అనంతపురం

తలవంపులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: జిల్లా పరిషత్ చైర్మన్ చమన్ రాజీనామా వ్యవహారం టిడిపిలో అంతర్గతంగా కుంపటి రాజేస్తున్నట్లు తెలుస్తోంది. ఒప్పందం మేరకు చైర్మన్ పదవికి రాజీనామా చేయకుండా కాలయాపన చేస్తుండటం, అధిష్ఠానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ వ్యవహరిస్తుండటం పార్టీకి నష్టం కలిగించేలా ఉందని జిల్లా పార్టీ నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఆయన వ్యవహారం జిల్లా ప్రజల్లో పార్టీ పట్ల వ్యతిరేక భావన కలిగించేందుకు ఆస్కారం కల్పిస్తోందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవన్న సంకేతాలను జిల్లా నేతలు పంపుతున్నట్లు సమాచారం. అధిష్టానం కనె్నర్రజేస్తే ఏమవుతుంది? పార్టీ మనుగడ కన్నా, వ్యక్తిగత అభిప్రాయాలు ముఖ్యం కాదు.. వేటు పడితే భవిష్యత్తు ఉండదని, అప్రమత్తమైతే మంచిదని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. పదవిని వదిలి పెట్టడం ఇష్టం లేని చమన్ ఇలా వాయిదాలు వేసుకుంటూ పోవడం ఇటు జిల్లా నేతలు, అటు అధిష్ఠానంలోనూ ఆయన పట్ల చులకన భావాన్ని ఏర్పరిచిందనే చెప్పొచ్చు. మాజీ మంత్రి దివంగత పరిటాల రవికి చమన్ కుడిభజంగా ఉండేవారు. అప్పట్లో అనేక వివాదాల్లో చమన్ ఉండటం, కేసులు నమోదు కావడం, అజ్ఞాత జీవితం గడపడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అజ్ఞాతం వీడి బయటకు వచ్చిన నేపథ్యంలో 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. ఈ పరిస్థితుల్లో చమన్ జెడ్పీటీసీఎన్నికల్లో పోటీకి దిగారు. ఈ నేపథ్యంలో జడ్పీ చైర్మన్ పదవికి పోటీ పడటంతో స్వయంగా సిఎం చంద్రబాబు వద్దంటూ అప్పట్లో కరాఖండీగా చెప్పారు. అయితే మంత్రి పరిటాల సునీత అండగా ఉండటం, ఆమెకు తోడు కాలవ శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారధి కలిసి సిఎంను ఒప్పించారు. జడ్పీ చైర్మన్‌గా పూల నాగరాజు, చమన్ మధ్యే పోటీ నెలకొంది. దీంతో జడ్పీటీసీ అభ్యర్థుల్ని గెలిపించుకునే బాధ్యత ఇరువురిపైనా జిల్లా నేతలు పెట్టారు. ఈ క్రమంలో అత్యధిక స్థానాలు టిడిపి కైవసం చేసుకోవడంతో చైర్మన్ పదవిలో చెరో రెండున్నరేళ్ల పాటు కొనసాగేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే కాల పరిమితి పూర్తయినా చమన్ ఏదో ఒక సాకు, ఎత్తుగడతో రాజీనామాను వాయిదా వేస్తుండటంతో జిల్లా నేతల్లో అసహనం పెరిగిపోతోంది. అప్పట్లో మద్దతు ఇచ్చిన తాము అధినేతకు ఏమని చెప్పుకోవాలి? అంటూ సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా? పదవి ఒక్కటే పరమావధి కాదు కదా? మాట ప్రకారం రాజీనామా చేయకుండా ఏమిటీ కుంటి సాకులు? పార్టీ ముఖ్యం కానీ, పదవులు కాదు.. క్రమశిక్షణ ఉల్లంఘన క్షమించరానిది? అంటూ చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా.. అధిష్ఠానం అనుకుంటే ఎంత సేపు? పుట్టపర్తి నగర పంచాయతీ చైర్మన్ పిసి గంగన్నపై వేటు వేయలేదా? అని ఉటంకిస్తుండటం విశేషం. చైర్మన్ పదవికి రాజీనామా చేయకుండా తనకు కనిపించవద్దని చమన్‌కు సిఎం చంద్రబాబు సీరియస్‌గా చెప్పారని గుర్తు చేస్తున్నారు. ఈయనలాగే ఆశ పెట్టుకున్న వారికి పదవిలో కొనసాగాలని ఉంటుంది కదా? ఎవరైనా హోదాను కోరుకుంటారు కదా! అంటున్నారు. తెగేదాకా లాగితే.. ఇకపై తమ చేతుల్లో ఏమీ ఉండదని, పార్టీలో భవిష్యత్తు కోల్పోయే పరిస్థితి రానీకూడదంటూ చర్చించుకోవడం గమనార్హం. నంద్యాల ఉప ఎన్నికలకు, చమన్ రాజీనామాకు ఏమాత్రం సంబంధం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చమన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
