పశ్చిమగోదావరి

పౌరసేవలు ప్రారంభించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: జిల్లాలోని అన్ని గ్రామీణ మినీ మీసేవా కేంద్రాల ద్వారా శనివారం నుంచి పౌరసేవలు ప్రారంభించాలని పంచాయతీ అధికారులను కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం పంచాయతీల్లో పనుల ప్రగతిపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మినీ మీసేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందించే సేవలతోపాటు పాస్‌పోర్టు, పాన్‌కార్డు, రైల్వే టిక్కెట్లు, బిఎస్‌ఎన్‌ఎల్ బిల్లులు, ఆధార్, జిఎస్‌టి, ఇన్‌కంటాక్స్ వంటి 160 రకాల కేంద్రప్రభుత్వ సేవలు కూడా పొందవచ్చునన్నారు. మినీ మీసేవా కేంద్రాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, దూరప్రాంతాలకు వెళ్లకుండానే వారి ఊరిలోనే వారికి కావాల్సిన సేవలు పొందవచ్చునన్నారు. మినీ మీసేవాకేంద్రాలు సమర్ధవంతంగా పనిచేసేందుకు, సక్రమంగా సేవలు అందించేందుకు ప్రతి పంచాయతీకి రెండు కంప్యూటర్లు, రెండు ప్రింటర్లు, ఒక స్కానర్‌తోపాటు ఇన్వర్టర్ సరఫరా చేస్తామని కలెక్టరు చెప్పారు. ప్రతి కేంద్రం వద్ద ప్రజలకు అందించే సేవల వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటుచేయాలన్నారు. ఈ కేంద్రాల ద్వారా సేవలు పొందేందుకు ఆన్‌లైన్ ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవాలో బుక్‌లెట్ తయారుచేయాలన్నారు. గ్రామాలన్నింటిని పరిశుభ్రంగా ఉంచేవిధంగా అధికారులు కృషిచేయాలన్నారు. ఇఓఆర్‌డిలతోపాటు పంచాయితీ సెక్రటరీలు కూడా తప్పనిసరిగా ఉదయం 5.30గంటలకే విధులకు హాజరై బయోమెట్రిక్ వేయాలని ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు అన్ని గ్రామాల్లో డంపింగ్ యార్డులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 937 డంపింగ్ యార్డులు నిర్మించాల్సి ఉండగా ఇంతవరకు 360 మాత్రమే మొదలుపెట్టారని, మిగిలినవాటిని కూడా త్వరితగతిన ఏర్పాటుచేయాలని ఆదేశించారు. తాడేపల్లిగూడెం, నిడమర్రు, జీలుగుమిల్లి, కుకునూరు, టి నర్సాపురం, చాగల్లు, తణుకు, పెరవలి, నిడదవోలు, ఉండ్రాజవరం, పాలకోడేరు, కాళ్ల, భీమవరం, ఆచంట, వీరవాసరం తదితర మండలాల్లో ఈవారం ఒక్క డంపింగ్‌యార్డు కూడా ప్రారంభించలేదని, అయా ఇఓఆర్‌డిలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. గ్రామపంచాయితీల్లో వీధిలైట్ల స్ధానే ఎల్‌ఇడి బల్బులు ఏర్పాటుచేసే ప్రక్రియ నవంబర్ 1 నాటికి పూర్తికావాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు, డిఆర్‌డిఎ పిడి కె శ్రీనివాసులు, డిఎల్‌పిఓలు అమ్మాజీ, అపర్ణ, శ్రీరాములు, సూర్యనారాయణ, ఇఓఆర్‌డిలు పాల్గొన్నారు.

