ఖమ్మం

ఘాటెక్కిన ఉల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్: ఉల్లిపాయలను కోయడం సంగతి పక్కన పెడితే కొనుగోలు చేయాలంటనే కన్నీళ్లు వస్తున్నాయి. గతంలో దరాఘాతంతో సామాన్యులకు కంటతడి పెట్టించిన ఉల్లి ధర మళ్లీ ఈ ఏడాది పరుగులు తీస్తోంది. ఈ ఏడాది తొలిసారి ఉల్లి ధర మళ్లీ ఘాటెక్కింది. హోల్‌సెల్ మార్కెట్‌లో సరకు కొరత కారణంగా ఒక్కసారిగా ధర పెరిగింది. దీనికి తోడు కృత్రిమ కొరత సృష్టించడమూ ప్రజలకు భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఉల్లి ధర పేద, సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. దీంతో జనం సతమతమవుతున్నారు. రోజువారి కూరలో ఉల్లి వినియోగం అనివార్యం కావడంతో పెరిగిన ధరతో కొనుగోలు చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని శ్రమజీవులు, మధ్య తరగతి ప్రజలకు పెరిగిన ధర పెనుభారంగా మాంది. పది రోజుల క్రితం ఉన్న ధర ప్రస్తుతం మూడింతలైంది. రెండు వారాల క్రితం కిలో ఉల్లి రూ.10 నుంచి 14 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.40వరకు అమ్ముతున్నారు. దీంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. మున్ముందు వినాయక చవితి, దసరా వంటి ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ప్రస్తుతం సాగులో ఉన్న ఉల్లిపంట మార్కెట్‌కు రావాడానికి మరో మూడు నెలలు కాలమైనా పడుతుంది. అప్పటివరకు ప్రస్తుతం విక్రయిస్తున్న ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాకు మహారాష్ట్ర మార్కెట్ నుంచి ఉల్లిగడ్డలు రవాణా అవుతుంటాయి. అక్కడ ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ఆ ప్రభావం ఇక్కడ చూపిస్తోంది. వ్యాపారుల అంచనా ప్రకారం సెప్టెంబర్ మొదటివారంలో ఉల్లి కిలో ధర రూ.100 వరకు చేరుకుంటుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఉల్లి ధరలు ఎప్పుడు తగ్గుతాయోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

