తూర్పుగోదావరి

స్వచ్ఛ గోదావరి తీరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: గోదావరి నది తీర ప్రాంతాన్ని స్వచ్ఛ్భారత్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాల్లో భాగంగా శుభ్రపరిచే కార్యక్రమాన్ని ఒఎన్‌జిసి ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ గోదావరి తీరం పరిశుభ్రతకు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఒఎన్‌జిసి ముందుకు రావడం అభినందనీయమన్నారు. రూ.47 లక్షలతో ఏర్పాటుచేసిన ప్రత్యేక యంత్రానికి సంబంధించి ఒఎన్‌జిసి, నగరపాలక సంస్థ ఒడంబడిక ప్రాజెక్టుకు కలెక్టర్ సంతకాలు తీసుకున్నారు. నగర అభివృద్ధిలో భాగంగా ఒఎన్‌జిసి రెండు వాహనాలను అందించిందని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ అంతకుముందు డ్రెయినేజీకి సంబంధించి వివిధ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగర పారిశుద్ధ్యం మెరుగునకు నల్లా ఛానల్ డ్రెయినేజీ కోసం బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. పారిశ్రామిక కాలుష్యాన్ని తరలించేందుకు ఆయా సంస్థల సిఎస్‌ఆర్ నిధులు, ప్రభుత్వ నిధులతో డెడికేటెడ్ ఛానల్‌ను నిర్మించేందుకు డిపిఆర్ సిద్ధమవుతోందన్నారు.
గోదావరి తీరాన్ని శుభ్రంగా ఉంచడంలో ఒఎన్‌జిసి కృషి చేస్తుందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అసెట్ మేనేజర్ డిఎంఆర్ శేఖర్ అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన పారిశుద్ధ్య కార్యక్రమంలో నగరపాలక సంస్థతోపాటు ఒఎన్‌జిసి భాగస్వామ్యం వహించింది. ఈ సందర్భంగా అసెట్ మేనేజర్ భారత ప్రధాని నరేంద్రమోదీ స్ఫూర్తితో దేశంలో అమలుజరుగుతున్న స్వచ్ఛ్భారత్, రాష్ట్రంలో అమలు చేస్తున్న స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి అనుగుణంగా సామాజిక బాధ్యతగా ఒఎన్‌జిసి పలు కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా 2017 నాటికి బహిరంగ మలవిసర్జన లేని దేశంగా రూపొందించాలనే సంకల్పంతో పలుకార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ఐదు ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేశామన్నారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛ్భారత్‌కు రూ.170 కోట్లు ఒఎన్‌జిసి సహకారం అందిస్తుందన్నారు. ఇందులో భాగంగా స్థానిక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రూ.3.02 కోట్ల నిధులు పారిశుద్ధ్య మెరుగునకు అందించినట్టు తెలిపారు. 50 ఎకరాల్లో గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి కోసం పండ్ల తోటల పెంపకం జరుగుతుందన్నారు. గోదావరి పరిశుభ్రత కార్యక్రమాన్ని కోటిలింగాల ఘాట్ నుంచి ధవళేశ్వరం వరకు చేపట్టడం జరుగుతుందన్నారు.
నగర మేయర్ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ గోదావరి నదిని పరిరక్షించి డెల్టా ప్రాంత ప్రజలకు మంచినీటి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. కమిషనర్ విజయరామరాజు మాట్లాడుతూ నగరపాలక సంస్థ చేపడుతున్న స్వచ్ఛ రక్షణ పథకం కింద దేశంలో 46వ స్థానం సంపాదించుకోగలిగామన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ నగర అభివృద్ధి కోసం ఒఎన్‌జిసి అందిస్తున్న సహకారాన్ని అభినందించారు. ఒఎన్‌జిసి కేంద్రీయ పాఠశాల విద్యార్థులు స్వచ్ఛ్భారత్ కార్యక్రమంపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒఎన్‌జిసి జనరల్ మేనేజర్లు సతీష్‌కుమార్, సతీష్‌బాబు, జాన్‌వెస్లీ తదితరులు పాల్గొన్నారు.

