కర్నూల్

కేశవరెడ్డి బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల: నంద్యాల నుంచి విద్యావ్యాపారాన్ని కొనసాగించి అంచెలంచెలుగా ఎదిగి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించి వాటిని తిరిగి చెల్లించడంలో మోసం చేసిన కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డి నుండి బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని వై ఎస్ జగన్ ఆరోపించారు. ఆదివారం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోలో వై ఎస్ జగన్ మాట్లాడుతూ కేశవరెడ్డి బాదితులు వందల సంఖ్యలో ఉన్నారని, వారికి కేశవరెడ్డి నుండి వందలాది కోట్ల రూపాయలు రావాల్సి ఉందని, పేద, మద్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి డిపాజిట్లు సేకరించి అవి చెల్లించకుండ వాయిదాలు వేస్తూ మోసం చేసిన కేశవరెడ్డిని తెలుగుదేశం ప్రభుత్వం వెనకేసుకు రావడం సిగ్గుచేటన్నారు. కేశవరెడ్డి బాదితులను ఆదుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొక్కా విప్పి కేశవరెడ్డి బాదితులు నిలదీయాలని, కేశవరెడ్డికి అండగా నిలిచి పంచాయితీలు చేసి బాదితులను ఏడిపించిన మంత్రి ఆదినారాయణరెడ్డి నిక్కరు ఊడదీయాలని తీవ్రస్థాయిలో ఆరోపించారు. నంద్యాల పట్టణంలో రోడ్ల విస్తరణ చేస్తున్నామని చంకలు గుద్దుకుంటున్న తెలుగుదేశం ప్రభుత్వం బాదితులైన షాపుల యజమానులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించి రోడ్ల విస్తరణ కోసం కూల్చి వేసి ఉండాల్సిందని, అయితే అలాకాకుండ ఉప ఎన్నికలో రోడ్ల విస్తరణ చేపట్టి లబ్ది పొందాలన్న దురాశతో ఆఘమేఘాల మీద అడ్డదిడ్డంగా షాపులను పడగొట్టారని ఆరోపించారు. నంద్యాల ఉప ఎన్నికలో వైకాపా పోటీ చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధులు కేటాయించేదా అని ప్రశ్నించారు. కేవలం నంద్యాల ఉప ఎన్నికలో లబ్ది పొందేందుకే తెలుగుదేశం ప్రభుత్వం నంద్యాల మీద వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తుందని దుయ్యబట్టారు. తనకు పులివెందుల నియోజకవర్గం, నంద్యాల నియోజకవర్గం సమానమేనని, వైకాపా ప్రభుత్వంలో రెండు నియోజకవర్గాలను స్మార్ట్ సిటిలుగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.మైనార్టీ ముస్లీంలకు తన తండ్రి వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్‌లు కల్పించి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను వారి కోసం రూపొందించారని అన్నారు. తమ ప్రభుత్వంలో నవరత్నాల పథకాలు ప్రతి కుటుంబం లబ్ది చేకూరే విధంగా రూపొందించామని, ముస్లీం మైనార్టీలకు పెద్దపీట వేస్తామని, ముస్లీంలకు మంత్రివర్గంలో చోటు కల్పించి వారి సమస్యలను పరిష్కరిస్తామని జగన్ హామీ ఇచ్చారు. రోడ్‌షోలో ఈయన వెంట వైకాపా అభ్యిర్థి శిల్పామోహన్‌రెడ్డి, వైకాపా నేతలు పాల్గొన్నారు.
టిడిపి, వైకాపా దొందూదొందే..
