సాహితి

వ్యథార్థ జీవిత కవిత్వం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలనేత పుస్తకంతో 1999లో కవిత్వ యాత్ర ప్రారంభించి మాట్లాడుకోవాలి (2007), నాన్న చెట్టు (2010), పూలందోయ్ పూలు (2014), ఇపుడు చేనుగట్టుపియానో (2016)తో ప్రముఖ కవిగా ఎదిగిన బి.ప్రసాదమూర్తి కవిత్వాన్ని చదువుతుంటే ఎందుకో తిలక్ అమృతం కురిసిన రాత్రి గుర్తొచ్చింది. సామాజికాభ్యుదయంలో గానీ, అద్భుత కవితాశక్తిలోగానీ ప్రసాదమూర్తి కవిత్వం తిలక్ కవిత్వానికి దగ్గరగా వుంది. అంతేకాదు అది యాదృచ్ఛికమే కావచ్చు యితని సొంత వూరు తిలక్‌గారి వూరి పక్కనే.
భాషాపరంగా ఇతను తెలుగులో భాషా ప్రవీణ చేసి ఒక శతకం కూడా రాసాడు. అవధాన ప్రక్రియ మీదా అధికారం సాధించాడు. సరళమైన, సహజమైన తెలుగు రాయడంలో గాఢంగా వ్యక్తీకరించడంలో నేర్పు సంపాదించాడు.
హైకూ లాంటి చిన్న కవితలు కాకుండా, దీర్ఘకవితలో అతి విస్తారంగా కాకుండా వస్తువును బట్టి 25 నుండి 50 వాక్యాల వరకు నిడివి కలిగి, సరళమైన ప్రతీకతో గాఢ ముద్ర వేసేలా కవితని నిర్వహించి విజువల్ ఇమాజినరీకి మానవ సంబంధాలకీ మధ్య అలంకారాల్ని ప్రయోగించి కవిత్వానుభూతిని సాధిస్తున్నాడు. ‘‘సముద్రం మీదకి వంగి ఆకాశం నీళ్ళతో ఆడుకుంటుంటే చిన్నపుడు నేను అమ్మతో ఆడుకున్న గుర్తు ఏదో’’ ఈ వాక్యాలు చూడండి. ప్రకృతికి సంబంధించిన దృశ్యాత్మక ప్రతీకని తనకీ తన తల్లికీ మధ్య అనుబంధంతో కలిపి ఉపమానంగా చెప్పడం ద్వారా బహ్య ప్రకృతిని వాహికగా వాడుకుని మన లోపలి ఉన్న ప్రకృతిలో స్పందన కలిగిస్తున్నాడు.
కలనేతతో తెలుగు కవిత్వంలోకి దళిత బహుజన ఉద్యమ కవిగా బిసి కులాల ప్రతినిధిగా అంచేద్యరిష్టుగా, అగ్రకులాల ఆధిపత్యాన్ని సహించని కవిగా మొదలుపెట్టాడు. కలనేతకి ముందు విప్లవ కవిత్వం పట్ల అభిమానం కలిగి ఉన్నాడు. దళిత బహుజన సాంస్కృతిక విప్లవాన్ని నిర్మించుకోవడానికి నిమ్నజాతులు ఎవరి పోరాటాలను వారు పోరాడాలి. అగ్రకుల నాయకత్వాల కింద జెండాల మోతగాళ్ళుగా మిగలకూడదు అన్నది కవి ఆశయం. ‘‘కలవని దారుల్లో విడివిడిగా కలసిపోయి వున్న బడుగు వర్ణాలన్నీ కలబోసి కలాల కావ్యాలమీద ఒంపగా వచ్చిన అద్భుత వర్ణమొకదాన్ని కొత్త కాంతిలో రెపరెపలాడించడం’’ ఇతని ఆకాంక్ష. ఇతని కవిత్వం ఎక్కువగా ప్రస్తుత వాస్తవ పరిస్థితుల పట్ల తన సామాజిక బాధ్యతని తెలుసుకుని రాస్తున్న కవిత్వంగా చెప్పవచ్చు. మొదట్లో బహుజన కవిగా ప్రస్థానం మొదలుపెట్టిన ప్రసాదమూర్తి ‘సకలజన కవి’గా రూపాంతరం చెందాడు.
ఇతని కవిత్వంలో జానపద కథాకథన శక్తి, తననలోకి మనల్ని పీల్చుకునే సమ్మోహన శక్తితోపాటు పల్లెసీమల్లోని జీవన యథార్థ చిత్రణ వుంది. అరవై ఏళ్ళ వయసులో చెట్టెక్కి కల్లు గీయాలనుకుని తలక్రిందులుగా వేలాడి చనిపోయిన శ్రామికుని కథ హృదయ విదారకంగా చిత్రించబడింది. రైతు ఆత్మహత్యలు, వూరు ఖాళీ అవడం, వలస వంటి వ్యవసాయ సమాజాల్లోని సంక్షోభాల్ని అన్ని సంకలనాల్లో ప్రధాన ఇతివృత్తంగా చిత్రించాడు.
‘‘తండ్రీ నాలో వాడిపోతున్న కొమ్మలు నీలో చిగురిస్తున్నాయి. నేను అస్తమిస్తూ నీలో ఉదయిస్తున్నాను’’ అని కొడుకు మీద రాసిన కవితగాని ‘‘ఎన్నివేల రఫీల గొంతుకలతో నిన్ను పాడుకున్నాను’’ ఎవరి మీద కవిత్వం ఒలికించినా అది అద్భుతమైన అనుభూతుల సమాహారం యితని కవిత్వం అనిపిస్తుంది. ముఖ్యంగా భార్యమీద రాసిన ప్రేమ కవితలు పాబ్లానెరూడ రాసిన ప్రేమ కవితలకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కవిత్వంలో పాబ్లానెరూడ కవిత్వంలో ఆత్మ ప్రవహిస్తుంది ఆద్యంతం. అన్ని కవితల గురించి చెప్పడం సాధ్యంకాదు గానీ, ముఖ్యంగా -
- వర్షంమీద రాసిన కవితలు అత్యద్భుతం. ప్రబంధ కవులు కూడా వర్షాన్ని ఇంత గొప్పగా ఎవరూ వర్ణించలేదనిపిస్తుంది.
‘‘పైలోకంలో వున్న కవులంతా కుండపోతగా పద్యాలు నేలకు కుమ్మరిస్తున్నట్లుంది వాన’’
‘‘ఆ వానకు ఆ ఒయ్యారాలేంటి?’’
‘‘ఆ వానకు ఆ నాట్యాలెందుకు?’’
ప్రసాదమూర్తి బహుశ మొట్టమొదటి కవిత వర్షంలోనే కూర్చుని రాసి వుంటాడు. పాకిస్తాన్ పెషావర్‌లో ఒక బడిమీద జరిగిన ఉగ్రదాడిలో మరణించిన 60 మంది పిల్లలకోసం రాసిన ‘పిల్లలేంచేసారు?’’ అనే కవిత హృదయవిదారకంగా కంటతడి పెట్టిస్తుంది.
‘‘వ్యాపారం కోసం అక్షరాన్ని ఆశ్రయించకు/గ్రూపులతో కవిత్వానికి ఊపురాదు/అది డ్రామా ట్రూపు అవుతుంది/నాయకుల కాళ్ళు కడిగితే పోయెం పొంగదు/రాజకీయాలు చేసి కవిగా ఎదుగుతావా?/బ్రతుకు తెరువుకోసం దొంగవైనా కా/దయచేసి కవిని కావొద్దు’’
తెలుగు కవిత్వంలో ఇప్పుడు వున్న వాస్తవ పరిస్థితికి ఇది అద్దం పడుతుంది. ఇంత నిక్కచ్చిగా నిజాన్ని చెప్పే కవులు ఎంతమంది? అవార్డులకోసం వారాలు, నెలలు మకాం మరీ వేసి చేసే ప్రయత్నాలు అవసరం తీరగానే అవార్డుల బోర్డులను తిప్పేసే అవకాశవాద కవులకి ఇలాగ ఎంత చెబితే బుద్ధి వస్తుంది? ప్రసాదమూర్తి కవిత్వం అనేక మలుపులు తిరిగింది. మలుపు మలుపుకీ కొత్త దృక్పథాన్ని తనకు కూడగట్టుకుంది. ప్రతి కవి కాలం గడిచినకొద్దీ కవిగా ఎదిగినకొద్దీ తనకి వైడర్ ఆడియెన్స్, వైడర్ యాక్సెప్టబిలిటీ కావాలనుకుంటాడు. తన ఆలోచనా దృక్పథాల్ని అందరికీ ఆమోదయోగ్యమైనవిగా మలచుకుంటాడు. సమా జ శాస్తప్రరంగా దీన్ని సంస్కృతీకరణ అనవచ్చు. ప్రసాదమూర్తి కవిత్వ ప్రయాణంలో తన దృక్పథాల్ని మార్పులు చేసుకుంటూ విస్తృతమయ్యాడు. ఒక పాపులర్ పొయెట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈరోజు ప్రసాదమూర్తి విప్లవ దళిత కవిత్వాల్లో వున్న మంచిని, అనుభూతి కవిత్వంలోని శైలీ సౌందర్యాన్నీ జోడించి సామాజిక దృక్పథంగల అందమైన కవిత్వాన్ని మనకు అందిస్తున్నాడు.

- ఆకెళ్ల రవిప్రకాష్