మళ్లీ రాజుకుంటున్న గరగపర్రు
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు : జిల్లాలో అధికార పార్టీని కుదిపేసిన పాలకోడేరు మండలం గరగపర్రు వివాదం శుక్రవారం పోలీసుల ఓవర్‌యాక్షన్‌తో మరోసారి రాజుకునే పరిస్థితి కనిపిస్తోంది. గరగపర్రులో దళితుల వెలి అంశం గత కొంతకాలంగా పతాక శీర్షికలకు ఎక్కిన విషయం తెలిసిందే. ఆ అంశాన్ని అధికార పార్టీ నేతలు నానా తంటాలు పడి అమాత్యులు కూడా జోక్యం చేసుకున్న తరువాత కొద్దిరోజుల క్రితం సర్దుమణిగిందని వారే ప్రకటించారు. అయితే ఆ సందర్భంగా జరిగిన ఒప్పందం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని గరగపర్రు దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే అవేదనతో వారంతా జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ఏలూరు తరలి వచ్చారు. అయితే ఇక్కడ పోలీసులు గరగపర్రు దళితులు ప్రయాణిస్తున్న బస్సును అడ్డుకుని వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జరిగిన హైడ్రామాతో గ్రామ దళితులంతా పోలీసుల తీరును తీవ్ర స్థాయిలో దుయ్యబడుతున్నారు. స్టేషన్ వద్ద గ్రామ దళితులను నానా ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా కొంతమంది నాయకులను అరెస్టు చేయడంతో పరిస్థితి మరింత తీవ్రంగా తయారైంది. చివరకు దళిత సంఘాలు, వామపక్షాలు రంగ ప్రవేశం చేయడంతో పోలీసులు కొంత వెనకడుగు వేయడం, ఆ తరువాత జిల్లా కలెక్టర్ వారి సమస్యలు తెలుసుకునేందుకు చొరవ చూపడంతో ఈ వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పడింది. అయితే శుక్రవారం ఉదయం నుంచి మాత్రం నగరంలో పెద్ద ఎత్తున పోలీసు డ్రామా నడిచిందనే చెప్పాలి. గరగపర్రు వెలి వివాదం నేపధ్యంలో కొద్దికాలం క్రితం వరకు తీవ్రస్థాయిలోనే ఇక్కడ పరిస్థితులు కొనసాగుతూ వచ్చాయి. ఈ వివాదానికి ఎలాగైనా ఫుల్‌స్టాప్ పెట్టాలని అధికార పార్టీ తమ శక్తియుక్తులన్నీ ఇక్కడే వడ్డాయి. దీనితో అమాత్యులు, ఎస్‌సి కార్పొరేషన్ ఛైర్మన్, ఎస్‌సి ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌ల సమక్షంలో గ్రామంలో ఇరువర్గాల మధ్య సయోధ్యను కుదిర్చి బాధితులైన దళితుల డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా బాధితులైన దళితులందరికీ చట్ట ప్రకారం ఆర్ధిక సహాయం అందిస్తామని కూడా ఒప్పందంలో భాగంగా అంగీకరించారు. అయితే గ్రామంలో వున్న దళిత కుటుంబాల్లో కొంతమందికి సహాయం పంపిణీ చేసి 84 కుటుంబాలను మాత్రం రకరకాల కారణాలు చెప్పి సహాయానికి నిరాకరిస్తున్నారని దళిత కుటుంబాలు ధ్వజమెత్తుతున్నాయి. ఈ విషయంలో అధికారులను ప్రశ్నించినా సంబంధిత బాధిత కుటుంబాలు ఎస్‌సి వర్గానికి చెందవని, వారు బిసి-సికి చెందిన వారని పేర్కొంటూ, దీనితోపాటు మరికొన్ని అంశాలను చెబుతూ సహాయం నిరాకరించారని బాధితులు పేర్కొంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఒప్పందం సందర్భంగా దళిత కుటుంబాలన్నింటికీ సహాయం అందిస్తామని చెప్పి ఆ తరువాత రకరకాల సాకులు చూపడం దారుణమంటూ బాధిత దళిత కుటుంబాలు శుక్రవారం గరగపర్రు నుంచి ఒక బస్సులో బయలుదేరి ఏలూరు చేరుకున్నారు. అయితే ఈ సమాచారం ముందుగా అందుకున్న పోలీసులు వారి బస్సును స్థానిక పాతబస్టాండ్ దగ్గరలో అడ్డగించారు. అక్కడి నుంచి ఆ బస్సును వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. ఈవిషయాన్ని గుర్తించిన బస్సులోని కొందరు బస్సు నుంచి కిందకు దూకి