విజయనగరం

రూ.625 కోట్లతో ఏడు మెగా పరిశ్రమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఇ(మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్) పార్కులు ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉదయ్‌భాస్కర్ చెప్పారు. శుక్రవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో వంద ఎకరాలు సేకరించినట్టు తెలిపారు. విజయనగరం నియోజకవర్గంలోని గుంకలాం, నెల్లిమర్ల నియోజకవర్గంలో కందివలస, గజపతినగరంలో మరుపల్లి, ఎస్.కోట నియోజకవర్గంలో బలిఘట్టం ప్రాంతాల్లో భూమి సిద్ధంగా ఉందన్నారు. బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, చీపురుపల్లి,కురుపాం నియోజకవర్గాల్లో కూడా ఎంఎస్‌ఎంఇ పార్కులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.
త్వరలో పది పరిశ్రమల ఏర్పాటు : జిల్లాలో మరో ఆరు నెలల్లో కొత్తగా ఏడు మెగా పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉదయ్‌భాస్కర్ తెలిపారు. సుమారు రూ.625 కోట్లతో ఈ పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయన్నారు. వాటిలో భోగాపురంలోని రూ.33 కోట్లతో కెమిరా ఇండస్ లిమిటెడ్, రూ.100 కోట్లతో బొబ్బిలిలోని కార్బన్ రిసోర్సెస్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమ రెండు యూనిట్లు ఏర్పాటు కాబోతున్నాయన్నారు. అలాగే రూ.50కోట్లతో గరివిడిలో మెసెర్స్ రిచ్‌మండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు కానుందన్నారు. ఎల్‌కోటలోని మా మహామాయ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.80కోట్లతో ఆ ప్రాజెక్టును విస్తరించనుందన్నారు. ఎల్‌కోటలోని శ్రీరాంపురంలో రూ.330.70 కోట్లతో సింహాద్రి పిల్లెట్స్ ఇండియా ప్రాజెక్టు ఏర్పాటు కానుందన్నారు. కొండకరకాంలో రూ.23 కోట్లతో మెస్సెర్స్ విజయనగరం వీట్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ ఫ్లోర్ మిల్లు ఏర్పాటు కానుందని వివరించారు. ఈ విధంగా జిల్లాలో మరో ఆరు నెలల్లో కొత్త పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, వీటి ద్వారా 1070 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలగనుందని వివరించారు.

కన్వర్జెన్సీ పనుల్లో ఆంధ్ర ఆదర్శం
విజయనగరం: దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం ఎలా జరుగుతుందనే అంశమై ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేంద్రగ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి చర్చించారని కేంద్ర ఉపాధి హామీ కౌన్సిల్ సభ్యురాలు, జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి చెప్పారు. శుక్రవారం ఆమె ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ మన రాష్ట్రంలో అమలు చేస్తున్న విధంగా ఉపాధి హామీ పనులు మిగిలిన రాష్ట్రాల్లో వేగవంతం కాలేదన్నారు. మనరాష్ట్రంలో 13 శాఖల అనుసంధానంతో కన్వర్జెన్సీ పనులను చేపడుతున్నామని, దీనిని మోడల్‌గా తీసుకోవాలని కేంద్రమంత్రి సూచించారన్నారు. ఉపాధి హామీ పథకం నిధులతో పాఠశాలలకు అదనపు తరగతి గదులు నిర్మాణం, వ్యవసాయ రంగంలో కూలీలకు ఉపాధి చెల్లించేందుకు అవకాశాలపై తాను సూచించానని చెప్పారు. ఉపాధి కూలీలకు ఆన్‌లైన్‌లో చెల్లింపులు, జాబ్‌కార్డుల మంజూరు తదితర వాటిని ఇతర రాష్ట్రాల్లో సక్రమంగా చేయకపోవడం వల్ల అక్కడ చెల్లింపులు కూడా ఆలస్యం అవుతున్నాయన్నారు. కొన్ని చోట్ల పోస్ట్ఫాసుల ద్వారా ఉపాధి కూలీలకు చెల్లింపులు జరపడం వల్ల చెల్లింపులు ఆలస్యంగా జరుగుతున్నాయని సమావేశంలో చర్చకు వచ్చినట్టు ఆమె తెలిపారు. వచ్చే ఏడాది ఏవిధంగా ఉపాధి హామీ పథకం అమలు చేయనున్నదీ తదుపరి సమావేశంలో చర్చిస్తిరని స్వాతిరాణి చెప్పారు.

