పశ్చిమగోదావరి

ఆ లబ్ధే చేరలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు : ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు భారీ ప్రకటనలతో బృహత్తర లక్ష్యాలను ప్రకటించడం, అవి చూసి ఆ మేరకు లబ్ధి అందుతుందేమోనని అర్హులంతా అర్రులుచాచడం సాధారణంగానే జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి పూర్తిగా తిరగబడి గత ఏడాది లక్ష్యాలే ఇంకా చేరువవని తరుణంలో ఈ ఏడాది లక్ష్యాలను కూడా పూర్తి చేయాల్సిన గడువు ముందుకు వచ్చేసింది. సంక్షేమ విభాగాల పరిధిలో ఇదొక వింత పోకడ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. వీటన్నింటికి మించి రుణం పొందడానికి అయిదేళ్ల నిబంధన కొత్తగా తెరపైకి తీసుకురావడంతో లబ్ధిదారుల్లో పూర్తిస్థాయి అయోమయం నెలకొంటోంది. ఈ విధంగా చూసినా సంక్షేమ పధకాల అమలు దాదాపుగా పడకేసినట్లే కనిపిస్తోంది. జిల్లాలో పరిస్థితి ఒక్కసారి పరిశీలిస్తే 2016-17 సంవత్సరానికి సంబంధించి బిసి కార్పొరేషన్ పరిధిలో 10394 మంది లబ్ధిదారులకు 107 కోట్ల రూపాయల మేరకు ఆర్ధిక సహాయాన్ని అందించాల్సి వుండగా అందులో ఇప్పటి వరకు 170 మంది లబ్ధిదారులకు ఫలితం అందలేదంటే అతిశయోక్తి కాదు. అలాగే ఎస్‌సి కార్పొరేషన్ పరిధిలో చూసినా 6368 మంది లబ్ధిదారులకు 132 కోట్ల రూపాయల మేరకు సహాయం అందించాల్సి వుండగా ఇందులో కేవలం 68 మందికి మాత్రమే లబ్ధి చేరువైందని చెప్పాల్సి వస్తే పరిస్థితి ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. మైనార్టీ విభాగంలో 315 మంది లబ్ధిదారులకు ఆరు కోట్ల రూపాయల మేరకు సహాయం చేయాల్సి వుండగా ఇందులో ఇద్దరికి మాత్రమే వ్యవహారాలు ముందుకు సాగినట్లు తెలుస్తోంది. ఈ విధంగా మిగిలిన అన్ని సంక్షేమ విభాగాల పరిధిలోనూ గణాంకాలు దాదాపు ఈ విధంగానే దర్శనమిస్తున్నాయి. వాస్తవానికి ఆయా విభాగాల పరిధుల్లో ప్రభుత్వ పరంగా అందించే సబ్సిడీ విడుదలైనా రుణ మొత్తం మాత్రం అందలేదని చెప్పవచ్చు. అవి కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేసి యుటిలైజేషన్ సర్ట్ఫికేట్లను పంపాల్సిన పరిస్థితి కూడా దగ్గరైంది. ఈ విధంగా చూస్తే గత ఏడాదికి సంబంధించిన లక్ష్యాల సాధనే ఇంకా సాధ్యంకాని పరిస్థితులు వుండగా ఇప్పటికిప్పుడు ఆ లక్ష్యాలు సాధించడం కూడా దాదాపు అసాధ్యంగా కనిపించే పరిస్థితే వుందని చెప్పాలి. మరో వైపు 2017-18 సంవత్సరానికి సంబంధించి ఆయా సంక్షేమ విభాగాల పరిధిలో లక్ష్యాల నిర్ధేశం పూరె్తై చాలా కాలం గడచిపోయింది. వీటికి సంబంధించి నెలాఖరులోగా ఆయా విభాగాల పరిధిలో లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోవాల్సి వుంటుంది. నెలాఖరులోగా అంటే ఇక మిగిలిన రోజులు ఎన్ని వున్నాయో అందరికీ తెలిసిందే. గత ఏడాది లక్ష్యాలకే చేరువకాని పరిస్థితుల్లో ఈ ఏడాది లక్ష్యాలకు సంబంధించి ఏ మేరకు నెలాఖరులోగా లబ్ధిదారులు దరఖాస్తులుచేసుకుంటారో వేచి చూడాల్సిందే. మరోవైపు ఆగస్టులో ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి సంక్షేమ విభాగాల పరిధిలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావాల్సి వుంది. సెప్టెంబరుకల్లా ఆయా విభాగాల నిబంధనల మేరకు లబ్ధిదారుల యూనిట్లకు సంబంధించి రుణ వితరణ కూడా జరగాల్సి వుంది. ప్రస్తుతం జిల్లాలో సంక్షేమ విభాగాల పరిధిలో నెలకొన్న పరిస్థితి ఈ విధంగా వుండగా గత లక్ష్యాలు ఈ ఏడాది లక్ష్యాలను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లగలరన్నది అర్ధం కాని పరిస్థితి. ఎప్పటికప్పుడు జిల్లా స్థాయిలో సంక్షేమ విభాగాల సమీక్షలు విరివిగా జరగడం, ఉన్నతాధికారులు అటు బ్యాంకర్లకు, ఇటు అధికారులకు అక్షింతలమీద అక్షింతలు వేయడం తప్ప పరిస్థితుల్లో వస్తున్న మార్పు పెద్దగా లేదంటే అతిశయోక్తి కాదు. ఈ వ్యవహారాలే ఇలా వుంటే కొత్తగా అమల్లోకి వచ్చిన అయిదేళ్ల నిబంధన లబ్ధిదారులను తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. సంక్షేమ విభాగాల్లో యూనిట్లు, ఇతర కార్యక్రమాల క్రింద బ్యాంకుల్లో రుణం పొందాలనుకునే వారికి ఈ నిబంధన తీవ్ర ఆటంకంగా మారిపోయిందనే చెప్పాలి. ఒక లబ్దిదారుడు గత అయిదేళ్లలో ఎక్కడైనా సంక్షేమ కార్యక్రమం కింద బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటే ఇప్పుడు ఆ లబ్ధిదారులకు రుణం ఇచ్చే పరిస్థితి లేదని బ్యాంకర్లు తేల్చి చెప్పేస్తున్నారు. అదే విధంగా గత అయిదేళ్లలో ఎటువంటి రుణం తీసుకోకపోతే ఈసారి రుణం అందించి దీని తరువాత మరో అయిదేళ్ల వరకు మరో రుణం మంజూరు చేసే పరిస్థితి వుండదని బ్యాంకర్లే తేల్చి చెప్పేస్తున్నారు. ఎక్కడికక్కడ లబ్ధిదారుల ఆధార్ కార్డులను అనుసంధానం చేయడంతో ఫలానా లబ్ధిదారుడు గత అయిదేళ్లలో ఎక్కడైనా రుణం తీసుకున్నారా అన్నది ఇట్టే తేలిపోతుండటంతో అలాంటి లబ్దిదారుల దరఖాస్తులను బ్యాంకర్లు బుట్టదాఖలు చేస్తున్నారు. మొత్తం మీద అసలు అనుకున్న లక్ష్యాలే ముందడుగు పడకపోతుంటే మరోవైపు బ్యాంకర్లు అయిదేళ్ల నిబంధన తెరపైకి తీసుకురావడంతో ముందుకు వచ్చిన లబ్ధిదారులకు కూడా మొండి చేయి మిగులుతోంది. మొత్తం మీద సంక్షేమం పూర్తిస్థాయి సంక్షోభంలో కొనసాగుతుందనే చెప్పాలి.
