కరీంనగర్

పోచంపాడు బాటపట్టిన వాహనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: పదహారు లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పునరుజ్జీవ పథకానికి గురువారం సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేయగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని దారులగుండా వాహనాలన్ని నిజామాబాద్ జిల్లా పోచంపాడు వైపుకు పరుగులు తీసాయి. గురువారం ఉదయం 6గంటల నుంచే పోచంపాడు వైపుకు వాహనాలు పరుగులు తీయడం ఆరంభమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి భారీగా గులాబీ శ్రేణులు తరలివెళ్లారు. ప్రతి గ్రామానికి రెండు బస్సుల చొప్పున రాగా, పార్టీ శ్రేణులు, ప్రజలు ఆ బస్సుల్లో తరలివెళ్లారు. పట్నం నుంచి పల్లె దాకా వందలాది వాహనాలు పోచంపాడు బాట పట్టాయి. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేయడం, అనంతరం పోచంపాడులో బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో ఆ సభను విజయవంతం చేసేందుకు ఐదారురోజుల ముందునుంచే ఉమ్మడి జిల్లాలో జిల్లా మంత్రి ఈటల రాజేందర్ పలుమార్లు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి విజయవంతానికి అందరు కృషిచేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో ముగ్గురు ఎంపిలు, ఇద్దరు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు, పలు రాష్ట్ర కార్పోరేషన్ల చైర్మన్లతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు సిఎం సభను విజయవంతం చేసే ప్రక్రియను తమ భుజాన వేసుకుని జన సమీకరణలో నిమగ్నమై, అవసరమైనన్ని వాహనాలతో అంతా సిద్ధం చేసుకుని, ప్రజల్ని, పార్టీ శ్రేణుల్ని తరలించారు. ఆర్టీసి బస్సులు, ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులను వినియోగించారు. కాగా, సిఎం సభకు ఆర్టీసి బస్సులు వెళ్లడంతో సరిపడా బస్సులు లేక ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. బస్టాండ్లలో గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. కొందరు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి జేబులను గుల్ల చేసుకున్నారు. మొత్తానికి సిఎం పోచంపాడు సభకు ఉమ్మడి జిల్లా నుంచి భారీ సంఖ్యలోనే పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివెళ్లారు.

నాపోరాటం ఆగదు
కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధి విషయంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎలా అంకితభావంతో ఉద్యమించానో అలాంటి కఠినమైన అంకితభావంతో కరీంనగర్‌లో ప్రభుత్వ వైద్య కళాశాల సాధనలో సిఎం కెసిఆర్ ప్రకటన చేసి, ఎన్‌ఓసి ఇచ్చేవరకు పోరాటం కొనసాగుతుందని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ప్రజల ఆకాంక్షలకనుగుణంగా నేను ప్రభుత్వానికి పదేపదే గుర్తుకు చేసి ప్రత్యక్ష పోరాటానికి దిగినా స్పందించకపోవడం ఉద్యమానికి ఊపిరిపోసిన కరీంనగర్ ప్రజలను మీరు వంచించినట్లే అవుతుందని పేర్కొంటూ గురువారం సిఎం కెసిఆర్‌కు పొన్నం నాలుగు పేజీల బహిరంగ లేఖ రాశారు. మెడికల్ కళాశాలపై ట్యాంక్‌బండ్ వద్ద దివంగత నేత ‘కాకా’ విగ్రహావిష్కరణ సందర్భంలో నేను మిమ్ముల్ని మొదటిసారిగా కలిసి వైద్య కళాశాల ఏర్పాటు చేస్తానని మీరిచ్చిన హామీని గుర్తు చేసి, త్వరగా కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కెకె, వివేక్‌ల సమక్షంలో కోరడం జరిగిందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ తరువాత గాంధిభవన్‌లో జీవన్‌రెడ్డితో కలిసి ప్రెస్‌మీట్ ద్వారా రెండవసారి, కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ చేస్తూ మూడవసారి, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి మెడికల్ కళాశాల ఆవశ్యకతను తెలుపుతూ మీరిచ్చిన మాటను నిలుపుకోవాలని కోరుతూ అఖిలపక్షం ద్వారా మీకు లేఖ రాయడం ద్వారా నాలుగోసారి వివరించడం జరిగిందని వివరించారు. పార్లమెంటు సభ్యునిగా కరీంనగర్ ఆసుపత్రిలో ప్లేట్‌లెట్స్ సపరేటర్ కొనుగోలుకు రూ.30 లక్షలు నా నిధుల నుండి ఇచ్చానని, ఆసుపత్రికి అనుబంధంగా నర్సింగ్ కాలేజి ఏర్పాటు చేసి అదే ఆసుపత్రిలో 150పడకలతో మాతా, శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు రూ.20కోట్లు కేంద్రం ద్వారా మంజూరు చేయించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలకు ప్రధానాసుపత్రి ద్వారా మరింత మెరుగైన సేవలందాలంటే వైద్య కళాశాల ఏర్పాటుతోనే సాధ్యమని గ్రహించి నేను ఆనాడు సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ముల్కనూరు సభలో వైద్య కళాశాలను కోరగా, మంజూరు చేస్తానంటూ ప్రకటించడం, అప్పటి కలెక్టర్ స్మితాసబర్వాల్ కళాశాల ఏర్పాటుకు శాతవాహన యూనివర్శిటి పరిధిలో ఎల్‌ఎండి వద్ద 20ఎకరాల ప్రభుత్వ స్థలం అలాట్ చేస్తూ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించడం జరిగిందని వివరించారు. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమం పతాకస్థాయికి చేరుకోవడంతో అభివృద్ధి పథకాలకు బ్రేక్ పడిందని తెలిపారు. అనంతరం రాష్ట్ర ఏర్పాటు జరగడం, సిఎంగా మీరు ప్రమాణస్వీకారం చేయడం, ఆ తరువాత తొలిసారిగా కరీంనగర్‌కు వచ్చిన మీరు స్వయంగా వైద్య కళాశాల మంజూరు చేస్తానని ప్రకటించారని, అప్పటినుండి పలుమార్లు కోరినప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడం, ఇటీవలే మంత్రి లక్ష్మారెడ్డిని కలిసి వివరించి స్పందించకుంటే ఆగస్టు 5నుండి ఆమరణ దీక్ష చేపడతానని చెప్పడం జరిగిందని పేర్కొన్నారు. ఆ మేరకు నేను ఆమరణ దీక్ష చేపడితే నా దీక్షను టిఆర్‌ఎస్ నాయకులు అపహాస్యం చేస్తూ మాట్లాడటం, స్వయంగా జిల్లా మంత్రి ఈటల రాజేందర్ మీ సిఎం కిరణ్ తిరస్కరించాడని చెప్పారని, ఒకవేళ తిరస్కరించినట్లు ఆధారాలుంటే ప్రజలకు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. మిడ్ మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తామని ప్రకటించి ఆ తరువాత నిబంధనలు అడ్డుగా వస్తున్నాయని క్షమాపణలు కోరిన మీరు అదే పద్ధతిలో కరీంనగర్‌లో వైద్య కళాశాల ఏర్పాటు చేయదల్చుకోనట్లయితే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కోరారు. ఉద్యమానికి, మీ రాజకీయ జీవితానికి అండగా నిలిచిన జిల్లా ప్రజలకు అనేక హామీలిచ్చి వాటిని విస్మరిస్తూ అన్యాయం చేస్తున్నారని, వైద్య కళాశాలతో పాటు జిల్లా నుంచి తరలిపోతున్న ప్రాజెక్టుల సాధనకు నా ప్రాణాలు సైతం లెక్క చేయబోనంటూ ప్రభాకర్ బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

దళితులపైనే కేసులా?
ఇల్లంతకుంట: తెలంగాణ ఏర్పడిన తర్వాత దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాననే హామీని మర్చి వారిపైనే కేసులు పెట్టించడమే వారికి ఇచ్చిన హామియా? అని ఎఐసిసి కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు విమర్శించారు. గురువారం మండలంలోని రామోజీపేట గ్రామంలోని రామాలయంలో శ్రీ సీతారామస్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు దళితులపై ఎంత ప్రేమ ఉందో నేరెళ్ల సంఘటనే కనిపిస్తుందని పేర్కొన్నారు. నేరెళ్లలో దళితులపై జరిగిన దాడుల కారకులను వదిలేసి వారిపైనే కేసులు పెట్టి జైలుకు పంపించడంలో ఎంతవరకు సమంజసమన్నారు. నేరెళ్ల బాధితులకు న్యాయం జరగనట్లయితే ఈ నెల 30న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిరాహారదీక్ష చేపడుతానని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం దళితులపై చూపే మొసలి కన్నీళ్లను అందరు గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దళితుల వెంట ఉంటుందని, వారికి న్యాయం జరిగేవరకు పోరాడుతామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా రైతు సెల్ అధ్యక్షుడు పాశం రాజేందర్ రెడ్డి, మాజీ సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ఉన్నారు.

కళాశాలల బంద్ విజయవంతం
కరీంనగర్ టౌన్: జిల్లాలో నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలోనిర్వహించిన గురువారం నిర్వహించిన కళాశాలల బంద్ విజయవంతమైంది. నగరంలోని పలు ప్రభుత్వ,ప్రైవేట్ జూనియర్,డిగ్రీ కళాశాలలు స్వచ్చంధంగా మూసివేయగా, కొన్నిచోట్ల ప్రైవేట్ పాఠశాలలకు సైతం యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. ఈసందర్బంగా వందలాదిమంది విద్యార్థులు నగరంలోని ప్రధాన వీధుల గుండా ద్విచక్రవాహనాలపై తిరుగుతూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీలో పాల్గొన్న ఎబివిపి జోనల్ ఇంచార్జి చిక్కుల కిరణ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ అందక అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మొండి వైఖరిని అవలంభిస్తుందని మండిపడ్డారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో విచ్చలవిడిగా విద్యార్థులనుంచి ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని, దీనిపై ఫిర్యాదులు చేసినా అధికారుల్లో స్పందనలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ విద్యను పేద,మద్యతరగతి ప్రజలకందించకుండా కార్పోరేట్ విద్యను పరోక్షంగా ప్రోత్సహించేలా వ్యవహరిస్తోందని, విద్యార్థిసమస్యలపై ఎబివిపి రాష్టశ్రాఖ ఇచ్చిన పిలుపుతోబుధవారం నగరంలోని కలెక్టరేట్ ఎదుట భారీ ఎత్తున ఆందోళనకు దిగితే, పోలీసులచే దాష్టీకం ప్రదర్శించిందని దుమ్మెత్తిపోశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా 30పోలీస్ యాక్టుపేర కేసులు నమోదుచేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానంతరం తొలిసారిగా పాలనపగ్గాలు చేపట్టిన టిఆర్‌ఎస్ విద్యారంగం అభివృద్దికి పెద్దపీట వేస్తుందని భావిస్తే, ప్రైవేట్,కార్పోరేట్ సంస్థలకు అప్పగించేందుకు పన్నాగం పన్నుతోందన్నారు. మూడేళ్ళలో ఇప్పటివరకు విద్యార్థులకు కించిత్ లాభం చేకూర్చలేదని, నిరుద్యోగుల కోసం విడుద లచేసిన నోటిఫికేషన్లలో జరిగిన అవకతవకలతోపలుమార్లు హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వంపై మొట్టికాయలు వేస్తూ, వాటిని రద్దుచేసినా టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ ఘంటా చక్రపాణిని మాత్రం తొలగించటంలేదన్నారు.ప్రభుత్వం మొద్దునిద్ర వీడి విద్యార్థుల ఫీజు రీ ఎంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు సత్వరమే విడుదల చేయాలని, మందబుద్దితో వ్యవహరిస్తున్న ఆయన చైర్మన్‌గిరికి వెంటనే స్వస్తిపలికి, నిబద్ధతతో కూడిన వ్యక్తికి అప్పగించాలని, లేనిపక్షంలో రాష్టవ్య్రాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. ఈసందర్భంగా ఆయన వెంట విద్యార్థినాయకులు వినయ్, మహేశ్,శ్రీనివాస్,అనిరుద్, చరణ్, సాయిప్రకాశ్ తదితరులున్నారు.

పోచంపాడ్‌కు గులాబీ దళం
జగిత్యాల: సిఎం కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ ఎస్సారెస్పీ వద్ద చేపట్టిన పునరుజ్జీవం పథకం ప్రారంభం, బహిరంగ సభకు జిల్లా గులాబీ దళం గురువారం పెద్ద ఎత్తున తరలివెళ్లింది. ఈ బహిరంగ సభకు జిల్లా నుండి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలతో పాటు జిల్లాకు చెందిన పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. పోచంపాడు సభకు తరలేందుకు జగిత్యాల నియోజక వర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ సంజయ్‌కుమార్ భారీ వాహనాలను సమకూర్చారు. ఆయా వాహనాలను జిల్లా పార్టీ కార్యాలయం వద్ద నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత పంచ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అయితే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున రైతులతో పాటు అభిమానులు, కార్యకర్తలు, మహిళలు, నాయకులు అందుబాటులో ఉన్న వాహనాల్లో తరలివెళ్లారు. సిఎం కెసిఆర్ ఎస్సారెస్పీ పునరుజ్జీవం ద్వారా దాదాపు కోటి ఎకరాలకు సాగు అందించే పునరుజ్జీవంతో తొలత లబ్ది చేకూరేది జగిత్యాల జిల్లా రైతులేనని చెప్పుకుంటున్న టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఈవిషయాన్ని రైతులకు నేరుగా వివరించేలా పోచంపాడ్ వద్ద ఎర్పాటు చేసిన సిఎం బహిరంగ సభకు ఇక్కడి నుండి అధిక సంఖ్యలో తరలించారు.
డ్రోన్‌ల వినియోగంపై నిషేధాజ్ఞలు
కరీంనగర్ టౌన్: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో భద్రతా కారణాల దృష్ట్యా పారాగ్లైడర్స్, రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్‌ల వినియోగాన్ని నిషేధించడం జరిగిందని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిషేదాజ్ఞలు సెప్టెంబర్ 8 వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. పైన పేర్కొన్న సాంకేతిక పరికరాలను ఈ మధ్యకాలంలో వివాహాది శుభకార్యాలు, వివిధ కార్యక్రమాల సందర్భంగా వినియోగించబడుతున్నాయని తెలిపారు. ఉగ్రవాదులు, అసాంఘీక శక్తులు వీటిని వినియోగించే అవకాశాలు ఉండడంతో సదరు సాంకేతిక పరికరాల వినియోగాన్ని నిషేధించడం జరిగిందని వివరించారు. ఎవరైనా వినియోగించాలనుకుంటే సంబంధిత పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఐపిసి సెక్షన్ 188 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
రేపు హైదరాబాద్‌లో లైబ్రేరియన్ల రాష్ట్ర సదస్సు
ముకరంపుర కరీంనగర్: గ్రంధాలయ పితామహుడైన ఎస్‌ఆర్ రంగనాథన్ 125వ జయంతి సందర్భంగా జాతీయ స్థాయిలో లైబ్రేరియన్స్ డే వేడుకలు ఈ నెల 12న దేశమంతా జరుపుకునే వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా లైబ్రేరియన్ డే వేడుకలు నిర్వహిస్తున్నారని, ఈ వేడుకలు నిర్వహించడం పట్ల తెలంగాణ గ్రంధాలయ వేదిక వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ముదుగంటి సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఈ నెల 12న ఉదయం 11 గంటలకు లైబ్రేరియన్ల సదస్సు జరుగుతుందని, ఈ సదస్సుకు రాష్ట్రంలోని లైబ్రేరియన్లంతా తరలి రావాలని సుధాకర్ రెడ్డి ఆ ప్రకటనలో కోరారు.
సిఎం దిష్టిబొమ్మ దగ్ధం
కోరుట్ల: కాంగ్రెస్ ఆధ్వర్యంలో సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మను గురువారం జాతీయ రహదారిపై దగ్ధం చేశారు. ఈ సందర్బంగా పట్టణ అధ్యక్షుడు అక్తర్ మాట్లాడుతూ ప్రజలకు భయాంభ్రాంతులకు గురి చేసి ప్రైవేటులతో పాటు మహిళ సంఘాల సభ్యులను సభకు బలవంతగా తరలించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఇందుకు నిరసనగానే సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్దం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీన్, రాకేష్, మహేష్‌లు ఉన్నారు.

మూడు కార్లు ఢీ: ఒకరు మృతి
మానకొండూర్: మండల పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామ శివారులో గల కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై మూడు కార్లు ఢీకొన్న సంఘటనలో రియాజ్ జాఫర్ (65) అనే వ్యక్తి మృతి చెందగా, మీర్ మదర్ హుస్సేన్, షాహీద్, నాగరాజులకు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు గురువారం తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..కరీంనగర్‌కు చెందిన రియాజ్ జాఫర్, మీర్ మదర్ హుస్సేన్ వరంగల్‌లోని బంధువుల వద్దకు వెళ్లి తిరిగి వారి సొంత కారులో కరీంనగర్‌కు వస్తుండగా ఈదులగట్టెపల్లి గ్రామ ప్రధాన రహదారిపై కరీంనగర్ నుండి వరంగల్‌కు వెళ్తున్న కారు అతివేగంగా వెళ్లి ఢీకొని మరో వెనుకాల ఉన్న కారుకు ఢీకొంది. దీంతో రియాజ్ జాఫర్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలైన నాగరాజు, మదర్ హుస్సేన్, షాహీద్ అనే ముగ్గురిని చికిత్సనిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
భూ పంపిణీ కోసం భూములు పరిశీలించిన జెసి
జమ్మికుంట: నిరుపేదలైన దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ కోసం ఇల్లంతకుంట మండలంలోని పాతర్లపల్లి, బూజునూర్ గ్రామలాలో ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూములను గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్బంగా భూ పంపిణీ కోసం సేకరించే భూములు వ్యవసాయనికి ఆమోదయోగ్యంగా ఉన్నయా? లేవా? వాటి వివరాలను పరిశీలించారు. గ్రామాలలో పర్యటించి, భూ వివరాలను సేకరించారు. దళితులకు భూ పంపిణీ. సేకరణ వేగ వంతం చేయాలని తాహశీల్దార్లకు సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ చెన్నయ్య, తాహశీల్దార్ రమేష్, ఆర్‌ఐ మధుతో పాటు సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.