తూర్పుగోదావరి

కమలంలో అసమ్మతి సెగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: జిల్లా కేంద్రం కాకినాడలో బిసి వర్గాలకు చెందిన బిజెపి నేతలు పార్టీ జిల్లా నేతలపై విరుచుకుపడ్డారు. కార్పొరేటర్ సీట్ల కేటాయింపులో బిసిలకు అన్యాయం చేశారని తిరగబడ్డారు. బిజెపికి చెందిన బలహీన వర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు నగరంలోని శాంతినగర్‌లో గల పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం ఆందోళనకు దిగారు. పార్టీ కార్యాలయం వద్ద బ్యానర్లను చింపి మురికికాల్వలోకి విసిరేశారు. ఓ సందర్భంలో పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను వారించారు. టిడిపి-బిజెపికి మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం అనంతరం కేటాయించిన 9 సీట్లలో ఒకటి మినహా మిగిలిన అన్ని సీట్లనూ అగ్రకులాలకు కేటాయించడాన్ని ఎస్సీ బిసి వర్గాలకు చెందిన నేతలు తప్పుపట్టారు. బిజెపి బిసి సెల్ నగర అధ్యక్షుడు కె గంగరాజు మాట్లాడుతూ 9 సీట్లకు గాను ఒక్క సీటు మాత్రమే బిసికి కేటాయించారని, జగన్నాథపురం ప్రాంతంలో బిసిలే అధికంగా ఉన్నప్పటికీ ప్రాధాన్యతనివ్వలేదని వాపోయారు. దీనిపై జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సోమవారం కాకినాడ వచ్చి ఈ సమస్యను పరిష్కరిస్తారన్నారు. అయితే ఆందోళనకారులపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసి, తగిన చర్యకు కోరతామని చెప్పారు. ఇదిలావుంటే బిజెపి నేతలు వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణంగానే ఎన్నికల్లో ఓడిపోయే అభ్యర్ధులకు టిక్కెట్లు ఇస్తున్నారంటూ అసమ్మతివాదులు బాహాటంగా విమర్శించారు.
కాలువలో దూకి భార్యాభర్తలు గల్లంతు
కొత్తపేట: గ్రామానికి చెందిన భార్యాభర్తలు కాలువలో గల్లంతైన ఘటనతో మండల పరిధిలోని కండ్రిగ శివారు గుబ్బలవారిపాలెంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. ఒక వివాహానికి హాజరై తిరిగి వస్తూ వారు కాలువలోకి దూకడంతో గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని బిళ్లకుర్రు శివారు డేగలవారిపాలెం వంతెన పైనుంచి ఆదివారం రాత్రి గుబ్బలవారిఫాలెంకు చెందిన కముజు శ్రీనివాస్ (30) అలియాస్ వాసుతో పాటు అతని భార్య కముజు భవాని(25)లు కాలువలో దూకడంతో వారు గల్లంతయ్యారు. అయిదేళ్ల చిన్నారిని వారు వచ్చిన మోటారు సైకిల్‌పైనే వదిలి ఈ అఘాయిత్యాయానికి పాల్పడ్డారు. శ్రీనివాస్ వృత్తిరీత్యా రావులపాలెంకు చెందిన ఒక ప్రైవేటు పాఠశాలలో పిఇటిగా పనిచేస్తున్నారు. అయినవిల్లి మండలం వీరవల్లిపాలెంకు చెందిన గొర్రే భవానిని శ్రీనివాస్ సుమారు ఆరేళ్ల క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. భవాని కొత్తపేటలోనే చదువుకొని స్థానిక ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేశారు. అయితే వీరికి అయిదేళ్ల చిన్నారి ఉండగా పుట్టుకతోనే ఆమెకు అనారోగ్య కారణంగా చాలా ఆసుపత్రులకు తిప్పి వైద్యం చేయించారని స్థానికులు చెబుతున్నారు. అయితే వీరి దాంపత్య జీవితంలో ఎటువంటి వివాదాలు లేకుండా ఉంటున్నారని, ఆదివారం కూడా గ్రామంలో జరిగిన ఒక వివాహానికి హాజరై అందరితో ఆప్యాయంగా ఉండి చక్కపెట్టారని గ్రామస్థులు చెపుతున్నారు. తమ ఎదుటే భార్యాభర్తలు కుమార్తెతో కలిసి పెళ్లికని బయలుదేరినట్టు, ఇంతలోనే ఏమైందో తెలియటం లేదని గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎస్సై డి విజయ్‌కుమార్ ఘటనా ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులా... ఆరోగ్య సమస్యా
మండల పరిధిలోని కండ్రిగ శివారు గుబ్బలవారిపాలెంకు చెందిన కముజు శ్రీనివాస్, భవానీల ఆత్మహత్యాయత్నానికి కారణం ఆర్థిక ఇబ్బందులా లేక కుమార్తె అనారోగ్య సమస్యా అన్నది తెలియాల్సి ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరి వివాహ బంధం సజావుగానే సాగుతున్నట్టు స్థానికుల కథనం. కుమార్తె అనారోగ్యం కారణంగా లక్షల మేర ఖర్చు చేసినట్లు అయినా ఆమె అనారోగ్యం కుదుటపడనట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే వారు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని స్థానికులు చెపుతున్నారు. ఇంటి వద్ద జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని వారి మోటారు సైకిల్‌పై సాయంత్రం బయటకు వెళ్లి వీరి ఊరికి సమీపంలోని డేగలవారిపాలెం వంతెన వద్ద అమలాపురం ప్రధాన పంటకాల్వలోకి దూకారు. దీనికి ముందు భార్యాభర్తలు స్వల్ప వాగ్వివాదం చేసుకున్నట్లు స్థానికులు చెపుతున్నారు. అదే సమయంలో భార్య ముందు కాల్వలోకి దూకినట్టు, వెంటనే భర్తకూడా కాల్వలోకి దూకినట్లు తెలిపారు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే కాలువ వద్దకు చేరుకొని చూసే సరికి వారు కనిపించలేదని చిన్నారి మాత్రం మోటారు సైకిల్‌పై ఉన్నట్లు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు.
పురుషోత్తపట్నంలో భారీ వర్షం
యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి..!!
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం: వర్షం లేకపోతే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం అంతా సిద్ధమే.. కానీ ప్రస్తుతం భారీ వర్షాలు అధికార యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మూడు చోట్ల క్రాసింగ్‌లు, పైపులైన్ పనులు సకాలంలో పూర్తయినప్పటికీ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి ముఖ్యమంత్రి పర్యటనకు భారీ వర్షాల వల్ల అవాంతరం ఎదురవుతుందేమోనని అధికారులు హైరానా పడుతున్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో రెండు పంపుల ద్వారా ఒక ప్రెజర్ మెయిన్‌తో నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో 150 మీటర్ల మేర రామచంద్రపురం వద్ద పైపులైన్ నిర్మాణంలో బురద మట్టి వల్ల ఇబ్బందిని సైతం మెగా సంస్థ అధిగమించి పైపులైన్‌కు ఇంజనీరింగ్ అధికారుల సూచన మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆదివారం ఒక పంపును నిర్మించారు. మరో పంపు పనులు రాత్రికి మొదలుపెట్టి సోమవారం ఉదయానికి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. సోమవారం సాయంత్రం పంపుల ట్రయల్ రన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పనుల పురోగతిని, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఆదివారం జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయరామరాజు, ఎస్‌ఇ సుగుణాకరరావు తదితరులు పరిశీలించారు.
