అంతర్జాతీయం

ఏటా లక్ష మంది చిన్నారులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, ఆగస్టు 2: తల్లిపాల ద్వారా నివారించగలిగిన వ్యాధుల కారణంగా భారత దేశంలో ప్రతి ఏటా దాదాపు లక్ష మంది చిన్నారులు చనిపోతున్నారని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. అంతేకాకుండా బాలింతలు తమ పిల్లలకు తగినంతగా స్తన్యాన్ని ఇవ్వకపోవడం కారణంగా సంభవించే శిశు మరణాలు, ఇతర నష్టాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు ఏటా 1400 కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లుతోందని కూడా ఆ నివేదిక పేర్కొంది. తల్లులు తమ చిన్నారులకు స్తన్యాన్ని ఇవ్వడం వల్ల చిన్నారుల మరణాలకు ప్రధాన కారణాలయిన డయేరియా (నీళ్ల విరేచనాలు), న్యుమోనియా వ్యాధులను నివారించగలగడమే కాకుండా తల్లుల్లో అండాశయ, రొమ్ము క్యాన్స ర్ రిస్క్‌ను తగ్గించడానికి దోహదపడుతుందని యునిసెఫ్, డబ్ల్యుహెచ్‌ఓలు గ్లోబల్ బ్రెస్ట్ఫీడింగ్ కలెక్టివ్ సంస్థ తో కలిసి రూపొందించిన ‘గ్లోబల్ బ్రెస్ట్ఫీడింగ్ స్కోర్ బోర్డ్’ అనే నివేదిక పేర్కొంది. చైనా, భారత్, నైజీరియా, మెక్సికో, ఇండోనేసియా దేశాల్లోనే తల్లులు తమ పిల్లలకు తగినంతగా స్తన్యాన్ని ఇవ్వకపోవడం కారణంగా ఏటా 2,36,000 మందికి పైగా పిల్లలు చనిపోతున్నారని ఆ నివేదిక పేర్కొంది. ఈ కారణంగా సంభవించే శిశు మరణాలు, తదితర నష్టాల వల్ల భవిష్యత్తులో ఆర్థిక భారం ఏటా 119 బిలియన్ డాలర్ల మేర ఉంటుందని ఆ నివేదిక పేర్కొంది. ఆరునెలల లోపు చిన్నారుల్లో 55 శాతం మంది పూర్తిగా తల్లిపాలపై ఆధారపడుతున్నప్పటికీ భారత దేశం లో అయిదు నెలల లోపు పసిపిల్లల్లో మరణాలు అధికం గా ఉండడాన్ని బట్టి చూస్తే డయేరియా, న్యుమోనియా వ్యాధుల కారణంగా ఏటా 99,499 మరణాలు సంభవిస్తున్నాయని ఆ నివేదిక తెలిపింది. బిడ్డ పుట్టిన తర్వాత ఆరు నెలల పాటు పూర్తిగా తల్లి పాలు ఇవ్వడం వల్ల, ఆ తర్వాత కూడా కొనసాగించడం వల్ల ఈ వ్యాధులు రాకుండా చూడవచ్చని ఆ నివేదిక పేర్కొంది. అంతేకాకుండా తల్లి పాలు ఇవ్వక పోవడం కారణంగానే శిశు మరణాలు ఎక్కువగా ఉండడం, మహిళల్లో క్యాన్సర్, టైప్-2 మధుమేహం కారణంగా మరణాలు సంభవించడం జరుగుతోందని కూడా ఆ నివేదిక పేర్కొంది. తల్లి పాలు శిశువుకు జీవితంలో ఉత్తమమైన ఆరంభా న్ని ఇస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అధనోమ్ ఘెబ్రెయెసస్ తెలిపారు. తల్లిపాలు అనేవి పసిపాపకు మొట్టమొదటి వ్యాక్సిన్‌లాంటిదని, ప్రాణాంతకమైన వ్యాధులనుంచి రక్షణ కల్పించడమే కాకుండా జీవించడానికి, ఎదగడానికి అవసరమైన అన్ని పోషక విలువలను అందిస్తుందని ఆయన చెప్పారు.
ఆరు నెలలకన్నా తక్కువ వయసున్న పసిపిల్లల్లో కేవలం 40 శాతం మందికి మాత్రమే పూర్తిగా తల్లిపాలను ఇస్తున్నారని, కేవలం 23 దేశాల్లో మాత్రమే 60 శాతం అంతకన్నా ఎక్కువ తల్లిపాల రేటింగ్ ఉందని ఆయన తెలిపారు. తల్లిపాలపైన పెట్టుబడి పెట్టకపోవడం ద్వారా మనం తల్లులు, వారి పిల్లల విషయంలో విఫలమవుతున్నామని, అందువల్ల రెట్టింపు మూల్యం చెల్లిస్తున్నామని యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంథోనీ లేక్ అభిప్రాయపడ్డారు.