మెదక్

డప్పుచప్పుళ్లతో దద్దరిల్లిన ఏడుపాయల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపన్నపేట: తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ది చెందిన శ్రీ ఏడుపాయల వనదుర్గ్భావాని మాత పుణ్యక్షేత్రం ఆదివారం రోజు ఆషాడ మాసం సందర్భంగా వేలాది మంది భక్తులతో జనసంద్రంగా మారింది. డప్పుచప్పుల్లు, భారీ ఉరేగింపుల మధ్య భక్తులు బోనాలను అమ్మవారికి సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండే కాక పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి భక్తులు వివిధ వాహనాల్లో భారీయేత్తున ఏడుపాయలకు తరలివచ్చారు. వనదుర్గామాత సన్నిదిలోని ప్రవహిస్తున్న పవిత్ర మంజీర నదీపాయల్లో, షవర్ బాత్‌ల వద్ద భక్తులు ఆషాడ మాసం పుణ్య స్నానాలు ఆచరించారు. ఆదివారం ఉదయం వనదుర్గామాత ఆలయంలో అమ్మవారికి అలయ అర్చకులు అభిషేకం, కుంకుమార్చన తదితర ప్రత్యేక విశేషాలంకరణ పూజలు నిర్వహించారు. దుర్గామాత అమ్మవారిని ఆలయ గర్భాలయంలో అలయ అర్చకులు పట్టు వస్త్రాలతో, వివిధ రకాల కూరగాయలు, రంగురంగుల పూలతో అత్యంత సుందరంగా శాకాంబరీదేవిగా ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ చైర్మన్ పి.విష్ణువర్దన్‌రెడ్డి, ఆలయ ఈఓ టి.వెంకటకిషన్‌రావులు దుర్గామాత అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భాలయంలో వనదుర్గామాత అమ్మవారు దీప కాంతుల మధ్య కోటి సూర్యప్రభ విద్యుత్ కాంతులతో బంగారు వర్ణంలో దగదగలాడుతూ భక్తజనావళికి దర్శనమిచ్చారు. ఆషాడమాసం సందర్భంగా భక్తులు భక్తిశ్రద్దలతో భారీయేత్తున బోనాల ఉరేగింపుతో అమ్మవారికి ఆలయానికి తరలివచ్చారు. డప్పుచప్పులు, బోనాల ఉరేగింపులు, శివసత్తుల శిగాలు, పోతరాజుల విన్యాసాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిభింబించే విధంగా ఏడుపాయల ప్రాంగణమంతా భక్తితన్మయంతో హోరెత్తింది. అశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆలయంలో క్యూలైన్ల ద్వారా వనదుర్గామాతను భక్తిశ్రద్దలతో దర్శించుకున్నారు. మహిళా భక్తులు నెత్తిని విరబోసుకొని ఆపై గండదీపం పెట్టుకొని, ముఖానికి పసుపు రాసుకొని వేప కొమ్మలు చేతబూని, మెడలో గవ్వలహారాలు, పూలదండలు చేతిలో కొరడా పట్టుకొని నెత్తిపై బోనం ఎత్తుకొని డప్పుచప్పుళ్లకు అనుగుణంగా లయబద్దంగా నృత్యాలు చేస్తూ అమ్మవారి ఆలయం వైపు సాగిపోతున్న దృశ్యాలు చూస్తూ భక్తులను, పర్యాటకులు మంత్రముగ్దులయ్యారు. కొబ్బరికాయలు కొట్టి తలనీలాలు ఇచ్చి భక్తుల తమ మొక్కులను తీర్చుకున్నారు.
కొందరు భక్తులు సంతాన ప్రాప్తి కలగాలని అమ్మవారి సన్నిదిలోని సంతాన గుండంలో దంపతులు పవిత్ర స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకొని ఆలయంలో కొబ్బరికాయలు, తొట్టెళ్లను కట్టారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి మేకలు, గొర్రెలు, కోళ్లు బలిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ చైర్మన్ పి.విష్ణువర్దన్‌రెడ్డి, ఈఓ టి.వెంకటకిషన్‌రావు, డైరెక్టర్లు, ఆలయ సిబ్బంది తదితరులు భక్తులకు తమతమ సేవలందించారు. ఏడుపాయల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పాపన్నపేట ఎస్సై సందీప్‌రెడ్డి, ఎఎస్సై మల్లేశం, పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.