* కాంగ్రెస్‌తోనే సీమ అభివృద్ధి:పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి
నంద్యాల: టిడిపి, వైకాపా దొందూ దొందేనని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం కాగా ప్రతిపక్ష పార్టీగా వైకాపా కూడా పూర్తిస్థాయిలో విఫలమైందని పిసిసి చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. నంద్యాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం రఘువీరా విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. మోదీ అనే నాణెంకు చంద్రబాబు, జగన్ బొమ్మా బొరుసు లాంటి వారని విమర్శించారు. టిడిపికి, వైకాపాకు ఓట్లు అడిగే దారిలేక విద్వేషాలను చాటుకుంటూ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాయలసీమలో అంతరించిపోయిందన్న ఫ్యాక్షన్‌ను ఇద్దరు నేతలు మళ్లీ నిద్రలేపుతున్నారన్నారు. రాయలసీమ సమస్యలను ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలు ఇద్దరూ విస్మరించారని దుయ్యబట్టారు. టిడిపి, వైకాపాలకు నంద్యాల ఓటర్లు ఎందుకు ఓటు వేయాలో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. 2014లో నంద్యాలలో వైకాపా గెలిస్తే టిడిపి పార్టీ మారారని, నేడు టిడిపి అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తుండగా ఆ నాటి ఎన్నికల్లో ఓడిన శిల్పా వైకాపా తరుపున పోటీ చేస్తున్నారని కేవలం జెండాలు మారాయే తప్ప వ్యక్తులు, కుటుంబాలు వారేనన్నారు. నేటి ఉప ఎన్నికలో పోటీ పడుతున్న భూమా, శిల్పా కుటుంబాలు భవిష్యత్తులో పార్టీ మారరన్న గ్యారంటీ లేదన్నారు. పార్టీ ఫిరాయింపులను అగ్రనేతలే ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ ప్రాంతానికి ఇంతవరకు చేసిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైందన్నారు. తెలుగుదేశం పార్టీ విధానాల కారణంగా సీమ రైతులు రోడ్డెక్కారని ఆరోపించారు. గుండ్రేవుల ప్రాజెక్టుకు కాంగ్రెస్ పార్టీ రూ.3 వేల కోట్లు మంజూరు చేయడంతో పాటు డిపిఆర్ కూడా పూర్తి చేసిందని, అయితే తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి గుండ్రేవుల ప్రాస్థావన కూడా తీసుకురాలేదన్నారు. సిద్దేశ్వరం అలుగు గురించి రెండు పార్టీలు మాట్లాడడం లేదని, ఇద్దరూ రాయలసీమ ద్రోహులేనన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను చట్టబద్దం చేసి నిధులు కేటాయించి వాటిని ఎస్సీ, ఎస్టీలకే ఖర్చు చేసిందని, నేడు టిడిపి సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లిస్తూ ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిందని ఆరోపించారు. ముస్లీంలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. నంద్యాలలో అత్యధిక శాతం ఉన్న ముస్లీం మైనార్టీలు వారికి రిజర్వేషన్లు కల్పించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్దుల్‌ఖాదర్‌కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్దుల్‌ఖాదర్, మహిళా నేత పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.
భక్తులతో పోటెత్తిన శ్రీగిరులు
శ్రీశైలం:శ్రీశైల మహాక్షేత్రంలో శ్రావణ మాసం, వరుస సెలవులు కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. దేశ నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలం చేరుకుని పవిత్ర పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు వేకువ జాము నుండే పోటీ పడుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ఆలయ వేళల్లో మార్పులు చేశారు. ఇక వరుస సెలవులు రావడంతో శ్రీశైల క్షేత్రానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆదివారం వేకువ జామున 3 గంటలకే ఆలయ ద్వారాలు తెరచి మంగళ వాయిద్యాలు, సుప్రభాత సేవ, ప్రాతఃకాల పూజల అనంతరం ఆర్జిత సేవలను ఆలయ అధికారులు ప్రారంభించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సుప్రభాత, మహామంగళ హారతి టికెట్లను ఆలయ అధికారులు నిలుపుదల చేశారు. వేకువ జాము నుండే దర్శనం క్యూలైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. సుమారుగా 60 వేల మందికి పైగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారని అంచనా. శ్రావణ మాసం, వరుసగా నాలుగు రోజులు సెలవు రావడంతో శ్రీశైలానికి భక్తుల రద్దీ పెరిగింది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో దేవస్థానం అధికారులు భక్తుల సౌకర్యార్థం క్యూ కాంప్లెక్స్‌లలో అల్పాహారం, బిస్కెట్ల పంపిణీని చేపట్టారు. అదేవిధంగా ఉదయం 9.30 గంటల నుండే అన్నపూర్ణ భవనంలో భోజన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్వహిస్తున్నారు. క్యూ కాంప్లెక్స్‌లలో, కళ్యాణ కట్ట వద్ద, పార్కింగ్ ప్రదేశాలలో ఆలయ అధికారులు ప్రత్యేక విధులు నిర్వహిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండ ఉండేలా ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారుల సూచనలతో భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శనంతోపాటు అన్ని విధాలా సౌకర్యాలు త్వరితగతిన అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
ద్వారబంధనాల బంగారు రేకులకు సంప్రోక్షణ
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల గర్బాలయం, అంత్రాలయం, ద్వార బందనాల రేకులకు ఆదివారం ఉదయం శాస్త్రోక్తకంగా సంప్రొక్షణ కార్యక్రమాన్ని ఈఓ నారాయణ భరత్‌గుప్తా చేతుల మీదుగా అర్చక వేదపండితులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని వృద్ధ మల్లికార్జునస్వామి ముఖ మండపంలో ఈ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమం నిర్విగ్నంగా జరగాలని మహాగణపతి పూజ, బంగారు రేకుల సిద్ది కోసం సంప్రోక్షణాది కార్యక్రమాలు అర్చక వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తరువాత బంగారు రేకులతో ఆలయ ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించిన అనతరం ఈ రేకులకు దాతల సహకారంతో బంగారు తాపడం కార్యక్రమాలు చేపట్టారు. మూడు ద్వార బందనాల తాపడంలో రాగి రేకులతో రూపొందించిన బందనాలకు బంగారు పూత వేయబడింది. ఇందుకోసం సుమారుగా 220 కిలోల రాగిని, 1.5 కిలోల బంగారాన్ని వినియోగించారు. సుమారు ఈ సువర్ణ కవచాలంకరణ పనులకు రూ.కోటి ఖర్చు అయినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మొత్తం 79 రేకులతో స్వామి వార్ల లింగోద్భవ మూర్తి, దక్షణామూర్తి, అర్ధనారీశ్వరమూర్తి, పద్మలంకరణలు ఈ రేకులపై చెక్కబడ్డాయి. ఆదివారం నుండి బంగారు రేకులను అమర్చే పనులు ప్రారంభిస్తారు. ఈ పనులు 18వ తేదీ నాటికి పూర్తి కావచ్చని ఆలయ అధికారులు తెలిపారు. ఈవిశేష కార్యక్రమంలో ఈఓ నారాయణ భరత్‌గుప్తా, అర్చక వేదపండితులు ఆలయ అధికారులు పాల్గొన్నారు.
నివేదికల స్ఫూర్తికి భిన్నంగా అభివృద్ధి
* సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి
* ప్రభుత్వ మాజీ సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు
కర్నూలు:శ్రీబాగ్ ఒప్పందం, శివరామక్రిష్ణన్ నివేదికల స్ఫూర్తికి భిన్నంగా అభివృద్ధిని కేంద్రీకరిస్తున్నారని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు. రాయలసీమలో తప్పకుండా హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని సిరిమేఘ ఫంక్షన్ హాలులో ఆదివారం జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి అధ్యక్షతన ‘రాయలసీమ అభివృద్ధి- సవాళ్లు’ అంశంపై సెమినార్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్, చత్తీస్‌ఘడ్, కేరళ, మధ్యప్రదేశ్, ఒరిస్సా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రాజధానులు, హైకోర్టులు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. కావున రాయలసీమలో తప్పకుండా హైకోర్టు ఏర్పాటు చేయాలన్నారు. అమరావతి రాజధాని కోసం 10 వేల ఎకరాల అటవీ భూములు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని, ఈ భూములకు ప్రత్యామ్నాయంగా రాయలసీమలోని కడప, అనంతపురం జిల్లాలను పేర్కొనటాన్ని తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కోసం కృషి చేయాలన్నారు. చెరువుల స్థిరీకరణపై దృష్టి పెట్టాలన్నారు. గత 20ఏళ్లలో పదేళ్ల పాటు అనంతపురంలోని అన్ని మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించాలన్నారు. మాజీ డిజిపి ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ బహుళ పంటలు పండే భూములను ధ్వంసం చేసి రాజధాని నిర్మించడం న్యాయం కాదన్నారు. రాష్ట్ర విభజన వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాలు, హైదరాబాద్ మాత్రమే బాగుపడ్డాయని, రాయలసీమకు ఎలాంటి ఫలితాలు అందలేదన్నారు. రాజధాని అమరావతిలో సాధ్యం కాదని, దొనకొండలో పెట్టాలని కోరారు. మార్కెట్ ఆధారిత వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలన్నారు. రాయలసీమలో వరిసాగును తగ్గించి ఖర్జూరం, ఎర్రచందనం, శ్రీగంధం, కూరగాయలు, దానిమ్మ తోటలను అభివృద్ధి పరచాలని, టమోటా ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇంజినీరింగ్ కాలేజీలను స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్‌గా మార్చి విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించాలన్నారు. కడప, కర్నూలు జిల్లాల్లో తమకు ఓట్లు రాలేదని ఈ రెండు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వడం లేదన్నారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరధరామిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో 1.7 కోట్ల ఎకరాల భూమి వుండగా 10 లక్షల ఎకరాలకు మాత్రమే నీటి వసతి ఉందన్నారు. అనంతరం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డా. అస్విరెడ్డి హరినాథ్‌రెడ్డి, జాతీయ బిసి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, రాయలసీమ మేధావుల ఫోరం నేత పురషోత్తంరెడ్డి, ఓపిడిఆర్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, రాయలసీమ అభ్యుదయ సంఘం కన్వీనర్ రాచమల్లు ఇస్మాయిల్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు మారుతి, రాయలసీమ ఉద్యోగుల సంఘం నేత సయ్యద్‌రోషన్‌అలీ, వెంకటసాయినాథ్, తదితరులు ప్రసంగించారు.
కెసి కెనాల్‌లో చెత్త వేస్తే చర్యలు
* కలెక్టర్ సత్యనారాయణ
కర్నూలుసిటీ:నగర నడిబొడ్డున ప్రవహించే కెసి కెనాల్ నీటిని సాగు, తాగునీటి కోసం ఉపయోగిస్తారని, అయితే కాలువ సమీపంలో నివాసం ఉండే ప్రజలు చెత్తను కెసి కెనాల్‌లో వేస్తూ అపరిశుభ్రం చేస్తున్నారని, ఇకపై కెసి కెనాల్‌లో చెత్త వేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సత్యనారాయణ హెచ్చరించారు. కెసి కెనాల్‌లో పేరుకుపోయిన చెత్తను తొలగించే కార్యక్రమం చేపట్టగా ఆదివారం కలెక్టర్ నగర పాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో కెసి కెనాల్ దాదాపు 9 కి.మీ ప్రవహిస్తుందని, కాలువ పక్కనే నివాసం ఉండే ప్రజలు తమ ఇళ్ల నుంచి వచ్చే మురికి నీటిని కెసి కెనాల్ లోకి వదలకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పైపులైన్ ద్వారా బయటికి పంపాలన్నారు. అలాగే తమ ఇళ్లలోని చెత్త చెదారాన్ని కెసి కెనాల్‌లో వేయకుండా చెత్త బుట్టల్లో వేయాలన్నారు. ఇకపై ఎవరైనా కెసి కెనాల్‌లో చెత్త వేస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. కలెక్టర్ వెంట కర్నూలు ఆర్డీఓ హుసేన్‌సాహెబ్, తహశీల్దార్ రమేష్‌బాబు, నగర పాలక సిబ్బంది, తదితరులు ఉన్నారు.
అభివృద్ధిని చూసి టిడిపిని గెలిపించండి
* మంత్రులు, ఎమ్మెల్యేలు
నంద్యాల రూరల్:నంద్యాల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టిడిపి అభ్యర్థి బ్రహ్మానందరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని టిడిపి మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్, ఎమ్మెల్యే డేవిడ్‌రాజు, బిసి జనార్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డిలు అన్నారు. ఆదివారం నంద్యాల మండలంలోని అబాండతాండా గ్రామంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గాన్ని టిడిపి ప్రభుత్వం అన్ని విధాల అభివృద్ధి చేస్తుందని ప్రతి ఒక్కరు ఓటుతో ఆశీర్వదించాలన్నారు. అభివృద్ధిని చూసి వైకాపా నాయకులు ఓర్వలేక పోతున్నారని, మాట్లాడుతున్న వైకాపా మాటలతో ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. వైకాపాకు గుణపాఠం చెప్పే రోజులు నంద్యాల ప్రజలతోనే ప్రారంభమవుతాయన్నారు. టిడిపి ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటూ ప్రజల ముందుకు వెళ్తుందన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ప్రధానంగా పనిచేస్తుందన్నారు. టిడిపి అభ్యర్థి బ్రహ్మానందరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో బాలవెంకట్‌రెడ్డి, లక్ష్మీరెడ్డి, టిడిపి కన్వీనర్ గురునాధరెడ్డి, స్వామినాయక్, తదితరులు పాల్గొన్నారు.
దేశ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రపంచంలోనే విశిష్ట స్థానం:ఎమ్మెల్యే ఎస్వీ
కర్నూలుసిటీ:్భరత దేశ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రపంచ దేశాల్లోనే ఒక విశిష్ట స్థానం ఉందని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 17వ జాతీయ సాంస్కృతిక మేళాలో భాగంగా శ్రీకృష్ణాష్టమి, స్వాతంత్య్ర దినోత్సవాలు పురస్కరించుకుని ఆదివారం ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నృత్యరూపక పోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఎస్వీ మాట్లాడుతూ శ్రీకృష్ణుడు, గోపిక వేషధారణ ఆనాటి పల్లె సంస్కృతికి చిహ్నాలన్నారు. ఇక స్వాతంత్య్రోద్యమంలో ప్రాణాలర్పించిన అమర వీరులను నేటి తరం గుర్తించుకుని సమ సమాజ స్థాపనకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఫౌండేషన్ అధ్యక్షుడు రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను నేటి తరం వారు మరవరాదన్నారు. శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలను సంప్రదాయబద్దంగా జరుపుకోవాలన్నారు. దివ్యాంగులు ఆత్మన్యూనతా భావాన్ని వదిలి అందరితో సంతోషంగా ఉండాలన్నారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన నృత్య రూపకాలు అలరించాయి. కార్యక్రమంలో రమణయ్య, నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు నాగలక్ష్మి, హనుమంతరాయచౌదరి, తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం..!
