నిజామాబాద్

పోచంపాడ్ సభకు పోటెత్తిన జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకం శంకుస్థాపనకు హాజరైన సందర్భంగా పోచంపాడ్‌లో గురువారం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. సిఎం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమతమ నియోజకవర్గాల్లో గత వారం రోజుల నుండే జన సమీకరణ కోసం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. సుమారు ఐదు లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా నిర్దేశించుకుని తెరాస శ్రేణులు ఎవరికివారు తమవంతు ప్రయత్నాలు సాగించారు. పాత జిల్లాలైన నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌తో పాటు నల్గొండ, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి తదితర జిల్లాల నుండి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలను పోచంపాడ్ సభకు తరలించారు. సుమారు 3500వరకు ఆర్టీసీ బస్సులే కాకుండా ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన వందలాది వాహనాలను ఇందుకోసం వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వాహనాల రద్దీ విపరీతంగా ఏర్పడి ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. సభాస్థలి అయిన పోచంపాడ్ నుండి మొదలుకుని సుమారు 15కిలోమీటర్ల మేర బాల్కొండ వరకు వేలాది వాహనాలు ఎక్కడికక్కడే గంటల తరబడి నిలిచిపోయాయి. బుధవారం సాయంత్రం ఇక్కడికి చేరుకుని స్థానికంగానే బస చేసిన సిఎం కెసిఆర్, గురువారం ఉదయం 11.30గంటల సమయంలో పునరుజ్జీవ పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన గెస్ట్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం 1.10గంటలకు బహిరంగ సభా స్థలికి చేరుకోవాల్సి ఉండగా, గంట ఆలస్యంగా సభా ప్రాంగణం వద్దకు వచ్చారు. అప్పటికే సభాస్థలి వద్దకు సుమారు లక్ష మంది వరకు చేరుకుని సభా ప్రాంగణం కిక్కిరిసి కనిపించింది. అయితే వరంగల్, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి తదితర దూర ప్రాంతాల నుండి తరలివస్తున్న వాహనాలన్నీ ఒకే సమయానికి చేరుకోవడంతో పెర్కిట్ నుండి మొదలుకుని పోచంపాడ్ వరకు వాహనాలు ఎక్కడికక్కడ చిక్కుబడిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కనీసం ద్విచక్ర వాహనాలు సైతం ముందుకు వెళ్లలేని రీతిలో ట్రాఫిక్ జామ్ కావడంతో ఆయా వాహనాల్లో వచ్చిన వారంతా గంటల తరబడి ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. భారీ సంఖ్యలో పోలీసులను నియమించినప్పటికీ, వేలాదిగా ఉన్న వాహనాలను క్రమబద్ధీకరించే పరిస్థితి లేక పోలీసులు సైతం నిశే్చష్టులుగా దిక్కులు చూస్తూ ఉండిపోయారు. చివరకు బహిరంగ సభలో పాల్గొనేందుకు హాజరవుతున్న క్రమంలో రాష్ట్ర ఐ.టి శాఖ మంత్రి కె.తారకరామారావు కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సి వచ్చింది. అతికష్టం మీద ఆయన పోచంపాడ్ ఎక్స్‌రోడ్డు వరకు చేరుకున్నప్పటికీ, అక్కడి నుండి ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనాల రద్దీని తప్పించుకుని ముందుకు వెళ్లే అవకాశం లేకపోవడం వల్ల సభా ప్రాంగణానికి వెళ్లకుండానే వెనుదిరిగారు. ట్రాఫిక్ స్తంభించిన సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ తన ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, తన ప్రసంగాన్ని 20నిమిషాల్లోపే ముగించుకుని ఒకింత అసంతృప్తితో తిరుగు ప్రయాణం అయ్యారు. నిజానికి పోచంపాడ్ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు పురమాయించారు. అందరినీ సమన్వయపరుస్తూ ఏర్పాట్లను చక్కబెట్టాల్సిందిగా మంత్రి ఈటెలను ఆదేశించగా, స్థానిక మంత్రి పోచారంతో పాటు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు గత వారం రోజుల నుండే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. లక్షలాదిగా జనం తరలిరానున్నందున ట్రాఫిక్‌కు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని, పోలీసు అధికారులను పదేపదే సూచిస్తూ వచ్చారు. అయినప్పటికీ ట్రాఫిక్ ఏర్పాట్ల విషయంలో సరైన చర్యలు చేపట్టని కారణంగా వేలాది వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడం సిఎం సభలో జన సమీకరణపై ప్రభావం కనబర్చింది. ఆశించిన స్థాయిలోనే సుదూర ప్రాంతాల నుండి ప్రజలు తరలివచ్చినప్పటికీ, వారిని సభాస్థలి వరకు తరలించడంలో విఫలం కావడం తెరాస శ్రేణులను ఒకింత నిరుత్సాహానికి గురి చేసింది.