యువకుడి అదృశ్యం
కౌడిపల్లి: యువకుడు అదృశ్యమైన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ముట్రాజ్‌పల్లి గ్రామానికి చెందిన అంకం బాలరాజ్ (19) వ్యవసాయం పనులు చేస్తుంటాడు. ఈ నెల 11న (శుక్రవారం) నాడు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. రాత్రి కావస్తున్నా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల వద్ద, తెలిసిన వారి వద్ద వెతికారు. అయినప్పటికి బాలరాజ్ అచూకి లభించలేదు. తండ్రి సాయిలు ఆదివారం నాడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశాడు. అదృశ్యం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ శ్రీనివాస్ తెలిపారు.

నల్లపోచమ్మకు ప్రత్యేక పూజలు
కౌడిపల్లి: మండల పరిధిలోని తునికి గ్రామశివారులో వెలిసిన నల్లపోచమ్మ తల్లికి ఆదివారం నాడు అర్చకులు ప్రత్యేక పూజ కార్యాక్రమాలు చేపట్టారు. శ్రావణ మాసం పురస్కరించుకొని అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగిగా తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ ప్రధాన పూజారి రాజేశ్వరశర్మ, శివ్వప్పలు తీర్థప్రసాదాలను అందజేశారు. మహిళలు అమ్మవారికి ఓడిబియ్యం పోసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోరికలు నేరవేరడంతో మహిళలు అమ్మవారికి బోనాలను సమర్పించారు. కోరికలు నేరవేరాలని భక్తులు ఆలయ ప్రాంగణంలో ముడుపులు కట్టారు. ఆలయ కార్యానిర్వాహణాధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది తగిన వసతులు కల్పించారు.
పారిశుద్ధ్య పనులు ముమ్మరం
కౌడిపల్లి. మండల కేంద్రమైన కౌడిపల్లిలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్రామ సర్పంచ్ బీసకాంత పురుషోత్తం ఆధ్వర్యంలో గ్రామంలోని వీధులలో గల మురుగు కాలువల్లో పేరుకపోయిన మురుగును తొలగిస్తున్నారు. గ్రామంలో పారిశుద్ద్య కార్యక్రమాలను ఎప్పటికప్పుడు చేపడుతున్నామని సర్పంచ్ బీసకాంత పురుషోత్తం తెలిపారు. వీధులలో ఎక్కడ కూడ చెత్తాచెదారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. చెత్తను తీసుకపోవడానికి చెత్తారిక్షాలు ప్రతి వీధికి ఉదయం వస్తున్నాయని, ప్రజలు చెత్తను రిక్షాలో వేసి గ్రామ పరిశుభ్రతకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

సెల్లార్ల కూల్చివేతలో పక్షపాత వైఖరి తగదు
* రూల్స్ ప్రకారం అన్నీ కూల్చేయాలి
* మాజీ కౌన్సిలర్ గంగారం
సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలో నిర్మించిన భవనాల సెల్లార్ల తొలగింపులో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు పక్షపాత వైఖరిగా వ్యవహరిస్తున్నారని మాజీ కౌన్సిలర్ గంగారం ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్ రోడ్డు లోని బల్దావా భవన్ వద్ద బాధితులతో కలసి మాట్లాడారు. గత కొద్దిరోజులుగా సిద్దిపేట పట్టణంలోని హైదరాబాద్, మెదక్, కరీంనగర్ దారుల్లో దశాబ్దకాలం పైన భవనాల్లో సెల్లార్లు నిర్మించుకొని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. సెల్లార్‌లలో షాపులు నిర్మించరాదని.. సెల్లార్లను పార్కింగ్‌కు వినియోగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులు చేపడుతున్న కూల్చీవేతల్లో పక్షపాత దోరణి అవలంభిస్తున్నారన్నారు. అధికార పార్టీ, అధికారుల అండదండలున్న సెల్లార్లు కూల్చకుండా కొందరి సెల్లార్లు మాత్రమే కూల్చేస్తున్నారని మండిపడ్డారు.
నిబంధనలు అంటే అందరికి ఒకే విధంగా ఉండాలి కాని ఒకరికి ఒక రకంగా, ఇంకొరికి ఒక రకంగా ఉండడమేమిటని ప్రశ్నించారు.
అక్రమ నిర్మాణాలు ఉంటే ముందుగా తెలియపరిచి నోటిసులు ఇచ్చిన తరువాత కూల్చీవేయాలి కాని ఇష్టం వచ్చినట్లు కూల్చడం సరికాదని బాధితులు పేర్కొన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు. మాకు న్యాయం జరుగకుంటే మున్సిపల్ కార్యాయలం ఎదుట నిరాహారదీక్షలు చేస్తామని హెచ్చరించారు.

అఖండ భారతాన్ని ఏకం చేద్దాం
* సరాఫ్ స్వరాజ్
రామాయంపేట: విడగొట్టిన భారత భూబాగాలను ఒక్కటి చేసి అఖండ భారతాన్ని నిర్మిద్దామని సరాఫ్ స్వరాజ్ అన్నారు. అఖండ భారత్ సంకల్ప దివాస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ అద్వర్యంలో ఆదివారం రాత్రి రామాయంపేట పట్టణంలో పురవీదుల గుండా కాగడాల ప్రదర్శన నిర్వహించి మహాంకాళి ఆలయంలో ముగించారు. ఈసందర్బంగా ముఖ్యఅథితిగా హాజరైన స్వరాజ్ మాట్లాడుతూ అఖండ భారత్ ఒకప్పుడు ప్రపంచానికి జగద్గురువుగా ఉండేదని నేడు అనేక భూభాగాలను కోల్పోవడం జరిగిందని తెలిపారు. తిరిగి ఇప్పుడు మనదేశంపై అనేక శక్తులు మళ్లీ దాడి చేయడానికి సిద్దంగా ఉన్న సమయంలో హిందువులు సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈకార్యక్రమంలో శ్రీనివాస్, పబ్బ సత్యనారాయణ, సంగమేశ్వర్, పుట్టి మల్లేశం, ప్రసాద్, నాగరాజు, సంతోష్, కనకయ్య, సాయి, వెంకట్, రవి, వినయ్, నర్సింలు, శివకుమార్‌ఉన్నారు.

15నుండి భక్తమార్కండేయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం
* వేడుకలకు ముస్తాబవుతున్న ఆలయం
రామాయంపేట: రామాయంపేట పద్మశాలి సంఘం అద్వర్యంలో పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీ్భక్తమార్కండేయ దేవాలయంలో ఈనెల 15నుండి 17వరకు మూడు రోజులు విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటి సభ్యులు తెలిపారు. ఆదివారం దేవాలయం వద్ద ప్రతిష్టా మహోత్సవ ఆహ్వాన పత్రికలు విడుదల చేసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. 15న మంగళవారం మొదటిరోజు ఉదయం 9గంటల నుండి విఘ్నేశ్వర పూజ, స్వస్తి పుణ్యాహవాచనము, అంకురార్పణ, ఋత్విక్‌గ్వరణము, మాతృక నాస్త్రంది కంకణదారణ, పంచగవ్యప్రాశన, గోపూజ, యాగశాల ప్రవేశం, అఖండ దీపాస్థాపనము, కలశస్థాపనము, వాస్తుపూజ, సర్వతోభద్ర మండపారాదన, దేవతాహవనములు, వేదపారాయణము (అగ్నిప్రతిష్ట దేవతాకుండ సంస్కారము (ప్రతిష్టాం)గ దేవతాహవనములు), మద్యాహ్నము తీర్థప్రసాద వితరణ, సాయంత్రం జలాదివాసము అధివాసాంగ హోమములు అవధారములు, రాత్రి తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు చేపట్టనున్నారు. మంగళవారం మద్యాహ్నం శ్రీ్భక్తమార్కండేయ, శివపార్వతులు, ఆంజనేయ, నవగ్రహా విగ్రహాలను ఊరేగింపుగా ఆలయానికి తరలిస్తారు. 