అనంతపురం

మేకల మందపై చిరుత దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర:మండలంలోని కొడగానిపల్లిలో మేకలమందపై చిరుతపులి దాడి చేయడంతో ఐదు మేకలు మృతి చెందాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని కొడగానిపల్లికి చెందిన హనుమక్క మేకలను గురువారం రాత్రి ఇంటి సమీపంలోని స్థలంలో కట్టి వేసింది. అర్ధరాత్రి సమయంలో చిరుతదాడి చేయడంతో మేకలు గట్టిగా అరవడంతో కుటుంబ సభ్యులు లైట్లు వేసి బయటకు వచ్చి చూడగా చిరుత పరుగులు తీసింది. అయితే ఇప్పటికే ఐదు మేకలను చంపివేసినట్లు తెలిపారు. మేకలు మృతి చెందడంతో దాదాపు రూ.40 వేల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. అటవీ శాఖాధికారులు తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు.
తుంగభద్ర నీటి విడుదలపై బళ్ళారి కలెక్టర్ హామీ
అనంతపురం సిటీ:జిల్లా తాగునీటి అవసరాల నిమిత్తం తుంగభద్ర నుండి హెచ్‌ఎల్‌సికి నీటి విడుదలపై బళ్లారి కలెక్టర్ రాంమనోహర్ ప్రసాద్ హామీ ఇచ్చినట్లు అనంత కలెక్టర్ జి.వీరపాండ్యిన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలపారు. ఈ మేరకు బళ్లారి కలెక్టర్‌తో కలెక్టర్ వీరపాండ్యిన్ ఫోన్‌లో మాట్లాడారు. శ్రీశైలం డ్యాంలో నీటి కొరత, పిఏబిఆర్, ఎంపిఆర్, చిత్రావతి రిజర్వాయర్లలో జిల్లా తాగునీటి అవసరాలకు సరిపడనంత నీరులేక ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని కలెక్టర్ బళ్లారి కలెక్టర్ దృష్టి తీసుకెళ్లారు. జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి తుంగభద్ర నుండి హెచ్‌ఎల్‌సికి ముందుగా నీరు వదలాల్సిందిగా కలెక్టర్ ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు బళ్లారి కలెక్టర్ సానుకూలంగా స్పందించి ఈ నెల 13వ తేదీ నిర్వహించనున్న తుంగభద్ర ఇరిగేషన్ బోర్డు కమిటీ మీటింగ్‌లో ఈ విషయమైన చర్చిస్తామని, జిల్లాకు అనుగుణంగా నీరు వదిలేందుకు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
బడికి తాళం!
* ఉపాధ్యాయురాలు మాకొద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన..
చెనే్నకొత్తపల్లి:విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు పాఠశాలకు సకాలంలో రావడం లేదంటూ గ్రామస్తులు బడికి తాళం వేసి పిల్లలను ఇంటికి తీసుకెళ్లిన సంఘటన నరసింగరాయనిపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ఉపాధ్యాయురాలు సమయపాలన పాటించకుండా ఉండడంతో గ్రామస్తులు వారి పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. గతంలో ఈ ఉపాధ్యాయురాలిని గతంలో పనిచేసిన ఎంఈవో వేరొక పాఠశాలకు బదిలీ చేశారు. అయితే ఆమెలో ఎటువంటి మార్పు రాకపోగా విధులకు సక్రమంగా హాజరయ్యేది కాదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలను మాన్పించి ప్రభుత్వపాఠశాలల్లోనే చదివిస్తున్నప్పటికీ ఉపాధ్యాయురాలి నిర్వాకం వల్ల విద్య కుంటుపడుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ ఐ మహమ్మద్ఫ్రి గ్రామానికి చేరుకొని విద్యార్థుల తల్లిదండ్రులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రులు ససేమిరా అంటున్నారు.
చర్యలు తీసుకుంటాం- ఎంఈవో రాజశేఖర్
ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎంఇఓ రాజశేఖర్ అన్నారు. సమస్యను త్వరలో పరిష్కరించి యధావిధిగా పాఠశాల కొనసాగేలా చర్యలు తీసుకుంటామన్నారు.