రక్షకతడులు అందించి రైతులను ఆదుకోండి
అనంతపురం సిటీ:ఎండుతున్న వేరుశెనగ పంటలకు ఎంఐ కంపెనీ ప్రతినిధులు, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి రక్షకతడులను అందించి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రాజశేఖర్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక లెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్సు హాల్‌లో రక్షకతడుల అంశంపై ఎంఐ కంపెనీ ప్రతనిధులు, వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయ సమవేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వేరుశనగ పంటలను కాపాడేందుకు సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొని సకాలంలో రక్షకతులను అందించి రైతులను గట్టెక్కించాలని సిఎం కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఇప్పటికే ముక్యమంత్రి రాష్ట్ర స్థాయి ఎంఐ కంపెనీ ప్రతినిధులు, వ్యవసాయ, జలవనరుల శాఖల అధికారులతో అనేకసార్లు సమావేశాలు నిర్వహించారన్నారు. జిల్లా స్థాయిలో రెయిన్‌గన్ల ద్వారా రక్షకతడులను అందించే ప్రక్రియపై మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో వర్క్‌షాపును నిర్వహించి ఎంఐ కంపెనీలకు అవకాహన కల్పించామన్నారు. బెట్టదశలో వున్న వేరుశెనగ పంట వివరాలను, రక్షకతడులను అందించేందుకు ప్రణాళికను కలెక్టర్ అందజేస్తారన్నారు. ఆ ప్రణాళిక మేరకు మీకు కేటాంచిన మండలాల్లో తడులు ఇవ్వాలని ఆదేశించారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా యూప్‌ను రూపొందించామని, ఇందులో ఎప్పటికప్పుడు ఎంత విస్తీర్ణానికి ఎంత నీటిని అందించారన్న వివరాలను పొందుపరచాలన్నారు.ఈ వివరాలను ఆధారంగా చేసుకుని ప్రతి 15 రోజులకోక సారి బిల్లులు చెల్లింపులు ఉంటాయని, దీనికి 50కోట్ల రూపాయలు రివాల్వింగ్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కదిలే ఎత్తిపోతల పథకంలో 30 యూనిట్లను సిద్ధం చేస్తున్నామన్నారు. వీటి ద్వారా కాలువలు, పంటకుంటలు, చెరువులలో వున్న నీటిని సమీపంలో వున్న పంట పోలాలకు నీటిని అందించాలన్నారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకుని నిస్వార్థంగా, పారదర్వకంగా, అంకితభావంతో తడులను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జు కలెక్టర్ టికె.రమామణి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శ్రీరామ్మూర్తి, ఆత్మ పి నాగన్న, అధికారులు హరిబాబు చౌదరి, శ్రీనివాసరావు, చంద్రానాయక్, ఎంఐ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేట్ శక్తులకు ఊడిగం తగదు
