అక్షర

అప్పటి కథల తీపి వగరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1974వ సం.లో తాళ్లూరి నాగేశ్వరరావు, హితశ్రీ సంపాదకత్వంలో విశాలాంధ్ర వారు వెలువరించిన కథా సంకలనం పునర్ముద్రణ ప్రతి ఇది. ‘కొద్ది మార్పులు, చేర్పులు’ జరిపినట్లు వివరణ ఇచ్చారు ఇప్పటి సంపాదకులు. అయినా దీనిని ‘శత వసంతాల’ ప్రాతినిధ్య ‘తెలుగు కథ’ల సంకలనంగా భావించలేము.
తెలుగు కథకి అప్పటివరకూ ఇంపుసొంపులు కూర్చిన 53 మంది ప్రసిద్ధ రచయితల కథలు ఇందులో ఉన్నాయి. గురజాడ వారి ‘దిద్దుబాటు’తో మొదలై, పంతుల శ్రీరామశాస్ర్తీ గారి ‘కిల్లీ దుకాణం’తో ముగిసిందీ సంకలనం. మధ్యలో మొదటి బహుమానము (చింతా దీక్షితులు), కలుపుమొక్కలు (శ్రీపాద), ఓ పువ్వు పూసింది (చలం), టార్చిలైటు (కరుణకుమార), వెండి కంచం (మునిమాణిక్యం), రంగవల్లి (మల్లాది రామకృష్ణ శాస్ర్తీ), నువ్వులూ - తెలకపిండీ (కొడవటిగంటి కుటుంబరావు), చరమరాత్రి (శ్రీశ్రీ), ధర్మవడ్డీ (గోపీచంద్), కరణం కనకయ్య వీలునామా (పాలగుమ్మి పద్మరాజు), బల్లకట్టు పాపయ్య (మా.గోఖలే), నవ్వు (తిలక్), వర్షం (రావిశాస్ర్తీ) వంటి ప్రాచుర్యం పొందిన, ప్రసిద్ధి వహించిన కథలు ఉన్నాయి.
ఇంకా, తెలుగులో చిన్న కథకి అసలు సిసలైన నమూనాగా చూపదగిన - వెధవ డబ్బు (పాలంకి వెంకట రామచంద్రమూర్తి), ఆత్మీయత (అందే నారాయణ స్వామి), జ్యేష్ఠుడు (వియస్.అవధాని), బళ్ళోకి వెళ్లాలి (జమదగ్ని), జీవిక (వేలూరి సహజానంద), తొగరు చెట్టు (అంగర వెంకట కృష్ణారావు) వంటి కథలు ఉన్నాయి. చక్రపాణి గల్పిక ‘అహం బ్రహ్మాస్మి’ కూడా ఎన్నికగొన్నది. ఇవన్నీ నిక్కంగా ఈ సంకలనం ఔన్నత్యాన్ని ఇనుమడింప జేస్తున్న కథలు. వీటన్నిటా వస్తు కేంద్రీకరణం, నిర్మాణ సౌష్టవం, శైలీ శిల్ప సాంద్రత వంటి కథానికాగుణ విశేషాలు మెండుగా ఉన్నాయి. బుచ్చిబాబు మనస్తాత్విక కథ ‘కాగితం ముక్కలు - గాజు పెంకులు’ని ఇందులో చేర్చి సాహిత్య విజ్ఞత కల కథాప్రియులకు మంచి విందునందించారు సంపాదకులు.
కథానికల ఎంపికలో సంపాదకులు నిర్ణయించుకున్న ప్రమాణాల్నీ, వారు ఇచ్చిన ఇతర వివరాల్నీ దృష్టిలో ఉంచుకొని చూసినప్పుడు - కవికొండల ‘కంఠధ్వని’, తూలికా భూషణ్ ‘మెరీనా తీరే’, మొక్కపాటి వారి ‘మా బావమరిది పెళ్లి’, నార్లవారి కథానిక ‘సభ్యత’ వంటి మామూలు రచనలు ఈ సంకలనంలో చోటు చేసుకోదగినవి కావనిపిస్తుంది.
ప్రచురణకర్తలు ఎంతో ప్రతిష్ఠాత్మక భావనతో పునర్ముద్రించి, ‘శత వసంతాల తెలుగు కథ’గా అభివర్ణించిన ఈ సంకలనంలో - 1974కి ముందే తెలుగు కథానికా ప్రస్థానానికి దారిదీపాలనదగిన కథలు రాసిన చాసో, కారా, కెసభా, బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు, మునిపల్లె రాజు, కొలకలూరి ఇనాక్, మధురాంతకం రాజారాం, వాసిరెడ్డి సీతాదేవి, కె.రామలక్ష్మి వంటి ప్రముఖులకు స్థానం లేకపోవటం కథాప్రియులకు ఆశాభంగమే! ‘అర్హత ఉన్న కొన్ని కథలకు స్థలాభావం రీత్యా అవకాశం కల్పించలేనందుకు విచారపడవలసి వచ్చింది’ అన్న సంపాదకుల వాక్యంతో ఆ లోటు తీరేది కాదు! ఒకప్పటి తెలుగు సమాజం స్థితిగతుల్నీ, మారిన, మారకుండా మిగిలిన మనుషుల చిత్తవృత్తుల్నీ, ప్రవర్తననీ ఆకళింపు చేసుకోవటానికి ఈ కథల్లోని వస్తు విస్తృతి తోడ్పడుతుంది. సామాజిక పరిణామాల్ని అర్థం చేసుకోవటానికీ దోహదం చేస్తుంది. మంచి కథల్ని ప్రేమించేవారంతా చదివి ఆనందించవచ్చు.

శతవసంతాల
తెలుగు కథ
కథా సంకలనం
ప్రతులకు:అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో

-విహారి