16న బుదవారం శాంతి పాటము అవహిత దైవతా హవణములు, ప్రాత:కాల పూజా, నవగ్రహ మండపారాదన, వాస్తు యోగినీ క్షేత్రపాలక నవగ్రహ మండల దేవతా హవనములు దాన్యాదివాసము యంత్రములకు మహాభిషేకము, రుద్రహవనము, మద్యాహ్నం తీర్థప్రసాద వినియోగము, సాయంత్రం ఛండీ హవనం, శయ్యాదివాసము పుష్పదివాసము, ఫలాదివాసము, మహన్నపనము, ప్రాసాదన్యాసం, మంగళహారతి రాజోపచార పూజ, తీర్థప్రసాద వితరణ, 17న గురువారం శాంతిపాటము, ప్రాత:కాల పూజ జపాదులు, అధివాసాంగ హోమములు సర్వతోభద్ర దేవతా హవనములు గర్త సంస్కారము, బింబశుద్ది, తులా లగ్న పుష్కరాంశ సుమూహూర్తమున పుష్పగిరి పీఠాదిపతి శారద లక్ష్మీ నృసింహా పీఠము బేగంపేటకు చెందిన శ్రీశ్రీశ్రీ నృసింహా భారతి స్వామి చేతుల మీదుగా శివ పంచాయతన శ్రీ్భక్తమార్కండేయ శివపార్వతుల ఆంజనేయస్వామి, నవగ్రహములు ద్వజ శిఖర ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీశివపార్వతుల శాంతి కళ్యాణ మహోత్సవము, అమ్మవారికి ఓడిబియ్యం, మద్యాహ్నం చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉత్సవాలకు ముఖ్యఅథితులుగా ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి ఈనెల 15న రానున్నారు. ఈకార్యక్రమంలో సంఘం అద్యక్షులు మద్దెల సత్యనారాయణ, బొద్దుల రాజలింగం, బల్లయాదగిరి, మద్దెల రమేష్, కైరంకొండ తిరుపతి, వల్లకాటి బాల్‌రాజు, వల్లకాటి రాంచంద్రం, మోహన్, బల్ల సుదాకర్, బాసం శ్రీనివాస్, గోపి, రాము, నర్సింలు, క్రిష్ణతోపాటు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ చాముండేశ్వరీదేవికి ప్రత్యేక పూజలు
కౌడిపల్లి: చిలప్‌చెడ్ మండలం చిట్కుల్ గ్రామశివారులో మంజీరా నది తీరాన వెలసిన శ్రీ చాముండేశ్వరిదేవికి శ్రావణమాసం పురస్కరించుకొని ఆదివారం నాడు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రధాన పూజారి ప్రభాకరశర్మ అమ్మవారికి వేద మంత్రోచ్ఛరాణలతో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుండి భారీగా తరలివచ్చారు. చిలప్‌చెడ్, కౌడిపల్లి, అందోల్, పుల్కల్, పరిసరాల మండలాల నుండే కాకుండా జోగిపేట, పటాన్‌చెరు, సంగారెడ్డి పట్టణాలతో పాటు జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రబాద్ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఓడిబియ్యం పోసిన మహిళలు తమ మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోరికలు తీరాలని అమ్మప్రాంగణంలోభక్తులు ముడుపులు కట్టారు. నూతన వాహనాలకు పూజలు జరిపించుకున్నారు. శ్రీ చాముండేశ్వరిదేవి దర్శనం కోసం భక్తులు వరుస పద్దతిలో వచ్చి దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన పూజారి ప్రభాకరశర్మ భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీ చాముండేశ్వరిదేవి క్షేత్రము భక్తులతో కిటకిటలాడింది.
