నిజామాబాద్

ప్రత్యామ్నాయ పంటలే శరణ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: గతేడాది అనుకూలించిన వాతావరణ పరిస్థితులు, ఈసారి మాత్రం ఇందూరు రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రస్తుత వర్షాకాలం సీజన్‌లో ఆగస్టు రెండవ వారం గడిచినప్పటికీ ఒక మోస్తారు వానలే తప్ప, ఆశించిన స్థాయిలో భారీ వర్షాల జాడ లేకపోవడం సేద్యపు రంగాన్ని సంక్షోభం కోరల్లో చిక్కుకునేలా చేస్తోంది. ఎన్నో ఆశలు, అంచనాలతో పంటల సాగుకు ముందుకు వచ్చిన జిల్లా రైతాంగంతో ప్రకృతి దోబూచులాడుతుండడం వారిని తీవ్రంగా కలవరపెడుతోంది. వాయుగుండం, అల్పపీడనం ప్రభావాలతో అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా చెదురుముదురు వర్షాలు కురియడం తప్ప, ఇంతవరకు భారీ వర్షాల జాడే లేకుండాపోయింది. దీంతో జిల్లాలో సాధారణ వర్షంతో పోలిస్తే మొత్తానికి మొత్తంగా 27మండలాల్లోనూ లోటు వర్షపాతం నెలకొని ఉంది. రాష్ట్రంలోనే అత్యధిక లోటు వర్షపాతం నెలకొన్న ప్రాంతాల్లో నిజామాబాద్ జిల్లా ముందు వరుసలో ఉందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో ఊహించుకోవచ్చు. ప్రధానంగా జిల్లాకు ఆయువుపట్టులా నిలుస్తున్న నిజాంసాగర్ రిజర్వాయర్‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోయి ఆయకట్టు రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. సుమారు లక్షన్నర ఎకరాల ఆయకట్టుకు భరోసాను అందించే నిజాంసాగర్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం కేవలం 1.20టిఎంసిల నీటి నిల్వలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవి కనీసం నిజామాబాద్, బోధన్ పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను సైతం తీర్చడం గగనకుసుమంగా మారింది. దీనికి ఎగువన గల సింగూరు జలాశయం 18టిఎంసిల నీటి నిల్వలతో నిండుగా కళకళలాడుతున్నప్పటికీ, సింగూరు జలాలను విడుదల చేసే విషయంలో ఎనలేని తాత్సారం చేస్తున్నారు. ఆయకట్టు రైతులు గత నెలన్నర రోజుల నుండి రోడ్డెక్కి ఎక్కడికక్కడ ఆందోళనలు నిర్వహిస్తున్నా, ప్రభుత్వం నుండి స్పందన శూన్యంగానే ఉంటోంది. జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై ఒత్తిడి పెరుగుతున్న దరిమిలా, తాత్కాలిక ఊరడింపు వచనాలతో రైతాంగాన్ని సంతృప్తిపర్చే ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప, నీటి విడుదలపై స్పష్టతను మాత్రం అందించలేకపోతున్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే సింగూరు నీటిని విడుదల చేయించుకున్నామని, ఇప్పుడు కూడా రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం వాటిల్లకుండా చూస్తామని, వారి కోసం ఏం చేయాలో మాకు ప్రతిపక్షాలు చెప్పాల్సిన పని లేదంటూ సోమవారం బీర్కూర్, రుద్రూర్ మండలాల్లో పర్యటించిన సందర్భంగా పేర్కొనడం జరిగింది. మరోవైపు ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ రిజర్వాయర్ కూడా కేవలం 8టిఎంసిల నీటి నిల్వలతో పూర్తిగా బోసిపోయి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఖరీఫ్ సాగు దిశగా ముందుకు సాగడం తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఈసారి పెద్దఎత్తున వరి పంటను సాగు చేస్తారని అంచనా వేసినా, ఇప్పటివరకు కేవలం 40శాతం విస్తీర్ణంలో మాత్రమే వరి నాట్లు వేశారు. అది కూడా బోరుబావులు కలిగి ఉన్న రైతులు వరినాట్లకు సాహసించగా, వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తీవ్ర వర్షాభావం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతుండడంతో బోరుబావుల్లో నీరు తగ్గిపోతోందని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఈసారి దాదాపు 5 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని అంచనా వేయగా, అందులో అత్యధికంగా వరి పంటను 3లక్షల ఎకరాల్లో పండిస్తారని వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఖరీఫ్‌లో వరి సాగు సాధారణ విస్తీర్ణం లక్షా 80వేల ఎకరాలు కాగా, ప్రకృతి అనుకూలిస్తుందనే నమ్మకంతో అనేక మంది రైతులు వరి సాగుకు ఆసక్తి కనబర్చారు. అయితే అడపాదడపా చిన్నపాటి చినుకులు, ఓ మోస్తారు వర్షాలతోనే వరుణుడు సరిపెట్టుకుంటుండడం వల్ల ప్రస్తుతం డోలాయమాన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వరి పంట వేస్తే మునుముందు కూడా ఇదే తరహా పరిస్థితులు నెలకొని ఉంటే తాము పెద్దఎత్తున పెట్టుబడులు కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఫలితంగా వరినారు ముదురుతున్నప్పటికీ, నాట్లకు మాత్రం ఇంకనూ వేచిచూసే ధోరణినే అవలంభిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో వరినాట్లు లక్ష ఎకరాల విస్తీర్ణాన్ని సైతం దాటలేకపోయాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో ఊహించుకోవచ్చు. వరి పంట సాగు యోచనను రైతులు విరమించుకుంటే జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తుగానే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక(కాంటింజెన్సీ ప్లాన్) సిద్ధం చేసే పనిలో నిమగ్నమవుతున్నారు. ఈ నెలాఖరు వరకు వర్షాభావ పరిస్థితులు ఇదే తరహాలో ఉంటే, ప్రత్యామ్నాయ ప్రణాళికను అమలు చేయడం ఖాయమని తెలుస్తోంది.

కెసిఆర్ చేస్తే రైట్...మేము చేస్తే తప్పా
నాడు జిఎస్టీ భేష్ అన్నారు...నేడు వ్యతిరేకిస్తున్నారు
సిఎంపై ధ్వజమెత్తిన శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ

ఆంధ్రభూమి బ్యూరో
కామారెడ్డి: సిఎం కెసిఆర్ ఏది చేసిన వారికి అది రైట్ అదే మేము చేస్తే అది ఆయనకు తప్పుగా కన్పిస్తుందా అని శాసనమండలి ప్రతిపక్ష నేత మహ్మద్‌షబ్బీర్‌అలీ సిఎం తీరుపై ధ్వజమెత్తారు. సోమవారం కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ధర్నాచౌక్ తరిలింపుపై షబ్బీర్‌అలీ మండిపడుతూ ఈవిషయాన్ని విపక్షాలు అందరు కలిసి రాష్టప్రతి దృష్టికి తీసుకు వెళతామని అన్నారు. ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో జరుగుతున్న వాటి విషయంలో కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర పార్టీలకు చెందిన నాయకులు, లేదా కార్యకర్తలు న్యాయం కోసం కోర్టుకు వెళితే, అది మొత్తం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని, ప్రాజెక్ట్‌లను అడ్డుకుంటుందంటూ తప్పుడు సాంకేతాలను ప్రజల్లోకి సిఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకు పోయే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జిఎస్టీ అమలు అయ్యేముందు జిఎస్టీ వల్ల లాభం అంటూ ప్రకటనలు ఇచ్చిన సిఎం ఇప్పుడు ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో జిఎస్టీ వల్ల కోట్లాది రూపాయలు నష్టం వస్తుందంటూ జిఎస్టీకి వ్యతిరేకంగా అవసరం అయితే ఆందోళన చేస్తాం, కోర్టుకు వెళ్తాం అంటున్నారని అన్నారు. ఇదేక్కడి న్యాయం అని ప్రశ్నిస్తూ, ఆనాడు సిఎంకు జిఎస్టీ వల్ల కలిగే నష్టాలు తెలియలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పుడు విధానాలను వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు చేసేందుకు ప్రయత్నిస్తే, ముందస్తుగానే తెల్లవారేలోగా పోలీసులు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌లలో పెడ్తున్నారని అన్నారు. ఒకవైపు ఇసుకమాఫియా, మరో వైపు టిఆర్‌ఎస్ నాయకులు గుండాలుగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం అన్నారు. కామారెడ్డిలో అన్ని అనుమతులతో అమరవీరుల స్పూర్తియాత్ర నిర్వహిస్తున్న తెలంగాణ జెఎసి చైర్మెన్ కోదండరామ్ అరెస్ట్ చేయడాన్ని, విద్యార్థినాయకులపై జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పోలీసుల ప్రేక్షక పాత్ర న్యాయ అన్యాయాల విచారణ లేకుండా పోలీసులు అధికార పార్టీక దాసోహం అంటూ ప్రవర్తించడం ఏమిటని అన్నారు. ఇలా అయితే పోలీసువ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతోందని, అధికార పార్టీకి పోలీసలు పూర్తిగా దాసోహం కాకుండా, న్యాయ అన్యాయాలను చూసి, న్యాయం కోసం పోలీసులు పనిచేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆయన పత్రికముఖంగా కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి సిఎం దివంగత నేత డాక్టర్. వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్ట్‌ను మంజూరు చేశారని, ఈ ప్రాజెక్ట్‌కు సంబందించిన 22వ ప్యాకేజీ విషయంలో అధికారంలో వచ్చిన తెలంగాణ ప్రభుత్వం మూడేళ్ల పాటు రైతులకు సాగునీరు అందకుండా చేసిందని ఆరోపించారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కొందరు ఏలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుండానే 22వ ప్యాకేజీ విషయంలో గందరగోళం సృష్టించి, సిఎంను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. చివరకు కాంగ్రెస్ హాయంలో చేసిన పాతప్రతిపాదననే టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఒకే చేసిందన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ విజయం అని అన్నారు. మల్లన్నసాగర్ నుండి రివర్స్‌లో నీరు తెచ్చేందుకు ఈ ప్రాజెక్ట్ డిజైన్ మార్చి అనవసరంగా మూడేళ్ల కాలయాపన చేసి రైతులకు నష్టం చేకూర్చారని అన్నారు. ప్రాజెక్ట్‌లు కడ్తామంటూ ఇప్పుడు 73వేల కోట్ల రూపాయల అప్పులో తెలంగాణ రాష్ట్రం కూరుకుపోయి ఉందన్నారు. కాంగ్రెస్ హాయంలో కేంద్ర సహాకారంతో ఎంతో ప్రణాళిక ప్రకారం రైతుల సంక్షేమం కోసం ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేశామని, ప్రభుత్వం ఖాజానా ఇలా ఖాళీ చేయలేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థుల దుస్థితి మరి ఘోరంగా మారిందన్నారు. విద్యార్థులకు ఫీజురియంబర్స్‌మెంట్‌లేదు, ఉద్యోగాలు లేవు, ఆనాడు ఉద్యమంలో విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేశామని అన్నారు. కాని ఇంకా కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటిల్లోని దాదాపు 200మంది ఉద్యమ విద్యార్థులపై కేసులు అలాగే ఉన్నాయని అన్నారు. జిల్లాలో చీటికి మాటికి 144సెక్షన్, 30యాక్ట్ అమలు చేస్తూ, ఏలాంటి ఉద్యమాలు లేకుండా కెసిఆర్ సర్కార్ చూస్తోందని అన్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని మండిపడ్డారు. సిఎం కెసిఆర్ బంగారు తెలంగాణ కోసం కాదు, బంగారు కుటుంబం కోసం కృషి చేస్తున్నారని ఆరోపించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా కుటుంబ పాలనకే పరిమితం అయ్యారని, ఒకప్పుడు ఎంపి కవితకు, కెటిఆర్‌కు ఉన్న ఆస్తులు ఏమిటి, ఇప్పుడు ఉన్న ఆస్తులు ఏమిటని, అవన్ని ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు. ఒకప్పుడు కవిత ఒక చిన్న ఇంట్లో ఉండేవారని ఇప్పుడు ఉన్న బంగ్లాలు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ సర్కార్‌లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు సంపాదిస్తున్న ఆస్తులను ప్రజలందరు గమనిస్తున్నారని, కొందరు ఎమ్మెల్యేలు మున్సిపాలిటీ, స్థలాలు కొట్టేస్తూ బంగ్లాలు కట్టుకుంటున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో టిఆర్‌ఎస్‌కు ప్రజలు తగిన బుద్దిచెప్పే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో మాజీ డిసిసిబి చైర్మెన్ ఎడ్ల రాజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు జాజాల సురేందర్, నల్లవెల్లిఅశోక్, మామిండ్ల అంజయ్య, ఎంజి.వేణుగోపాల్‌గౌడ్, గంగాధర్, పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

పంద్రాగస్టు వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబు
వినాయక్‌నగర్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జిల్లా అధికార యంత్రాంగం తరఫున అట్టహాసంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ వేడుకలకు వేదికగా నిలువనున్న పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను అందంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే కలెక్టర్ డాక్టర్ యోగితారాణా స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. పతాకావిష్కరణ సందర్భంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని, వేడుకలను తిలకించేందుకు హాజరయ్యే సందర్శకుల కోసం పరేడ్ గ్రౌండ్‌లో షామియానాలు, కుర్చీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం నాటికే టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేస్తూ, పరేడ్ గ్రౌండ్ మైదానాన్ని చదును చేసి పంద్రాగస్టు పండగ కోసం అన్ని విధాలుగా సిద్ధం చేశారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలతో పాటు వివిధ శాఖల ప్రగతిని తెలియజేస్తూ జిల్లా నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ సభలో ప్రసంగించనున్నారు. వివిధ శాఖల్లో సమర్ధవంతంగా విధులు నిర్వర్తిస్తూ ఉత్తమ సేవలందిస్తున్న ఉద్యోగులను మంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను బహూకరించనున్నారు. ఆయా శాఖల ప్రగతిని తెలుపుతూ హౌసింగ్, డ్వామా, వ్యవసాయ, పశు సంవర్ధక తదితర శాఖల శకటాలను ప్రదర్శించనున్నారు. అన్నింటికి మించి పంద్రాగస్టు వేడుకలకు వారం రోజుల ముందు నుండే చిన్నారుల హడావుడి నెలకొంది. స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను పురస్కరించుకుని దేశభక్తిని పెంపొందించే రీతిలో సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమాల పట్ల ఆహుతుల నుండి సైతం చక్కటి స్పందన లభిస్తుండడంతో జిల్లా యంత్రాంగం సాంస్కృతిక ప్రదర్శనలకు ప్రాధాన్యతనిస్తోంది. దీంతో పరేడ్‌గ్రౌండ్‌లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎంపికైన ఆయా పాఠశాలలకు చెందిన చిన్నారులు గత రెండుమూడు రోజుల నుండి ఉదయం, సాయంత్రం వేళల్లో పరేడ్‌గ్రౌండ్ మైదానానికి హాజరవుతూ రిహార్సల్స్ కొనసాగిస్తున్నారు. రంగురంగుల దుస్తుల్లో ఆకర్షణీయమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. ఎలాంటి బిడియం, సంకోచం లేకుండా స్వేచ్ఛగా తమ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించాలనే తపనతో పదుల సంఖ్యలో విద్యార్థిని, విద్యార్థులు ఎంతో ఏకాగ్రతతో రిహార్సల్స్‌లో నిమగ్నమవడం కనిపించింది. ఇదిలాఉండగా, మంత్రి పోచారంతోతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కలెక్టర్, జిల్లా స్థాయి అధికారులు, పుర ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సంఘ విద్రోహ, విచ్ఛిన్నకర శక్తుల నుండి ప్రమాదం పొంచి ఉందంటూ ఇంటలిజెన్స్ వర్గాలు చేసిన హెచ్చరికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పరేడ్‌గ్రౌంట్ చుట్టూ ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. ప్రధాన ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసి, ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన మీదటే లోనికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలాఉండగా, త్రివర్ణ పతాకాలు, మువ్వనె్నల జెండాలను సమకూర్చుకునేందుకు చిన్నారులు, ఆయా విద్యా సంస్థలు, వివిధ సంఘాల వారు బుక్‌స్టాళ్లు, జనరల్ స్టోర్ల వద్ద బారులుతీరారు.