భక్తాద్రిగా భద్రాద్రి
భద్రాచలం టౌన్: జై శ్రీరామ్.. జయ జయ శ్రీరామ్ అంటూ భక్తులు నినదించారు. చూడచక్కని రామయ్యా.. మా దరి చేరవయ్యా అంటూ రామయ్యను కొలిచారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు రామదర్శన భాగ్యం కోసం గంటలకొద్దీ వేచి ఉన్నారు. భక్తుల రాకతో పవిత్ర గోదావరి తీరంలోనూ సందడి కనిపించింది. వరుస సెలవు రోజులు రావడంతో భద్రాచలం పుణ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు ఒక్కసారిగా పోటెత్తడంతో ఆలయంలో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. రామయ్య దర్శనం కోసం భక్తులు గంటల పాటు వేచి ఉన్నారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు జరగడంతో ఎటు చూసినా అంతా రామమాయమై సాక్షాత్కరించింది. తెల్లవారుజామున పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఘాట్ వద్ద ఉన్న కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీల్లో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం తలుపులు తెరిచిన తర్వాత అర్చకులు రామయ్యకు సుప్రభాతం పలికి ఆరాధించి నామార్చనలు చేశారు. అభిషేక మహోత్సవంగా వైభవంగా నిర్వహించి బంగారు పుష్పాలతో అర్చన చేశారు. స్వర్ణ పుష్పార్చన భక్తిశ్రద్ధలతో సాగింది. బంగారంతో తయారు చేసిన పుష్పాలను అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన రామయ్య పాదాల వద్ద ఉంచి అర్చన చేశారు. ఇది చూసిన భక్తులు జైశ్రీరామ్ అంటూ నీరాజనాలు పలికారు. దేవ దేవుడికి ఈ పూజలు అంగరంగ వైభవంగా జరగడంతో మంత్రోచ్ఛారణలు పరమ పావనమై నిలిచాయి. అభిషేకంలో తక్కువ మంది భక్తులు మాత్రమే పాల్గొనే అవకాశం ఉండటంతో తమకు కలిగిన భాగ్యానికి ఉప్పొంగిపోయారు. క్షేత్ర విశిష్టత వీనుల విందు చేసింది. పుణ్యాహవచనం చేసి గోత్రనామాలను చదివి క్రతువులో అతి ముఖ్య ఘట్టమైన ప్రవరను పఠించారు. యాగశాలలో భక్తిప్రవత్తులతో హోమం నిర్వహించారు. కన్యాదానం చేసి కంకణధారణ నిర్వహించి యోక్త్ధ్రారణ చేశారు. పాహిమాం శ్రీరామచంద్ర ప్రభో అంటూ భక్తులు ప్రణమిల్లుతుండగా సమస్త మంగళ వాయిద్యాలు మార్మోగుతుండగా మాంగళ్యధారణ రమణీయంగా జరిగింది. నిత్యకళ్యాణ ఘట్టాన్ని వివరిస్తూ తలంబ్రాల వేడుకను నిర్వహించడంతో పూజల్లో పాల్గొన్న భక్తులు పరవశించిపోయారు. రాజాధిరాజైన రాముడికి జరిగిన దర్బార్‌సేవ వీక్షించిన వారు శ్రీరామ నామాలను స్మరిస్తూ పులకించిపోయారు. నిత్యకల్యాణంలో 170 జంటలు పాల్గొనగా శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. నేడు ముత్తంగి అలంకారంలో దర్శనం జరుగుతుందని ప్రధానార్చకులు జగన్నాథాచార్యులు తెలిపారు. నేడు ఆలయంలో ఆనవాయితీగా నిర్వహించే కృష్ణాష్టమి వేడుకలను సెప్టెంబర్ 14వ తేదీన నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆలయంలోని చిత్రకూట మండపంలో ద్వితీయ శ్రీమద్ భాగవత సప్తాహాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండపంలో హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామికి నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పద్మశాలీలు రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి
* రాజ్యసభ సభ్యుడు ఆనంద భాస్కర్, ఖమ్మం ఎంపి పొంగులేటి
కొత్తగూడెం: పద్మశాలి కులస్థులు రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా మరింత అభివృద్ధి సాధించాలని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తగూడెంలో నూతనంగా నిర్మించిన శ్రీ భక్త మార్కేండేయ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యాపారం రంగంలో పద్మశాలీలు పురోగతి సాధించాలన్నారు. కొత్తగూడెం పట్టణంలో పద్మశాలీ సోదరులు ఐక్యంగా కళ్యాణ మండపాన్ని నిర్మించుకోవటం అభినందనీయమన్నారు. ఖమ్మం పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పద్మశాలీ కళ్యాణ మండపానికి అవసరమైన సదుపాయాలను సమకూర్చేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. కళ్యాణ మండపాన్ని నిర్మించుకోవటం ద్వారా పద్మశాలీ సోదరులు తమ ఐక్యతను చాటుకున్నారని అన్నారు. కొత్తగూడెం శాసన సభ్యులు జలగం వెంకటరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కొత్తగూడెంలో నిర్మించుకున్న కళ్యాణ మండపం మరింత మందికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్ గుండు సుధారాణి, కొత్తగూడెం మున్సిపల్ ఛైర్ పర్సన్ పులి గీత, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ, పద్మశాలీ సంఘం నాయకులు ఆముదాల వెంకట నర్సయ్య, కోదాటి చంద్రవౌళి, మోతుకూరి ధర్మారావు, కనుకుంట్ల కుమార్, కుడిక్యాల సమ్మయ్య, కూచన బాలయ్య, కొండబత్తిని ప్రభాకర్, బోగా రవి కుమార్, కొండబత్తిని మధు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా పద్మశాలీ నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు.

భారీ దొంగతనం
* సుమారు 42లక్షల విలువైన సొత్తు అపహరణ
* రూ.24లక్షల నగదు, బంగారు నగలు అపహరణ
వైరా: స్థానిక సుందరయ్యనగర్, గాంధీచౌక్ ప్రాంతాల్లో దొంగలు తలుపులు బద్దలు కొట్టి మరీ దోచుకున్న సంఘటన శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గాంధీచౌక్‌లోని మిట్టపల్లి నాగేశ్వరావు(నాగి) ఇంట్లో వారు మొత్తం కుటుంబం బంధువుల ఇంట్లో పెండ్లి నిమిత్తం కోదాడ వెళ్ళారు. ఇంటి ముందు వైపు తలుపులు పగులకొట్టి ఆ ఇంట్లో సుమారు 520గ్రాముల బంగారంతోపాటు మరో రూ.15లక్షలు నగదు దోచుకెళ్ళారు. అలాగే సుందరయ్యనగర్‌లోని పెన్షనర్స్ భవనంకు పక్కనే రెండవఇంటిలో ఉన్న ఉపాధ్యాయులు నున్నా శ్రీనివాసరావు, సరిత ఇరువురు ఉపాధ్యాయులే. వరుస శెలవులు రావడంతో హైదరాబాద్‌లో చదువుతున్న కుమారుడి ఆరోగ్యం సరిగాలేదని భార్యాభర్తలు ఇద్దరు కలిసి హైదరాబాద్ వెళ్ళారు. వీరి ఇంట్లో కూడా సుమారు రూ. 2లక్షల విలువచేసే బంగారు వస్తువులు పోయినట్లు సమాచారం. అదే ఇంటికి ఎదురుగా ఉన్న మెడికల్ దుకాణం యజమాని లగడపాటి ప్రభాకర్ ఇంట్లో వారు పెండ్లికి వెళ్ళారు. ప్రభాకర్ ఇంటి తలుపులు పగలకొట్టిన దొంగలకు ఇంట్లో ఎటువంటి బంగారు ఆభరణాలు, నగదు దొరకకపోవడంతో పక్కనే కిరాయికి ఉంటున్న తల్లాడలో ఉన్న శ్రీరామ కోల్డ్‌స్టోరేజ్‌లో పనిచేస్తున్న వెలగ నాగేశ్వరావు ఇంట్లో కోల్డ్ స్టోరేజ్‌కు సంబంధించిన రూ. 9లక్షల నగదు దోచుకెళ్ళారు. దీంతో పోలీసులు వెంటనే డాగ్‌స్క్వాడ్‌ను రంగలోకి దింపి వెతికించినా దొంగల ఆచూకీ మాత్రం దొరకలేదు. మరో వైపు వేలిముద్రలు సేకరించడానికి క్లూస్‌టీంను కూడా రంగంలోకి దింపి వేలిముద్రలు సేకరించారు.ఇంత పెద్ద స్థాయిలో దొంగతనం జరగడంతో వైరాలో సంచలనం కలిగించింది. ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్ దొంగతనం జరిగిన ఇండ్లను పరిశీలించారు. వీరితోపాటు సిఐ మల్లయ్యస్వామి, ఎస్‌ఐ ఆంజనేయులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఉలిక్కిపడ్డ వైరా
వైరా: మునుపునె్నడు లేని విధంగా వైరా పట్టణంలో శనివారం అర్ధరాత్రి తరువాత జరిగిన వరుస దొంగతనాలతో ప్రశాంతంగా ఉన్న వైరా ప్రజలు ఉలిక్కిపడ్డారు. గతకొంతకాలంగా రాత్రి సమయాల్లో చిన్న - చిన్న దొంగతనాలు మాత్రమే జరుగుతుండేవి. పోలీసులకు ఫిర్యాదు చేయగా దొంగతనాలు జరగకపోవడంతో ప్రజలు దొంగల విషయానే్న మరిచిపోయారు. ఇటీవల పట్టణంలో సిసి కెమెరాలు దొంగలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చేశాయి. కాని శనివారం రాత్రి జరిగిన దొంగతనం తీరు చూస్తే పోలీసులు సైతం విస్తుపోయేవిధంగా ఉంది. సుందరయ్య నగర్‌లో ఓ ఇంటిముందు దొంగతనం సినీఫక్కీలో జరిగింది. ఏమాత్రం శబ్దం రాకుండా దొంగలు అధునాతన యంత్రాలు ఉపయోగించారు. ఇది కేవలం బయటి నుండి వచ్చిన దొంగల పనిమాత్రమే కాదని, స్థానికుల హస్తం కూడా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అంతేకాదు జరిగిన నాలుగు దొంగతనాల్లో ఏఒక్క ఇంటి యజమానులు కూడా ఇంట్లో లేరు. ఈసమస్య పోలీసులకు పెనుసవాలుగా మారింది. గతకొంతకాలంగా పోలీసులు సైతం పెట్రోలింగ్‌పై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టటంలేదని విషయం తేటతెల్లమవుతోంది.

కినె్నరసాని గేట్లు 2 ఎత్తివేత
* 8 వేల క్యూసెక్కుల నీరు విడుదల
పాల్వంచ: కినె్నరసాని ఎగువ ప్రాంతాలైన గుండాల, ఆళ్లపల్లి ప్రాంతాలలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి పాల్వంచ మండల పరిధిలోని కినె్నరసాని రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు చేరుతుంది. ఈ కారణంగా 407అడుగుల సామర్ధ్యం గల కినె్నరసాని రిజర్వాయర్ నీటి మట్టం ఆదివారం 406.1కి చేరుకుంది. దీంతో కెటిపిఎస్ అధికారులు రిజర్వాయర్‌కి ఉన్న 12 క్లస్ట్ గేట్లలో 2గేట్లను 4 అడుగుల మేరకు ఎత్తి 8వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 2వేలు ఉండగా ఇన్‌ఫ్లో పెరిగినట్లైతే మరికొన్ని గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా కెటిపిఎస్ అధికారులు ఉప్పలయ్య, రామకృష్ణలు తెలిపారు.

మంత్రి తుమ్మలను పరామర్శించిన ఐజెయు నేతలు
ఖమ్మం(జమ్మిబండ): ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొంది హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టియుడబ్ల్యూజె(ఐజెయు) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్టెకోల రాంనారాయణ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నర్వనేని వెంకట్రావ్, సయ్యద్ ఖాదర్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం కలిసి పరామర్శించారు. మంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే తాను జిల్లా ప్రజలను కలుసుకుంటానని జర్నలిస్టులకు తెలిపారు.
తుమ్మలను పరామర్శించిన నేతలు
తిరుమలాయపాలెం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆదివారం ఎంపిపి అశోక్ పరామర్శించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనారోగ్యానికి గురై యశోద ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జై హైదరాబాద్‌లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను పరామర్శించినట్లు అశోక్ తెలిపారు. తుమ్మలను పరామర్శించిన వారిలో టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బోడా మంగీలాల్, ఎంపిటిసి ఆర్ సురేష్‌రెడ్డి, ఆత్మ డైరెక్టర్లు ఆర్ నరసింహారెడ్డి, బెల్లం చలపతిరావు, నగేష్, రామసహాయం నరేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రావణమాస బోనాలు
కామేపల్లి: పాడిపంటలు మెండుగా ఉండాలని, గ్రామాలు సస్యశ్యామలంగా ఉండాలంటూ గ్రామ దేవతలను ఆదివారం నాడు మహిళలు అత్యంత భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించారు. వర్షాలు అధికంగా కురిసే శ్రావణమాసంలో గ్రామ దేవతలకు విశేషపూజలు నిర్వహించడం ఆనవాయితీ ప్రకారంగా ఆదివారం రైతులు, రైతుకూలీలు, మహిళలు, అన్ని వర్గాలకు చెందిన ప్రజల భాగస్వామ్యంతో గ్రామ బొడ్రాయి వద్దకు మహిళలు బోనాలతో తరలివచ్చారు. వేలాది మంది మహిళలు తమ బోనాలను బొడ్రాయి వద్ద చూపించి అక్కడ మొక్కులు చెల్లించిన అనంతరం ప్రధాన గ్రామ దేవతైన ముత్యాలమ్మ గుడివద్దకు చేరుకొని మొక్కులతో కూడిన బోనాలను సమర్పించారు. అక్కడ గ్రామ దేవతకు పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్న అనంతరం పలహారాలు అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామమంతా సుభిక్షంగా ఉండాలని వారు ఈ సందర్భంగా మొక్కులు చెల్లించారు. అదే విధంగా తాళ్ళగూడెం, ఊట్కూరు, ముచ్చర్ల, దాస్తుపల్లి, పండితాపురం గ్రామాలలో గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు.

గ్రామాల్లో ముత్యాలమ్మ జాతర
జూలూరుపాడు: శ్రావణమాసంలో ప్రతి ఏటా అన్ని వర్గాల ప్రజలు ముత్యాలమ్మతల్లికి పూజలు చేయటం ఆనవాయితీ. ఇందులో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ముత్యాలమ్మతల్లికి పసుపు, కుంకుమలతోపాటు కోళ్లను బలిహరణ ఇచ్చి ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే మహిళలు ఇళ్లలో ప్రత్యేక పిండి వంటకాలు, ముత్యాలమ్మ దేవతకు ఇష్టమైన నైవేద్యాలను తయారు చేసుకుని గ్రామ పరిధిలో ఉన్న దేవతకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పాడిపంటలు, సౌభాగ్యాలు ప్రసాదించాలని దేవతను మొక్కుకున్నారు. దాదాపు అన్ని గ్రామాల్లో ఒకే రోజున ముత్యాలమ్మ దేవతకు పూజలు చేయటంతో పండుగ జాతరలా సాగింది.
ఖమ్మంలో ఘనంగా గంగపుత్రుల బోనాలు
ఖమ్మం(మామిళ్ళగూడెం): నగరంలో ఆదివారం గంగపుత్రులు ఘనంగా బోనాల వేడుకలు నిర్వహించారు. మునే్నటి ఒడ్డున వేంచేసి ఉన్న గంగాభవాని దేవాలయానికి ప్రతి ఏటా శ్రావణమాసంలో బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా గంగపుత్రులు అధిక సంఖ్యలో పాల్గొని గంగామాతకు బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ గంగపుత్రుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చేపల వృత్తిగా ఎంచుకున్న వారికి ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తుందన్నారు. గంగాభవాని దేవాలయ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్రుల సంఘం నాయకులు తవిడబోయిన గోపాల్, అంజయ్య, వెంకట్, కృష్ణ, ప్రసన్న, బయ్యన్న, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

తిరుపలాయపాలెం మండలంలో...
తిరుమలాయపాలెం: మండలంలోని పిండిప్రోలు, తిరుమలాయపాలెం, ఏదుళ్ళచెర్వు, తెట్టెలపాడు, యర్రగడ్డ తదితర గ్రామాల్లో ఆదివారం బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆషాడమాసం చివరి ఆదివారం రోజున ఆయా గ్రామాల ప్రజలు బోనాలను ఎత్తుకొని ముత్యాలమ్మ తల్లికి సమర్పించారు. దేవాలయం వద్ద భక్తులు కోళ్ళు, మేకలను బలిచ్చారు. ప్రతి సంవత్సరం ముత్యాలమ్మకు బోనాలు సమర్పించే సాంప్రదాయంలో భాగంగా బోనాలు సమర్పించుకోవడం విశేషం.
నేలకొండపల్లి మండలంలో...
నేలకొండపల్లి: శ్రావణమాసంను పురస్కరించుకొని ఆదివారం మండలంలో ముత్యాలమ్మ జాతరను భక్తులు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని బైరవునిపల్లి గ్రామంలో వివిధ కులాల ఆధ్వర్యంలో ముత్యాలమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామంలో డప్పులతో ఊరేగింపుగా జాతర నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు నకిరికంటి వెంకటేశ్వరరావు, అప్పారావు, నకిరికంటి రమేష్, సత్యనారాయణ, వంగవేటి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
తుమ్మలను కలిసిన పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు
సత్తుపల్లి: తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొంది గురువారం డిశ్చార్జ్ అయిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావును పరామర్శించేందుకు సత్తుపల్లి ప్రాంతంలోని నేతలు, అధికారులు, ప్రజాప్రతినిధులు క్యూ కడుతున్నారు. ఆదివారం సత్తుపల్లి నగరపంచాయితీ చైర్‌పర్సన్ దొడ్డాకుల స్వాతి, గోపాలరావులు పరామర్శించారు. అదే విధంగా సిద్ధారం గ్రామం సర్పంచ్ ప్రమీలారాణి, ప్రసాద్‌లు తుమ్మలను కలిసి పరామర్శించిన వారిలో ఉన్నారు.

పరమత సహనానికి భారత్ ప్రతీక
ఖమ్మం(మామిళ్ళగూడెం): దేశ గౌరవాన్ని తగ్గించే విధంగా ఎవరు ప్రయత్నించినా సహించేది లేదని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బుడాన్ బేగ్ అన్నారు. జమాయత్ ఉలేమా ఏ హిందూ ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం నగరంలో జరిగిన శాంతి ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పరమత సహనానికి భారతదేశం ప్రతీక అన్నారు. ఈ దేశంలో హిందూ, ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉన్నారని, భారత రాజ్యాంగం పేర్కొన్నట్లుగా దేశంలో ఎవరైనా ఏ మతాన్నయినా పాటించవచ్చన్నారు. మతపరంగా ఈ దేశాన్ని మరొకసారి విభజించాలని చూస్తున్న మత ఛాందసవాదుల ప్రయత్నాన్ని కొనసాగనివ్వమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సయ్యద్, అల్లావుద్దీన్, జియావుద్దీన్, తాజుద్దీన్, సలాం, ఇతర ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.

వర్షంతో జలమయం
నేలకొండపల్లి: మండలంలో ఆదివారం కురిసిన ఎడతెరిపి లేని వర్షంతో రహదారులు, పంటపొలాలు జలమయంగా మారాయి. మండలంలోని కోనాయిగూడెం, ఆచార్లగూడెం, ఆరెగూడెం, కోరట్లగూడెం, రాజేశ్వరపురం, అమ్మగూడెం, బైరవునిపల్లి, చెరువుమాదారం తదితర గ్రామాలలో వర్షం భారీగా పడింది. దీంతో పత్తి, వరి, మొక్కజొన్న, పెసర పంటలు నీటితో నిండిపోయాయి. అదే విధంగా రహదారులపై వర్షంనీరు భారీగా చేరి చిన్నపాటి చెరువులను తలిపించాయి. వర్షం నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.