బస్సును అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అనంతరం బస్సును నేరుగా రూరల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత నుంచి ఇక్కడ హైడ్రామా నడిచింది. బస్సులో వున్న వారిని కిందకు దిగనివ్వకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే అందులో మహిళలు ఎక్కువ మంది వుండటం గమనార్హం. మరోవైపు మహిళలు లఘుశంఖ తీర్చుకునేందుకైనా అనుమతించాలంటూ పోలీసులను వేడుకున్నా వారు దానికి ససేమిరా అనేశారు. అంతేకాకుండా బస్సు తలుపుల వద్ద పోలీసులు మోహరించి ఒక్కరు కూడా కిందకు దిగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ సమయంలో కొంతమంది నాయకులు బస్సునుంచి కిందకు దిగినా వారిని పోలీసులు స్టేషన్‌లోకి తరలించి వారిని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. చివరకు ఈ వ్యవహారం ఎంతకూ పరిష్కారం కాకపోవడం, మరోవైపు మహిళలు ఇబ్బందులు ఎదుర్కోవడంతో కొంతమంది బస్సు కిటికీల నుంచి తీవ్ర ఇబ్బంది పడుతున్న మహిళలు కొందరు కొంతమంది సహాయంతో కిందకు దిగి లఘుశంఖ తీర్చుకుని రావాల్సి వచ్చింది. దీన్ని కూడా పోలీసులు అడ్డుకోవడంతో నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఇక్కడ హైడ్రామా ఇలా నడుస్తుండగా మరోవైపు గరగపర్రు నుంచి దళితులు తరలి వచ్చారన్న సమాచారం తెలుసుకున్న కలెక్టర్ వారి సమస్యలను తెలుసుకునేందుకు చొరవ చూపారు. మరోవైపు రూరల్ పోలీసుస్టేషన్ వద్ద గరగపర్రు దళిత కుటుంబాలను నిర్బంధించారన్న సమాచారం అందుకుని దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. అరెస్టు చేసిన వారిని విడిచిపెట్టాలని కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వారిని అంగీకరించాలని డిమాండ్ చేశారు. చివరకు ఈ విషయంలో పోలీసుల అత్యుత్సాహాన్ని తీవ్ర స్థాయిలో ప్రతిఘటించడంతో వారు కొంత తగ్గాల్సి వచ్చింది. పోలీసుస్టేషన్ వద్దకు చేరుకున్న దళిత సంఘాల నేతలు మెండెం సంతోష్‌కుమార్, నేతల రమేష్‌కుమార్, యారం సునీల్‌కుమార్, కళింగ లక్ష్మణరావు, కెవిపిఎస్ నేత రామకృష్ణ, గరగపర్రు ఉద్యమ కన్వీనర్ రాజేష్, సిపిఐ నేతలు నెక్కంటి సుబ్బారావు, బండి వెంకటేశ్వరరావు, కె కృష్ణమాచార్యులు, సిపిఎం నేతలు పి కిషోర్, బి సోమయ్య, కౌలురైతుల సంఘం కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించారు. దళితులందరికి న్యాయం చేస్తామని చెప్పిన మంత్రుల మాటను కాదని జిల్లా యంత్రాంగం ఇప్పుడు కొంతమందికి నష్టపరిహారం ఇచ్చేది లేదని చెప్పడం దారుణమని మెండెం సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. కొద్దిసేపటి తర్వాత వారంతా పాదయాత్రగా అక్కడి నుంచి బయలుదేరి కలెక్టరేట్‌కు చేరుకుని కొద్దిసేపు ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గరగపర్రు గ్రామంలో దళితులకు అన్ని విధాలా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. గ్రామానికి చెందిన 173 కుటుంబాలకు మాత్రమే పరిహారం ఇచ్చారని, వీరిలో 53 కుటుంబాలకు ఆన్‌లైన్ ద్వారా ఇస్తామని రెవిన్యూ అధికారులు హామీ ఇచ్చారని, మిగిలిన 84 కుటుంబాలకు ఎలాంటి పరిహారం అందలేదని దళితులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం అర్హతను బట్టి ప్రతీ దళితునికి న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఇళ్లు, ఇళ్ల స్థలాల విషయంలో దరఖాస్తు చేస్తే అర్హులైన వారందరికీ మంజూరు చేస్తామని చెప్పారు.

మత్స్య సంపద అభివృద్ధికి రూ.216 కోట్లు
-మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్
ఉంగుటూరు: మత్స్య సంపద అభివృద్ధికి రూ.216 కోట్ల మేర నిధులు కేటాయించినట్టు రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్ వెల్లడించారు. శుక్రవారం ఉంగుటూరు మండలం బాదంపూడిలో మత్స్య అభివృద్ధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో నాయక్ మాట్లాడుతూ మత్స్యకార జనాభా దామాషా ప్రకారం రూ.216 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత కోస్తా కారిడార్‌లో ఆక్వారంగం ప్రధాన ఆలయ వనరు అయ్యిందని నాయక్ పేర్కొన్నారు. మత్స్య సంపద అభివృద్ధి చేసేందుకు ఈ నిధులు వెచ్చిస్తున్నట్టు తెలిపారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ఏడాదికి రెండు నెలల వేట నిషేధ సమయంలో లబ్దిదారునికి రూ.4 వేలు చొప్పున అందించనున్నట్టు తెలిపారు. అలాగే మరపడవులు, వలలు, ప్రమాద సమయంలో బాధిత కుటుంబానికి సహాయం నిమిత్తం రూ.50 కోట్లు కేటాయించినట్టు నాయక్ తెలిపారు. రాష్ట్రంలోని ఇన్‌ల్యాండ్ ఫిషరీష్ కేంద్రాలు అభివృద్ధి చేసేందుకు రూ.60 కోట్లు వెచ్చిస్తున్నట్టు చెప్పారు. మత్స్యకార సహకార సొసైటీల సభ్యులకు చేపల వేటకు ఉపయోగపడే వలలు, మేత, వాహనాలు, ద్విచక్ర వాహనాలు అందించేందుకు రూ.40 కోట్లు, ఆక్వా రంగంపై ఆధారపడి జీవిస్తున్న చిన్న, సన్నకార రైతాంగానికి రూ.60 కోట్లు కేటాయించినట్టు వివరించారు. బాదంపూడి మత్స్యకేంద్రాన్ని అభివృద్ధి చేసేందుకు కలెక్టర్‌తో మాట్లాడినట్టు నాయక్ వెల్లడించారు. ఆయన వెంట జాయింట్ డైరెక్టర్ అంజలి, డిప్యూటీ డైరెక్టర్ వివి రావు, ఎడి రాధాకృష్ణ, ఫిషరీస్ ఇన్‌స్పెష్టర్ వెంకటేశ్వరరావు ఉన్నారు.
జిల్లాలో 42 చెక్‌పోస్టులు: విజిలెన్స్ ఎస్పీ
జీలుగుమిల్లి, ఆగస్టు11: జిల్లాలో 42 విజిలెన్స్ చెక్‌పోస్టులు నిర్వహిస్తున్నట్టు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ కె బాల వెంకటేశ్వరరావు చెప్పారు. శుక్రవారం ఆయన జీలుగుమిల్లిలో ప్రతి వారం నిర్వహించే విజిలెన్స్ చెక్‌పోస్టును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జీలుగుమిల్లి ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద ప్రతి వారం విజిలెన్స్ చెక్‌పోస్టు నిర్వహించి, అన్ని శాఖల అధికారులు సక్రమంగా పన్నులు కట్టించుకుంటున్నదీలేనిదీ పరిశీలిస్తున్నట్టు చెప్పారు. అనంతరం రవాణా కార్యాలయాన్ని సందర్శించి అసిస్టెంట్ ఎంవిఐ ప్రభాకర్‌ను సరిహద్దు పన్నుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజిలెన్స్ చెక్‌పోస్టు ద్వారా 2,31,914 రూపాయల ఆదాయం లభించింది. విజిలెన్స్ తనిఖీల్లో తహసీల్దారు వి శైలజ, మైన్స్ ఎజి టి జయప్రకాశ్, మైన్స్ ఆర్‌ఐ ఎం సురేష్‌కుమార్, సివిల్ సప్లైయ్స్ డిటి కె రమేష్, ఎఫ్‌ఎస్‌ఒ వి ధర్మారావుతదితరులు పాల్గొన్నారు.