* తాగునీరు కలుషితం.. రోగాల బారిన ప్రజలు
కర్నూలు సిటీ:నగర పాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. నగర పాలక సంస్థ పరిధిలోని 41వార్డు తిలక్‌నగర్(విద్యుత్ భవన్ ఎదురుగా)లో గత 13 రోజులుగా తాగునీటి పైపులైన్ పగిలిపోయింది. ఈ పైపులైన్ ప్రధాన డ్రైనేజీ కాలువ మధ్యలో ఉంది, దీంతో మురికి నీరు అందులో కలిసిపోవటం వల్ల ఆ నీటిని తాగిన ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పగిలిపోయిన తాగునీటి పైపులైన్‌ను కొంత తవ్వి మధ్యలోనే వదిలేసి వెళ్లారు. కలుషిత నీటిని తాగటం వల్ల ఈ ప్రాంత ప్రజలు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారని స్థానికులు బి.శివ, రాజారెడ్డి, సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా నగరపాలక సంస్థ అధికారులు నిర్లక్ష్యం వీడి పగిలిపోయిన తాగునీటి పైపులైన్లను సరి చేసి ప్రజలను రోగాల బారి నుంచి కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తాళం వేసిన ఇళ్లకు ప్రత్యేక రక్షణ
* చోరీల నివారణకు ప్రజలు సహకరించాలి:ఎస్పీ
కర్నూలు:తాళం వేసిన ఇళ్లలో చోరీలు జరగకుండా ఉండేందుకు పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న లాక్‌డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం(ఎల్‌హెచ్‌ఎంఎస్) సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ ప్రజలకు సూచించారు. నగరంలోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్‌లో ఆదివారం ఎల్‌హెచ్‌ఎంఎస్‌పై డెమో క్లాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తాళం వేసిన ఇళ్ల ను లక్ష్యంగా ఎంచుకుని చోరీలకు పాల్పడుతున్న దొంగలను నివారించడానికి ఈ యాప్‌ను ఎక్విప్‌మెంట్‌తో ప్రారంభించామన్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోనిలో అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ టెక్నాలజీని ఉపయోగించి ప్రజల ఇళ్లకు భద్రత కల్పించాలన్నారు. నగరపాలకసంస్థ కమిషనర్ హరినాథ్‌రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఆఫీస్, పింఛన్లు పంపిణీ చేసే చోట, కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు ఈ యాప్ గురించి తెలియజేసేందుకు, వినియోగించేందుకు పోలీసుల సహకారం తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రమణమూర్తి, సిఐలు మహేశ్వరరెడ్డి, డేగల ప్రభాకర్, నాగరాజారావు, క్రిష్ణయ్య, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాసరావు, ఈకాప్స్ ఇన్‌చార్జి రాఘవరెడ్డి, ఎస్‌ఐలు, యాప్ డెవలపర్స్ నవీన్‌కుమార్, మణికంఠ పాల్గొన్నారు.
ప్రకటనలకే పరిమితమైన పందుల నియంత్రణ!
* రోడ్లపై స్వైరవిహారం.. * ఇబ్బందుల్లో ప్రజలు
కర్నూలు సిటీ:నగర పాలక సంస్థ పరిధిలో ‘పందుల నియంత్రణ’ కేవలం ప్రకటనలకే పరిమితమైందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పందులు రోడ్లపై కనిపిస్తే కోర్టు ఆదేశాల ప్రకారం కాల్చి వేస్తామని నగర పాలక సంస్థ అధికారులు ప్రగర్భాలు పలుకుతున్నారే తప్ప ఆచరణలో విఫలమయ్యారనే చెప్పవచ్చు. నగరంలో విచ్చల విడిగా పందులు సంచరిస్తూ ప్రజలకు ఇబ్బందులు కల్గించటమే కాకుండ రోగాల బారిన పడేటట్లు చేస్తున్నాయి. పందులను జనావాసాల నుంచి తప్పించి నగరానికి 5కి.మీ దూరంలో ఉన్న డంప్ యార్డు వద్ద ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసుకోవాలని, అందు కు మెప్మా తరఫున రుణ సౌకర్యం కల్పిస్తామని నగర పాలక సంస్థ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యంగా పందుల యజమానులతో సమావేశం నిర్వహించి పందులను జనావాసాల నుంచి తరలించాలని హెచ్చరించారు. అయినా పందుల యజమానులు నగర పాలక సంస్థ అధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా పందులను ఇష్టారాజ్యంగా రోడ్లపైకి వదిలి వేస్తున్నారు. ముఖ్యం గా కొత్తబస్టాండ్ పరిసర ప్రాంతాలతో పాటు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, పాఠశాలల ఆవరణలో పందులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. రాష్ట్రంలో సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది అటువంటి కళాశాల ఆవరణలో, ఆ కళాశాలకు దగ్గరలో ఉన్న పోస్ట్ఫాస్ సమీపంలో పందులు విచ్చలవిడిగా సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
కమిషనర్ వివరణ
ఈ విషయంపై నగర పాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డిని వివరణ కోరగా పందులు రోడ్ల మీద కనిపిస్తే కోర్టు తీర్పు ప్రకారం మట్టుపెడతామన్నారు. పందుల యజమానులు ఖచ్చితంగా కోర్టు తీర్పును పాటించి ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు.
తగ్గిన పంట సాగు!
* 4 లక్షల హెక్టార్లలో విత్తు..
కర్నూలు సిటీ:గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా పంటల సాగు బాగా తగ్గింది. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా రైతులు 4 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. గత ఏడాది 4,15,045 హెక్లార్లలో పంటలు సాగు చేయగా ఈ ఏడాది మాత్రం ఆ స్థాయిలో సాగు చేయలేదు. కారణం గత ఏడాది జూన్‌లో సాధారణ వర్షపాతం 77.2మి.మీ కాగా 153.1మి.మీ అంటే దాదాపు 98మి.మీ ఎక్కువగా నమోదైంది. ఈ ఏడాది కూడా జూన్‌లో సాధారణ వర్షపాతం కంటే 42 మి.మీ ఎక్కువగానే నమోదైంది. అయితే గత ఏడాది జూలైలో 117.2మి.మీ నమోదు కాగా 131.8మి.మీ నమోదై సాధారణం కంటే 12మి.మీ ఎక్కువగా నమోదైంది. ఈ ఏడాది మాత్రం జూలైలో సాధారణ వర్షపాతం 117.2 కాగా కేవలం 63.5మి.మీ నమోదై సాధారణం కంటే దాదాపు 46మి.మీ వర్షపాతం తక్కువగా నమోదైంది. ఇక ఆగస్టులో గత ఏడాది 3 వారాల పాటు వర్షం కురవకపోయినా చివరి వారంలో సాధారణం కంటే ఎక్కువగానే కురిసింది. కానీ అప్పటికే పంటలు మొత్తం పూర్తిగా ఎండిపోయాయి. ఈ ఏడాది కూడా ఇప్పటి వరకూ సరైన వర్షాలు కురవలేదు. రోజూ ఆకాశం మేఘామృతం అవుతుందే కానీ చినుకు కురవటం లేదు. అందుకే గత ఏడాది కంటే పంటల సాగు తగ్గిపోయింది.
జిల్లాలో వరి పంట సాధారణ సాగు 7,674 హెక్టార్లు కాగా కేవలం 3,790 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. వాటితో పాటు వేరుశెనగ 1,10,124 హెక్టార్లు కాగా 70వేల హెక్టార్లు, పత్తి 2,28,221 హెర్టార్లు కాగా 1.80లక్షల హెక్టార్లు, కంది 60,835 హెక్టార్లు కాగా 50వేల హెక్టార్లు, కొర్ర 14,192 హెక్టార్లు కాగా 3,500 హెక్టార్లు, ఉల్లి 20,754 హెక్టార్లు కాగా 17,500హెక్టార్లు, ఆముదం 35,731 హెక్టార్లు కాగా 9,500 హెక్టార్లు, ప్రొద్దుతిరుగుడు 4,764 హెక్టార్లు కాగా కేవలం 500 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. అయితే మినుములు సాధారణ సాగు 5,521 హెక్టార్లు కాగా 11వేల హెక్టార్లలో సాగు చేశారు. వీటితో పాటు పెసలు 1811 హెక్టార్లు కాగా 1100 హెక్టార్లలో రైతులు సాగు చేశారు. ఈ విధంగా ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదు కావటంతో రైతులు గత ఏడాది కంటే తక్కువగా పంటలు సాగు చేశారు.