కృష్ణ

కలెక్టర్ సాగర విహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: కలెక్టర్ బి లక్ష్మీకాంతం సాగర విహారం చేశారు. గిలకలదిండి మెరైన్ పోలీసు స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మెరైన్ బోటులో సముద్రంలో పర్యటించారు. బోటు పనితీరును మెరైన్ పోలీసులను అడిగి తెలుసుకుని సముద్రంలో కొంత దూరం స్వయంగా ఆయనే బోటును నడిపారు. తీరం వెంబడి ఉన్న మడ అడవులను పరిశీలించారు. బోట్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా మారిన సముద్ర మొగను పరిశీలించారు. మొగ పూడిక తీతకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట తహశీల్దార్ బి నారదముని, మెరైన్ స్టేషన్ ఎస్‌ఐ ఎండి ఇస్మాయిల్, బోట్ మాస్టర్ ఎస్‌విజి రెడ్డి, మెరైన్ సిబ్బంది ఉన్నారు.

ఉత్సాహంగా కృష్ణాష్టమి వేడుకలు
జి.కొండూరు: శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను శనివారం కన్నుల పండువగా నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణ, గోపికల వేషాలతో అలరించారు. ముద్దుముద్దు మాటలతో గోపికలు చిన్ని కృష్ణయ్యను ఆటపట్టించారు. సంప్రదాయ బద్ధంగా జరిగిన వేడుకల్లో ఉట్టికొట్టే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల కేరింతల నడుమ ఉట్టిని కొట్టారు. కనుమరుగవుతున్న సంప్రదాయాలకు జీవం పోస్తూ ఎస్‌వి విద్యాలయంలో జరుపుకున్న ఈవేడుకల్లో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొని తిలకించారు. డైరెక్టర్ గరిమెళ్ళ వెంకట సు బ్బారావు, ప్రిన్సిపాల్ రేణుక మాట్లాడుతూ అందరూ ఐకమత్యంగా ఉం డాలన్నారు. అన్ని పండుగలు అందరినీ ఆనందింప చేస్తాయన్నారు.
గుడివాడలో...
గుడివాడ : స్థానిక బైపాస్ రోడ్డులోని డాక్టర్ కెకెఆర్స్ గౌతమ్ కానె్సప్ట్ స్కూల్లో శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
చిన్నారులు కృషు ణడు, గోపికల వేషధారణల్లో నృత్య ప్రదర్శనలు, గీతాలాపనలు చేసి అలరించారు. కోలాటం ఆడారు. చిన్నారులచే ఉట్టి కొట్టించారు. వివిధ రాష్ట్రాల సంప్రదాయ వేషధారణలతో విద్యార్థులు భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆవిష్కరించారు. నర్సరీ, కేజి విద్యార్థులు గాంధీజీ, భారతమాత, నెహ్రూ వేషధారణల్లో ఆకట్టుకున్నారు.
నందిగామ/ పెనుగంచిప్రోలులో...
నందిగామ/పెనుగంచిప్రోలు : ఉత్సాహంగా నిర్వహించారు. నందిగామ రైతుపేటలోని గౌతమ స్కూల్, పెనుగంచిప్రోలు తక్షశిల, శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించారు. ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.

ఆలుమగల ఆత్మహత్య
చందర్లపాడు: కుటుంబ కలహాలు, ఆర్ధిక ఇబ్బందుల నేపధ్యంలో భార్య, భర్త ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కోనాయపాలెం గ్రామంలో శనివారం జరిగింది. కోనాయపాలెం గ్రామానికి చెందిన కనె్నగంటి దాసు(45), భార్య బుజ్జి (38) గత కొద్ది కాలంగా ఆర్ధిక ఇబ్బందులతో తరచు గొడవ పడుతున్నారు. శుక్రవారం రాత్రి ఇద్దరూ తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగారు. గమనించిన చిన్న కొడుకు పక్కవారిని పిలిచి చెప్పాడు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరినీ నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో దాసు మృతి చెందగా, చికిత్స పొందుతూ బుజ్జి మృతి చెందినట్లు తెలిపారు. ఎమ్మెల్యే సౌమ్య, జెడ్‌పిటిసి వాసిరెడ్డి ప్రసాద్ నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృత దేహాలను సందర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుండి సహాయం ఆందేలా చ ర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. ఎస్సై దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నట్లు తెలిపారు.

తాడోపేడో తేల్చుకుంటాం
విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే విషయంలో ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు చెప్పారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈనెల 16నుంచి సెప్టెంబర్ 17వరకు చైతన్యయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితుల చైతన్యయాత్ర వాల్‌పోస్టర్‌ను ముప్పాళ్ల నాగేశ్వరరావు నగరంలోని దాసరి నాగభూషణరావు భవన్‌లో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తులను హైకోర్టు ఎటాచ్ చేసిందని, ప్రతి నెలా రూ.వెయ్యి కోట్ల విలువైన ఆస్తులను విక్రయించి బాధితులకు న్యాయం చేయాలని సూచించిందన్నారు. 8 రాష్ట్రాల్లో 32 లక్షల మంది బాధితులుండగా, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 19.52 లక్షల మంది అగ్రిగోల్డ్ మోసానికి బలయ్యారన్నారు. తమ పిల్లల భవిష్యత్ కోసం పొదుపు చేసుకున్న సొమ్ము ఇక రాదనుకున్న 142 మంది బాధితులు బలవన్మరణం పొందారని తెలిపారు. ఈనెల 16న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులో చైతన్యయాత్ర నిర్వహించి బాధితులను ఏకం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 17న అనంతపురంలో ముగింపు సభ జరుగుతుందని చెప్పారు. బాధితులు ఇక ఎవరూ ఆత్మహత్యకు పాల్పడకుండా భరోసా ఇచ్చేందుకే చైతన్యయాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆస్తులను వేలం వేయాలని, చిన్న మొత్తాల పొదుపుదారులకు డబ్బులు చెల్లించేందుకు తక్షణమే రూ.1,180 కోట్లను విడుదల చేయాలని కోరారు. అలాగే ఆస్తుల వేలం ప్రక్రియను నిర్వహించేందుకు ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. విలేఖరుల సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు, ఉప ప్రధాన కార్యదర్శి బివి చంద్రశేఖరరావు, కమిటీ సభ్యులు కె.రాంబాబు, పి.మురళీకృష్ణ పాల్గొన్నారు.

జీతాల కోసం రాష్టవ్య్రాప్త ఉద్యమం
* ఎమ్మెల్సీ నాగేశ్వరరావు
బెంజిసర్కిల్: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులకు, స్కిల్డ్, సెమీ స్కిల్డ్ సిబ్బంది జీతాల కోసం రాష్టవ్య్రాప్తంగా ఆందోళనలు, పోరాటాలు ఉదృతం చేయనున్నట్లు ఇంజనీరింగ్ కార్మికుల రాష్ట్ర సదస్సు తీర్మానించింది. శనివారం నగరంలోని గాంధీనగర్‌లోని దాసరి భవన్‌లో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల రాష్ట్ర సదస్సును నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు వెట్టి చాకిరీ చేయిస్తున్నాని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మెరకు వారికి రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల నైపుణ్యాన్ని బట్టి జీతాలు చెల్లించకుండా ప్రభుత్వాలు వీరిని దగా చేస్తున్నాయన్నారు. ఏళ్ల తరబడి వీరి సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించడం లేదన్నారు. జెఎసి నాయకులు కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సుప్రీం కోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆదేశించినప్పటికి ప్రభుత్వాలు వాటిని ఆచరించడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయాలన్నారు. ఈ నెల 22న జెఎసి ఆధ్వర్యంలో నిర్వహించే చలో విజయవాడను జయప్రదం చేయాలన్నారు. అలాగే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కోసం సెప్టెంబర్, అక్టోబర్‌లో నిర్వహించే దశలవారీ పోరాటాలకు కార్మికులు సిద్ధం కావాలన్నారు. ఈసదస్సులో నాయకులు కార్మికులు పాల్గొన్నారు.

కలిసొచ్చిన వరుస సెలవులు!
రైల్వేస్టేషన్, బస్టాండ్ కిటకిట
* నగరం నుంచి 80 ప్రత్యేక బస్సుల ఏర్పాటు
విజయవాడ: 4రోజులపాటు వరుస సెలవులతో హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో శనివారం తెల్లవారుజామునుంచే రైల్వే, ఆర్టీసీ బస్ స్టేషన్లు ఇసుక వేస్తే రాలనంతగా కిటకిటలాడుతూ కన్పించాయి. 2వ శనివారం, ఆదివారం, సోమవారం (కృష్ణాష్టమి), మంగళవారం (స్వాతంత్య్ర దినోత్సవం) వరుసగా 4 రోజులు సెలవులు రావటంతో హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో బయలుదేరి వెళ్లారు. ఇక హాస్టళ్లల్లో చదివే విద్యార్థులు కూడా బయలుదేరారు. వాస్తవానికి శుక్రవారం రాత్రి నుంచే బస్సులన్నీ కిటకిటలాడుతూ బయలుదేరాయి. రాత్రి బయలుదేరిన బస్సులు తిరిగి అదే రద్దీతో నగరానికి చేరుకుంటున్నాయి. సాధారణంగా నిత్యం హైదరాబాద్‌కి 180 సర్వీసులు నడుస్తుండగా నేడు అదనంగా మరో 40 సర్వీసులు నడిపారు. విశాఖపట్టణంకు 10 సర్వీసులు, రాజమండ్రికి 30సర్వీసులు నడిచాయి. సాధారణంగా రాజమండ్రికి ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంటే నేడు అదనంగా బస్సులను నడిపారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ పిన్నమనేని వెంకట రమారావు ఉదయం నుంచి బస్ స్టేషన్‌లోనే మకాం చేసి ప్రయాణికుల రద్దీని బట్టి క్షణాల్లో ప్రత్యేక సర్వీసులను నడిపిస్తున్నారు. ఈ నెల 15న హైదరాబాద్‌కు తిరిగి వెళ్లే ప్రయాణికుల రద్దీ బాగా ఉండగలదని భావిస్తూ ఆ రోజు అదనంగా మరో 150 బస్ సర్వీసులను నడిపేందుకు తగు ఏర్పాట్లు చేశామన్నారు.

ఆన్‌లైన్ బెట్టింగ్ మెసేజ్‌లపై అప్రమత్తం
విజయవాడ (క్రైం): ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ మెసేజ్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసు కమిషనరేట్ సూచించింది. ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ బ్యాచ్‌లను అదునుగా చేసుకుని 2 మాసాలుగా రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల్లో కొంతమంది మొబైల్ ఫోన్లకు గుర్తు తెలీని వ్యక్తులు క్రికెట్ ప్రిడిక్షన్ అండ్ బెట్టింగ్ టిప్స్ బై ఈగల్ పేరుతో వాట్పాప్ ద్వారా సమాచారం వస్తున్న నేపథ్యంలో కమిషనరేట్ స్పందించింది. ఈ ఎస్‌ఎంఎస్‌లు వారి మిషన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ ఆటగాళ్లకు తెలియచేసి తద్వారా ప్రతి ఆటగాడు మ్యాచ్ ద్వారా గెలుపొంది డబ్బు సంపాదించవచ్చని, ఇందుకు సంబంధించిన టెలిగ్రామ్ అనే యాప్‌కు సమాచారం చేయమని, ఎస్‌ఎంఎస్‌లు పంపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొంటూ వస్తున్న మెసేజ్‌లను నమ్మవద్దని కమిషనరేట్ అధికారులు సూచించారు. ఇందుకు సంబంధించి ఫోర్త్ లయన్ యాప్‌కు ప్రజల నుంచి వస్తున్న సమాచారం పరిగణనలోకి తీసుకున్న సిపి ఆదేశాలతో టాస్క్ఫోర్స్ రంగంలోకి దిగి పరిశోధించగా తమిళనాడులోని పుదుకోట్టాయ్, చెన్నై ప్రాంతాల నుంచి ముఠా సభ్యులు ఈ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వెల్లడైంది. కావున ఇలాంటి టిప్స్ బారిన పడవద్దని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

విదేశీ వస్తువుల్ని బహిష్కరిద్దాం
* స్వదేశీ జాగరణ్ మంచ్ పిలుపు
పటమట: దేశంలో స్వదేశీ అభిమానాన్ని పెంపొందించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్వదేశీ జాగరణ్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోట శ్రీకృష్ణ్భగవాన్ సూచించారు. గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేటి ప్రభుత్వాల అలసత్వం కారణంగా దేశంలో విదేశీ వస్తువుల వాడకం పెరిగిపోయిందన్నారు. దేశంలో విదేశీ వస్తువుల వాడకం కారణంగా మన దేశంలో చైనా ఉత్పత్తులు అధికమవడం శోచనీయమన్నారు. చైనా ఉత్పత్తులను మనం కొనడంతో వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మన దేశంపై దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. విదేశీ వస్తువుల వాడకాన్ని నివారించేందుకు స్వదేశీ జాగరణ్ మంచ్ రాష్ట్ర శాఖ పలు అవగాహన కార్యక్రమాలకు రూపకల్పన చేసిందన్నారు. దీనిలో భాగంగా అక్టోబర్ 6,7,8న పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 6న స్వదేశీ రన్ నిర్వహించి స్వదేశీ మేళాను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనంతరం ప్రజలలో స్వదేశీ వస్తువులపై వినియోగ ప్రయోజనాలను తెలిపేందుకు స్వదేశీ జాగరణ్ మంచ్ వెబ్‌సైట్‌ను కోట శ్రీకృష్ణ్భగవాన వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సమావేశంలో సంస్థ కన్వీనర్ మైనేని నవీన్, ప్రచారం ప్రముఖ్ ఉప్పలపాటి వెంకట రామరాజు, నగర కన్వీనర్ కంతేటి శ్రీహరి, వేమవరపు శ్రీనివాస్, చందు సురేష్, తదితరులు పాల్గొన్నారు.

మాతాశిశు సంక్షేమం కోసం ఉద్యోగినులు పాటుపడాలి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ: మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారంతో పాటు ‘మాతా శిశు సంక్షేమం’ కోసం ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో ఉద్యోగులను చైతన్యపరిచే దిశలో కృషి చేయాలని ఏపి ఎన్‌జివో అసోసియేషన్ పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ కోరారు. ఐసిడిఎస్ సూపర్‌వైజర్స్ అండ్ ఎక్సంటేషన్ అధికారుల సంఘం జిల్లా కార్యవర్గ ఎన్నికలు శనివారం స్థానిక గాంధీనగర్‌లోని ఎన్‌జివో హోంలో నిర్వహించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గానికి విద్యాసాగర్ అభినందనలు తెలుపుతూ స్ర్తి, శిశు సంక్షేమ శాఖలో విధులు నిర్వర్తించడం ఎంతో బాధ్యతాయుతమైందన్నారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కొని సమర్థవంతంగా విధులను నిర్వర్తించి ప్రభుత్వ లక్ష్యాలను చేరుకునేలా ఉద్యోగులను చైతన్యపరిచేలా నూతన కార్యవర్గం కృషి చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు. ఏపి ఎన్‌జివో అసోసియేషన్ పశ్చిమ కృష్ణా, నగర అసోసియేటెడ్ అధ్యక్షుడు డి.సత్యనారాయణరెడ్డి, వీర్ల సూరిబాబు ఎన్నికల, సహాయ ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. జిల్లాలో సుమారు 160 మంది ఐసిడిఎస్ సూపర్‌వైజర్లు, ఎక్సంటేషన్ అధికారులు కలిగిన సంఘంలో 123 మంది సభ్యులుగా సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. శనివారం నామినేషన్ల గడువు ముగియటంతో 11 మంది సభ్యులతో సంఘ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రశాంతి, స్ర్తి, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి సిహెచ్ శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం
ఐసిడిఎస్ సూపర్‌వైజర్స్ అండ్ ఎక్సంటేషన్ అధికారుల జిల్లా సంఘానికి అధ్యక్షురాలిగా సిహెచ్ సాయిగీతా (కంకిపాడు), ఉపాధ్యక్షురాలిగా సిహెచ్ నాగపద్మావతి (గన్నవరం), కార్యదర్శిగా ఎన్.సునీతాదేవి (విజయవాడ), కోశాధికారిగా కె.నాగమణి (విస్సన్నపేట), సంయుక్త కార్యదర్శిగా ఎస్‌కె తారాభి (చిల్లకల్లు), కార్యవర్గ సభ్యులుగా కె.లక్ష్మి (విస్సన్నపేట), ఆర్.రాజేశ్వరి (చిల్లకల్లు), జె.సుజాత (కంకిపాడు), ఎ.జయంతి (కైకలూరు), ఎస్.రెహెనా బేగం (మచిలీపట్నం), పి.విజయలక్ష్మి (అవనిగడ్డ)లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియను ఎన్‌జివో అసోసియేషన్ పశ్చిమ కృష్ణా ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.రమేష్ పర్యవేక్షించారు. నూతన కార్యవర్గానికి స్ర్తి శిశు సంక్షేమ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు