వరంగల్

నులిపురుగు మాత్ర వికటించి చిన్నారికి అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్: నులిపురుగు మాత్ర వికటించి 20నెలల చిన్నారి అస్వస్థతకు గురైంది. గురువారం మహబూబాబాద్ మండలం మల్యాల శివారు రేగడితండాకు చెందిన చందు-నిర్మల దంపతుల 20నెలల ప్రవళికకు రేగడి తండా అంగన్‌వాడీ కేంద్రంలో అంగన్‌వాడీ కార్యకర్త శివకుమారి పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు ఇవ్వగా అందులో ప్రవళిక అనే పాప మాత్ర వేసుకున్న వెంటనే వాంతులు చేసుకొని అస్వస్థతకు గురైంది. వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.

కస్టమ్ మిల్లింగ్ బియ్యం లక్ష్యాన్ని ఆగస్టు చివరి నాటికి సాధించాలి
మహబూబాబాద్: గత రబీ సీజన్‌లో మిగిలి ఉన్న కస్టమ్ మిల్టింగ్ బియ్యం లక్ష్యాన్ని ఈ నెలఖరులోగా సాధించాలని రాష్ట్ర పౌరసరఫరాల కమీషనర్ సివి ఆనంద్ ఆదేశించారు. గురువారం హైద్రాబాద్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరేన్స్ నిర్వహించి పౌరసరఫరాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఈ పిఓఎస్ విధానాన్ని అమలు పరిచేందుకు జిల్లాలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి శిక్షణ తరగతులు నిర్వహించాలని తెలిపారు. మొబైల్ సీడింగ్‌ను త్వరితంగా పూర్తిచేయాల్సిందిగా ఆదేశించారు. లబ్ధిదారులకు దీపం పథకం కింద మంజూరు నిమిత్తం ప్రభుత్వం నుండి కొత్త మార్గదర్శకాలు రూపొందించి వాటిని జాగ్రత్తగా అమలు చేయాలని తెలిపారు. దీపం లబ్ధిదారుల ఎంపిక తహశీల్దార్లు చేయాల్సి ఉన్నందున పర్యవేక్షించే త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. యంఎల్‌ఎస్ పాయింట్ నుండి చౌకధార దుకాణాలకు తూకం సరిగ్గా ఉండేటట్లు సరుకు రవాణాకు చర్యలు చెపట్టాలని అన్నారు. స్టేజ్-11కాంట్రాక్టర్ టెండర్ల ప్రక్రియ ఈ మాసాంతానికి పూర్తిచేయాల్సిందిగా ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరేన్స్‌లో జేసి దామోదర్‌రెడ్డి, డిఎస్‌వో లక్ష్మణ్‌రావు, పౌరసరఫరాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పునరుజ్జీవ పథకంతో ఓరుగల్లు రైతాంగానికి ప్రయోజనాలు శూన్యం
వరంగల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అట్టహాసంగా చేపట్టిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకంతో వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ఎటువంటి ప్రయోజనం ఉండదని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజేశ్వర్‌రావు, ధర్మారావు అన్నారు. 100కిలోమీటర్ల దూరంలో ఉన్న కంతనపల్లి నుంచి కాకుండా నాలుగవందల కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరాంసాగర్ నుంచి రివర్స్ సిస్టం పేరిట నీళ్లందిస్తామని చెప్పటం ఈప్రాంత ప్రజలను మోసం చేయటమేనని అన్నారు. గురువారం ఇక్కడ ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మించిన తరువాత గడచిన 35ఏళ్లలో ఏడు, ఎనిమిది పర్యాయాలు మాత్రమే పూర్తి ఆయకట్టుకు నీరందిందని చెప్పారు. సాగునీటి కోసం పొరుగు జిల్లా కరీంగనగర్ రైతులతో తరచుగా వివాదాలు ఏర్పడేవని, కింది ఆయకట్టుకు నీరు రాకుండా అక్కడి రైతులు అడ్డుకట్టలు వేసిన సందర్భంలో ఘర్షణలు కూడా జరిగాయని, ఒక సందర్భంలో అడ్డుకట్టలు తొలగించేందుకు బాంబులు కూడా ప్రయోగించి కేసుల్లో ఇరికిన సంఘటనలు కూడా ఉన్నాయని అన్నారు. వరంగల్ శివారులోని డిబిఎం 234నుంచి నల్గొండ జిల్లాలోని చివరి వరకు 7.25లక్షల ఎకరాలకు సాగునీరు అందించవలసి ఉందని చెప్పారు. కానీ శ్రీరాంసాగర్ నుంచి నీరు అందని కారణంగా తెలంగాణ ఉద్యమ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని టిడిపి హయాంలో దేవాదుల, కాంగ్రెస్ హయాంలో కంతనపల్లి ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతులు ఇస్తే, టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కంతనపల్లి వద్ద ఫిజిబులిటీ లేదంటూ ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపివేసారని ఆరోపించారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే 10లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని చెప్పారు. కనీసం టిఆర్‌ఎస్ ప్రభుత్వం తుపాకులగూడెం ప్రతిపాదించిన రిజర్వాయర్ నుంచి కాకతీయ కెనాల్‌కు నీటిని మళ్లించినా సాగునీటికి ఇబ్బందులు తొలగేవని అన్నారు. దేవాదుల ప్రాజెక్టు ప్రాంతం సముద్ర మట్టానికి 74మీటర్ల ఎత్తులో ఉండగా, కాళేశ్వరం 110మీటర్ల ఎత్తులో ఉందని, ఇక్కడి నుంచి 329మీటర్ల ఎత్తులో ఉన్న ఎస్సారెస్పీకి నీటిని తరలించి అక్కడి నుంచి గోదావరి పైన నిర్మించిన వివిధ ప్రాజెక్టులకు సాగునీటిని సరఫరా చేయటం తలతోకలేని వ్యవహారంగా చెప్పారు. దీనివల్ల వేలకోట్ల ప్రజాధనం దుర్వినియోగం తప్ప ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు ఒరిగేది ఏమీ ఉండదని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయటంలో విఫలమైన కెసిఆర్ ప్రభుత్వం వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎప్పటికపుడు కొత్త పథకాలు ప్రకటిస్తుందని, అందులో భాగమే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునురుజ్జీవ పథకమని అన్నారు. ప్రచారం కోసం ప్రభుత్వం ప్రజల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వైఖరి అప్పట్లో కాకతీయలు.. ఆ తరువా నిజాం నవాబు.. ఇప్పుడు తాను మాత్రమే పరిపాలకులమని, మధ్యలో అసలు పరిపాలనే లేదనే తీరులో ఉందని ఎద్దేవా చేసారు. కేంద్రం తాజాగా అమలులోకి తెచ్చిన జిఎస్‌టి విషయంలో మొదట ఆహా..ఓహో అంటు కితాబు ఇచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పుడు మాటమార్చటం వెనక మతలబు ఏమిటని ప్రశ్నించారు. జిఎస్‌టి అమలులో దేశం అంతా ఒకే విధానం ఉంటుందే తప్ప, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం ఉండదని, జిఎస్‌టి అమలు విషయంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే కమిటీలో మంత్రి కెటిఆర్ సభ్యుడని, జిఎస్‌టి సమావేశాల సందర్భంగా ఎందుకు అభ్యంతరాలు తెలపలేదని ప్రశ్నించారు. రాష్ట్రప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించటం ఇక కుదరదని, ఖర్చు చేసే ప్రతి పైసాకు లెక్కలు చెప్పక తప్పదని అన్నారు. విలేఖరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు మందాడి సత్యనారాయణరెడ్డి, వన్నాల శ్రీరాములు, పార్టీ నాయకులు వంగాల సమ్మిరెడ్డి, రావుల కిషన్ తదితరులు పాల్గొన్నారు.

పోచంపాడుకు తరలిన టిఆర్‌ఎస్ శ్రేణులు
* ప్రయాణికులకు తప్పని పాట్లు
వరంగల్: రాష్ట్రప్రభుత్వం నిజామాబాద్ జిల్లా పోచంపాడు వద్ద అట్టహాసంగా నిర్వహించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు రైతులను, పార్టీశ్రేణులను భారీగా తరలించారు. వరంగల్ నగరంలో జరిగిన పార్టీ మహాగర్జన సందర్భంగా ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అటువంటి సమస్యలు తలెత్తకుండా ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనాయకులు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించి రైతులను, కార్యకర్తలను పోచంపాడుకు తరలించారు. ఉదయం నుంచే వివిధ గ్రామాల నుంచి రైతులను, కార్యకర్తలతో ఆర్టీసి బస్సులు పోచంపాడుకు తరలివెళ్లాయి. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి భారీగా ఆర్టీసి బస్సులు వెళ్లటంతో సామాన్య ప్రయాణికులు గురువారం నానాపాట్లు పడవలసి వచ్చింది. వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి జిల్లాల నుంచి రైతులను, టిఆర్‌ఎస్ శ్రేణులను పెద్దఎత్తున తరలించారు. దీనికోసం ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది ఆర్టీసి డిపోల నుంచి 450కిపైగా ఆర్టీసి బస్సులను అద్దెకు తీసుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి ఆధికారపార్టీ నాయకులు, శ్రేణులు భారీగా తరలుతుండటంతో ఆర్టీసి అధికారులు బుధవారం పంపించే పలు నైట్‌హాల్టు బస్సులను కూడా రద్దు చేసి పోచంపాడుకు తరలించారు. ఫలితంగా గురువారం పలు రూట్లలో బస్సులు లేక సామాన్య ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. వరంగల్, హన్మకొండల నుంచి హైద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, నర్సంపేట, మహబూబాబాద్ తదితర ప్రాంతాలకు కొద్దిపాటి సర్వీసులు నడవుగా గ్రామీణ ప్రాంతాల సర్వీసులు చాలామటుకు రద్దయ్యాయి. సిటీ, సబ్ అర్బన్ సర్వీసులు కూడా కొన్నింటిని రద్దు చేసారు. ఫలితంగా వరంగల్ నగరంతోపాటు పరకాల, భూపాలపల్లి, ములుగు, ఏటూరునాగారం, జనగామ, స్టేషన్ ఘనపూర్, మహబూబాబాద్, తొర్రూరు తదితర పట్టణాల నుంచి రోజువారీగా విధుల నిర్వహణ కోసం వివిధ ప్రాంతలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల పరిస్థితి చెప్పనక్కలేదు. చాలామంది ప్రయాణికులు జీపులు, ఇతర ప్రైవేటు వాహనాల్లో గమ్యస్థానాలకు వెళ్లేందుకు ప్రయత్నించగా, మరికొందరు సమీప ప్రయాణాల కోసం ఆటోలను ఆశ్రయించారు.

లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం
వరంగల్(కల్చరల్): వచ్చే నెల 9న జరిగే జాతీయ లోక్ అదాలత్ ద్వారా అత్యధిక కేసులు పరిష్కరించనున్నట్టు ఆశిస్తున్నట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఇ తిరుమలాదేవి తెలిపారు. గురువారం సంస్థ కార్యదర్శి క్రిస్టియానాతో కలిసి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజీపడదగు క్రిమినల్, సివిల్, చిట్‌ఫండ్స్, బ్యాంక్స్, వివాహ, కుటుంబ తగాదాలు గల కేసులు, ఎలక్ట్రిసిటి, ఫ్రీ-లిటిగేషన్ కేసుల వంటి రాజీపడదగు అన్ని కేసులు కక్షిదారులు రాజీకుదుర్చుకొని ఒక అవగాహనకు వచ్చిన వారికి జాతీయ లోక్ అదాలత్‌లో వెంటనే అవార్డులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అవార్డు ఇచ్చిన కేసులలో అపీల్ ఉండదని ఆమె పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, జిల్లాలోని అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గత లోక్ అదాలత్ నిర్వహించినప్పుడూ 901 పెండింగ్ కేసులు పరిష్కరించారని అన్నారు.
