మెదక్

టీచర్లకు క్రమశిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్: ప్రభుత్వ పాఠశాలలను ఒక క్రమశిక్షణా పద్ధతిలో అదుపులో పెట్టేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నానని మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారి సరోజినిదేవి తెలిపారు. శుక్రవారం ఆమెతో కలిసిన విలేఖరులతో ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త ప్రణాళికను నిర్వహించబోతున్నట్లు ఆమె తెలిపారు. ముఖ్యంగా ఉపాధ్యాయులందరూ సమయ పాలన పాటించాలని ఆమె సూచించారు. ఉపాధ్యాయుల వద్ద ఉన్న సెల్‌పోన్స్‌ను తరగతుల్లో నిరోధించినట్లు ఆమె తెలిపారు. వారి వద్ద ఉన్న ఫోన్లన్నీ హెచ్‌ఎం వద్ద పెట్టుకోవాలని ఆమె సూచించారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు విద్యార్థులకు తేడా లేకుండా దుస్తులు వేసుకుంటున్నారన్నారు. కానీ మహిళా ఉపాధ్యాయులందరూ హుందాతనంగా ఉండేందుకు చీరలు ధరించి తరగతులకు హాజరుకావాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు బోధన చేసేప్పుడు కూర్చీలో కూర్చోరాదని ఆమె తెలిపారు. నిలబడే విద్యార్థులకు బోధన చేయాలన్నారు. ఈ బోధన కార్యక్రమానికి ముందు ఉపాధ్యాయులు ముందుగా బోధించే పాఠ్యంశాన్నీ ప్రిపేర్ అయన తరువాతే విద్యార్థులకు బోధన చేయాలని తెలిపారు. చదువే కాదు ఆటలు, పాటలు నేర్పించాలని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు లిటిల్ టీచర్, లిటిల్ లీడర్ అనే కార్యక్రమాన్ని ఆగస్టు 1 నుంచి ప్రారంభించబోతున్నట్లు డిఈఓ తెలిపారు. ఉపాధ్యాయులు చెప్పిన బోధన కార్యక్రమాలు హుషారుగా ఉన్న విద్యార్థులతో బోధన తరగతులు ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట వంతున నిర్వాహణ జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వంద నుంచి 150 మంది ప్రభుత్వ 10వ తరగతి విద్యార్థులు 10/10 గ్రేడ్ సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతిలో 8754 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. అయితే 10వ తరగతిలో తెలంగాణ సత్తా చూపుతామని డిఈఓ సవాల్ చేశారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆకస్మికంగా తనిఖీ చేస్తానన్నారు. ముఖ్యంగా ఉదయం ప్రార్దన కార్యక్రమాలకు హాజరవుతానని తెలిపారు. ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుందన్నారు. టీచర్స్ కొరత ఉంది, వారి స్థానంలో 363 మంది వివిలను భర్తీ చేయడం జరిగిందన్నారు. అదనంగా 160 మంది వివిలు అవసరం ఉందని ప్రభుత్వానికి వివరించడం జరిగిందన్నారు. కాగా విద్యాసంస్థలు ఒక మార్గంలో పెట్టడానికి ప్రణాళికబద్దంగా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యాసంస్థలలో ఎన్ని మార్పులు ఉన్నప్పటికీ విద్యార్థులకు బోధన అందించడం ఏకైక మార్గంగా ఎంచుకొని ఆ తరువాత ఉపాధ్యాయులు వారి కార్యక్రమాలు చేసుకోవడంలో తప్పులేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆమె తెలిపారు.

కారును ఢీకొన్న జెసిబి!
సిద్దిపేట అర్బన్: రాజీవ్ రహదారిపై సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని మందపల్లి శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రి కూతురు మృతిచెందగా మరో మహిళకు తీవ్రగాయాలైన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. టూటౌన్ సిఐ ఆంజనేయులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా చొప్పదండికి చెందిన కళ్లెం లక్ష్మారెడ్డి శుభకార్యం నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి టిఎస్ 02టిహెచ్ 5391 నెంబర్ గల కారులో హైద్రాబాద్‌కు వెళ్లి తిరుగు ప్రయాణమైనాడు. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపాన మందపల్లి శివారులోని రాజీవ్ రహదారిపై టిఎస్ 15ఇఇ 6858 నెంబర్‌గల జెసిబిని డ్రైవర్ అజాగ్రత్తగా తప్పుడు రూట్‌లో వచ్చి కారును ఢీకొట్టాడు. కారులో ప్రయాణిస్తున్న కళ్లెం లక్ష్మారెడ్డి(65) ఆయన కుమార్తె వనిత(35)లు మృతిచెందగా, బార్య తులసమ్మ తీవ్ర గాయాల పాలైంది. తులుసమ్మను చికిత్స నిమిత్తం 108లో సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వివరించారు.

నిండు గర్భిణి పట్ల ఇంత నిర్లక్ష్యమా?
పటన్‌చెరు: పట్టణంలోని టంగుటూరి అంజయ్య స్మారక వంద పడకల ఆసుపత్రి వైద్యుల తీరుపై పటన్‌చెరు జడ్పీటిసి సభ్యుడు గడీల శ్రీకాంత్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వైద్యం కోసం వచ్చిన నిండు గర్భిణిని బయటికి పంపారని ఆయన ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి ఆసుపత్రిలో సంప్రదించాలని వారు వెనక్కి పంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మండల పరిధిలోని చిట్కుల్ గ్రామ పంచాయతీ వడ్డెర కాలనీకి చెందిన దివ్య (26) ప్రసవం కోసం ఈ నెల 20న స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిందని, ఆమె ఏమాత్రం పట్టించుకోని వైద్యులు సంగారెడ్డికి పంపారని శ్రీకాంత్ ఆవేదన వెలిబుచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఆసుపత్రి వైద్యులను నిలదీసారు. ప్రభుత్వ సూచనలను బేఖాతరు చేస్తున్నారని, సాధ్యమైనంత ఎక్కువగా ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరగాలని ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా ఆదేశాలు ఇస్తున్నారన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ వైద్యుల వైఖరి మారకపోవడం శోచనీయమన్నారు. సంగారెడ్డి ఆసుపత్రికి వెళ్లిన దివ్యను అక్కడి వైద్యులు బయటికి గెంటి వేసారన్నారు. దానితో దిక్కులేని పరిస్థితులలో ప్రవేటు ఆసుపత్రిని ఆశ్రయించాల్సిన దుస్థితి దివ్య కుటుంబ సభ్యులకు కలిగిందన్నారు. ఆర్థికంగా చితికిన వారికి ప్రైవేటు వైద్యం బాగా ఖరీదుగా మారిందన్నారు. ప్రసవ వేదనతో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే రాత్రి సమయంలో బయటికి ఎలా పంపిస్తారని జడ్పీటిసి సభ్యుడు గడీల శ్రీకాంత్‌గౌడ్ ఆసుపత్రికి చెందిన వైద్యులను, సిబ్బందిని నిలదీసారు. ఇలాంటి పరిణామాలు మరోసారి జరిగితే ఎంతమాత్రము సహించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో దివ్య కుటుంబ సభ్యులు, పలువురు టిడిపి నాయకులు పాల్గ్గొన్నారు.

నోము పండించరా స్వామి!

మెదక్: నాగుల పంచమి పర్వదినాన్ని పురష్కరించుకొని మహిళా భక్తులు భక్తి శ్రద్దలతో పుట్టలలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసంలో వచ్చిన తొలి శుక్రవారం రోజు తెలంగాణ రాష్ట్ర ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి పసుపులేరు వాగు ఒడ్డున ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఉన్న నాగుల పుట్టకు పాలు పోసి ప్రత్యేక పూజలు తొలిసారిగా నిర్వహించారు. ఆ తరువాత ఎల్లమ్మ గుడిలో అమ్మవారికి పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో 10 నిమిషాల పాటు కూర్చున్నారు. వారి వెంట మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్ ఉన్నారు. తారకరామనగర్ కాలనీలో మహిళా భక్తులు నాగుల పుట్టకు పాలు పోసి ప్రదక్షణలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేయడం కనిపించింది. ఈ కార్యక్రమం ఉదయం ఏడు గంటల నుండి కొనసాగింది. ముఖ్యంగా మెదక్ పట్టణానికి కీలకమైన హనుమాన్ దేవాలయంలోని నాగ దేవతకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందే మల్లం చెరువు కట్టపై ఉన్న పురాతన పుట్టలలో పాలు పోసి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా ఈ సంవత్సరం మల్లం చెరువు కట్టపై రద్దీ ఉన్నప్పటికినీ క్యూలైన్లలో మహిళా భక్తులు నిల్చుండి వరుస క్రమంలో నాగ దేవతకు పాలు పోసి పూజలు నిర్వహించడం కనిపించింది. పోలీసులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం గమనార్హం. ముఖ్యంగా మహిళా కౌన్సిలర్లు, మహిళా డాక్టర్లు, వర్తక వ్యాపార మహిళలు, నిరుపేద మహిళలు ఈ పండుగను తారతమ్యం లేకుండా ఘనంగా నిర్వహించుకున్నారు. ఎప్పుడు కనిపించని మహిళా డాక్టర్ అనురాధ పూజలకు సంబంధించిన వస్తు సామాగ్రితో ఒక బుట్టను పట్టుకొని నాగ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అంతే కాకుండా విద్యాశాఖ అధికారి శోభ, వ్యాపారవేత్తలు నాగ దేవత పూజలలో విశేషంగా పాల్గొన్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా నాగుల పంచమి పండుగను మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు. సుమారు కొన్ని క్వింటళ్ల పాలు నాగ దేవతలకు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలు, యువతులు స్నానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరించి పూజకు అవసరమైన సామాగ్రితో వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి పుట్టలలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఉదయం 7 గంటల నుండే ఈ కార్యక్రమం ఊపందుకుంది. మెదక్ హనుమాన్ ఆలయం వద్ద భక్తులకు ఒక క్వింటళు లడ్డు ప్రసాదాలు పంపిణీ చేసిన హనుమాన్ ఆలయ కమిటికి ఒక ప్రత్యేకత చోటు చేసుకుంది. క్వింటళు లడ్డులను భక్తులకు అందజేసిన ఆలయ కమిటి పెద్దలు లింగబచ్చయ్య, విక్రమ్‌గౌడ్, మ్యాడం రమేశ్, తొడుపునూరి శివరామకృష్ణ, మ్యాడం రమేశ్, వీరేందర్, ప్రభాకర్, అంజన్న ఉన్నారు. ఈ ఆలయంలో పూజారులు ప్రసాద్‌రావు, గోపాల కృష్ణ భక్తులకు విశేష సేవలు అందించారు. అంతే కాకుండా బోరంచమ్మ ఆలయంలో, ఎల్లమ్మ ఆలయంలో నాగుల చవితి పూజలను మహిళా భక్తులు వైభవంగా నిర్వహించారు. మెదక్ జిల్లాలో నాగుల పంచమి పురష్కరించుకొని ప్రత్యేక ఆధ్యాత్మికంగా మహిళలందరు చిన్నా పెద్ద తేడా లేకుండా కనిపించారు. ఇది చారిత్రాత్మకం, ఇందులో ఉన్న భక్తి భావాలు అపూర్వం. ఇంతటి గొప్ప పండుగ మహిళలకు ఏకైక నాగుల పంచమని చెప్పుకోవచ్చు. ఇందులో తెలంగాణ రాష్ట్రం ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొనడం విశేషత నెలకొంది. ఎదురైన మహిళలను పద్మాదేవేందర్‌రెడ్డి బొట్టుపెట్టి ఆశీర్వదించడం కనిపించింది. ఎల్లమ్మ దేవాలయంలో గంగిరెద్దుల ప్రదర్శన జరిగింది. వారికి పద్మాదేవేందర్‌రెడ్డి కానుకలను సమర్పించారు. ఎందరో పేదవారు ఎదురుచూస్తున్న వారందకి ఆమె కానుకలు సమర్పించారు. ఆ తరువాత మెదక్ జిల్లా మిషన్ భగీరథకు అవసరమైన పైలాన్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రాంతాన్ని ఎల్లమ్మ గుడి ముందు గుట్టలపైకి ఎక్కి సందర్శించారు. ఇదే సమయంలో భారీ వర్షం కురిసింది. అయినా వర్షాన్ని లెక్కచేయకుండా పద్మాదేవేందర్‌రెడ్డి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆమె వెంట చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, పిఆర్‌ఓ జీవన్‌రావు, అధికారులు ఉన్నారు.