విశాఖ మెట్రో నగరంగా మార్పునకు సర్వే
బొండపల్లి: విశాఖపట్నం మెట్రో పాలిత ప్రాంతంగా మార్పుచేసి అభివృద్ధి పరిచే దిశగా ప్రయత్నం బృహత్తర ప్రణాళికను రూపొందిస్తుందని లీ అసోసియేట్ సౌత్ మీడియా సంస్థ డిప్యూటీ ప్లానింగ్ ఇంజనీరు సమీర్‌నాజర్, ఫృధ్వీ తెలిపారు. శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ బాపిరాజుతో సమీక్షించారు. అనంతరం ఆయన గొట్లాం, బొండపల్లి, దేవుపల్లి గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, విఆర్వోలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళంలో 11, విజయనగరంలో 16, తూర్పు గోదావరిలో 4, విశాఖపట్నం పరిధిలో ఉన్న మండలాలను కలుపుతూ విశాఖను మెట్రోపాలిత నగరంగా మార్పు చేసేందుకు ప్రణాళిక-2036పై సర్వే చేపడుతున్నామని అన్నారు. విజయనగరం జిల్లాలో బొండపల్లి, విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల, డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం, గంట్యాడ, కొత్తవలస, గరివిడి, చీపురుపల్లి, గుర్ల, దత్తిరాజేరు, వేపాడ, ఎస్.కోట, ఎల్.కో ట మండలాలను ఎంపికచేశారని తెలిపారు. ఈ బృహత్తర ప్రణాళిక రూపొందించేందుకు మూడు ప్రంచాయతీలు ఎంపిక చేసి అభివృద్ధి పరిచేందుకు సూచనలు, సలహాలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆయా గ్రామాలలో వౌలిక సదుపాయాలపై అభిప్రాయ సేకరణ జరిపారు. కార్యక్రమంలో బొండపల్లి ఎంపిటిసి సూర్యనారాయణమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు కోరాడ కృష్ణ పాల్గొన్నారు.

కేసుల దర్యాప్తులో టెక్నాలజీ ఉపయోగించండి
విజయనగరం: జిల్లాలో కేసుల దర్యాప్తు విషయంలో సిబ్బంది టెక్నాలజీని ఉపయోగించాలని జిల్లా ఎస్పీ పాలరాజు తెలిపారు. శుక్రవారం ఆయన నెలవారీ నేరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల దర్యాప్తులో వేగవంతం చేసేందుకు టెక్నాలజీ ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఇసుక అక్రమ రవాణా, గుట్కా, ఖైనీ విక్రయించేవారు, గంజాయి అక్రమ రవాణా వాటిని రెండోసారి నేరానికి పాల్పడితే వారిపై అనుమానితులుగా షీట్‌లో నమోదు చేసి వారిపై నిఘా ఉంచాలన్నారు. రౌడీషీట్‌లు, సస్పెక్ట్ షీట్‌లలో ఉన్న వారిని వారానికోమారు స్టేషన్‌కు పిలిపించాలన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు బ్లాక్‌స్పాట్‌లలో ఇంజనీరింగ్ మార్పులు చేయాలన్నారు. అలాంటి చోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. భూ సమస్యలపై ఇరువర్గాలను పిలిపించి డాక్యుమెంట్లను పరిశీలించి న్యాయ నిపుణుల సలహా మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పోలీసు స్టేషన్‌లో వృద్ధమిత్ర కో-ఆర్డినేటర్లను నియమించి వృద్ధుల ఫిర్యాదులపై స్పందించి వారికి స్వాంతన చేకూర్చాలన్నారు. వృద్ధులను ఆయా కుటుంబాలు వారసత్వ సంపదగా గుర్తించే విధంగా ప్రజలలో అవగాహన కల్పించేందుకు వచ్చేనెల 2వతేదీన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రతి పోలీసు అధికారి మండల స్థాయిలో ఒక పాఠశాలను దత్తత తీసుకోవాలన్నారు. విద్యార్థుల అభివృద్ధికి సూచనలు, వనం-మనం, స్వచ్ఛ భారత్ చేపట్టాలన్నారు. సైబర్ నేరాలు, వైట్‌కాలర్ నేరాలుపైన విధి విధానాలు, సాంకేతిక విజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఎవిరమణ, డిఎస్పీలు రమణ, సౌమ్యలత, త్రినాథ్, ఎఎస్ చక్రవర్తి, రాజేశ్వరరావు, హనుమంతు, సిఐ బివిజె రాజు, రఘ శ్రీనివాస్, లీగల్ అడ్వయిజర్ జానకి రామారావు, సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