అనంతపురం సిటీ: కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధానానికి దేశంలో స్వస్తిపలికి పేద ప్రజల అభివృద్ధికి పాటు పడాలని ఢిల్లీ జెఎన్‌యూ ఎఐఎస్‌ఎఫ్ మాజీ అధ్యక్షుడు కన్హయ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఎఐవైఎఫ్, ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ట్స్ కాలేజి మైదానంలో నిర్వహించిన లాంగ్‌మార్చ్ బహిరంగ సభకు కన్హయ్‌కుమార్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు విద్యార్థులు టవర్‌క్లాక్ నుండి ఆర్ట్స్ కాలేజి మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో కన్హయ్‌కుమార్ మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగం ఎక్కువవుతోందన్నారు. దేశంలో మోదీ ఎన్నికల ముందు సంవత్సరానికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఇంత వరకు ప్రధాని మోదీ ఇప్పటి వరకు 35వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, మిగిలిన 3కోట్ల ఉద్యోగాలు ఎప్పడు ఇస్తారని ప్రశ్నించారు. విద్యార్థులకు అవసరం లేని విద్యావిధానాలను ప్రవేశపెట్టి జెఎన్‌యూలో నైతిక, ప్రజాస్వామ్య విలువలను దిగజారుస్తున్నారని ఆరోపించారు. గోరక్షణ పేరుతో దళితులు, గిరిజనులు, క్రైస్తవులు, ముస్లింపై దాడులు చేసి అరచకాలు సృప్టిస్తున్న బిజెపి అనుబంధ ఆర్‌ఎస్‌ఎస్ ఆగడాలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. విదేశీయ యూనివర్సిటీలను స్వయం ప్రతిపత్తి ఇచ్చి దేశంలోకి ఆహ్వానించడం విద్యార్థులందరు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అలాగే విద్యార్థులకు యూనివర్సిటీలో అన్ని సౌకర్యాలు కల్పించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జాతీయ స్థాయిలో విద్యార్థి, యువత ఏకమై ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్ రమణ, ఎఐఎస్‌ఎఫ్ మధు, జాన్సన్, సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్, నాయకులు పి.నారాయణస్వామి, జాఫర్, విద్యార్థి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వర్మ వ్యాఖ్యలు సిగ్గుచేటు
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సిట్ విచారణకు హాజరైన సినీనటి చార్మిని ఝూన్సీ లక్ష్మిభాయితో పోల్చడం రామ్‌గోపాల్ వర్మ దిగజారుడుతనానికి నిదర్శనమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక ఆర్ట్స్ కాలేజి మైదానంలో నిర్వహించిన లాంగ్‌మార్చ్‌లో ఆయన డ్రగ్స్‌పై స్పందిస్తూ దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన ఝూన్సీ లక్ష్మిబాయితో ఛార్మిని పోల్చడం సిగ్గుచేటన్నారు. రామ్‌గోపాల్ వర్మ తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మత్తుమందుల వ్యవహారంతో సంబందమున్న అందరికీ కఠిన శిక్షలు పడేలా సిట్ విచారణ సాగించాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటులు నమూనాలు ఇవ్వకుండా కోర్టు ఆశ్రయిస్తున్నారని, ఈ విషయంలో కోర్టులు కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి
ధర్మవరం: జిల్లాలో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎస్‌పి జివిజి.అశోక్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం డి ఎస్‌పి కార్యాలయంలో సబ్‌డివిజన్ పోలీసులతో సమీక్ష అనంతరం ఇన్‌చార్జ్ డి ఎస్‌పి శివరామిరెడ్డితో కలిసి ఎస్‌పి విలేకరుల సమావేశంలో మాట్లాడుతు శాంతిభద్రతలతో పాటు పోలీసు ఖాళీలు వున్నచోట వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రధానంగా గ్రామాల్లో మద్యం అమ్మకాలు కాని, బెల్టుషాపులు నిర్వహణ కాని జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, 