వరంగల్

ముగ్గురు కలెక్టర్లకు ఎక్సలెన్స్ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని మూడు జిల్లాల కలెక్టర్లకు రాష్ట్రప్రభుత్వ ఎక్సలెన్సీ అవార్డులు లభించాయి. వివిధ రంగాలలో వారు చేసిన ఉత్తమ సేవలకుగాను ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని వరంగల్ రూరల్ జిల్లాలో ముమ్మరంగా అమలు చేస్తున్న కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు ఎక్సలెన్సీ అవార్డు ప్రకటించింది.
ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యసదుపాయలు అందుబాటులో ఉంచటం ద్వారా పేదలు ప్రభుత్వ ఆసుపత్రులకు చేరువ అయ్యేందుకు అవకాశం కల్పించిన భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళికి ప్రభుత్వం ఎక్సలెన్సీ అవార్డు ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రసవాల కోసం పట్టణాల్లోని ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చి డబ్బు, సమయం వృధా చేసుకోవద్దని విస్తృత ప్రచారం జరిపించారు.
కేవలం ప్రచారానికే పరిమితం అవకుండా ప్రసవం కోసం వచ్చిన తన కూతురుని ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి డెలివరీ చేయించి అందరి ప్రశంసలు అందుకున్నారు. కలెక్టర్ మురళితోపాటు ఆ జిల్లాకు చెందిన్న వైద్య,ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్యకు కూడా ఎక్సలెన్సీ అవార్డు లభించింది. ఇక మహిళలు, విద్యార్థినులు స్వయం రక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇప్పించటంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రదర్శనలు ఇప్పించిన జనగామ కలెక్టర్ దేవసేన ప్రభుత్వం ప్రకటించే ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపికయింది.
ఉమ్మడి జిల్లాల్లో జెండా ఎగిరేసేది వీరే...
* ఓరుగల్లులో కడియం శ్రీహరి
* మానుకోటలో సీనియర్ ఐఎఎస్ ఆచార్యకు చాయిస్
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఐదు జిల్లాల్లో స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎవరు జెండా ఎగురవేయాలనేది ప్రభుత్వం తేల్చేసింది. జిల్లాల వారీగా జెండా ఎగురవేసే మంత్రులు, ఉన్నతాధికారుల పేర్లను ప్రభుత్వం విడుదల చేసింది. వరంగల్ నగరంలోని పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే అర్బన్ జిల్లా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎగురవేస్తారు. నగరంలోని జవహర్‌లాల్ నెహ్రు స్టేడియంలో జరిగే రూరల్ జిల్లా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎమ్మెల్సీ పల్లె రాజేశ్వర్‌రెడ్డి జెండా ఎగురవేస్తారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో స్పీకర్ మధుసూదనాచారి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. జనగామ జిల్లా కేంద్రంలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఇక మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసే అవకాశం సీనియర్ ఐఎఎస్ అధికారి, రాష్ట్ర ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బిపి ఆచార్యకు లభించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు కలెక్టర్‌గా పనిచేసిన బిపి ఆచార్య కలెక్టర్‌గా గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా వరంగల్ నగరంలో జరిగిన వేడుకల్లో జాతీయ జెండా ఎగురవేయగా, ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నారు.

ఖాళీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎక్కడ..