ఇదో గూడుపుఠాణి
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం: భీమవరంలో 82 ఎకరాల్లో నిర్మించతలపెట్టిన ఇళ్ళ నిర్మాణంలో పేద ప్రజలను అడుగడుగునా మోసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైసిపి కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ ఆరోపించారు. ఇది పేదల ఇళ్ల పథకంలా లేదని, రూ.400 కోట్లు దోచుకోవడానికి వేసిన పథకంలా ఉందన్నారు. శుక్రవారం వైసిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసలు 82 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణం లెక్కకడితే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఇచ్చే సబ్సిడీ సొమ్ముతోనే ఎటువంటి బ్యాంకు రుణం లేకుండా ఒక్కో సెంటు స్థలంలో ఇంటిని నిర్మించవచ్చునన్నారు. అయితే దోపిడీ పథకం రూపకర్తలు మాత్రం పేద ప్రజల తలలను మాత్రం బ్యాంకుల్లో తాకట్టుపెడుతున్నారని దుయ్యబట్టారు. 300, 365, 430 చదరపు అడుగుల ఇంటి విషయంలో కార్పెట్ ఏరియాను పరిశీలిస్తే ఎంత మోసం జరుగుతుందో తేలిపోతుందన్నారు. నిన్న ఒక ధర, ఇవ్వాళ మరో ధర, రుణం, సబ్సీడీలు మరో విధంగా ఉన్నాయని గ్రంధి శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండటానికి కన్నా వ్యక్తిగత గృహానికే మొగ్గుచూపుతున్నారన్నారు. తాము గతంలో అధికారులను గౌరవంగా కలిసి ఇళ్ళ నిర్మాణం గురించి చెప్పామని, లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటుచేయాలని సూచించామని, అయినా సమావేశం ఏర్పాటు చేయకుండా ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఇళ్లు నిర్మించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి అధికారంలోకి రాగానే సెంటు స్థలంలో రూపాయి రుణం లేకుండా సొంత ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. గాదిరాజు తాతరాజు, కొల్లు ప్రసాద్, రేవూరి గోగురాజు, పేరిచర్ల సత్యనారాయణరాజు, పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్ పాల్గొన్నారు.
జిఎస్టీ కౌన్సిల్‌ను కలిసిన సినీ నిర్మాతలు
ఏలూరు: చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి నటీనటులు, పంపిణీదారులు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను గురించి ఆంధ్రప్రదేశ్ ఫిలిమ్, టివి, చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్ధ ఛైర్మన్ అంబికా కృష్ణ ఆధ్వర్యంలో పలువురు తెలుగుచలనచిత్ర నిర్మాతలు శుక్రవారం న్యూఢిల్లీలోని జిఎస్‌టి కౌన్సిల్ సభ్యులను కలుసుకుని వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా అంబికా కృష్ణ మాట్లాడుతూ జిఎస్‌టి పన్ను విధానంలో కొన్ని మార్పులు చేయాలని, కొన్ని విషయాలలో స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఫిలిమ్ ఛాంబర్ అధ్యక్షులు కిరణ్, ఏలూరు ఎంపి మాగంటి బాబు, రాజమండ్రి ఎంపి మాగంటి మురళీమోహన్, ఎంపి జెసి దివాకర్‌రెడ్డి, నిర్మాతలు సి కళ్యాణ్, అంబికా రామచంద్రరావు, బూరుగుపల్లి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అంబికా కృష్ణ మాట్లాడుతూ తాము చెప్పిన విషయాలను జిఎస్‌టి కౌన్సిల్ సభ్యులు సావధానంగా విన్నారని, సానుకూలంగా స్పందించారని చెప్పారు.
స్వాతంత్య్ర దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు
ఏలూరు : జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధితాధికారులను కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో స్వాతంత్య్ర దినోత్సవం ఏర్పాట్లుపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం మాదిరిగా ప్రతీ ఉద్యోగి హాజరును బయోమెట్రిక్ అటెండెన్స్ ద్వారా తీసుకోవడం జరుగుతుందని, కావున ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరుకావాలని చెప్పారు. వివిధ శాఖల వారు స్టాల్స్‌తోపాటు, శకటాలను కూడా ప్రదర్శించాలని ముఖ్యంగా వ్యవసాయం, ఐటిడి ఏ, వైద్య ఆరోగ్యం, కార్మిక, ఫిషరీస్, మైక్రో ఇరిగేషన్, ఉద్యానవనం, ఐటి శాఖ, బిసి, ఎస్‌సి, కాపు కార్పొరేషన్, డిఇవో, సర్వశిక్ష అభియాన్, డిఆర్‌డిఎ, అటవీశాఖ, ఆర్‌డబ్ల్యుఎస్ తదితర శాఖల వారు ప్రజలకు అర్ధమయ్యే తీరులో పధఖాలను ప్రదర్శించాలన్నారు. ఈసారి ఉద్యోగులకు ఎవరైతే మంచి ప్రతిభను కనపరిచారో, నిబద్ధతతో కూడిన పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా అధికారులు అటువంటి ఉద్యోగుల పేర్లను శనివారం సాయంత్రం లోగా డి ఆర్‌వోకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. పేర్లు ఇవ్వడమే కాకుండా వారు చేసే పనులను కూడా సమగ్రంగా వివరించి ఇచ్చిన పట్టికలో పంపించవలసి వుంటుందని అన్నారు. ఏ అధికారి అయినా మూడు సంవత్సరాల లోపు సర్ట్ఫికెట్లు తీసుకుంటే వారు మరల సర్ట్ఫికెట్లు తీసుకోవడానికి అర్హులు కారని చెప్పారు. జిల్లాలో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా ఒక మనిసిని నియమించి వారిని తీసుకువచ్చి సన్మానం అయిన తర్వాత వెనక్కి తీసుకుని వెళ్లి వారి గృహాలలో ఉంచిరావాల్సిందిగా కలెక్టర్ డి ఆర్‌వోను ఆదేవించారు. గత సంవత్సరం ఏర్పాటు చేసినట్లుగానే విద్యార్ధినీ విద్యార్ధులో వివిధ రకాల కార్యక్రమాలు కూడా గవర్నమెంటు స్కూల్స్, మూడు ప్రైవేటు స్కూల్స్ ఎంపిక చేయాలని డి ఇవోను ఆదేశించారు. సమావేశంలో జెసి కోటేశ్వరరావు, జెసి-2 షరీఫ్, డి ఆర్‌వో కె హైమావతి, ఆర్‌డివో జి చక్రధరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అక్రమ రొయ్యల చెరువు ధ్వంసం
ఆచంట: నిబంధనలకు విరుద్ధంగా తవ్విన రొయ్యల చెరువును శుక్రవారం మత్స్యశాఖ అధికారులు ధ్వంసం చేశారు. ఆచంట మండలం శేషమ్మచెర్వు గ్రామానికి చెందిన మనె్న సుభద్రమ్మ వరి చేను పక్కన ఇదే గ్రామానికి చెందిన మనె్న వేణు, బొప్పన సత్యనారాయణ మూడెకరాల రొయ్యల చెర్వును నిబంధనలకు వ్యతిరేకంగా తవ్వారని, ఈ చెర్వు వలన తమ పంటచేను పూర్తిగా పాడైపోతోందని ఇటీవల ఏలూరు కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన కలెక్టర్ కాటంనేని భాస్కర్ వెంటనే ఆ చెర్వును ధ్వంసం చేయాలని మత్స్యశాఖాధికారులను ఆదేశించడంతో శుక్రవారం పొక్లెయిన్లతో చెర్వును ధ్వంసంచేశారు. మత్స్యశాఖ అభివృద్ధి అధికారి ఎల్‌ఎల్‌ఎన్ రాజు, ఎంపిఇవో వివి సత్యనారాయణ పాల్గొన్నారు.
ఉంగుటూరులో ఆర్‌ఒబి నిర్మాణానికి పరిశీలన
ఉంగుటూరు: రైల్వే ఓవర్‌బ్రిడ్జి (ఆర్‌ఒబి) నిర్మాణం కోసం విజయవాడ నుండి వచ్చిన రైల్వే అధికారుల బృందం ఉంగుటూరు సెంటర్‌ను శుక్రవారం పరిశీలించింది. రైల్వే గేటు, స్టేషన్ రోడ్డు, జాతీయ రహదారి కూడలిని బృందం పరిశీలించింది. తాడేపల్లిగూడెం వైపు జాతీయ రహదారిపై 500 మీటర్లు, ఏలూరు వైపు 500 మీటర్లు, అలాగే నల్లజర్ల రోడ్డుకు 600 మీటర్లు ఫ్లైఓవర్ నిర్మాణం జరగనుంది. రైల్వే డిఇ వంశీకృష్ణ, ఎఇ రామశాస్ర్తీ, తాడేపల్లిగూడెం ఆర్‌అండ్‌బి ఎఇ ప్రభాకరరావు, సర్వేలో పాల్గొన్నారు.

మంత్రి శిద్ధాకు ఆకివీడు సర్పంచ్ సన్మానం
ఆకివీడు: రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు షష్ఠిపూర్తి సందర్భంగా ఆకివీడు సర్పంచ్ గొంట్లా గణపతి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఒంగోలులో జరిగిన షష్ఠిపూర్తి కార్యక్రమానికి వెళ్ళి రాఘవరావు దంపతులను సన్మానించారు. పట్టణ టిడిపి అధ్యక్షులు బొల్లా వెంకటరావు, పచ్చిగోళ్ళ శేషు మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
ఆంధ్రాలో పెరిగిన బిజెపి బలం
-పార్టీ రాష్ట్ర సమన్వయకర్త రఘురాం
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం: దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి బలం పెరిగిందని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త పురిఘళ్ళ రఘురాం అన్నారు. బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కావడంతో మరింతగా ఆదరిస్తున్నారన్నారు. శుక్రవారం భీమవరంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు సాగరమాల, సేతుభారతం ఒక వరమన్నారు. సాగరమాల ద్వారా కోస్తాతీర ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతోందని, సేతు భారతం ద్వారా దేశవ్యాప్తంగా లక్ష వంతెనలు నిర్మిస్తున్నారన్నారు. బూత్‌ల కమిటీల నిర్మాణం విజయవంతంగా జరుగుతోందని రఘురాం తెలిపారు. మధ్యప్రదేశ్, గుజరాత్‌లను ఆదర్శవంతంగా తీసుకుని ప్రణాళికాబద్ధంగా పార్టీ సంస్థాగతంగా బలపడుతోందన్నారు. కమ్యూనిస్టు కోటగా ఉన్న త్రిపురలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లోని మణిపూర్, మిజోరామ్, నాగాలాండ్, దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలో పార్టీ విజయపతాకాలు ఎగరవేస్తామన్నారు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ను బిజెపి ఎండగడుతోందని, ఆంధ్రాలో టిడిపిలో పొత్తులో ఉన్నా ఇక్కడ పార్టీ బలం మరింతగా పెరిగిందన్నారు. అభివృద్ధి, మిగులు విద్యుత్, రాష్ట్రానికి 10లక్షలకు పైగా ఇళ్ళు, పోలవరం నిధులు, హౌసింగ్ ఫర్ ఆల్ వంటి ఆనేక పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షాదని కొనియాడారు. రైల్వే ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్ పరిశీలనలో ఉందని, అమలాపురం-అమరావతి రైల్వే పనులు టెండర్ల దశలో ఉన్నాయన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అల్లూరి సాయిరాజు, జిల్లా ఎస్సీ మోర్చ అధ్యక్షులు బూసి సురేంద్రనాధ్ బెనర్జీ, యువమోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోకవరపు శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఆర్టీసీ పరిరక్షణే లక్ష్యం
జంగారెడ్డిగూడెం: ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ పనిచేస్తోందని ఎన్‌ఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు చెప్పారు. ఆర్టీసీ మనుగడ సాగించాలంటే కొత్త బస్సులు అవసరమని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి కోరగా మూడు వేల బస్సుల కొనుగోలుకు అంగీకరించారని, ఇప్పటికే 1,800 బస్సులు వచ్చాయన్నారు. ఎన్‌ఎంయు ఆవిర్భావ వేడుకలు స్థానిక ఆర్టీసీ డిపోలో శుక్రవారం డిపో కార్యదర్శి కె మల్లికార్జునరావు నాయకత్వంలో ఘనంగా నిర్వహించారు. ఎన్‌ఎంయు పతాకాన్ని శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అనంతరం రీజనల్ ఛైర్మన్ ఆలపాటి సూర్యచంద్రరావు అధ్యక్షతన జరిగిన సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్టీసీలో 4,700 కాలం చెల్లిన బస్సులు ఉంటే గతంలో గుర్తింపు పొందిన యూనియన్ కొత్త బస్సులు రప్పించలేక పోయిందన్నారు. కార్మికులకు రావలసిన ప్రయోజనాలు సాధించలేక పోయిందన్నారు. ఎన్‌ఎంయుకు తిరిగి గుర్తింపు లభించిన వెంటనే పరిస్థితులు అధ్యయనం చేసి, యాజమాన్యం, ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆర్టీసీ పునరుజ్జీవనానికి నాంది పలికినట్టు చెప్పారు. 2012 నుండి కార్మికులకు చెల్లించాల్సిన 370 కోట్ల రూపాయల డిఎ బకాయిలు మూడు విడతలుగా ఇప్పించామన్నారు. 3,170 మంది కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయించామన్నారు. విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికులకు చెందిన 1,400 కుటుంబాలకు పదవ తరగతి అర్హత ఉంటే ఉద్యోగం ఇచ్చే విధంగా రెగ్యులేషన్, జీఒలు మార్పు చేయించామన్నారు. కార్మికుల కోసం విజయవాడలో నూతన ఆసుపత్రి నిర్మాణం, వైద్యుల నియామకం, కొత్త పరికరాలు సాధించామని చెప్పారు. ఆర్టీసీ చరిత్రలో చనిపోయిన కార్మికుని కుటుంబాన్ని ఆదుకోలేదని, ఇప్పుడు ప్రమాదంలో మృతి చెందిన కార్మికునికి పది లక్షలు చెల్లించేలా బీమా పథకం తెచ్చామని చెప్పారు. ఉద్యోగ విరమణ చేసిన కార్మికునికి కనీసం నెలకు 20 వేల రూపాయల పెన్షన్ వచ్చేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. కార్మికుల 60 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవు ఎన్‌క్యాష్మెంట్ ఇప్పించేందుకు 7.6 కోట్లు సాధించామన్నారు. ఈ నెలలో విజయవాడలో జరిగే యూనియన్ స్వర్ణోత్సవ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారని, ఆసభలోనే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేసారు. ఎన్‌ఎంయు రాష్ట్ర ఛైర్మన్ ఆర్‌వివిఎస్‌డి ప్రసాద్ మాట్లాడుతూ ఆర్టీసీలో చిరుద్యోగి పి రామ్మోహనరావు స్థాపించిన యూనియన్ ఎన్‌ఎంయు నేడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని కార్మిక సేవలో తరిస్తోందన్నారు. కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కారీ రవాణా వ్యవస్థను కుప్పకూల్చివేసి, ప్రయివేటుకు ఇవ్వాలని చూస్తున్నారని, ఇటువంటి ప్రయత్నాలను ఎన్‌ఎంయు తిప్పకొట్టినట్టు చెప్పారు. సమావేశంలో ఎన్‌ఎంయు డిపో గౌరవాధ్యక్షుడు పెనుమర్తి రాంకుమార్, నాయకులు గారపాటి రామారావు, తోట వెంకటేశ్వరరావు, బి రామకృష్ణ, కె మల్లికార్జునరావు, జివిఎస్ నారాయణ, ఛైర్మన్ డివిఎస్‌ఎన్‌టి రాజు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా పట్టణంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు.