వరంగల్

పౌష్టికాహారం సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: జిల్లాలోని గర్భిణులకు, బాలింతలకు ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం కింద నిర్ధేశించిన మేరకు పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని, అంగన్‌వాడీ కేంద్రాలకు సకాలంలో భోజనం అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత విభాగాల అధికారులను వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి సూచించారు. గురువారం అర్బన్ కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో హరేకృష్ణ మూవ్‌మెంట్ ఫౌండేషన్ ప్రతినిధులు, విజయడైరీ, ఐసిడిఎస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం అమలుతీరు, భోజన సరఫరా, పాల సరఫరాపై కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు అర్బన్ జిల్లా పరిధిలోని ఇప్పటికే ఈనెల ఒకటవ తేదీనుంచి 296 అంగన్‌వాడీ కేంద్రాలలో ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం కింద పౌహ్టికాహారాన్ని సరఫరాను ప్రయోగాత్మకంగా ప్రారంభించామని, ఆగస్టు 16న హన్మకొండ అర్బన్ ఐసిడిఎస్ పరిధిలోని 271 అంగన్‌వాడీ కేంద్రాలలో, సెప్టెంబర్ ఒకటిన భీమదేవరపల్లి ఐసిడిఎస్ పరిధిలోని 232కేందాలలో ఆరోగ్యలక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించాలని తెలిపారు. అర్బన్ ఐసిడిఎస్ పరిధిలో 18రూట్లు ఏర్పాటుచేసి 18 ప్రత్యేక వాహనాలలో అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు మధ్యాహ్నం ఒంటిగంటలోగా భోజనాన్ని సరఫరా చేస్తున్నామని అక్షయపాత్ర నిర్వాహకులు తెలిపారు. ఈ భోజనం సరఫరా కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలను ఉపయోగిస్తున్నామని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయవలసిన పాల ధర విషయంలో ఉన్నతాధికారులతో చర్చించి ధర నిర్ణయించాలని విజయ డైరీ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజ, హరేకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి శ్రీవాత్సవ తదితరులు పాల్గొన్నారు.

సత్వరం రుణాలు
వరంగల్: ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులకు మంజూరైన యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన రుణాలను సత్వరం విడుదల చేయాలని రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ బ్యాంకర్లను కోరారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ కార్పొరేషన్‌ల ద్వారా వివిధ పథకాల కింద మంజూరైన యూనిట్లకు ఇప్పటికీ రుణాలు ఇవ్వటంలో జరుగుతున్న జాప్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసారు. పథకాలకు సంబంధించిన రుణాల మంజూరులో జాప్యం జరిగితే సకాలంలో లక్ష్యాలను పూర్తిచేయటంలో ఇబ్బందులు ఏర్పడుతాయని అన్నారు. గురువారం రూరల్ కలెక్టరేట్ మీటింగ్ హాలులో బ్యాంకర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు రెండేళ్ల కిందట మంజూరైన పథకాలకు రుణాలు మంజూరు చేయటంలో జాప్యానికి కారణాలను బ్యాంకర్లను ప్రశ్నించారు. దానికి బ్యాంకర్లు సమాధానమిస్తూ నెలరోజుల్లో రుణాల మంజూరు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2016-17లో అర్హులైన లబ్ధిదారులకు 890యూనిట్లు మంజూరయ్యాయని, యూనిట్లు పొందిన లబ్ధిదారుల ఖాతాలను ఆగస్టు 10వ తేదీలోగా వెంటనే ప్రారంభించాలని చెప్పారు. వివిధ పథకాల యూనిట్లు పొందిన లబ్ధిదారులు ఆ యూనిట్లు ఖచ్చితంగా ఏర్పాటు చేసేలా బ్యాంకర్లు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. డెయిరీ యూనిట్లు ఏర్పాటుకు బ్యాంకర్లు ప్రోత్సహించాలని చెప్పారు. ప్రభుత్వ పథకాల ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులు రుణాలను తిరిగి చెల్లించటం లేదని, ఈ విషయంలో జిల్లాయంత్రాంగం సహకరించాలని బ్యాంకర్లు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, రుణాల రికవరీపై ప్రత్యేకదృష్టి పెడతామని, రుణాల తిరిగి చెల్లింపులకు సంబంధించిన నివేదిక అందచేయాలని బ్యాంకర్లకు కలెక్టర్ సూచించారు. వివిధ శాఖల అధికారులతో, మండల స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించి రుణాలు రికవరీ జరిగేలా చూస్తామని అన్నారు. జిల్లావ్యాప్తంగా బ్యాంకు ఖాతాలకు ఆధార్, మొబైల్ నెంబర్లు సీడింగ్ చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని, ఈ విషయాన్ని ఖాతాదారులకు తెలిపేందుకు ప్రతి గ్రామంలో మూడురోజుల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయా బ్యాంకుల ప్రతినిధులు కలెక్టర్‌కు తెలిపారు. మొదటి రెండురోజులు ఖాతాదారుల నుంచి మొబైల్ నెంబర్లు, ఆధార్ నెంబర్ సేకరించి మూడవరోజున ఖాతాలకు అనుసంధానం చేస్తారని చెప్పారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ హరిప్రసాద్, ఎస్‌బిఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ భరణికుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేష్, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల జిల్లా అధికారులు నర్సింహస్వామి, నిర్మల, సర్వర్‌మియా, సబిత, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

నగర అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు

నక్కలగుట్ట: మహానగరంగా శరవేగంతో అభివృద్ధి చెందుతున్న నగర అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని మహానగర పాలక సంస్థ కమిషనర్ శృతి ఓఝా అన్నారు. గురువారం కమిషన్‌ర్ కార్యాలయంలో నగర పాలక సంస్థ అధికారులతో శానిటేషన్ నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శానిటేషన్ మెరుగు పర్చడానికి అదనపు వసతులను ఏవిధంగా కల్పించాలో సూచించాలని అధికారులకు తెలిపారు. బీన్స్, వాహనాల వంటి సదుపాయాలను కల్పించడానికి సిద్ధంగా ఉన్నమని అన్నారు. ఆర్గనిక్ వెస్ట్ కంపోస్ట్, అండర్ గ్రౌండ్ బీన్స్ వంటి వాటిపై సమగ్ర నిర్వహణ కోసం సాధ్యమైనంత త్వరలో టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. ఆగస్టు పదిలోగా నగరపాలక సంస్థ పరిధిలో పందుల పెంపకానికి గుర్తించిన స్థలాలకు వాటిని తరలించాలని ఆదేశించారు. చెత్త సమగ్ర నిర్వహణకు నగరంలో గతంలో రెండు చోట్ల డంపింగ్ స్థలాలను గుర్తించామని, అక్కడి నుండి ప్రధాన డంపింగ్ యార్డ్‌కు తరలించడానికి నిర్వహణ వ్యయం తక్కువగా ఉండేలా నివేదికలు తయారు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ షాహిద్ మసూద్, ఆరోగ్య అధికారి రాజారెడ్డి, ఈ ఈ లక్ష్మారెడ్డి, సాంకేతిక నిపుణులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

యువతి వౌన దీక్ష
కాటారం: ప్రేమిస్తున్నానని నమ్మబలికి తనను శారీరకంగా వాడుకున్నాడని ఆక్రోశిస్త్తూ ఓ యువతి సదరు యువకుడి ఇంటి ఎదుట వౌన దీక్షకు దిగింది. వివరాలలోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండల కేంద్రమైన కాటారానికి చెందిన బొమ్మ సంతోష్ అనే యువకుడు తనను ప్రేమిస్తున్నాని చెప్పి, నాలుగేళ్ళుగా శారీరకంగా వాడుకొని వదిలేశాడని కాటారం మండలం గూడూరుకు చెందిన అయిత సృజన (27)లు అనే యువతి ఆరోపించింది. గురువారం సదరు యువకుడి ఇంటి ఎదుట దీక్షకు దిగింది. ఈ సందర్భంగా విలేఖరులతో సృజన మాట్లాడింది. తాను , సంతోష్ ఇద్దరం ఇష్టపడ్డామని , సంతోష్ తల్లిదండ్రులు అడ్డుకుంటున్నారని సృజన పేర్కొంది. తాను డిగ్రీ, ఎమ్మెస్సీ చదువుతున్న కరీంనగర్, వరంగల్ పట్టణాలలో పరిచయం ఏర్పడిందని, అది కాస్తా ప్రేమగా మారిందని సృజన వివరించింది. తాము ఇద్దరం రెడ్డి గాండ్ల కులానికి చెందిన వారమని , దూరపు బంధువులం కూడా అని సృజన పేర్కొంది. నాలుగేళ్ళుగా కొనసాగుతున్న తమ ప్రేమ వ్యవహారం వారింట్లో వారికి తెలిసిందని, సంతోష్ ఇంటి వారు అంగీకరించడం లేదని తెలిసి తామిద్దరం హన్మకొండలో అద్దెకు తీసుకున్న ఇంట్లో దండలు మార్చుకొని పెండ్లి చేసుకున్నామని సృజన తెలిపింది. అనంతరం ఆయన తల్లిదండ్రులు వచ్చి తమను మందలించారని విలపించింది. సంతోష్ కుటుంబ సభ్యులు తనను కల్లిబొల్లి మాటలు చెప్పి సంతోష్‌ను తన నుంచి తప్పించారని, జూన్ 30న పెండ్లి జరిపిస్తామని బాండ్ కాగితాలు రాసిచ్చారని సృజన గద్గద స్వరంతో విలేఖరులకు వివరించింది. అప్పటి నుంచి నేటి వరకు సంతోష్‌కు ఫోన్‌లో సంప్రదించడానికి ప్రయత్నించగా అందుబాటులో లేడని, మొబైల్ ఫోన్‌లను స్విచ్ఛ్ఫా చేశారని సృజన విలపించింది. నాలుగేళ్ళుగా తనను శారీరకంగా వాడుకొని, అజ్ఞాతంలోకి వెళ్ళిన సంతోష్‌ను చట్ట పరంగా చర్యలు చేపట్టి తనతో పెండ్లి జరిపించాలని సృజన డిమాండ్ చేసింది. సంతోష్ తండ్రి బొమ్మ మల్లారెడ్డి రాజకీయంగా ఉండడంతో తమకు పెళ్లి జరగడం లేదని ఆమె ఆరోపించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్‌గా, సింగిల్ విండో సొసైటీ చైర్మన్‌గా రాజకీయంగా ఉండి తన లాంటి పేదింటి బిడ్డకు అన్యాయం చేస్తున్నాడని సృజన ఆరోపించింది. మంథని శాసనసభ్యుడు పుట్ట మధూకర్ వద్దకు వెళ్ళి తన గోడు వెళ్ళబోసుకున్నానని, జయశంకర్ జిల్లా ఎస్పీ వద్దకు వెళ్ళినా తనకు న్యాయం జరగలేదని సృజన వివరించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో మహిళా సంఘాల మద్దతు కూడబలుక్కొని సంతోష్ ఇంటి ఎదుట గురువారం వౌన దీక్షకు దిగినట్లు సృజన పేర్కొంది. సృజన దీక్షకు ఎంఆర్‌పిఎస్ జిల్లా కార్యదర్శి గద్దల పద్మ, సోషల్ ఆక్షన్ కమిటీ సభ్యులు యొలుగం సుమతి తదితరులు పాల్గొన్నారు. సృజన వౌన దీక్షను పోలీసులు సందర్శించారు.

సాగునీటిని విడుదల చేయాలి
భీమదేవరపల్లి: ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలకు చెందిన రైతులకు ధర్మసాగర్ నీటిని విడుదుల చేసి రైతుల పంటపొలాలకు నీరందించేందుకు హుస్నాబాద్ ఎమ్మెల్యే వి.సతీష్‌కుమార్ చొరవ తీసుకోవాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కర్రె బిక్షపతి, భీమదేవరపల్లి మండల కార్యదర్శి ఆదరి శ్రీనివాస్ డిమాండ్ చేసారు.
ఈ మేరకు గురువారం భీమదేవరపల్లి తహశీల్దార్ కిరణ్‌ను కలిసి వినతిపత్రం అందించారు. దేవాదుల పరిధిలోని ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లి, కొప్పూర్, ముల్కనూర్, మాణిక్యాపూర్, ఎల్కతుర్తి మండలంలోని దామెర, గోపాల్‌పూర్, జగన్నాథపూర్, జీల్గుల గ్రామాలకు చెందిన రైతుల పంటపొలాలకు వెంటనే సాగునీటిని అందించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు.
రెండు మండలాలకు చెందిన రైతుల పంటపొలాలు ఎండిపోతున్నాయని, ఎమ్మెల్యే సతీష్‌కుమార్ వెంటనే జోక్యం చేసుకొని రైతుల పక్షాన నిలబడి దేవాదుల నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. తహశీల్దార్‌కు వినతిపత్రం అందించిన వారిలో కంచర్ల సదానందం, మార్పు సంజీవరెడ్డి, గొర్రె బాబు, కొదురుపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏమిటో చెప్పాలి?

ఆత్మకూర్: పరకాల నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధిలో ముందుందని గొప్పలు చెబుతున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జరిగిన అభివృద్ధి పైన జయశంకర్ స్వగ్రామమైన అక్కింపేటలో చర్చకు సిద్ధమా అని టిడిపి పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ గన్నోజు శ్రీనివాసచారి సవాల్ చేశారు. తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ స్వగ్రామంలో టిడిపి పార్టి ఆధ్వర్యంలో ఆయన పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జయశంకర్ విగ్రహానికి పూల మాలలు వేసిన అనంతరం శ్రీనివాసచారి, టిడిపి నాయకులు, కార్యకర్తలు గ్రామంలో పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శ్రీనివాసచారి మాట్లాడుతూ టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ జయశంకర్ స్వగ్రామం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. సిఎం కెసిఆర్ జయశంకర్ స్వగ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి టిడిపి నుండి గెలిచి టిఆర్‌ఎస్‌లోకి వెళ్ళి కమీషన్లు తీసుకొని క్షుద్ర పూజలు, మంత్రాలకు డబ్బులు వెచ్చిస్తున్నారని ఎద్దేవా చేశారు.
గత ఏడాది జయశంకర్ జయంతి సభలో అక్కింపేట అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరు చేసిన డిప్యుటీ సిఎం కడియం శ్రీహరి ఆ నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పార్ట్టీ పతనం అంచుల్లోకి వెళ్లిందని ఎమ్మెల్యే ధర్మారెడ్డికి నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారని అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహాత్మగాంధీ విగ్రహానికి గన్నోజు వినతి పత్రాన్ని అందజేశారు. వచ్చే నెల మొదటి వారంక్ల అక్కింపేట అభివృద్ధికి పూనుకోని పక్షంలో టిడిపి ఆధ్వర్యంలో దీక్షలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు ఇర్సడ్ల సదానందం, బుర్రి చేరాలు, గుమ్మడి శ్రీశైలం, దుబాసి అనిల్, పెరమాండ్ల సదానందం, సాంబరెడ్డి, కుమారస్వామి, సారంగం తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ కుటిల రాజకీయాలను మానుకోవాలి : గోనె
నర్సంపేట: రాష్ట్రంలో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న సుమారు 21వేల మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులను విద్యుత్ సంస్థలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఉత్తర్వులు జారీ చేస్తే జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుకు వెళ్లి కార్మికుల జీవితాల్లో వెలుగులను ఆర్పేందుకు కుటిల రాజకీయాలు చేస్తున్నారని టిఆర్‌ఎస్‌కెవి జిల్లా ఇన్‌చార్జి గోనె యువరాజు విమర్శించారు. నర్సంపేట పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో దడువాయి యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నాయిని నర్సయ్య అధ్యక్షతన కార్మికుల సమావేశం గురువారం జరిగింది. ఈసందర్భంగా గోనె యువరాజు మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా కాంట్రాక్టు కార్మికులను దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సాహసోపేతమైన నిర్ణయాలు చేస్తుంటే కోర్టులకు వెళ్లి అభివృద్ధిని అడ్డుకోవడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. ఇదే సమయంలో విద్యుత్ రంగంలో ఉన్న ఐఎన్‌టియూసి కార్మిక సంఘాన్ని కార్మికులంతా నిలదీయాల్సిందిగా పిలుపునిచ్చారు. యావత్ తెలంగాణ కార్మిక వర్గం కెసిఆర్ ప్రభుత్వానికి బాసటగా నిలిచి నైతిక మద్దతు తెలపాల్సిందిగా కోరారు. ఈకార్యక్రమంలో టిఆర్‌ఎస్‌కేవి నాయకులు పాలడుగుల రమేష్, కొల్లూరి లక్ష్మీనారాయణ, పెరుమాండ్ల బుచ్చిరాములు, ఎర్రబెల్లి రమేష్, వేల్పుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

మొక్కల సంరక్షణ బాధ్యత అందరిదీ

మల్హర్: హరితహారంలో మొక్కలు నాటి ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని జిల్లా కలెక్టర్ అకునూరి మురళి అన్నారు. గురువారం మండలంలోని రుద్రారం , ఎడ్లపల్లి అడవుల్లో అటవీ శాఖాధికారులతో కలిసి కలెక్టర్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మూడో విడత హారిత హారం కార్యక్రమంలో నాటిన మొక్కలను బాధ్యతయుతంగా కాపాడాలని , మానవాళి మనుగడకు కృషి చేయాలని కోరారు. మానవుడు తన అవసరాల కోసం అడవులను విచ్చలవిడిగా అడవులు నశించడం వల్ల వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1980 లో అడవుల సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చిందని, అడవుల శాతాన్ని పెంచడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు. అదే విధంగా రుద్రారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో విద్యా వ్యవస్థపై ఉపాధ్యాయుల పనితీరు అడిగి తెలుసుకున్నారు. 3వ తరగతి విద్యార్థులతో పుస్తకాలు చదివించి, విద్యా బోధనపై ఆరా తీశారు.
దామెరకుంటలోనున్న బిసి సంక్షేమ హస్టల్ ను రుద్రారం పాఠశాలకు అనుసంధానం చేసి, నిర్వహించాలని విద్యాధికారికి ఫోన్‌లో సూచించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖాధికారులు, తహశీల్దారు రాజవౌళి గౌడ్, సర్పంచ్‌లు వాల సంధ్యాయాదగిరిరావు, గొట్టం విజయ్‌కుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

డ్రగ్స్ మహమ్మారికి అలవాటు కావొద్దు

కాటారం: డ్రగ్స్ మహామ్మారికి అలవాటు కావద్దని, ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎక్సైజ్ శాఖ కాటారం సర్కిల్ ఇన్స్‌పెక్టర్ యం.ప్రశాంతి అన్నారు. కాటారం మండలం కొత్తపల్లిలో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్ధినీ, విద్యార్థులకు డ్రగ్స్ నివారణపై అవగాహన సమావేశం నిర్వహించారు. తెలంగాణలో ప్రస్తుతం డ్రగ్స్ మాఫియా వలలో చిక్కి సినిమా పరిశ్రమకు చెందినవారు బానిసలుగా మారారని, వారి జీవితాలతో డ్రగ్స్ ఆటలాడుకుంటుందని పేర్కొన్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడడం అనేది జరగకూడదని హితవు పలికారు. గుట్కా, అంబార్, పోగాకు ఉత్పత్తులకు అలవాటు పడినవారు ఏ విధంగానైతే తొందరగా విముక్తి కాలేరో, అంతకంటే పదింతలు ఎక్కువగా డ్రగ్స్‌కు అలవాటు అయినవారు విముక్తి కాలేరని , దాంతో వ్యక్తిగత జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారని, ఆదే విధంగా కుటుంబ జీవనానికి తీవ్ర ఆటంకం కలిగించినవారు అవుతారని, దాంతో సమాజానికి చీఢ పురుగుల్లాగా గోచరిస్తారని వివరించారు. మత్తు పదార్థాలకు ఆలవాటు కాకుండా చక్కని వాతావరణంలో పౌష్టికాహారం తీసుకోవాలని, కడుపు నిండా భోజనం చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. బలవర్దకమైన ఆహారం తీసుకోవడం వల్ల మానసికంగా బలంగా ఉంటారని పేర్కొన్నారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల తాత్కాలికంగా క్షణికమైన ఆవేశం, ఆనందం లభిస్తుందనుకొని కొంతమంది భావించి, తమ విలువైన జీవితాలను, వారితో పాటు వారిపైన ఆధారపడిన కుటుంబ సభ్యుల జీవిత కాలాన్ని తమ జీవితాలతో పెనువేసుకొని, తీవ్ర ఇబ్బందులను సృష్టించినవారవుతారని సోదాహారణంగా వివరించారు. డ్రగ్స్ తీసుకోవడం చట్టరీత్యా నేరమనే విషయాన్ని ప్రజలందరూ గమనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎక్సైజ్ ఎస్‌ఐ రాజేశ్వరి మాట్లాడుతూ సమ సమాజ నిర్మాణానికి విద్యార్థులు, యువత సన్మార్గంలో నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దేశ సంపదను సృష్టించే వయస్సు కలిగిన యువత చెడు వ్యసనాలకు అలవాటు కావద్దని పేర్కొన్నారు. దేశ ఉత్పాదక శక్తి సంపన్నులుగా ఎదగాలంటే నేటి విద్యార్థి యువతే రేపటి భావిభారత సమాజ మార్గనిర్ధేశకులుగా వర్థిల్లుతారని రాజేశ్వరి వివరించారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యులు రాధాక్రిష్ణ, ఎక్సైజ్ సిబ్బంది బలరాం, రాణా ప్రతాప్, వాసురాం, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సే నో డ్రగ్స్ పోస్టరును ఆవిష్కరించారు.

ప్రసాదంలో బల్లి

పాలకుర్తి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పులిహోర ప్రసాదంలో బల్లి రావడంతో గురువారం పాలకుర్తి మండలకేంద్రంలో కలకలం రేపింది. హరిహరులు కొలువైన సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి క్షీరగిరి క్షేత్రంపై శ్రీ సోమేశ్వరాలయం శివుడు సోమేశ్వరునిగా, మహావిష్ణువు లక్ష్మీనరసింహస్వామిగా స్వయంభూగా వేర్వేరు గుహల్లో కొలువై ఉండడంతో భక్తులు ఎంతో విశిష్టతతో కొలుస్తారు. ఇట్టి ఇలవేల్పుగా స్వాముల వార్లను కొలుస్తూ ధర్శనానికి వస్తారు. గురువారం మండలంలోని విస్నూరు గ్రామానికి చెందిన నేతి మధూకర్ సింగపూర్‌లో ఉద్యోగరీత్యా ఉంటున్న వారి కొడుకు- కోడలు వెంకటరమణ- శ్యామల, మనుమరాలు వర్ణిత దైవ దర్శనం చేసుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలోని ప్రసాదం కౌంటర్‌లో లడ్డూ, పులిహోరను కొనుగోలు చేశారు. పులిహోరను మనుమరాలు వర్ణితకు తినిపించగా అస్వస్థతకు గురికావడంతో తల్లిండ్రులు ప్రసాదాన్ని పరిశీలించగా పులిహోరలో బల్లి కనబడడంతో భయాందోళనకు గురై వెంటనే చిన్నారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. భక్తులు ప్రసాదాలకు ఎంతగానో విశ్వసనీయతనిస్తూ దైవానుగ్రహంగా భావిస్తారు.
అలాంటి ప్రసాదాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో రుచి లేకుండా ఇష్టారాజ్యంగా తయారుచేస్త్తూ భక్తులకు అంటగడుతున్న అధికారుల పర్యవేక్షణ లేకపోయంది. ప్రసాదాల తయారీదారుల నిర్లక్ష్యం, దేవాదాయ శాఖ అధికారుల అలసత్వంతో పులిహోరలో బల్లి ప్రత్యక్షం కావడం, చిన్నారి ప్రాణం మీదకు రావడంతో భక్తులు హరిహరా ఇదేం ప్రసాదమని విస్తుపోతున్నారు. శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఇటువంటి సంఘటనలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసినట్టయింది.