100కు డయల్ చేసి సమాచారమందించాలన్నారు. మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ తదితర అసాంఘీక కార్యకలాపాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. వీటివల్ల యువత చెడుమార్గంలో పయనించకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, ఏయే ప్రాంతాల్లో జూదం, మట్కా, పేకాట, బెట్టింగ్ నిర్వహణ జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు సమాచారాన్ని రాబట్టి దాడులు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే దొంగతనాలపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పాత నేరస్థుల జాబితా ద్వారా విచారించి త్వరితగతిన దొంగతనాలు జరిగిన వెంటనే నేరస్థులను అరెస్టు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల పుట్టపర్తి రైల్వేస్టేషన్‌లో గంజాయిని సైతం పోలీసు నిఘా ద్వారానే పట్టుకోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా పట్టణాల్లో ఎవరైనా పనిమీద ఇంటికి తాళాలు వేసి వెళితే దగ్గరలో వున్న పోలీస్‌స్టేషన్‌కు సమాచారమందిస్తే ఆ ప్రాంతంలో సిసికెమరాలు ఏర్పాటు చేసి నిఘా వుంచుతామన్నారు. ఇందుకోసం జిల్లాకు 50కెమరాలు వచ్చాయని, అందులో ధర్మవరం డివిజన్‌కు 7కెమరాలు అందిస్తున్నట్లు తెలిపారు. కెమరాలు అందుబాటులో లేనిపక్షంలో పోలీసులు వాచ్ చేస్తారని పేర్కొన్నారు. ప్రత్యేకంగా యాప్‌ను కూడా జిల్లా నుంచే ప్రథమంగా యాప్‌ను తయారుచేసినట్లు తెలిపారు. ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించామని, ధర్మవరంలో ట్రాఫిక్ సమస్య వున్నట్లు స్థానిక పోలీసుల ద్వారా తెలుస్తోందని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఎస్ ఐను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను తనిఖీ చేయండి
అనంతపురం సిటీ: కాలుష్యం వెలువడే పరిశ్రమల యూనిట్లను తరచు తనిఖీ చేయాల్సిందిగా జిల్లా ఇన్‌ఛార్జ్జి కలెక్టర్ రమామణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్సు హాల్‌లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ, సింగల్ విండో క్లియరెన్సు సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యధికంగా కాలుష్యం వెలువడే టైర్ల నుండి నూనేను తయారు చేసే పరిశ్రమల్లాంటి యూనిట్లను రెగ్యులర్‌గా పర్యవేక్షిస్తూ వుండాలన్నారు. ఇతర పరిశ్రమలను కూడ 6 నెలలకొసారి తనిఖీ చేసి ధృవీకరణ పత్రాలను ఇవ్వాలని కాలుష్య నియంత్రణ బోర్డు ఏఈ శంకరరావును ఆదేశించారు. కాలుష్య పరంగా అభ్యంతరం వుండి అనుమతి ఇవ్వకపోతే వాటిని మూసివేసేందుకు నివేదిక ఇవ్వాలన్నారు. పరిశ్రమల అనుమతుల మంజూరు చేసే శాఖలు నిర్ధేశించిన సమయంలోపే దరఖాస్తులను పరిష్కరించి సింగిల్ డెస్క్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. అదనపు సమాచారం అవసరమైతే దరఖాస్తుదారునికి తెలియజేసి, దానిని కూడ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. జెసిబి, డోసర్ లాంటి పరికరాలకు సబ్సిడీ మంజూరుకు పరిశ్రమల శాఖ జిఎం, ఎల్‌డిఎం, సంబంధిత బ్రాంచ్ మేనేజర్, తహాశీల్దారు తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలన్నారు. ఇతర వాహనాలకు సబ్సిడీ మంజూరు చేసేందుకు లైన్ డిపార్టమెంట్స్‌లో ప్రభుత్వ లబ్దిదారుల జాబితాను పరిశీలించిన తర్వాత మంజూరుకు సిఫారస్సు చేయాలన్నారు. ఇందులో 85 పరిశ్రమలకు సంబందించిన సబ్సిడీ మంజూరు దరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జిఎం సుదర్శన్‌బాబు, డిడి శ్రీనివాస్, ఎల్డీయం జయశంకర్, పిడిఓ సుధాకర్‌రెడ్డి, టౌన్ అండ్ కంట్రీప్లానింగ్, ఎస్పీడిసిఎల్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
విషజ్వరాలపై జాగ్రత్తగా ఉండాలి
అనంతపురం అర్బన్: జిల్లాలో నమోదవుతున్న విషజ్వరాలపై ఎంపిహెచ్‌ఓ మరియు సిహెచ్‌ఒలు మరింత ఆప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వెంకటరమణ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపిహెచ్‌ఓలు, సిహెచ్‌ఓలు పాల్గొన్నారు. ఈ సదర్భంగా జిల్లా వై ద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమ ణ మాట్లాడుతూ జిల్లాలో అక్కడక్కడ విషజ్వరాల నమోదు అవుతున్నాయన్నారు. వైద్య సిబ్బంది ముందస్తు జా గ్రత్తలు తీసుకొని నివారణ చర్యలు తీ సుకోవాలన్నారు. మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో ప్రజాప్రతినిధులు సహయం తీసుకొని పారిశుద్ధ్యం, వ్యక్తిగత శుభ్రత వంటి విషయాలపై విస్త్రుత ప్రచారం చేయాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే తప్పనిసరిగా పాటించడంతో పాటు ప్రతి శనివారం పరిసరాల పరిశుభ్రత దినంగా పాటించే విధంగా ప్రజలను చైతన్య పరచాలన్నారు. అంటువ్యాధుల నివారణలో అలసత్వం సహించేదిలేదన్నారు. ఇది ఆగస్టునెల 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరగబోవు మీజిల్స్ రూబెల్లా నివారణ టీకా కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికలతో సజావుగా అమలు పరచాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 9నెలల నుండి 15 ఏళ్ల చిన్నారులందరికీ మీజిల్స్ మరియు రుబెల్లా టీకాను ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ టీకాపై సైతం క్షేత్రస్థాయి సిబ్బంది విసృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్యధికారి పద్మవతి, డిఐఓ పురుషోత్తం, డాక్టర్ సుజాత, రతీష్‌బజాజ్, దిలిప్‌కుమార్, దోసారెడ్డి పాల్గొన్నారు.
నేర ప్రవృత్తిని విడనాడి ప్రశాంత జీవితాన్ని గడపండి
బత్తలపల్లి: నేరాల జోలికి వెళ్ళకుండా ప్రశాంత జీవనం గడిపినపుడే సంసారాలు సాఫీగా జరుగుతాయని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ పుల్లయ్య, అదనపు జూనియర్ మెజిస్ట్రేట్ గాయత్రి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని పోట్లమర్రి గ్రామంలో మండల న్యాయసేవా సమితి ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ప్రజలు ఎల్లప్పుడు ఆస్పత్రులు, పోలీస్‌స్టేషన్లు, కోర్టుల మెట్లు ఎక్కవద్దంటూ సూచించారు. ఇక్కడకు రావడమంటే డబ్బులు పోవడమే కాక మానసిక ప్రశాంతత కోల్పోవడం జరుగుతుందన్నారు. బ్యాంకుల్లో రుణాలు పొందిన రైతులు పంటలు పండక అప్పులు కట్టలేని పరిస్థితులు వస్తే బ్యాంకులు వేలం వేయకుండా కోర్టు ద్వారా ఉపశమనం పొందవచ్చునన్నారు. ఎస్‌సి, ఎస్‌టి కేసుల్లో తప్పుడు కేసులు నమోదైతే నిందితులు తిరిగి వారిపైనే కేసులు పెడితే జైలుకు వెళ్ళక తప్పదన్నారు. ఏవైనా సమస్యలొస్తే కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు కలిసి చర్చించుకుని పరిష్కారం చేసుకోవాలన్నారు.
క్షణికావేశాలకు లోనుకాకుండా ఘర్షణకు దిగవద్దని సూచించారు. ఇరువర్గాలు ఒప్పుకుంటే లోక్‌అదాలత్‌లో కేసులు రాజీ చేసుకోవచ్చునన్నారు. అంతకుమునుపు తహశీల్దార్ సురేష్‌బాబు, ఉపసర్పంచ్ హరికుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు శంకర్‌నారాయణరెడ్డి, అతావుల్లా, నరసింహులు తదితరులు వివిధ అంశాలపై వివరించారు. సదస్సులో న్యాయవాదులు విజయరాఘవ, సుమలత, దస్తగిరితో పాటు వి ఆర్ ఓ పెద్దన్న, రామాంజనేయులు, పంచాయితీ కార్యదర్శి నారాయణస్వామి, పోలీసులు, గ్రామపెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
అర్హులందరికీ పంట నష్ట పరిహారం
చిలమత్తూరు : అర్హులందరికీ పంటనష్ట పరిహారం అందిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని శెట్టిపల్లిలో రైతు శ్రీరామప్పకు చెందిన వేరుశెనగ పంటను పరిశీలించారు. ఈ సందర్భం గా ప్రస్తుతం రెయిన్‌గన్‌ల ద్వారా రక్షకతడులను వేస్తే పంటలు ఎంతవరకు పండుతాయన్న విషయంపై ఆరా తీశారు. అదేవిధంగా భూమిలోని తే మశాతాన్ని శాస్ర్తియంగా పరిశీలించా రు. ఈ ప్రాంతంలో ఎకరా వేరుశెనగ పంట వేస్తే వచ్చే ఖర్చులు, లాభాలపై రైతులతో అడిగి తెలుసుకుంన్నారు. వారు చెప్పిన లెక్కల ప్రకారం వేరుశెనగలో లాభాలు వచ్చే అవకాశాలే లేవని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అనంతరం హంద్రీనీవా కాలువ నీటిని చిలమత్తూరు మండలంలోని గ్రామాలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. తాము పంటలు సాగు చేసిన విస్తీర్ణానికి పంటనష్ట పరిహారం అందించాలని కోరారు. వెంటనే రెయిన్‌గన్‌లను రైతులకిస్తే కొంతమేర పంటలను కాపాడుకోవచ్చని రైతులు కోరారు. అనంతరం రెయిన్‌గన్‌ల పనితీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జెడి శ్రీరామమూర్తి, ఇన్‌చార్జి జెసి 2 వెంకటేశం, ఎడి రవికుమార్, తహశీల్దార్ ఇబ్రహీం సాబ్, ఎంపిడిఓ శివనందనాయక్, ఏఓ శ్రీలత, ఎంపిపి నౌజియాబాను తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సెలవు పొడిగింపు
అనంతపురం : కలెక్టర్ జి.వీరపాండియన్ సెలవు పొడిగించినట్లు సమాచారం. అనారోగ్యం కారణంగా ఆయన గత కొద్ది రోజుల క్రితం ఆయన సెలవులో వెళ్లిన విషయం విధితమే. దీంతో జెసి టికె రమామణి ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా కొనసాగుతున్నారు. కాగా మెరుగైన చికిత్స నిమిత్తం కలెక్టర్ తన సెలవును పొడిగించినట్లు తెలిసింది.
అఫ్జల్‌గురు ఉరిని వ్యతిరేకించిన దేశద్రోహి కన్హయ్
అనంతపురం సిటీ: దేశ ద్రోహనికి పాల్పడిన అబ్జల్‌గురు ఉరిని వ్యతిరేకించిన దేశ ద్రోహి కన్హయ్‌కుమార్ జిల్లాకు రావడం సిగ్గుచేటని ఏబివిపి జిల్లా కో కన్వీనర్ వీరాంజినేయులు పేర్కొన్నారు. కన్హయ్‌కుమార్ జిల్లాకు రావడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం ఎబివిపి ఆధ్వర్యంలో స్థానిక టవర్‌క్లాక్ వద్దవున్న భగత్‌సింగ్ విగ్రహానికి పాలాభీషేకం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరాంజినేయులు మాట్లాడుతూ దేశ స్వతంత్య్రం కోసం అనేక మంది తమ చిన్న వయసులోనమే ప్రాణాలను కోల్పోయి, దేశానికి స్వాతంత్య్రం తీసుకవస్తే మన దేశా రాజధానిలోని ఢిల్లీ జెఎన్‌యూ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘానికి పనిచేసిన కన్హయ్‌కుమార్ జాతీయ గీతాన్ని, జాతీయ జెండాను గౌరవించకుండా పాకిస్థాన్‌కు జిందాబాద్ కొడుతూ దేశాన్ని ముక్కలు చేస్తామని నినాదాలు చేసిన దేశద్రోహి జిల్లాలో పర్యటించడం చాలా సిగ్గుచేటన్నారు. పార్లమెంటుపై దాడి చేసిన అబ్జల్‌గురు, మంబాయి బాంబు పేళ్లు ఉగ్రవాది యాకుబ్‌లకు వత్తాసు పలికనటువంటి ఈ నాయకుడు మాయమాటలకు విద్యార్థి లోకం ఎప్పటికి మరువరానిదని తెలిపారు. దేశద్రోహి అనటువంటి కన్హయ్‌కుమార్ నడిచినటువంటి స్థలం మాలీనమైపోయిందని, కావున ఈ స్థలంలో పాలతో కడిగి ఈ స్థలం యొక్క పవిత్రతను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి నాయకులు సాయి, పులిరాజు, కృష్ణ, వీరేష్, రాయుడు, శ్రీకాంత్, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.

రిక్షా కార్మికుడి దారుణహత్య
హిందూపురం టౌన్ : లేపాక్షి మండలం తిలక్‌నగర్‌కు చెందిన బాబా ఫకృద్దీన్ (38) శుక్రవారం తెల్లవారుఝామున పట్టణంలోని డిఎల్ రోడ్డులో దారుణహత్యకు గురయ్యారు. పట్టణంలో రిక్షా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న బాబా ఫకృద్దీన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో తలపై మోది హత్య మార్చారు. అయితే ఎవరు, ఎందుకు హత్య చేశారనే విషయాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అగ్రిగోల్డ్ ఏజెంట్ ఆత్మహత్య
పెద్దవడుగూరు : మండల పరిధిలోని గుత్తి అనంతపురం గ్రామానికి చెందిన మోహన్‌రావు(48) శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో విష పుగుళికలు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. గమణించిన స్థానికులు గుత్తి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతరం తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు తెలిపారు. మోహన్‌రావుకు రెండున్నరెకరాల పొలం ఉండగా 1.70 ఎకరాల పొలం రహదారి సేకరణకు పోయింది. పరిహారంలో తోటి రైతులతో సమానంగా తనకు ఇవ్వలేదని మదనపడుతుండేవాడు. దీనికితోడు అగ్రిగోల్డ్ ఏజెంట్‌గా ఉన్న సమయంలో చేసిన పాలసీదారులు డబ్బులు చెల్లించాలని తరచూ డిమాండ్ చేయడంతోపాటు అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు అధికమయ్యాయి. ఈనేపథ్యంలో విషగుళికలు తిని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమణారెడ్డి తెలిపారు.