సబ్ ఫీచర్

యువశక్తి నిర్వీర్యానికి కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ మాఫియా కార్యకలాపాలు కొనసాగించడం వెనుక పెద్ద కుట్ర దాగివుంది. ముఖ్యంగా యువతను పెడత్రోవ పట్టించేందుకు ఓ వ్యూహం ప్రకారం డ్రగ్స్ మాఫియా తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే భారతదేశంలో యువత 60 శాతం పైన వుంది. యువతను లక్ష్యంగా చేసుకుని విదేశాల నుండి కొకైన్, హెరాయిన్ వంటి అతి ప్రమాదకరమైన మత్తుపదార్ధాలను దిగుమతి చేసి దొంగచాటుగా సరఫరా చేస్తున్నారు. తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఓ కార్పొరేట్ స్కూలు విద్యార్థిని నోరు విప్పడంతో ఈ వ్యవహారం బయటపడింది. సదరు విద్యార్థిని మత్తుకు బానిసై తన నగ్నచిత్రాలను ఇతరులకు పంపిందంటే హైదరాబాద్‌లో కొన్ని కార్పొరేట్ స్కూళ్లలో పరిస్థితి ఎలా వుందో గమనించవచ్చు.
ఒకప్పుడు పంజాబ్ రాష్ట్రం ఇంటికో సైనికుడిని ఇచ్చి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. త్రివిధ దళాలలో పంజాబ్ యువకుల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండేది. అటువంటి పంజాబ్ ఇటీవలి కాలంలో డ్రగ్స్ మాఫియాకు ఆలవాలంగా మా రింది. దేశ సరిహద్దులో ఉండడంతో పంజాబ్‌లోకి డ్రగ్స్ మాఫియా చొరబడింది. దీంతో ఇంటికో సైనికుడు బదులు ఇంటికో ‘మత్తు బానిస’ పంజాబ్‌లో కనిపిస్తాడు. పంజాబ్‌లో యువశక్తిని నిర్వీర్యం చేయడంలో భాగంగానే ఈ అరాచకం జరుగుతోంది. పంజాబ్‌లో పరిస్థితులను చూసైనా దేశంలోని మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు డ్రగ్స్ మాఫియాను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి. డ్రగ్స్ మాఫియాను ఎగదోస్తున్న శత్రుదేశాల వైఖరిని అంతర్జాతీయ వేదికలపై కేంద్రం ఖండించాలి.
తెలంగాణపై డ్రగ్స్ మాఫియా దృష్టి పడిందన్న విషయాన్ని మన పాలకులు గుర్తించాలి. మత్తు పదార్థాల సరఫరా, వినియోగాన్ని పూర్తి స్థాయిలో అడ్డుకోని పక్షంలో విద్యా వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం వుంది. డ్రగ్స్ మాఫియాపై యుద్ధాన్ని ప్రకటించి, హైదరాబాద్‌ను ఆ అరాచక శక్తులు ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాయో అన్న విషయంపై లోతుగా దర్యాప్తు చేయాలి. ఈ విషయంలో ఏ మాత్రం ఉపేక్షించినా భవిష్యత్ తరాలకు డ్రగ్స్ విపరిణామాలు కాన్సర్ వ్యాధిలా విజృంభిస్తుంది. తెలంగాణ ఎక్సయిజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు శాఖ అధికారులు ఇటీవల కొంతమంది సినీ ప్రముఖులను పిలిపించి డ్రగ్స్ విషయమై విచారించారు. అయితే, ఇంతవరకు ఏ ఒక్క పబ్‌పై గానీ, ఇంజనీరింగ్ కళాశాలపై గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫీజు రీయంబర్స్‌మెంట్ ఎక్కువగా అందుతున్న కళాశాలల్లోనే డ్రగ్స్ వాడుతున్న విద్యార్థులు ఎక్కువ అని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజానిజాలు ఎంత? ఇప్పటికైనా ప్రభుత్వం డ్రగ్స్ సరఫరా చేసేవారిని అరెస్టు చేసి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును కాపాడాలి. ఎక్సయిజ్ శాఖ ఏర్పాటు చేసిన ‘ప్రత్యేక దర్యాప్తు బృందం’ (సిట్) అధికారులు సినీ నటీనటులు, సాంకేతిక నిపుణులను విచారించడం ఓ ప్రహసనంగా ముగిసింది. సినీ వర్గాలకు సంబంధించి రెండో జాబితా ఉందన్న హడావుడికి కూడా తెరపడింది. ఉన్నతాధికారుల, రాజకీయ ప్రముఖుల వారసులకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. రాజకీయ వత్తిళ్లకు ప్రభుత్వం తలొగ్గితే- ‘సిట్’ బృందంలో అధికారులు మారుతారు తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం లభించదు.
హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్ పాత్రపై పలు అనుమనాలు ఉన్నాయి. నగరంలో ఇంకెంతమంది కెల్విన్‌లు ఉన్నారో నిగ్గుతేల్చాలి. ‘వీసా’ గడువు ముగిసినా నగరంలో చాలాకాలంగా తిష్ట వేసిన విదేశీయుల గురించి ఆరా తీయాలి. పోలీసుల అలసత్వం వల్లే విదేశాలకు చెందిన వారు ఇక్కడ నేర సామ్రజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. కెల్విన్‌తో పరిచయం వున్నందుకు మాత్రమే సినీ పరిశ్రమలోని ప్రముఖులను విచారించారు. కొంతమంది నుంచి రక్త నమూనాలను సేకరించారు. మిగిలిన వారిని వదిలిపెట్టారు. హైదరాబాద్ నగర శివార్లలోని కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు డ్రగ్స్ వైపు ఆకర్షితులవుతున్నారు. విద్యార్థుల ప్రవర్తన, వారి అలవాట్ల గురించి కళాశాలలు గానీ, తల్లిదండ్రులు గానీ పట్టించుకోనందునే ఈ విపరిణామాలు నెలకొంటున్నాయి. ‘మత్తు’ను రుచి చూసే క్రమంలో విద్యార్థులు తొందరగా ఈ వ్యసనానికి బానిసలవుతున్నారు. విద్యార్థులపై కళాశాలల్లో పర్యవేక్షణ సరిగా జరగడం లేదనే చెప్పాలి. ఎన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో ‘సోషల్ రెస్పాన్సిబిలిటీ’ తరగతులు జరుగుతున్నాయి? ఈ విషయమై ఎంతమంది విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డ్రగ్ డీ ఎడిక్షన్ సెంటర్లు ఏమయ్యాయి? ‘మత్తు’కు అలవాటుపడ్డవారిని విచారించడమే కాదు, వారిలో ఎంతమందిని డీ ఎడిక్షన్ కేంద్రాలకు పంపుతున్నారో అధికారులు ప్రకటించాలి. తెలంగాణలో డ్రగ్స్‌కు అలవాటు పడిన వారిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, కార్పొరేట్ స్కూల్స్, ఇంజనీరింగ్ విద్యార్థులు, సినిమా తారలు ఉన్నట్లు ప్రచారమవుతోంది. డ్రగ్స్ వినియోగంలో ఆరోపణలు వచ్చిన ప్రముఖ కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలకు తూతూ మంత్రంగా నోటీసులు ఇవ్వడమేనా? వారిని విచారించడం జరిగే పనేనా?
తెలంగాణలో ఉన్న సైన్స్ లాబొరెటరీలకు ‘డ్ర గ్స్’ వినియోగాన్ని నిర్థారించే పరిజ్ఞానం సరిగా లే దు. ఈ విషయాన్ని నిర్ధారించే ఒకే ఒక లాబొరెటరీ చత్తీస్‌గఢ్‌లో మాత్రమే ఉంది. ఫోరెన్సిక్ లాబొరేటరీ నమూనాలను అక్కడికి ఎప్పుడు పంపిస్తారు? నివేదికలు ఎప్పుడు తెప్పిస్తారు? కేసులు పెట్టి శిక్షలు పడాలంటే చాలా సమయం పడుతుంది. డ్రగ్స్ సరఫరా చేసేవారిని అరెస్టు చేయాలంటే కచ్చితమైన సాక్ష్యాధారాలు లభించాలి. డ్రగ్స్‌కు అలవాటు పడినవారిని కౌనె్సలింగ్ కేంద్రాలకు తరలించి వైద్య సహాయం అందించాలి. వారిని సుదీర్ఘంగా విచారించాల్సిన అవసరం లేదు. డ్రగ్స్ మాఫియా అరాచకాలు చాలా ఏళ్లుగా జరుగుతునే ఉన్నాయి. సినీ ప్రముఖుల ప్రమేయంతో ఇపుడు ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడు డ్రగ్స్ మాఫియా బండారం ఎందుకు బయటపడింది? గతంలో నమోదు చేసిన కేసుల సంగతేమిటి?.. ఈ విషయాలన్నింటినీ ప్ర భుత్వం ప్రకటించాలి.
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా లాంటి పలు దేశాల నుండి మత్తు పదార్థాలు సరఫరా అవుతున్నాయి. విదేశాల నుండి వస్తున్న వారిని ‘వీసా’ గడువు ముగియగానే మన దేశం నుంచి పంపించేయాలి. కానీ- ఉద్యోగాల పేరుతో, చదువుల పేరుతో వచ్చి, మన చట్టాలలోని లొసుగులను ఆసరాగా చేసుకుని ఇక్కడి యువతను ‘మత్తు’లోకి దింపుతున్న వారి ఆటలు కట్టించాలి. యువశక్తి ని ర్వీర్యం కాకుండా పాలకులు కఠిన చర్యలను తీసుకోవాలి. మన దేశాన్ని విచ్ఛిన్నం చేసే పనిలో విదేశీశక్తులు వున్నాయి. రానున్న రోజుల్లో డ్రగ్స్ మా ఫియా మరింతరెచ్చిపోయే అవకాశం వుంది కాబట్టి పోలీసులు మరింత అప్రమత్తంగా, చిత్తశుద్ధితో వి ధులను నిర్వహించాలి.

-ఎన్.రాజేంద్రప్రసాద్ సెల్: 97048 46563