మోడల్ స్కూల్ సమస్యలను పరిష్కరించండి
విజయనగరం: రాష్ట్రంలో మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణికి ఉపాధ్యాయులు వినతిపత్రం అందజేశారు. శుక్రవారం సాయంత్రం జెడ్పీలో ఆమెకు వివిధ సమస్యలపై ఏకరవు పెట్టారు. గత మూడు నెలలుగా తమకు జీతాలు అందక అవస్థలు పడుతున్నామన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తమకు జీతాలు మంజూరు చేసేదని, గత ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం జీతాలను చెల్లిస్తుందన్నారు. అయితే 010 పద్దు కింద చెల్లించకపోవడంతో ప్రతి నెలా జీతాలు అందడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు, సిబ్బంది అవస్థలు పడుతున్నామన్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎపిటిఎఫ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు, కార్యదర్శి రాజు, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అప్పాజీ, సిబ్బంది పాల్గొన్నారు.

చైనా వస్తువులు బహిష్కరించాలి
బొబ్బిలి: చైనా వస్తువులను బహిష్కరించి నవభారత నిర్మాణానికి ప్రతీ ఒక్కరూ నడుంబిగించాలని అఖిలభారత విద్యార్థి పరిషత్ జిల్లా కో- ఆర్డినేటర్ రాంబాబు పిలుపునిచ్చారు. చైనా వస్తువులను బహిష్కరించాలని కోరు తూ శుక్రవారం వివిధ పాఠశాలల విద్యార్థులు భారీ ఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చైనా వస్తువులను ప్రతీ ఒక్కరూ విస్మరించాలని కోరారు. అలాగే వ్యాపారులు కూడా ఈ వస్తువులను దిగుమతి చేసుకోవద్దని పిలుపునిచ్చారు. నవభారత నిర్మాణానికి ప్రతీ ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. భారతదేశంలో ఉన్న ముడిసరుకులు, వనరులను కారుచౌకగా తీసుకువెళ్లి వివిధ రకాలైన వస్తువులను తయారుచేసి స్వదేశంలోనే అధిక ధరలకు విక్రయిస్తున్నారని, దీన్ని ప్రతీ ఒక్కరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే చైనా వస్తువుల విక్రయాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రముఖ్ గోపాలపాత్రుడు, కార్యవర్గ సభ్యులు శ్రావణ్, బొబ్బిలి ప్రముఖ్ మాదవ్, సాలూరు కార్యదర్శి ప్రశాంత్, మహేష్, దిలీప్ పాల్గొన్నారు.

ఏజెన్సీలో వైద్యసేవలు సక్రమంగా అందించండి
కురుపాం: ఏజెన్సీ ప్రాం తంలో వైద్య సిబ్బంది వైద్యసేవలను సక్రమంగా అందించాలని జిల్లా న్యాయసేవ ప్రాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి ఎం శ్రీహరి కోరారు. ఇటీవల దండుసూర గ్రామానికి చెందిన గిరిజన బాలిక తోయక అనసూయ మృతి సంఘటనపై జిల్లా న్యాయమూర్తి సుమోతోగా కేసు నమోదు చేశారు. ఈ విషయమై విచారించేందుకు శుక్రవారం కురుపాం ఆసుపత్రికి వచ్చి పరిశీలించారు.రికార్డులను పరిశీలించారు. అనంతరం సంఘటన జరిగిన రోజున డ్యూటీలో ఉన్న డాక్టర్, స్ట్ఫానర్సు, ఇతర సిబ్బందితో మాట్లాడారు. డెలివరీ రూంను పరిశీలించారు. ల్యాబ్ గది, వార్డులు, మందులిచ్చే గదులను పరిశీలించారు. ఆసుపత్రిలో ఉన్న రోగులతో వైద్యం ఎలా అందుతుందో అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి గిరిజన ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో రోగు లు వస్తుంటారని, వారికి పూర్తిస్థాయిలో వైద్యసేవలందించాలని కోరారు. ఇక్కడ పరిస్థితులు బాగానే ఉన్నప్పటికీ మరణాలు సంభవించడం విచాకరమన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. ఈ సంఘటనపై సమగ్రమైన దర్యాప్తు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన వాటికి బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు, పథకాలకు సంబంధించిన ఉద్యోగులు అవినీతికి పాల్పడకుండా సక్రమంగా పనిచేయాలన్నారు.