వరంగల్

మొక్కల ప్రాధాన్యతను భావితరాలకు తెలపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట: మానవ మనుగడకు చెట్లు ఎంతో అవసరమని, భావితరాలకు మొక్కల ప్రాధాన్యతను తెలియజేసి మొక్కలు నాటేలా వారిని ప్రోత్సహించాలని అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా హన్మకొండ బాలసముద్రంలోని ఈతకొలను ఆవరణలో సోమవారం మొక్కలు నాటే కార్యక్రమం కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డితో కలిసి నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అర్బన్ జిల్లాను పచ్చని చెట్లతో హరితవనంగా తీర్చిదిద్దేందుకు జూలై 12 నుండి పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామని తెలిపారు. చెట్ల ప్రాధాన్యతను తెలుసుకుని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మూడవ విడత హరితహారం కార్యక్రమంలో జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఉద్యమ స్ఫూర్తితో మొక్కలను నాటాలని తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించడంతోపాటు, వరంగల్ నగరాన్ని పచ్చని సుందర నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో కుడా ఆధ్వర్యంలో 10 లక్షల మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. అదే విధంగా నగరంలోని ప్రధాన కూడళ్లు, రోడ్ల మద్యలో మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణం కోసం చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈతకొలను ఆవరణలో క్రీడల విద్యార్థి విద్యార్థులతో కలసి కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో యువజన క్రీడల అధికారిణి ధనలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమాన్ని నీరుగార్చడానికే ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రకటన
పరకాల: పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రకటన ఉద్యమాన్ని నీరుకార్చడానికేనని అఖిల పక్షం నేతలు స్పష్టం చేశారు. సోమవారం పరకాల ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పిట్ట వీరస్వామి, కొలుగూరి రాజేశ్వర్‌రావు, బొచ్చు క్రిష్ణారావు, నక్క చిరంజీవి, దుప్పటి సాంబయ్య, ఓంటేరు రాజవౌళి మాట్లాడుతూ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాలను డమీ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. వరంగల్ రూరల్ జిల్లా ఉంటే జిల్లా కేంద్రం పరకాలలోనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ హన్మకొండ జిల్లా ఏర్పాటు చేస్తే హన్మకొండ జిల్లాలో మొగుళ్ళపల్లి, రేగొండ, కమలాపూర్, చిట్యాల, పరకాల మండలాలను కలపాలని పేర్కొన్నారు. పరకాలలో నాటి తెలంగాణ ఉద్యమం గుర్తు చేసేలా ఇంత భారీ స్థాయిలో ఉద్యమం జరగుతుంటే ఎమ్మెల్యే ఇంత వరకు స్పష్టత ఇవ్వడం లేదన్నారు. అదికాక ఉద్యమాన్ని అణచి వేయడానికి పోలీసు బలగాలను ఉపయోగించడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఉద్యమం ఆపి వేయండి ఎట్లా వస్తాది అంటూ స్పష్టత ఇవ్వకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రూరల్ జిల్లా కేంద్రం మొగిళిచర్లలో ఏర్పాటు చేస్తే తాము ఒప్పుకోమన్నారు. స్పష్టత వచ్చే వరకు పోరాటం ఆగదన్నారు. ఉద్యమాన్ని నీరు గార్చేందుకు చిచ్చు పెడితే ప్రజలు బుద్ది చెప్పుతారని చరిత్రహీనులు కావద్దన్నారు.
సిఐ తీరు పట్ల గరం...గరం...
పరకాల సిఐ జానీ నర్సింహులు వ్యవహరిస్తున్న తీరుపై అఖిలపక్ష నేతలు గరం..గరం అయ్యారు. రెవెన్యూ డివిజన్ ఏలా వస్తుందని సిఐ నర్సింహులు తమను ప్రశ్నించడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న తమను పోలీసు స్టేషన్‌లో రాత్రి 8 గంటలకు వరకు నిర్బంధించడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. డిసిపి ఇస్మాయిల్ అఖిల పక్షం నేతలను పంపించాలని సిఐకి చెప్పితే రాత్రి 8 గంటల వరకు పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించి వదిలి పెట్టారని పేర్కొన్నారు. మేము దొంగలము కాదని, దోపిడీలు, దౌర్జన్యాలు చేయలేదని, పరకాల ప్రజలు జిల్లా కేంద్రం అడగడం తప్పా అని వారు ప్రశ్నించారు. అంతేకాకుండా సిఐ అన్ పార్లమెంటరీగా మాట్లాడుతున్నాడని జిల్లా కేంద్రం, రెవెన్యూ డివిజన్ ఎలా వస్తుందని సిఐ అనడం సరైంది కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఉద్యమాలు చేసే హక్కులేదా అని వారు ప్రశ్నించారు. ఈ సమావేశంలో కానుగుల గోపినాధ్, ఏకు సారయ్య, చాడ రవీందర్‌రెడ్డి, మార్క రఘుపతిగౌడ్, కక్కు రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలి

నక్కలగుట్ట: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆగష్ట్ 15 భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుటకు అవసరమైన ఏర్పాట్లను ముందస్తుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆగష్ట్ 15న పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకం ఆవిష్కరణతో పాటు స్వాతంత్య్ర సమరయోధులకు సత్కారం, ప్రభుత్వ ఫ్లాగ్ షిప్, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల పై శకటాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బంది వివరాలు సమగ్రమైన సమాచారంతో ఆగస్టు 5లోగా కలెక్టరేట్‌కు ప్రతిపాదనలు పంపాలని కోరారు. సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు వివరాలను ముందస్తుగా సంభందిత అధికారులకు సూచించి అనుమతి పొందాలని, పబ్లిక్ గార్డెన్ టౌన్ హల్‌లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక ఎగ్జిబిషన్, ఛాయాచిత్ర ప్రదర్శన, విద్యార్ధిని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దయానంద్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మానుకోటలో 10మంది కాంగ్రెస్ నేతల అరెస్ట్
మహబూబాబాద్: ఛలో సిరిసిల్ల కార్యక్రమానికి అనుమతి లేదన్న కారణంగా పోలీసులు కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. దళిత, గిరిజన, బిసిలపై జరిగిన అమానుష దాడులను నిరసిస్తూ నేరెళ్ల బాధితులకు అండగా నిలిచేందుకు టిపిసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఛలో సిరిసిల్లాకు సన్నద్ధం అవుతున్న నేతలను పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేశారు. సోమవారం వేకువ జామునే కాంగ్రెస్ ముఖ్య నాయకులైన జడ్పీటిసి మూలగుండ్ల వెంకన్న, పట్టణ అధ్యక్షుడు ముల్లంగి ప్రతాప్‌రెడ్డితోపాటు నాయకులు ప్రసాద్, వెంకట్, వీరభద్రం, రాజుగౌడ్, కిషన్, వెంకటాచారి తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. పోలీసుల అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చెపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల అక్రమ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండించారు.

ఎండు గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు.. మరో ఇద్దరి పరారీ
నర్సంపేట: ద్విచక్రవాహనంపై అక్రమంగా రవాణా చేస్తున్న ఐదు కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశామని నర్సంపేట ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ మహబూబాబాద్ సూపరింటెండెంట్ విజయశేఖర్, సిఐ శశికుమారి తెలిపారు. నర్సంపేటలోని ఎక్సైజ్ పోలీసుస్టేషన్‌లో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. మోటార్ సైకిల్‌పై అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్న మాధన్నపేట గ్రామానికి చెందిన మారపాక రమేష్, గిరబోయిన సారంగపాణిలను అరెస్టు చేసినట్టు చెప్పారు. ఈకేసుతో సంబంధం ఉన్న చక్రంతండాకు చెందిన అజ్మీరా భద్రు, ఎ.్భద్రు పరారీలో ఉన్నారని ఆమె వివరించారు. అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్టు వివరించారు. ఈ విలేఖరుల సమావేశంలో ఎస్సై సరిత, సిబ్బంది పాల్గొన్నారు.
మద్యం తాగినడిపితే కటకటాల వెనక్కి...!?
కేసముద్రం: ఇంతకు ముందు పట్టణాలకే పరిమితమైన బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు గ్రామాల్లో కూడా చేపట్టేందుకు పోలీసులు నిర్ణయించారు. మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు ప్రధానంగా మోటార్‌సైకిళ్లని.. అందులో అధికులు మద్యం సేవించి వాహనాలను నడపడం వల్లే జరుగుతున్నాయని గుర్తించిన ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి జిల్లాలోని ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో విరివిగా బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన యంత్రాలను సమకూర్చారు. ఈ మేరకు ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో తరచుగా పరీక్షలు నిర్వహించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీనితో గ్రామీణ ప్రాంతాల్లో సైతం పోలీసులు మోటార్ వాహనాలను ఆపి వాహన డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించి మద్యం తాగినట్లు నిర్ధారణ జరిగితే వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకొని మరుసటి రోజు వారిని న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారు. గత బుధవారం రాత్రి కేసముద్రంలో వాహనదారులకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా ఏడుగురు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు నిర్ధారించి మహబూబాబాద్ కోర్టులో హాజరపర్చగా న్యాయమూర్తి రెండు రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

విద్యార్థులను చితకబాదిన పోకిరీలు
రాయపర్తి: సెలవురావడంతో సరదాగా అటలాడుకుందామని అరుగురు స్నేహితులు కలసి పక్కగ్రామంలోని తమ స్నేహితుని వద్దకు వెళుతుంటే మార్గమద్యలో ముగ్గురు పోకిరీలు వారిని అడ్డుకొని గృహనిర్బంధించి చిత్రహింసలు పెట్టిన సంఘటన కాట్రపల్లి గ్రామంలో జరిగింది. అలస్యంగా వెలుగులోకి రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎస్‌ఐ వెంకటమల్లు వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన గిరక కేశవ్, కళ్యాణ్, అభిషేక్, రాజు, లోకేష్, సన్నురాజులు కాట్రపల్లి గ్రామంలో ఏడవ తరగతి చదువుతున్నారు. అదివారం సెలవుకావడంతో తమ స్నేహితుడు అరవింద్ తమ గ్రామానికి సరదాగా అడుకోవడానికి రమ్మని పిలవడంతో అరుగురు స్నేహితులు మురిపిరాలకు సైకిళ్లపై వెలుతుండగా మార్గ మధ్యంలో మేకల సురేష్, అనిల్, మరోవ్యక్తితో కలిసి ఆరుగురు విద్యార్థులను అటకాయించి మేకల సురేష్ ఇంటికి తీసుకెళ్లి వీరి సైకిళ్లను లాక్కున్నారు. విద్యార్థులను నిర్బంధించి చేతి కర్రలతో కోట్టారు. అంతేకాకుండా వారి ఇంటి ముందు ఉన్న గడ్డిని పీకిస్తూ విచక్షణ రహితంగా చిత్రహింసలకు గురిచేశారు. ఈ విషయాలను ఇంటి వద్ద తల్లిదండ్రులకు చెబితే మిమ్ములను చంపేస్తామని బెదిరించారు. సుమారు ఐదు గంటలపాటు విద్యార్థులను నిర్బంధించి వారితో పనులు చేయించుకొని సైకిళ్లు ఇచ్చి వదిలేశారు. ఇంటికొచ్చాక తమ తల్లిదండ్రులకు భయపడి విషయం చెప్పకపోవడంతో సోమవారం ఉదయం విద్యార్థులు స్నానాలు చేస్తున్నప్పుడు ఒంటిపై ఉన్న వాతలను చూసి వారిని ప్రశ్నించడంతో ఉన్న విషయాన్ని చెప్పేశారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి పోలీస్ సేషన్‌లో పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.

కటకటాల పాలైన కిలాడి లేడీ

వడ్డేపల్లి: పోలీసులు దుస్తులు వేసుకుని కానిస్టేబుల్‌నని చెపుతూ గతకొంత కాలంగా మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న కిలాడీ లేడీని సుబేదారి పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సుబేదారి సిఐ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం సుబేదారి పోలీసు స్టేషన్లలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసముద్రం మండల కేంద్రానికి చెందిన పోలెపాక ప్రత్యూషరెడ్డి (24) గత కొన్నిరోజులుగా విజయవాడకు చెందిన నకిలీ ఆర్‌పిఎఫ్‌గా చెలామణి అవుతున్న సుబ్బుతో పరిచయం ఏర్పరచుకుందని, నకిలీ పోలీసు దుస్తులతో అంతర్జాలంలోని ఫేస్‌బుక్ ద్వారా సుమారు 1000 మంది మిత్రులను ఏర్పరచుకుని వారికి పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేస్తుందని తెలిపారు. అదే విధంగా కరీంనగర్ జిల్లాకు చెందిన స్వామి అనే వ్యక్తి దుబాయ్‌లో ఉంటున్నాడని, అతనితో పరిచయం ఏర్పరచుకున్న ప్రత్యూష తన వ్యక్తిగత అవసరాల కోసం 70 వేల రూపాయలను స్వామివద్ద నుండి తీసుకుందని సిఐ తెలిపారు. ఈ విషయాన్ని స్వామి తమ్ముడు అనిల్ ఈ నెల 28న ప్రత్యూషరెడ్డిపై సుబేదారి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, దర్యాప్తు కొనసాగించి కిలాడి లేడీ పట్టుకుని అరెస్టు చేసి, ఆమె వద్ద ఉన్న 24వేల నగదును, 7 చరవాణీలను, ఒక మోటర్ సైకిల్‌ను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచామని పేర్కొన్నారు. కిలాడీ లేడీని చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎస్సై సతీష్, కానిస్టేబుళ్లను సిఐ అభినందించారు.

పంట భూముల్లో రియల్ వెంచర్లు

మంగపేట: తిండి గింజలు విరగపండే పంట భూముల రూపం మారిపోతోంది. ప్రధాన రహదారుల పక్కన ఉన్నవైతే ఇట్టే మాయమైపోతున్నాయి. రియల్ ఎస్టేట్ పుణ్యమాని మాగాణి భూములు కొత్త మట్టిని కప్పుకుంటున్నాయి.
రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాయాజాలంతో చాలా చోట్ల రైతులు పంట భూములను అమ్మేస్తున్నారు. మంగపేట మండలంలోని రాజుపేట, కమలాపురంలలో పెట్రోల్ బంకుల సమీపంలో ఎన్నో ఎకరాలను ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారులు క్రయవిక్రయాలు చేశారు. వీటిలో నిబంధనలకు అనుగుణంగా ఉన్నవి తక్కువే. మండలంలో అనేక ఎకరాల పంట భూములు ఇంటి స్థలాలుగా మారిపోయాయి. భవిష్యత్‌లో వీటి విస్తీర్ణం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెట్రోల్ బంకుల సమీపంలోని స్థలాలపై కన్ను వేశారు. పెట్రోల్ బంకుల ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూములను రైతుల నుంచి కొనుగోలు చేసి వాటిల్లో చెరువుల మట్టి నింపి ఆ పంట పొలాలను ప్లాట్లుగా మార్చి అమ్ముతున్నారు. ఈ ప్రాంతంలో గుంట విలువ లక్షలలో ఉంది.
ఇలా మార్చిన ప్లాట్లలో ఎక్కువ శాతం అక్రమ లే అవుట్లు ఉన్నాయని తెలుస్తుంది. వ్యవసాయ భూమి మార్పు కోసం సర్కార్‌కు కట్టాల్సిన ఫీజు చెల్లించకుండా, లేఅవుట్ అనుమతులు లేకుండానే ఎక్కువ ప్లాట్లను విక్రయిస్తున్నారు. పంట భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చాలంటే ప్రభుత్వ నిబంధనలను పాటించాల్సి ఉండగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా ‘‘మామూలు’’గా ఉంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతమైన కమలాపురంలో పంట భూములను రియల్ వెంచర్లుగా మార్చిన వారి వద్ద నుండి ఫీజు వసూలు చేయాలని గ్రామ సభలో గ్రామస్థులు ఏకగ్రీవ తీర్మానం ఆమోదించినా అధికారులు మాత్రం గ్రామ సభ తీర్మాణంను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా సంబందిత అధికారులు స్పందించి పంట భూములను అక్రమంగా లే అవుట్‌లు చేసిన వారి వద్ద నుండి ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఫీజును వసూలు చేయాలని తద్వారా గ్రామ పంచాయితీలకు ఆదాయం పెరుగుతుందని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు

కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం శోచనీయం
వడ్డేపల్లి:ప్రజాస్వామ్యబద్దంగా నిరసలు తెలపడానికి సిరిసిల్లకు బయర్దేరిన కాంగ్రెస్ నాయకులను అప్రస్వామికంగా గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులు చేయడం శోచనీయమని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాసరావు మండిపడ్డారు. నేరెళ్ల గ్రామంలో దళిత బహుజనులపై దాడులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఛలో సిరిసిల్ల కార్యక్రమానికి తరలివెళుతున్న కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను సోమవారం అరెస్టు చేశారు. ఈసందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బడుగు బలహీన వర్గాలు బాగుపడుతాయని అనుకుంటే, దొరలకు ఊడిగం చేసే ఇసుక మాఫియా జీవితాలను బాగుపరుస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోల ద్వారా ప్రభుత్వ పనితీరును ప్రశ్నించే హక్కు లేకుండా పోయిందని, రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల అండతో నియంతృత్వ పాలన కొనసాగిస్తోందని విమర్శించారు.

హమాలీల అర్ధనగ్న నిరసన

నర్సంపేట: నాల్గవ తరగతి ఉద్యోగులుగా గుర్తించి, ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటియూసి ఆధ్వర్యంలో హమాలీలు సోమవారం అర్ధనగ్నంగా మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. నర్సంపేట సివిల్ సప్లై గోదాం ఎదుట హమాలీ కార్మికులు గత ఐదు రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్న విషయం పాఠకులకు తెల్సిందే. ఈక్రమంలో సోమవారం అర్ధనగ్నంగా మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా సిపిఐ రూరల్ జిల్లా సహాయ కార్యదర్శి పంజాల రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ప్రజలకు 14 రకాల నిత్యాసవసర వస్తువులు అందేవని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేవలం రెండు, మూడు రకాల వస్తువులను మాత్రమే ప్రభుత్వం ప్రజలకు ఇవ్వడం సరి కాదన్నారు.
పౌరసరఫరాల గోదాంలలో పనిచేస్తున్న హమాలీలకు తగినంత పని లేకుండా పోయిందని వాపోయారు. ప్రజలకు 14 రకాల నిత్యావసర వస్తువులను సరఫరా చేసి ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచనను ఉపసంహరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంపెల్లి మునీశ్వర్, మహేందర్, లక్ష్మీనర్సు, నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి
ములుగుటౌన్,జూలై 31: ములుగు నియోజకవర్గ అభివృద్దికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అహర్నిశలు కృషి చేస్తున్నారని టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గట్టు మహేందర్ అన్నారు. మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడు సంవత్సరాలు కావస్తున్నప్పటికి గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని సిఎం కెసిఆర్ నేతృత్వంలో మంత్రి చందూలాల్ చేస్తూ ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు, సింగిల్ విండో ఎన్నికల్లో తమ పార్టీ ప్రతిపక్ష పార్టీల దిమ్మతిరిగేలా విజయం సాధిస్తారని అన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు టిఆర్‌ఎస్ పార్టీని విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. లేని పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, మండల నాయకులు, అన్ని గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు, అనుబంధ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.