ఆటాపోటీ

ఖరీదైన బదిలీలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బదిలీ అంటే అదే సంస్థలో పని చేస్తూ, ఒక చోటి నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం అన్నదే అందరికీ తెలిసిన అర్థం. కానీ, ఫుట్‌బాల్‌లో బదిలీ లేదా ట్రాన్స్‌ఫర్‌కు మరో అర్థం ఉంది. ఇక్కడ ఆటగాళ్లను కొనుగోలు చేసిన ఒక జట్టు మరో జట్టుకు వారిని అమ్మడాన్ని బదిలీగా పేర్కొంటారు. చాలామంది ఆటగాళ్లను వారివారి కెరీర్ ఆరంభంలో తక్కువ మొత్తానికే ఫ్రాంచైజీలు కొనేస్తాయి. తాము ఒప్పందం కుదుర్చుకున్న ఆటగాళ్లలో ఎవరైనా అంతర్జాతీయ పోటీల్లో అద్భుతంగా ఆడితే, వెంటనే వారిని ‘ట్రాన్స్‌ఫర్’ పేరుతో అమ్మకానికి పెట్టేస్తారు. బార్సిలోనాకు ప్రాతినిథ్యం వహించిన బ్రెజిల్ మెగాస్టార్ నేమార్ జూనియర్ గతంలో ఎన్నడూ లేనంత భారీగా 264 మిలియన్ డాలర్లు (సుమారు 1,680 కోట్ల రూపాయలు) చెల్లించి పారిస్ సెయింట్ జర్మెయిన్ (పిఎస్‌జి) జట్టు కొనేసింది. సామాన్యుడి ఊహకు కూడా అందనంత మొత్తం ఇది. ట్రాన్స్‌ఫర్ ధరలు వందల కోట్లను మించి, వేల కోట్లకు చేరడం మారుతున్న విధానాలకు, ఆటగాళ్లకు దక్కుతున్న స్టార్‌డమ్ ఇమేజ్‌కి అద్దం పడుతున్నది. రగ్బీ, అమెరికాలో ఎన్‌ఎఫ్‌సి బాస్కెట్‌బాల్ వంటి కొన్ని క్రీడల్లో ట్రాన్స్‌ఫర్స్ ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ట్రాన్స్‌ఫర్ అంశాన్ని ప్రవేశపెట్టినా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. మిగతా క్రీడల్లో అసలు బదిలీ విధానమే లేదు. సాకర్‌లో మాత్రం కొన్ని దశాబ్దాలుగా బదిలీ పేరుతో ఆటగాళ్ల అమ్మకాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అయితే, నేమార్‌ను పిఎస్‌జి కొనుక్కోవడం సాకర్ ప్రపంచంలో ప్రకంపనాలు సృష్టిస్తున్నది. గత ఏడాది పాల్ పొగ్బాను మాంచెస్టర్ యునైటెడ్ జట్టు 116 మిలియన్ డాలర్లు చెల్లించింది. అప్పట్లో అదే అత్యంత ఖరీదైన ట్రాన్స్‌ఫర్‌గా రికార్డు సృష్టించింది. నేమార్ తాజా ఒప్పందం ఆ రికార్డుకు రెట్టింపు మొత్తం కావడం విశేషం. అతనికి పిఎస్‌జి ఇంత భారీ మొత్తాన్ని చెల్లించడానికి కారణం లేకపోలేదు. ఆ జట్టు ఇప్పటి వరకూ ఒక్క యూరోపియన్ కప్‌ను కూడా గెల్చుకోలేదు. ఫిఫా క్లబ్ ప్రపంచ కప్‌లో నాకౌట్ దశ దరి దాపుల్లోకి వెళ్లలేకపోయింది. మరోవైపు బార్సిలోనాకు నేమార్ అత్యంత విలువైన సేవలు అందించాడు. లియోనెల్ మెస్సీ, లూయిస్ సౌరెజ్‌తో కలిసి అతను బార్సిలోనాను తిరుగులేని విజయాలను సాధించిపెట్టాడు. ఈ ముగ్గురినీ ఎంఎస్‌ఎన్ (మెస్సీ, సౌరెజ్, నేమార్) అని పిలుస్తారు. ఇప్పుడు ఈ సాకర్‌త్రయం నుంచి నేమార్ బయటకు వచ్చేశాడు. బార్సిలోనాలో చాలామంది స్టార్లు ఉన్నందున, నేమార్ లేని లోటు పెద్దగా కనిపించకపోవచ్చు. కానీ, క్లబ్ సాకర్‌లో ఇంతవరకూ ఎలాంటి గుర్తింపును సంపాదించుకోలేకపోయిన పిఎస్‌జికి మాత్రం నేమార్ రాక కొత్త ఊతాన్నివ్వడం ఖాయం. జట్టులోని మిగతా ఆటగాళ్లకు అతను స్ఫూర్తిదాయకంగా నిలుస్తాడని, జట్టు ప్రమాణాలను అమితంగా పెంచుతాడని పిఎస్‌జి చైర్మన్ నెసర్ అల్ ఖలాఫీతోపాటు, జట్టులోని సహచరులు, సపోర్టింగ్ స్ట్ఫా నమ్ముతున్నారు. వారి అంచనాలకు మేరకు రాణించే సత్తా నేమార్‌కు ఉంది.
ఇదే మొదలుకాదు..
సాకర్‌లో భారీ మొత్తాలకు ట్రాన్స్‌ఫర్స్ జరగడం ఇదే మొదటిసారి కాదు. ఒక సీజన్‌కు కనీసం 20 మిలియన్ డాలర్లకంటే ఎక్కువ ధరకే అమ్ముడైన వారు చాలామంది ఉన్నారు. అల్వరో మొరాటాను చెల్సియా ఫుట్‌బాల్ క్లబ్‌కు రియల్ మాడ్రిడ్ 76.2 మిలియన్ డాలర్లకు అమ్మేసింది. రొమెలూ లుకాకాను ఎవర్టన్ నుంచి మాంచెస్టర్ యునైటెడ్ 96.4 మిలియన్ డాలర్లకు ఖరీదు చేసింది. బెంజిమిన్ మెన్డీ మొనాకో నుంచి మాంచెస్టర్ సిటీకి వెళ్లినప్పుడు 68.3 మిలియన్ డాలర్ల ధర పలికాడు. ఆండ్రియా కొన్టీని అట్లాంటా నుంచి మిలన్ 46.2 మిలియన్లు వెచ్చించి కొనింది. లియోనార్డో బొనూసీ (జువెంటాస్)ని 46.2 మిలియన్ డాలర్లకు మిలన్, మిలాన్ స్నినియర్ (సాండోరియా)ను 37.3 మిలియన్ డాలర్లకు ఇంటర్ మిలన్, అలెగ్జాండర్ లాకజెట్ (లియాన్)ను 59.1 మిలియన్ డాలర్లకు ఆర్సెనెల్, థియో హెర్నాండెజ్‌ను 29.2 మిలియన్ డాలర్లకు రియల్ మాడ్రిడ్ కొన్నాయి. ఇలా చెప్తూ పోతే, జాబితా చాంతాడంత అవుతుంది. సాకర్‌లో అమ్మకాలు, కొనుగోళ్ల జోరు కొనసాగుతునే ఉంది.
ఇంగ్లాండ్‌లో మొదలు
ఫుట్‌బాల్‌లో ట్రాన్స్‌ఫర్ విధానం మొదట ఇంగ్లాండ్‌లో మొదలైంది. సాకర్, క్రికెట్, బాస్కెట్‌బాల్ తదితర క్రీడల్లో ఆటగాళ్ల వేలం ఇంగ్లాండ్‌లోనే ఆరంభమై, ఆతర్వాత మిగతా దేశాలకు, ఇతర క్రీడలకు వ్యాపించింది. 1890 దశం ప్రారంభంలో బదిలీ ప్రక్రియకు అంకురార్పణ జరిగింది. అంతకు ముందు సుమారు వందేళ్లుగా అనుసరిస్తూ వస్తున్న విధానాలకు ఇంగ్లాండ్ చరమగీతం పాడింది. మొదట్లో ఒక క్లబ్‌తో కాంట్రాక్టు కుదుర్చుకున్న ఆటగాడు తన యజమాని నుంచి ఆమోదం లభిస్తేగానీ మరో క్లబ్‌కు వెళ్లడానికి వీలుండేది కాదు. సదరు క్లబ్‌తో కాంట్రాక్టు ముగిసినా, ఆ క్లబ్ తరఫున ఆ క్రీడాకారుడు ఆడకపోయినా, ఈ ఆమోదం తప్పనిసరి. అయితే, క్రమంగా ఈ తీరు మారింది. కాంట్రాక్టు కాలం పూర్తయిన వెంటనే ఆటగాడికి స్వేచ్ఛ లభిస్తున్నది. అతను అదే క్లబ్‌లో కాంట్రాక్టును పొడిగించుకోవచ్చు లేదా మరో క్లబ్‌కు వెళ్లవచ్చు. అయితే, ఒప్పందం అమల్లో ఉన్న సమయంలో మాత్రం, ఎట్టి పరిస్థితుల్లోనూ తన సొంత నిర్ణయాలు లేదా ఇష్టాయిష్టాల ప్రకారం నడచుకునే అవకాశం ఉండదు. 1995లో జీన్ మార్క్ బోస్మన్ కేసులో యూరోపియన్ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కాంట్రాక్టు ముగిసినా లేదా ముగింపు దశకు చేరుకున్నప్పుడు ఆటగాళ్లు తమకు నచ్చిన క్లబ్‌కు వెళ్లవచ్చని కోర్టు స్పష్టం చేసింది. బోస్మన్ కేసు ఆటగాళ్లకు కొంత ఊరటనిచ్చినప్పటికీ, నష్టపరిహారం కింద ఒప్పందం కొనసాగుతున్న లేదా ముగియనున్న క్లబ్‌కు ఎంతోకొంత మొత్తాన్ని చెల్లించాల్సిందేనని కోర్టు ఆదేశాలున్నాయి. ఈ తీర్పును ఆటగాళ్లు ఎంతవరకూ వినియోగించుకుంటున్నారో చెప్పలేంగానీ, క్లబ్‌లు మాత్రం తమకు అనుకూలంగా మార్చేసుకున్నాయి. నష్టపరిహారం పేరుతో మిలియన్ల డాలర్లు వసూలు చేస్తున్నాయి. ఒకప్పుడు బానిసలు అమ్మడం కొనడం జరిగేదని చరిత్రలో చదువుకుంటే, ఆ విధానం ఫుట్‌బాల్‌లో ఇప్పటికీ కొనసాగుతునే ఉంది. బదిలీ పేరుతో జరుగుతున్న అమ్మకాలను ఎంతో ఘనంగా చెప్పుకోవడం, భారీ మొత్తాలను చూసి గర్వపడడం విచిత్రం. ఆటగాళ్లను అంగడి వస్తువుగా మార్చేస్తున్న ఈ ట్రాన్స్‌ఫర్ విధానానికి ఎప్పటికి తెరపడుతుందో ఏమో!
చిత్రం.. భారీ ట్రాన్స్‌ఫర్ ఫీజు పొందిన బ్రెజిల్ సాకర్ స్టార్ నేమార్ జూనియర్

- బిఎల్