శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

తాళాలు వేసిన ఇళ్ల భద్రతకు ప్రత్యేక యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినపుడు ఇంటికి తాళాలు వేసి వెళ్తున్నప్పటికి దొంగతనాలు జరుగుతుండటాన్ని నిరోధించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా తాళాలు వేసి ఊరెళ్లాలనుకునే వారికి ఎటువంటి భయం లేకుండా ప్రత్యేక యాప్‌ను సిద్ధం చేశారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం (ఎల్‌హెచ్‌ఎంఎస్) అనే ఈ యాప్ వివరాలను ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వివరించారు. ఆయన మాట్లాడుతూ స్మార్ట్ఫోన్ ఉన్న వారందరూ ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇంటి యజమాని పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయగానే యూనిక్ ఐడి వస్తుందని తెలిపారు. రిజిస్టర్ చేసుకున్న వారు ఎపుడైనా దూరప్రాంతాలకు వెళ్తూ ఇంటికి తాళం వేసి వెళ్లే పక్షంలో ఈ యాప్‌లోకి ఫలానా రోజు నుంచి ఫలానా రోజు వరకు తాము ఇంట్లో ఉండటం లేదంటూ యాప్‌లోని రిక్వెస్ట్ వాచ్‌లో పొందుపరచాలని, వెంటనే సదరు అభ్యర్థన పోలీస్ కమాండ్ కంట్రోల్‌రూంకు చేరుతుందన్నారు. వారు ఇంటికి వెళ్లే ముందు రోజే పోలీసు సిబ్బంది సదరు ఇంటి వద్దకు వెళ్లి, వైర్‌లెస్ మోషన్ కెమెరా మోడెంలను అమరుస్తారని చెప్పారు. ఈ వైర్‌లెస్ కెమెరా తన ముందు జరిగే కదలికలను రికార్డ్ చేస్తుందన్నారు. అంతేకాకుండా ఆ కెమెరా పోలీస్ కంట్రోల్ రూంకు, ఇంటి యజమాని ఫోన్‌కు అనుసంధానించబడి కూడా ఉంటుందన్నారు. కెమెరా ముందు ఎటువంటి చిన్న కదలిక జరిగినా దాన్ని చిత్రీకరించి వెంటనే కంట్రోల్‌రూంకు పంపుతుందని తెలిపారు. తద్వారా ఇంటి దొంగతనానికి పాల్పడే వ్యక్తుల నుంచి తాళం వేసిన ఇళ్లను కాపాడవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ దొంగతనం జరిగినప్పటికి వెంటనే దొంగల్ని సులువుగా పట్టుకోవచ్చని వివరించారు. దీనికి సంబంధించి సందేహాలు ఉన్నవారు నెల్లూరు నగరం, రూరల్, సిసిఎస్ సిఐలను అడిగి తెలుసుకోవచ్చని సూచించారు. ప్రస్తుతానికి ఈ యాప్‌ను నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్ ప్రాంతాల ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉంచామని, త్వరలో జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతక్రితం ఈ యాప్ డౌన్‌లోడ్‌కు సంబంధించిన పోస్టర్లను జిల్లా ఎస్పీ రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి శరత్‌బాబు, నెల్లూరు నగర ఇన్‌చార్జ్ డిఎస్పీ బాలసుందరరావు, కావలి డిఎస్పీ రాఘవరావు, సిఐ బాజీజాన్ సైదా తదితరులు పాల్గొన్నారు.

మద్యం షాపు వద్దంటూ మహిళల ధర్నా
నెల్లూరుసిటీ : నగరంలోని మనుమసిద్ధి నగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న మద్యం షాపును తొలగించాలని కోరుతూ ఆదివారం స్థానిక మహిళలు ధర్నా నిర్వహించారు. అనంతరం స్థానిక మహిళలు మాట్లాడుతూ ఇప్పటికే అనేక ప్రాంతాల్లో నివాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణాలను అడ్డుకున్న మహిళలు తాజాగా మనుమసిద్ధి నగర్‌లో నివాసాల మధ్య, రోడ్డు పక్కన, దేవాలయానికి సమీపంలో ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణం వద్దని రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. 42వ డివిజన్‌లో కూలీనాలీ చేసుకుని బతికే అనేక నిరుపేద కుటుంబాలు నివాసం ఉండే ఈ ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటు చేస్తే తమ బతుకులు చిద్రం అవుతాయని ఆవేదన చెందారు. ఈ మద్యం షాపునకు సంబంధించి అనుమతులు కూడా పొందారన్నారు. స్థానికుల డిమాండ్ మేరకు ఈ ప్రాంతం నుంచి షాపును తొలగించాలని కోరారు.

దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణం కోసం 22న ఆమరణ దీక్ష
* తిరుపతి ఎంపి వరప్రసాద్ వెల్లడి
వాకాడు : దుగరాజపట్నంలో పోర్టు నిర్మాణం కోసం ఈ నేల 22న ఆమరణ దీక్ష చేపట్టనున్నట్టు తిరుపతి ఎంపి వరప్రసాద్ తెలిపారు. ఆదివారం సాయంత్రం వాకాడు, దుగరాజపట్నం గ్రామాల్లో ఆయన పర్యటించి విలేఖర్లతో మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే పోర్టు నిర్మాణ వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. గత మూడేళ్లుగా పోర్టు నిర్మాణం కోసం ప్రధాని, కేంద్రమంత్రులతో ప్రత్యక్షంగా మాట్లాడటం, ఇక్కడి పరిస్థితులను తెలియచేయడం, పలు దఫాలు లేఖలు రాయడం జరిగిందన్నారు. కానీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కుంటి సాకులు చెప్తున్నారని అన్నారు. కేంద్రంపై రాష్ట్రం, రాష్ట్రంపై కేంద్రం ఆరోపణలు చేసుకుంటూ ఇక్కడ ఆ పోర్టు నిర్మాణంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పోర్టు నిర్మాణానికి అనుకూలంగా లేవంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ఏజెన్సీల ద్వారా ప్రకటనలు జారీ చేస్తున్నారని విమర్శించారు. కొందరి స్వార్ధ ప్రయోజనాల కోసమే ఇక్కడ పోర్టు నిర్మాణ పనులు చేపట్టడం లేదన్నారు. గత ప్రభుత్వం అన్ని కోణాల్లో పరిశీలించి ఇక్కడ పోర్టు నిర్మాణానికి అంగీకరించిందని, రాష్ట్ర విభజన సమయంలోను పోర్టు నిర్మాణం ప్రతిపాదన ఉందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ పోర్టు ఎక్కడాలేదని, విశాఖలో ఉన్న పోర్టు ఎక్సైజ్‌శాఖకు కేటాయించారని, కృష్ణపట్నం పోర్టులో ప్రభుత్వ భాగస్వామ్యం అతి స్వల్పమని, తప్పనిసరిగా దుగరాజపట్నంలో పోర్టు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. అటవీ, ఇస్రో గతంలో తమకు అభ్యంతరాలు లేవని కేంద్రానికి లిఖిత పూర్వకంగా తెలిపి ఉన్నారని, కోట్లాది రూపాయలతో సర్వే పనులు నిర్వహించారని తెలిపారు. ఈ ప్రాంతంలో పోర్టు నిర్మాణానికి అనుకూలంగా ఉందని ఏజెన్సీ బృందం కేంద్రానికి తెలిపిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా తాను దీక్ష చేపడుతున్నట్లు, పార్టీలకు అతీతంగా ఈ దీక్షల్లో పాల్గొని పోర్టు సాధన కోసం అందరు భాగస్వాములు కావాలని ఎంపి కోరారు.
ఇకపై ఆటోడ్రైవర్లకు కొత్త విధివిధానాలు
* ప్రత్యేక సమావేశంలో ఎస్పీ నిర్ణయం
నెల్లూరు: జిల్లాలో ఆటోలు నడిపే డ్రైవర్లు ఇకపై పోలీస్, ఇతర శాఖలు కలిసి తీసుకున్న కొత్త విధి విధానాల మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు జిల్లా ఎస్పీ అధ్యక్షతన ఆదివారం స్థానిక ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో మున్సిపల్, రవాణా తదితర శాఖలతో పాటు ఆటోడ్రైవర్ల సంఘ యూనియన్ నేతలతో ప్రత్యేక సమావేశంలో నిర్ణయించారు. ఈ వివరాలను నగర ట్రాఫిక్ డిఎస్పీ ఎన్ రామారావు వెల్లడించారు. ఆయన ప్రకనటలో పేర్కొన్న సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన ఆటోలు వెనుకవైపు పోలీస్ వారు ఇచ్చే నెంబర్లను ఎరుపురంగు వృత్తంపై తెల్ల అక్షరాలతోనూ, ఇతర ప్రాంతాలకు చెందిన ఆటోల వెనుక నీలిరంగు వృత్తంపై తెలుపు అక్షరాలతోనూ ముద్రించుకోవాల్సి ఉంటుంది. వెంకటాచలం వైపు నుంచి నగరంలోకి వచ్చే ఆటోలను మినీ బైపాస్‌లో అన్నమయ్య సర్కిల్ వరకు మాత్రమే అనుమతిస్తారు. పొదలకూరు వైపు నుంచి వచ్చే ఆటోలను నగరంలోని పొదలకూరు రోడ్ సర్కిల్, కొండాయపాలెం గేట్ వరకు మాత్రమే అనుమతించనున్నారు. కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, కావలి వైపు నుంచి వచ్చే ఆటోలు నెల్లూరులోని తూర్పు రైల్వేస్టేషన్ ప్రాంగణం వరకు మాత్రమే అనుమతి. ముత్తుకూరు వైపు నుంచి వచ్చే ఆటోలు హరనాథపురం సర్కిల్ వరకు, ఇందుకూరుపేట, టిపి గూడూరుల వైపు నుంచి వచ్చే ఆటోలు మైపాడు గేట్, నరుకూరు సెంటర్‌ల వరకు మాత్రమే అనుమతించనున్నారు. నగరంలో ఎక్కడపడితే అక్కడ ఆటోలను నిలిపి, ప్రయాణికులను ఎక్కించుకునే ఆటోలకు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. పరిమితికి మించి ఆటోలో ప్రయాణికులు ఉంటే కేసులు తప్పనిసరి. ఆటోడ్రైవర్‌కు రెండు వైపులా ఎవరూ కూర్చోకుండా డ్రైవర్ సీటును కుదించుకోవాల్సి ఉంటుంది. తమ ఆటోలకు కేటాయించే నెంబర్ల కోసం ఆటోడ్రైవర్లు సంబంధిత స్టేషన్‌లలో సోమవారం నుంచి సంప్రదించవచ్చు. నగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించడంలో తీసుకుంటున్న చర్యలకు ఆటోడ్రైవర్లతో పాటు ప్రయాణికులు కూడా సహకరించాలని జిల్లా ఎస్పీ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.
రోడ్డు ప్రమాదంలో వైద్యుడికి గాయాలు
సంగం : సంగం మండలం తరుణవాయి గ్రామం సమీపంలోని జాతీయరహదారిపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సింహపురి వైద్యశాలకు చెందిన వైద్యుడికి స్వల్ప గాయాలయ్యాయి. నెల్లూరు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న కారు తరుణవాయి గ్రామం వద్ద టైరు పంచర్ అయ్యంది. దాంతో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కల్వర్టును వేగంగా ఢీకొట్టింది. కారులో బెలూన్లతో సహా బయటకి వచ్చాయి. అందులో ప్రయాణిస్తున్న సింహపురి హాస్పిటల్స్ వైద్యుడు అమర్‌నాథ్‌రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే నెల్లూరు వైద్యశాలకు తరలించారు.

జిల్లాలో ఎస్సైల బదిలీలు
నెల్లూరు : జిల్లాలో పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. విఆర్‌లో ఉన్న షేక్ కరీముల్లాను నెల్లూరు ఒకటో నగర ఎస్సైగా, విఆర్‌లో ఉన్న డి వెంకటేశ్వరరావును తడకు బదిలీ చేశారు. తడలో పనిచేస్తున్న ఏ సురేష్‌బాబును ఆర్‌ఎస్ టాస్క్ఫోర్స్‌కు బదిలీ చేశారు. విఆర్‌లో ఉన్న డి జగన్మోహన్‌రావును వెంకటాచలసత్రంకు, అలాగే జె బలరామిరెడ్డిని ఇందుకూరుపేట స్టేషన్‌కు బదిలీ చేశారు. ఉత్తర్వుల్లో పేర్కొన్న ఎస్సైలు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు.

రెండు ఆలయాల్లో చోరీ
చిల్లకూరు : మండలంలోని రామారెడ్డిపాలెం పంచాయతీలో బంగారమ్మ, మహాలక్ష్మమ్మ ఆలయాల్లో ఆదివారం తెల్లవారుఝామున గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి ఆలయ తలుపులు పగులగొట్టి హుండీలను చోరీ చేసినట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై అంకమ్మ నెల్లూరు క్లూస్‌టీంకు సమాచారం అందించి దొంగతనం జరిగిన తీరుతెన్నులపై విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

క్రికెట్ టోర్నమెంట్‌లో విన్నర్ ఈఎస్‌ఎస్, రన్నర్స్ అమరావతి
వెంకటగిరి : సింహపురి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు కళాశాల స్థాయిలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో ఈఎస్‌ఎస్ కళాశాల విద్యార్థులు విన్నర్స్ కాగా అమరావతి జూనియర్ కళాశాల విద్యార్థులు రన్నర్స్‌గా నిలిచారు. మూడురోజుల పాటు ఈ టోర్నమెంట్స్‌లో 10 టీమ్స్ పాల్గొనగా ఫైనల్స్‌కు ఈఎస్‌ఎస్ కళాశాల, అమరావతి జూనియర్ కళాశాల విద్యార్థులు చేరుకున్నారు. ఫైనల్స్‌లో అమరావతిపై ఈఎస్‌ఎస్ కళాశాల విద్యార్థులు విజయం సాధించారు. విన్నర్స్, రన్నర్స్‌కు పెట్లూరు చీనీ నిమ్మ పరిశోధన కేంద్రం సీనియర్ శాస్తవ్రేత్త బిజి రాజులు, అమరావతి కళాశాల ప్రిన్సిపాల్ శ్రావణ్‌కుమార్, ఈఎస్‌ఎస్ కళాశాల జూనియర్ సిబ్బంది రవిశంకర్ మెమొంటోలు అందజేశారు. సింహపురి యూత్ అసోసియేషన్ సభ్యులు ప్రవీణ్, వెంకీ, బాలు, మోహన్, వంశీ, మధు, ధరణ్, శివ, గౌరీ తదితరులు పాల్గొన్నారు.
‘బిజెపి పటిష్టతకు క్షేత్రస్థాయి నుంచి కృషి’
గూడూరు : రాష్ట్రంలో బిజెపి బలోపేతానికి క్షేత్రస్థాయి నుంచి పటిష్టతకు కార్యకర్తలు, అభిమానులు, నాయకులు చిత్తశుద్ధితో కృషి చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్థాయి ప్రజలకు తీసుకెళ్లి వారిని చైతన్యవంతులను చేసి బిజెపి పట్ల ఆకర్షితులను చేయాలని బిజెపి తిరుపతి పార్లమెంటు పరిశీలకులు దాసరి రత్నం కోరారు. ఆదివారం స్థానిక బిజెపి కార్యాలయంలో రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు నర్రా సంజీవనాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, ఈ ఏడు అసెంబ్లీనియోజకవర్గాల్లోని బూత్‌ల నిర్వహణ, పనితీరుపై ఆయన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లో సైతం పార్టీని బలోపేతం చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నదని, ఇప్పటికే పార్టీపై పలువురు ఆశావహులు ఎదురు చూస్తున్నారని అన్నారు. తమ తమ పోలింగ్ కేంద్రాల్లో పలు కార్యక్రమాలను నిర్వహించి తద్వారా చేసిన పనులను ఈ నెల 21వ తేదీన సోమిశెట్టి ఫంక్షన్ హాల్లో జరిగే విస్తారక కార్యక్రమంలో వివరించాలన్నారు. అలాగే ఈ సారి ఆగస్టు 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కెవి కృష్ణయ్య, బిజెపి నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, పద్మనాభచౌదరి, శ్రీనివాసులు, బాలకృష్ణమనాయుడు, శ్రీహరి, దాసు, రమీజా, మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి
* అపోలో యూనిట్ హెడ్ నవీన్
నెల్లూరుటౌన్: ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షిస్తూ భావితరాలకు ఆరోగ్యపరంగా భరోసా కల్పించాలని అపోలో వైద్యశాఖ యూనిట్ హెడ్ నవీన్ అన్నారు. నగరంలోని అపోలో హాస్పిటల్స్, జైన్ హబ్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం విఆర్‌సి సెంటర్ నుంచి గోగ్రీన్ అండ్ స్టే హెల్తీ (పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ) అపోలో వైద్యశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ వైద్యశాల, ఆ అసోసియేషన్ అధ్యక్షులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా నవీన్, జైన్ హబ్ అధ్యక్షుడు శాంతిలాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని పరిరక్షించాలని, మొక్కలు నాటి అవి పెరిగి పెద్దవి అయ్యే వరకు సంరక్షించాలని కోరారు. మన చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతారన్నారు. ఇది నిరంతరాయంగా చేసే ప్రక్రియ అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఇందులో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పర్యావరణం నానాటికి కాలుష్యం అవుతుందని, దీనివల్ల భావితరాలు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి పూర్తిస్థాయిలో పర్యావరణాన్ని కాపాడితేనే భావితరాల వారికి భరోసా కల్పించవచ్చన్నారు. తొలుత గో అండ్ గ్రీన్ స్టే హెల్తీ సందర్భంగా అపోలో వైద్యశాల వరకు సైక్లిస్టులు సైక్లింగ్ చేస్తూ మొక్కలను నాటాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని నినాదాలు చేస్తూ అపోలో వైద్యశాలకు చేరుకున్నారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో అపోలో వైద్యశాల ఫైనాన్స్ మేనేజర్ మోహన్, మార్కెటింగ్‌ట్ మేనేజర్ విజయ్‌కుమార్, సిబ్బంది, జైన్‌హబ్ ఆర్గనైజేషన్ అసోసియేషన్ సభ్యులు విక్రమ్ జైన్, దీపక్, జైన్, దయనేషన్ జైన్ పాల్గొన్నారు.

18 నుంచి వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాలు
* 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా * రూ.17 లక్షలతో సౌకర్యాలు * ఆశ్రమ ఇవో బాలసుబ్రహ్మణ్యం వెల్లడి
వెంకటాచలం : దక్షణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి 35వ ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేస్తున్నట్లు ఆశ్రమ ఎగ్జిక్యూటివ్ అధికారి పి బాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు. వెంకటాచలం మండలంలోని గొలగమూడి ఆశ్రమ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు ఏడు రోజుల పాటు జరిగే ఆరాధనోత్సవాలకు ఈ ఏడాది మొత్తం 5 లక్షల మందికి పైగా భక్తులు వస్తారన్న అంచనాతో ఉన్నామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రూ.17 లక్షలతో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడు రోజులపాటు ఆశ్రమానికి రూ.30 లక్షలకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతి రోజు ఉదయం, రాత్రి వాహన సేవలు, ఉత్సవాలు ఉన్నాయని, అన్ని ఉత్సవాలకు ఒకే రకమైన అలంకరణ ఉంటుందన్నారు. ఆరాధనోత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 145 వసతిగృహలు, విశ్రాంతి తీసుకునేందుకు రెండు డార్మెంటరీలు, కల్యాణ మండపం సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఆశ్రమ ప్రాంగణంతోపాటు ఆశ్రమ చుట్టుపక్కల ట్రాఫిక్ అంతరాయం లేకుండా గొలగమూడి గ్రామంలోకి వచ్చే రెండుమార్గాల వైపు వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఆశ్రమం తరపున భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. అశ్రమంలో దర్శనం కోసం భక్తులు వెళ్లేందుకు క్యూ మార్గాల్లో శాశ్వత ప్రాతిపదికన షెడ్లు ఏర్పాటు చేశామన్నారు. ఆశ్రమం ఆధ్వర్యంలో ఏడురోజులపాటు ఇస్కపాళెం ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం, జిల్లా పిఎంపి అసోసియేషన్, మోడరన్ కంటి ఆసుపత్రి వారు ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. నెల్లూరు ఆర్టీసీ వారు గొలగమూడికి ప్రత్యేక బస్సులు నడపనున్నారని, దీంతోపాటు నెల్లూరుతోపాటు జాతీయ రహదారి నుంచి ఆటోలు ఉంటాయన్నారు. జాతీయ రహదారి నుంచి గొలగమూడి వరకు వచ్చే మార్గంలో విద్యుద్దీపాలంకరణ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆరాథనోత్సవాలు చివరి రోజైన 7వ రోజు 24వ తేదీన ప్రత్యేకంగా లక్షల రూపాయలతో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన చెప్పారు. తిరుమల, తిరుపతి దేవస్థానం మాదిరిగా గొలగమూడి వెంకయ్యస్వామి ఆశ్రమానికి అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఆశ్రమంలో మరిన్ని అభివృద్ధి పనులు నిర్మాణంలో ఉన్నట్లు ఆయన చెప్పారు. త్వరలో ఆశ్రమంలో ఫిజియోథెరపి ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. దీనికి మహావీర వికలాంగుల సేవా సమితి వారు సహకారం అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఆశ్రమంలోని ట్రస్ట్‌లకు, ఆశ్రమ అభివృద్ధికి వివరాలు ఇచ్చే దాతలకు ఆదాయపు పన్నుల శాఖ నుంచి కొంత మినహాయింపు ఉంటుందన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆశ్రమంలో జరిగే ప్రతి కార్యక్రమం, సమావేశాల వివరాలను హైకోర్టు వారికి పంపించనున్నట్లు ఆయన వివరించారు. ప్రత్యేక దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రసాదాలు, దర్శనం, వసతి సౌకర్యాలపై నగదు సంపాదించాలన్న ఉద్దేశ్యంతో తాము చేయడం లేదన్నారు. ఆరాధనోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఘటనలు జరగకుండా నెల్లూరు రూరల్ డిఎస్పీ రాఘవరెడ్డి, నెల్లూరు రూరల్ సిఐ శ్రీనివాసులురెడ్డి, వెంకటాచలం ఎస్‌ఐ జగన్‌మోహన్‌రావుల ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు.