సాహితి

సకలం ముకుళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంటే ఏందో
అనకుంటే ఏందో
ప్రాణం ఎల్లుక పోతుంటే
చూసుకుంటూ చూసుకుంటూ
పచ్చి మంచి నీళ్లు పొయ్యని
క్షమాధర్మంలేని కఠిన కాలం
ఎవరికి వారు ఎక్కడికి అక్కడ
కట్టడి చేసుకుంటున్న ఇష్ట కాలం

ప్రమాదం జరిగి రక్తం మడుగులో
గిలగిలా కొట్టుకుంటున్నా
చూసీ చూడనట్టుపొయ్యే కాలం
తన లేదు మన లేదు
ఎక్కడికి అక్కడ ఎవరికి వారు
పట్టని తనాన్ని పెంచి పోషిస్తున్న కాలం

ఎవరు సోదా చేసింది లేదు
ఎవరు నిలదీసి అడిగింది లేదు
ఆకలితో డొక్క గుంజుకుపోతున్నా
ఎంగిలి చెయ్యితో కాకిని కొట్టని
ఏకాకి సుఖవంతమైన కాలం
ఎవరికి వారు ఎక్కడికి అక్కడ
మునిగిపోతున్నా ఏమీ కాదనే కాలం

ఎవరూ అడ్డుపడిందీ లేదు
పొలం పోనీ ఫలం పోనీ
ఊరు పోనీ పేరు పోనీ
కడుపులో గడ్డపారతో పెకిలిస్తున్నా
మొర వినని దయలేని కాలం
మనసు మసిలిపోతున్నా
కంట కన్నీరు కారని మొండి కాలం

కాళ్లు నడుస్తుంటాయి
గమ్యం అగమ్య గోచరం
చేతులు చేస్తుంటాయి
కార్యాలు నిర్వీర్యాలు
కండ్లు చూస్తుంటాయి
దృష్టి అంతటా వ్యష్టి
చెవులు వింటుంటాయి
వినికిడి ఉన్నా బధిరత్వం
పదిమందిని కూడగట్టాల్సిన చోట
మురిసిపోతూ కీర్తిస్తుంటుంది
మనిషిని నిలబెట్టాల్సిన మాట
అబ్బుర పడుతూ భజన చేస్తుంటుంది

ఎవరూ ఏమీ అని అనరు
ఎవరూ ఏంది అని అడగరు
మనసు ఇరుగుతుందా కాలం
కావాలని సకలాన్ని ముకుళం
చేసుకుంటున్న వట్టి పిరికిపందల బలం

- జూకంటి జగన్నాథం