శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వస్తు సేవల పన్నుపై వీడని భయాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) విషయమై ఇంకా స్పష్టత రాక గందరగోళంగా తయారైంది. ఏ వస్తువుకు ఎంత పన్ను చెల్లించాలి, వేటికి ముద్రణ ధరలోనే జిఎస్‌టి మిళితమై ఉంది అనే వివరాలపై కానీ తాము ఎంత పన్ను ఏవిధంగా చెల్లించాలనే అంశంపై కానీ స్పష్టత లేకపోవటం, కొందరికి దీనిపై మిడిమిడి పరిజ్ఞానం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈక్రమంలో వినియోగదారుడుపై రెట్టింపు భారం పడుతోంది. జిల్లాలో గతంలో వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో ఇరవై వేల మంది వ్యాపారులుండగా ఆ సమయంలో ఏడాదికి ఆరు వందల కోట్ల వరకు ఆదాయం లభించేది. వస్తుసేవల పన్ను అమలుచేసి తుది గడువు పూర్తయే సమయానికి 12,263 మంది జిఎస్‌టి నెట్‌వర్క్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. దేశమంతా ఏకపన్ను విధానం అమలులోకి వచ్చాక ఎక్కడ వస్తువు కొనుగోలు చేసినా ఆ వస్తువు ఒకే ధర కల్గి ఉండాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు పరిశీలిస్తే వ్యాపారులు వివిధ రకాల ధరలతో విక్రయించి దీనికి జిఎస్‌టి అదనం అనటంతో భారం మొత్తం వినియోగదారునిపై పడుతోంది. అసలు దేనికి వస్తుసేవల పన్ను అమలులో ఉందో అర్థంకాని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.
హోటళ్లలో మరీ దారుణం
బతకాలంటే తిండి తినాలి. సరిగ్గా ఈ అవసరాన్ని వ్యాపారులు, ముఖ్యంగా రెస్టారెంట్ యజమానులు పన్ను రూపంలో వడ్డిస్తున్నాయి, గతంలో సేవా పన్ను వసూలు చేయకూడదని చెప్పినా వినకుండా కచ్చితంగా సేవా పన్ను వసూలు చేసేవారు. ఇపుడు సేవా పన్నుకు తోడు వస్తు సేవల పన్ను కూడా వేయటంతో వినియోగదారులకు వేసిన బిల్లుకు 18 శాతం అదనపు బిల్లుతో వసూలు చేస్తున్నారు. వాస్తవానికి రెస్టారెంట్‌లలో మసాలాలు, పప్పుదినుసులు అన్నీ కూడా వస్తుసేవల పన్ను చెల్లించే వీటిని కొనుగోలు చేస్తారు. దీనికి తయారీ ధర, నిర్వహణ వ్యయాన్ని వినియోగదారునికి బిల్లు ఇస్తున్నాడు. వినియోగదారుడు జిఎస్‌టితో సహా చెల్లించినట్లే లెక్క. కానీ బిల్లు ఇచ్చాక దాని కింద భాగంలో జిఎస్‌టి రూపంలో పన్ను శ్లాబుకు అనుగుణంగా వెయ్యికి నూట ఇరవై రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు.
నిత్యావసర వస్తువుల విషయంలో..
వాస్తవానికి బిల్లు మొత్తానికి కలిపి రెండు వేలు అయిందనుకుంటే దీనికి అదనంగా 18 శాతం వస్తుసేవల పన్ను అదనం అంటూ 360 పన్ను రూపేణా వసూలు చేస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ వినియోగదారుడు కొనుగోలు చేసే వస్తువులు రిటైల్ రేటుకు వస్తాయి. దీనికి అదనంగా మరోసారి పన్ను చెల్లించడమంటే రెట్టింపు పన్ను చెల్లించడమేనని వినియోగదారులు అంటున్నారు. ఇటువంటి వాటిపై వినియోగదారులకు కచ్చితమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. గృహోపకరణాలు కాకుండా ఇతర వస్తువులు, స్థానికంగా తయారయ్యే బ్రాండెడ్ కాని వస్తువులకు ప్రత్యేకమైన ధరలు ఉండవు. ఇలాంటి వస్తువులకు తయారీదారుడే ధర నిర్ణయించుకుని హోల్‌సేల్‌కు విక్రయించి రిటైల్ దుకాణాలకు వస్తాయి. ఈ మూడు అంశాలలో దాని వాస్తవ ధర ఎంత అనేది ఎవరికీ తెలియదు. కానీ ఇక్కడ తయారీలో వాడే ముడిసరుకులకు మాత్రం జిఎస్‌టి చెల్లించి ఉత్పత్తిదారుడు కొనుగోలు చేస్తాడు. ఇక్కడవరకు జిఎస్‌టి వసూలు చేస్తే ఫరవాలేదు. కానీ ఎంత ధరకు కావాలంటే అంత ధరకు రిటైల్ వ్యాపారి వినియోగదారులకు విక్రయిస్తున్నాడు. తాను విక్రయిస్తున్న వస్తువులకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు ఒక వస్తువును 70 రూపాయలకు తయారుచేసి జిఎస్‌టి, తనకు రావాల్సిన రాబడి కలిపి ఉత్పత్తిదారుడు వందకు హోల్‌సేల్ ధరకు విక్రయిస్తున్నాడు. దీనిని రిటైల్‌దారుడు వినియోగదారునికి 500 రూపాయలకు విక్రయించి దీనికి అదనంగా వస్తుసేవల పన్ను వినియోగదారునిపై బనాయిస్తున్నాడు. ఇక్కడ వాస్తవానికి జిఎస్‌టి 400 రూపాయలకు మాత్రమే వేయాలి. కాబట్టి పన్ను నుండి తొలుత చెల్లించిన వందను మినహాయించి మిగిలిన దానికి మాత్రమే వస్తుసేవల పన్ను వసూలు చేయాలి. వ్యాపారుల అవగాహనరాహిత్యమో, మరే కారణమో కానీ మొత్తం లావాదేవీకి పన్ను విధిస్తున్నారు. రెడీమేడ్ దుస్తులపై ఇదే తంతు కనిపిస్తోంది. ఎక్కడా ఏ రంగానికి కూడా దీనిపై స్పష్టమైన అవగాహన లేదనేది వాస్తవం. ఇలా ప్రతిచోటా ప్రత్యేకించి సినిమా టిక్కెట్లు, తినుబండారాలు, శీతలపానీయాలు, సిగరెట్లపై సైతం వస్తు సేవల పన్ను వసూలు చేస్తున్నారు.
జిఎస్‌టి పేరుతో ప్రజలపై పెనుభారం- డిసిసి అధ్యక్షుడు పనబాక
జిఎస్‌టి అమలులో ప్రభుత్వం వినియోగదారులకు, వ్యాపారులకు స్పష్టమైన అవగాహన కల్పించకపోవడంతో అధిక ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 28 శాతం మేర వస్తుసేవల పన్ను పేరుతో వినియోగదారులపై జిఎస్‌టి భారం పడుతోంది. అధిక ఆదాయం లభిస్తున్న చమురు ఉత్పత్తులపై వస్తుసేవల పన్ను విధించకుండా నిత్యావసర వస్తువులపై జిఎస్‌టి విధించటం ఎంతవరకు సమంజసం.

వణికిస్తున్న డెంగ్యూ
సూళ్లూరుపేటలో మరో కేసు నమోదు
సూళ్లూరుపేట: సూళ్లూరుపేట పట్టణ ప్రజలను డెంగ్యూ జ్వరం వణికిస్తోంది. ఎక్కడ చూసినా విష జ్వరాల బారినపడి వైద్యశాలకు క్యూకడుతున్నారు. ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో సరైన వైద్యం అందక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉంది. మురుగునీరు సైతం రోడ్లపై ప్రవహిస్తున్నా పట్టించుకొనే నాధుడే లేడు. దోమల బెడద సైతం పట్టణ వాసులను పట్టిపీడిస్తోంది. దీనికితోడు పుర వీధుల్లో ఎక్కడ చూసినా పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. మురుగునీరు, నిల్వ ప్రదేశాల్లో పందులు స్వైరవిహారం చేస్తునా మున్సిపాలిటీ అధికారులు, పాలకవర్గం తమకేమి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. పారిశుద్ధ్యం లోపించడంతో ఎక్కడ చూసినా జ్వరాల బారిన పడుతన్నారు.
