కడప

దశలవారీగా ఒంటిమిట్ట కోదండ రామాలయం అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట:ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధిచెందుతున్న ఒంటిమిట్ట కోదండ రామాలయ అభివృద్ధికి దశల వారిగా శాశ్వత పనులు చేపడతామని టిటిడి ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్ అన్నారు. గురువారం మొట్టమొదటి సారిగా తన అధికార బృం దంతో ఇఓ కోదండ రామాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇఓకు అర్చకులు, టిడిపి నాయకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మధ్యరంగంలో కూర్చుని ఆలయ చరిత్రను తెలుసుకుని, అభివృద్ధి పనుల మ్యాప్‌లను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ తాను మొదటి సారిగా ఇక్కడకు రావడం జరిగిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు టిటిడిలో రామాలయం విలీనం అయ్యాక ఏర్పాటు చేసిన అభివృద్ధి మ్యాప్‌లకు బదులు కొత్త మ్యాప్‌లను రూపొందించి శాశ్విత పనులకు కృషి చేయాలని, అందుకు తగ్గ దశ, దిశలను టిటిడి అధికారులకు సూచించారు. వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి రూ. 15 కోట్లతో ఆలయానికి వంద మీటర్ల పైభాగంలో శాశ్విత పనులు చేపడతామన్నారు. ఈ పనులకు టెండర్లు త్వరలో పిలవనున్నట్లు చెప్పారు. ఇందులో మరుగుదొడ్లు, స్నానవాటికలు, పార్కు, టికెట్ కౌంటర్, శాశ్విత అలంకార మంటపం, మొబైల్ పార్కింగ్, మిలిగి పోయిన మాడ వీధుల పనులను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఆలయానికి ఈశాన్య భాగంలో ప్రత్యేక పుష్కరణి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అభివృద్ధికి అధికారులకు ప్రజలు సహకరించాలన్నారు. ఈ ఆలయంపై అధ్యయనం చేశాక మిగిలిన పనుల కోసం పురావస్తు శాఖకు ప్రతిపాదనలు పంపి శాశ్విత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అనంతరం మాడ వీధులు, పూరె్తైన అదనపు గదుల నిర్మాణం, కల్యాణ వేదికలను ఇఓ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జెఇఓ పోలా భాస్కర్, టిడిపి నాయకులు, టిటిడికి చెందిన అన్ని శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నదీ పరివాహక ప్రాంతాల కబ్జా!
ఆంధ్రభూమిబ్యూరో
కడప:జిల్లాలో కొన్ని శతాబ్దాల నుంచి నిత్యం వేసవి, వర్షాకాలం అనే తారతమ్యం లేకుండా జిల్లాలోని నదుల్లో నీరు గలగల పారేవి. తాగు, సాగునీటి కొరత ఉండేది కాదు. ప్రస్తుతం జిల్లాలో చిత్రావతి, చెయ్యేరు, బహుద, పాపాగ్ని, పెన్నానదులను ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న భూ బకాసురులు ఆక్రమించుకుని వాటిని సాగుచేసుకుంటూ చివరకు పట్టాదారు పాసుపుస్తకాలు కూడా సృష్టించుకుని యధేచ్చగా అమ్మకాలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. ఆ నదుల్లో గొట్టపుబావులు వేయడం ఏకంగా విద్యుత్ సరఫరా తీసుకుంటున్నా సంబంధిత అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం జరుగుతోంది. ఈ దురాక్రమణలో బాధ్యత ఉన్న అధికారులు కూడా నదులను ఆక్రమించుకున్నట్లు తెలుస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి భూ కబ్జాదారులు జై కొట్టి నదీ పరివాహక ప్రాంతాలను ఆక్రమించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఉన్న భూములతోపాటు మరికొన్ని భూములు కూడా ఆక్రమించుకుంటున్నారు. కొంతమంది ఈ భూముల నుంచి ఇసుక వ్యాపారం కూడా చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఇసుక తరలింపుతో భూగర్భజలాలు పూర్తిగా ఇంకిపోయి ఎడారిగా మారిపోయాయి. ఈ నదులకు మధ్యలో పెద్ద పెద్ద గోతులు, కుంటలు తరహాలో జెసిబితో తవ్వకాలు జరపడంతో వర్షపునీరు నిలబడినా ఇంకిపోతోంది. లింగాల దగ్గర చిత్రావతి, పాపాగ్ని చక్రాయపేట మండలం, బహుద రాయచోటి, సుండుపల్లి, చెయ్యేరు నందలూరు , పెన్నా చెన్నూరు, పరిసర ప్రాంతాల్లో నదులను ఆక్రమించుకోవడంతో నదుల రూపురేఖలే మారిపోయాయి. వర్షాకాలంలో భూగర్భజలాలు కూడా నిలిచే మార్గాలు కన్పించడంలేదు. ప్రస్తుతం ఆక్రమించుకున్న నదుల్లో పండ్లతోటలు, వరి , కూరగాయల తోటలు సాగుచేసుకుంటున్నారు. ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో వందలాది ఎకరాలు ఆక్రమించుకుని కబ్జా చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని దురాక్రమానికి గురైన నదీ పరివాహక ప్రాంతాలను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పరిహారం అవినీతిపై విచారణ నివేదిక సిద్ధం..!
* మరికొందరిపై వేటు పడే అవకాశం * నివేదికపై ఉత్కంఠ
జమ్మలమడుగు:గండికోట ప్రాజెక్టు ముంపు బాధిత పరిహారం పంపిణీలో చోటుచేసుకున్న అవినీతిపై జిల్లా కలెక్టర్ బాబూరావు నియమించిన అధికారుల బృందం నివేదిక దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. గండికోట ముంపు బాధితులకు ప్రభుత్వం గతేడాది రూ.479 కోట్లు విడుదల చేసింది. వందల కోట్ల రూపాయల పరిహారం పంపిణీలో అధికార యంత్రాంగం సరైన ప్రణాళికలు, నిబంధనలు లేకుండా పంపిణీ చేపట్టింది. ఇదే ఆసరాగా అప్పటి ఆర్డీవో కె.వినాయకం పలు రకాలుగా పరిహారం పంపిణీలో తన చేతివాటాన్ని ప్రదర్శించారు. సోషియో ఎకనమిక్ సర్వే(ఎస్‌ఈయస్) జాబితా బూచిని చూపిస్తూ పరిహారాన్ని ఆరగింపుకు తెరలేపారు. ఎస్‌ఈయస్‌లో తమ పేరు ఉందో లేదో కూడా కనుక్కోవడానికి స్థానిక నేతలు, దళారీలపై ప్రజలు ఆధారపడాల్సిన పరిస్థితికి అధికారులు తీసుకువచ్చారు. చేయితడపని వారికి చెక్కులను ఇవ్వడానికి తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదే విషయం పత్రికల్లో వరుస కథనాలు వచ్చినా, పరిహారం విషయంలో ఫిర్యాదులు వచ్చినా అప్పట్లో జిల్లా అధికారులు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆరోపణలు జిల్లా అధికారుల వరకు వెళ్లకుండా డివిజన్ పరిధిలోని ఆర్డీవో వినాయకం కొందరు తహశీల్దార్‌లతో విచారణ బృందం ఏర్పాటు చేసి విచారణ కూడా చేయించారు. అయితే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా సదరు విచారణ అధికారుల బృందాలు విచారణలు చేశాయి. విచారణ బృందాలు కూడా పరిహారాన్ని ఫలహారంగా తిన్న వారి నుండి భారీగా వసూళ్లకు తెరలేపినట్లు ఆరోపణలు బలంగా వచ్చాయి. తదనంతర కాలంలో ఆర్డీవో వినాయకంపై పరిహారం పంపిణీ కేంద్రాల వద్ద కడుపుమండిన బాధితులు దాడులకు దిగే పరిస్థితులు తలెత్తిన సంఘటనలకు దారితీయడంతో ప్రస్తుత జిల్లా కలెక్టర్ బాబూరావు నాయుడు సమస్యపై దృష్టి సారించారు. జాయింట్ కలెక్టర్-2 శివారెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు అధికారులతో కూడిన బృందం మూడు వారాలుగా పరిహారం పంపిణీపై పూర్తి స్థాయి విచారణ చేపట్టింది. వీరితో పాటు 9మంది డిప్యూటి కలెక్టర్ల పర్యవేక్షణలో పంపిణీ వివరాలను రికార్డు చేసినట్లు సమాచారం. గండికోట పరిహారం పంపిణీ విషయంలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్డీవో వినాయకంను ఇప్పటికే జిల్లా కలెక్టర్ బాబూరావు నాయుడు ప్రభుత్వానికి సరెండర్ చేసిన విషయం విదితమే. సోసియో ఎకనమిక్ సర్వే జాబితాలో ఎడిట్ ఆప్షన్ ద్వారా ఇష్టారాజ్యంగా పరిహారానికి సంబంధం లేని వ్యక్తులు, అర్హత లేని వారికి, ఆధార్ కార్డుల్లో చిన్న చిన్న మార్పులు ద్వారా ఒకే వ్యక్తి రెండు మూడు చోట్ల పరిహారం పొందడం, ముఖ్యంగా చెక్కుల తీసుకోవడానికి ఆధార్ ఆధారమే అయినా ఆలశ్యం బూచిగా చూపిస్తూ వేలి