శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

జిల్లాలో పలు చోట్ల వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు : రుతుపవనాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల శుక్రవారం ఒక మోస్తరు వర్షం కురిసింది. ముఖ్యంగా నెల్లూరు నగరంలో శుక్రవారం మధ్నాహ్నం తిరిగి సాయంత్రం మరోసారి వర్షం కురిసింది. కురిసింది భారీవర్షం కాకపోయినప్పటికి నగరం మాత్రం బురదమయంగా మారిపోయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనుల పేరుతో నగరంలో రోడ్లను ఇష్టారీతిగా ధ్వంసం చేయడంతో రోడ్లన్నీ బురదనీటితో నిండిపోయాయి. పలుచోట్ల కార్లు, ఆటోల చక్రాలు డ్రైనేజీ పనుల కోసం తవ్వి సరిగా పూడ్చని గుంతల్లో కూరుకుపోయాయి. అయితే గత వారం రోజులుగా ఎండలు తీవ్రంగా కాస్తుండటంతో శుక్రవారం కురిసిన వర్షం నగరవాసులకు ఆహ్లాదం కలిగించింది. ఇదే వర్షం మరో రెండు రోజుల పాటు కురిస్తే డెల్టా ప్రాంతంలో కొన్ని చోట్ల సాగునీటికి ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది.

కార్మికులకు కనీస వేతనాలు
* వేజ్‌బోర్డు చైర్మన్ గోవర్దన్ వెల్లడి
నెల్లూరుటౌన్: అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు లేవని, అలాంటి కుటుంబాలకు తిండి, బట్ట, విద్యా, వైద్యం, గృహ తదితర వౌలిక వసతులు కల్పించాలన్న ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కనీస వేతనాలను రూ.14 వేల నుంచి రూ.25 వేల వరకు పెంచినట్లు భారతదేశ వేజ్‌బోర్డు చైర్మన్ గోవర్దన్ చెప్పారు. నెల్లూరులోని బిజెపి కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో, కేంద్రంలో కనీస వేతనాలు గత కేంద్రప్రభుత్వం 2010లో పెంచిన నిత్యావసర సరుకుల ధరకు అనుగుణంగా కార్మికులకు 42శాతం పెంచిందని కానీ ఇప్పటి వరకు దానిని అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. నేడు కార్మికుల కోసం ప్రధాని నరేంద్రమోదీ 2010లో ఉన్న నిర్ణయించిన కనీస వేతనాలను నేడు 42శాతానికి పెంచడం జరిగిందని, దాదాపు రూ.14వేలు ఉన్న కనీస వేతనాన్ని రూ.25వేలకు పెంచారని, దాన్ని త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారని తద్వారా కార్మికులు, అసంఘటిత కార్మికులు పేద, బడుగు, బలహీన వర్గాల వారు పూర్తిస్థాయిలో అభివృద్ధిలోకి రానున్నారని పేర్కొన్నారు. కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశ్యంతో అహర్నిశలు ప్రధాని పాటుపడుతున్నారన్నారు. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబునాయుడు ఆంధ్రరాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా నిర్మిస్తానంటున్నారని తెలిపారు. అయితే గతంలో టిడిపి అధికారంలోకి రావడంతోటే అసంఘటిత కార్మికుల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, ఇప్పటికీ ఆ కార్పొరేషన్ ద్వారా అర్హులైన కార్మికులకు లబ్ధి చేకూరిన దాఖలాలు లేవన్నారు. గతంలో వైఎస్‌ఆర్ అసంఘటిత కార్మికుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశారని అప్పటి ఆ చైర్మన్ తప్పుడు లెక్కలు చూపుతూ ధనాన్ని దోచుకున్నారన్నారు. ఇప్పటికైనా స్వర్ణాంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తూ కేంద్రం ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు అందిస్తున్న సంక్షేమ ఫలాలు రాష్ట్రంలో అందరికి అందేలా చూడాలని ఆయన కోరారు. పేదలకు అలాగే గత 2010 నుంచి పలు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా ఉండటం శోచనీయమన్నారు. దేశంలో అన్ని జిల్లాల్లో 379 ఈఎస్‌ఐ ఆసుపత్రులు ఉన్నాయని, త్వరలో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఈఎస్‌ఐ ఆసుపత్రులను భారీ సంఖ్యలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి కార్మికుడికి ప్రావిడెంట్ ఫండ్ కింద ప్రభుత్వం ఓ కోడ్ నెంబర్ ఇస్తుందని ఆ నెంబర్ ద్వారా వారు పొందాల్సిన లబ్ధిని పొందవచ్చన్నారు. మహిళలకు గర్భధారణ సమయంలో ఇప్పుడు ఇస్తున్న సెలవుల కంటే మరో 14రోజులు మోదీ పెంచినట్లు ఆయన తెలిపారు. బడుగు, బలహీన వర్గాల వారి కోసమే ప్రధాని మోదీ, అమిత్‌షా, బిజేపి పార్టీ పనిచేస్తుందని తెలిపారు. త్వరలో జర్నలిస్టులకు కూడా వేజ్‌బోర్డు ద్వారా ఓ కమిటీని ఏర్పాటు చేసి వారికి కల్పించాల్సిన కనీస వేతనాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నివేదికలో ఉందని, ఈ కమిటీకి ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జీని, కమిటీ సభ్యులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బిజేపీ నాయకులు ఎంపెడా చైర్మన్ సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిడతల రమేష్, మారుబోయిన శ్రీనివాసులుగౌడ్, సమాధి శీనయ్య తదితరులు పాల్గొన్నారు.

అక్రమంగా వానపాముల రవాణా
* పోలీసుల తనిఖీల్లో బయటపడిన వైనం
చిల్లకూరు: చెన్నై నుంచి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో రెండు రొయ్యల హేచరీలకు వానపాములను తరలించే ముఠా సభ్యులను శుక్రవారం జాతీయ రహదారిపై బూదనం టోల్ ప్లాజా వద్ద తనిఖీల్లో భాగంగా పోలీసులు పట్టుకున్నారు. ఓ కారును, అందులో 100 కిలోల వానపాములను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను చిల్లకూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు ప్రాంతంలోని ఎన్నూరు బ్రిడ్జి వద్ద నుంచి తరుచుగా నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న రొయ్యల హేచరీలకు వానపాములను తరలించి సొమ్ము చేసుకునేవారని, ఇందులో భాగంగా గుమ్మడిపూండి ప్రాంతానికి చెందిన దేవకుమార్, ఆరంబాకం ప్రాంతానికి చెందిన అహ్మద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మరింత సమాచారాన్ని రాబడుతున్నట్టు ఎస్సై అంకమ్మ తెలిపారు. వాటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉండవచ్చని పోలీసులు తెలిపారు.

కొనసాగుతున్న విచారణ
* వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి
* శాఖాపరమైన మరిన్ని చర్యలకు సిద్ధమవుతున్న ఎస్పీ
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు: జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌ను నామరూపాలు లేకుండా చేయాలనే తలంపుతో ఉన్న ఎస్పీ రామకృష్ణ విచారణను మరింత లోతుగా చేపట్టబోతున్నారు. అత్యంత ముఖ్యమైన క్రికెట్ బుకీలను ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు పంపిన పోలీసులు తిరిగి వారిని విచారణ కోసం కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటిదాకా పోలీసుల విచారణలో కృష్ణసింగ్, మరికొందరు ఇతర బుకీలు వారి కిందిస్థాయి సబ్‌బుకీలు, పంటర్లకు మాత్రమే పరిమితమైన విచారణ ప్రస్తుతం పైస్థాయిలో ఉన్న బడా బుకీల గురించి దర్యాప్తు సాగించనున్నట్లు సమాచారం. అదేవిధంగా ఇప్పటిదాకా బుకీలు సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకునే విషయంలోనూ జిల్లా ఎస్పీ పట్టుదలతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. సామాన్య ప్రజల క్రికెట్ వ్యామోహాన్ని జూదంగా మార్చుకొని కోట్లు సంపాదించిన బుకీల ఆస్తుల్ని తిరిగి ప్రభుత్వపరం చేసేందుకు అవసరమైన న్యాయసలహాతో పోలీసులు ముందుకెళ్లనున్నారు. పోలీసుల దర్యాప్తులో వెల్లడై ప్రస్తుతం పరారీలో ఉన్న పలువురు సబ్ బుకీల కోసం గాలింపు చర్యలు కూడా ఒకవైపు ముమ్మరం చేశారు. నగరానికి చెందిన ఓ మాజీ కౌన్సిలర్, మరో టిడిపి యువనేతను పట్టుకునేందుకు ఇప్పటికే ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఆ ఇద్దరు వ్యక్తులు నగరానికి చెందిన ఓ టిడిపి నేత సంరక్షణలో ఉన్నారని సమాచారం. ఎవరి సంరక్షణలో ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొని తీరాలని ఎస్పీ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో బృందాల్లోని పోలీసు సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. అదేవిధంగా కృష్ణసింగ్‌ను పోలీసులకు అప్పగించడంలో కీలక భూమిక పోషించే తాను కూడా పంటర్‌గా అరెస్ట్ కాబడిన ఓ వైకాపా నేత కూడా పోలీసులకు కీలక సమాచార వ్యక్తిగా మారారు. ఆయన్ను కూడా మరోసారి పోలీసులు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరికొందరు సిబ్బందిపై చర్యలు?
జిల్లాలో క్రికెట్ బుకీలకు ఇంతకాలం సహాయం చేస్తూ వచ్చిన కొందరు పోలీసు సిబ్బందిపై ఇప్పటికే చర్యలు తీసుకున్న జిల్లా ఎస్పీ, ప్రస్తుతం మరికొందరు క్షేత్రస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. సిబ్బందిపై తానే స్వయానా చర్యలు తీసుకునే అధికారం ఉండటంతో ఆయన పైఅధికారులకు సిఫార్సు చేయాల్సిన పని లేకపోవడంతో ప్రస్తుతం క్రిందిస్థాయి సిబ్బందిలో వణుకు మొదలైంది. ముఖ్యంగా కొందరు ఎస్‌బి కానిస్టేబుళ్లు, నగరంలో తిష్టవేసి యూనిఫాం లేని పోలీసులుగా వ్యవహరించే మరో ముగ్గురు కానిస్టేబుళ్లపై తప్పక చర్యలు ఉంటాయని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. అదేవిధంగా డెల్టా ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఓ సర్కిల్ స్థాయి అధికారిపై కూడా చర్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎస్పీ ఏ క్షణంలో ఎవరిపై చర్యలు తీసుకుంటారో తెలియక, తెలిసి చేసిన తప్పుకు తప్పక మూల్యం చెల్లించుకునే గడువు కోసం కొందరు పోలీసు సిబ్బంది బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు.
బాధితులకు న్యాయం చేస్తాం : ఆర్డీవో
డక్కిలి (వెంకటగిరి) : ఆల్తూరుపాడు వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్, రైల్వేలైన్ మార్గాల్లో భూములు కోల్పోతున్న బాధితులకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని గూడూరు ఆర్డీవో అరుణ్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం డక్కిలి మండలంలోని ఆల్తూరుపాడు, వెల్లంపల్లిలో రిజర్వాయర్, రైల్వేలైన్ల వల్ల భూములు కోల్పోతున్న రైతుల భూములను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఆర్డీవో ఆరుణ్‌బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఆల్తూరుపాడు వద్ద రూ.400 కోట్లతో రిజర్వాయర్ నిర్మిస్తున్నారని, దీంతో ఈ చుట్టుపక్కల సస్యశ్యామలంగా తయారవుతుందని అన్నారు. వీటి నిర్మాణం వల్ల ఆల్లూరుపాడు, వెల్లంపల్లి గ్రామాల్లో సూమారు 150 ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ఈ 150 ఎకరాలు రైతులు 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటుంన్నా వారు ఇప్పటి వరకు సాగు చేసుకుంటున్నట్లు రికార్డుల్లో కూడా ఎక్కించుకోలేదన్నారు. అయినప్పటికీ వారికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దీన్ని పరిశీలించేందుకు ఆర్డీవోను కూడా పిలిపించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు సాగు చేసుకుంటున్న వారికి మాత్రం ప్రభుత్వం తరపున పరిహారం చెల్లిస్తామన్నారు. ఇంకెవరైనా కొత్తగా భూములను సాగు చేస్తే పాతవారికి కూడా ఎలాంటి పరిహారం ఇవ్వడం జరగదన్నారు. ఈ కార్యక్రమంలో డక్కిలి జడ్పీటిసి రామచంద్రనాయుడు, డక్కిలి ఎంపిపి పి వెంకటరెడ్డి, డక్కిలి టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు పొలంరెడ్డి కోటేశ్వరరెడ్డి, వెంకటగిరి ఎఎంసి చైర్మన్ పులుకొల్లు రాజేశ్వరరావు, డక్కిలి ఎంపిపి విజయలక్ష్మి, నాయకులు పాల్గొన్నారు.
జగన్ జీవితాంతం ఎన్నికల్లో పాల్గొనకుండా చూడాలి
* నుడా చైర్మన్ కోటంరెడ్డి డిమాండ్
నెల్లూరుటౌన్ : ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ఆయన జీవితకాలం ఎన్నికల్లో పాల్గొనకుండా చూడాలని ఎన్నికల కమిషన్‌ను నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌కు ఇడిలో 12కేసులు ఉన్నాయని, ఒకటిన్నర ఏడాది ఈ కేసులపై జైలులో ఉన్నాడని, ఒక్కసారి జైలుకు వెళ్లిన వారు ఎవరైనా సరే ఎన్నికలకు వెళ్లేందుకు అర్హులు కాదని గుర్తుచేశారు. నంద్యాలలో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రిని నడిరోడ్డుపై కాల్చి చంపాలన్న జగన్‌ను చూసి ఆ పార్టీ నాయకులు కూడా విమర్శిస్తున్నారన్నారు. దీనిపై విసి వివరణ కోరగా నేను అలా అనలేదు, ఇలా అన్నాను అని సర్దిచెప్పుకున్నారని అన్నారు. మళ్లీ నిన్న నిలదీస్తాం, మాకు ఆ హక్కు ఉంది అని చంద్రబాబును విమర్శించడం ఎంత వరకు సబబు అంటూ నిలదీశారు. ఈయనపై ఉన్న కేసులకు ఈయనకు ఉన్న జీవితకాలం కూడా జైలులో గడిపేందుకు సరిపోదన్నారు. ఇకనైనా మాటతీరు మార్చుకొని పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు ఉచ్చి భువనేశ్వరప్రసాద్, ధర్మవరపు సుబ్బారావు, మొయినుద్దీన్, మల్లి, జలదంకి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

‘సెటిల్‌మెంట్ పట్టాలు రద్దు చేయాలి’
నెల్లూరు కలెక్టరేట్: జిల్లాలోని సైదాపురం మండలం జోగిపల్లిలో దళితులకు ఇచ్చిన పట్టాలకు దొడ్డిదారిన భూస్వాములు పొందిన సెటిల్‌మెంట్ పట్టాలను రద్దు చేయాలని రైతుకూలీ సంఘం (ఎఐకెఎంఎస్) జిల్లా కన్వీనర్ డిపి పోలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించి, జెసికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సర్వే నంబర్ 15.2,లో 8 ఎకరాలు, 33.2లో 6 ఎకరాలు, 36.2లో 4 ఎకరాల బంజరు, ప్రభుత్వ పోరంబోకు భూములు మొత్తం 18 ఎకరాలను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. అలాగే గతంలో దళితులకు ఇచ్చిన అసైన్‌మెంట్ పట్టాల స్థానంలో భూస్వాములు అవినీతి, అక్రమ మార్గాలలో సెటిల్‌మెంట్ పట్టాలు పొందారని వాటిని వెంటనే రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో వెంకటయ్య, క్రిష్ణవేణి, మమత, ఇప్టూ నాయకులు ఖాదర్‌భాషా తదితరులు పాల్గొన్నారు.

షార్‌లో చోరీ..ఒకరి అరెస్టు
సూళ్లూరుపేట : సతీష్ థవన్ అంతరిక్ష కేంద్రం షార్‌లో శుక్రవారం కాపర్ వైర్లను అపహరించుకొని తీసుకెళ్తున్న వ్యక్తిని సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. శ్రీహరికోట ఎస్సై చెంగయ్య సమాచారం మేరకు, దొరవారిసత్రం మండలం తనియాలి గ్రామానికి చెందిన వి కుమారస్వామి షార్‌లో కాంట్రాక్టు పనులకు కూలీగా వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం పనులు ముగించుకొని తిరిగి వస్తూ షార్‌లో నిల్వచేసి ఉన్న రాగి కాపర్ వైర్లను తీసుకొని వెళ్తుతుండగా మొదటి ప్రధాన గేటు వద్ద సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేశారు. అతని వద్ద ఏడు కిలోల కాపర్ వైర్లు ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడిన వ్యక్తిని శ్రీహరికోట పోలీసులకు అప్పగించారు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మాపై సవతి తల్లిప్రేమ
ఆనం తీరుపై బీదకు ఫిర్యాదు చేసిన తలచీరు
ఆత్మకూరు : మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి రాజకీయంగా తమను పూర్తిగా అణగదొక్కడమే అంతిమ లక్ష్యంగా మలచుకున్నారని మర్రిపాడు మండల టిడిపి నేత తలచీరు శ్రీనివాసులునాయుడు వాపోయారు. తమపై సవతితల్లి రీతిలో ప్రేమ ఒలకబోస్తున్నారని తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ అధ్యక్షుడు, ఎంఎల్‌సి బీద రవిచంద్రయాదవ్‌కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంతులూరు వెంకటేశ్వరరావు వివాహ వేడుకలకు బీద హాజరయ్యారు. ఇదే వేడుకలో పాల్గొన్న తలచీరు అనాదిగా తెలుగుదేశంలో కొనసాగుతున్న పార్టీ శ్రేణులకు నేడు ఆత్మకూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న వేధింపుల ధోరణిపై ఫిర్యాదు చేశారు. తమను పార్టీ కార్యక్రమాలకు దూరం చేయాలనే ధ్యేయంతోనే వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ కార్యవర్గాల నియామకాల్లో పాత శ్రేణుల్ని నియోజకవర్గం మొత్తమీద దాదాపుగా తొలగించారన్నారు. తాజాగా జన్మభూమి కమిటీల్లోనూ అవే విన్యాసాలు కొనసాగుతున్నాయని ఆవేదన చెందారు. ఇదేమిటంటే, ఆయనతో కలసి రావడం లేదని మీడియాకు చెప్తున్నారన్నారు. ఆనం తెలుగుదేశం పార్టీకి ఆత్మకూరు ఇన్‌చార్జి కాగానే, తొలి నాళ్లలో అంతా కలసి కొనసాగామన్నారు. ఎన్నో సభలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాల్లో ఆయన వెంట పాల్గొన్నామన్నారు. అయినా సరే ఉద్దేశ్యపూర్వకంగానే తమను పక్కన పెడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ ప్రాధాన్యత తిరిగి కల్పించే దిశలో చర్యలపై ఆలోచించాలని కోరారు.

విద్యను ప్రోత్సహించడం అభినందనీయం
వేదాయపాళెం : విజన్ ఇండియా సేవా కార్యక్రమాల ద్వారా విద్యను ప్రోత్సహించడం అభినందనీయమని జాయింట్ కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ అన్నారు. శుక్రవారం విజన్ ఇండియా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేసి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజన్ ఇండియా చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. అనంతరం 12 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజన్ ఇండియా ప్రోగ్రాం ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు ఉన్నత విద్య, స్థితిగతులపై సర్వే
నెల్లూరు కలెక్టరేట్: ఉన్నత విద్యలో మహిళలకు ప్రోత్సాహం లేదని ఎబివిపి జిల్లా మహిళా కన్వీనర్ వైష్ణవి అన్నారు. ఆ సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన సర్వేలో భాగంగా జిల్లా కేంద్రం నెల్లూరులోని డికె మహిళా కళాశాలలో మహిళలకు ఉన్నత విద్య- స్థితిగతులపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికి కళాశాలల్లో మహిళలకు ఉన్నత విద్య ఆశించతగిన స్థాయిలో లేదన్నారు. అలాగే క్రీడల్లో ప్రోత్సాహం లేదని, కొన్ని మహిళా కళాశాలల్లో క్రీడా మైదానాలు లేవన్నారు. కళాశాలలు, వివిధ సంస్థలు మహిళలకు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించకపోవడం దారుణమన్నారు. మహిళలు ఉన్నత విద్య, పరిశోధన రంగాల్లో రాణించేందుకు పిహెచ్‌డి సీట్లలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అలాగే ఉన్నత విద్యలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంఘటనా కార్యదర్శి రాజేష్, గ్రామీణ విభాగ కన్వీనర్ బాబు, వీణ, శ్రావణి, లక్ష్మీ, సుస్మిత, యశ్విని తదితరులు పాల్గొన్నారు.
సంబరాలు చేసుకున్న బిజెపి నేతలు
నెల్లూరుటౌన్: ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉప రాష్టప్రతిగా బాధ్యతలు పట్టిన సందర్భంగా శుక్రవారం నగరంలోని బిజేపీ జిల్లా కార్యాలయంలో దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు శ్రీనివాసులు ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ ద్వితీయ ఉన్నత పదవికి సింహపురికి చెందిన ఓ తెలుగు వ్యక్తి ఎన్నిక కావడం తెలుగు రాష్ట్రాల ప్రజలు గర్వించదగ్గ విషయమన్నారు. ఈ రాష్ట్రాల అభివృద్ధికి శక్తికి మించి కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రాకు దక్కాల్సిన హక్కుల గురించి పార్లమెంటులో ఆయన చేసిన పోరాటం మరవలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో బిజేపీ నాయకులు భాస్కర్‌గౌడ్, వై రాజేష్, కెవి సుబ్రహ్మణ్యం, కె కృష్ణమూర్తి, పరశురాం, డి ప్రసాద్, పద్మజ, రంగరాజన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.