నిశ్శబ్దం భయంకరమైన వెపన్
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె విశ్వనాథ్
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం: నిశ్శబ్దాన్ని ఇష్టపడతాను..అందుకే నా చిత్రాలు నిశ్శబ్దంగా ఉంటాయి.. నిశ్శబ్దం భయంకరమైన వెపన్ అని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, కళా తపస్వి డాక్టర్ కె విశ్వనాథ్ అన్నారు. రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలో ఆదివారం డాక్టర్ కె విశ్వనాథ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సందర్భంగా, విశ్వనాధ్ చిత్రీకరించిన చిత్రాల్లో అత్యధికంగా గోదావరి తీరంతో ముడిపడిన బంధం నేపధ్యంలో ఆయనకు నవరస నట సమాఖ్య సినీ నటుడు, గాయకుడు శ్రీపాద జిత్‌మోహన మిత్ర ఆధ్వర్యంలో ఘన సత్కారం జరిగింది. ఈ సత్కార సభకు అతిథిగా రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళీమోహన్ హాజరయ్యారు. మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మాజీ ఎంపి జివి హర్షకుమార్, మేయర్ పంతం రజనీ శేషసాయి, పట్టపగలు వెంకటరావు, డివిబి రాజు తదితరులు విశ్వనాథ్‌కు స్వర్ణ కంకణ ధారణ చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ విశ్వనాథ్ మాట్లాడుతూ సినిమా తీయడమే తనకు తెలుసని, సిద్ధాంతపరంగా మాట్లాడటం తెలియని తనను ఫాల్కే అవార్డు వచ్చినందుకు దూరంగా పెట్టొద్దని చమత్కరించారు. తాను ఎప్పుడూ ఖాకీడ్రెస్ వేసుకుని దర్శకత్వం వహించే పాత మనిషినేనన్నారు. శంకరాభరణం గురించి ఇటీవల తారసపడిన ఇద్దరి వ్యక్తులు చెప్పిన మాటలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నానన్నారు. ఒకరు 106 సార్లు శంకరాభరణాన్ని చూసినట్టు చెప్పారని, మరొకరు సినిమా చూసినపుడల్లా థియేటర్‌లోకి పాదరక్షలు విడిచిపెట్టి వెళ్లి చూశానని చెప్పారని విశ్వనాథ్ ముచ్చటించారు. గంగిరెడ్లు, బుర్రకథ, హరికథ వంటి కళాకారులు బాగా వెనుకబడి వుంటారని, అటువంటి వారి గురించి సినిమాలు తీసినప్పుడు మరో ఆలోచన ఉండదన్నారు. గంగిరెడ్లు, బుర్రకథ, హరికధ వంటి పేద కళాకారుల కోసం సినిమాలు తీయాలనేదే తన దుగ్ధ అని, అటువంటి ఆసక్తికి సహకరించిన నిర్మాతలు, సాంకేతిక నిపుణులు సర్వదా అభినందనీయులన్నారు. రాజమహేంద్రవరమంటే తనకు విపరీతమైన ప్రేమ అని, తాను మెంటల్‌గా యంగ్ అని, అందరి ఆశీస్సులతో నా ఆయుష్షు పెరుగుతుందన్నారు. లలిత కళలను కాపాడుతోన్న ప్రతి ఒక్కరికీ పాదాభివందనం అన్నారు.
34 మంది టిడిపి కార్పొరేటర్ అభ్యర్థుల జాబితా విడుదల
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ: కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో పోటీచేసే తమ పార్టీ కార్పొరేటర్ అభ్యర్ధుల జాబితాను తెలుగుదేశం పార్టీ ఆదివారం ప్రకటించింది. 34 మంది అభ్యర్ధులను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు ప్రకటించారు. మరో ఐదుగురు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కార్పొరేషన్‌లో 50 డివిజన్లుండగా కోర్టు వివాదాల కారణంగా 42, 48 డివిజన్లను ఎన్నికల నుండి మినహాయించగా మొత్తం 48డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 39 స్థానాల్లో టిడిపి, 9 స్థానాల్లో బిజెపి మిత్రపక్షాలుగా పోటీ చేస్తున్నాయి. బిజెపిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం వివాదాస్పదం అయింది. అయితే 9 మంది అభ్యర్ధుల ఎంపిక సోమవారానికి కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. టిడిపికి సంబంధించి మరో ఐదుగురి పేర్లు ప్రకటించాల్సి ఉంది. ఆదివారం ప్రకటించిన అభ్యర్ధుల వివరాలిలా ఉన్నాయి. 1వ డివిజన్‌కు పేరాబత్తుల లోవరాజ, 2వ డివిజన్‌కు కెబిఎస్‌ఎస్ సత్తిబాబు, 3వ డివిజన్‌కు గుత్తుల అచ్చయ్యమ్మ, 6వ డివిజన్‌కు బి సత్యనారాయణ, 7కు అంబటి క్రాంతి, 8కి అడ్డూరి వరలక్ష్మి, 10కి మోసా దానమ్మ, 11వ డివిజన్‌కు గద్దేపల్లి దానమ్మ, 12కు తుమ్మల సునీత, 14వ డివిజన్‌కు వనమాడి ఉమాశంకర్, 15కు అరదాడి శివ, 16కు మల్లాడి గంగాధర్, 17కు చోడిపల్లి ప్రసాద్, 18కి చవ్వాకుల రాంబాబు, 19వ డివిజన్‌కు పలివెల రవి, 20కి కె నాగసత్యనారాయణ, 22కు వనమాడి శివప్రసాద్, 23వ డివిజన్‌కు గుత్తుల జగదాంబ, 24కు డి భద్రం, 25కు కె సీత, 26కు ఎస్ నందం, 27వ డివిజన్‌కు రాజాన మంగారత్నం, 28కి సుంకర పావని, 30వ డివిజన్‌కు బాదం బాలకృష్ణ, 31కి బంగారు సూర్యావతి, 32కు రిక్కా లక్ష్మి, 33కు గుజ్జు దుర్గ, 34కు పహేరా ఖాతూస్, 37కు హేమలత, 38కి మాకినీడి శేషుకుమారి, 43వ డివిజన్‌కు దినేష్‌పవన్‌కుమార్, 44కు వెంకటరమణమ్మ, 45కు కర్రి శైలజ, 46వ డివిజన్‌కు కోరుమల్లి బాలప్రసాద్‌లను కార్పొరేటర్ అభ్యర్ధులుగా ప్రకటించారు. కాగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది.
ఆంక్షలు తొలగిస్తే కాపుల సత్తా చూపుతాం
కాపు రిజర్వేషన్ పోరాట సమితి
వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం: కాపు రిజర్వేషన్ కోసం కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రను పురస్కరించుకుని ప్రభుత్వం విధించిన ఆంక్షలు తొలగిస్తే రాష్ట్రంలో ఉన్న కాపుల సత్తా ఏమిటో చూపుతారని కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఆదివారం నల్లా విష్ణు స్వగృహం ఎదుట రహదారికి అడ్డంగా పడుకుని వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. ఈసందర్భంగా నల్లా విష్ణు మాట్లాడుతూ కొంతమంది కాపు ప్రజాప్రతినిధులు ముద్రగడ నడవలేక గేటువరకూ వచ్చి వెనక్కి వెళ్లిపోతున్నారని చేస్తున్న విమర్శలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాపుల శక్తిని ఎదుర్కోలేకే సెక్షన్ 30, 144లు అమలు చేస్తున్నారని, దమ్ముంటే ముద్రగడపై విధించిన ఆంక్షలు సడలిస్తే కాపుల సత్తా ఏమిటో చూపుతామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాపుల బతుకులను నడిరోడ్డుపై పడవేసి చంద్రబాబు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో నల్లా పవన్‌కుమార్, సూదా గణపతి, బండారు రామ్మోహన్‌రావు, సలాది నాగేశ్వరరావు, కరాటం ప్రవీణ్, గుర్రాల చందు, నల్లా నాయుడు, గనిశెట్టి అరవింద్, తూము నాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే కోనసీమ జెఎసి కన్వీనర్ కల్వకొలను తాతాజీ ఆధ్వర్యంలో ఆయన స్వగృహం వద్ద కాపు యువత ముద్రగడపై విధించిన ఆంక్షలు తక్షణమే ఎత్తివేసి పాదయాత్రకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తాపీ పనివారితో కలిసి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, కాపు మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో యేడిద శ్రీను, పినిశెట్టి భాను, ముద్రగడ దొరబాబు, సాధనాల అప్పారావు, నల్లా త్రిమూర్తులు, అర్లపల్లి ముత్యం, వీరంశెట్టి సతీష్, సలాది చక్రి, మెండా రవి, బండారు వీరన్న, పొమ్మూరి త్రిమూర్తులు, వర్రే సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
ముమ్మిడివరం నియోజకవర్గ వైసిపిలో ముసలం
- సాయికి మద్దతుగా పలువురు రాజీనామాలు
ముమ్మిడివరం: వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తుల సాయి రాజీనామాతో ముమ్మిడివరం వైసిపిలో ముసలం మొదలైంది. ఆదివారం ముమ్మిడివరం మండలానికి పలువురు వైసిపి నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. గుత్తుల సాయి శనివారం ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి విదితమే. సాయికి మద్దతుగా మండలానికి చెందిన పలువురు సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు శనివారం రాజీనామా చేశారు. అనాతవరానికి చెందిన గ్రామ గౌరవాధ్యక్షుడు దంగేటి పండుతోపాటు వైసిపికి చెందిన ఇళ్ల శ్రీనివాసరావు, దంగేటి దత్తు, దంగేటి అన్నవరం, వనచర్ల ప్రసాద్, మట్టపర్తి సత్యనారాయణ, వనచర్ల అర్జున్, వనచర్ల పండు, పెయ్యిల రమణ, ఇళ్ల శ్రీనివాసరావు వైసిపికి రాజీనామా చేసి గుత్తుల సాయి నాయకత్వంలో టిడిపిలో చేరేందుకు సోమవారం అమరావతి వెళుతున్నట్లు వారు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ముమ్మిడివరం నగర పంచాయతీకి చెందిన ఇద్దరు వైసిపి కౌన్సిలర్లు, ముమ్మిడివరం మండలానికి చెందిన నలుగురు వైసిసి సర్పంచ్‌లు సాయి నాయకత్వంలో వైసిపిలో చేరుతున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా పలువురు మాజీ సర్పంచ్‌లు, ఎంపిటిసిలు కూడా వైసిపికి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. దీంతో వారిని బుజ్జగించేందుకు వైసిపి నాయకులు కృషి చేస్తున్నారు.
ఎన్నాళ్లీ గృహ నిర్బంధం
పోలీసులను ప్రశ్నించిన కాపు ఉద్యమ నేత ముద్రగడ
ప్రత్తిపాడు: రాష్ట్రంలో ఎవరికీ లేని నిబంధనలు కాపులకేననా అని, గృహ నిర్బంధం ఎన్నాళ్లని పోలీసులను మాజీమంత్రి ముద్రగడ ప్రశ్నించారు. కాపులను బిసిల్లో చేర్చాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి నుండి అమరావతి వరకు నిరవధిక పాదయాత్ర తలపెట్టిన 19వ రోజు ఆదివారం కూడా ఆయన నివాసం వద్ద గేటు వద్దే అడ్డుకున్నారు. అనంతరం జిల్లా నలుమూలల నుండి ముద్రగడను భారీ సంఖ్యలో మహిళలు, కాపు యువత ఆయన నివాసంలో కలుసుకుని పాదయాత్రకు మద్దతు తెలిపారు. వారందరి సమక్షంలో కాపు జెఎసి నాయకులు, ముద్రగడ కంచాలను మోగించి కాపుల ఆకలి కేకలను తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గం దుర్గాడ, కొండెవరం, ప్రత్తిపాడు నియోజకవర్గం పెద్దనాపల్లి, ఏలూరు, గ్రామాలకు చెందిన కాపు యువత తమ తమ గ్రామాల నుండి పాదయాత్రగా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి చేరుకుని మద్దతు తెలిపారు. కిర్లంపూడి, జగపతినగరం, చిల్లంగి గ్రామాల ప్రజలు ఆదివారం బంద్ పాటించి కిర్లంపూడి మెయిన్ రోడ్డులో వంట - వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. వారంతా ప్రత్తిపాడు - కిర్లంపూడి రోడ్డుపై బైఠాయించి ముద్రగడ పాదయాత్రకు వెంటనే అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు బైఠాయించిన ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారంతా సుమారు 3 గంటలపాటు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. ఇలావుండగా కాపు జెఎసి నాయకులు ముద్రగడ నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ కాపు మంత్రులు కాపు జాతిని చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెట్టవద్దని, ఎన్నికల్లో చంద్రబాబు జాతికి ఇచ్చిన హామీనే అమలుచేయాలని గత రెండు సంవత్సరాలుగా ముద్రగడ ఉద్యమిస్తున్నారన్నారు. ముద్రగడ ఉద్యమ ఫలితంగానే కాపు కార్పొరేషన్, మంజునాథ కమిషన్ ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. కాపు మంత్రులు తమ పదవులు కాపాడుకోవడం కోసం కాపు యువత భవిష్యత్తును పణంగా పెట్టి, వారి జీవితాలు పాడు చేయవద్దని కాపు జెఎసి నాయకులు ఆకుల రామకృష్ణ, ఆరేటి ప్రకాష్, వైవి దాసు, గౌతు స్వామి అన్నారు. 1994లో ముద్రగడ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కాపులను బిసిల్లో చేర్చాలని చేసిన ఉద్యమ ఫలితంగానే అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కరరెడ్డి 30 నంబరు జిఒ ఇచ్చారన్నారు. ఆ జిఒ నేటికీ అమల్లోనే ఉందని చెప్పారు. జిఒ ఫలితాన్ని ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీరుగార్చారని విమర్శించారు. అప్పటి జిఒలో ఉన్న అంశాలనే ఇటీవల బిసి ప్రిన్సిపల్ సెక్రటరీ మంజునాథ కమిషన్‌కి రాసిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 30 నంబరు జిఒ ఇచ్చి, ముత్తుస్వామి కమిషన్‌ను నియమించిందన్నారు. ఈ వాస్తవాలను ముఖ్యమంత్రి, మంత్రులు అవగాహన లేకుండా పక్కన పెట్టడం సరికాదన్నారు. రిజర్వేషన్ పొందే హక్కు కాపు జాతికి ఉందని, మిడిమిడి జ్ఞానంతో మంత్రులు ప్రవర్తించవద్దని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు దాటినా ఇప్పటివరకు రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభించలేదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొని కాపులను బిసిల్లో చేర్చే భవిష్యత్ కార్యాచరణ ప్రారంభించాలని కాపు జెఎసి నాయకులు కోరారు.

స్మార్ట్ ఫోను పేలి యువకుడికి గాయాలు
రావులపాలెం: స్మార్ట్ ఫోన్ జేబులోనే పేలడంతో ఒక యువకుడు గాయాలపాలైన ఘటన రావులపాలెం ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలావున్నాయి. గ్రామంలోని శివాలయం సమీపంలో నివాసం ఉంటున్న బావన సూర్యకిరణ్ ఉదయం తన స్మార్ట్ఫోన్‌ను ప్యాంట్ జేబులో పెట్టుకుని మోటారు సైకిల్‌పై ఇంటి నుండి బయలుదేరాడు. శివాలయం ఎదురుగా వచ్చేసరికి జేబులో ఉన్న ఫోన్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అవాక్కయిన సూర్యకిరణ్ మోటారు సైకిల్‌ను కింద పడేసి జేబులో నుండి ఫోన్ తీసేందుకు ప్రయత్నించాడు. అయితే వీలు కాకపోవడంతో అక్కడే ఉన్న స్థానికులు సూర్యకిరణ్ ప్యాంట్‌ను కిందకు లాగి ఫోన్ బయటకు పడవేసి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో సూర్యకిరణ్ ఎడమ తొడకు గాయాలయ్యాయి. ఈ సందర్భంగా సూర్యకిరణ్ మాట్లాడుతూ గత నెల 19న ఆన్‌లైన్‌లో రెడ్మీ నోట్ 4 మోడల్ ఫోన్‌ను రూ.12,999కు కొనుగోలు చేసినట్టు తెలిపాడు. ప్లిప్‌కార్ట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ ఫోన్‌ను బుక్‌చేయగా పోస్టులో తనకు అందిందన్నాడు. కొని ఇంకా నెల కూడా కాలేదని, అయితే ఇలా ఫోన్ పేలడం ఏమిటో అర్థంకావడం లేదని అయోమయం వ్యక్తం చేశాడు. ఈ ఫోన్ పేలడం వల్ల ఆర్థిక నష్టంతోబాటు తనకు గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు. అదృష్టవశాత్తూ ఎలాంటి ముప్పు వాటిల్లలేదని స్థానికులు అంటున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న ఎస్‌ఐ సిహెచ్ విద్యాసాగర్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుని నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే దీనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు. తనకు జరిగిన నష్టంపై కంపెనీకి చెందిన కాల్ సెంటర్‌ను సంప్రదించగా మెయిల్ ద్వారా వివరాలు పంపాలని సూచించినట్టు బాధితుడు సూర్యకిరణ్ తెలిపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. యువతలో స్మార్ట్ ఫోన్లంటే విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం పేలిన ఫోన్ కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా విక్రయాలు జరుగుతున్న నేపధ్యంలో ఫోన్ కొనుగోలు చేసిన అందరిలో ఆందోళన వ్యక్తమవుతోంది.