* నిరుద్యోగులను మోసం చేస్తున్న కెసిఆర్ సర్కారు * బిజెపి అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన ఉద్యోగాలు మనకే అంటూ ఉద్యమ సమయంలో.. ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్‌రావు గత మూడేళ్లలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసారి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీ ప్రకటనల పేరిట నిరుద్యోయ యువతను కెసిఆర్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. ఉద్యోగాల నియామకంలో నిర్లక్ష్యం, అవినీతికి నిలయంగా మారిన కారణంగా టిఎస్‌పిఎస్‌సి చైర్మన్‌ను, సభ్యులు పదవుల నుంచి తొలగించవలసిన ప్రభుత్వం వారికి వత్తాసు పలుకుతు జీతాలు, భత్యాలు, ఇతర సౌకర్యాలను మూడింతలు పెంచటం సిగ్గుచేటని, అవినీతికి మద్దతుగా నిలిచిందనటానికి సాక్ష్యమని ఆయన అన్నారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో రాకేష్‌రెడ్డి మాట్లాడుతు నిధులు, నీళ్లు, ఉద్యోగాల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు న్యాయం జరగటం లేదని, ప్రభుత్వాలు పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపణలు చేసిన కెసిఆర్ అధికారంలో వచ్చిన ఈ మూడేళ్లలో నిరుద్యోగుల విషయంలో చేసిన మేలు ఏమిటని అన్నారు. అధికారంలోకి రాగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌ను ఏర్పాటుచేసిన సందర్భంలో ఖాళీగా ఉన్న 1.20లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన సిఎం ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీచేసారని ప్రశ్నించారు. తొమ్మిది వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు, మరో ఆరువేల ఇతర శాఖల ఉద్యోగాల భర్తీ తప్ప ఏ శాఖ కార్యాలయానికి వెళ్లిన ఖాళీలు బోలెడు కనిపిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పోస్టులు ఖాళీగా ఉన్న కారణంగా ప్రజలకు సరైన సేవలు అందటం లేదని, సమస్యలు పరిష్కారం జరగటం లేదని చెప్పారు. వరంగల్ నగరపాలక సంస్థ, కుడా కార్యాలయాల్లో ఎల్‌ఆర్‌ఎస్ కింద వచ్చిన వేల దరఖాస్తులు నెలల తరబడిగా పెండింగులో ఉన్నాయని, దీనికి సిబ్బంది కొరత ప్రధాన కారణమని కార్యాలయ ఉన్నతాధికారులు చెబుతున్నారని తెలిపారు. ఇదే పరిస్థితి అన్ని శాఖల్లో నెలకొని ఉందని అన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన నాటికి 1.20లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉండగా, గడచిన మూడేళ్లలో వేల సంఖ్యలో ఉద్యోగులు పదవీ విరమణ పొందారని, ఈ పోస్టులు భర్తీ చేసేది ఎన్నడని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో భర్తీ చేసే ఉద్యోగాల భర్తీకి సంబంధించి యుపిపిఎస్‌సి ప్రతియేటా క్యాలెండర్ విడుదల చేస్తుందని, అదే తరహాలో టిఎస్‌పిఎస్‌సి క్యాలెండర్ విడుదల చేస్తుందని చైర్మన్ ఘంటా చక్రపాణి ఘనంగా ప్రకటించినా అమలు జరగటం లేదని తెలిపారు. గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నారని, ఖాళీగా ఉన్న 1032పోస్టుల భర్తీకి గత ఏడాది నోటిఫికేషన్ ఇవ్వగా 7.89లక్షల మంది దరఖాస్తులు చేసుకుని పరీక్ష రాసారని, ప్రభుత్వ సిబ్బంది నిర్లక్ష్యంతో 50వేలమంది నిరుద్యోగుల ప్రశ్నాపత్రాలు తారుమారు కావటం, ప్రభుత్వం చూపిన కారణాల కారణంగా కేసు కోర్టులో ఉండటంతో భర్తీ ప్రక్రియ ఆగిపోయిందని అన్నారు. గురుకుల విద్యాలయాల పోస్టుల భర్తీ కూడా గందరగోళంగా మారిందని చెప్పారు. టెట్ విషయంలో కూడా ప్రభుత్వ విధించిన నిబంధనలు గందరగోళానికి దారితీసిందని అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ అధికారం లోకి వచ్చాక ఇప్పటి వరకు డిఎస్సీ జరగలేదని, ప్రభుత్వ పాఠశాలల్లో టీచరు పోస్టులు ఏళ్లతరబడి ఖాళీగా ఉండటంతో విద్యాబోధన సక్రమంగా జరగటం లేదని తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియక నిరుద్యోగ యువత ఆందోళన చెందుతోందని అన్నారు. ఉద్యోగ నియామకాల విషయంలో నిర్లక్ష్యం, నిర్వహణ లోపం, అవినీతి విచ్చలవిడిగా కొనసాగుతోందని, టిఎస్‌పిఎస్‌సి అవినీతికి నిలయంగా మారిందని ఆరోపించారు.

సలీమా ‘సంకల్పం’ ముందు వాన ఓడింది...
* జోరువానలో 23 గ్రామాలు పర్యటించిన నేనుసైతం * కరపత్రాలను పంచుతూ మొక్కలను ఇస్తూ ముందుకు

కురవి: నీతులు చెప్పడం సులభం ఆచరించడం కష్టం...లక్ష్యం నిర్ధేశించుకుని సంకల్పిస్తే ఎంతటి అడ్డంకైన ఎదుర్కోవచ్చని నేను సైతం ప్రధాన కార్యదర్శి సలీమా నిరూపించింది.
వన ప్రేమికులుగా మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన నేను సైతం స్వచ్ఛంద సేవా సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని ఒక్క క్షణమైన ఆలోచింపచేస్తున్నాయి. హరితహారం కార్యక్రమానికి ముందుగానే వృక్ష రక్షకులుగా నేను సైతం అనేక కార్యక్రమాలను చేపట్టింది. వీరి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం తోడు అయ్యింది. మొక్కలను నాటండి...పెంచండి అనే నినాధంతో నేను సైతం వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి మహ్మాద్ సలీమా చేపట్టిన హరిత సైకిల్ యాత్ర ఆదివారం కురవి మండల కేంద్రానికి చేరింది. అప్పుడే జడివాన మొదలైంది. కాని సలీమా సంకల్పం ముందు జోరువాన వోడింది. వానకు వెనుకడుగు వేయకుండా మహిళలకు స్పూర్థిగా సలీమా సైకిల్‌యాత్ర మండంలోని 23 గ్రామాలలో పర్యటించింది. ఈ సందర్భంగా సలీమా మాట్లాడుతూ...పర్యావరణం ఎవరికోసం కాదని..మన కోసమేనని అందరు గమనించాలని కోరింది. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వాటిని ప్రాణుల వలే చూడాలని ప్రజలకు వివరించింది. వెంట తెచ్చిన పండ్ల, నీడ మొక్కలను అడిగిన వారికి లేదనకుండా ఇచ్చింది. ప్రతి ఒక్కరు శుభకార్యాలకు, పుట్టిన రోజులకు మిత్రులకు, కుటుంబీకులకు మొక్కలను ఇవ్వాలని కోరింది. చిన్నారులు మొక్కలను దత్తత తీసుకుని ముందు తరం వారికి స్పూర్థిగా నిలవాలని సలీమా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మహ్మద్ సుభాని, ఆరిపాక రాజేష్, లక్ష్మన్, సమీర్, సుమలు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ నగర్‌లో డ్రైనేజీ కాల్వ శుభ్రం
నర్సంపేట: నర్సంపేట నగర పంచాయతీ పరిధిలోని 19వ వార్డు ఎన్టీఆర్ నగర్‌లో ప్రొక్లైయినర్ సహాయంతో సైడ్ డ్రైనేజీ కాల్వను ఆదివారం శుభ్రం చేశారు. ఎన్టీనగర్ కాలనీ నుండి వచ్చే మురికి నీరంతా కాల్వలో పేరుకపోవడంతో కాలనీకి వెళ్లేందుకు కాలనీ వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. కాల్వలో భారీగా గుర్రపు డెక్కతో పాటు పిచ్చిమొక్కలు, చెత్త చెదారం ఉండడంతో కౌన్సిలర్ మండల శ్రీనివాస్ క్రేన్ తెప్పించి శుభ్రం చేయించారు.
వాటర్ ప్లాంట్ ప్రారంభం
గూడూరు: గూడూరు మండలంలోని కొల్లాపురం రూ. 2.80లక్షలతో నూతనంగా నెలకొల్పిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఆదివారం గ్రామ సర్పంచ్ జిల్ల యాకయ్య ప్రారంభించారు. ఈసందర్భంగా సర్పంచ్ యాకయ్య మాట్లాడుతూ రక్షిత మంచినీటి కోసం గ్రామస్థులు నానా ఇబ్బందులు పడుతున్న క్రమంలో గ్రామ పంచాయతీ నిధులను వెచ్చించి నూతనంగా వాటర్ ప్లాంట్‌ను నెలకొల్పడం జరిగిందని చెప్పారు. వాటర్ ప్లాంట్ ద్వారా మంచినీటిని గ్రామస్థులంతా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ పిన్నింటి రజిత, ఎంపిటిసి నునావత్ అనిత, వార్డు సభ్యులు రాంనర్సయ్య, వసంత, లక్ష్మయ్య, జ్యోతి, శ్రీనివాస్, అన్వర్, బావుసింగ్, గ్రామ పెద్దలు రామారావు, వెంకన్న, లక్ష్మయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.
వర్షంతో పత్తి, మొక్కజొన్న రైతుల ఆనందోత్సవం
సంగెం: వరుణదేవుడి కోసం ఎదురు చూస్తున్న పత్తి, మొక్కజొన్న రైతులకు ఆదివారం కురిసిన వర్షంతో రైతుల్లో ఆనందోత్సవం నెలకొంది. మండలంలో పత్తి, మొక్కజొన్న విత్తనాలను విత్తిన రైతుల పంటలు మంచిగా మొలకెత్తాయని ఉత్సాహంగా పంటలను సాగు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వర్షాలు పడకపోవడం మొలకెత్తిన మొక్కజొన్న పత్తి పంటలు అక్కడక్కడ వాడిపోవడాన్ని చూసి వరుణదేవుని కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. బావులు, బోర్లు ఉన్న రైతులు పంటలకు నీళ్లు పడదామంటే బావులలో జలపాతం పెరగక పోవడం వల్ల వేసిన పంటలకు పూర్తిస్థాయిలో నీళ్లు పట్టలేక పంటలు ఎండిపోతాయని రైతులు బయాందోలను చెందుతున్నారు. ఆదివారం మండలంలో కురిసిన బారీగా వర్షం పడటంతో రైతులు ఆనందోత్సవం వ్యక్తం చేస్తు ఎరువులు వేయటానికి రైతులు ఫటిలైజర్ షాపుల వద్దకు పరిగెడుతున్నారు.
మృతుల కుటుంబాలను పరామర్శించిన పెద్ది
నల్లబెల్లి: ఇటీవల హైదరాబాద్‌లో అనుమానస్పద స్థితిలో మృతి చెందిన నల్లబెల్లి వాసీ కుటుంబాన్ని రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, టిడిపి జాతీయ కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డిలు పరామర్శించారు. నల్లబెల్లి మండలంలోని రాంపూర్‌కు చెందిన అంబటి పద్మనాగిరెడ్డిల కూతురు ఝాన్సీరాణిని గీసుగొండ మండలం గంగదేవిపల్లి గ్రామానికి చెందిన వనజ, మల్లరెడ్డిల కుమారుడు ప్రవీన్‌కుమార్‌రెడ్డికి ఐదు లక్షల నగదు ఇచ్చి వివాహం జరిపించారు. అదనం కట్నంకోసం ప్రవీన్‌కుమార్ బార్య ఝూన్సీరాణిని వేదింపులకు గురి చేసీ హత్య చేశారని పిర్యాదు చేసిన విషయం తెల్సిందే. మృతుల కుటుంబాన్ని పెద్దిసుదర్శన్‌రెడ్డి, టిడిపి జాతీయ కార్యధర్శి ప్రకాశ్‌రెడ్డిలు పరామర్శించారు. జాన్సీరాణి మృతికి కారకులైన వారిని కటినంగా శింక్షీంస్తూ ఇంలాంటి సంఘటనలు పునరావృతం కాకుండ చూడలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో రాంపూర్ సర్పంచ్ రేవతి ప్రభకర్‌రావు, మోహన్‌రావు, మోహన్‌రెడ్డి, ప్రవీన్ టిడిపి మండల అద్యక్షుడు మోహన్‌రెడ్డి, ప్రతాప్‌సింగ్, పాల్గొన్నారు.

పంచాయతీ భవనం లేని రంగాపురం
*పాతది ఎప్పుడు పడిపోతుందో..! * కొత్తది ఎప్పుడు పూర్తవుతుందో..?
కేసముద్రం: కేసముద్రం మండలం రంగాపురం గ్రామ పంచాయతీ భవనం శిధిలంగా మారడంతో గత ఏడాది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కొత్త భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
అయితే రెండేళ్లవుతున్నా భవనాన్ని పూర్తి చేయకుండా వదిలేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పలితంగా పాత భవనం ఎప్పుడు పడిపోతుందో తెలియక.. అందులో పంచాయతీ కార్యాలయ నిర్వాహాణ కొనసాగించడం లేదు.
కొత్త భవనం పూర్తి చేయకపోవడంతో ప్రస్తుతం రంగాపురం గ్రామానికి పంచాయతీ భవనం లేక కార్యనిర్వాహణ అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొత్త భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

పంటలతో సస్యశ్యామలం చేయడమే లక్ష్యం

*వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
చేర్యాల: ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని పంటలతో సస్యశ్యామలం చేయడమే ముఖ్యమంత్రి కేసిఆర్ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని సరస్వతి ఉపాసకుడు మంగళగిరి నర్సింహ్మమూర్తి కూతురు వివాహానికి మంత్రి హాజరై వదూవరులను ఆశీర్వదించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈసారి జూన్‌లో వర్షాలు కురవడంతో రైతులు పంటలు వేశారని అయితే జూలైలో వర్షాలు లేక ఇబ్బందులు పడ్డా గత వారం రోజుల నుండి వర్షాలు పడటంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారని పంటలు సరిగ్గా పండి రైతుల ఇబ్బందులు తొలుగుతాయని అన్నారు. శాశ్వతంగా రైతుల సమస్యలు తీర్చేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ప్రతిపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇంజనీర్లే ప్రాజెక్టులు నిర్మించరని నిజాం కాలం నాడు ఏ ఇంజనీర్ లేకపోయినా ప్రాజెక్టులు నిర్మించారనే విషయాన్ని విమర్శకులు గుర్తుంచుకోవాలని అన్నారు.
కాళేశ్వరం, పాలమూరు, డిండి, సీతమ్మ ప్రాజెక్టుల నిర్మాణాల ద్వారా సరిపడా సాగునీరు సమస్య తీరుతుందని బోర్లపై ఆదారపడాల్సిన అవసరం ఉండదని అన్నారు. ఉత్తర తెలంగాణాకు గోదావరి, దక్షిణ తెలంగాణాకు కృష్ణా నీటిని అందించడం విషయంలో ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాదించవచ్చునని దానికి ముఖ్యమంత్రి కేసిఆర్ నిదర్శనమని అన్నారు.
