ఆటాపోటీ

పాడి, అథ్లెటిక్స్ చెట్టపట్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడి పరిశ్రమ, అథ్లెటిక్స్ చెట్టపట్టాలేసుకొని నడవడాన్ని మనం ఊహించలేం. కానీ, కెన్యాలో ఇది ఆచరణలో ఉంది. మారథాన్ పరుగు అంటే ముందుగా గుర్తుకొచ్చే దేశం కెన్యా. ఇది అందరికీ తెలుసు. ఎంతోమంది ప్రపంచ మేటి లాంగ్ డిస్టెన్స్ రన్నర్లను క్రీడా ప్రపంచానికి అందించిన ఘనత ఆ దేశానిదే. అక్కడి అథ్లెట్లు కెరీర్‌కు ఎంత ప్రాధాన్యతనిస్తారో సంప్రదాయ వృత్తుల పట్ల అంతకంటే ఎక్కువ శ్రద్ధ పెడతారు. ప్రపంచ వ్యాప్తంగా పాడి పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో కెన్యా ఒకటి. ఆ దేశంలో ప్రజలకు పశువుల పెంపకం కేవలం వ్యాపారం మాదిరిగా కాకుండా సంప్రదాయంగా కూడా కొనసాగుతున్నది. ఎంతో మంది పేరుమోసిన రన్నర్లు ఈ సంప్రదాయానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతర్జాతీయ పోటీల్లో నిత్యం పాల్గొనే కెన్యా అథ్లెట్లు తాము సంపాదించిన మొత్తంలో ఎక్కువ శాతాన్ని పాడి పశువుల కొనుగోలుకే ఖర్చుపెడుతున్నారంటే, ఈ పరిశ్రమపై వారికి ఉన్న ప్రేమ ఎలాంటిదో ఊహించుకోచ్చు. ప్రపంచ మారథాన్ చాంపియన్ గెఫ్రీ కిస్పాంగ్ కంవొరొర్, లండన్ మారథాన్ విజేత స్టాన్లీ బివోట్ వంటి ఎంతోమంది ప్రపంచ మేటి అథ్లెట్లు పాడి పరిశ్రమను ప్రవృత్తిగా కొనసాగిస్తున్నారు. ప్రొఫెషనల్ రన్నర్స్‌గా తీరిక లేకుండా ఉన్నప్పటికీ, దొరికే కొద్ది సమయాన్ని గేదెలు, ఆవుల సంరక్షణకు వినియోగిస్తున్నారు. నిజానికి పాడి పరిశ్రమ తమకు వ్యాపారం కాదని, అది తమ సంప్రదాయంలో భాగమని కెన్యా అథ్లెట్లు అంటారు. కనీసం రెండు మూడు పాడి గేదెలు లేని రన్నర్ కెన్యాలో లేడనడం ఆశ్చర్యం కలిగించే నిజం. కుటుంబ పోషణకు కూడా వారు అథ్లెటిక్స్‌ను కాకుండా పాడి పరిశ్రమపైనే ఆధారపడతారు. కెన్యాలో ఎక్కడ చూసినా పెద్ద కుటుంబాలే కనిపిస్తాయ. మత విశ్వాసాలను అనుసరించి ఎక్కువమంది కుటుంబ నియంత్రణకు దూరంగా ఉంటారు. దీనితో, తమకు లభించే ప్రైజ్‌మనీలతో పదుల సంఖ్యలో ఉన్న కుటుంబీకులను పోషించడం అథ్లెట్లకు సాధ్యం కాదు. అందుకే వారంతా ఒకవైపు సంప్రదాయాన్ని కాపాడుకుంటూనే మరోవైపు కుటుంబాలకు అవసరమైన డబ్బును సంపాదించుకుంటున్నారు. ఇంకెక్కడైనా, అథ్లెట్లు ప్రైజ్‌మనీని విందులు, విలాసాలకు ఖర్చు చేస్తుంటారు. కానీ కెన్యా అథ్లెట్లు మాత్రం తమకు లభించే మొత్తాలను ఉపాధి కల్పనకు వచ్చిస్తూ ప్రపంచ క్రీడాకారులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. ఎంత కష్టపడితే ఫలితం అంతగా రాణించవచ్చనేది వారు అనుసరిస్తున్న మూలసూత్రం. అందుకే, అంతర్జాతీయ వేదికలపై అద్భుతాలు సృష్టించగలుగుతున్నారు. సంప్రదాయాలను గౌరవిస్తూ, అథ్లెటిక్స్‌లోనేగాక వ్యక్తిగత జీవితంలోనూ అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పుతున్నారు. మొత్తానికి పాడి, అథ్లెటిక్స్ కలసి మెలసి ముందుకు సాగడం కెన్యాలో తప్ప ప్రపంచంలో మరెక్కడా చూడలేం. అందుకే, కెన్యాను, అక్కడి అథ్లెట్లను ఎంత పొగిడినా తక్కువే.