నిజామాబాద్

నగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్: నిజామాబాద్ నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ కష్టాలు తీవ్రతరం అవుతున్నాయి. రోజుకు వేల సంఖ్యలో వాహనాలు జిల్లా కేంద్రానికి వస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. సిబ్బంది కొరత కారణంగా ట్రాఫిక్‌ను నియంత్రించడంలో పోలీసులు విఫలమవుతున్నారు. హెల్మెట్‌లు ధరించడం లేదని, లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతున్నారనే కారణంగా ఇబ్బడిముబ్బడిగా జరిమానాలు విధిస్తున్నారే తప్ప, సమస్య పరిష్కారానికి పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలో అనునిత్యం వాహనాల తనిఖీలు చేపడుతున్న అధికారులు భారీ మొత్తంలో జరిమానాలు వడ్డిస్తున్నారు. ఇదివరకు వంద నుండి రెండు వందల రూపాయల జరిమానాలు వేసేవారు కాగా, ప్రస్తుతం ఒక్కసారిగా వేయి రూపాయల వరకు జరిమానాలు విధిస్తుండడంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. అయితే ట్రాఫిక్ పోలీసులు జరిమానాలపై కనబరుస్తున్న శ్రద్ధాసక్తుల్లో ఏ కాస్తంతైనా ట్రాఫిక్ ఇక్కట్లపై దృష్టిసారించి ఉంటే చాలావరకు సమస్యలు పరిష్కారమయ్యేవని ప్రజలు పేర్కొంటున్నారు. ఈ విషయంలో ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సరైన పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో రోడ్లపైనే ఆటోలు, జీపులు, కార్లు, లారీలను నిలుపుతూ ఎక్కడబడితే అక్కడ అడ్డాలుగా ఏర్పాటు చేసుకున్నారు. ఖలీల్‌వాడిలోని రమేష్ థియేటర్ నుండి రాజీవ్‌గాంధీ ఆడిటోరియంకు వచ్చే మార్గంలో ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. ట్రాఫిక్ ఇక్కట్లను దూరం చేసేందుకు ఏర్పాటు చేస్తున్న సమావేశాల్లో అధికారులు చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న హామీలు ఆచరణకు నోచుకోవడం లేదు. ఫలితంగా నగర ప్రజలు అనునిత్యం అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరంలో రోడ్లు లేకపోవడం, ప్రస్తుతం చేపడుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, మిషన్ భగీరథ పనులతో ట్రాఫిక్ సమస్య మరింత జఠిలమవుతోంది. ఉన్న కొద్దిపాటి రోడ్డును ప్రైవేట్ వ్యాపారులు ఆక్రమించుకోవడంతో రోడ్లు మరింత ఇరుకుగా తయారయ్యాయి. రోడ్లను కబ్జా చేసుకుని ఇరువైపులా వెలసిన దుకాణాలు ట్రాఫిక్ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. గతంలో ప్రైవేట్ వాహనాలకు ప్రత్యేకంగా నగర శివారులో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించి స్థలాలను ఎంపిక చేశారు. నగర శివారులో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని వాహనాదారులు అభ్యతరం వ్యక్తం చేయడంతో పార్కింగ్ స్థలాల కేటాయింపు ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఆటోలు, జీపులు, లారీలు, కార్లు రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు. అసలే ఇరుకు రోడ్లతో వాహన చోధకులు, పాదచారులు, నగర ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రైవేట్ వాహనాలను రోడ్లపై నిలుపడం ట్రాఫిక్ కష్టాలకు కారణంగా మారాయి. జిల్లా కేంద్రంలో పోలీసుల రికార్డుల ప్రకారం 12వేల పైచిలుకు ఆటోలు తిరుగుతున్నాయి. వీటితో పాటు పరిసర గ్రామాలు, మండలాల నుండి మరో 6వేల ఆటోలు జిల్లా కేంద్రానికి రావడం వల్ల ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. ఆటోరిక్షాలు అతివేగంగా వెళ్తూ వాహనాలను ఓవర్‌టేక్ చేయడం వల్ల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ట్రాఫిక్‌ను క్రమబద్ధికరించడానికి అనువైన పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించుకోవడం లేదు. అరకొర సిబ్బందితో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడం కష్టతరంగా మారగా, జిల్లా కేంద్రంలో తరచూ డ్యూటీలకే పరిమితం అవుతున్నారు. అడపాదడపా సివిల్ పోలీసులే ట్రాఫిక్ పోలీసులుగా అవతారమెత్తాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొంత మంది ట్రాఫిక్ సిబ్బందిని నియమించాల్సి ఉండగా, పోలీసుశాఖ దీనిపై దృష్టి సారించడం లేదు. ప్రధాన వ్యాపార కూడళ్లు, పెద్ద సంఖ్యలో ఆసుపత్రులు కలిగిన ఖలీల్‌వాడీ ప్రాంతాలలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఆసుపత్రుల యజమానులు ఇష్టారీతిన బహుల అంతస్తులు నిర్మిస్తున్నప్పటికీ, ఆసుపత్రులకు వచ్చే రోగుల వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు స్థలాన్ని కేటాయించకపోవడంతో ఆసుపత్రుల ఎదుట రోడ్డుపైనే పార్కింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి నగరంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

బదిలీ ఊహాగానాల మధ్యే రెండేళ్ల పదవీ కాలం పూర్తి

కలెక్టర్ యోగితారాణా జిల్లాలో బాధ్యతలు చేపట్టి నేటికి 2 సంవత్సరాలు

ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా బదిలీ ఊహాగానాల నడుమే తన రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. 2015 ఆగస్టు 14వ తేదీన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టగా, ఆరు మాసాలు సైతం గడువకముందే ఆమె బదిలీ విషయమై ఊహాగానాలు తెరపైకి రావడం మొదలైంది. తాజాగా నెల రోజుల క్రితం కూడా కలెక్టర్ బదిలీ దాదాపుగా ఖాయమైందని, ఆమె స్థానంలో ఫలానా ఐఎఎస్ అధికారి వస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో, అధికార వర్గాల్లోనూ విస్తృత చర్చ కొనసాగింది. అయితే ఇదివరకటి తరహాలోనే ఈ తాజా ప్రచారం కూడా ఊహాగానానికే పరిమితమైంది. అధికార పార్టీ నేతలకు కలెక్టర్ వ్యవహారశైలి మింగుడుపడని చందంగా మారడం ఆమె బదిలీ విషయమై తరుచూ పుకార్లు చెలరేగేందుకు ఆస్కారం కల్పించినట్లయ్యింది. జిల్లా యంత్రాంగం పనితీరును గాడిన పెడుతూ, పాలనా వ్యవహారాల్లో ముక్కుసూటిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ యోగితారాణా తన పాలనా దక్షతను చాటుతూ ఇప్పటికే ఉపాధి హామీ పథకం అమలుతో పాటు ఇ-నామ్ అమలులో నిజామాబాద్ జిల్లాను ముందంజలో నిలిపి కేంద్ర ప్రభుత్వం ద్వారా రెండు జాతీయ స్థాయి అవార్డులను, హరితహారం అమలులో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అభినందనలు పొందారు. స్వతహాగా డాక్టర్ అయినందున వైద్య సేవలను మెరుగుపరుస్తూనే విద్యారంగం అభివృద్ధి విషయంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అన్నింటికి మించి ప్రభుత్వ ప్రాధామ్యాల అమలుకు పెద్దపీట వేస్తూ ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతూ సత్ఫలితాలు సాధించగలిగారు. అయితే మొదటి నుండి పలువురు ప్రజాప్రతినిధుల సిఫార్సులను బుట్టదాఖలు చేస్తూ, నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరిస్తానంటూ కలెక్టర్ నిక్కచ్చిగా తేల్చి చెబుతుండడాన్ని పలువురు ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె పనితీరును ఆక్షేపిస్తూ పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. కలెక్టర్ వ్యవహారశైలి సక్రమంగా లేదని, తమకు తగిన గౌరవం ఇవ్వకుండా సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతుండడం వల్ల ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోందని వాపోయినట్టు తెలిసింది. సిఎం వద్ద కలెక్టర్ గురించి ఫిర్యాదు చేయడానికి చాలాకాలం ముందు నుండే అధికార పార్టీ ఎమ్మెల్యేలు బాహాటంగానే కలెక్టర్‌పై తమ అక్కసును వెళ్లగక్కుతూ వచ్చారు. జడ్పీ సర్వసభ్య సమావేశాలు, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ వంటి వాటిని వేదికగా మల్చుకుని కలెక్టర్ యోగితారాణాను లక్ష్యంగా చేసుకుని మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. ఎంపి కవిత సమక్షంలోనూ కలెక్టర్‌పై తమ రుసరుసలు ప్రదర్శించారు. జడ్పీ సమావేశంలోనైతే కలెక్టర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, గత