ఉత్తర తెలంగాణ

కథల్లో తెలంగాణ జీవనశైలి ప్రతిబింబించాలి (అంతరంగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథల్లో తెలంగాణ ప్రజల జీవనశైలిని ప్రతిబింబింపజేయాలని అభిప్రాయపడే ప్రముఖ కథా రచయిత బి.మురళీధర్ వృత్తిరీత్యా ఆదిలాబాద్‌లో వ్యవసాయ విస్తరణాధికారిగా మూడు దశాబ్దాలకు పైగా సేవలు అందించారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సొనాలా గ్రామానికి చెందిన ఆయన 1967లో ‘అడవి పువ్వు’ పేరుతో ఒక కథ రాశారు. ఇప్పటివరకు పందొమ్మిది కథలు మాత్రమే ఆయన రాసినప్పటికీ.. చాలా కథలు సాహితీ పురస్కారాలకు ఎంపికైనాయి! ‘నెమలి నార‘ పేరుతో ఓ కథా సంకలనాన్ని ఇటీవలే వెలువరించారు. తెలంగాణ సాంస్కృతిక జీవన వైభవాన్ని చాటుతూ ‘నిరుడు కురిసిన కల’ నవల రాశారు. కవిత్వం, కథ, నవల రాసే అనుభవం ఉన్న ఆయనతో మెరుపు ముచ్చటించింది. ముఖాముఖి వివరాలు ఆయన మాటల్లోనే..

ఆ మీకు సాహిత్యం పట్ల ఆసక్తి
కలగడానికి ప్రేరణ ఇచ్చింది ఎవరు?
మా ఆదిలాబాద్ గ్రంథాలయం మొదట ప్రేరణనిచ్చింది. ఆ తరువాత మా గురువు ఆదినారాయణ రావు గారి ప్రోత్సాహంతో సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నాను. హైస్కూల్, కళాశాల చదువులు కొనసాగించిన రోజుల్లో సాహిత్య సంబంధం ఉన్న అన్ని పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుపొందిన ఉత్సాహం కూడా నన్ను రచయితగా మార్చింది.

ఆ కవిత్వం/కథ/నవల రాసే మీకు ఏ ప్రక్రియ అంటే ఇష్టం?
నిజానికి మూడు ప్రక్రియలూ నాకు ఇష్టమే. అయినా కథ అంటే ప్రత్యేకమైన అభిమానం!

ఆ కవిత్వం/కథ/నవల ఏది రాయడం సులభం?
ఏదీ అంత సులభం కాదు. ఒక మంచి కవిత్వం లేదా కథ రాయాలంటే..రచయిత తనని తాను ఎంతో సంఘర్షించుకుంటే తప్ప రాయలేరు.

ఆ మంచి కథకు ఉండవలసిన లక్షణాలు?
కథలోని పాత్రలను ప్రతిభావంతంగా, వాస్తవికతకు దగ్గరగా చిత్రించగలగాలి.. ఏకబిగిన చదివించగలగాలి. పాత్రలు సహజసిద్ధంగా ఉండాలి. సంఘటనలు, సంభాషణలు పాఠకులను తమ వెంట నడిపించుకుపోయేలా ఉండాలి.

ఆ ఇప్పుడొస్తున్న కథలపై మీ అభిప్రాయం?
ఎవరో కొందరు తప్ప చాలామంది కథకులు కథల్ని సీరియస్‌గా రాయడం లేదు.. రచయితల కథలు సాటి రచయితలే చదువని పరిస్థితి ఉంది. ముందు ముందు కథలు రాసే వారు ఉండవచ్చు కానీ.. చదివే వాళ్లు ఉండకపోవచ్చని నా అభిప్రాయం! ఇప్పుడు కథలు-కేవలం పాతతరం పాఠకుల దయాదాక్షిణ్యాలపై మాత్రమే ఆధారపడి వున్నాయి! ఇప్పటి తరం ఒకవేళ పత్రికలు చదివినా.. ఏ జానపద సోషియోథ్రిల్లర్’ సీరియల్‌కో లేదా ఏ ‘్ఫంటసీ హర్రర్’ సీరీస్‌కో అలవాటుపడుతున్నారు తప్ప జీవన సత్యాలను ఆవిష్కరించే కథలు చదవాలన్న ధ్యాస ఉండటం లేదు.

ఆ ఇప్పుడు అధిక సంఖ్యలో వస్తున్న తెలంగాణ కథ ఎలా ఉంది?
ఆశాజనకంగా లేదు.. తెలంగాణ మాండలిక సంభాషణలతో నింపేస్తున్నారు. చెప్పదలుచుకున్న విషయం కొంత మంది కథకులకే స్పష్టత లేదు. చివరికి పాఠకులను నిరాశకు గురి చేస్తున్నారు. తెలంగాణ ప్రజల మూలాల్లోకి వెళ్లి వారి జీవన శైలిని కథల్లో ప్రతిబింబింపజేయాలి. దోపిడీ, పీడన, పేదరికం ఒక్క తెలంగాణలోనే కాదు ప్రపంచమంతటా ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ కవిత కొంత పలుచబడింది. కథకు కూడా అదే పరిస్థితి వస్తుందేమో మరి!

ఆ మరుగున పడ్డ తెలంగాణ సాహిత్యం వెలుగులోకి రావాలంటే ఏం చేయాలి?
చేయాల్సింది చాలా వుంది. కానీ దాన్ని చేయగలిగిన వాళ్లు చేస్తేనే మంచి ఫలితాలొస్తాయి! తెలంగాణ ఏర్పడిన మూడేళ్లలో ఒక్క సాహితీ పత్రిక కూడా ప్రారంభం కాకపోవడం శోచనీయం! తెలంగాణ కవులు, రచయితలు ఉత్తమ రచనలు ప్రచురించడానికి ముందుగా మంచి పత్రికలను ప్రారంభించాలి. ఒకప్పుడు ‘సోయి’ పత్రిక తెలంగాణ సాహితీ సంపదకు అద్దం పట్టేది. తిరిగి మనకు ‘సోయి’ రావాలి. తెలంగాణ సాహిత్య అకాడమి ఆవిర్భవించింది కనుక మున్ముందు మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం.

ఆ సాహితీ పురస్కారాలపై మీ అభిప్రాయం?
పురస్కారాలు అవసరమే! అవి కవి/రచయిత చేసిన కృషికి గుర్తింపుగా నిలుస్తాయి. కానీ ఇటీవల తెలుగు రాష్ట్రాలలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన సాహితీసంస్థలు ఎవరికి పడితే వారికి ఉదారంగా బిరుదులను ప్రదానం చేస్తున్నారు. సాహిత్య అకాడమి లాంటి సంస్థలు పారదర్శకంగా సాహితీ పురస్కారాలలో ఇచ్చే మంచి అనవాయితీని నెలకొల్పాలి.

ఆ మీకు నచ్చిన కవి/రచయిత?
కవులలో సినారె, శ్రీశ్రీ, దాశరథి, తిలక్, ఆరుద్ర.. రచయితలలో విశ్వనాథ, రవిశాస్ర్తీ, సాక్షి పానుగంటి, దాశరథి రంగాచార్య, పెద్దింటి ఇలా చాలామందే వున్నారు.

ఆ మీరు పొందిన పురస్కారాలు? బహుమతులు?
నా మొదటి కథ ‘అడవి పువ్వు’కు విపుల కథల పోటీలో బహుమతి లభించింది. నేను రాసిన 19 కథల్లో 12కి ఏదో ఒక బహుమతి రావడం విశేషం! ‘నెమలి నార’ అనే కథకు 2006 సంవత్సరం ఉత్తమ తెలంగాణ కథగా వట్టికోట ఆళ్వారు స్వామి స్మారక కథా పురస్కారం లభించింది. అంతేగాక ‘విపుల’లో మూడుసార్లు, నవ్యలో మూడుసార్లు బహుమతి వచ్చాయి. 1995 ఆంధ్రప్రభ వారి దీపావళి నవలల పోటీలో ‘నిరుడు కురిసిన కల’ అనే నా నవలకు ప్రథమ బహుమతి వచ్చింది. గ్రామ స్వరాజ్యాన్ని కాంక్షించే అరుదైన గ్రంథంగా ఈ నవలను ‘ఇండియా టుడే’ ప్రశసించింది.

ఆ కొత్త కథకులకు మీరిచ్చే సలహాలు, సూచనలు?
బాగా చదవాలి..తెలుగు కథకులలో గొప్ప కథకులున్నారు. వారి రచనలు అధ్యయనం చేసి వారి శైలీ, శిల్పం, ఎత్తుగడ, ముగింపులకు తెలుసుకోవాలి. రచయిత ముందుగా తన కథకు తానే నిర్ధాక్షిణ్యమైన విమర్శకుడవ్వాలి. అయితేనే మంచి రచనలు..కాలానికి నిలబడే కథలు రాయగలుగుతారు.
బి.మురళీధర్
పంచవటి, బి-85, హౌసింగ్ బోర్డు కాలనీ,
ఆదిలాబాద్-504001
సెల్.నం.9440229728

- దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544