తూర్పుగోదావరి

నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్‌కు రూ.3000 లంచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎసిబికి చిక్కిన ముమ్మిడివరం నగర పంచాయతీ మేనేజర్ శ్రీలక్ష్మి
ముమ్మిడివరం: బిసి కార్పొరేషన్ రుణానికి అవసరమైన నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడానికి లబ్ధిదారుడి నుండి రూ.3000 లంచం తీసుకుంటూ ముమ్మిడివరం నగర పంచాయతీ మేనేజర్ బి శ్రీలక్ష్మి అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులకు దొరికిపోయారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం ముమ్మిడివరం నగర పంచాయతీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి రాజమండ్రి ఎసిబి డిఎస్పీ సుధాకరరావు తెలిపిన వివరాలిలావున్నాయి. ముమ్మిడివరం నగర పంచాయతీ నాలుగో వార్డుకు చెందిన మట్టపర్తి వెంకటరమణ బిసి కార్పొరేషన్‌కు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే రుణం పొందాలంటే నగర పంచాయతీలో బకాయిలు ఏమీలేనట్టుగా నో అబ్జక్షన్ సర్ట్ఫికెట్ జతచేయాల్సివుంది. దాని కోసం వెంకటరమణ గతంలో పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా వివిధ కారణాలతో అధికారులు తిరస్కరించారు. అయితే మళ్లీ ఈ నెల 1వ తేదీన మరోమారు వెంకటరమణ నో అబ్జక్షన్ సర్ట్ఫికెట్ కోసం కమిషనర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ దరఖాస్తు మేనేజర్ బి శ్రీలక్ష్మి వద్దనే ఉండిపోవడంతో వెంకటరమణ ఆమెను సంప్రదించాడు. నో అబ్జక్షన్ సర్ట్ఫికెట్‌ను ఇవ్వాలంటే రూ.5000 లంచం ఇవ్వాలని శ్రీలక్ష్మి డిమాండ్ చేసిందన్నారు. అంత లంచం తాను ఇవ్వలేనని వెంకటరమణ చెప్పడంతో మూడువేలుకు ఒప్పందం కుదిరింది. అయితే నగర పంచాయతీ సిబ్బంది పెట్టిన ఇబ్బందులతో విసిగిపోయిన వెంకటరమణ ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎసిబి అధికారులు శుక్రవారం వలపన్నారు. కార్యాలయంలలో మేనేజర్ శ్రీలక్ష్మి రూ.3000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఎసిబి డిఎస్పీ సుధాకర్ తెలిపారు. స్థానిక తహసీల్దార్ ఎం వీర్రాజు సమక్షంలో లాంఛనాలు పూర్తిచేసి శ్రీలక్ష్మిని రాజమహేంద్రవరానికి తరలించారు. ఈ దాడుల్లో ఎసిబి ఇన్‌స్పెక్టర్లు పుల్లారావు, మోహనరావు, సిబ్బంది పాల్గొన్నారు.

సిఎం పర్యటన ఖరారు
రాజమహేంద్రవరం: అఖండ గోదావరి నది ఎడమ గట్టుపై నిర్మించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం గోదావరి జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగస్టు 15న సీతానగరం మండలం చీపురుపల్లి వద్ద పూజ నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగస్టు 15వ తేదీ మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి రాకకు పర్యటన ఏర్పాట్లు సాగుతున్నాయ. ఇప్పటివరకు ఖరారైన పర్యటనను బట్టి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెలీకాఫ్టర్‌లో సీతానగరం కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌లో దిగుతారు. అక్కడ నుంచి బస్సులో పది కిలో మీటర్ల దూరంలో ఉన్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి చేరుకుని అక్కడ పథకాన్ని ప్రారంభించి మోటార్లకు స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేస్తారు. వెంటనే బయలుదేరి సీతానగరం హెలీప్యాడ్‌కు చేరుకుని అక్కడ నుంచి చీపురుపల్లి చేరుకుంటారు. ముఖ్యమంత్రి హెలీకాప్టర్‌లో అక్కడకు చేరుకునేలోగా పురుషోత్తపట్నం పథకం ద్వారా గోదావరి జలాలు అక్కడకు చేరుకుంటాయి. ఈ జలాలకు పసుపు, కుంకుమ వేసి పుష్పాభిషేకం చేస్తారు. అక్కడ నుంచే హెలీకాప్టర్‌లో బయలుదేరి జగ్గంపేట సమీపంలోని కృష్ణవరం వద్ద పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం స్టేజ్-2 పంపుహౌస్‌లో స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేస్తారు. అనంతరం గోకవరం-జగ్గంపేట రోడ్డులో జగ్గంపేట వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో రైతులనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

మేయర్ పీఠానికై పోటాపోటీ...

టిడిపిలో ఐదుగురి మధ్య పోటీ-వైసిపిలో ఆశావహుల ప్రయత్నాలు

ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ: కాకినాడ నగర పాలక సంస్థ మేయర్ పీఠానికై అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్ధులు విశ్వప్రయత్నాల్లో ఉన్నారు. నగర ప్రథమ మహిళ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసుకునేందుకు హోరాహోరీగా పావులు కదుపుతున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన మహిళకే మేయర్ పీఠం ఇస్తామని తెలుగుదేశం ప్రకటించడంతో సామాజికపరంగా ఓ స్పష్టత వచ్చింది. దీంతో సదరు ఆశావహులు ఎవరికి వారు తీసిపోని రీతిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం హైకమాండ్ కాకినాడ నగర ప్రజలకు ఫోన్ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేస్తోంది. శుక్రవారం నుండి ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. తమకు నచ్చిన అభ్యర్ధిని ఫోన్ ద్వారా ఓటు వేసి ఎంపిక చేయాలని పార్టీ కోరుతోంది. ప్రస్తుతం కార్పొరేటర్లుగా పోటీలో ఉన్న అడ్డూరి లక్ష్మి, సుంకర శివప్రసన్న, సుంకర పావని, జ్యోతుల ఇందిర, ఎం శేషకుమారి వీరిలో ఎవరు నచ్చితే వారికి మద్దతు తెలియజేస్తూ సదరు అంకెను ప్రెస్ చేయాలని సూచిస్తోంది. ఎవరూ నచ్చని పక్షంలో ఆ విషయాన్ని కూడా ధ్రువీకరించాలని స్పష్టం చేసింది. నగర ప్రజల మొబైల్స్‌కు ఓ నంబరు ద్వారా ఈ సందేశం చేరుతోంది. ఇదిలావుంటే పై ఐదుగురిలో ఒకర్ని ఇప్పటికే ఎంపిక చేసి అధిష్ఠానానికి స్థానిక నేతలు సూచించినట్టు సమాచారం! సదరు అభ్యర్ధి తొలుత కార్పొరేటర్‌గా ఎన్నిక కావల్సి ఉంది. మేయర్ పీఠం కోసం విశ్వప్రయత్నాలు సాగిస్తున్న జ్యోతుల ఇందిర, సుంకర శివప్రసన్నను ఒకే డివిజన్ నుండి కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు నామినేషన్లు వేశారు. వీరిరువురూ మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నారు. ఒకవేళ ఇందిరను కార్పొరేటర్ అభ్యర్ధిగా పార్టీ ప్రకటించిన పక్షంలో శివప్రసన్న స్వతంత్య్ర అభ్యర్ధిగా బరిలో ఉండాలని నిర్ణయించుకున్నట్టు భోగట్టా! వైసిపి విషయానికి వస్తే మేయర్ స్థానాన్ని ఫలానా సామాజికవర్గానికి ఇస్తామని ప్రకటించలేదు. అయినప్పటికీ ఇక్కడ కూడా కాపు సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధుల్లోనే ప్రధానంగా పోటీ నడుస్తోంది.

పొత్తు కుదిరింది...!
-బిజెపికి 9 డివిజన్లు ఇవ్వడానికి టిడిపి సమ్మతి
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ: కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో టిడిపి-బిజెపి మధ్య పొత్తు ఖరారయ్యింది. శుక్రవారం పొద్దుపోయిన తరువాత మిత్రపక్షమైన బిజెపికి 9సీట్లు ఇవ్వాలని టిడిపి నిర్ణయించింది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, జిల్లా మంత్రుల పరిశీలన అనంతరం సీట్ల సర్దుబాటు జరిగినట్టు టిడిపి జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు తెలిపారు. అయితే ఏయే డివిజన్లను కేటాయించాలన్న విషయమై స్పష్టత రావల్సివుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య చెప్పారు. తాము 14 డివిజన్లు ఇవ్వాలని చివరిగా కోరామని, 9 ఇవ్వాలని టిడిపి నిర్ణయించినట్టు తెలిసిందని పేర్కొన్నారు. 48 డివిజన్లకు గాను 26 డివిజన్ల నుండి పోటీ చేసేందుకు బిజెపి అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టిడిపితో పొత్తు ప్రకారం 9 డివిజన్లలో బిజెపి అభ్యర్ధులు పోటీ చేసిన పక్షంలో మిగిలిన డివిజన్లలో బరి నుండి తప్పుకోవల్సి ఉంటుంది. 39 డివిజన్లలో టిడిపి అభ్యర్ధులు పోటీ చేస్తారు. ఉభయ పార్టీలూ ఆయా డివిజన్లలో పరస్పర సహకారంతో పోటీ చేయాల్సి ఉంటుంది.

మత్తు వదలరా...!
రామచంద్రపురం: రామచంద్రపురం సబ్‌డివిజన్ పోలీస్ అధికారి ఎన్‌బిఎం మురళీకృష్ణ నేతృత్వంలో సబ్‌డివిజన్ పరిధిలో జాతీయ రహదారిపై ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు చోటు చేసుకోకుండా చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఆలమూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జొన్నాడ వంతెన నుండి కడియం పోలీస్ స్టేషన్ సరిహద్దు వరకుగల జాతీయ రహదారి రామచంద్రపురం పోలీస్ సబ్‌డివిజన్ అధికారుల నియంత్రణలోనే ఉంది. దీంతో ఆ ప్రాంతంలో పలు ప్రదేశాలలో జరుగుతున్న ఘోర రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రాష్ట్ర డిజిపి, ఏలూరు రేంజ్ డిఐజి, జిల్లా ఎస్‌పి తదితర ఉన్నతాధికారుల ఆదేశాలు, సూచనలకు అనుగుణంగా సబ్‌డివిజన్ పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సహజంగా అర్ధరాత్రి తరువాత వాహనాలు నడిపే చోదకులకు నిద్రమత్తు వచ్చే అవకాశం ఉన్నందువల్ల, ప్రమాదాలు జరుగుతాయనుకునే పోస్టుల వద్ద పోలీసు అధికారులు అప్రమత్తతగా ఉంటూ.. వాహన చోదకులకు చల్లటినీరిచ్చి, ముఖాలను కడిగించి, కొద్దిసేపు విశ్రాంతి చేయించి, ముందుకు వాహనాలను పంపుతున్నారు. ఈ కార్యక్రమం చేపట్టిన అనంతరం గతంలో ఏ ప్రాంతాలలోనైతే.. రహదారి ప్రమాదాలు జరిగి, విలువైన ప్రాణాలను కోల్పోయారో.. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలను గణనీయంగా అరికట్టారని చెప్పవచ్చు. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత రామచంద్రపురం సర్కిల్ పరిధిలోని కె గంగవరం ఎస్సై జి నరేష్ డ్యూటీలో ఉంటూ వచ్చీ.. పోయే.. వాహనాలను ఆపి, డ్రైవర్లకు నిద్రమత్తు వదిలించేందుకు చల్లటి నీటితో ముఖాలను కడిగించారు.

విద్యుత్ బిల్లుల సమస్యపై గళమెత్తిన నర్సరీ రైతులు
కడియం: విద్యుత్ బిల్లుల సమస్యపై కడియం మండలంలోని నర్సరీ రైతులు ఆందోళనకు సమాయత్తమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క ఉచిత విద్యుత్తును అమలు చేస్తామని చెబుతూనే నర్సరీలకు విద్యుత్ మీటర్లు బిగించి బిల్లులు చెల్లించాలని విద్యుత్ శాఖ వసూలు చేయడం పట్ల నర్సరీ రైతులు మండిపడుతున్నారు. శుక్రవారం కడియపు లంక సర్‌ఆర్ధర్ కాటన్ నర్సరీమెన్ అసోసియేషన్ కార్యాలయ ఆవరణలో నర్సరీ రైతులంతా సమావేశమయ్యారు. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించాలని నిర్ణయించారు. నర్సరీల మనుగడకు విద్యుత్ బిల్లుల సమస్య ఇబ్బందిగా మారుతుందని నర్సరీమెన్ అసోసియేషన్ అధ్యక్షుడు పుల్లా చంటి, మాజీ అధ్యక్షుడు తాడాల వీరాస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. 2004లో ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నర్సరీలకు ఉచిత విద్యుత్తు అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారని, అప్పటి నుండి విద్యుత్ బిల్లుల సమస్య లేదని పేర్కొన్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చాక విద్యుత్ బిల్లులు చెల్లించాలని అధికారులు వత్తిడి తేవడంతో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో నర్సరీ రైతులు స్వయంగా సిఎంను కలిసి సమస్యను విన్నవించారు. అప్పటి నుండి మిన్నకుండిన విద్యుత్ అధికారులు గత ఆరు నెలలుగా పలు నర్సరీలకు విద్యుత్ మీటర్లు బిగిస్తూ బిల్లులు చెల్లించాలని వత్తిడి తేవడం మొదలుపెట్టారు. దీంతో నర్సరీ రైతులు ప్రత్యక్ష ఆందోళనకు దిగాలని నిర్ణయించుకున్నారు. అవసరమైతే కొన్నిరోజులు మొక్కల విక్రయాలను కూడా నిలిపివేసి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని నర్సరీ రైతులు వ్యూహరచన చేస్తున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో పలువురు నర్సరీ రైతులు, పాలకవర్గం డైరెక్టర్లు పాల్గొన్నారు.

పుష్కరతో మెట్టను సస్యశ్యామలం చేస్తాం
-తాళ్లూరు లిప్టు ప్రారంభించిన జడ్పీ ఛైర్మన్ నవీన్
గండేపల్లి: తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను అందించి మెట్టప్రాంతాన్ని సస్యశ్యామలం చేయనున్నట్టు జిల్లా పరిషత్ ఛైర్మన్ జ్యోతుల నవీన్‌కుమార్ పేర్కొన్నారు. గండేపల్లి మండలం తాళ్లూరు వద్ద ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ను శుక్రవారం ఆయన స్విచ్ ఆన్‌చేసి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నవీన్‌కుమార్ లిఫ్ట్‌లోని పంపులను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. లిఫ్ట్ పరిధిలోని ఆయకట్టు అంతటికి సాగునీరు సక్రమంగా అందించాలని సూచించారు. అంచెలంచెలుగా నీటిని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు నవీన్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. రైతు శ్రేయస్సే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని చెప్పారు. తాళ్లూరు లిఫ్ట్ ఆయకట్టు పరిధిలోని సీతారాంపురం, రాజపూడి, మల్లిసాల, తాళ్లూరు, ఉప్పలపాడు, సుబ్బాయమ్మపేట, మల్లేపల్లి, గండేపల్లి, ఎన్‌టి రాజాపురం, సింగరంపాలెం, రామయ్యపాలెం, మురారి గ్రామాలకు నీటిని సక్రమంగా అందేవిధంగా అధికారులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆయన వెంట అత్తులూరి సాయిబాబు, పుష్కర అధికారులు, రైతులు ఉన్నారు.

సైకిల్ ఎక్కుతున్న సాయి!

14న ముహూర్తం ఖరారు
ముమ్మిడివరం: ముమ్మిడివరానికి చెందిన గుత్తుల సాయి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఒక ప్రధాన సామాజిక వర్గానికి నాయకుడుగా ఉన్న గుత్తుల సాయి వైసిపి పార్టీ తరుపున 2014 ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు. అయితే 2019లో జరిగే ఎన్నికల్లో ఆయనకు ఆర్థిక స్తోమత సరిపోదన్న కారణంతో సాయిని నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పదవి నుండి తొలగించి మరో వ్యక్తికి అప్పగించారు. దాంతో అప్పటినుండి సాయి, అతని అనుచరులు వైసిపికి దూరంగా ఉంటున్నారు. ఈపరిణామాలను గమనిస్తున్న తెలుగుదేశం శ్రేణులు సాయిని టిడిపిలోకి రావాలంటూ గత కొంతకాలంగా మంతనాలు సాగిస్తూ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు చేరవేశారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో సాయికి ఉన్న ఇమేజ్‌పై ఆరాతీసిన చంద్రబాబు భవిష్యత్తులో ఆయనకు మంచి పదవి కల్పించి ప్రాధాన్యత ఇచ్చేందుకు హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో సాయితో పాటు ముమ్మిడివరం నగర పంచాయతీకి చెందిన పలువురు వైసిపి కౌన్సిలర్లతో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు వైసిపి సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, పలువురు నాయకులు ఈ నెల 14న ముమ్మిడివరం నుండి భారీగా రాజధాని అమరావతిలోని వెలగపూడి తరలివెళ్లి టిడిపిలో చేరేందుకు సాయి రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.

24 నామినేషన్లు తిరస్కృతి
కాకినాడ: కాకినాడ నగరపాలక సంస్ధ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పొద్దుపోయే వరకు జరిగింది. దాఖలైన మొత్తం నామినేషన్లలో 24 నామినేషన్లను తిరస్కరించగా 494 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ శనివారం నుంచి 16వ తేదీ వరకు జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం సుమారు 200 మంది వరకు బరిలో ఉంటారని అంచనా.

మహిళా చైతన్య కార్యక్రమాలతో స్ఫూర్తిగా నిలవాలి
కాకినాడ: మహిళా గ్రూపులకు రుణ సౌకర్యం కల్పించడంలో రాష్ట్రంలో మొదటి స్ధానం పొందిన జిల్లాలో పలు మహిళా చైతన్య కార్యక్రమాలను అమలు చేసి, ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కోర్టుహాలులో డిఆర్‌డిఎ అమలు చేస్తున్న కార్యక్రమాలపై కలెక్టర్ మిశ్రా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం 52920 స్వయం సహాయక సంఘాలకు 1223. 22 కోట్ల రుణ సహాయం అందించటం లక్ష్యం కాగా 6495 గ్రూపులకు 223 కోట్ల రుణాలు అందించాలని బ్యాంకు లింకేజీని వేగవంతం చేసి ఈ నెలాఖరకు నాటికి 300 కోట్లకు పెంచాలన్నారు. జిల్లాలో స్ర్తి నిధి అమలును కలెక్టర్ సమీక్షిస్తూ ఈ సంవత్సరం 80.65 కోట్లు లక్ష్యం కాగా 25. 76 కోట్లు రుణాలుగా అందజేయడం జరిగిందని, ఈ నెలాఖరుకు 40 కోట్లకు పెంచి రుణాలు అందజేయటానికి చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా ఎవెన్యూ ప్లాంటేషన్ కింద మొక్కలు నాటటానికి 737 కి.మీ లక్ష్యం కాగా ఇప్పటి వరకు 476 కిలోమీటర్ల మొక్కలను నాటామని కలెక్టర్ చెప్పారు.
వర్గీకరణ వ్యతిరేక పోరులో అశువులు బాసినవారికి నివాళి
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా 1997లో హైదరాబాద్‌లో పివి రావు ఆధ్వర్యంలో జరిగిన అసెంబ్లీ ముట్టడి సంఘటనలో అశువులు బాసిన పాణింగి శేషయ్య, గోవతోట నారాయణ, సత్యనారాయణ సుదర్శన్, మెట్టి సత్యనారాయణతోపాటు పివి రావుకు కోనసీమ మాలమహానాడు నాయకులు ఘనంగా నివాళులర్పించారు. శుక్రవారం స్థానిక గడియారస్తంభం సెంటర్‌లో జరిగిన ఈకార్యక్రమంలో డిబి లోక్, పెయ్యల పరుశరాముడు, జంగా బాబూరావు, మట్టా వెంకట్రావు, ఉండ్రు బుల్లియ్య, నాతి శ్రీనివాసరావు, జల్లి శ్రీనివాసరావు, కొంకి వెంకటబాబ్జి తదితరులు ఘనంగా నివాళులర్పించారు.

పన్ను చెల్లించినందుకు ఫ్రిజ్ బహుమతి!
నలుగురికి బంగారం, వెండి గినె్నలు, 20 మందికి చీరలు:ఫలించిన చెల్లూరు పంచాయతీ లక్కీడిప్ వ్యూహం
రాయవరం: మండలంలోని చెల్లూరు పంచాయతీలో ఇంటి పన్నుల వసూలుకు పన్ను కట్టు బహుమతి పట్టు అన్న నినాదంతో నూటికి నూరు శాతం ఇంటి పన్నులు వసూలు చేశారు. లక్కీ డిప్ ద్వారా విజేతలకు శుక్రవారం బహుమతులు అందజేశారు. వివరాల్లోకి వెళితే నాలుగేళ్ల క్రితం చెల్లూరు పంచాయతీలో ఇంటి పన్నులు వసూలు కాక పంచాయతీ సిబ్బంది అవస్థలు పడుతూ ఉండేవారు. ఈ స్థితిని గమనించిన సర్పంచ్ మోరంపూడి రాజకుమార్ పన్నులు సకాలంలో చెల్లించిన వారికి లక్కీడిప్ ద్వారా బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. దీంతో గ్రామంలో నూరు శాతం పన్నులు వసూలయ్యాయి. ఇదే తరహాలో గత మూడేళ్లుగా పన్నులు వసూలు చేశారు. ఈ ఏడాది 2016-17 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 30 లక్షల ఇంటి పన్ను డిమాండ్ ఉండగా నూటికి నూరు శాతం పన్నులు వసూలు చేసి లక్కీడిప్ నిర్వహించారు. మొదటి బహుమతిగా ఫ్రిజ్‌ను కొప్పన సత్యవతి గెలుచుకున్నారు. ద్వితీయ బహుమతిగా నలుగురు విజేతలను ఎంపిక చేసి ఒక్కొక్కరికి గ్రాము బంగారం, తృతీయ బహుమతిగా నలుగురికి వెండిగినె్నలు అందజేశారు. అలాగే నాల్గవ బహుమతిగా ఇరవై మందికి చీరలు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ ఈ విధానం ద్వారా నూటికి నూరుశాతం పన్నులు వసూలు చేయడంతో పంచాయతీ ఆర్థికంగా అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపిపి దేవు వెంకటరాజు, గ్రామ పెద్దలు మామిడిశెట్టి రామకృష్ణ, చుండ్రు రాజు, ఇన్‌ఛార్జి కార్యదర్శి గొల్లపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

వారపు సంతలో సారా విక్రయాలు!
మారేడుమిల్లి: తూర్పు ఏజెన్సీ ప్రాంతాల్లో యథేచ్ఛగా వారపు సంతలో సారా విక్రయాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం మారేడుమిల్లి మండలం చావడికోట పంచాయతీ పరిధిలోగల ఆకుమామిడికోట గ్రామంలో జరిగే వారపు సంతలో సుమారు ఎనిమిది సారా దుకాణాలు నిర్వహిస్తున్నారు. వారపు సంతలో గిరిజనులు పండించే పంటలను విక్రయించి, వారానికి సరిపడా నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడం పరిపాటి. ఈ క్రమంలో నిత్యావసర సరుకులు కొనుగోలు చేయవలసిన డబ్బుతో సారా తాగి అనారోగ్యం పాలవుతున్నారు. ఈ వారపు సంతకు చావడికోట, పుల్లంగి పంచాయతీ పరిధిలోని గ్రామాలు, వై రామవరం మండలం కానివాడ పంచాయతీ గ్రామాల గిరిజనులు రావడం పరిపాటి. దీంతో వారపుసంతలో సారా వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా యథేచ్ఛగా సాగుతుంది. దీనిపై చర్యలు చేపట్టాల్సిన అధికార యంత్రాంగం మాత్రం పట్టించుకున్న దాఖాలాల్లేవు. ఇదేకాకుండా మైదాన ప్రాంతాల నుండి వారపు సంతల్లో నల్లబెల్లం, అమ్మోనియా వంటి సరుకుల అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నా, వాటిని అరికట్టాల్సిన సంబంధిత శాఖ మాత్రం చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు గిరిజన ప్రాంతాల్లో అవగహన సదస్సులు ఏర్పాటుచేసి, ఏజెన్సీలో సారాను పూర్తిగా అరికట్టాలని పలువురు కోరుతున్నారు.