ఇ-పాస్ విధానంతో అక్రమాలకు అడ్డుకట్ట
* డిప్యూటీ తహశీల్దార్ చంద్రశేఖర్
చిన్నశంకరంపేట్: ఇ-పాస్ విధానంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని డిప్యూటి తహశీల్దార్ చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం చిన్నశంకరంపేట్‌లో ఇ-పాస్ విధానాన్ని డిటి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిటి మాట్లాడుతూ, లబ్దిదారులకు పారదర్శంకా సరఫరా చేసేందుకు ఈవిధంగా ఎంతోతోడ్పాటును అందిస్తుందన్నారు. రేషన్ డీలర్ల వద్దకు వచ్చిన లబ్దిదారులకు ఎలక్ట్రానిక్ తూకం ద్వారా సరకులను సక్రమంగా సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు. తూకంలో తేడాలు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇ-పాస్ విధానం ద్వారా రేషన్ కార్డులో ఉన్న సభ్యులు ఎవ్వరైన వచ్చి రేషన్ సరకులు తీసుకుని పోవచ్చని అన్నారు. అనంతరము స్థానిక సర్పంచ్ వసంతకుమార్‌గౌడ్ మాట్లాడుతూ, ఇ-పాస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎంతో మంచి పనిచేసిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఇలాంటి సౌకర్యాలను లబ్దిదారులు సధ్వినియోగం చేసుకుని సహకరించాల్సిందిగా కోరారు. ఈకార్యక్రమంలో రేషన్ డీలర్లు శంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి చిత్రం ఆవిష్కరణ
సిద్దిపేట టౌన్: శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో ఆదివారం కృష్ణాష్టమి చిత్రాన్ని తెలంగాణ చిత్రకారులు రుస్తు విడుద ల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పండుగలు సంస్కృతి మేలవింపులని, జన్మాష్టమి భారతజాతి జరుపుకునే గొప్ప పండుగల్లో ఇదోక్కటి అన్నారు. భగవద్గీతను ప్రపంచానికి అందించిన శ్రీకృష్ణుని జన్మదినమే జన్మాష్టమి పండుగ అందరి జీవితాల్లో ఆనందాలు ఐక మత్యానికి, బంగారు తెలంగాణకు బాట లు వేయాలనిఆకాంక్షించారు. కార్యక్రమంలో జులేఖరుస్తుం, నహీంరస్తుం పాల్గొన్నారు.

టిఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రప్రజల్లో అభద్రత
* తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి
సిద్దిపేట టౌన్: రాష్ట్రం ప్రజల్లో అభద్రతాభావం ఉందని, టిఆర్‌ఎస్ పరిపాలన విధానాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివారం నాడు సిద్దిపేట జిల్లా టిడిపి పార్టీ కార్యాలయం ప్రారంభించారు. పార్టీ వ్యస్థాపకులు ఎన్‌టిఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి టిడిపి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే బ్రతుకులు బాగుపడుతాయనుకున్న ప్రజల ఆశలు భంగపడ్డాయన్నారు. టిఆర్‌ఎస్ పరిపాలన విధానం అస్తవ్యస్తంగా సాగిస్తు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. విద్య, వైద్య, సంక్షేమ రంగాల అన్నిటిలో ద్వంద విధానంగా వ్యవహరించడం వల్ల ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నారన్నారు. టిడిపికి 35 ఏండ్ల చరిత్రలో 17 సంవత్సరాలు పరిపాలన సాగించిందన్నారు. 1982 మార్చి 22న స్థాపించ బడిన టిడిపి ప్రజాసంక్షేమానికి కృషి చేసిందన్నారు. ఎన్‌టిఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి చిరస్మరణీయులుగా ఉన్నారన్నారు. అభివృద్ధి అంటే టిడిపి, టిడిపి అంటే అభివృద్ధి అన్న విధంగా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు పర్చి ప్రజల్లో చైతన్యం తెచ్చిందన్నారు. నాటి కాంగ్రెస్ అధినేత ఇందిరాగాంధీ నుండి వైఎస్‌ఆర్, సోనియాగాంధీ ఇప్పుడు కెసిఆర్, జగన్‌లు చంద్రబాబుపైన కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. టిడిపి హయాంలోనే ఎస్‌ఆర్‌ఎస్, ఎల్‌ఎండి కాలువలకు 1600కోట్లు కేటాయించిందన్నారు. సిద్దిపేటకు మానేరు ద్వార మంచినీరు అందించింది కూడ టిడిపి ప్రభుత్వమే అని గుర్తుచేశారు. ప్రభుత్వ వ్యవహరించే ప్రజావ్యతిరేక తీరును ప్రశ్నించిన వారిపై టిఆర్‌ఎస్ గుండాలు దాడులకు పాల్పడడం దారుణమన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని సకలజనుల సమ్మెతో ఉద్ధృతం చేసిన కోదంకరామ్ పైన దాడులకు పాల్పడడం చరిత్రకే అపహాస్యం మన్నారు. ప్రభుత్వ వ్యవహారం, విధానాలు ప్రజలకు నచ్చడం లేదన్నారు. ప్రజలు సమయం కోసం వేచి చూస్తున్నారని, టిఆర్‌ఎస్‌కు సమయం దగ్గర పడిందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలచే భంగపాటు తప్పదని హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో టిఆర్‌ఎస్‌కు గత ఫలితాలే పునరావృతం అవుతాయని జోస్యం చెప్పారు. టిడిపి మాత్రం ఎప్పుడు ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రజల వెంటనే ఉంటుందన్నారు. జిల్లాలో అన్ని మండల, గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. త్వరలో సిద్దిపేట జిల్లాకేంద్రంలో 25వందల మోటర్ సైకిళ్లు 5వేల మందితో కలిసి ప్రజాసమస్యలు, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేయాలని డిమాండ్ చేస్తు నిరసన ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు ధరిపల్లి చంద్రం, ఇల్లెందుల రమేష్, మధుసూదన్‌రెడ్డి, తాటికొండ రమేష్, పట్టణ అధ్యక్షుడు ధరిపల్లిశ్రీను, నాయకులు భరత్, గౌస్‌మియా, మండల హరికిషన్, జయశ్రీ, రాజేశం, బాలరాజు పాల్గొన్నారు.

24 గంటల విద్యుత్‌కు నోచుకోని మండల రైతులు
మిరుదొడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలో వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ అందిస్తున్నప్పటికి మిరుదొడ్డి మండల రైతులకు అందించడంలో అధికారులు ఆశ్రద్ద వహిస్తున్నారని చెప్పవచ్చు. మండల కేంద్రంలో సబ్‌స్టెషన్ వున్నప్పటికి వ్యవసాయానికి విద్యుత్ అందించకపోవడం శోచనీయమని రైతులు పెర్కొంటున్నారు. మిరుదొడ్డి మండలంలో 8 సబ్‌స్టెషన్లు వుండగా 4 సబ్‌స్టేషన్లు మాత్రమే 24 గంటల విద్యుత్‌ను అందిస్తుండగా మిగతావి అందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విద్యుత్ అధికారులు మాత్రము నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరిస్తున్నారని పెర్కొంటున్నారు. విద్యుత్ బిల్లులు వసూలు చేసినట్లు విద్యుత్ అందించడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. కాసులాబాద్, కొండాపూర్, రుద్రారం, చెప్యాల సబ్‌స్టేషన్ల పరిధిలోగల గ్రామాలకు మాత్రము 24 గంటలు విద్యుత్‌ను అందిస్తున్నారు. మిగిత మిరుదొడ్డి, జంగాపల్లి, భూంపల్లి, ఖాజీపూర్ సబ్‌స్టేషన్ల పరిధిలోగల గ్రామాలకు మాత్రలు 12 గంటలు విద్యుత్ అందిస్తున్నారు. రైతు బిడ్డ అని చెపుకుంటున్న రాష్ట్ర అంచనాల కమిటి చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రాంలింగారెడ్డి రైతుల సమస్యలను పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నేటి వరకు విద్యుత్‌ను అందించడంలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి విద్యుత్‌ను అందించేందుకు చర్యలు తీసుకొవాలని కోరుతున్నారు.

పుణ్యక్షేత్రాల్లో శ్రావణ శోభ
* వర్గల్, నాచగిరి క్షేత్రాలకు తరలి వచ్చిన భక్తులు

గజ్వేల్: సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా వెలుగొందుతున్న నాచగిరి శ్రీ లక్ష్మి నృసింహ క్షేత్రం, వర్గల్ శ్రీ విద్యాధరి ఆలయాల్లో ఆదివారం శ్రావణ శోభ సంతరించుకుంది. నాచగిరి క్షేత్రంలో శ్రావణమాస పర్వదినాలను పురస్కరించుకొని నాచగిరి శ్రీ లక్ష్మి నృసింహ క్షేత్రంలో వందలాది శ్రీ సత్యదేవుడి వ్రతాలను భక్తులు నిర్వహించుకోవడం తోపాటు మొక్కులు చెల్లించుకున్నారు. కాగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుదాకర్‌రెడ్డి ఆద్వర్యంలో ఏర్పాట్లు చేయగా, విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదాలతోపాటు మహాప్రసాదం అందజేశారు. అలాగే వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రానికి భక్తులు పోటెత్తగా, అమ్మవారి నామస్మరణతో శంభూగిరులు మార్మోగాయి. తమ చిన్నారులకు భక్తులు అక్షర స్వీకారాలు చేసుకోగా, శ్రీ విద్యాధరి క్షేత్రంతోపాటు శ్రీ లక్ష్మి గణపతి ఆలయం, శ్రీ శనైశ్చరాలయం, శ్రీ స్వయంబు శంభులింగేశ్వర క్షేత్రాలను భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమాలలో వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్ర వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్దాంతి, నాచగిరి ఆలయ పాలక మండలి చైర్మెన్ కొట్టాల యాదగిరి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికై పోరాటం
* టీ మాస్ ఫోరం ఆవిర్బవ సభలో తమ్మినేని వీరభద్రం
సంగారెడ్డి టౌన్: తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం టీ మాస్ ఫోరమ్ పోరాడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నూతన రాష్ట్రంలో తమ బతుకులు బాగుపడుతాయని ఆశపడ్డ ప్రజలకు నిరాశే మిగిలిందని, తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడ్డప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.
ఆదివారం సంగారెడ్డిలోని బాలాజీ గార్డెన్‌లో నిర్వహించిన టీ మాస్ ఫోరమ్ ఆవిర్భావ సభకు తమ్మినేని వీరభద్రంతో పాటు ప్రజా గాయకుడు గద్దర్ ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ విద్య, వైద్యం, ఇల్లు, భూమి ఉంటే మనిషి బాగుపడినట్లేనని, ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తే బాగుటుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం బాగుపడటం ఏమో గానీ ఉన్న పాఠశాలలను మూసివేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దళితులకు 3ఎకరాల భూ పంపిణీ చేస్తామన్న హామిని విస్మరించారని, ఇది భూమి ఇచ్చే ప్రభుత్వం కాదని, రైతుల నుండి భూములు లాక్కునే ప్రభుత్వమని విమర్శించారు. ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయే రైతు సంతోష పడే విధంగా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తూనే కోర్టులు కోట్టేసే చర్యలకు ఈ ప్రభుత్వం పాల్పడుతుందన్నారు. ఇచ్చిన హామిలపై ప్రశ్నిస్తే అణగదొక్కాలనుకోవడం అవివేకమన్నారు. దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, పెత్తందార్ల పాలనకు స్వస్తి పలకాలని హితువు పలికారు. కేసిఆర్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, కుటుంబ పాలనను టీ మాస్ ఫోరమ్ వ్యతిరేకిస్తుందని, బతుకు తెలంగాణ కోసం, ప్రజాస్వామ్య, సామాజిక తెలంగాణ కోసం ఫోరమ్ పోరాడుతుందన్నారు.
బడుగు,బలహిన వర్గాల సమస్యల పరిష్కారామే ఫోరం లక్ష్యమన్నారు.ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ నూతన రాష్ట్రం ఏర్పడినప్పటికీ ప్రజల బ్రతుకులు మాత్రం మారలేదన్నారు.
క్యాబినేట్ మంత్రి వర్గంలో ఒక్క మహిళకు కూడా స్థానం కల్పించకపోవడం బాధకరమని, మహిళలకు గౌరవం దక్కినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్లన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే సిద్దాంతాలతో టీ మాస్ ఫోరం ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ సాయుద పోరాటం, రాజుల పరిపాలన, ప్రస్తుత ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై పాట, నాటక రూపంలో ప్రజలకు వివరించారు.
281 ప్రజా,సామాజిక సంఘాలతో టీ మాస్ ఫోరమ్ ఏర్పడటం అభినందనీయమన్నారు. వివిధ కుల, ప్రజా సంఘాల నాయకులు సభను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ విశే్వశ్వర్, బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు బీరయ్య యాదవ్, వివిధ సంఘాల నాయకులు అనంతయ్య, రాజు, మల్లేశం, రాజయ్య, సాయిలు, మానిక్యం, మల్లికార్జున్, మల్లీశ్వరితో పాటు అన్ని కుల సంఘాల ప్రజలు పాల్గొన్నారు.