చినమిల్లి ఆమరణదీక్ష ఆరంభం
భీమవరం: కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం పాదయాత్రను అడ్డుకున్న తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ జిల్లా కాపునాడు అధ్యక్షులు చినమిల్లి వెంకట్రాయుడు ఆమరణ నిరాహార దీక్షను శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభించారు. ఆయన దీక్ష ప్రారంభంకాగానే జిల్లాలో నలుమూలల నుంచి కాపుసామాజిక వర్గానికి చెందిన యువతీ, యువకులు, మహిళలు, ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు చినమిల్లి వెంకట్రాయుడును పరామర్శించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వెంకట్రాయుడు ఆమరణ దీక్షకు దిగంగానే అన్ని ప్రాంతాల నుంచి కాపు ఉద్యమకారులు, నేతలు ఆయనను కలుసుకున్నారు. తమ మద్దతు తెలిపారు. అదే విధంగా వైసిపి జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని, భీమవరం, ఉండి నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, పాతపాటి సర్రాజు, తదితరులు ఆయనను పరామర్శించారు. ముందుగా పోలీసులు అనుమతి ఇవ్వనప్పటికీ ఆ తర్వాత వారికి అనుమతిని ఇచ్చారు. ముదద్రగడ, కాపు ఉద్యమానికి మద్దతుగా చినమిల్లి దీక్ష చేస్తున్న నేపధ్యంలో కాపుసామాజిక వర్గానికి చెందిన న్యాయవాదులు, ఉండపల్లి రమేష్ నాయుడు ఆద్వర్యంలో తహసీల్దార్ చవ్వాకుల ప్రసాద్‌కు వినతిపత్రాన్ని అందించారు. 144, 30 పోలీసు యాక్టు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా అటు ముద్రగడ ఇటు చినమిల్లి వెంకట్రాయుడు పూర్తిగా ఉద్యమంలో ఉండటంతో వివిధ వర్గాలకు చెందిన వారు ఆయనను కలుసుకునేందుకు క్యూ కట్టారు. 48 గంటల్లో ముద్రగడ పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో 700 గ్రామాల్లో నిరాహారదీక్షలకు దిగుతామని ఆయన చెప్పారు.

1008 మంది సువాసినీలచే వరలక్ష్మీ వ్రతాలు
ఏలూరు : సత్రంపాడులో కొలువై వున్న శ్రీ సౌభాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నాగ పంచమి, శ్రావణమాసంలోని తొలి శుక్రవారం కావడంతో 1008 మంది సువాసినీలచే సామూహిక శ్రీ వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు. ప్రత్యేక వేదికను ఏర్పాటుచేసి వరలక్ష్మి అమ్మవారిని నెలకొల్పి అభిషేకం నిర్వహించి అనంతరం విశేష అలంకరణ జరిపి పుష్పార్చన నిర్వహించి కుంకుమార్చనలు జరిపి అనంతరం సామూహిక వరలక్ష్మి వ్రతాలను యాజ్జిక బ్రహ్మ వారణాశి శ్రీ రాఘవేంద్ర శర్మ భక్తులతో చేయించారు. పెద్ద సంఖ్యలో భక్తులు మూలవిరాట్‌కు ధాన్యలక్ష్మిదేవి అలంకరణ జరపడంతో దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుని భక్తిసంకీర్తనలు ఆలపించి భజనలు నిర్వహించి పసుపు, కుంకుమ, గాజులు స్వీకరించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. మహిళా ప్రతినిధులతో ఆలయ ప్రాంతమంతా కిటకిటలాడింది.
మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం
ఏలూరు : ప్రజలకు మెరుగైన వైద్యం అందాలన్నదే తన ప్రయత్నమని ఇందుకోసం నిర్వహించే సమీక్షలలో వాస్తవాలుకప్పిపుచ్చేందుకు ఎంతమాత్రం ప్రయత్నించవద్దని వైద్యాధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ హితవు పలికారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం సాయంత్రం వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షలో మాతా, శిశు మరణాలు, మందుల సరఫరా, ఆరోగ్యకేంద్రాలు మెరుగు, తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నదన్న వాస్తవాన్ని మరిచి పోకుండా ఆసుపత్రికి వచ్చే రోగులకు సక్రమమైన వైద్యం అందించాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు సంతృప్తికరస్థాయిలో వైద్య సేవలు అందించి ప్రజల మన్నన చూరగొనాలని హితవు పలికారు. జిల్లాలో ఏ ప్రాంతం నుండి ఏ వ్యాధులు ఎక్కువగా నమోదు అవుతున్నాయో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వారీగా అంచనా వేసి దానికి కారకమైన పరిస్థితులను గుర్తించాలన్నారు. రోగులకు అవసరమైన మందులు అన్నీ ఆరోగ్య కేంద్రాల్లో, ఇతర ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలని రోగులకు మందులు లేవనే మాట చెప్పే పరిస్థితి ఉండకూడదన్నారు. ఉంగుటూరు మండలం బొమ్మిడికి చెందిన బత్తు కవిత అనే గర్భిణీని చేబ్రోలు పిహెచ్‌సి నుండి తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుండి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి పంపడం జరిగిందని దురదృష్ట వశాత్తూ ఆ మహిళ మరణించడం జరిగిందన్నారు. సంబంధిత విషయంపై సంబంధిత తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రిలో ఆమెను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిసిహెచ్ ఎస్‌ను ఆదేశించారు. మాతా శిశు మరణాలు సంభవించిన సమయంలోనే రికార్డులను సమగ్రంగా రూపొందిస్తున్నారే తప్ప సంబంధిత మాతా శిశు వైద్యానికి సంబంధించి రూపొందించిన పుస్తకాల్లో ఎప్పటికప్పుడు సంబంధిత వైద్య వివరాలు నమోదు చేయడం లేదన్నారు. ఇటువంటి సంఘటనల్లోనే మరణించిన గర్భిణీ సంతకం ఫోర్జరీ చేసినట్లుగా భావిస్తున్నామని దానిని సమగ్రంగా క్రోడీకరించిన అనంతరం వాస్తవం అయితే సంబంధిత ఎ ఎన్ ఎం, తదితరులు ఉద్యోగం కోల్పోవడంతోపాటు వారిపై క్రిమినల్ కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. మలేరియా నివారణకు ఏజెన్సీ ప్రాంతాల్లో రెండవ విడత స్ప్రేయింగ్ పూర్తి చేయడంతోపాటు దోమలకు ఆసరా అయిన నీటి కుంటలను మట్టితో పూడ్చే పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. చంద్రన్న సంచార చికిత్సకు సంబంధించి ఆయా గ్రామాల్లోకి వెళ్లే ముందు రోజే వాహనం రాకపై టాంటాం ద్వారా ప్రజలకు తెలియపరచాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె కోటేశ్వరి, డిసిహెచ్ ఎస్ డాక్టర్ కె శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
నవసమాజ నిర్మాణానికి బాటలు వేయాలి
ఏలూరు: ఉన్నత చదువులు చదివిన వారంతా నవసమాజ నిర్మాణానికి బాటలు వేయాలని అప్పుడే చదువుకున్న విద్యకు సార్ధకత చేకూరుతుందని ఏలూరు శాసనసభ్యులు బడేటి కోట రామారావు(బుజ్జి) అన్నారు. స్ధానిక సిఆర్ రెడ్డి అటానమస్ కళాశాలలో శుక్రవారం తొలి గ్రాడ్యుయేషన్ డే వేడుకలను జ్యోతివెలిగించి ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్ధి జీవితంలో డిగ్రీ పట్టా ఎంతో కీలకమైన ఘట్టమని, విదేశాల్లో అయితే ఈవేడుకలు ఎంతో ఘనంగా జరుపుతారన్నారు. ఆధునికయుగంలో ప్రతిమనిషి విద్య నేర్చుకోకపోతే అభివృద్ధి సాధించలేడని, అయితే నేర్చుకున్న విద్య నవసమాజ నిర్మాణానికి ఉపయోగపడాలని అప్పుడే చదువుకున్న విద్యకు సార్ధకత ఏర్పడుతుందన్నారు. రోజురోజుకు కొత్త విషయాలు నేర్చుకుని సమాజాన్ని ముందుకు నడిపించే బృహత్తర బాధ్యతను యువత చేపట్టాలని ఆయన కోరారు. డిగ్రీ పట్టా కేవలం ఉద్యోగానికే పరిమితం కారాదని, నేర్చుకున్న విజ్ఞానాన్ని సమాజం కోసం వినియోగించే స్ధాయిలో యువత ముందడుగు వేయాలన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎం ముత్యాలనాయుడు మాట్లాడుతూ కేవలం ఉద్యోగం కోసం కాకుండా సామాజిక బాధ్యతగా సమాజాన్ని ముందుకు నడిపేలా పట్ట్భద్రులు మంచి మార్గాన్ని ఎంచుకోవాలన్నారు. ఆధునిక సమాజంలో యువత చెడువ్యసనాల జోలికి పోకుండా ఇతరులకు ఆదర్శంగా నిలిచేవిధంగా నీతి,నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసే సామర్ధ్యం పెంపొందించుకోవాలని యువతను కోరారు. సిఆర్‌ఆర్ విద్యాసంస్ధల అధ్యక్షులు కొమ్మారెడ్డి రాంబాబు మాట్లాడుతూ గత ఏడు దశాబ్దాల నుండి రెడ్డి విద్యాసంస్ధల్లో లక్షలాది మంది విద్యార్ధులు పట్ట్భద్రులయ్యారన్నారు. యువత సమయాన్ని సద్వినియోగం చేసుకుని వివిధ వృత్తుల్లో నైపుణ్యాన్ని పెంచుకోవటం ద్వారా సమాజంలో పదిమందికి ఉపయోగపడే విధానాన్ని అలవర్చుకోవాలన్నారు. విద్యాసంస్ధల ఉపాధ్యక్షులు డాక్టరు వివి బాలకృష్ణారావు మాట్లాడుతూ విద్యార్ధినీవిద్యార్ధులు కష్టపడి చదవడమే కాకుండా ఉన్నతశిఖరాలు అధిరోహించే విధంగా నూతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. ఈసందర్భంగా 2016, 2017 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన 600 మంది విద్యార్ధులకు డిగ్రీ పట్టాలను బడేటి బుజ్జి, ముత్యాలనాయుడు అందజేశారు. ప్రతిభకనపర్చిన 20మంది విద్యార్ధులకు ఉపకులపతి ఆచార్య ముత్యాలనాయుడు బంగారుపతకాలను అందజేశారు. కార్యక్రమంలో విద్యాసంస్ధల ఉపాధ్యక్షులు కాకరాల రాజేంద్రవరప్రసాద్, కరస్పాండెంట్ రాంప్రసాద్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వి వెంకట్రావు, ఐక్యూ ఎసి కన్వీనర్ పిసి స్వరూప్, సూపరింటెండెంట్ పతంజలి, విద్యాసంస్ధల పాలకవర్గం సభ్యులు డాక్టరు కాంచనమాల, లక్ష్మినారాయణ, విశ్వనాధరావు, కుటుంబశాస్ర్తీ, రెడ్డి కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ డాక్టరు ఎ వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం
ఏలూరు : పోలీసు ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని ఎ ఆర్ అదనపు ఎస్‌పిగా బాధ్యతలు తీసుకున్న ఎం మహేష్‌కుమార్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ఎ ఆర్ సిబ్బందితో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పోలీసు దర్బార్‌ను జరిపారు. ఉద్యోగుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది యొక్క నివాస గృహాల గురించి, సంక్షేమాలను ఎప్పటికప్పుడు పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సమస్యలపై తనను ఎప్పుడైనా కలుసుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎ ఆర్ డి ఎస్‌పి బి చంద్రశేఖర్, ఆర్ ఐ కె వెంకట్రావు, ఆర్ ఎస్ ఐలు, ఎస్ ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆంగ్లమాధ్యమాన్ని విద్యార్థులపై బలవంతంగా రుద్దవద్దు
ఏలూరు : రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని విద్యార్ధులపై బలవంతంగా రుద్దేందుకు చేసిన నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, మాతృభాష తెలుగుకు తెగులు పట్టించవద్దని కోరుతూ చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ఇమెయిల్ ద్వారా వినతిపత్రాలను పంపినట్లు కమిటీ జిల్లా కన్వీనర్ పిచ్చుక ఆదిశేషు, కో కన్వీనర్ పత్తిపాటి రామకృష్ణలు తెలిపారు. స్థానికంగా శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎంతో ఔన్నత్యాన్ని కలిగిన అమ్మభాషను ప్రభుత్వ పాఠశాల నుంచి తరిమి వేయాలని కంకణం కట్టుకుందని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే మున్సిపల్ పాఠశాలలకు తెలుగు మాధ్యమం పుస్తకాలను సరఫరాను నిలివేస్తోందని తెలిపారు. మున్సిపల్ పాఠశాలలను మూసివేసి విద్యార్ధులందరినీ కార్పొరేట్ స్కూళ్లకు తరలించాలన్న కుట్ర జరుగుతోందని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వ చర్యలను ఉపసంహరించుకోకపోతే తెలుగు భాష రక్షణకు ఉద్యమాన్ని చేపడతామని వారు స్పష్టం చేశారు. సమావేశంలో కె వెంకటరమణ, పి బాపిరాజు, డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మహిళల అభివృద్ధికి టిడిపి ప్రాధాన్యత
మొగల్తూరు: మహిళల అభివృద్ధికి తెలుగుదేశం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అన్నారు. శుక్రవారం మొగల్తూరులో ఏర్పాటు చేసిన ఐసిడిఎస్ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మొగల్తూరు, నరసాపురం, యలమంచిలి మండలాలకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలు, సిబ్బంది ఈ కార్యాలయంలో సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఒక్కొక్క మండలానికి రూ.33 లక్షల వ్యయంతో స్ర్తిశక్తి భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేశామన్నారు. ఐసిడిఎస్ పిఒ సిహెచ్ ఇందిర అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు డాక్టర్ శిరిగినీడి రాజ్యలక్ష్మి, ఎఎంసి చైర్మన్ రాయుడు శ్రీరాములు, మొగల్తూరు, నరసాపురం, యలమంచిలి మండలాల ఎంపిపిలు, జడ్పీటిసిలు, ముత్యాలరావు, నాగరాజు, వాతాడి కనకరాజు, బాలం ప్రతాప్, బూసి సుజాత, బోణం నాని తదితరులు పాల్గొన్నారు.
సమాచార కమిషనర్లను నియమించాలి

ఏలూరు : రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమాచార కమిషనర్లను నియమించాలని సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొల్లపల్లి మురళీ డిమాండ్ చేశారు. స్థానిక ఆర్ ఆర్ పేటలోని సంఘం కార్యాలయంలో శుక్రవారం సమాచార హక్కు చట్టంపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీ మాట్లాడుతూ ప్రభుత్వం సమాచార హక్కు కమిషనర్లను నియమించకపోవడం వలన అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు వినతిపత్రాలు అందజేయడం జరిగిందని, వెంటనే వారి నియామకాలను పూర్తి చేయాలని కోరారు. నగర గౌరవాధ్యక్షులు కోలా భాస్కరరావు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడానికి అన్ని చోట్ల సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ చట్టం ప్రజల చేతుల్లో వజ్రాయుధం వంటిదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంఘంలో చేరిన సభ్యులకు మీడియా ఇన్‌ఛార్జి డివి రామాంజనేయులు సభ్యత్వ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆచంట వెంకటేశ్వరరావు, కార్యదర్శి డాక్టర్ కె తిరుపతిరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు దళపతిరాజు శ్రీనివాసరాజు, జిల్లా ఉపాధ్యక్షులు సాయి రామారావు, అత్తిలి రాము, ఎం శ్రీనివాసరావు, సీతా సూరిబాబు, కె ఇవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.