించి నీటి సరఫరా జరగలేదు. మొత్తం 270 ఎంఎల్‌డి నీరు పట్టణానికి రావాల్సి ఉండగా కేవలం 69 ఎంఎల్‌డిలు మాత్రమే చేరాయి. ఇకపోతే ఉచిత ట్యాంకర్ల ద్వారా సగటున రోజూ 40 ట్యాంకర్ల ద్వారా నీటిని వివిధ వార్డులకు సరఫరా చేస్తున్నా కనీస అవసరాలకు కూడా పూర్తిస్థాయిలో నీరు అందకపోవడంతో ప్రజలు ఆందోళన బాట పడుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల బోయపేట, కొల్లకుంట, శ్రీకంఠపురం ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి నీటి సమస్య తీర్చాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా దశరథరామయ్య కాలనీ, శ్రీబాలాజీనగర్, అహ్మద్‌నగర్, హస్నాబాద్, ఆర్టీసీ కాలనీ, కొల్లకుంట, శ్రీకంఠపురం, బోయపేట, చిన్నమార్కెట్, ముద్దిరెడ్డిపల్లి వంటి ప్రాంతాలకు 20 రోజులకు ఒకసారి కూడా నీరు రావడం లేదని స్థానికులు వాపోతున్నారు. మున్సిపాలిటీకి నీటి పన్ను మాత్రం ఖచ్చితంగా చెల్లిస్తున్నా కొళాయిల్లో కనీసం నెలకు ఒకసారి కూడా నీరు అందడం లేదని వాపోతున్నారు. సాధారణ నీరు ఎలాగూ అందకపోవడంతో స్థానికులు కొందరు శుద్ధ జల ప్లాంట్ వద్ద నీటి కోసం పడిగాపులు పడుతున్నారు. తాగునీటి కోసం ఇప్పటికీ బిందె రూ.6 నుండి రూ.8 దాకా చెల్లించి కొనుగోలు చేయాల్సిన దారుణమైన పరిస్థితి తమకు రావడం బాధాకరమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు సాధారణ నీరు కూడా బిందె రూ.3 నుండి రూ.4 దాకా వెచ్చించి కొనుగోలు చేస్తున్నామని మహిళలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా పిఏబిఆర్ పథకంలో ఏదో ఒక సాంకేతిక లోపం తలెత్తడంతో పట్టణ ప్రజలు నీటి కోసం అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. హిందూపురానికి పిఏబిఆర్ తప్ప మరేతర తాగునీటి వనరు లేకపోవడంతో అక్కడి నుండి నీరు అందకపోతే ఇబ్బందులకు గురి కావడం ప్రజలకు రివాజుగా మారుతోంది. మరోవైపు ప్రభుత్వం హిందూపురానికి తాగునీరు అందించేందుకు ప్రత్యేకంగా రూ.194 కోట్లతో మంచినీటి పథకాన్ని మంజూరు చేయగా టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో పర్యటించే సందర్భంగా భూమిపూజ చేయించాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. వచ్చేనెలలో బాలకృష్ణ ఇక్కడ పర్యటించే అవకాశాలు ఉండటంతో అధికారులు ఈదిశగా చర్యలు చేపడుతున్నారు.