సాహితి

కలతల కలవరింతలు - కలిసిన హృదయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భార్యాభర్తల మధ్య మూడో మనిషి (ఆడ అయినా సరే, మగ అయినా సరే) ప్రవేశిస్తే ఇక ఆ సంసారం గట్టుఎక్కినట్లే. గట్టు ఎక్కిన సంసారాన్ని సరిచేసుకోవడం ఎట్లా? ‘దిద్దుబాటు’ చేసుకోవడం ఎట్లాగో ఎప్పుడో చినప్పుడు (1910లో) కీ.శే. గురజాడ అప్పారావు పంతులుగారు చెప్పనే చెప్పారు. వేశ్యాలోలుడు అయిన మనిషిని మరల్చుకోవటానికి ఒక తమాషా ప్రదర్శిస్తుంది ఆ కథలో కమలిని. అన్ని కథలూ అంత తేలికగా దిద్దుబాటు సర్దుబాటు కావు. వ్యవహారం చాలా దూరం నడిచి కోర్టుల వరకు వెళ్లడం సామాన్య విషయం. కోర్టుకు వెళ్లిన తర్వాత కూడా ఆ దావాను వదులుకోవడం ద్వారా సరైన పరిష్కారం సంపాదిస్తుంది సుగుణ అనే యిల్లాలు, శ్రీహితశ్రీ వ్రాసిన ‘వర్షించని మేఘాలు’ అన్న కథానికలో. 1950 తరువాత తెలుగు స్వతంత్ర (ఎడిటర్ ఖాసా సుబ్బారావు/గోరా శాస్ర్తీ) హయాంలో తయారైన కొత్త రచయితలలో ఒకరు హితశ్రీ. విరివిగా కథలు, నవలలు వ్రాసి ప్రజారంజకంగా రూపుదిద్దారు. కథలోనికి వస్తే చమత్కారం అంతా ఎక్కడవున్నదంటే- చంద్రం అనే అతడు కొడుకు పుట్టిన తరువాత కూడా భార్యా పిల్లలను చూడటానికి రాడు. పట్నం నుంచి మూడున్నర మైళ్ళు దూరంలోనే వున్న గ్రామానికి రావటానికి అతనికి తీరిక దొరకలేదు. ఎందుకంటే ప్రియురాలు మనోరమకు పట్నంలో మరో యిల్లు కట్టిస్తున్నాడు. ఈ యింటి ప్రస్తావన తెచ్చిందనే కోపంతో ఉక్రోషంతో అతను - చంద్రం బారసాల కూడా చేసుకోకుండా తన యింటికి తిరిగి వెళ్లిపోతాడు.
అవమానాన్ని భరించుకుందుకు సిద్ధపడిన సుగుణ పసిబాలుడిని తీసుకుని భర్త దగ్గరకు వెడుతుంది. అతనికి ఎంతగా యిష్టం లేకపోయినా ఆమెను వెళ్లిపొమ్మని అనలేకపోతాడు చంద్రం. ఆమె అక్కడ అభోజనంగానే ఉండిపోతుంది ఒక రోజు.
చంద్రం ఆమెను సమరసంగా చూడకపోయినా, అక్కడ చేరివున్న ప్రియురాలి (మనోరమ) అన్న భూషణం ఆమెకు ‘కంటకం’గా తయారవుతాడు. ఆమెకు అన్నపానాలు అందిస్తూనే, తన ప్రేమ ప్రలాపాలు కూడా విన్నవిస్తాడు. సుగుణ అతన్ని మందలిస్తుంది. భర్తతో ఫిర్యాదు చేస్తుంది. అయినా అంత ప్రయోజనం కనిపించక ఆమె నెల రోజులలోనే మళ్లీ పుట్టినింటికి వెళ్లిపోతుంది. తండ్రి ఆమెను సంభాళించి, ధనమదంవల్ల చంద్రం చెడిపోతున్నాడు గనుక దానికి విరుగుడుగా అతనిమీద ‘మైనర్ దావా’ వేయడం ఒక్కటే తరుణోపాయం అని క్రమంగా అనునయించి చెబుతాడు. ఆస్థి సగం కొత్త యిల్లు కట్టించిన అప్పులతోనే సరిపోతే, తతిమ్మా సగం పిల్లవాడికి దఖలు అయితే చంద్రం యింక బికారి అయి రోడ్డుమీద పడడమే తరువాయి అవుతుంది.
చంద్రం కోర్టులో దావా దఖలు పడడంతో ప్లీడర్‌ను సంప్రదించక తప్పలేదు. ప్లీడర్ తన వృత్తిపరంగా చెప్పిన సలహా ఏమంటే- సుగుణ మంచిదే అయినా, మనోరమ అనే వేశ్యమీద మనసు పోయినందువల్ల ఆమెతో కాపురం చేయలేకపోతున్నాడు గనుక, ‘మైనర్ నాకు కొడుకు కాదు’ అని వాదించుదామని. చంద్రం మనస్సు ముందు రుూ సూచనను అంగీకరించదు. కాని దావా గెలవటానికి మరో మార్గం లేదు గనుక ఒప్పుకుంటాడు.
