రివ్యూ

ఎంత చేసినా.. అంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** ఫర్వాలేదు ** జయ జానకి నాయక
తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రగ్యా జైశ్వాల్, కేథరిన్ ధ్రెసా, సుమన్, జగపతిబాబు, శరత్‌కుమార్, వాణీ విశ్వనాథ్, తదితరులు
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: రిషి పంజాబీ
నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి
రచన, దర్శకత్వం: బోయపాటి శీను

కంటెంట్ ఏదైనా -కీమాకొట్టి మసాలా పెట్టడంలో దర్శకుడు బోయపాటిది ఓ స్టయిల్. పండగలాంటి కథనిచ్చినా -్ఫక్తు యాక్షన్ ఎపిసోడ్స్‌తోనే సినిమా చూపించటం బోయపాటికి బాగా అలవాటు. భద్రం నుంచి సరైనోడు వరకు ఆయన సినిమాల్లో అదే కనిపిస్తుంది. అయితే, అప్పుడప్పుడు సాఫ్ట్ టైటిల్స్‌తో స్ట్రాంగ్ కథను చూపించే ప్రయత్నమూ చేస్తుంటాడు. గతంలో ‘తులసి’, ఇప్పుడు ‘జయ జానకి నాయక’ని ప్రస్తావించాలి. -యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం కామన్. శీను సినిమాలకు అనూహ్య పోరాటాలే సెంటర్ స్టార్ కనుక -కుర్ర హీరో బెల్లంకొడ సాయి శ్రీనివాస్‌తోనూ ‘చుక్కలు’ చూపించే ప్రయత్నం చేశాడు. స్క్రీన్ మీదకు ప్రేమ కథనే ఎక్కించినా, దానికి ముందు వెనుక -పరువు, పవర్ గేమ్‌ను డిజైన్ చేసి చూపించిన చిత్రమే ‘జయ జానకి నాయక’.
కుటుంబాన్ని అమితంగా ప్రేమించే కుర్రాడు గగన్ (బెల్లంకొండ శ్రీనివాస్). నాన్న చక్రవర్తి (శరత్‌కుమార్), అన్నయ్య (నందు) అంటే ప్రాణం. కాలేజీలో ఓ ఆకతాయి ప్రవర్తనను అడ్డుకున్న సందర్భంలో గగన్‌కు స్వీటీ (రకుల్ ప్రీత్‌సింగ్) పరిచయమవుతుంది. సహజంగానే ప్రేమ పుట్టుకొస్తుంది. ట్రాక్‌మీద హాయిగా సాగిపోతున్న స్వీటీ లైఫ్‌లో -అనూహ్య సంఘటన ఎదురవుతుంది. డైమండ్ రింగ్ రోడ్డు కాంట్రాక్ట్ కోసం రెండు వర్గాల మధ్య తలెత్తిన ‘పవర్-పరువు’ గేమ్‌లో స్వీటీ ఇరుక్కోవడంతో కథ మలుపు తిరుగుతుంది. చిక్కుల్లో పడిన స్వీటీని రక్షించడానికి హీరో గగన్ ఏం చేశాడు. అతని కుటుంబం ఎలా సహకరించింది? పరువు కోసం కూతురి ఆత్మహత్యకు, కాబోయే అల్లుడి చావుకు కారణమైన అశ్వింత్ నారాయణ వర్మ (జగపతిబాబు)కి స్వీటీకి సంబంధమేమిటి? తదితర విషయాలు తెరమీద చూస్తాం.
నిజానికి ఇదో రొటీన్ లవ్ స్టోరీ. హీరోయిన్ ప్రేమ, హీరో సాహసాలు, విలన్స్‌పై పోరాటాలు.. -తెలుగు సినిమాకు బాగా అలవాటైపోయిన ఇతివృత్తమే. రొటీన్ స్టోరీ చుట్టూ తన మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేసుకోవడమే ఇక్కడ దర్శకుడు బోయపాటి చేసిన పని. కుటుంబ కథ చుట్టూ యాక్షన్, మసాలా దట్టించినట్టే -ప్రేమ చుట్టూ అదే తరహా బిగువైన యాక్షన్‌ను డిజైన్ చేసుకున్నాడు. బలమైన ఎమోషన్ డ్రైవ్‌తో సినిమా మొదలెట్టి, సందర్భోచితమైన లీడ్ సన్నివేశాలతో భారీ పోరాట దృశ్యాల్ని చూపించటం వినా -సినిమాను ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఇంకేమీ లేదు. హంసలదీవిలో డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్‌తో -మాస్ ఆడియన్స్ సంతృప్తిపడిపోతారు. పరువు, పంతం నడుమ ప్రేమ ఎలా నలిగిపోతుందన్న విషయాన్ని ఉత్తరాదిలోని కొన్ని ఘటనలు దృష్టిలో పెట్టుకునే బోయపాటి రాసుకున్నట్టు అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ కంటే, విలన్ల నడుమ ‘ఇగో’లకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో -బోయపాటి నుంచి కొత్తగా ఆశించిందేదీ సినిమాలో కనిపించదు. హీరోని ఎలివేట్ చేయడానికి దర్శకుడు బోయపాటి చేసిన కృషి ఫలించలేదు. ఫైట్లు ఫైట్లు ఫైట్లులా సాగిపోయే సినిమాలో -క్రీనీడలా కనిపించే కొన్ని భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుడికి కొంత ఊరటనిస్తాయి.
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు మూడో సినిమా. గత రెండు చిత్రాల్లోనూ ‘ఓవర్‌నైట్ స్టార్’ ప్రయత్నాలే చేసి విఫలమైన శ్రీనివాస్, ఇప్పుడు బోయపాటితోనూ అదే ప్రయత్నం చేశాడు. తనవరకూ పడిన కష్టం ఈసారి స్క్రీన్‌మీద కనిపించింది. యాక్షన్ హీరో క్రేజ్ కోసం చేసిన పోరాటాలు, డ్యాన్స్‌ల్లో అలరించినా, ఎమోషనల్ డ్రామాకు వచ్చేసరికి అతని కృషి సరిపోలేదు. క్లైమాక్స్‌లో భావోద్వేగ సంభాషణలు పలకాల్సి వచ్చినపుడు ఆ తేలికతనం కనిపిస్తుంది.
తొలిసగం గ్లామర్‌తో అలరించిన రకుల్, ద్వితీయార్థంలో కష్టాల్లో పడిన ఆడపిల్లగా పరిణత నటన ప్రదర్శించింది. రెండు కోణాల్లో తన పాత్ర ప్రాధాన్యతను చూపించగలిగింది. జగపతిబాబు మరింత స్టైలిష్‌గా ఆకట్టుకుంటే, శరత్‌కుమార్ కనిపించే సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. నందు తన పాత్రకు న్యాయం చేస్తే, చాలాకాలం తరువాత తెరపై కనిపించిన వాణీ విశ్వనాథ్ ఆకట్టుకునే ఆహార్యంతోనే ఉన్నా, పాత్రకు మాత్రం ప్రాధాన్యత లేదు. పాత్రోచితంగా ప్రగ్యా ప్రదర్శనకు పెట్టిన అందాలు, అవసరం లేకుండానే ఇరికించినట్టున్న కేథరిన్ ఐటెమ్ నృత్యాలు -మాస్ ఆడియన్స్‌కి ఒకింత రిలాక్సేషన్. అడుగడుగునా భారీతనం, వామ్మో అనిపించే నిర్మాణ విలువలు సినిమాలో దండిగా కనిపిస్తాయి. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు, నేపథ్య సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకునేంత లేదు. రిషీ పంజాబీ కెమెరా ప్రధాన ఆకర్షణ. కథ, కథనాల్లో మలుపుల్ని మర్చిపోయి యాక్షన్ ఆటిట్యూడ్‌తో డిజైన్ చేసిన పక్కా బోయపాటి సినిమా -జయ జానకి నాయక.

-ప్రవవి