పురంలో భారీ వర్షం
హిందూపురం టౌన్/హిందూపురం రూరల్: హిందూపురం ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఈ సీజన్ ప్రారంభం నుండే అదే పెద్ద వర్షంగా స్థానికులు చెబుతున్నారు. అర్ధరాత్రి 12.30 గంటల నుండి 3 గంటల దాకా ఏకదాటిగా వర్షం కురిసింది. దీంతో ఆలస్యంగా వేరుశెనగ పంట సాగు చేసిన రైతులకు ఒకింత ఉపశమనం కలుగుతుండగా మొక్కజొన్న రైతుల్లో ఆశలు చిగురించాయి. గురువారం అర్ధరాత్రి హిందూపురంలో 52.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా చిలమత్తూరులో 7.4, లేపాక్షి మండలంలో 53.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వర్షాలు లేక ఎండిపోయిన చెక్‌డ్యాంలు నీటితో కళకళలాడుతున్నాయి. ఇదే తరహాలో రెండు రోజుల పాటు మంచి వర్షం పడితే గుంతలు, కుంటలు నిండే అవకాశం ఉంటుందని పూలకుంట మాజీ సర్పంచ్ ఆదిరెడ్డి పేర్కొన్నారు. కాగా పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ళలోకి నీరు చేరగా మహిళలు నీటిని బయటకు పారబోసేందుకు అనేక అవస్థలు పడ్డారు. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రహదారులు జలమయమయ్యాయి. అలాగే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు గుడ్డం కోనేరులో నీళ్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి వర్షం కురియడంతో కోనేరులోకి నీరు వచ్చి చేరాయి. ఇటీవల హిందూ సురక్షా సమితి ఆధ్వర్యంలో గుడ్డం కోనేరులో పూడికతీత పనులు చేపట్టి చెత్తాచెదారాన్ని శుభ్రం చేశారు. దీంతో కోనేరు నీటితో కళకళలాడుతోంది. ప్రస్తుతం కురిసిన వర్షం మరోసారి పడితే పూర్తిగా కోనేరు నీటితో నిండుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇకపోతే వర్షాభావం కారణంగా మున్సిపల్ బోర్లు ఎండిపోతున్న తరుణంలో ప్రస్తుతం కురిసిన వర్షం కారణంగా బోర్లలో నీటిమట్టం పెరిగి అవకాశం ఉంటుందని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు.
బంగారం..
అనంతపురం: బులియన్ మార్కెట్‌ను అనుసరించి బంగారం ధర ప్రియం కానుంది. శ్రావణ మాసం కావడంతో పెళ్లిళ్లు, శుభకార్యాలు, శ్రావణ శుక్రవారాలు పురస్కరించుకుని ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో పసిడి ధరకు రెక్కలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ధర పెరుగుదల ఇటు వినియోగదారుల్లోనే కాకుండా, అటు వ్యాపారుల్లో కూడా ఆందోళన కలిగిస్తోంది. పెరిగిన ధర మేరకు 10 గ్రాముల హాల్‌మార్క్ బంగారం రూ.30 వేలకు విక్రయించాల్సి రావచ్చని వ్యాపార వర్గాల అంచనా. బంగారం ధరలు కొంతైనా తగ్గితే ఎంతో కొంత కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులకు ఇది ఆశనిపాతమేనని చెప్పొచ్చు. శుక్రవారం నాటికి జిల్లాలో 10 గ్రాముల బంగారం ధర రూ.27,800 దాకా ఉంది. ఆర్నమెంట్స్‌పై 10 గ్రాములు రూ.26,500 మేరకు విక్రయాలు జరుగుతున్నాయి. జిల్లాలో పలుచోట్ల రూ.28వేలు వరకు కూడా విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గత రెండు, మూడు రోజుల నుంచి బంగారం ధర క్రమంగా పెరుగుతోంది. దీంతో జిల్లాలో కూడా ధరలు పెరిగే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 6 కార్పొరేట్ స్థాయి బంగారు ఆభరణాల షోరూమ్‌లు ఉండగా, 20 హోల్‌సేల్ స్థాయిలో బంగారు వర్తకులు ఉన్నారు. వీరు కాకుండా 300 మందికి పైగా చిన్నచిన్న వ్యాపారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం, హిందూపురం, ధర్మవరం, కదిరి, తాడిపత్రి, గుంతకల్లు తదితర ప్రాంతాల్లో బంగారు దుకాణాల్లో కొనుగోళ్లు అత్యధికంగా కొనసాగుతున్నాయి. ఒక్క అనంతపురంలోనే ప్రతి రోజూ లక్షలాది రూపాయలు విక్రయాలు జరుగుతుంటాయి. వివాహ మహోత్సవాలు అత్యధికంగా ఉండటంతో వందలాది మంది ఇప్పటికే బంగారాన్ని కొనుగోలు చేశారు. వీరితో పాటు బంగారాన్ని కొనుగోలు చేయాలని ఆశించే వారి సంఖ్య కూడా ఈ నెలలో అధికంగా ఉంటోంది. ధర కొంతైనా తగ్గితే బంగారం కొనుగోలు చేయవచ్చని కొందరు వినియోగదారులు ఆశించారు. అయితే బులియన్ మార్కెట్లో ధరలు పెరుగుదలను దృష్ట్యా బంగారం ధర పెరగనుందని తెలుస్తోంది. మరోవైపు కార్పొరేట్ స్థాయి గోల్ట్ షాపులో రూ.30వేలు పైబడి కొనుగోళ్లపై ఆఫర్లు ప్రకటించడం విశేషం. అయితే స్థానికంగా హోల్‌సేల్ విక్రయాలు జరిపే వ్యాపారులు కూడా ఈ పోటీని తట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ధర పెరుగుదల ఉన్నా హాల్‌మార్క్ లేని బంగారంపైనే కొంత ధర తగ్గించి అమ్ముతున్నట్లు వినియోగదారుల ద్వారా తెలుస్తోంది. కాగా ఆర్నమెంట్స్‌పై చాలా రకాల డిజైన్లకు హాల్‌మార్క్ ఉండటం లేదన్న ఆరోపణలున్నాయి. దీంతో కొన్ని రకాల డిజైన్లకు మాత్రమే హాల్‌మార్క్ చూపించి, మిగతావి కూడా గ్యారంటీ అంటూ వినియోగదారులను ఆకట్టుకుంటూ విక్రయాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బంగారం ధర పెరిగినా హాల్‌మార్క్ బంగారంపై కాకుండా హాల్‌మార్క్ లేని, ఆర్నమెంట్స్‌పై ధరలు తగ్గించి అమ్మడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తూకాల్లో తేడాతో పాటు కాస్తా నాసిరకంగా కూడా ఉండే ప్రమాదం లేకపోలేదన్న ఆందోళన వినియోగదారుల్లో నెలకొంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ చెప్పుకోదగ్గ రీతిలో బంగారం కొనుగోళ్లు ఉండటం లేదని, ధర పెంచితే తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యాపార వర్గాల్లో నెలకొనడం విశేషం.
జెండా పండుగను విజయవంతం చేద్దాం
* 14లోపు ఏర్పాట్లు పూర్తిచేయాలి
* జెసి-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్
అనంతపురం సిటీ: ఈ నెల 15న జరుగనున్న 71వ భారత స్వాతంత్య్ర దినోత్సవ జెండా పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని జెసి-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ నిర్వహణ సందర్భంగా స్థానిక పరేడ్ మైదానంలో జరుగుచున్న ఏర్పాట్లును జెసి-2, ఇతర అధికారులతో కలసి పరిశీలించారు. సభా వేదిక, ప్రోటోకాల్, పార్కింగ్, మార్చ్‌పాస్ట్, ప్రజలు, పాత్రికేయులు, విఐపిల గ్యాలరీ, ఫోటో ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమలా, శకటాలు ప్రదర్శన, అర్హులైన లబ్దిదారులకు ఆస్తుల పంపిణీ, ఎంపికైన ఉద్యోగులకు ప్రశంసాపత్రాల పంపిణీ తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, ఆర్ అండ్ బి, సమాచారశాఖ, విద్యుత్, అగ్నిమాపకం, విద్యాశాఖ తదితర శాఖాధికారులు సమన్వయంతో ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపట్టి జెండా పండుగను విజయవంతం చేయుటకు కృషి చేయాలన్నారు. ఆగస్టు 15న ఉదయం అన్ని ప్రభుత్వ శాఖల్లో జెండావందనం చేసిన వెంటనే అధికారులు, ఉద్యోగలు అందరూ తప్పక పోలీసుల పరేడ్ మైదానంలో ఉద్యం 8:30 గంటలకు హాజరు కావాలని, 9 గంటలకు జాతీయ పతావిష్కరణ చేయడం జరుగుతుందన్నారు. శకటాలకు, ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్‌కు ప్రత్యేకంగా ఎంపికచేసి బహుమతులు ప్రదానం చేస్తున్నామని పోటీతత్వంతో ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వేడుకల్లో పాల్గొనే వారందరికి త్రాగునీరు, సరఫరా, మదానంలో పారిశుద్ధ్య పనులు, పోలీసు బందోబస్తు, నిరంతర విద్యుత్ సరఫరా, గ్రౌండులోకి ప్రవేశమార్గాలు, తదితర అంశాలపై ముంద స్తు ప్రణాళికా బద్దంగా దృష్టిని కేంద్రీకరించి ఏలాంటి లోటుపాట్లు లేకుండా ఆగస్టు 14లోగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా అధికారులను జెసి-2 ఆదేశించారు. స్టాల్స్ ఏర్పాట్లకు ఇన్‌ఛార్జిగా జెడి పట్టుపరిశ్రమశాఖ, శకటాల ప్రదర్శనకు జడ్పీ సిఇఓ, లబ్దిదారుల ఆస్తుల పంపిణీ ఇన్‌ఛార్జిగా డిడి సాంఘిక సంకేమశాఖాధికారులు వ్యవహరిస్తున్నారు. అలాగే సాయంకాలం స్థానిక లలిత కళాపరిషత్ నందు జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఓ మలోల, తహసీల్దారు అన్వర్‌బాషా, మున్సిపల్ కమిషనర్ మూర్తి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి
పెనుకొండ:మహోన్నత వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఎదగాలని మహారాష్ట్ర అదనపు డిజిపి వివి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యక్తిత్వ వికాస సమావేశంలో మాట్లాడుతూ, దేశంలో జన్మించిన స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ, ఝాన్సీలక్ష్మీబాయి వంటి మహోన్నత వ్యక్తులను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రతి వ్యక్తి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. కోరికలను తపనగా మార్చుకోవాలన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మంచి స్నేహితులను, పుస్తకాలను దగ్గరగా ఉంచుకోవాలన్నారు. జీవితం ఎంతో విలువమయిందని, సమయాన్ని వృథా చేయవద్దన్నారు. భవిష్యత్తు నిర్మాణానికి గట్టి పునాదులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్యార్థులు జాతీయ భావాలను పెంపొందించుకొని సమాజ సేవకు అంకితభావంతో కృషి చేయాలన్నారు. దేశాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలన్నారు. దృఢ సంకల్ఫం, క్రమశిక్షణ, జాతీయ భావాలు విద్యార్థుల తోడ్పాటుకు ఎంతో కృషి చేస్తాయన్నారు. సభలో విసి రాజగోపాల్ మాట్లాడుతూ, ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో తల్లిదండ్రులు, పుట్టిన ప్రాంతానికి ఖ్యాతి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ప్రొఫెసర్లు దుర్గాప్రసాద్, పాండురంగారావు, ప్రగతి విద్యాసంస్థల కరస్పాండెంట్ శ్రీనివాసులు, సిఐ వెంకటేశులు, పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జగన్‌ను జనం ఛీ కొడుతున్నారు
అనంతపురం కల్చరల్:మూడేళ్ల తెలుగుదేశం పార్టీ పాలనలో మొట్టమొదటి సారి నంద్యాలలో ఉప ఎన్నిక జరుగుతున్న నంద్యాలలో టిడిపి ఘనవిజయం సాధిస్తుందని జిల్లా అధ్యక్షులు బికె.పార్థసారథి పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం నగర మేయర్ స్వరూపతో కలసి విలేఖరులతో మాట్లాడారు. నంద్యాలలో అత్యధిక మెజారిటీతో ప్రజలు తమను గెలిపించనున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఓటు అడిగే హక్కు ఉందని, ప్రతిపక్ష నేత జగన్ అనుచిత వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. ఫ్యాక్షన్ చరిత్ర కలిగిన కుటుంబం నుండి వచ్చిన జగన్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారన్నారు. జగన్ మాట్లాడుతున్న భాష చూసి, జనం ఛీ కొడుతున్నారన్నారు. రాష్ట్భ్రావృద్ధికి, ప్రజాసంక్షేమానికి చంద్రబాబు చేస్తున్న కృషిని అందరూ ప్రశంసిస్తున్నారన్నారు. 2014 ఎన్నికల్లో జనం ఛీకొట్టినా జగన్‌కు బుద్దిరాలేదన్నారు. ఇప్పటికైనా బుద్దితెచ్చుకుని ప్రతిపక్ష నేతగా హుందాగా వ్యవహరించాలన్నారు. జగన్‌కు, చంద్రబాబుకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ఈసమావేశంలో పార్టీ నాయకులు నెట్టెం వెంకటేసు పాల్గొన్నారు.
మతిభ్రమించి మాట్లాడుతున్న జగన్
కదిరి:నంద్యాల ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఓడిపోతాడని ముందుగానే తెలుసుకున్న జగన్ మతిభ్రమించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, 12 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడును జగన్ విమర్శించడం సిగ్గుచేటన్నారు. జగన్‌కు ప్రజాస్వామ్యంపై అవగాహన లేదన్నారు. మూడు రోజుల క్రితం కాల్చి చంపాలి అన్న జగన్ గురువారం ముఖ్యమంత్రిని ఉరి తీయాలని మాట్లాడడం ఆయన మానసిక ప్రవర్తన సరిగాలేదన్న విషయాన్ని తెలుస్తోందన్నారు. జగన్ ఆలోచనావిధానం ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు. గత ఎన్నికల్లో రెండు పార్లమెంట్ స్థానాలు వెనుకబడిన వారికి కేటాయిస్తామని చెప్పిన జగన్ ఎన్నికల్లో మాత్రం సూట్‌కేస్‌లు ఇచ్చే వ్యక్తులకు టికెట్లు ఇచ్చారని విమర్శించారు. అందుకే ప్రజలు జగన్‌కు తగిన గుణపాఠం చెప్పారన్నారు. మొన్నటిదాకా ప్రత్యేక హోదా అంటూ విద్యార్థుల వద్దకు వెళ్లి జగన్ గగ్గోలు పెట్టాడని, తమ ఎంపిలచేత రాజీనామాలు చేయిస్తానని చెప్పిన జగన్ నేడు ఆ విషయాన్ని మర్చిపోవడం హాస్యాస్పదంగా వుందన్నారు. సొంత జిల్లాలో కూడా జగన్ ఉనికి కోల్పోతున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు వెంకట రమణ, రామాంజులు తదితరులు పాల్గొన్నారు.

మురుగు కాలువలో శిశువు మృతదేహం
* సగం తినేసిన కుక్కలు..
అనంతపురం అర్బన్:అప్పుడే పుట్టిన శిశువులను చెత్తకుప్పలు, మురుగుకాలవలో వివిధ కారణాలతో మాతృత్వాన్ని మరిచి పడేసేవారి సంస్కృతి రోజురోజుకు నగరంలో పెరిగిపోతోంది. శుక్రవారం లక్ష్మినగర్ అప్పుడే పుట్టిన మగ శిశువును కాలువలో పడేసి వెళ్లగా కుక్కలు సగం తినేశాయి. దీన్ని స్థానికులు గుర్తించి నగరపాలక సంస్థ వారికి సమాచారం ఇచ్చారు. రెండవ పట్టణ పోలీసులు శిశువు మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంబంధిత అధికారులు ఇటువంటి సంఘటనలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు.
చైనా వస్తువులను బహిష్కరిద్దాం

అనంతపురం సిటీ:దేశం కోసం జీవిద్దామని, చైనా వస్తువులను బహిష్కరిద్దామని ఎబివిపి నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం ఎబివిపి ఆధ్వర్యంలో సప్తగిరి సర్కిల్ నుండి టవర్‌క్లాక్ వరకు ర్యాలీ నిర్వహించి చైనా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎబివిపి జిల్లా కో కన్వీనర్ వీరాంజినేయులు మాట్లాడుతూ చైనా 1962లో యుద్దం తరువాత భారత్ నుండి 42,700 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించడమేకాక ఇంకనూ 90వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తోందన్నారు. భారత్ సరిహద్దులైన డోక్లం ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని చైనా విశ్వప్రయత్నం చేస్తోందన్నారు. అలాంటడు చైనాను మన దేశం ప్రజలు వ్యతిరేకించాలని, అందులో భాగంగానే చైనా తయారు చేసే ఎలాంటి వస్తువులను ప్రజలు తీసుకోకుండా స్వచ్ఛందంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రతి భారతీయ పౌరుడు చైనా వస్తువులను బహిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి నాయకులు సాయి, పులిరాజు, కిరణ్, శ్రీకాంత్, హర్ష, నాగమల్లారెడ్డి, వెంకటేసు, మారుతిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
శిక్షణ ఎస్‌ఐలకు అవగాహన
* ఎస్పీ జివిజి అశోక్‌కుమార్
అనంతపురం అర్బన్:సమాజ కోసం అహర్నిశలు శ్రమించే పోలీసులకు విధుల్లో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో దోహదం చేస్తుందని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. పిటిసిలో రాష్ట్ర పోలీసుశాఖలోని ట్రెండ్స్‌పై అభ్యర్థులకు అవగాహన కల్పించారు. శుక్రవారం పిటిసిలోని శిక్షణ పొందుతున్న 374 మంది అభ్యర్థులకు ఎస్పీ పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ టెక్నాలజీ ఉపయోగించి నేరాల ఛేదింపు, రాష్ట్ర పోలీసుశాఖలోని అదునిక పోకడలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. టెక్నాలజీని ఉపయోగించి నేరస్తులను గుర్తించటం, నేరాల ఛేదింపు, నేరాలకు అడ్డకట్టకు సంబంధించి టెక్కాలజీని ఎలా ఉపయోగించుకోవచ్చు అన్న అంశాలపై సవివరంగా వివరించారు.
పోలీసుస్టేషన్ల పరిధిలో జరిగిన నేరాలు, కేసులు నమోదు, నిందితుల అరెస్టు, దర్యాప్తు, ఛార్జీషీటు దాఖలు తదితర వాటిపై సైతం సిసిటిఎన్ (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్కింగ్ సిస్టం)లో పొదుపరిచి దేశంలో ఎక్కడి నుంచైనా వివరాలు తెలుసుకోవచ్చు అన్న అంశాలపై అవగాహన కల్పించారు. కమాండ్ కంట్రోల్, సిసి కెమెరాల పనితీరు గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు ట్రైనింగ్ విభాగం అధికారి ఎన్.సంజయ్, పిటిసి ప్రిన్సిపాల్ వెంకట్రామిరెడ్డి, డిఎస్పీలు శ్రీనివాసరెడ్డి, రామచంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, పలువురు సి. ఐలు తదితరులు పాల్గొన్నారు.
ముగ్గురు పోలీసు సిబ్బందిపై వేటు
అనంతపురం అర్బన్: గోరంట్ల పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ మల్లేశ్వరయ్యతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు రవినాయక్, రామకృష్ణలను విఆర్‌కు పంపుతూ జిల్లా ఎస్పీ జివిజి అశోక్‌కుమార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. వీరు మట్కా నిర్వహణకు సహకరిస్తున్నందున వీరిని విధుల నుండి తాత్కాలికంగా తప్పించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
మహిళ దారుణ హత్య
కదిరి: కదిరి రూరల్ పరిధిలోని గంగ మ్మ మోరి వద్ద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని మహి ళ (35) దారుణంగా హ త్యకు గురైంది. మహిళను చీరతో మెడకు బిగించి అనంతరం తలపై రాళ్లతో మోది హత్య చేసినట్లు తెలుస్తోంది. కదిరి ఇన్‌చార్జి డిఎస్పీ వెంకటరమణ, ఇన్‌చార్జి సిఐ శ్రీ్ధర్ బాబు, ఎస్‌ఐలు మధుసూదన్‌రెడ్డి, రాఘవలు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతపురం నుండి పోలీసు జాగిలాలను రప్పించి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాస్సి ఉంది.