ఈ సందర్బంగా మాజి ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, ఎంపిపి మేడిశెట్టి శ్రీ్ధర్, నాయకులు అంకుగారి శ్రీ్ధర్‌రెడ్డి, మంగోలు చంటి, అవుశర్ల కిషోర్‌లు మంత్రి వెంట ఉన్నారు.

తరగతి గదుల్లోనే విద్యార్థుల దేశ భవిష్యత్తు
వరంగల్(కల్చరల్): తరగతి గదులలోనే విద్యార్థుల దేశ భవిష్యత్తు నిర్మించబడుతుందని, విద్యార్థులలో అనంతమైన శక్తి దాగి ఉంటుందని, దానిని వెలికి తీసే బాధ్యత ఉపాధ్యాయులదే అని మహారాష్ట్ర అదనపు డిసిపి, ఉమ్మడి రాష్ట్ర సిబిఐ పూర్వ జేడి వి లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం హంటర్ రోడ్‌లోని శ్రీవ్యాస ఆవాసంలో సులక్ష్య సేవా సమితి ఆధ్వర్యంలో ఓ యువత మేలుకో - నీ లక్ష్యం చేరుకో.. అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అబ్దుల్ కలాం లాంటి వారు కూడా సామాన్య స్థాయి నుండే ఉన్నత శిఖరాలు అధిరోహించారని తెలిపారు. మన ఉన్నతికి పేదరికం అడ్డు కాకూడదని, యువత ఆరాధించాల్సింది రియల్ హీరోలను కాని రీల్ హీరోలను కాదని ఉద్భోందించారు. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య మాట్లాడుతూ వివిధ దేశాలలో ఉన్న విధంగానే ప్రతీ పాఠశాల, కళాశాలలో గ్రంధాలయాలను ఏర్పాటు చేయాలని అన్నారు. తెలంగాణకు ఓరుగల్లు విజ్ఞాన నిధి అని, తనకు వరంగల్‌లో అనేక జ్ఞాపకాలు మమేకమై ఉన్నాయని పేర్కొన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహిత వనజీవి దారిపల్లి రామయ్య మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు అంకుటిత దీక్షతో మొక్కలు నాటి వాటిని సంరక్షించినప్పుడు మాత్రమే పరియావరణాన్ని పరిరక్షించడం సాధ్యమని అన్నారు. సులక్ష సేవా సమితి వ్యవస్థాపకుడు మండవ సంతోష్ మాట్లాడుతూ సంస్థ ప్రధాన లక్షాలు అయిన అందరికి విద్యా, యువత సాధికారికత, పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం లక్ష్మీనారాయణ, చుక్కారామయ్యలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భూపతి, ప్రభాకర్, భిక్షపతి, సతీష్, శాంత, సాయినాథ్‌లు పాల్గొన్నారు.

గుట్కా అమ్మకాలపై పోలీసుల ఉక్కుపాదం
పోలీసుల ప్రత్యేక తనిఖీలు * గుట్కా స్థావరాలపై దాడులు * పలువురుపై కేసులు
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు గుట్కా అమ్మకాలపై ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పి కోటిరెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం అర్ధరాత్రి మానుకోట పట్టణంలో పలు గుట్కా స్థావరాలపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్‌ల పోలీసులు ఏకకాలంలో అనేక ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
మహబూబాబాద్ డిఎస్పి రాజమహేంద్రనాయక్, తొర్రూరు డిఎస్పి రాజారత్నం ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. నిషేదిత గుట్కా స్థావరాలపై పోలీసులు ముకుమ్మడి దాడులు చేశారు. అక్రమ కార్యకలాపాలు, అక్రమ వ్యాపారాలు, అక్రమ రవాణాతోపాటు శాఖా పరమైన భద్రతాచర్యల్లో అకస్మత్తుగా ప్రత్యేక సోదాలు నిర్వహించినట్లు ఎస్పి కోటిరెడ్డి తెలిపారు. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలో గుడుంబా స్థావరాలపై గురిపెట్టిన పోలీసులు వాటిని అదుపులోకి తీసుకొచ్చారు. గుడుంబా రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకున్న పోలీసులు తాజాగా గుట్కా అమ్మకాలపై దృష్టిపెట్టారన్నారు. పోలీసుల ఆకస్మిక తనిఖీలతో అక్రమ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. ఈ దాడుల్లో పలువురు అక్రమ వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.
ఆ కార్యదర్శిపై అంత ప్రేమ ఎందుకో...
*అవినీతి బయటపడినా చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు
మంగపేట: అతను గతంలో అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో చిక్కాడు. ఆ కేసులో ఇప్పటికీ వాయిదాలకు తిరుగుతూనే ఉన్నాడు. తాజాగా మండలంలోని కమలాపురం గ్రామ పంచాయితీలో సుమారు రూ.17 లక్షలు నిధులు దుర్వినియోగం చేశాడని గ్రామ పంచాయితీ ఆవరణలో నిర్వహించిన బహిరంగ విచారణలో విచారణ అధికారులు తెలిపారు. అక్రమాలకు పాల్పడ్డాడని కమలాపురం గ్రామ పంచాయితీకి చెందిన రికార్డులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కమలాపురం జిపిలో చేసిన అవకతవకలపై విచారణ జరిపిన అధికారులు జిల్లా పంచాయితీ అధికారులకు నివేదిక కూడా పంపారు. తమ పంచాయితీ కార్యదర్శి నిధులు దుర్వినియోగం చేశాడని గ్రామస్థులు మంత్రి చందులాల్, ములుగు సబ్ కలెక్టర్ విపి.గౌతమ్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమటీ ఛైర్మన్ డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్‌లకు సైతం పిర్యాదు చేశారు. ఇటీవల మండల తహశీల్దార్ కార్యాలయంలో ములుగు సబ్ కలెక్టర్ మండలంలోని పంచాయితీ కార్యదర్శులు, గ్రామ ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి హాజరయిన కమలాపురం పంచాయితీ కార్యదర్శిని సమావేశం నుండి బయటకు వెళ్లిపోవాలని ములుగు సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఇవన్నీ గమనించిన కమలాపురం గ్రామస్తులు అక్రమాలకు పాల్పడ్డ తమ పంచాయితీ కార్యదర్శిపై డిపిఓ చర్యలు తీసుకుంటాడని భావించారు. కానీ కమలాపురం పంచాయితీ కార్యదర్శి నిధులు దుర్వినియోగం చేశాడని గ్రామస్థుల సమక్షంలో నిర్వహించిన బహిరంగ సభలో తేలినా అతనిపై డిపిఓ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ‘మామూలు’గా ఉండడం విమర్శలకు తావిస్తుంది. సదరు కార్యదర్శి అంటే కమలాపురంలోని ఒకరిద్దరు నాయకులకు ఎనలేని ప్రేమని, అతనిని కాపాడడం కోసం గ్రామానికి చెందిన అధికార పార్టీ,ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు కార్ల మీద నియోజకవర్గ కేంద్రమైన ములుగుకు, జిల్లా కేంద్రమైన భూపాలపల్లికి వెళ్ళి పైరవీలు చేస్తున్నట్లు గ్రామంలో ప్రచారం జరుగుతుంది. గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాల్సిన ఆయనకు గ్రామాభివృద్ధి, గతంలో ఉమ్మడి జిల్లాలో అవినీతికి పాల్పడి ఏసిబి చిక్కి ఇప్పటికీ ఆ కేసు నుండి బయటపడకపోయినా అయినా ఆయన తీరు మారలేదని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. తాగునీటి బోర్లకు మోటార్లు, వీధిలైట్లు తదితర సామాగ్రి కొనుగోలులో సర్కారు నిధులు కొల్గగొట్టినట్లు గ్రామంలో జరిగిన బహిరంగ విచారణలో అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. వారంలో నాలుగు రోజులు పొరుగు జిల్లాలోనే ఉంటారని మూడు గ్రామ పంచాయితీలకు బాస్‌గా ఉండడంతో ఏ ఒక్క గ్రామంలో కూడా ప్రజలకు ఏ ఒక్క రోజు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడం లేదని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా డిపిఓ స్పందించి కమలాపురం పంచాయితీ కార్యదర్శిని సస్పెండ్ చేసి దుర్వినియోగం చేసిన నిధులను రికవరీ చేయాలని, కమలాపురానికి రెగ్యులర్ కార్యదర్శిని నియమించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

చల్లగా చూడు తల్లీ..
* బోనమెత్తిన కేసముద్రం..
కేసముద్రం: కేసముద్రం మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం బోనాల పండగ జరుపుకున్నారు. కేసముద్రం (స్టే), ఇనుగుర్తి గ్రామాల్లో ముత్యాలమ్మ, పోషమ్మ బోనాల పండగ జరిగింది. ఈ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో బోనం వండి గ్రామదేవతలకు సమర్పించారు. ఏడాదంతా మంచి జరగాలని, పంటలు మంచి దిగుబడి ఇవ్వాలని, పిల్లా..జెల్లా ఆరోగ్యంగా ఉండేలా చూడాలని కోరుతూ కోళ్లు, మేకలు బలిచ్చారు. ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో సర్పంచ్‌లు డాక్టర్ అల్లం రమ, గండు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా బోనాల సందడి కనిపించింది.
పెసర పంటను పరిశీలించిన
వ్యవసాయ శాఖ అధికారులు
గూడూరు: గూడూరు మండలంలోని పొనుగోడు, బొల్లేపల్లి గ్రామాల్లో ఆదివారం పెసర పంటలను వ్యవసాయశాఖ అధికారి రాకేష్ పరిశీలించారు. ఎంజిజి 290 రకం విత్తనాలను గూడూరులోని వ్యవసాయశాఖ కార్యాలయం నుండి గత నెలలో మండలంలోని పొనుగోడు, బొల్లేపల్లి గ్రామాలకు చెందిన రైతులు కొనుగోలు చేశారు. అయితే పెసర పంట ఏపుగా పెరిగిన పూత కాత లేకపోవడంతో సాగు చేసిన రైతులు లబో దిబో మంటూ గూడూరుకు పరుగులు తీశారు. వ్యవసాయశాఖ అధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆదివారం ఏవో రాకేష్, ఏఇవో మునిప్రసాద్‌లు రెండు గ్రామాలకు చేరుకుని పంటను పరిశీలించారు. భూమిలో తేమ శాతం లేకపోవడం.. వర్షాలు సన్నగిల్లడం తదితర వాతావరణ పరిస్థితుల నేపధ్యంలో పూత కాత లేదని ఏవో రాకేష్ తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.
నేడే శ్రీకృష్ణాష్టమి
*ముస్తాబైన దేవాలయాలు
వరంగల్(కల్చరల్): శ్రీమహావిష్ణువు అవతారాలలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై ముల్లోకాలను పరిరక్షించేందుకు అవతరించి ఆబాల గోబాలం ఆనందోత్సాహాలతో నిండిన అపురూపమైన శ్రావణ బహుళ అష్టమి కృష్ణాష్టమి పండుగను నేడు జిల్లావ్యాప్తంగా నిర్వహించుకోనున్నారు. లోకాలకు అనన్య జ్ఞాన సంపదను అందించి జగద్గురువైన శ్రీకృష్ణుడిని సేవించేందుకు భక్తులు దేవాలయాలకు వెళ్లి పత్యేక పూజలు చేయనున్నారు. గోకులాష్టమిని పురస్కరించుకొని నగరంలోని ప్రముఖ దేవాలయాలలో సోమవారం తెల్లవారుజాము నుండే అభిషేక, అర్చనలు చేయనున్నారు. ఈ సందర్భంగా వరంగల్ ములుగు రోడ్‌లోని ఇస్కాన్ దేవాలయం, జెమిని టాకీస్ వద్ద గల గీతాభవన్ శ్రీకృష్ణ దేవాలయం, కాజీపేటలోని భామారుక్మిణి సమేత శ్రీ కృష్ణ దేవాలయాలలోనే కాకుండ ప్రముఖ వైష్ణవ, శైవ దేవాలయాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్దలతో చేయనున్నారు. నగరంలోని పలు సంఘాల ఆధ్వర్యంలో బాలగోకులాలలో, చిన్నారులకు శ్రీకృష్ణ వేశధారణలు, గోపికా వేశధారణ పోటీలను నిర్వహించనున్నారు. వరంగల్ వ్యాప్తంగా గోపిలోలునుని జన్మాష్టమిని పురస్కరించుకొని ఉట్టి కొట్టు కార్యక్రమాలను జరుపనున్నారు.

శిక్షణతోనే వృత్తిలో నైపుణ్యాన్ని పొందవచ్చు: సిపి
వడ్డేపల్లి: శిక్షణద్వారానే వృత్తిలో నైపుణ్యాలను పొందవచ్చునని, నైపుణ్యాలు పొంది ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ సిబ్బంది సిద్దాంగా ఉండాలని నగర పోలీస్ కమీషనర్ సుదీర్ బాబు అన్నారు. రాష్ట్ర స్థాయిలో పోలీసులకు నిర్వహించిన డిఫెన్సిస్ టాక్టికల్ ట్రైనింగ్ నందు ప్రతిభ కనబర్చిన వరంగల్ పోలీస్ కమీషనరేట్ సిబ్బందిని ఆదివారం కమీషనర్ అభినందించారు. వికారాబాద్ జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో రెండు నెలల పాటు రాష్ట్రంలో ఎంపిక చేసిన పోలీసు బృందాలకు శిక్షణను అందజేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ విభాగం తరపున క్యూ ఆర్‌టి విభాగం ఆర్ ఎస్ ఐ శ్రీ్ధర్ నేతృత్వంలో శిక్షణ పొందడంతో పాటు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. శిక్షణలో ప్రతిభ కనబర్చిన బృందానికి కమీషనర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇజ్రాయిల్ దేశ సైన్యానికి అందజేసే శిక్షణను అందజేసే తరహాలో తెలంగాణ పోలీసులకు శిక్షణ అందజేయడం జరిగిందన్నారు. ఈ శిక్షణలో పోలీసులు ఎలాంటి ఆయుధాలు లేకుండా శత్రువులను ఎదురుకునే సామర్థ్యాలను నేర్పుతారని అయన వివరించారు. ఈ కార్యక్రమంలో డిసిపిలు వేణుగోపాలరావు, వెంకన్న, ఇస్మాయిల్, ఏఆర్‌ఏసిపిలు విద్యాసాగర్, సదానందం, నాగయ్యలు పాల్గొన్నారు.

18వ రోజుకు చేరుకున్న అధ్యాపకుల నిరసనలు
కెయుక్యాంపస్: కాకతీయ విశ్వవిద్యాలయంలో పార్ట్‌టైం అధ్యాపకులు కుప్టా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నా ఆదివారం 18వ రోజుకు చేరుకుంది. యూనివర్సిటీలోని వివిధ విభాగాలకు సంబంధించిన అధ్యాపకులు తమ న్యాయబధమైన సమస్యలను పరిష్కరించాలని పరిపాలన భవనం ముంది నిరసనలు వ్యక్తం చేస్తు ధర్నా చేశారు. ఈ సందర్భంగా కుప్టా అధ్యకులు తిరుపతిరాజ్, జయప్రకాశ్‌గౌడ్‌లు మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులకు ఎన్ని సార్లు వినతిపత్రాలను అందించిన పట్టించుకోవడంలేదని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కెటిఆర్‌లు తమ సమస్యల పై దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎన్నో ఉద్యమాలకు పురిటి గడ్డ అయిన కాకతీయ విశ్వవిద్యాలయంలో పార్ట్‌టైం అధ్యాపకుల సమస్యలను పట్టించుకోకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదా కెసి ఆర్ ఇచ్చిన ప్రతీ పిలుపును గౌరవించి తెలంగాణ సాధన కోసం ఎంతగానో పోరాడిన ఉద్యోగులను మర్చిపోవడం న్యాయమేనా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పార్ట్‌టైం ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, తెలంగాణ సాధించడం వలన ఉద్యోగుల సమస్యలు తీరతాయని ఆశించిన అధి జరగడం లేదన్నారు.
బంగారు తెలంగాణలో తమ బ్రతుకులు బాగుపడతాయని అనుకుంటే దానికి విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు తమ సమస్యపై చొరవచూపి సమస్యను పరిష్కరించాని కోరారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ ప్రభాకర్, కిరన్‌గౌడ్, గిరిప్రసాద్, ఫణీంధర్, శ్రీ్ధర్‌గౌడ్, వినోద, సురేష్, కేదారి, తదితరులు పాల్గొన్నారు.

కరుణించిన వరుణుడు - ఆనందోత్సాహాల్లో రైతులు
కొత్తగూడ:గత కొన్ని రోజులుగా వరణుడు కరణించకుండా పోవడంతో రైతులు నిరుత్సాహంతో ఉండగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఉత్సాహంతో ఉన్నారు.జూలై మాసంలో కురిసిన వర్షాలతో రైతులు తమ పంటలను సాగు చేసుకోగా అప్పటినుండి వర్షాలు కురువక పోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనడంతో రైతులు అయోమయ పరిస్థితికి లోనుకాగా వర్షాలు పడాలని తమకు తోచిన దేవుళ్లకు మొక్కులు మొక్కి ఆకాశం వైపు చూశారు. రైతుల మొక్కులు ఫలించి రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతుల ముఖంలో ఆనందాలు కనిపిస్తున్నాయి. ఈ వర్షాలతో ఖాళీ అయిన చెరువులు, కుంటలు మళ్ళీ నిండుకుంటాయని రైతులు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
వాగులు వంకలు ప్రవహించడంతో మండల కేంద్రానికి రావలసిన ప్రధాన రహదారిపై గువ్వలబోడు సమీపంలోని వాగులు రోడ్డుపై నీరు ఉధృతంగా రావడంతో వాహనాలన్ని గంటల తరబడి నిలిచి పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గుంజేడు ముసలమ్మ దేవాస్ధానం వద్ద నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి పూర్తి కాకపోవడంతో తాత్కాతికగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు బురదమయం కావడంతో వాహనాలు దిగబడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లో లెవెల్ వంతెనలు తోలగించి హైలెవల్ వంతెనలు నిర్మించడం వలన భారీ వర్షాలు కురిసినప్పుడు రోడ్ల పైకి నీరు చేరకుండా ఉంటుందని తద్వారా వాహనాలకు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగవని ప్రస్తుతం నిర్మిస్తున్న బ్రిడ్జిలను త్వరిత గతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.