ముద్రలు లేకుండా చెక్కుల పంపిణీ చేయడం వంటి పలు లొసుగులతో పరిహారం పంపిణీని అధికారగణం దళారీల సాయంతో ఇష్టారాజ్యంగా మేసింది. ప్రస్తుతం విచారణ బృందం బోగస్ పత్రాల ధృవీకరణపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పరిహారం పంపిణీకి సంబంధించి పలు ఫైళ్లు మాయం అయినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇప్పటికే పరిహారం అవినీతిపై విచారణ దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. పూర్తిస్థాయి నివేదిక జిల్లా కలెక్టర్‌కు చేరితే మరి కొందరు తహశీల్దార్‌లపై వేటు పడే అవకాశం ఉన్నట్లు రెవెన్యూ వర్గాల్లో వినిపిస్తోంది.

పింఛా ప్రాజెక్టు నుండి నీరు వృథా!
సుండుపల్లె: కడప, చిత్తూరు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన పింఛా సమీపంలో నిర్మించిన యర్రపురెడ్డి ఆదినారాయణరెడ్డి పింఛా ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టు గేట్ల నుండి నీళ్లు వృథాగా ఏటిలోకి వెళ్తోంది. 9వ తేదీ అర్ధరాత్రి నుండి గురువారం ఉదయం 9 గంటల వరకు భారీగా వర్షం కురిసింది. ప్రాజెక్టులోకి వర్షం నీరు చేరడం జరిగింది. అయినా ఆ నీరు ఎక్కువ సేపు నిలువలేదు. 3వ గేటు వద్ద ఉన్న చైను విరగడంతో గేటు నుండి వృధా అధికమవుతుండటంతో స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలాది మంది రైతుల వరప్రసాదిని వందల కుటుంబాల కడుపు నింపే పింఛా ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారిందని తెలుస్తోంది. శాశ్వత మరమ్మతుల కోసం అనేకమార్లు నివేదికలు పంపినా ఫలితం లేదని పింఛా సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే నెల రోజుల క్రితం వంద కోట్ల రూపాయల నిధులతో పింఛాకు మరమ్మతులు చేయించాలని మంజూరైనట్లు తెలిసింది. కానీ ప్రభుత్వం టెండర్లకు పిలిచి పనులు ప్రారంభించే ఊసే ఎత్తడం లేదని రైతులు ఆందోళనలో ఉన్నారు. శాశ్వత మరమ్మతులు కలేనా అని ప్రస్తుతం 3వ గేటు నుండి వృథా అవుతున్న నీటిని ఆపకపోతే పింఛా ఖాళీ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. చుక్కనీరు లేక భూగర్భ జలాలు ఎం డిపోయి రైతులు అష్టకష్టాలు పడుతు ంటే పింఛాలోకి చేరుతున్న వర్షం నీ టిని అధికారులు నిలుపుకోలేకపోతున్నారు. నీరు ఖాళీ అయి తే ఇప్పటికే బోరు బావుల్లో నీరు లే దు. తాగునీరు కూడా లేకుండా పోతాయని పింఛా దిగువ గ్రామాల రైతులు, ప్రజలు చెప్పుకుంటున్నారు. జిల్లా సర్వోన్నత అధికారి కలెక్టర్ బాబురావునాయుడు వెంటనే స్పందించకపోతే పింఛా దిగువ ప్రాంతాల రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆయకట్టుదారులు చెబుతున్నారు. పింఛాకు మోక్షం వస్తుందని పలువురు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కలెక్టర్ స్పందించి వెంటనే పింఛాలో వృథా అయ్యే నీటిని ఆపాలని రైతులు కోరుకుంటున్నారు.

వెలిగల్లులో విజృంభించిన విషజ్వరాలు
* చికిత్స కోసం పట్టణాలకు పరుగులు
గాలివీడు:మండలంలోని వెలిగల్లు గ్రామం పునరావాస కాలనీలో పలువురికి విషజ్వరాలు విజృంభించాయని మాజీ వక్ఫ్‌బోర్డు డైరెక్టర్ మహబూబ్‌బాషా ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన వెలిగల్లులో ఆయన మాట్లాడుతూ వలసల ఆంజనేయులు కుమారుడు పండు(7) అనే బాలునికి వారం రోజులుగా జ్వరం తీవ్రమై డెంగ్యూ జ్వరంగా మారడంతో మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. బండి మహమ్మద్(42) జవహర్‌లాల్‌నాయక్(40), ప్రమీలమ్మలకు జ్వరం తీవ్రంగా మారింది. డీలర్ బాషా భార్య మెహతాజ్‌కు విషజ్వరం సోకడంతో ఈమెను వైద్యచికిత్సల నిమిత్తం అనంతపురం జిల్లా కదిరికి తరలించారు. ఇలా ఎందరో జ్వరాల బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని మహబూబ్‌బాషా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ మందులు అందిస్తున్నా రోగాలు కంట్రోల్ కావడం లేదని ఆయన పేర్కొంటున్నారు. వెంటనే వైద్యాధికారులు వెలిగల్లు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి రోగులకు మెరుగైన వైద్యచికిత్సలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గండికోట ఉత్సవం... ప్రభుత్వం సానుకూలం
* రూ.2కోట్లు కేటాయింపు * ఉత్సవాల కేలండర్‌లో గండికోటకు స్థానం
జమ్మలమడుగు: చారిత్రాత్మక గండికోట వారసత్వ ఉత్సవంపై ప్రభుత్వం ఎట్టకేలకు సానుకూలంగా చర్యలకుపక్రమించింది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంనకు గాను రూ.2కోట్లు గండికోట వారసత్వ ఉత్సవాల నిర్వహణకు నిధులు మంజూరు చేయడం హర్షనీయాంశం. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళిక కేలండర్‌కు గండికోటకు స్థానం కల్పించడం విశేషం. వీటిపై స్పష్టతను ఇస్తూ జిఓఆర్‌టి నెంబరు 269, తేది.8.8.2017 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీని ప్రకారం 2018 జనవరి మాసంలో 21నుండి 23వరకు మూడు రోజుల పాటు వారసత్వ ఉత్సవాల నిర్వహణకు విన్సన్ గ్రాఫిక్స్ సంస్థకు అప్పగించింది. ఉత్సవాల నిర్వహణ స్థానిక పరిస్థితుల దృష్ట్యా నిర్ణయించుకునేందుకు వెసలుబాటు కల్పించింది. గండికోట చారిత్రకతపై ఎంతో కాలం నుండి పలు వర్గాల నుండి అభివృద్దికై వినతులు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే గత ఐదేళ్ల నుండి స్థానిక ప్రజల నుండి వినతులు, మీడియా కథనాలు భారీ ఎత్తున జరిగింది. దీంతో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గండికోట అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే 2015 ఆగష్టులో గండికోట వారసత్వ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఉత్సవాల అనంతరం గండికోటలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించి గండికోటకు ప్రపంచస్థాయి ఖ్యాతి గుర్తింపు తెచ్చేందుకు కృషిచేస్తామని తెలిపారు. అలాగే ప్రతి ఏటా గండికోట ఖ్యాతిని ఇనుమడింపజేసేలా ఏటా గండికోట వారసత్వ ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. 2016 ఉత్సవాలు పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చి 2017 ఫిబ్రవరి 18, 19తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించారు. మూడోసారి 2018 జనవరిలో నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలకుపక్రమించింది. ఇప్పటికే గండికోట దుర్గం అభివృద్దిపై దృష్టి సారించిన ప్రభుత్వం ఏజెన్సీల ద్వారా సర్వేలు కూడా చేపట్టింది. జిల్లా కలెక్టర్ బాబూరావు నాయుడు గండికోట దుర్గంలోనే బసచేసి చేపట్టాల్సిన అభివృద్ది పనులపై అధికారయంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. దీంతో గండికోట దుర్గం భవిష్యత్తులో ప్రపంచస్థాయి టూరిజం హబ్‌గా పర్యాటకులను అలరించే అవకాశం ఉందని పలువురు పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చెరువుల అభివృద్ధే ధ్యేయం
* మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి
కమలాపురం: చెరువుల అభివృద్దే ద్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ ఎమ్మెల్సీ,నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్ పుత్తా నరసింహారెడ్డి అన్నారు. ఆయన గురువారం మండలంలోని మీరాపురం చెక్‌డ్యాం,అప్పారావుపల్లె కాలువ,తిప్పలూరు సమీపంలోని చెక్‌డ్యాంలను పరిశీలించారు. మంగళవారం రాత్రి కురిసిన భారీవర్షం ఫలితంగా ఇటీవల మీరాపురం సమీపంలో రు.20లక్షలతో చేపట్టిన చెక్‌డ్యాం కు పెద్ద ఎత్తున నీరు చేరుకుంది. దీంతో అక్కడిగ్రామస్థులు హర్షాతిరేకం వ్యక్తంచేస్తున్నారు. తమ గ్రామాల్లోని 120 ఎకరాలు సాగు చేసుకునేందుకు నీరు సంవృద్దిగా ఉందని గ్రామస్థులు పుత్తా నరసింహారెడ్డికి తెలియచేసి సంతోషం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన నీటి పారుదల శాఖ డి ఈ రాజ, ఏ ఈ రవి,క్వాలిటీ కంట్రోల్ ఇంజనీరింగ్ డి ఈ వెంకటరాముడు, ఏ ఈ వెంకటరామయ్యలతో పుత్తా నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రస్థుతమున్న చెక్‌డ్యా ం ఎత్తును మరింతగా పెంచి అదికంగా నీరు నిల్వ ఉండేలా ప్రతిపాదనలు సిద్దం చేయాలని కోరారు. ఇందువల్ల ఈ ప్రాంతంలో మరింత భూమి సాగుకు అనుకూలంగా మారగలదన్నారు. అలాగే అప్పారావుపల్లె వద్ద నిర్మాణంలో ఉన్న చెక్‌డ్యాం కాలువపనులు పరిశీలించారు. ఐతే వర్షం ధాటికి కాలువ కు చెందిన కట్టలు తెగిపోయి నీరు పొలాల్లోకి వృధాగాపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పనులను కూడా వేగవంతం చేసి ఈ మారు కురిసే వర్షపునీటిని కమలాపురం చెరువుకు వెళ్లే కట్టుకొమ్మలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని,తారురోడ్డు క్రాస్ అయ్యేచోటు కల్వర్ట్ కూడా నిర్మించాలని ఇంజనీరింగ్ అదికారులను ఆయన కోరారు. ఇందుకు సంబందించిన ప్రతిపాదనలను అధికారులు సిద్దం చేసి కలెక్టర్‌కు పంపాలన్నారు. అలాగే తిప్పలూరు వద్ద నిర్మాణంలో ఉన్న చెక్‌డ్యాం కాలువపనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇందువల్ల వంకలో నుంచి వచ్చేనీరు కమలాపురం చెరువుకు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని అదికారులను కోరారు. నీరు-చెట్టు పధకానికి చెందిన అవసరమైన నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరిన మేరకు మంజూరు చేసారన్నారు. నియోజకవర్గంలో 150కోట్లతో కమలాపురం, వల్లూరు, పెండ్లిమర్రి,సికెదినె్న మండలాల్లో చెరువుల అభివృద్ది,అధునాతనసాంకేతిక పరిజ్ఞానంతో చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నా రన్నారు. ఈ పనులన్ని కూడా త్వరితగతిన పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వర్షాలు బాగాకురిసి పాపాగ్నినదికి నీరు వచ్చిన తక్షణమే గొలుసుచెరువుకట్టలకు నీరు సమృద్దిగా అందుతాయన్నారు. ఇందువల్ల వేలాది ఎకరాల ఆయకట్టు అభివృద్ది చెంది రైతులు అర్థికంగా స్థిరపడతారన్నారు. ఆయన వెంట టిడిపి నేతలు సుబ్బారెడ్డి,వాసుదేవరెడ్డి,చెన్నకృష్ణారెడ్డి,కమలాపురం చెరువు అబివృద్ది సంఘం అధ్యక్షుడు ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు.
రాజంపేట డివిజన్‌లో భారీ వర్షం
* వర్షం నీటిలో ప్రధాన మార్కెట్, మండల కేంద్రం పెనగలూరు వీధులు
రాజంపేట: రాజంపేట డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం నమోదైంది. భారీ వర్షం కోసం ఎదురుచూపులు చూస్తున్న ఇక్కడి ఆయకట్టు రైతాంగం ఈ భారీ వర్షంతో కొంతవరకు సేద తీరారని చెప్పవచ్చు. గత రెండు రోజులుగా ఈ డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో భారీ వర్షం నమోదవ్వడం కొంతవరకు ఆయకట్టు రైతాంగాన్ని ఊరట నిస్తుంది. ఈ ఏడాది ఖరీఫ్ పంటను పండించుకోలేక పోయిన ఇక్కడి రైతాంగం రాబోయే రబీ పంటపై నమ్మకాలు పెట్టుకొని ఉన్నారు. ఈ డివిజన్ పరిధిలో సాధారణంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో భారీ వర్షాలు నమోదవుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా ఇవే పరిస్థితులు కొనసాగి ఇక్కడి చెరువులకు, మడుగులకు పూర్తిస్థాయి సాగునీరు చేరుతుందని గంపెడాశలు పెట్టుకుని ఆయకట్టు రైతాంగం ఎదురుచూపులు చూస్తున్నారు. కాగా భారీ వర్షం పడడంతో రాజంపేట ప్రధాన మార్కెట్ మొత్తం వర్షపునీటి మడుగులా మారిది. దీనికి తోడు వృథా కూరగాయలు, ఆకుకూరలు పడేయడంతో ఏర్పడిన పారిశుద్ధ్యలోపం తోడై దుర్వాసన వెలువడుతున్నది. మార్కెట్ మొత్తం వర్షనీటి మడుగులా మారడంతో వర్షపునీటి మడుగులోనే కూరగాయల వ్యాపారస్తులు తమ గంపలను ఉంచుకుని వ్యాపారాలు కొనసాగించారు. ఇవే పరిస్థితులు పట్టణంలోని పలు వీధులు, పలు మండల కేంద్రాల్లో కూడా కనిపించింది. అయితే బావులు, బోర్ల క్రింది రైతాంగంతో పాటు వాణిజ్య పంటల రైతాంగం ప్రయోజనాలు మెరుగుపడేందుకు కొంతవరకు తోడ్పడనుంది. భారీ వర్షం గత రెండు రోజులు డివిజన్ పరిధిలో కురవడంతో రానున్న రోజుల్లో భారీ వర్షాలు నమోదై తమ కష్టాలు తీరతాయన్న ఆయకట్టు రైతుల నమ్మకం నెరవేరాలని ఆశిద్ధాం. కాగా రాజంపేట ప్రాంతంలో గత రెండురోజులుగా భారీ వర్షం కురుస్తున్నా చెరువుల్లోకి నీరు చేరని పరిస్థితి ఆయకట్టు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. భారీ వర్షం నమోదవుతున్నా ఆయకట్టు రైతుల ప్రయోజనాలకు ఏ మాత్రం ఉపయోగపడకపోవడం దురదృష్టకరం. వర్షపునీరు చెరువుల్లో గుంతలకే పరిమితమవుతున్నాయి. భారీ వర్షం పడుతున్నా డివిజన్‌లో ఏ చెరువుకు నీరు చేరడం లేదు. మరో రెండురోజులు ఇదే విధంగా భారీ వర్షం నిరాఘాటంగా నమోదైతే కాని చెరువులకు నీరు తీసుకొచ్చే కాలువల ద్వారా చెరువుల్లోకి సాగునీరు చేరదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తరచూ వర్షాలు పడుతున్నప్పటికి భారీ వర్షాలు నిరాఘాటంగా నమోదు కానందువల్ల ఈ దుస్థితి నెలకొంది. దీంతో ఆయకట్టు భూములు బీడుగా మారి ఉన్నాయి. భారీ వర్షం కారణంగా పట్టణమంతా బురదమయంగా మారిపోయింది. చెరువులకు నీరు తీసుకొచ్చే కాలువల్లో చెత్తా చెదారం పేరుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయకట్టు రైతుల నుండి ఇరిగేషన్ శాఖాధికారులకు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి భారీ వర్షం కారణంగా రాజంపేట పట్టణంలో ఎక్కడ చూసినా అపరిశుభ్రత కారణంగా దుర్వాసన వెలువడుతోంది. కాలువల్లో చెత్తా చెదారం పడేస్తుండడం వల్ల మురికినీరు సక్రమంగా పారక భారీ వర్షంతో కాలువలు పొంగి వీధుల్లో రోడ్లపైకి మురికి నీరు వచ్చి చేరుకుంటూ దుర్వాసనకు కారణమవుతోంది.