చేర్యాల విద్యార్థుల కోసం ప్రత్యేక బస్ కౌంటర్
సిద్దిపేట : సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కేంద్రంలో 30రోజుల పాటు విద్యార్థుల కోసం ప్రత్యేక మోబైల్ బస్ పాస్ కౌంటర్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఈసందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ చేర్యాల నుండి సిద్దిపేట కళాశాలకు వెళ్లే విద్యార్థులు బస్ పాస్ లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. వెంటనే జనగామ డిపో మేనేజర్‌తో మాట్లాడి ప్రత్యేక బస్ పాస్ కౌంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండ చూడాలని సూచించినట్లు తెలిపారు. దీంతో చేర్యాల మోబైల్ పాస్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గంగాధర్‌రెడ్డి రిమాండ్
సంగారెడ్డి: ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టినట్లు వచ్చిన పిర్యాదు మేరకు గురువారం ఏకకాలంలో సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్న ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గంగాధర్‌రెడ్డిని శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎసిబి డిఎస్పీ సూర్యనారాయణ స్పష్టం చేసారు. గంగాధర్‌రెడ్డి ఇళ్లతో పాటు బంధువుల ఇండ్లలో నిర్వహించిన సోదాల్లో మొత్తం 32 ఆస్తులను గుర్తించినట్లు తెలిపారు.
వీటి విలువ ప్రభుత్వ రికార్డుల ప్రకారంగా రూ.2.50 కోట్లు, బహిరంగంగా ప్రైవేట్ మార్కెట్ ప్రకారం రూ.12 కోట్లు ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గంగాధర్‌రెడ్డిని నాంపల్లిలోని ఎసిబి కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించామన్నారు.
మెదక్ ఎంఇవో నరేష్ సస్పెన్షన్!
మెదక్ రూరల్: ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన స్థానంలో ప్రైవేటు వ్యక్తితో విధులు నిర్వహిస్తున్నా చూసీ చూడనట్లు వ్యవహరించిన మెదక్ మండల విద్యాధికారి నరేష్‌ను సస్పెండ్ చేస్త్తూ ఆర్‌జెడి రమేశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాధికారి సరోజినీ దేవి శుక్రవారం ధ్రువీకరించారు. వివరాలిలా ఉన్నాయి. హవేళీఘణాపూర్ మండలం శుక్లాల్‌పేట ప్రాథమిక పాఠశాల ఎస్‌జిటి ఉపాధ్యాయుడు పి.సిద్దిరెడ్డి తాను విధులకు వెళ్లకుండా ఓ ప్రైవేటు వ్యక్తితో విధులు చేయించాడు. గత కొన్నాళ్లుగా ఈ తతంగం జరుగుతున్నా పర్యవేక్షించాల్సిన మండల విద్యాధికారి చర్యలు తీసుకోకపోవడమే కాకుండా ఉన్నతాధికారులకు సమాచారం అందించలేదు. ఐదు నెలల క్రితం దినపత్రికల్లో ప్రచురితం కావడంతో అప్పటి జిల్లా విద్యాధికారి స్పందించి విచారణ చేయించారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. వెంటనే ఉపాధ్యాయుడు పి.సిద్దిరెడ్డిని సస్పెండ్ చేశారు. ఉపాధ్యాయులపై పర్యవేక్షించాల్సిన మండల విద్యాధికారి సక్రమంగా పర్యవేక్షించలేదని ఆర్‌జెడి రమేశ్ మెదక్ ఎంఇవో నరేష్‌ను సస్పెండ్ చేశారని సరోజినిదేవి వివరించారు.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి భూమి పూజ
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో శుక్రవారం ఎమ్మెల్యే గీతారెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదోద్దీన్ భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ అబ్దుల్ హమీద్, ఎంపిపి చిరంజీవి ప్రసాద్, జెడ్పీటిసి కిషన్ పవార్, మున్సిపల్ చైర్ పర్సన్ సదానాబేగం, కౌన్సిలర్లు రాములు నేత, మోతిరాం, రవికిరణ్, అబ్దుల్లా, జాంగీర్ తదితరులు పాల్గొన్నారు.

దాబాలు, హోటళ్ళపై పోలీసు దాడులు
ములుగు: ములుగు మండల పరిధిలోని వంటిమామిడి రాజీవ్ రహదారి పక్కన గల దాబా హోటళ్ళపై ములుగు ఎస్‌ఐ శ్రీశైలం శుక్రవారం దాడులు నిర్వహించి హోటల్ యజమానులపై కేసులు నమోదు చేశారు. దీనికి సంబందించి ఎస్‌ఐ అందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రహదారుల పక్కన ఉన్న దాబాలలో నిల్వ ఉంచిన మటన్, చికెన్ అలాగే కల్తీ నూనెలు, పిండి పదార్థాలు గుర్తించామని అలాగే వండిన వస్తువులను కూడా పరిశీలించగా నాణ్యతా ప్రమానాలను దాబా యజమానులు పాటించడంలేదని ఎస్‌ఐ తెలిపారు. వినియోగదారులకు అందించే వస్తువులను పంపిణి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కల్తీ వస్తువులతో పదార్థాలను తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారని ఆయన తెలిపారు. ఈ దాబాలలో ఎన్నిమార్లు హెచ్చరికలు చేసినప్పటికి మద్యం సేవించడాన్ని తగ్గించకపోగా, దాబా యజమానులు నిర్లక్ష్యం చేయడంతో యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ దాడులలో ఎస్‌ఐతోపాటు సిబ్బంది శంకర్, రాజిరెడ్డి, సత్యనారాయణలు పాల్గొన్నారు.