పది రోజుల్లో రెండు డెంగ్యూ కేసులు
పట్టణంలో 10 రోజుల్లోనే రెండు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఆరోగ్యంపై భయాందోళన చెందున్నారు. దీనిని పట్టించుకోవాల్సిన వైద్యాధికారులు కేసులు ఏమీలేవని చేతులు దులుపుకొంటున్నారు. 10 రోజల క్రితం గాండ్లవీధిలోని వనంతోపునకు చెందిన జాస్మిన్ అనే నాలుగేళ్ల చిన్నారి జ్వరం బారిన పడింది. మూడు రోజులు జ్వరం తగ్గకపోవడంతో అనుమానంతో చెన్నైకి తీసుకెళ్లి రక్తపరీక్ష చేయగా డెంగ్యూ సోకినట్లు నిర్ధారించారు. దీంతో అక్కడే వారం రోజులు చికిత్స చేయించుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. అంతకుముందు షార్ కాలనీలో రెండు డెంగ్యూ కేసులు నమోదు కాగా చెన్నైలోనే చికిత్స చేయించుకొన్నారు. మళ్లీ రెండు రోజుల క్రితం గాండ్లవీధిలో నివాసం ఉంటున్న మున్సిపాలిటీలో బిల్లుకలెక్టర్‌గా పనిచేస్తున్న శంకర్ కుమారుడు జశ్వంత్ (16) అనే బాలుడికి రెండు రోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో స్థానిక వైద్యశాలకు వెళ్లి వైద్యులకు చూపించారు. వైద్యులు పరిశీలించి నెల్లూరుకు వెళ్లాలని సూచించారు. దీంతో బాలుడ్ని హుటాహుటిన నెల్లూరు నారాయణ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి డెంగ్యూ జ్వరంగా నిర్ధారించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. సూళ్లూరుపేటలో పారిశుద్ధ్యం పడకేయడంతో విషజ్వరాలు వణికిస్తున్నాయి. దీనికితోడు రెండు రోజుల నుండి వర్షం కురుస్తుండడంతో పట్టణమంతా అధ్వాన్నంగా తయారైంది. ఎక్కడ చూసినా మురుగనీరు, బురదమయంగా ఉంది. దీనికితోడు తాగునీరు సైతం కలుషితంగా మారడంతో అందరూ వ్యాధుల బారిన పడుతున్నారు. జిల్లా అధికారులు స్పందించి పారిశుద్ధ్యం మెరుగుపరిచి పట్టణవాసులను వ్యాధుల బారినుండి రక్షించాల్సిన అవసరం ఉంది.

విద్యాసంస్థల బంద్ విజయవంతం
పలుచోట్ల విద్యార్థి సంఘాల ప్రతినిధులు అరెస్ట్
నెల్లూరు కలెక్టరేట్: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌ఒ, ఎఐఎఎఫ్ తదితర ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్యర్యంలో గురువారం నిర్వహించిన విద్యాసంస్థల సమ్మె విజయవంతమైంది. జిల్లా కేంద్రంలోని ఆత్మకూరు బస్టాండ్ కూడలి నుండి సమ్మె నిర్వహించేందుకు బయలుదేరిన ఆయా విద్యార్థి సంఘాల ప్రతినిథులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు విద్యార్థి సంఘాల ప్రతినిథులకు వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్థుల అరెస్ట్ సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాల ప్రతినిథులు డికె మహిళా కళాశాల ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ ప్రతినిథులు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై ఉద్యమిస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను ప్రభుత్వం పోలీసులతో అరెస్ట్ చేయటం సిగ్గుచేటన్నారు. విద్యా వ్యతిరేక విధానాలు అవలంబించటమే కాకుండా ఉచిత విద్య నుండి ప్రభుత్వం తప్పుకోవటం దారుణమన్నారు. దీనికి తోడు కెజి నుండి పిజి వరకు ప్రైవేటు విద్యను ప్రోత్సహించి పేద వర్గాలను విద్యకు దూరం చేసేందుకు ప్రభుత్వం పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల మూసివేతకు తెగబడిందని ఆరోపించారు. ఇకనైనా ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయా విద్యార్థి సంఘాల ప్రతినిథులు ఎం సునీల్, ఎంవి రమణ, నందకిరణ్, శ్రీనివాసులు, రసూల్, వై మధు తదితరులు పాల్గొన్నారు.
హోరాహోరీగా తలపడ్డ జాతీయ సాప్ట్‌బాల్ క్రీడా జట్లు
నెల్లూరు కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని విఆర్‌సి క్రీడా మైదానంలో ఏడవ జాతీయ జూనియర్ సాప్ట్‌బాల్ క్రీడా పోటీలు గురువారం హోరాహోరీగా సాగాయి. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలు ఈ జాతీయ క్రీడలలో పాల్గొన్నాయి. పోటీలను వీక్షించేందుకు భారీగా క్రీడాభిమానులు క్రీడా మైదానానికి చేరుకుని పోటాపోటీగా తలపడిన తమ అభిమాన జట్లను ప్రోత్సహించారు. అండర్-12 బాలుర విభాగంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, డిల్లీ, మహారాష్ట్ర జట్లు తలపడ్డాయి. అలాగే అండర్-12 బాలికల విభాగంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, గోవా జట్లు తలపడ్డాయి. కాగా వీటిలో గెలుపొందిన రెండు విభాగాల జట్లకు సెమీ పైనల్, ఫైనల్ పోటీలను శుక్రవారం నిర్వహిస్తారు. కార్యక్రమంలో సాప్ట్‌బాల్ అసోసియేషన్ సిఇఒ ప్రవీణ్ అనోకర్, సాప్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, డిఎస్‌డిఒ పివి రమణయ్య, సన్ని సుల్తాన్, షణ్ముగం తదితరులు పాల్గొన్నారు.

చుక్కల భూములు క్రమబద్ధీకరణ:కలెక్టర్
జిల్లాలో భూములు 31 లక్షల 98 వేల ఎకరాలు * కలెక్టర్ ముత్యాలరాజు
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు: జిల్లావ్యాప్తంగా అన్ని రకాల భూములు కలిపి 31 లక్షల 98 వేల ఎకరాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ తన క్యాంప్ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా రికార్డుల ప్రకారం మూడు లక్షల 70 వేల ఎకరాల చుక్కల భూములు గుర్తించామని తెలిపారు. రెవెన్యూ రికార్డుల్లో కొన్ని సంవత్సరాలుగా భూమి ఎవరిదో తెలపకుండా చుక్కలు పెట్టడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆ భూములను వర్గీకరించి నిబంధనల ప్రకారం 2017 మే 1వ తేదీ నాటికి 12 సంవత్సరాలు లేదా దాని పైబడి స్వాధీనంలో ఉన్న లబ్ధిదారునకు క్రమబద్ధీకరణ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రబబద్ధీకరణకు మీసేవ కేంద్రంలో దరఖాస్తులు పెట్టుకోవాలన్నారు. దరఖాస్తుతోపాటు భూమి అనుభవిస్తున్న లబ్ధిదారుడు ఆ భూమికి సంబంధించి గుర్తింపు పత్రాలను అందజేయాల్సి ఉంటుందన్నారు. మీసేవ కేంద్రంలో చేసుకున్న దరఖాస్తులు సంబంధిత తహశీల్దార్ లాగిన్‌లోకి వస్తుందని తెలిపారు. దరఖాస్తులను పరిశీలించడానికి ఒక కమిటీ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉంటుందని, ఆ కమిటీలో సభ్యులుగా జాయింట్ కలెక్టర్, సంబంధిత ఆర్‌డిఓ, తహశీల్దార్లు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. జిల్లాలో తెలుగుగంగ, సోమశిల ప్రాజెక్టు కాలువ నిర్మాణాలు జరుగుతున్నందున చుక్కల భూముల గురించి ప్రాముఖ్యత కలిగి ఉందన్నారు. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం భూముల్లో 11 1/2 శాతం భూములు చుక్కల భూములుగా ఉన్నట్లు గుర్తించినట్టు కలెక్టర్ తెలిపారు. ఆరు నెలల కాలంలో భూములను అనుభవిస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్నీ పరిశీలించిన తరువాత క్రమబద్ధీకరణ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం లక్షా 31 వేల 603 ఎకరాలు క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం ఉన్న భూములుగా గుర్తించటం జరిగిందన్నారు. జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ మాట్లాడుతూ, వంద గజాల స్థలం కలిగిన లబ్ధిదారులు క్రమబద్ధీకరణ చేయటానికి ప్రభుత్వం జిఓ జారీ చేసిందన్నారు. దాని ప్రకారం 2014 జనవరి 1వ తేదీకి ముందు తమ ఆధీనంలో ఉండి స్థలం అనుభవిస్తున్న లబ్ధిదారులకు క్రమబద్ధీకరణకు పై ఆధారాలు జత చేయాలన్నారు. ఈ ప్రక్రియ 120 రోజుల్లో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. విలేఖరులు అడిగిన పసుపు సమస్య గురించి కలెక్టర్ స్పందిస్తూ మొత్తం 1,211 మంది రైతులలో వాస్తవంగా 550 మంది రైతులు పసుపు పంట వేశారని గణాంకాలు తెలుపుతున్నాయని అన్నారు. వారికి ముందుగా నగదు అందేలా మార్క్‌ఫెడ్ సూచించినట్లు ఆయన వివరించారు. ఈ ప్రక్రియలో ఏ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమయముంటే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా మూడో వ్యక్తికి లావాదేవాలుంటే వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డుల గురించి జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో పది లక్షల భూ సమస్యలు గుర్తించామని ఆయన వివరించారు. ప్రతి గ్రీవెన్ సెల్‌లో కూడా 70 శాతం ప్రజలు పిటీషన్ రూపంలో భూసంబంధితమైన విషయాలను దరఖాస్తుల రూపంలో తమకు తెలియజేసుకుంటున్నారని తెలిపారు. ప్యూరిఫికేషన్ రికార్డులు పూర్తయితే భూసమస్యలు చాలావరకు తగ్గుతాయని అన్నారు. ప్యూరిఫికేషన్ రికార్డులు ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోపు పూర్తిచేయడానికి కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ముందుకుపోతున్నట్లు ఆయన తెలిపారు. సమస్యల పరిష్కారంలో సలహాలివ్వడానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని నియమించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. మరుగుదొడ్లు నిర్మాణాలు (ఓడిఎఫ్) గురించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అక్టోబర్ 2వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో ఓడిఎఫ్ కార్యక్రమం జిల్లాలో పూర్తిచేసే విధంగా సిఎం సూచనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 2 లక్షల 44 వేల 800 మరుగుదొడ్లు నిర్మాణం పూర్తిచేసినట్టు ఆయన తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా అక్టోబర్ 2 నాటికి నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో నూటికి నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేసి రాష్ట్ర ప్రభుత్వం ఓడిఎఫ్ జిల్లాలుగా ప్రకటించడం జరుగుతుందని ముత్యాలరాజు తెలిపారు.

పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహిద్దాం:ఆర్డీఓ
గూడూరు: జాతీయ పండుగ అయిన ఆగస్టు 15 స్వాతంత్య్ర వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని గూడూరు ఆర్డీవో పి అరుణ్‌బాబు కోరారు. గురువారం ఆయన స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో స్వాతంత్య్ర వేడుకల నిర్వహణపై సమీక్షించాచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాదిలా ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఒక్కో దానికి ఒక్కో కమిటీ వేసి వారికి వారివారి బాధ్యతలను అప్పగించారు. ప్రధానంగా ఈ వేడుకలను స్థానిక అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్న నేపథ్యంలో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కోరారు. ఈ వేడుకలను తిలకించడానికి వచ్చే ప్రజలు, విద్యార్థులకు నీడ కోసం షామియానాలను వేయాలన్నారు. అలాగే వర్షం వచ్చినా, ఎండ ఉన్నా వారికి సదుపాయాలు, నీళ్లవసతి కల్పించాలని సూచించారు. స్టేడియంలో తొక్కిసలాట జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్‌సిసి, పోలీసులచే మార్చ్ఫాస్ట్ నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే ఎమ్మెల్యే గౌరవవందనం స్వీకరిస్తారని అన్నారు. ముఖ్యంగా ఈ వేడుకల్లో పాల్గొనే విద్యార్థులు తప్పనిసరిగా దేశభక్తిని పెంపొందించే విధంగా నృత్య రూపకాలు, గేయాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఉండాలని, ఇందుకు సంబంధించి ఏఏ పాఠశాల ఏఏ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుందో జాబితా తయారుచేసుకొని ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ, పోలీస్, అగ్నిమాపక, పాఠశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.