వేసవిలో సిఆర్‌ఎఫ్, నాన్ సిఆర్‌ఎఫ్ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను అనుమతులు లేవనే సాకుతో నిలిపివేశారంటూ ఎమ్మెల్యేలు షకీల్, జీవన్‌రెడ్డి తదితరులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతకుముందు ఇసుక రవాణాపై లేనిపోని ఆంక్షలు విధిస్తున్నారని, ఫలితంగా ప్రభుత్వ అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని, దీనికి అధికారులను బాధ్యులుగా పరిగణిస్తూ సస్పెన్షన్‌లు చేస్తున్నారని కలెక్టర్ తీరును ఆక్షేపించారు. అభివృద్ధి పనుల పరిశీలన కోసం థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరిపించడాన్ని కూడా తప్పుబట్టారు. ఇలా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు, కలెక్టర్‌కు మధ్య గత చాలాకాలం నుండే ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుండగా, ఇటీవలి కాలంలో ప్రజాప్రతినిధులు ఆమె తీరుపై మరింత అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. ఈ క్రమంలోనే స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు కలెక్టర్‌ను బదిలీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందనే ప్రచారం గడిచిన ఏడాదిన్నర కాలం నుండి వినిపిస్తూ వస్తోంది. ఈ బదిలీ ఊహాగానాల మధ్యనే కలెక్టర్ యోగితారాణా జిల్లాలో తన రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోగలిగారు.

గుమ్మిర్యాల ఎత్తిపోతలకు త్వరలో ట్రయల్న్
* గోదావరిలో నీటి లేమితో సఫలీకృతమయ్యేనా?

మోర్తాడ్: ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల గోదావరి నదిలో చేపట్టిన ఎత్తిపోతల పథకానికి త్వరలోనే ట్రాయల్న్ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఈ నెలలో ట్రాయల్న్ చేపట్టనున్నట్లు తెలిసింది. దశాబ్దంన్నర కాలంగా గుమ్మిర్యాల రైతాంగం ఎదురు చూస్తున్న ఎత్తిపోతల పథకం కల త్వరలో సాకారం కానున్న నేపథ్యంలో గోదావరి నదిలో లేకపోవడడం ఆయకట్టు రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. సంవత్సర కాలం క్రితం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు 11కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన గుమ్మిర్యాల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. సంవత్సర కాల వ్యవధిలో పనులను పూర్తి చేసి నీటిని అందిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో, పనులు కూడా శర వేగంగానే జరిగాయి. గుమ్మిర్యాల గ్రామంలో దాదాపు రెండున్నర వేల హెక్టార్ల ఆయకట్టు భూములకు సాగునీరు అందించేందుకు ఈ పథకాన్ని చేట్టారు. వాస్తవానికి శ్రీరాంసాగర్ కాకతీయ కాల్వ 19వ డిస్ట్రిబ్యూటరీ కింద చివరి ఆయకట్టు గ్రామంగా గుమ్మిర్యాల ఉంది. ఏ ఒక్కసారి కూడా చివరి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందిన దాఖలాలు లేకపోవడంతో గుమ్మిర్యాల రైతులు ప్రత్యామ్నయ పథకం వైపు మొగ్గు చూపారు. బట్టాపూర్ శివారు నుండి గుమ్మిర్యాల శివార్ల వరకు గోదావరి నది తీరం వైపు ఉన్న రైతులంతా నదిలో పంపుసెట్లను ఏర్పాటు చేసుకుని పంట పొలాలకు నీటిని తరలించుకుంటున్నారు. రెండు సంవత్సరాల క్రితం గోదావరి నది పూర్తిగా ఎండిపోయిన నేపథ్యంలో ఆ సమయంలో కూడా రైతులు నదిలో గుంతలు తీసి ఊరిన నీటిని పంపింగ్ చేసుకుని పంటలు సాగు చేసుకున్నారు. ఆ నేపథ్యంలోనే గుమ్మిర్యాల ఎత్తిపోతల పథకానికి బీజం పడింది. 15సంవత్సరాల క్రితమే అప్పటి పాలకులు గుమ్మిర్యాల ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదనలు పంపించగా, ఎట్టకేలకు 18మాసాల క్రితం ప్రభుత్వం నిధులు కేటాయించింది. నది ఒడ్డున పంప్‌హౌజ్‌ను ఏర్పాటు చేసి పైప్‌లైన్ల సహాయంతో అటు చెరువుకు, ఇటు పంట కాల్వలకు అనుసంధానం చేశారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక సబ్ స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను అందించారు. పంప్‌హౌజ్‌లో మోటార్లను ఏర్పాటు చేసి, పవర్ యూనిట్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, స్టార్టర్లు మాత్రం అందుబాటులోకి రాలేదు. మరో రెండు మూడు రోజుల్లో వీటిని కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే గోదావరి నదిలో నీటిని నిల్వలు ఆశించిన స్థాయిలో లేకపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. గోదావరి నుండి పంప్‌హౌజ్ వరకు ప్రత్యేక కాల్వలను ఏర్పాటు చేసి నీటిని మళ్లించాలని చూస్తున్నప్పటికీ, పంప్‌హౌజ్ పైప్‌లైన్ వరకు నీరు చేరని పరిస్థితి. గోదావరిలో నీరు సంవృద్ధిగా అందుబాటులో ఉంటే వెంటనే ట్రాయల్న్ చేపట్టే అవకాశాలు ఉన్నప్పటికీ, ఆ అవకాశం కనిపించడం లేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి వర్షాలు కురియకపోవడం, అడుగంటిన భూగర్భ జలాలతో బోరుబావులు ఆగిఆగి నీరందిస్తుండటంతో గుమ్మిర్యాల ఎత్తిపోతల పథకమే తమకు శరణ్యమన్నది ఆయకట్టు రైతుల ఆలోచన.
15న ట్రయల్ రన్
ఇదిలాఉండగా, ఈ నెల 15న గుమ్మిర్యాల ఎత్తిపోతల పథకం నుండి ట్రాయల్న్ చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. పక్షం రోజుల క్రితం పంప్‌హౌజ్ నుండి మోటార్ల పని తీరును పరిశీలించిన అధికారులు, ప్రస్తుతం ట్రాయల్న్ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది సఫలీకృతం అయితే తక్కువ సమయంలోనే ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించే అవకాశం కూడా ఉంటుందని గ్రామ ప్రజాప్రతినిధులు అంటున్నారు. ఎత్తిపోతల కమిటీ పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డికి పథకం పురోగతిని తెలియజేస్తున్నారు. అవసరమనుకుంటే ట్రాయల్ రన్‌ను ఉన్నతాధికారులతో పాటు ఎమ్మెల్యే సమక్షంలోనే చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఏదీ ఏమైనప్పటికీ, చిరకాలంగా కలలు కంటున్న గుమ్మిర్యాల రైతులకు ఎత్తిపోతల పథకం ఫలితాలను అందివ్వనుంది.

ఘనంగా బారిడి పోచమ్మ బోనాలు
*పోతరాజుల కోలాటాలు *హాజరైన జుక్కల్ ఎమ్మెల్యే
పిట్లం: పిట్లం మండల కేంద్రంలో ప్రతి ఏడు జరిగే బారిడిపోచమ్మ బోనాల ఊరేగింపు కార్యక్రమం ఆదివారం అత్యంత వైభవంగా కన్నుల పండగా జరిగింది. నూతన వస్త్రాలు ధరించి అందంగా అలంకరించిన బోనాలతో పాటు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని నెత్తిన బోనంగా పెట్టుకుని జరిపిన ఈ ఊరేగింపును చూపరులను ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి జుక్కల్ శాసనసభ్యుడు హన్మంత్ షిండే ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ ఊరేగింపులో పోతరాజులు కోలాటాలు, విన్యాసాలు చూపురులకు ఎంతో ఉత్సాహాన్ని రేకెత్తించాయి. ఉదయం భజాభజంత్రీలతో, పోతరాజుల నృత్యాలు, విన్యాసాలతో గడి హనుమాన్ ఆలయం నుండి గ్రామ శివారులోని బారడి పోచమ్మ ఆలయం వరకు బోనాల ఊరేగింపు కొనసాగింది. బోనాలకు హాజరైనందుకు ఆలయ కమిటీ నిర్వహకుడైన జగదీష్ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. బోనాల పండగలో చుట్టు పక్కల గ్రామాల నుండి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. ఆలయ కమిటీ నిర్వహకుడైన జగదీష్ తన కుటుంబ సభ్యులతో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి భారీ వర్షాలు కురవాలని తద్వారా కుంటలు, చెరువులు, ప్రాజెక్ట్‌లు నిండి రైతుల పంటలు పండి రైతులు సంతోషంగా ఉండాలని అమ్మవారికి మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగారాం, ఎంపిపి రజినికాంత్‌రెడ్డి, జడ్పీటిసి ప్రతాప్‌రెడ్డి, ఎఎంసి చైర్మన్ వెంకట్‌రాంరెడ్డి, వైస్ ఎంపిపి నర్సాగౌడ్, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు వాసరి రమేష్, నేతలు రాజు, జొన్న శ్రీనివాస్‌రెడ్డి, కోటారి ప్రభు, మైపల్‌గౌడ్‌తో పాటు ఎంపిటిసీలు, సొసైటి చైర్మెన్‌లు, కుల పెద్దలు, గ్రామస్థులు భారీ సంఖ్యలో హాజరు అయ్యారు.
గంగమ్మ బోనాల పండగ
ఎల్లారెడ్డి: డివిజన్ కేంద్రంలోని పెద్దచెరువు కట్ట వద్ద గల గంగమ్మ ఆలయంలో ఆదివారం ఘనంగా పూజలు నిర్వహించి, గంగపుత్ర సందర్భంగా బోనాల ఊరేగింపు నిర్వహించారు. గంగపుత్రులకు చెందిన మహిళలు ప్రతి ఇంటి నుండి ఒక బోనం ఎత్తుకుని ఆలయం వరకు ఊరేగింపుగా వచ్చి గంగమ్మ ఆలయానికి చేరుకుని ఆలయం చుట్టు ఐదు ప్రదక్షణలు నిర్వహించి, బోనాల్లో తెచ్చిన నైవేద్యం అమ్మవారికి సమర్పించి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ వర్షాకాలంలో వర్షం సమృద్ధిగా కురిసి పెద్దచెరువు నిండాలని గంగమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నక్క గంగాధర్, ఇన్‌చార్జీ సర్పంచ్ పప్పువెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

ఆయకట్టు రైతులకు ఎత్తిపోతలే శరణ్యమా?
మోర్తాడ్: తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. కాకతీయ కాల్వలో ఉన్న లీకేజీ జలాలను పంట పొలాల్లోకి మళ్లించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాల్వ డిస్ట్రిబ్యూటరీల ద్వారా పంట పొలాలకు నీరందిస్తున్న విషయం విధితమే. దీనికి తోడుగా రైతులు కూడా కాకతీయ కాల్వలో మోటార్లను ఏర్పాటు చేసుకుని, పైప్‌లైన్ల ద్వారా నీటిని మళ్లించుకోవడం ఆనాదిగా వస్తున్న అలవాటే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాకతీయ కాల్వలో వరద ప్రవాసం లేకపోయినప్పటికీ, ఉన్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు పైప్‌లైన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ ప్రాంత రైతులు ఎక్కువగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాలపైనే ఆధారపడి పంటలు సాగు చేసుకుంటారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ జలాలను కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాలకు తరలించడానికి కాకతీయ కాల్వను ఏర్పాటు చేసిన విషయం విదితమే. కాల్వ ప్రారంభమైన నాటి నుండి రైతులు దీనిని ఆసరా చేసుకోనే పంటలు సాగు చేస్తున్నారు. కాల్వలో పంపుసెట్లు ఏర్పాటు చేసుకొని పైపులైన్ల ద్వారా పంట పొలాలకు నీటిని మళ్లించుకుంటున్నారు. ఇలాంటి రైతుల కోసమే అధికారులు ప్రాజెక్ట్ గేట్ల నుండి కొంత మేర నీటిని లీకేజీల రూపంలో కాకతీయ కాల్వలోకి విడుదల చేస్తారు. ఈ నీటి కోసం రైతులు ఆందోళనలు జరిపిన సందర్భాలు కూడా ఎక్కువేనని చెప్పవచ్చు. అందువల్ల ఏ కాలంలోనైనా కాకతీయ కాల్వలో కొంత మేరైన నీటి నిల్వలు ఉంటాయి. కాకతీయ కాల్వ వెంబడి పరిశీలిస్తే నిజామాబాద్ జిల్లా సరిహద్దుల వరకు కాల్వకు రెండు వైపులా వేలాది వ్యవసాయ పంపుసెట్లు కనిపిస్తాయి. కాల్వకు రెండు వైపులా ఉన్న గ్రామాల రైతులు ఒక్కొక్కరు రెండు నుండి నాలుగు కిలోమీటర్ల వరకు పైపులైన్లు ఎర్పాటు చేసుకుంటారంటే కాకతీయ కాల్వపై ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. రైతులకు కాకతీయ కాల్వలో నీటి నిల్వలు ఎప్పుడు అందుబాటులో ఉంచాలన్న డిమాండ్ మేరకు ప్రభుత్వం ఉప్లూర్ శివార్లలో కాకతీయ కాల్వలో క్రాస్ రెగ్యులేటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. రెవెన్యు అధికారుల అంచనాల ప్రకారం జిల్లా సరిహద్దుల వరకు ఈ ప్రాంతంలొ సాగవుతున్న పంటల సాగు విస్తీర్ణం వెయ్యి ఎకరాల పైనే ఉంటుంది. ఒక్క కాకతీయ కాల్వనే కాకుండా ఇటీవలే కొత్తగా తవ్విన వరద కాల్వను కూడా రైతులు ఇదే తరహాలో సాగు నీటిని వినియోగించుకుంటున్నారు. వాస్తవానికి నిబంధనల ప్రకారం ఇది నీటి ఛౌర్యం క్రిందకే వస్తుందని, అయితే రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకోనే అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్నది బహిరంగ రహాస్యం. కాకతీయ కాల్వ డిస్ట్రిబ్యూటరీ కాల్వల్లోనూ ఈ తతంగాన్ని వీక్షించవచ్చు. ఈ ప్రాంత రైతాంగానికి సాగు నీటిని అందివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం హన్మంతరెడ్డి ఎత్తిపోతలు, పాలెం ఎత్తిపోతలు, తొర్తి ఎత్తిపోతలు, గట్టుపొడచినవాగు లిఫ్ట్‌తో పాటుగా అనేక రకాల సాగు నీటి పథకాలను కోట్లాది రూపాయల వ్యయంతో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కాల్వలు చివరి ఆయకట్టుకు నీటిని అందించడం మాట అటుంచితే కనీసం కాల్వలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. గతంలో ఈ ప్రాంతంలో తగ్గిన భూగర్భజల మట్టాన్ని పెంచడానికి లక్షలాది రూపాయల వ్యయంతో చేపట్టిన వాటర్‌షెడ్ లాంటి పథకాలు కూడా సరైన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల వల్ల ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఒక్క సాగునీటి పథకం కూడా పూర్తిస్థాయిలో రైతులకు అందుబాటులోకి రాలేదు. వీటిపై రైతులు పెట్టుకొన్న గంపెడాశలు అడియాసలే అవుతున్నాయి. వరదకాల్వ నిర్మాణం వల్ల ఈ ప్రాంత రైతులు చాలా విలువైన పంట భూములను కోల్పోయారని, వీరికి ప్రత్యామ్నాయంగా వరదకాల్వ నుండి ఎత్తిపోతల పథకం చేపట్టి బాధిత గ్రామాల చెరువులను నింపుతామని గత పాలకులు ఇచ్చిన హామీలు నీటి మూటలుగా గానే మిగిలిపోయాయి. అయితే ముఖ్యమంత్రి కెసిఆర్ కాళేళ్వరం నుండి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్‌లోకి రోజుకో టిఎంసి చొప్పున నీటిని మళ్లించేందుకు చేపట్టిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకం ఈ ప్రాంత రైతుల్లో గంపెడు ఆశలు నింపింది. ఈ పథకాన్ని సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని స్వయంగా సిఎం హామీ ఇచ్చిన దరిమిలా, వచ్చే సంవత్సరం నుండి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఏర్పడనుందన్నారు.

60 లక్షల బీడీ కార్మికులపై జిఎస్‌టి భారం
మోర్తాడ్: బీడీ కార్మికుల ఉపాధి అవకాశాలు దెబ్బతీసే జిఎస్‌టి నుండి బీడీ పరిశ్రమను ఉపసంహరించాలని ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి సత్తెక్క డిమాండ్ చేశారు. ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో ఆదివారం జిఎస్‌టిపై బీడీ కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, తెలంగాణలో 3లక్షల మంది, దేశంలో 60లక్షల మంది కార్మికులు బీడీ పరిశ్రమపై ఆధారపడి కుటుంబాలను వెల్లదీస్తున్నారని అన్నారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యంత ప్రాధాన్యత రంగంగా ఉన్న బీడీ పరిశ్రమపై కూడా జిఎస్‌టి అమలు చేయడం వల్ల కార్మికులపై ఆర్థిక భారం పడుతుందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని విమర్శించారు. కార్మిక వర్గంపై దాడిని కొనసాగిస్తున్న బిజెపి సర్కార్, మేకింగ్ ఇండియా పేరుతో కార్మికుల చట్టాల సవరణ చేస్తూ, కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. బీడీ కార్మికులు పోరాడి సాధించుకున్న జీవో నెంబర్ 41ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కార్మికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం నడుంభిగించిన కార్మికులు, బీడీ పరిశ్రమపై జిఎస్‌టి ఉప సంహరణకు కూడా ఉద్యమంలా కదులుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు సురేష్‌తో పాటు సంఘ ప్రతినిధులు జమున, లక్ష్మి, రాధ, బీడీ కార్మికులు పాల్గొన్నారు.

సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం ఆర్యసమాజ్
* అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా
వినాయక్‌నగర్: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమే ఆర్యసమాజ్ అని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని కసాబ్‌గల్లిలో గల ఆర్య సమాజ్‌లో నూతనంగా నిర్మించిన వైదిక సత్సంగ్ భవనాన్ని ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందువుల సంప్రదాయలకు తగినట్లుగా ఆర్య సమాజ్‌లో వివాహాలు నిర్వహించడంతో పాటు ప్రతి పండుగను హిందూ సంస్కృతి ప్రకారం నిర్వహిస్తూ దేశభక్తిని చాటుతున్న ఘనత ఆర్య సమాజ్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఆకుల సుజాత, ఎసిపి ఆనంద్‌కుమార్, టిఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ ఎనుగందుల మురళీ, ఆర్య సమాజ్ అధ్యక్షులు వెంటక నర్సయ్య, కార్యవర్గ సభ్యులు నారాయణ, ముక్కా శ్రావణ్‌కుమార్, వైద్యులు వినోద్‌కుమార్‌గుప్తా, శ్రావణ్‌కుమార్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.

హోటల్‌పై టాస్స్‌ఫోర్స్ దాడులు
వినాయక్‌నగర్: నగరంలోని శాతవాహన హోటల్‌పై టాస్క్ఫోర్స్ సిఐ వెంకటేశ్వర్లు నేతృత్వంలో సిబ్బంది ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ సిబ్బంది హోటల్‌లోని కిచెన్‌లో వంటకు ఉపయోగిస్తున్న ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన మాసం తదితర వాటిని పరిశీలించారు. వాటిలో కొన్నింటిని సీజ్ చేసి హైదరాబాద్ ల్యాబ్‌కు పంపించారు. నివేదికలు వచ్చిన అనంతరం చర్యలు తీసుకుంటామని, కుళ్లిన పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు తెలిస్తేచర్యలు తీసుకుంటామని టాస్క్ఫోర్స్ సిఐ తెలిపారు. ఈ దాడుల్లో ఫుడ్ ఇన్స్‌పెక్టర్ నాగరాజుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి స్వల్పంగా ఇన్‌ఫ్లో
నిజాంసాగర్: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు వరప్రదాయినిగా నిలుస్తున్న కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఆదివారం స్వల్పంగా ఇన్‌ఫ్లో వరదనీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్ట్ డిప్యూటీ ఇఇ దత్తత్రి తెలిపారు. గత రెండు రోజులుగా ఎగువ ప్రాంతాలైన బాచ్‌పల్లి, రాంరెడ్డిపేట్, నిజాంపేట్, తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్ట్ జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతోందని అన్నారు. ప్రాజెక్ట్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1405.00 అడుగుల సామార్ధ్యం కాగా, 1380.10 అడుగుల నీరు ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో ఉందని తెలిపారు. ఎగువ ప్రాంతం నుండి జలాశయంలోకి 234 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోందని తెలిపారు. ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి కురిసిన వర్షం మొత్తం 8మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. రైతులందరు వర్షాలు కురవాలని ఆలయాల్లో పూజలు చేస్తున్నారు.