సామాజిక బాధ్యతతో నాటిన మొక్కలను సంరక్షించుకోవాలి

రఘునాథపల్లి: రాబోయె తరాలకు ప్రాణవాయువు అందించడానికి ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో మొక్కలు నాటి, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యతను చేపట్టాలని కలెక్టర్ శ్రీదేవసేన, ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్యలు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్ ఆవరణలో ఉత్తర విద్యుత్ పంపిణి సంస్థ ఆధ్వర్యంలో హరితహార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీదేవసేన, ఎమ్మెల్యే రాజయ్యలు మొక్కలు నాటారు. ఒక్కరోజు జిల్లాలోని విద్యుత్ సిబ్బంది 2వేల మొక్కలు నాటారు. అనంతరం జనగామ డీఇ రాంబాబు అధ్యక్షత జరిగిన సమావేశంలో కలెక్టర్ శ్రీదేవసేన, ఎమ్మెల్యే డా. రాజయ్యలు మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలు హరితహార కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అన్నారు. జిల్లాలోని కొన్ని మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయని వారన్నారు. జనగామ జిల్లాలో 86లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించామని ఇప్పటికి 45లక్షల మొక్కలు నాటామని అలాగే 1.50కోట్ల సీడ్ బాల్స్‌ను కొండల్లో, గట్లల్లో విసిరామాని తెలిపారు. ప్రతి సోమవారం మొక్కలకు నీరు పోసేందుకు కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. జిల్లాను హరితవనంగా తీర్చిదిద్దేందుకు అందరు సహకరించాలని వారు కోరారు. అంతకు ముందు కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా హరితహార పుస్తకం, హరిత కంకనాలను ఆవిష్కరింపచేసి, హరితహారంపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ శ్రీదేవసేన ట్రాన్స్‌కో మహిళా ఉద్యోగులతో హరిత బతుకమ్మ ఆడారు. అదేవిధంగా ఎమ్మెల్యే రాజయ్య మండల కేంద్రంలో మోటర్ సైకిల్‌పై హరితర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జోన్ సీఇ సంపత్‌కుమార్, జనగామ ఎస్‌సి మల్లికార్జుణ్, డీఇలు అర్జున్‌కుమార్. సత్యనారాయణ, ఏఇలు శంకరయ్య, రవికుమార్, సురేష్, కనకయ్య, తారాచంద్, జెడ్పీటీసి బానోతు శారద, ఎంపిపి దాసరి అనిత, వైస్ ఎంపిపి మల్కపురం లక్ష్మయ్య, మండలపార్టీ అధ్యక్షుడు పొకల శివకుమార్, మండల చీఫ్ రాంబాబు, ఐఎన్ టియుసి జిల్లా అధ్యక్షుడు నీలం ఐలేశ్, నాయకులు నరేందర్‌రెడ్డి, సాంబయ్య, బాలు పాల్గొన్నారు.
327యూనియన్ జెండా ఆవిష్కరణ
మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా విద్యుత్ సిబ్బంది మొక్కలు నాటారు. అనంతరం 327, ఐఎన్‌టియు యూనియన్ జెండాను ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నీలం ఐలేశ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారంలో నాటిన మొక్కలను కాపాడాలని ఆయన సిబ్బందిని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు వీరాంజనేయులు, అధ్యక్షులు నరేందర్‌రెడ్డి, నాయకులు ఎడ్ల రాజేందర్, సాంబయ్య, బాలు, రాంబాబులు పాల్గొన్నారు.

జనగామ ఆర్‌డివోతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు
జనగామ టౌన్: భూ వివాదంలో జోక్యం చేసుకోని విధుల దుర్వినియోగానికి పాల్పడి అన్యాయం చేశారని ఓ బ్హాఒతురాలు కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆదేశం మెరకు జనగామ ఆర్‌డివో వెంకట్‌రెడ్డితో పాటు మరో నలుగురిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు జనగామ సిఐ ముసికె శ్రీనివాస్ గురువారం రాత్రి తెలిపారు. జనగామ మండలం యశ్వంతపురం గ్రామంలో మాజీ సైనికులకు ఇచ్చిన భూమిపై ఏర్పడిన సమస్యపై కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని బ్హాఒతురాలు గడ్డం కవిత గత కొన్ని రోజుల క్రిందట కోర్టును ఆశ్రయించింది. కోర్టు కేసులో ఉన్న భూమికి సంబందించిన భూమిలో కొంత భాగం జాతీయ రహదారి సంస్థ స్వాధీనం చేసుకోగా వచ్చిన డబ్బును ఆర్‌డివో వెంకట్‌రెడ్డి అవినీతికి పాల్పడి తోటి కక్షిదారునికి అందేవిధంగా సహకరించాడని బాధితురాలు కోర్టుకు వెళ్లింది. ఈ నేపధ్యంలో జనగామ సబ్‌కోర్టు ఆర్‌డివో వెంకట్‌రెడ్డితో పాటు అప్పటి తహశీల్దార్ చెన్నయ్య, విఆర్‌వో నర్సమ్మ, కక్షిదారులు పులిస్వామి, పులి విజయలపై 120బి 467, 420, 424, 405, 406, 409సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయాలని కోర్టు ఇచ్చిన ఆదేశం మేరకు వారిపై విధుల దుర్వినియోగం, చీటింగ్‌కేసులు నమోదయ్యాయని సిఐ శ్రీనివాస్ తెలిపారు.

విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు

వడ్డేపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల బహుజనుల విద్యాభివృద్దిని అడ్డుకోవడానికి కుట్ర చేస్తూ, విద్యారంగాన్ని నాశనం చేస్తున్నాయని శాతవాహన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సురేపల్లి సుజాత అన్నారు. హన్మకొండ నేరెళ్ల వేణుమాధవ్ ప్రాంగణంలో తెలంగాణ స్టూడెండ్ ఫెడరేషన్ అధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన సుజాత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు లేరనే సాకుతో 5000 పాఠశాలలను మూసివేస్తోందని విమర్శించారు. ఇంటర్, డిగ్రీ, పిజి వరకు కాంట్రాక్టు, పార్టుటైం ఉపాద్యాయులతో నడిపిస్తున్నారని, శాశ్వత ఉద్యోగులను నింపడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని అన్నారు. బహుజన రచయితల సంఘం జాతీయ సమన్వయకర్త డాక్టర్ జిలుకర్ర శ్రీనివాస్ మాట్లాడుతూ మహాత్యా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, సావిత్రబాయి పూలేలు పోరాడి బహుజనుల కోసం చదువుకునే హక్కును సాధించారని, ఆ హక్కును కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కాలరాయాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఎసి నాయకుడు నళిగంటి శరత్ మాట్లాడుతూ ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని, అలాంటి విద్యార్థులను అణచివేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతుందని అన్నారు.
ఆంధ్ర సంపన్న వర్గాలనే ఎదుర్కొన్న విశ్వవిద్యాలయ విద్యార్థులకు కెసిఆర్ ఎదుర్కొనడం పెద్ద సమస్యేమీ కాదని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యార్థి సంఘాలపై అమలు చేస్తున్న అప్రకటిత నిషేధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిర్ర రాజ్‌కుమార్, సునీల్, త్రిశూల్, శ్రావణ్, చంద్రకాంత్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

మొరం తరలింపుపై ఉద్రిక్తత
పరకాల: నాగారం ప్రజలు ఓట్లు వేయలేదా... చెరువు మొరంను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హుజూరాబాద్ నాలుగు లైన్‌ల రోడ్డుకు ఎలా తరలిస్తారూ అంటూ గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించగా చెరువువద్దకు తరలి వచ్చిన టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు రాజకీయాలు మీరే చేస్తున్నారని చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. ఒక దశలో కాంగ్రెస్ వర్సస్ టిఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వివాదం జరిగి తోపులాటకు దారి తీయడంతో చెరువు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఉన్న ఎస్సై అభినవ్ వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ఇరు వర్గాలను అక్కడి నుండి పంపించారు. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పరకాల మండలం నాగారం గుండికుంట చెరువు మొరాన్ని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తాను కాంట్రాక్ట్ చేస్తున్న నాలుగు లైన్ల హుజురాబాద్ రోడ్డుకు గత నాలుగు రోజుల నుండి మొరాన్ని అక్రమంగా తరలిస్తున్నారని చెప్పారు. చెరువులో ఇష్టరాజ్యంగా మొరం తీయడంతో చెరువు రూపు రేఖలు మారినాయని, తూం వద్దకు నీళ్లు ఎలా వస్తాయని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే చెరువులో రెండు ఎద్దులు, మనుషులు చనిపోయారని పేర్కొంటూ వారు ఆందోళన నిర్వహించారు. అయితే అధికారుల అనుమతి ఉందని పేర్కొంటూ మొరంను చెరువు నుండి హుజూరాబాద్ రోడ్డుకు తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న పరకాల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఇనగాల వెంకట్రాంరెడ్డి గ్రామస్తులతో కలిసి చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువులో దారుణంగా 16 ఫీట్లతో మొరం తీయడంతో పెద్ద గొయ్యిగా మారిందని వారు ఇనగాలకు చూపించారు. దీంతో అయన తహశీల్దార్‌ను అడిగితే రెవెన్యూ అనుమతి లేదని చెప్పగా నీటిపారుదల శాఖ ఇఇ కూడా అనుమతి లేదని చెప్పారు. దీంతో మొరం తరలిస్తున్న వారిని పరిమిషన్ లేకుండా గత నాలుగు రోజుల నుండి మొరంను ఎలా తరలిస్తున్నారని ఇనగాల ప్రశ్నించారు. తమకు ఉన్నతాధికారుల అనుమతి ఉందంటూ పేర్కొన్నారు. అందులో గురువారం తేదీ ఉండడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి నాలుగు రోజుల నుండి ఎలా మొరంను హుజురాబాద్‌కు తరలిస్తున్నారని ప్రశ్నించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతానని చెప్పుతూ అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్నారు.
కాంగ్రెస్ వర్సెస్ టిఆర్‌ఎస్...
చెరువు పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుక వెళతానని చెబుతూ అక్కడ నుండి పరకాల కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ ఇనగాల వెంకట్రాంరెడ్డి వెళుతుండగా టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు చెరువు వద్దకు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో కాంగ్రెస్ నేతలు, గ్రామస్తులు వారు రావడంతో ఇది ఊరు సమస్య పరకాల నుండి, వేరే గ్రామాల నుండి అధికార పార్టీ నాయకులు రావడం ఏమిటని ప్రశ్నించారు. నాగారం ఊరు కాదా మేము ఎమ్మెల్యేకు ఓట్లు వేయలేదా అని ప్రశ్నించారు. తమ గ్రామానికి మొరం అవసరం ఉన్న పోలీసులతో కేసులు బనాయించారని ఇప్పుడు మీరు వచ్చి రాజకీయం చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో టిఆర్‌ఎస్ నేతలు రాజకీయాలు చేస్తుంది మీరేనంటూ పేర్కొనడంతో టిఆర్‌ఎస్ వర్సస్ కాంగ్రెస్ నాయకులు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒక దశలో తోపులాట జరిగడంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది. అయితే అక్కడ పరిస్థితి ఉద్రిక్తతగా ఉందని ఎస్సై అభినవ్ సమాచారం మేరకు ఎస్సైలు శ్రీకాంత్‌రెడ్డి, సుధాకర్‌లు వచ్చారు. పోలీసు సిబ్బంది తక్కువ ఉండడంతో ఇరు వర్గాలను అదుపు చేయడానికి వారు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఉద్రిక్తత కొనసాగుతుండగా సిఐ జానీ నర్సింహులు సంఘటనా స్థలానికి తరలి వచ్చారు.
పరకాల సిఐ జానీ నర్సింహులు సంఘటన స్థలానికి తరలి వచ్చి ఇరు వర్గాలతో మాట్లాడారు. అయితే కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ ఇనగాల వెంకట్రాంరెడ్డి మొరం తరలింపుకు తహశీల్దార్ పరిమిషన్ లేదని ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో సిఐ జానీ నర్సింహులు అందరి సమక్షంలో తహశీల్దార్‌కు ఫోన్ చేసి స్పీకర్ అన్ చేయగా తహశీల్దార్ తమకు తెలియదని, పర్మిషన్ లేదని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వాట్సప్‌లో పరిమిషన్ లెటర్ రావడంతో కాంగ్రెస్ నేతలు అవాక్కు అయ్యారు. లక్ష రూపాయల చలాన్ కట్టడంతో తాము పర్మిషన్ ఇచ్చినట్లు అందులో పేర్కొనడంతో మార్కింగ్ లేకుండా మిషన్ కాకతీయలో టెండర్ అయిన చెరువుకు ఎలా పరిమిషన్ ఇస్తారని ఇనగాల ప్రశ్నించారు. లారీలు అక్కడ నుండి పంపిస్తేనే వెళతామని చెప్పగా సిఐ ససేమిరా అన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనకు సిద్ధం కాగా ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని ఎస్సై అభినవ్ చెప్పడంతో ఇనగాల ఆదేశాల మేరకు రాతపూర్వకంగా వార్డు సభ్యులు ఫిర్యాదు చేశారు.
నర్సంపేటలో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి

నర్సంపేట: నర్సంపేట పట్టణంలో వరంగల్ రూరల్ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి డాక్టర్ కత్తి వెంకటస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. ఈసందర్భంగా డాక్టర్ కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ కేంద్రంగా విరాజిల్లుతున్న నర్సంపేట పట్టణం జిల్లా కేంద్రానికి కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయని చెప్పారు. రూరల్ జిల్లా కేంద్రాన్ని మొగిళిచర్లలో ఏర్పాటు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. రూరల్ జిల్లా కేంద్రం ఏర్పాటు విషయంలో ప్రభుత్వానికే స్పష్టత లేకుండా పోయిందని విమర్శించారు. నర్సంపేటలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్పలంగా లభించే అవకాశం ఉందని, తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. వర్ధన్నపేట, పరకాల పట్టణాలను అర్భన్ జిల్లాల్లో కలిపి ఆ ప్రాంత ప్రజల మనోభావాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇలా కాకుండా ప్రభుత్వం మొండిగా పోతే ప్రజలను సమీకరించి ఉద్యమిస్తామని హెచ్చరించారు.