ఈ సమాధానం చూసుకున్న సుగుణ, ఆమె తండ్రి కూడా అతని దౌష్ట్యానికి, దుర్మార్గవర్తనకు- వాదనకు ఎంతగానో నొచ్చుకున్నారు, తిట్టుకున్నారు. చంద్రం రుూ రకమయిన వాదనకు అంగీకరించాడు గాని, అతని మనసు మనసులో లేదు. ఏదో తీరని అపచారం చేస్తున్నట్లు భావించాడు. తన అంతరాత్మకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్లు అనుభూతి పొందాడు. అయినా అతను మళ్లీ సమాధానం చెప్పుకున్నాడు. అవును. వాళ్లకలా శాస్తి కావలసిందే అని మనసులోనే అనుకున్నాడు.
చంద్రం యిచ్చిన దావా సమాధాన పత్రానికి జగన్నాధరావుగారు మండిపడడమే కాక, రుూ అపనిందనుంచి బయటపడడం కోసరమే అయినా దావాను పొడిగించాలనుకుంటారు. అయితే సుగుణ అభిప్రాయం వేరుగా వుంది. నలుగురు పెద్దమనుషులను ఋజువులు చూపించి నమ్మించడం అనవసరం అని ఆమె అభిప్రాయం. వారు రుూ ఆరోపణలు నిజమేనని మనస్ఫూర్తిగా నమ్మితే మనం చేసే ఋజువులు అనవసరం. కేవలం కేసు గెలవడం కోసమే వారు ఇలా చేస్తే ఋజువులు అంతకంటే అనవసరం. ఇంత ద్రోహం చేయడానికి డబ్బే కారణం. అయితే ఆ డబ్బు వారినే తీసుకోనీ. కాని నేను నిజం తేల్చుకోవాలి.. అని ఆమె మళ్లీ భర్త వున్న పట్టణానికి ప్రయాణమై వెడుతుంది. భర్త ఎదురయిన తర్వాత ఆమెకు ఏం మాట్లాడటానికీ నోరు పెగలదు. చంద్రం కూడా ఏమీ మాట్లాడలేక, ఆమె ముఖం వంక సూటిగా చూడలేకపోయాడు. మేఘాలు వర్షిస్తాయి అనుకుంటే అవి నీటి చుక్కలు కూడా రాల్చడంలేదు. ఇది అతనికి అశనిపాతం అయింది. ప్లీడర్ దగ్గరకు వెళ్లి అక్కడ మామగారు వుండడం కూడా ఎదుర్కొంటాడు. ఆయన చూపుతో చంద్రం పంచప్రాణాలు వణికాయి. ‘...ఎంత నీచభావంతో చూస్తున్నాడు. నిజమే, తను చేసిన పనికి అలా చూడడం అసమంజసంకాదు’ అనుకుని సిగ్గుతో తలవంచుకుంటాడు.
చంద్రం ప్లీడర్ దగ్గర్నుంచి ఇంటికి వచ్చేసరికి ఇక్కడ దృశ్యం మరింతగా గందరగోళంగా తయారయి కనిపిస్తుంది. భూషణం అతిగా ప్రవర్తించడంవల్ల, అతన్ని ఇంట్లోంచి వెళ్లిపొమ్మని అనడం ఎక్కువ అసాధ్యం కాలేదు. భూషణంతోపాటు మనోరమను కూడా ‘గంగలో దూకండి’ అని శపించి అతను సుగుణ దగ్గరకు వెడతాడు. అతని పరిస్థితి యిప్పుడు మరీ అగమ్యగోచరంగా తయారైంది. ‘సుగుణ కోపంతో ఒక్కమాట అని వుంటే అంత బాధపడేవాడు కాదు. కసిగాగాని, మర్మధ్వనితోగాని ఒక్క ఎత్తిపొడుపు మాట అయినా అని వుంటే..’- కాని సుగుణ నేలచూపులు చూస్తూ బెల్లం కొట్టిన రాయిలా నించుంది. తనను నిందించటానికి భాషలో మాటలు లేవేమో అనుకున్నాడు చంద్రం. ‘నా దురదృష్టానికి కారణం అయిన డబ్బును మీ నుంచి వేరుచేయటానికి’ ఈ దావా వేయించానని చెబుతుంది సుగుణ చివరకు. తను క్షమాపణ అడగవలసిన తరుణంలో సుగుణే ఆ పని చేసినందుకు చంద్రం పూర్తిగా కుంగిపోయాడు. ఘోరమైన పరాజయం పొందాడు.
చంద్రం తన పాపాయిని ఎత్తుకుని గుండెలకదుముకున్నాడు. అతని గుండెల్లోని అవ్యక్తమైన బాధ ఏదో క్రమంగా జారిపోతోంది. నీళ్లు నిండిన కళ్ళతో అతను పాపాయి కళ్లవైపు అలాగే చూశాడు. పాపాయి వేదాంతిలా నవ్వాడు. ఇలా కథ సుఖాంతం అవుతుంది. కలతలు మనసులలో కలవరింతలు కలిగిస్తాయి. అయినా హృదయానికి ‘నిజం’ తెలుసు. నిజం నిలకడమీదగాని బయటపడదు. హృదయాలు కలిసినప్పుడు, మనస్సులలోని మకిలి మటుమాయం అయిపోతుంది. ఇది వేదాంతం కాదు. మనుషుల నిజ జీవితాలలో నిరంతరం జరిగే సంఘర్షణే! సమాధాన సరళే!! బరువయిన భావ పరంపరను, పదునయిన మాటలతో పదిలంగా చెప్పడం రుూ కథానికలో జరిగిన పని. కలతలు కలకాలం వుంచుకోకుండా, కమనీయంగా కుదుటపడడమే కర్తవ్యం.

- శ్రీవిరించి, 9444963584