ఉత్తర తెలంగాణ

గాలం (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలపు గాలంలో చిక్కుకుని
వయసు విలవిలలాడుతోంది
వనపు ఎరచాపి ఆకట్టుకున్న కాలం
రాబోయే ముడతల చిత్రాలు చూపలేదు
అందమంతా మట్టిలా కొట్టుకుపోయి
వట్టిపోయి మిగిలిన కళేబరం
చర్మాన్ని చుట్టుకు నిలబడుతుంది
ఎముకలన్నీ లెక్కెట్టుకోండంటూ
పైకితేలి నిలబడ్డాయి
వడలిన ఆశలు వసారాలో అతుక్కున్నాయి
గోడమీద ఫోటోలు ముసలి వాసనొస్తున్నాయ్
తల్లిపేగు బిడ్డల ఇళ్ల వాకిట్లో తచ్చాడుతోంటే
కళేబరం మాత్రం ఊరి పెంకుటింట్లో పడుంది
బింకం వీడని అయ్యకంటి చెమ్మని
పైకండువా మూగగా భరిస్తోంది
ఆప్యాయతలు కరువై
ఆదరణ విడివడని వేకువై
అభిమానానికి ఆమడదూరమై
బలహీనమవుతున్న బంధాలు
మోయలేని భారాన్ని ఎత్తుకోలేక
అవస్థలు పడుతున్నాయ్
బోసిపోయిన వీధి అరుగు
తుప్పుపట్టిన బావిగిలక
కదలించే చేతుల కోసం
ఆశగా చూస్తున్నాయి
ఇంటినిండా కరువు తాండవిస్తోంది
ముంగిట్లో రంగవల్లి
వాకిట్లో జాజిమల్లీ
పెరట్లో తీగమల్లి
గడప మీద ముసలి తల్లీ
ఎదురు చూసి చూసి అలమటిస్తున్నాయ్
కరువుతీరి దారి లేక సందడి కోసం
మొహం వాచిపోతున్నాయ్
తరాల అంతరాలు
మమతల చిరునామా మరచిపోతున్నాయ్!
- డాక్టర్ వకుళాభరణం అనంతలక్ష్మి
హైదరాబాద్
సెల్.నం.9866954194

సౌందర్య సమాహారం!

నిన్ను చూచిన క్షణమే..
చిత్రకారుడినై కుంచెతో
నీ రూపాన్ని చిత్రించాలని వుంది!
నిన్ను గాంచిన మరు నిమిషమే
గాయకుడినై నా గళం నుండి
జాలువారే గీతంతో
నీకు హారతి పట్టాలని వుంది!
నువ్వు ఏ భంగిమలో నిలిచినా
శిల్పినై నేను నీ శిల్పాన్ని
రూపుదిద్దాలని వుంది!
నీ నాట్యాన్ని చూసి తన్మయుడనై..
పదంలో పదం కలిపి..
నర్తించాలని వుంది!
నీ మోహనాకారాన్ని చూసి
కమనీయ కావ్యాన్ని
లిఖించాలని వుంది!
అన్ని లలిత కళల పూర్ణాకృతివి నీవు
జగతిలో సౌందర్య సమాహారానివి నీవు!!
- ఎ.గజేందర్ రెడ్డి, కరీంనగర్, సెల్.నం.9848894086

రియల్ హీరో
చిటికెన వేలు పట్టుకొని
నడిపించే వేళ తెలియలేదు
నా భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నానని
తప్పటడుగు వేసినపుడు
తప్పటడుగుగా ఓదార్చి
చాటుగా నీవు పడ్డ వేదన
ఎలా మరువను..?
గుప్పెడంత గుండెలో
కష్టాల కడలి ఉప్పొంగినా..
కష్టాన్నీ ఇష్టంగా మార్చుకొని
విశ్వమంతా ప్రేమను పంచావు
కళ్లలోంచి ఉబికి వస్తున్న కన్నీటిని
ఆనంద భాష్పాలుగా మార్చి
మమ్మానందింపజేశావు
సమాజంలో నా ఉనికికై
నీవుపడ్డ తపన
ఎన్ని తపస్సులతో పోల్చుకోను..?
నీ గుండెలపై
ఆడినపుడు గ్రహించలేదు
అందులో నాపై ఉన్న ప్రేమను
ముక్కోటి దేవతలున్నా..
నా హృదిలో ప్రతిష్టించింది నినే్న
ఏమివ్వగలను నాన్నా..!
నా సంతోషాన్ని
అంకితమివ్వడం తప్ప
అప్పటికీ..ఇప్పటికీ..ఎప్పటికీ
మా రియల్ హీరోవి నువ్వే..
- మాధవ్ గుర్రాల
కరీంనగర్, సెల్.నం.9492648887

హెచ్చరిక!
అవనిక పట్టిన ఆతపత్రము
కన్నుల గట్టిన చిత్రపటము
ఎల్లలెరుగని దృశ్యం
చూచువారలకు నయన మోహనం
సూర్యచంద్రులకు నివాస స్థానం
(లోహ) విహంగాలకు విహార స్థానం
బోలెడు వింతల విహాయసం
మేఘమాలలు మేన దాల్చినది
కావ్య పుటల్లో కదలియాడినది
రాత్రి ఆకాశం రత్న కంబళం
పగటి ఆకసం నీలి సముద్రం
ఉభయ సంధ్యల్లో రక్తశోభితం
వైశాఖ నింగి నిప్పుల కొలిమి
ఆగస్టు నింగి నిప్పుల కొలిమి
ఆగస్టు గగనాన గర్జనల జల్లు
శ్రావణ మాసాన సింగిడెత్తిన నింగి
కార్తీక నభం పిండారబోసింది
పుష్యమాసమందు మంచు కుమ్మరించు
ఓజోను రహిత విన్ను
ప్రాణ హంతకి మిన్ను
మసి పులుసు వాయువు వదల
ఉసురు దీయక వదలదు తథ్యం
విష వాయవుల విహత్తలం
విపరీతాలకు ఆలవాలం
గ్లోబల్ వార్మింగుతో బాధించు మిమ్ము
మేలుకొని నరునికి నరకమే నమ్ము
ఇకనైన మొక్కను నాటుము!
- రాపెల్లి పాండురంగమ్
రుద్రంగి, రాజన్న సిరిసిల్ల జిల్లా
సెల్.నం.9963866167

నాకిష్టం!
ప్రేమ, ద్వేషం
ఒకే మడిలో పురుడు పోసుకుంటేనేం?
ప్రేమ పంటల్ని
ఏపుగా పెంచడమే కాదు..
ద్వేషపు మొక్కల్ని పెకిలించడం నాకిష్టం!
నిబ్బరంగా
తనలో అలల్నీ.. ముత్యాల నిధినీ
మురిపెంగా దాచుకునే
ప్రశాంత కడలిని
ఆదర్శంగా తీసుకోవడం నాకిష్టం!
వర్షించేందుకు
ఉరుములు మెరుపులతో జతకట్టే
మేఘాల వోలే
ఎత్తుపల్లాల జీవన మైదానంలో
ఓటమి అవమానాలను
అధిగమించి..
విజయతీరాలు చేరడం నాకిష్టం!
- డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్
సెల్.నం.9949700037

అవయవదానం!
మూసిన కన్ను తెరుచుకుంది మళ్లీ
వెలుగు పూలు పూసింది..
మరో మనిషి కపాలంలో
కనుగుడ్డు గుహలో చేరి
కనువిందు చేసింది
ప్రపంచాన్ని కళ్లముందు ఉంచింది
ఆగమేఘాలమీద
నిస్తేజ నిర్వేద మెదడు గలిగిన
ఒక మనిషి నుంచి
మరో ఆర్తుడైన అర్హుడైన
మనిషిలోకి మార్చబడిన
గుండె సరిగ్గా అమరింది
కాలేయం కుదురుకుంది
మూత్ర పిండం సర్దుకుంది
చావుబతుకుల్ల కొన ఊపిరితో
మృత్యువుతో సలిపిన సమరంలో
ఓడిన మనిషి మరో మనిషికి
అందిస్తున్నాడు ఆపన్న హస్తం
నిలుపుతున్నాడు మరో ప్రాణాన్ని
అవయవదానం
నేటి అవసరం!
అది మనవాళి సహృదయం!
కరుణాంతరంగాల
మహోన్నత ఆదర్శాల
జీవిజలధతరంగం..
- డాక్టర్ దామెర రాములు
నిర్మల్, సెల్.నం.9866422494

కొన్ని అనామక చిత్రాలు!

ఆకాశపు గొడుగు కింద
అచ్ఛాదన లేని తనువులతో
ఆరు రుతువులను భుజాన మోసే
అనామక చిత్రాలు
బతుకు కొమ్మకు చిక్కుకున్న
గాలిపటాలై తారసపడుతుంటాయి..
పిడికెడు మెతుకుల కోసం
చీదరింపుల సత్కారాలను
చిరునవ్వుతో స్వీకరించి
ఆకలిని జయించే విద్య
పంపునీళ్లతో పట్టుబడేందుకు
అదే పనిగా ప్రయత్నిస్తుంటాయి..
అరిషడ్వర్గాలకు అతీతమై
ఆనందం ఆవేదనలను
గుండె గదుల్లో గుట్టుగా దాచుకుని
దొషణలను భూషణలుగా ధరిస్తూ
గాయపడిన హృదయాలతో
దయామయులు విదిలించే
ఓదార్పు మాటల కోసం
ఆర్తిగా ఎదురు చూపులను అతికించి
శూన్యాన్ని జోలెలో నింపుకుంటూ
గమ్యం తెలియని చలనాలై
ముందుకు సాగిపోతుంటాయి..
అసమానత పర్వంలో
అవమానాల గాయాలు తడుముకుంటూ
అడుగడుగున తారసపడే
కత్తుల వంతెనలు దాటుతూ
దుఃఖ నదులై ప్రవహిస్తుంటాయి..
పగళ్లన్నీ పగబట్టిన పాములవుతుంటే
రాత్రులేమో రాయలేని విషాద గీతికలై
చీకటి దారుణాలకు సాక్షులుగానో
రాక్షసత్వానికి వంచింపబడిన
దేహాలుగానో మారుతుంటే
న్యాయం జరగని వేకువలో
కన్నీటి సంద్రాలవుతుంటాయి..
బతుకు ఎడారులై విస్తరిస్తున్న
వ్యదార్థ జీవితాలని
ఏతమేసి తోడుకున్నా
యాతనలకు ముగింపు దొరక్క
మానవతా ఒయాసిస్సులకై
తపించే వీధి బాలల చిత్రాలవి..!
- పురిమళ్ల సునంద
బురహాన్‌పురం, ఖమ్మం జిల్లా
సెల్.నం.9441815722