నిరసనల సీమ
అమలాపురం: కాపు ఉద్యమనేత ముద్రగడ పాదయాత్రను అడ్డుకుని కాపు నాయకులను గృహ నిర్బంధాల్లో ఉంచడాన్ని నిరసిస్తూ అమలాపురంలో కాపు ఉద్యమ నాయకులు శుక్రవారం కూడా తమ నిరసనలను కొనసాగించారు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, కాపు జెఎసి రాష్ట్ర సంయుక్త కన్వీనర్ నల్లా పవన్‌కుమార్, టిబికె జెఎసి కోనసీమ కన్వీనర్ కల్వకొలను తాతాజీతో పాటు కోనసీమ వ్యాప్తంగా కాపు నాయకులు ఇళ్ల వద్ద పోలీసు పహారాలు కొనసాగాయి. నల్లా విష్ణుమూర్తి, నల్లా పవన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం పోలీసుల కళ్లుగప్పి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్లకార్డులతో స్థానిక ఎర్రవంతెన వద్ధ ప్రధాన పంట కాల్వలోకి దిగి ‘కాపులను నిండా ముంచిన చంద్రబాబు డౌన్ డౌన్’ అంటూ నినాదాలుచేశారు. ఎన్నికల సమయంలో కాపులను నమ్మించి ఓట్లు వేయించుకుని అధికారం చేతికందిన తరువాత వివిధ రకాలుగా సాకులు చెపుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రానున్నకాలంలో తగిన గుణపాఠం చెప్పాలని నల్లా విష్ణు పిలుపు నిచ్చారు. అయితే గృహ నిర్బంధం నుండి నల్లా వర్గీయులు బయటకు వెళ్లారన్న సమాచారం తెలుసుకున్న సిఐ వైఆర్‌కె శ్రీనివాస్ భారీగా పోలీసు బలగాలతో ఎర్రవంతెన వద్దకు చేరుకుని నిరసనకారులను వారి ఇళ్లకు తరలించారు. ఈసందర్భంగా నిరసనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కాపులను రౌడీలు, ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోందని, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ ప్రపంచం గమనిస్తోందని విష్ణు పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో కాపు నాయకులు సుంకర స్వామినాయుడు, జక్కంపూడి కిరణ్, సాధనాల సుబ్రహ్మణ్యం, సుంకర చిన్నా, నార్ని శ్రీరాములు, సిరంగు వీరబాబు, నిమ్మకాయల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే కోనసీమ టిబికె జెఎసి కన్వీనర్ కల్వకొలను తాతాజీ స్వగృహంలో తాతాజీ ఆధ్వర్యంలో కాపు యువకులు, కాంగ్రెస్ నాయకులు జాతీయ జెండాలతో నిరసన తెలిపారు. గాంధీజీ తెచ్చిన స్వాతంత్య్రానికి ముఖ్యమంత్రి నిరంకుశ అధికారాలతో కాపు ఉద్యమాన్ని అణచివేస్తున్నారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పిసిసి మహిళా ఉపాధ్యక్షురాలు అయితాబత్తుల సుభాషిణి, సలాది రమణ, డేగల రమణ, యేడిద శ్రీను, అడపా సూరిబాబు, పోలిశెట్టి వీరబాబు, కల్వకొలను బాబి, అర్లపల్లి ముత్యం, కోడూరి బాబి, వంటెద్ధు బాబి, కొటుకులపూడి శివ, వర్రే శేషు, నల్లా చిన్న తదితరులు పాల్గొన్నారు.

వదిలితే పాదయాత్ర చేసి చూపిస్తా...
ప్రత్తిపాడు: పోలీసు నిర్బంధం తొలగిస్తే అమరావతి వరకు పాదయాత్ర చేసి చూపిస్తానని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సవాల్‌చేశారు. ముద్రగడకు పాదయాత్ర చేసే ఉద్దేశ్యం లేదని హోంమంత్రి చినరాజప్ప చేసిన విమర్శపై శుక్రవారం తన నివాసంలో విలేఖర్ల సమావేశం సందర్భంగా స్పందించారు. తాను నడవలేనని ముఖ్యమంత్రి అనుచరులతో చెప్పిస్తున్నారని, అయితే పోలీసులు అడ్డుతొలిగితే పాదయాత్ర పూర్తిచేసి చూపిస్తానని స్పష్టంచేశారు. తాను పాదయాత్ర పూర్తిచేస్తే మంత్రి రాజప్ప రాజీనామా చేయాలని, తాను చేయలేకపోతే ఉద్యమం నుండి తప్పుకుంటానని ముద్రగడ సవాల్‌చేశారు. తాను ఇంట్లో నుండి అడుగు బయటకు పెడితే అది పాదయాత్ర కోసం తప్ప మరొక దాని కోసం ఉండదన్నారు. తాను, తన కుటుంబ సభ్యులకు ఏ విధమైన అనారోగ్యం చేసినా ఇంట్లోనే ఉంటానని, బయటకు వెళ్లనని ముద్రగడ స్పష్టం చేశారు.

12.15 లక్షల మంది పిల్లలకు ఎంఆర్ వ్యాక్సిన్
రాజమహేంద్రవరం: జిల్లాలో మీజిల్స్-రూబెల్లా (ఎంఆర్) వ్యాక్సిన్ వేసే కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెల్లడించారు. రాజమహేంద్రవరంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో కలెక్టర్ కార్తికేయ వివరాలు వెల్లడించారు. జిల్లాలో 12 లక్షల 15వేల మంది పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయనున్నట్టు తెలిపారు. తొమ్మిది నెలల నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు ఎంఆర్ వ్యాక్సిన్ వేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలందరికీ ఈ వ్యాక్సిన్ ఆగస్టు 1 నుంచి వేయనున్నట్టు తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 8 లక్షల 15వేల 327 మంది పిల్లలు, అర్బన్ ప్రాంతాల్లో 3 లక్షల 9543 మంది పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేస్తామన్నారు. ఎంఆర్ వ్యాక్సిన్ వేసేందుకు జిల్లాలో 3500 మంది అంగన్‌వాడీ సిబ్బంది, 4600 మంది ఆశ వర్కర్లు, 3,500 మంది సూపర్‌వైజర్లను నియమించామన్నారు. ప్రాణాంతక వ్యాధులను పారదోలడానికి ఈ వ్యాక్సిన్ దోహదపడుతుందన్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఆగస్టు 1 నుంచి 5వ తేదీ వరకు వేస్తారన్నారు. రాజమహేంద్రవరం నగరంలో 1.25 లక్షల మంది పిల్లలకు వ్యాక్సిన్ వేయించేందుకు ఏర్పాట్లుచేశామన్నారు. నగరంలో 220 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఈ వ్యాక్సిన్ వేయనున్నట్టు వివరించారు. పిల్లలకు వ్యాక్సిన్ వేసిన తర్వాత కొద్దిగా జ్వరం వస్తుందని, ఏమీ కంగారు పడనవసరం లేదని, అందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. పిల్లల తల్లిదండ్రులకు ఈ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించామన్నారు. గిరిజన ప్రాంతాల్లో సుమారు లక్ష మంది పిల్లలకు వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. మారుమూల ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేసేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటుచేశామన్నారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం కమిషనర్ వి విజయరామరాజు, జిల్లా ఆరోగ్యశాఖ అధికారి కె చంద్రయ్య, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఎం మల్లిక, అడిషనల్ డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్ పి కోమల తదితరులు పాల్గొన్నారు.

పురుషోత్తపట్నం పనులు వేగవంతం కావాలి
సీతానగరం: మండలంలోని పురుషోత్తపట్నం గ్రామంలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని జాయట్ కలెక్టర్ మల్లికార్జున ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ మల్లికార్జునరావు, రాజమహేద్రవరం ఇన్‌ఛార్జి సబ్-కలెక్టర్ విజయ రామరాజు శుక్రవారం పరిశీలించారు. తొలుత మండల కేంద్రం సీతానగరం చేరుకున్న వారు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్మించే హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పురుషోత్తపట్నం చేరుకుని ఎత్తిపోతల పథకం పైపులైను పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాల్సిందిగా ఆదేశించారు. ఎత్తిపోతల పథకాన్ని ఆగస్టు 15వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. కార్యక్రమంలో తహసీల్దార్ కనకం చంద్రశేఖర్, ఇరిగేషన్ ఎస్సీ సుగుణాకర్‌రావు, కోరుకొండ సిఐ మధుసూదనరావు, ఎస్సై ఎ వెంకటేశ్వరరావు, కాంట్రాక్టు సంస్థ మెగా కంపెనీ సిజిఎం కె రంగనాధన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య
కాకినాడ రూరల్: కుటుంబ కలహాల నేపథ్యంలో దంపతులిద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి సర్పవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కాకినాడ పట్టణం గొడారి గుంటకు చెందిన బయ్యపురెడ్డి దుర్గాప్రసాద్ (30), మంగాదేవి (26)కి ఏడేళ్ల క్రితం వివాహమయ్యంది. వీరికి ఆరు, నాలుగేళ్ల ఇద్దరు కుమారులున్నారు. దుర్గాప్రసాద్ స్థానికంగా ఎరువుల కర్మాగారంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేసేవాడు. కొంతకాలంగా ఖాళీగా ఉంటున్నాడు. కాగా దంపతులిద్దరూ కుటుంబ కలహాలతో సతమతమవుతున్నారు. శుక్రవారం ఉదయం కూడా ఈ దంపతుల మధ్య స్వల్ప విభేదాలు చోటుచేసుకున్నాయ. దీనితో మంగాదేవి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకుంది. దీనితో కంగారుపడిన దుర్గాప్రసాద్ తన సోదరునికి ఫోన్‌చేసి విషయం వివరించాడు. అనంతరం దుర్గాప్రసాద్ కూడా ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వీరు నివసిస్తున్న గొడాలి గుంట డీమార్ట్ సమీపంలో సంచలనాన్ని కల్గించింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు సర్పవరం సిఐ చైతన్యకృష్ణ తెలిపారు.

ప్రణాళికాబద్ధంగా లబ్ధిదారుల ఎంపిక
కాకినాడ: ఎస్సీ, ఎస్టీ, బిసి, కాపు, మైనార్టీ కార్పొరేషన్ల ఉపాధి యూనిట్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఆగస్టు 1 నుండి 11వ తేదీ వరకు బ్యాంకు బ్రాంచీల వారీగా ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులు, బ్యాంకర్లను కోరారు. శుక్రవారం కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా బ్యాంకర్లు, సంక్షేమ కార్పొరేషన్ల ఇడిలతో సమావేశాన్ని నిర్వహించారు. 2016-18 సంవత్సరానికి లబ్ధిదారుల ఎంపికకు ఇంటర్వ్యూల నిర్వహణ ప్రణాళిక అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో 2016-17 సంవత్సరానికి ఇప్పటివరకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2629 యూనిట్లకు 39 కోట్లు, బిసి కార్పొరేషన్ ద్వారా 7371 యూనిట్లకు 100 కోట్లు, కాపు కార్పొరేషన్ ద్వారా 16,443 యూనిట్లకు 234 కోట్లు మొత్తాలను లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు. రుణాల పంపిణీలో ప్రస్తుతం జిల్లా 6వ స్థానంలో ఉందని, ఈ నెలాఖరుకు మరిన్ని పంపిణీచేసి ద్వితీయ స్థానంలో నిలపాలన్నారు. ఆగస్టు 1వ తేదీ నుండి 11లోపు బ్యాంకు బ్రాంచీల వారీగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు లబ్ధిదారుల ఎంపికకు ఆయా బ్రాంచీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించాలని, ఇందుకు ఆన్‌లైన్ దరఖాస్తుదారులందరికీ ఎక్కడ ఏ సమయానికి హాజరుకావాలో మూడు రోజులు ముందుగా మెసేజ్‌ల ద్వారా సమచారాన్ని తెలియజేయాలని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో జెసి-2 జె రాధాకృష్ణమూర్తి, ఎస్సీ కార్పొరేషన్ ఇడి డేవిడ్‌రాజ్, బిసి, కాపు కార్పొరేషన్ ఇడి ఎం జ్యోతి, ఎల్‌డిఎం సుబ్రహ్మణ్యం, వివిధ బ్యాంకుల కో-ఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

డంపింగ్ యార్డులుగా రహదారులు

చింతూరు: అధికారుల నిర్లక్ష్యం కారణంగా మండలంలో పారిశుద్ధ్యం పడకేసింది. రహదారులు, వీధుల పక్కనే చెత్తాచెదారం పడవేయడంతో రహదారులు కంపుకొడుతూ దుర్గంధం వెదజల్లుతున్నాయి. తద్వారా రహదారులు దాటేటప్పుడు ప్రజలు ముక్కుమూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి. దీనినిబట్టి పారిశుద్ధ్యంపై అధికారుల చిత్తశుద్ధి ఏమిటో చెప్పకనే తెలుస్తోంది. కోళ్ల వ్యాపారులు, కూరగాయలు, పండ్లు, హోటల్ వ్యాపారులు తమవద్ద పాడైన వస్తువులను ప్రధాన రహదారి పక్కనే పడవేస్తున్నారు. దీంతో రహదారులే డంపింగ్ యార్డులుగా మారాయి. చింతూరు ప్రారంభ ప్రధాన రహదారి పక్కనే చెత్తాచెదారం కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి దర్శనమిస్తోంది. వీధుల్లోనైతే చెత్తాచెదారం పేరుకుపోయి మురుగు కూపలను తలపిస్తున్నాయి. ప్రధాన రహదారి గుండా ఐటిడిఎ పిఒ, ప్రభుత్వ శాఖల అధికారులు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఏ ఒక్కరికీ పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలనే ఆలోచనే రాకపోవడం శోచనీయం. అసలే వర్షాకాలం..రోగాలు విజృంభిస్తున్నాయి. ఈ సమయంలో పారిశుద్ధ్యం ఈ విధంగా తాండవిస్తే రోగాలు మరింత విజృంభించే అవకాశం లేకపోలేదు. చెత్తాచెదారం వల్లన ప్రజలకే కదా రోగం వచ్చేది మనకి కాదుకదా అనే భావనతో అధికారులు ఉన్నారని పలువురు విమర్శిస్తున్నారు. సంబంధిత అధికారులు పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రధాన రహదారి, వీధుల్లో ఉన్న చెత్తాచెదారాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే సత్వరమే పారిశుద్ధ్య మెరుగునకు చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు.

రావులపాలెం మండలంలో కొనసాగిన పోలీసుల తనిఖీలు
రావులపాలెం: మాజీమంత్రి ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో రావులపాలెం మండలంలో శుక్రవారం కూడా పోలీసు బందోబస్తు కొనసాగింది. రావులపాలెం సెంటరుతో పాటు ఈతకోట, గోపాలపురం సెంటర్లలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. మండల కాపు సంఘం అధ్యక్షుడు సాదనాల శ్రీనివాస్‌ను పోలీసులు మూడో రోజు కూడ హౌస్ అరెస్టులో ఉంచారు. ఇదిలావుండగా బందోబస్తు నేపథ్యంలో డిఎస్పీ మురళీమోహన్, సిఐ బి పెద్దిరాజు, ఎస్సై సిహెచ్ విద్యాసాగర్ స్థానిక పోలీసుస్టేషనులో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించి వ్యాపారులు సహకరించాలని కోరారు. ఇదిలావుంటే ముద్రగడకు మద్దతుగా శుక్రవారం రాత్రి మండలంలోని పొడగట్లపల్లిలో కాపు జెఎసి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

గంజాయ నిందితులపై కఠిన చర్యలు
రంపచోడవరం: ఏజన్సీ నుంచి గంజాయి రవాణాకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, రవాణాపై గట్టి నిఘా ఏర్పాటుచేశామని ఎటపాక ఒఎస్డీ అంబు రాజన్, ఎఎస్పీ దిలీప్ కిరణ్‌లు తెలిపారు. శుక్రవారం డొంకరాయి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ నెల 27న స్వాధీనం చేసుకున్న గంజాయికి సంబంధించి వివరాలను స్థానిక పోలీసు స్టేషన్లో విలేఖర్లకు వారు వివరించారు. డొంకరాయి పోలీసు స్టేషన్ సిఐ దుర్గాప్రసాద్‌కు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు ఈ నెల 27వ తేదీ రాత్రి వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా, లారీలో గంజాయిని తరలిస్తున్నట్టు గుర్తించారు. లారీ డ్రైవర్, మరొక వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వరంగల్ జిల్లా అక్కంపేట గ్రామానికి చెందిన ధర్మపురి శ్రీనివాస్, మహారాష్ట్ర బారత్ గ్రామానికి చెంది వర్షవర్ద్‌లను అదుపులోనికి తీసుకుని విచారించగా, మహారాష్ట్ర భారత్ గ్రామానికి చెందిన మిలీంద్, వరంగల్ జిల్లాకు చెందిన నాగుల రవిలు సీలేరు గ్రామం అటవీ ప్రాంతం వద్ద 2,400 కేజీల గంజాయిని వంద గోనె సంచీలలో పార్శిల్‌చేసి టిప్పర్ లారీలో లోడు చేశారని చెప్పారు. దానిని తాము మహారాష్టక్రు తరలిస్తున్నట్టు తెలిపారన్నారు. వీరిపై కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఒఎస్డీ అంబురాజన్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.1.5 కోట్ల నుంచి రూ.2కోట్లు ఉంటుందని తెలిపారు.

బయో ప్రాజెక్టు వద్దు
రంగంపేట: రంగంపేట మండలం మర్రిపూడిలో మెస్సర్స్ గోదావరి బయో మేనేజ్‌మెంట్ ప్రతిపాదిత ప్రాజెక్టు నిర్మాణంపై పలువురు ఆందోళన వ్యక్తంచేస్తూ నిర్మాణం చేపట్టవద్దంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. శుక్రవారం మర్రిపూడి గ్రామంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ మల్లికార్జున ఆధ్వర్యంలో మెస్సర్స్ గోదావరి బయో మేనేజ్‌మెంట్ ప్రతిపాదిత ప్రాజెక్టుపై పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి (కాకినాడ) పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామస్థులు ఆందోళన చెందవలసినది ఏమీలేదని, ప్రభుత్వ ఆసుపత్రిలో వేస్ట్ మెటీరియల్ తీసుకువచ్చి శుద్ధిచేస్తామని సంస్థ పిడి శ్రీనివాసరెడ్డి వివరించారు. గ్రామస్థుడు కె ధనుంజయ మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతంలో కాలుష్య ఫ్యాక్టరీలు కట్టడంతో రెండు చెరువులు విషపూరితమయ్యాయన్నారు. అలాగే యేసు, ఆచంటి రాజబాబు, ముత్యాల రాజబ్బాయి భద్రం, రామ్ ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ ఫ్యాక్టరీల వల్ల ఈగలు, దోమలు పెరిగిపోయి మనుషులతోపాటు జీవనాధారమైన పశువులు సైతం అనారోగ్యంపాలవుతున్నాయని పేర్కొన్నారు. వ్యర్థపదార్థాల వల్ల చెరువులు కలుషిత మవుతున్నాయని, కనీసం పశువులు తాగేందుకు గుక్కెడు నీరు కూడా దక్కని పరిస్థితి నెలకొనేలా వుందని, కావున ప్రాజెక్టు నిర్మాణం చేపట్టవద్దంటూ మర్రిపూడి, చుట్టు పక్కల గ్రామాలైన ఆనూరు, తిమ్మాపురం, మేడపాడు, ఆర్‌బి పట్నం, చిన బ్రహ్మదేవం, కొత్తూరు తదితర గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తూ సంతకాలుచేసి పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి విచారణాధికారికి అందజేశారు. దీనిపై జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ మల్లికార్జున మాట్లాడుతూ ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామన్నారు. కార్యక్రమంలో పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి ఇఇ రామారావు, పెద్దాపురం ఆర్డీవో విశే్వశ్వరరావు, రంగంపేట తహసీల్దార్ కృష్ణమూర్తి, ఫ్యాక్టరీ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.