ఈ సారి అత్యధిక సంఖ్యలో కేసులు పరిష్కరించనున్నట్టు ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

అపరిశుభ్రతే అన్నివ్యాధులకు మూలం

కురవి: పరిసరాల, వ్యక్తిగత అపరిశుభ్రతే అన్నివ్యాధులకు మూలమని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా అన్నారు. కురవి మండల కేంద్రంలో ఏకలవ్య బాలికల గురుకుల పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన కలెక్టర్ ముందుగా నులిపురుగుల నివారణ వాల్‌పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ...ప్రతి ఒక్కరు వ్యిక్తిగత పరిశుభ్రతపై అవగహాన పెంచుకోవాలన్నారు. నేడు వస్తున్న ఎక్కువ శాతం జబ్బులకు అపరిశుభ్రతే కారణమన్నారు. బహిరంగ మలమూత్రవిసర్జనకు స్వస్తి చెప్పాలన్నారు. నులిపురుగుల వలన పిల్లల్లో ఎదుగుదల లోపం, రక్తహీనత, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనబడుతాయన్నారు. ఆరోగ్య భారతవనికి అందరు సహకరించాలన్నారు. జిల్లాలో రెండు లక్షల 9వేల 323మంది 1-19 వయస్సుగల పిల్లలను గుర్తించినట్లు, అందులో 80శాతం మందికి మందులను అందించనున్నట్లు తెలిపారు. మిగతా పిల్లలకు 23వ తేదీన మందులను పంపిణీ చేయనున్నట్లు వివరించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని గ్రామాలలో, తండాలలో ప్రజలను ఆరోగ్య సిబ్బంది అప్రమత్తం చేయాలని సూచించారు. అదేవిధంగా బోధకాలు కూడా ప్రమాదకరమైందని పైలేరియా అడిషనల్ డైరెక్టర్ ప్రభావతి సూచించారు. జిల్లాలోని కురవి, దంతాలపల్లి, మరిపెడ గ్రామాలలో ఈ వ్యాధి గ్రస్తులు ఉన్నారన్నారు. తట్టు, రుబెల్లా వ్యాక్సిన్‌పై లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ముద్రించిన ప్రచార కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించి, క్లబ్ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రమేష్‌రెడ్డి, ఎంపిపి బజ్జూరి ఉమాపిచ్చిరెడ్డి, ఐసిడిఎస్ పిడి స్వర్ణలతా లెనినా, డిపిఆర్‌ఓ అయూబ్ అలీ, డిటిడిఓ నారాయణస్వామి, ఎటిడబ్ల్యూఓ దేశీరాంనాయక్, బలపాల డాక్టర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ద్రోహిగా మిగిలి పోవద్దు...
పరకాల, అగస్టు 10: ద్రోహిగా మిగిలి పోవద్దు... పరకాల చరిత్ర తెలుసుకోవాలని అఖిలపక్ష నేతలు స్పష్టం చేశారు. గురువారం స్థానిక స్వర్ణ గార్డెన్స్‌లో అఖిల పక్షం, వ్యాపార, విద్యార్థి నేతలతో సమావేశం నిర్వహించారు. న్యాయవాది ఒంటేరు రాజవౌళి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ సంతోష్‌కుమార్ మాట్లాడుతూ పరకాలను రెవెన్యూ డివిజన్ చేయాలని అప్పుడు అన్నారని... ఇప్పుడు జిల్లా కేంద్రం అంటున్నారు రేపు రాజధాని అడుగుతారా అని ఎద్దేవా చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు పరకాల చరిత్ర తెలుసుకోవాలన్నారు. నైజాం సర్కారు, రజాకార్ల నుండి నుండి భూమి కోసం, భుక్తి కోసం సాగిన పోరాటంలో విముక్తి ప్రసాదించింది పరకాల కాదా? అని ఆయన ప్రశ్నించారు. పరకాల కేంద్రంగా సాగిన సాయుధ పోరాటంతో హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చిందని చరిత్ర చెప్పుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. నైజాం సర్కార్ 15 మందిని కాల్చి చంపితే నైజాం సర్కార్‌ను తరిమివేసిన ఘనత పరకాలకు ఉందన్నారు. అలాంటి ఘన చరిత్ర కలిగిన పరకాల చరిత్రను మరుగున పడి వేస్తున్నారని చెప్పారు. అంతటి చరిత్ర కలిగిన పరకాలను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అడగడం తప్పా అని ప్రశ్నించారు. పరకాల నుండి కరీంనగర్ జిల్లా మహదేవపూర్ వరకు సంబంధాలు ఉన్నాయని తెలిపారు. పరకాల చరిత్ర గురించి తెలియని వారే నేడు పరకాలకు అన్యాయం చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ కేంద్రమైన పరకాలను వదిలి వేసి ఎక్కడో రూ. 1150 కోట్లతో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారో ఇక్కడి ప్రజలకు కడుపు లేదా అని ప్రశ్నించారు. ఒక ఎకరం భూమి పరకాలలో లేదని బాలికల గురుకుల పాఠశాలను తరలించారే పరకాలకు చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. పరకాలకు సమీపంలో ఉన్న చిట్యాల మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిని 150 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేశారని, భూపాలపల్లిలో 250 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేశారని పరకాల ప్రభుత్వ ఆసుపత్రి మీకు తెలిసిందేనన్నారు. 1960లో పరకాలలో గరకుబావి తవ్వించారని ఇప్పుడు కూడా ఆ బావే ఆధారమైందన్నారు. ఉద్యమం అన్నప్పుడు బెదిరింపులు తప్పవని, బెదిరింపులకు భయపడేది లేదని చెప్పారు.
ఎమ్మెల్యే ధర్మారెడ్డి పరకాలకు చేసింది ఏమీ లేదు...
పరకాల పట్టణ ప్రజలు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి ఓట్లు వేయలేదా అని అఖిల పక్ష నేత పిట్ట వీరస్వామి ప్రశ్నించారు. పరకాల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాలకు చేసింది ఏమీ లేదన్నారు. కేవలం ఆయన ఉండడానికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అద్భుతంగా కట్టుకుంది తప్ప ఏమీ చేయలేదన్నారు. కరీంనగర్ ఎంపి వినోద్‌కుమార్ భూపాపల్లికి ముఖద్వారం పరకాల అని, పరకాలకు అన్యాయం జరిగింది వాస్తమని చెప్పారని ఆయన పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల పాటు పరకాల మండలంతో కలిసి ఉన్న కౌకొండ తదితర గ్రామాలు తన స్వార్థం కోసం విడదీసిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. చల్లా ధర్మారెడ్డి కోసం ఆనాడు స్టేషన్‌కు కూడా వెళ్లినామని ఆయన గుర్తు చేశారు. నియోజకవర్గ పెంపు లేదని చెప్పడంతో ఎమ్మెల్యే పరకాలపై తూతూగా ప్రకటన చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. అధికారం శాశ్వతం కాదని చెప్పారు. అనంతరం కాంగ్రెస్, టిడిపి, బిజెపి, విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ 48 గంటలకు పిలుపుఇచ్చి పరకాలను దిగ్బంధం చేయాలని, ప్రతి కుల సంఘాల నాయకులు భాగస్వామ్యం కావాలని చెప్పారు. ప్రజాప్రతినిధుల ఇంటి ముందు చాపుడప్పు వినిపించాలని వారు సమావేశంలో పేర్కొన్నారు. అనంతరం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సమావేశంలో కొలుగూరి రాజేశ్వర్‌రావు, కట్కూరి దేవేందర్, చాడ రవీందర్‌రెడ్డి, నలబల క్రిష్ణయ్య, ఏకు సారయ్య, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, దుప్పటి సాంబయ్య, యాట నరేష్, నాగెల్లి రంజిత్ పాల్గొన్నారు.

వెనుకబడిన కులాల అభ్యున్నతికే సొసైటీల ఏర్పాటు

ఆంధ్రభూమి బ్యూరో
మహబూబాబాద్: వెనుకబడిన కులాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కో-ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా అన్నారు. గురువారం ఉదయం జిల్లా కో-పరేటివ్ సొసైటీల రిజిస్ట్రేషన్ కమిటీ సభ్యులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన 21జిల్లాల్లో జిల్లా షెడ్యూల్డ్, కులాల సేవాసహకార సంఘ లిమిటేడ్ పేరుతో జిల్లా కో-ఆపరేటివ్ అధికారి కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కో ఆపరేటివ్ సొసైటీ 10మంది సభ్యులతో ఏర్పడుతుందని చైర్మన్‌గా కలెక్టర్ వ్యవహరిస్తారని అన్నారు ప్రభుత్వంచే అందిస్తున్న అభివృద్ధి ఫలాలు, లోన్స్, వ్యాపారాలు, ట్రైనింగ్ సెంటర్స్‌ను ఏర్పరచి సొసైటీల ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు విధి విధానాలు, ముఖ్య లక్ష్యాలు చేపడుతున్నట్లు అభివృద్ధి అంశాలపై కలెక్టర్ చర్చించారు. జిల్లా షెడ్యుల్డ్ కులాలు, సేవా సహకార సంఘం లిమిటెడ్ ద్వారా లబ్ధిదారులను గుర్తించి ఆర్ధికంగా ఆదుకోనున్నట్ట్లు తెలిపారు. ప్రజలు కార్పోరేషన్స్ అందించే సంక్షేమ ఫలాలను సకాలంలో సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా అందరూ అభివృద్ధి పడేలా సంబందిత అధికారులకు తగిన సూచనలు, సలహాలు, కర్తవ్యాలు గుర్తుచేస్తూ కమిటీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పనులను సకాలంలో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రాజు, హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణ, కమిటీ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మనం బ్రతుకుతూ ముందు తరాలను బతికించాలి
ఆత్మకూర్: మనం బతుకుతూ ముందు తరాలను బతికించుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని గుడెప్పాడు విట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన హరిత హారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమిషనర్ సుధీర్‌బాబు, రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ హాజరై కళాశాలలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సుధీర్‌బాబు మాట్లాడుతూ దేశంలో 33శాతం అడవులు ఉండాల్సి ఉండగా ఇందులో 12 శాతమే ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన 3వ విడుత హరిత హారంలో భాగంగా కమీషనరేట్ పరిధిలో 30లక్షల మొక్కలను నాటామని చెప్పారు. హరిత హారాన్ని సామాజిక ఉద్యమంగా తీసుకొని ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు. మానవ జీవితం చెట్లతో ముడిపడి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ ఏడాది 40 కోట్ల మొక్కలు నాటడం లక్షంగా పెట్టుకుందని, ఈ హరితహారంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం రూరల్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటికి 8 నుండి 10 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని అన్నారు. మొక్కల పెంపకాన్ని దత్తత తీసుకొని వాటిని సంరక్షించాలని పేర్కొన్నారు.
ప్రజల సహకారంతోని హరితహారం విజయవంతం అవుతుందని చెప్పారు. గత ఏడాది కోటి మొక్కలు నాటగా అందులో 2శాతం మొక్కలు మాత్రమే సంరక్షించబడ్డాయని అన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెట్ల పెంపకం వలన ఉపయోగాలను వివరించాలని సూచించారు. పరకాల డివిజన్ పరిధిలో ఆత్మకూర్ మండలంలో లక్ష మొక్కలను నాటడం పోలీస్ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ అక్బర్, డిసిపి ఇస్మాయిల్, జిల్లా అటవీ శాఖ అధికారి పురుషోత్తం, పరకాల ఏసిపి సుదీంద్ర, విట్స్ కళాశాల కరెస్పండెంట్ మహేందర్, ఎంపిడివో నర్మద, సిఐ శ్రీనివాస్, ఎస్సైలు విఠల్, రవీందర్, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

త్రివేణి జలాలతో తెలంగాణకు అభిషేకం

కాటారం: గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని త్రివేణి నదుల సంగమంతో కూడిన జలాలతో తెలంగాణకు అభిషేకం చేస్తామని మంథని శాసనసభ్యుడు పుట్ట మధూకర్ ప్రకటించారు. వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు, పాలాభిషేకం చేసిన కాళేశ్వరం జలాలను కలశాలలో నిజామాబాద్ జిల్లా పోచంపాడ్‌కు తీసుకువెళుతూ, గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో ‘ఆంధ్రభూమి’తో మాట్లాడారు. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని ప్రవచించిన దాశరథి మాటలను నిజం చేస్తూ, శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, జల ప్రదాత కేసీఆర్ శంకుస్థాపన చేస్తున్నారని మధు వివరించారు. ప్రధాన గోదావరిలో ఎగువ రాష్టమ్రైన మహారాష్ట్ర నుంచి ఒక్క చుక్క నీరు రాకున్నా, శ్రీరాం సాగర్ ప్రాజెక్టు, కాలువలు నిత్యం జలకళ ఉట్టిపడేలా రూ.2వేల కోట్లతో ఎస్‌ఆర్‌ఎస్‌పి పునర్జీవం పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.
16 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరందించే ఈ బృహత్తర జలసాధన యజ్ఞానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతగానో దోహదం చేస్తుందని అన్నారు. మంథని శాసనసభ నియోజకవర్గంలోని కాళేశ్వరంలో చేపట్టిన ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ళ, ఎల్లంపల్లి మీదుగా మిడ్ మానేరు వరద కాల్వ 102వ కిలో మీటర వద్ద 15 మేగా వాట్ల మోటార్లను బిగించి మూడు చోట్ల ఎత్తిపోతల ద్వారా శ్రీరాం సాగర్‌లోకి 60 టిఎంసీల నీటిని ఎత్తిపోస్తామని , వరద కాల్వనే జలాశయంగా మార్చుకొని రివర్స్ పంపింగ్ విధానంలో ప్రభుత్వం రూపకల్పన చేసిందని వివరించారు.
దీంతో రానున్న కాలంలో కరవు కాటకాలనేవి దరిచేరవని, నిత్యం నీళ్ళ కుండలాగా ఎస్పారెస్పీ ప్రాజెక్టు జీవనదిగా మారబోతున్నదని మధు అన్నారు. దీంతో కాలువలల్లో నిరంతరం నీరు పారేలా, అన్ని చెరువులను నింపే విధంగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించారని, పనుల వేగవంతంగా జరగడానికి ఇప్పటికే ప్రభుత్వం రూ.1067 కోట్లను మంజూరీ చేసిందని అన్నారు. పాత కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోని రైతాంగానికి సాగు నీరందించడంతో పాటు హైదరాబాద్ నగరానికి మంచినీరు అందించే బృహత్తర ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతల పథకమని, వచ్చే ఏడాది నుంచి ఈ ప్రాజెక్టు ద్వారా పంట పొలాలకు గోదావరి నీరు అందించే విధంగా పనులు ఫ్లడ్ లైట్ల వెలుతురులలో సైతం శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే పుట్ట మధు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాల నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని అనుకున్నట్లుగా జరగితే గోదావరి నదీ జలాల గలగలలు పంట పొలాలలో ప్రవహించి, బంగారు పంటలను రైతులు పండిస్తారని దాంతో తెలంగాణ తల్లి ముఖ చిత్రంలోని ప్రజల్లో దరహాసం పరిఢవిల్లుతుందని, బంగారు తెలంగాణ సాకారమవుతోందని మధు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రవహించే అతి పెద్ద నది గోదావరిపై నిర్మించనున్న కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయినిగా వర్ధిల్లుతుందని పేర్కొన్నారు. తెలంగాణ గుండా ప్రవహించే గోదావరి నదీ జలాలు వృథాగా సముద్రంలో కలువకుండా, వాటిని సద్వినియోగం చేసుకోవాలనే సదాశయంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని, ఇదిలా ఉండగా ప్రాజెక్టు నిర్మాణంతో కొంత వ్యవసాయ భూమి కోల్పోవడం జరిగినా, వారంతా సహకరించారని, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ప్రాజెక్టు పూర్తి కావడంతో ప్రజలు, రైతులు మధుర ఫలాలను పొందుతారనే అశాభావాన్ని వ్యక్తం చేశారు. లక్షల ఎకరాల బీడు భూములను మాగాణి భూములుగా మార్చుతుందని అన్నారు.
నదీ ప్రాజెక్టులతో అనేక లాభాలున్నాయని , సంవత్సరమంతా సాగునీరు అందుబాటులోకి వస్తుందని, చేపల పెంపకం చేయవచ్చని, పశువుల పెంపకానికై పశుగ్రాసం లభిస్తుందని, భూగర్భ జలాల సాంద్రత పెరుగుతుందని అన్నారు. భూసారం పెరిగుతుందని, అడవులు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయిన తర్వాత పర్యాటకం అభివృద్ధి చెందుతుందని అకాంక్షించారు. పాడి పంటలతో గ్రామాలు అభివృద్ధి జరిగి తెలంగాణలోని పల్లెలు పునరుజ్జీవం పొందుతాయని మంథని ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మొక్కలు నాటడమే కాదు.. బాధ్యతతో పెంచాలి
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబాబాద్: మొక్కలను నాటి బాధ్యతతో పెంచినప్పుడే పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా తెలిపారు. గురువారం మహబూబాబాద్ మండలంలోని నక్కబండ అటవీప్రాంతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మూడవ విదత హరితహారం చేపట్టి రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 33శాతం పెంచేందుకు పూనుకుందని అందరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. 25హెక్టార్‌లలో ఉన్న నక్కబండ అటవీ ప్రాంతంలో 2500మొక్కలు నాటుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని జియోట్యాగింగ్ చేసి హరిత దళాలను ఏర్పాటు చేసి వాటిని సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా హరితహారం ప్రత్యేక అధికారిణి సుజాత, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సదానందం, సెక్షన్ అధికారి నాగరాజు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

దేవాదుల నీటిని వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాలి

* సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి భిక్షపతి
భీమదేవరపల్లి: దేవాదుల ద్వారా నీటిని విడుదల చేసి భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, ధర్మసాగర్ మండలాలకు సాగునీటిని వెంటనే అందజేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కర్రె భిక్షపతి, భీమదేవరపల్లి మండల కార్యదర్శి ఆదరి శ్రీనివాస్‌లు డిమాండ్ చేశారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఐ నాయకులు మాట్లాడుతూ దేవాదుల ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి భీమదేవరపల్లి మండలం, ఎల్కతుర్తి మండలం, ధర్మసాగర్ మండలాల్లోని వేలాది ఎకరాలకు సాగునీటిని అందించేందుకు స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ కృషి చేయాలన్నారు. గత రెండు నెలలుగా వర్షాలు లేకపోవడంతో పంటల ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ పక్షాన ప్రభుత్వాన్ని, అధికార పార్టీ నాయకులను నీటి విడుదల కోసం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, ధర్మసాగర్ మండలాలు సాగునీటితో పాటు తాగునీటిని సైతం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ దేవాదుల నీటిని విడుదల చేసేందుకు అధికారులతో ప్రత్యేక సమావేశం జరిపి ధర్మసాగర్ రిజర్వాయర్ ద్వారా ఆయా మండలాలకు చెందిన రైతులను ఆదుకునేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు మార్పు సంజీవ రెడ్డి, కొదురుపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.