కెసిఆర్ భావోద్వేగం
ఎస్సారెస్పీతో అనుబంధాన్ని నెమరువేసుకున్న సిఎం
నిజామాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకుని ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం శంకుస్థాపన కోసం ఒకరోజు ముందుగానే బుధవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా పోచంపాడ్‌కు చేరుకున్న సిఎం కెసిఆర్ స్థానికంగా బస చేశారు. గురువారం ఉదయం నిర్ణయించిన ముహూర్త సమయానికి ఉదయం 11.30గంటల సమయంలో భూమిపూజ చేసి శంకుస్థాపన పైలాన్‌ను ఆవిష్కరించారు. ప్రాజెక్టు దిగువన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ఎస్సారెస్పీతో ముడిపడి ఉన్న గతస్మృతులను గుర్తు చేసుకున్నారు. 1996లో నిర్మల్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక సమయంలో అప్పటి అభ్యర్థి వేణుగోపాలచారికి మద్దతుగా ప్రచారం కోసం వచ్చిన తాను, ప్రస్తుత ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ శోభ భర్త సత్యనారాయణతో కలిసి ఎస్సారెస్పీ డ్యాంను సందర్శించానని కెసిఆర్ గుర్తు చేసుకున్నారు. ఎలాంటి మరమ్మతులు లేకుండా దైన్య స్థితిలో కనిపించిన ఈ ప్రాజెక్టును చూసి ఆ సమయంలోనే తాను ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైతే తప్ప ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యపడదంటూ పేర్కొనడం జరిగిందని, తనకు ఆయుష్షు ఉండి ఆరోగ్యం సహకరిస్తే తానే తెలంగాణ ఉద్యమాన్ని మరోమారు ప్రారంభించి, తుది వరకు తీసుకెళ్తానని ఇదే ఎస్సారెస్పీ డ్యాం పైన పేర్కొన్నానని అన్నారు. ఆనాడు తాను చెప్పినట్టుగానే దాదాపు 15సంవత్సరాల పాటు అనేక త్యాగాలు, పోరాటాలతో తెలంగాణను సాధించుకున్నామని, తెలంగాణ బిడ్డగా తాను ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పనులకు శంకుస్థాపన చేయడంతో తన జన్మ ధన్యమైందని, తన అంత అదృష్టవంతులు ఎవరూ లేరని భావిస్తున్నానని సిఎం కెసిఆర్ ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు.
ఎస్సారెస్పీని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతాం
నిజామాబాద్ జిల్లా పోచంపాడ్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టును పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని, స్థానికంగా సినిమా షూటింగ్‌లు సైతం జరిగేలా అన్ని హంగులను సమకూరుస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం చేపడుతున్న పునరుజ్జీవ పథకంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఏడాది పొడుగునా నీటి నిల్వలు అందుబాటులో ఉంటాయని, తద్వారా ఇక్కడి నుండి లాంచీలలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరను భక్తులు సందర్శించేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. సిఎం హామీతో స్థానికుల్లో తీవ్ర హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

సిఎం సభలో కలకలం
సిఎం ప్రసంగిస్తుండగానే కటౌట్ ఎక్కిన సర్పంచ్ భర్త
బాల్కొండ/ఆర్మూర్: మెండోరా మండలం పోచంపాడ్‌లో గురువారం ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొన్న బహిరంగ సభలో సర్పంచ్ భర్త కటౌట్ ఎక్కి కలకలం సృష్టించారు. సిఎం కెసిఆర్ ప్రసంగిస్తుండగానే సభా ప్రాంగణానికి పక్కనే ఉన్న సిఎం కటౌట్‌పై నిర్మల్ జిల్లా కడెం మండలం గంగపూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ ఆరేపల్లి శాంత భర్త చంద్రవాస్ ఎక్కారు. కటౌట్‌పైకి ఎక్కిన సర్పంచ్ భర్త అక్కడి నుంచి వినతిపత్రంతో పాటు సంబంధిత కాగితాలను ముఖ్యమంత్రి కెసిఆర్‌కు చూపిస్తూ సైగ చేయడానికి యత్నించినా ఫలితం లేకుండా పోయింది. సిఎం కెసిఆర్ ప్రసంగం ముగించుకొని సభా స్థలి నుంచి వెళ్లిపోయారు. ఆ వెంటనే ఇద్దరు కానిస్టేబుళ్లు కటౌట్‌పైకి ఎక్కి సర్పంచ్ భర్త చంద్రవాస్‌ను కిందకు దించే ప్రయత్నం చేశారు. అయినప్పటికి చంద్రవాస్ తన డిమాండ్‌ను పరిష్కరించే వరకు కిందకు దిగనంటూ కొద్దిసేపు కానిస్టేబుళ్లతో వాదనకు దిగాడు. దీనిని గమనించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తీకేయ అక్కడికి వచ్చి సర్పంచ్ భర్తతో మాట్లాడానికి ప్రయత్నించారు. ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని హితవు పలికారు. ఆ తర్వాత కటౌట్‌పైకి ఎక్కిన చంద్రవాస్ కిందకు దిగడంతో అతని డిమాండ్‌ను సిపి కార్తీకేయ అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామమైన గంగపూర్ నుంచి సోమార్‌పేట్‌కు మధ్య ఒక వాగు ఉందని, దానిపై బ్రిడ్జి నిర్మించి రాకపోకలు కల్పించాలని కొన్ని సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులకు చెప్తూ వస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మంత్రి హరీష్‌రావును సైతం కలిసి సమస్యను విన్నవించానని, స్థానిక ఎమ్మెల్యే రేఖానాయక్ దృష్టికి సైతం ఈ సమస్యను తీసుకెళ్లానని వివరించారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో పోచంపాడ్‌కు వస్తున్న సిఎం కెసిఆర్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లాలన్న ఆలోచనతో తాను కటౌట్‌ను ఎక్కినట్లు చంద్రవాస్ పేర్కొన్నారు. అదే సందర్భంలో పోచంపాడ్ గ్రామానికి చెందిన విజయలక్ష్మీ అనే యువతి తన కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇంటిని మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ చంద్రవాస్‌ను అనుసరిస్తూ ఆమె కూడా కటౌట్ ఎక్కింది. పోలీసులు ఆమెను కూడా సముదాయించి సురక్షితంగా కిందికి దించారు. దాదాపు 30అడుగుల ఎత్తుతో ఉన్న కటౌట్ పై భాగం వరకు చేరుకున్న వీరు అక్కడి నుండి కిందకు దూకితే పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని భావించిన పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా కటౌట్ చుట్టూ కార్పెట్లు పట్టుకుని సిద్ధంగా నిల్చున్నారు. అయితే కమిషనర్ కార్తికేయ జోక్యంతో కటౌట్ ఎక్కిన వారు సురక్షితంగా కిందకు దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సిఎం సభకు వస్తూ రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
ఆర్మూర్: ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం శంకుస్థాపన సందర్భంగా గురువారం పోచంపాడ్‌లో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ సభలో పాల్గొనేందుకు హాజరవుతున్న సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గిరిజన రైతు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆర్మూర్ మండలం అంకాపూర్ సమీపంలో చోటుచేసుకుంది. సిఎం సభలో పాల్గొనేందుకు బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలం నుండి రైతులు ఆర్టీసీ బస్సులో పోచంపాడ్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో అంకాపూర్ సమీపంలో వారు బస్సును నిలిపి, కొంతమంది మూత్రవిసర్జన కోసం కిందకు దిగారు. వారు రోడ్డు పక్కకు వెళ్తున్న క్రమంలోనే, ఆర్మూర్ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ వెనుక చక్రాలు ఊడిపోయి అతివేగంగా వచ్చి మూత్రవిసర్జన కోసం వెళ్తున్న వారికి తగిలాయి. దీంతో శంకోరా గ్రామానికి చెందిన మలావత్ చందర్(57) అనే గిరిజన రైతుతో పాటు గుగులోత్ శంకర్, మాశ్నయ్య, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అనుకోని రీతిలో సంభవించిన ఈ ప్రమాదంతో ఒకింత దిగ్భ్రాంతికి గురైన తోటి రైతులు క్షతగాత్రులను హుటాహుటిన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్రంగా రక్తస్రావం కావడంతో మలావత్ చందర్ చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే మృతి చెందాడు. అతని తల, ముఖం, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలవడంతో ప్రాణాలు కోల్పోయాడు. మిగతా ముగ్గురు క్షతగాత్రులకు చికిత్సలు అందిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో పాటు మృతుడి కుటుంబీకులను పరామర్శించారు. మృతుడు చందర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, అతని కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని మంత్రి పోచారం ప్రకటించారు.

సిఎం సభకు వచ్చి ఎస్సారెస్పీని సందర్శించిన జనం
ఆర్మూర్/బాల్కొండ: నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్‌లో గురువారం నిర్వహించిన ముఖ్యమంత్రి కెసిఆర్ బహిరంగ సభలో పాల్గొనేందుకు తరలివచ్చిన వారంతా శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించడంతో ఎస్సారెస్పీ జన సందోహంతో కిటకిటలాడింది. ట్రాఫిక్ అవాంతరాల కారణంగా సిఎం సభలో పాల్గొనలేకపోయిన వేలాది మంది దాదాపు ఐదారు కిలోమీటర్ల మేర కాలినడకన ఎస్సారెస్పీ వద్దకు చేరుకుని డ్యాం అందాలను తిలకించారు. సిఎం సభలో పాల్గొనలేకపోయినా, పోచంపాడ్ అందాలను ఆస్వాదించగలిగామని పలువురు ఊరట చెందారు. గోదావరి నదిపై నిర్మించిన ఏకైక భారీ ప్రాజెక్టుగా విరాజిల్లుతున్న ఎస్సారెస్పీ ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలు లబ్ధి పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ ప్రాంతానికి లక్షలాది ఎకరాల పంటలకు సాగు జలాలను అందించే ఈ భారీ ప్రాజెక్టును సందర్శించాలనే కోరికతో అనేక మంది కరీంనగర్, వరంగల్, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి తదితర సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చారు. ఒక్కసారిగా వేలాది వాహనాలు రావడంతో ట్రాఫిక్ జామ్ అయినందున వేలాది మంది గంటల తరబడి ఎక్కడికక్కడ చిక్కుబడిపోవాల్సి వచ్చింది. అయినప్పటికీ డ్యాంను సందర్శించాలనే బలీయమైన కోర్కెతో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా కిలోమీటర్ల కొద్ది కాలినడకన, మరికొందరు పరుగులు పెడుతూ ఎస్సారెస్పీ ప్రాజెక్టు వైపు దూసుకెళ్లారు. సిఎం సభ మధ్యాహ్నం మూడు గంటల సమయానికే ముగియడంతో, సభా ప్రాంగణంలో ఉన్న వారు తిరుగు ప్రయాణం అవుతుండగా, సభ కొనసాగిన సమయానికి చేరుకోలేక ట్రాఫిక్‌లో చిక్కుబడిపోయిన వారంతా ఎలాగూ ఇంత దూరం వచ్చాం...కనీసం ప్రాజెక్టును అయినా చూసి వెళ్తే సంతృప్తి మిగులుతుందని ఎస్సారెస్పీ వైపు తరలిరావడంతో పోచంపాడ్ డ్యాం మార్గమంతా జన సందోహంతో కిక్కిరిసి కనిపించింది. ఎస్సారెస్పీలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వరద ప్రవాహం చేరుకోక కేవలం 8టిఎంసిల నీటి నిల్వలతో బోసిపోయి ఉన్నప్పటికీ, ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా ఉన్న ఈ ప్రాజెక్టును తిలకించాలనే ఆకాంక్ష ప్రజల నుండి బలంగా వ్యక్తమైంది.

కలెక్టరేట్ ముట్టడి
వినాయక్‌నగర్: ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ గురువారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు ఎం.గంగాధర్ మాట్లాడుతూ, ఎన్నికల్లో మాదిగ, మాదిగ ఉప కులాల ఓట్లను దండుకునేందుకు కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వాలు వర్గీకరణ బిల్లును ఆమోదింపజేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయానికి గురవుతున్న మాదిగ, మాదిగ ఉప కులాలు గత ఎన్నికల్లో బిజెపి, టిఆర్‌ఎస్ పార్టీలకు ఓటు వేసి గెలిపించడం జరిగిందన్నారు. ఈ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా, ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని అనేక సంవత్సరాలుగా ఆందోళనలు, పోరాటం చేస్తున్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగ, మాదిగ ఉపకులాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ స్పందించి, పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం డిఆర్‌ఓను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఆరోగ్యంగా ఉంటేనే విద్యలో రాణింపు
* కలెక్టర్ సత్యనారాయణ
ఆంధ్రభూమి బ్యూరో
కామారెడ్డి: విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే విద్యలో రాణిస్తారని జిల్లా కలెక్టర్ డాక్టర్. సత్యనారాయణ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని హరిజనవాడ జెడ్పీ బాలికల పాఠశాలలో నూలిపురుగుల నివారణ మందుల మాత్రల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని విద్యార్థినులకు నూలిపురుగుల నివారణ మాత్రలు అందచేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం రెండుసార్లు ఫిబ్రవరి 10వ తేదిరోజు పిల్లలకు నూలిపురుగుల నివారణ (అల్భెండజోబుల్) మాత్రలు వేయాలని అన్నారు. నూలి పురుగుల వల్ల పిల్లలు రక్తహీనతకు గురిఅవుతున్నారని, తద్వారా బలంగా ఎదగకపోవడం వల్ల చదువుల్ల రాణించడం కష్టంగా మారుతోందని అన్నారు. నులిపురుగుల వల్ల ఎత ఆహారం తీసుకున్న శరీరానికి సగం మాత్రం అందుతోందని, నూలిపురుగుల నివారణ మాత్రలు తప్పనిసరిగా వేసుకుంటే సమస్య తీరిపోతోందని అన్నారు. మంచి పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉన్ననాడు విద్యార్థులు అనుకున్న గోల్ సాధిస్తారని అన్నారు. అందుకే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారని, ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసమే ఈ నూలిపురుగునివారణ మాత్రలు ఉచితంగా అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యశాఖ అధికారి మదన్‌మోహన్, జిల్లా ఆరోగ్యవైద్యశాఖ అధికారిణి డాక్టర్. మధుశ్రీ, పిఓఎన్‌డిడి. డాక్టర్. రవీందర్‌గౌడ్, పిఓ సిహెచ్‌ఐ డాక్టర్. పి.చంద్రశేఖర్, పాఠశాల హెచ్‌ఎమ్ ఆర్.శివనాగేశ్వర్, జిల్లా హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బస్సులు లేక ప్రయాణికుల ఇబ్బందులు
మోర్తాడ్: ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలతో పాటుగా ఆటోరిక్షాలు కూడా పోచంపాడ్ బహిరంగ సభకే తరలడంతో సాధారణ ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం పోచంపాడ్‌లో శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకానికి సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేసిన విషయం విధితమే. దీనికోసం ప్రజలను తరలించేందుకు ఒక్కో గ్రామానికి సగటుగా 5బస్సుల వంతున ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించి, ఆ బస్సులను కూడా ప్రజలను తరలించేందుకే మళ్లించారు. చివరకు ఆటోరిక్షాలను కూడా సిఎం సభకు జనాన్ని తరలించేందుకు సిద్ధం చేయడంతో సాధారణ ప్రయాణీకులు వారి గమ్యస్థానాలకు చేరుకునేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మోర్తాడ్ బస్టాండ్‌లో జాతీయ రహదారిపై గంటల తరబడి ప్రయాణీకులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు గంటలకు ఒక బస్సు అన్నట్లుగా బస్సులు కనిపించడంతో కిక్కిరిసిన రద్దీలోనే బస్సు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సిఎం సభకు పోగా, మిగిలిన ఆటోరిక్షాల యజమానులు రేట్లను మూడింతలు పెంచేయడంతో సాధారణ ప్రజలు ఇక్కట్లు ఎదుర్కోక తప్పలేదు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఒక్క బస్సు కూడా రాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జాతీయ రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. సాయంత్రం సిఎం సభ ముగిసిన తర్వాత ప్రజలను తిరిగి వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు రోడ్లపై పరుగులు తీసిన బస్సులు పెద్ద కాన్వాయ్‌నే తలపింపజేశాయి. 20, 25బస్సులు ఒకే వరుసలో రోడ్లపై దూసుకెళ్లాయి. ప్రజలను గ్రామాల్లో దించాక ఖాళీ బస్సులు తిరిగి యథావిధిగా వారి డిపోలకు వెళ్తున్నప్పటికీ, కండక్టర్ లేకపోవడంతో ప్రయాణీకులు ఎక్కే అవకాశమే లేకుండాపోయింది.

షబ్బీర్‌అలీ వల్లే ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్ట్ సాధ్యమైంది
*పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్
*పైలాన్‌కు పాలాభిషేకం

కామారెడ్డిరూరల్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ శాసనమండలి షబ్బీర్‌అలీ వల్లే సాధ్యం అయ్యిందని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస శ్రీనివాస్ అన్నారు. గురువారం కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ఉన్న ప్రాణహిత - చేవేళ్ల పైలాన్‌కు కాంగ్రెస్ నాయకులు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ మున్సిపల్ చైర్మన్ కైలాస్ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ, స్వర్గీయ. డాక్టర్. వైఎస్.రాజశేఖర్‌రెడ్డి సిఎంగా ఉన్న సమయంలో షబ్బీర్‌అలీ మంత్రిగా ఉండి, రైతుల కష్టాలను దూరం చేసేందుకు ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసి కామారెడ్డిలో పైలాన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 2014లో ఈ పనులు జరుగుతుండగా, ప్రభుత్వం మారిపోవడంతో ఇట్టి ప్రాజెక్ట్ ప్యాకేజీ నంబర్ 22ను ఇక్కడి నుండి మార్చివేయాలని ఎంతో మంది ఇంజనీర్లతో ప్రణాళికను సిద్ధం చేశారని, కాని ఏ ప్రణాళిక ఆమోదం పొందలేదన్నారు. కాని తిరిగి ఈవిషయంలో షబ్బీర్‌అలీ తయారు చేయించిన ప్రణాళిక ద్వారానే తిరిగి పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందన్నారు. ఇది కాంగ్రెస్ విజయం అని అందుకే యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్ట్ పైలాన్‌కు క్షీరాభిషేకం చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా కామారెడ్డి ప్రాంత రైతుల పంట పొలాలు సస్యశ్యామలం అవుతాయని అన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కరంగుల అశోక్‌రెడ్డి, కన్నయ్య, బట్టుమోహన్, వాసు, శేరు, మల్లేశ్, ముదాంరమేష్, శేఖర్, చింతల శ్రీనివాస్, కిషన్, ప్రసాద్, సాయికృష్ణ, మెడికల్‌రాజు, ఇంతియాజ్, సిరాజుద్దిన్, జమీల్, సాజీద్, శ్రీ్ధర్‌గౌడ్, లక్కపతిగంగాధర్, నితీష్‌రెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయరా?
* ఎఐకెఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్

బోధన్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ కారులపై ఇప్పటి వరకు ఉద్యమ కేసులు ఎత్తివేయలేదని ఏఐకెఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ విమర్శించారు. గురువారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమ కారులపై కేసులు ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి చెప్పినా ఇప్పటి వరకు తమపై కొన్ని కేసులు యదావిధంగానే ఉన్నాయని అన్నారు. కేసులు నమోదైనా రాష్ట్రం ఏర్పాటైతే అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందన్న ఆశతో ఉద్యమకారులు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఉద్యమ కారులకు ఎటువంటి సంతోషం లేదన్నారు. నిజాంసాగర్ ఆయకట్టు రైతాంగం నేడు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని ఆయన పేర్కొన్నారు. నిజాంసాగర్‌కు బ్యాలన్సింగ్ రిజర్వాయర్‌గా ఉన్నటువంటి సింగూర్ నుండి నీటిని వదిలి సాగర్ రైతులను ఆదుకోవాల్సి ఉన్నా సర్కారు తనకేమి పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.విలేఖరుల సమావేశంలో రైతు కూలీ సంఘం నాయకులు సుల్తాన్ సాయిలు, మల్లేష్ పాల్గొన్నారు.