సిఎం కెసిఆర్ బాటలో మంత్రి పోచారం
తెల్లవారు జామున 4గంటల ముహుర్తానికి శంకుస్థాపనలు...ప్రారంభోత్సవాలు

ఆంధ్రభూమి బ్యూరో
కామారెడ్డి: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభోత్సవాలు, నూతన నిర్మాణాలకు శాస్త్రోపేతంగా సమయాన్ని పాటిస్తున్న విషయం తెల్సిందే. ఇదే కోవలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు. సోమవారం మంత్రి తన సొంత నియోజక వర్గంలోని కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలో 60డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణం కోసం తెల్లవారు జామున 4గంటలకు బ్రహ్మముహూర్తం నిర్ణయించి, ఆ సమయం కంటే ముందుగానే ఆ గ్రామానికి చేరుకున్న మంత్రి 4గంటలకు డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు. అనంతరము 13లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరము మంత్రి మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో పాలన మెరుగు పర్చిందుకు తమవంతు కృషి చేస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కనీస సౌకర్యాలైన విద్య, విద్యుత్, వైద్యం, తాగునీరు, సాగునీరు అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గర్భిణులకు 12వేల రూపాయలతో పాటు పుట్టిన బిడ్డకు కెసిఆర్ కిట్ అందిస్తున్నామని, అలాగే బతుకమ్మ పండుగకు అర్హులైన వారికి చేనేత చీరలు, కుల వృత్తుల వారికి గొర్రెల పంపిణీ, ఆదునీక క్షౌరశాలలు ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ఏ రాష్ట్రంలో కూడా లేని పథకం మన రాష్ట్రంలో రైతుకు ఎకరాకు నాల్గు వేల రూపాయల చొప్పున మే నెల నుండి రైతు అకౌంట్‌లలో వేయడం జరుగుతోందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీకి వెలితే అందరు ఆశ్చర్యంతో ఈ పథకం ప్రకటనను స్వాగతించి సిఎంను అభినందించారని అన్నారు. ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు కేవలం సిఎం కెసిఆర్ వల్లనే సాధ్యం అవుతున్నాయని అన్నారు. ఈకార్యక్రమంలో దుర్కి గ్రామ సర్పంచ్ మోహన్, ఆర్డీఓ రాజేశ్వర్‌తో పాటు పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

ఇద్దరు బైక్ దొంగల అరెస్టు
24వాహనాలు స్వాధీనం
వినాయక్‌నగర్: కంటికి ఇంపుగా కనిపించే మోటార్ సైకిళ్లను క్షణాల్లో తస్కరించి పారిపోవడం అలవాటుగా మార్చుకున్న ఇద్దరు కరడు గట్టిన దొంగలను నిజామాబాద్ నగర పోలీసులు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుండి 9.60లక్షల విలువ చేసే సుమారు 24ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిజామాబాద్ ఎసిపి ఆనంద్‌కుమార్ పట్టుబడ్డ దొంగల వివరాలను వెల్లడించారు. నిజామాబాద్‌కు ఆనుకుని ఉండే మహారాష్టల్రోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకా కొండల్‌వాడి గ్రామానికి చెందిన పి.వికాస్ అలియాస్ పి.లాలు కొంతకాలం నుండి నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో తాత్కాలికంగా నివాసం ఉంటూ భవన నిర్మాణ పనులు చేసేవాడు. ఈ క్రమంలోనే తానూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ ఫహీమ్‌ఖాన్‌తో అతనికి పరిచయం ఏర్పడింది. వీరిరువురు కలిసి దొంగదారిలో సులభంగా డబ్బులు సంపాదించేందుకు బైక్‌లను చోరీ చేయాలని పథకం రూపొందించుకున్నారు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగి తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టారు. ముందుగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుని ఆయా ప్రాంతాల్లో పార్కింగ్ చేసి ఉంచిన మోటార్ బైక్‌లను పరిశీలించి కొత్తగా కనిపించిన వాటిని తస్కరించి క్షణాల్లో తెరమరుగు అయ్యారు. ఇలా కేవలం రెండుమూడు మాసాల వ్యవధిలోపే ఒక్క నిజామాబాద్ వన్‌టౌన్ పరిధిలోనే డజను బైక్‌లను చోరీ చేశారు. త్రీటౌన్, ఫోర్త్ టౌన్, ఆర్మూర్ పిఎస్‌ల పరిధిలో కూడా వీరి చోరీల పరంపర అప్రతిహతంగా కొనసాగింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోనూ ఆరు బైక్‌లను అపహరించుకుపోయారు. ఇలా అపహరించిన వాహనాలను విడి భాగాలుగా చేసి విక్రయించేవారని పోలీసుల విచారణలో తేలింది. పక్కా సమాచారం మేరకు వన్‌టౌన్ సిఐ ఎన్.రవీందర్ తన సిబ్బందితో నిఘాను ఏర్పాటు చేసి ఉంచగా, సోమవారం నిజామాబాద్ నగరానికి వచ్చిన వీరిరువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరుపగా, బైక్ చోరీల కేసులన్నీ కొలిక్కి వచ్చాయని ఎసిపి ఆనంద్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారి వద్ద నుండి 24బైక్‌లను స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్‌కు తరలించామని ఎసిపి పేర్కొన్నారు. దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన వన్‌టౌన్ సిఐ రవీందర్‌తో పాటు పాటు సిబ్బంది ఎస్‌ఐ పి.రాఘవేందర్, సిబ్బంది ఎంఎ.షకీల్, రవికృష్ణలను ఎసిపి అభినందిస్తూ, వీరికి కమిషనర్ కార్తికేయ రివార్డులను అందజేయనున్నారని తెలిపారు.

సొసైటీలు శక్తివంతమైనవి
మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
లింగంపేట్: నేటి సమాజంలో సొసైటీలు చాల శక్తివంతమైనవని , సహకార సంస్థలకు ఉన్న శక్తి ఏ సంస్థకు లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం లింగంపేట్ మండల కేంద్రంలో 75 లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకును, వాణిజ్య సముదాయాన్ని, గాంధీ విగ్రహాన్ని ప్రారంభించారు. అనంతరం నూతన బ్యాంకు నుండి జిఎన్‌ఆర్ గార్డెన్ వరకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, టిఎస్‌క్యాబ్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రావు, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, రైతులు బైక్ ర్యాలీ పై జిఎన్‌ఆర్ గార్డెన్‌కు చేరుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. సహకార సంగాలు అత్యంత శక్తివంతమైనవని అన్నారు. నా రాజకీయ భవిష్యత్తు సహకార సంఘం అధ్యక్షుడుగా మొదలైందని తెలిపారు. సింగిల్ విండో విదానంలో బ్యాంకులు రైతుల అవసరాలను తీర్చాలని చెప్పారు. సహకార సంఘాల పటిష్టతకు నాంది పలికింది నిజామాబాద్ సొసైటీలేనని చెప్పారు. గత యాసంగిలో 3 లక్షల 68 వేల టన్నుల ధాన్యం సొసైటీల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసిందని అన్నారు. రాష్ట్రంలో 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయాధికారిని నియమించామని, మొత్తం 2,638 మంది వ్యవసాయాధికారులను రాష్ట్రంలో నియమించామని తెలిపారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని అన్నారు. రైతులకు ఎకరానికి 4 వేల రూపాయలు ఆర్దిక సహాయం ప్రభుత్వం అందిస్దుని అన్నారు. ఈ కార్యక్రమంలో జెసి సత్తయ్య, ఆర్డీఒ దేవేందర్‌రెడ్డి, ఎఎంసి చైర్మన్ వెంకట్రామ్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాల సహకార బ్యాంకు చైర్మన్ పట్వారి గంగాధర్, జిల్లా గ్రందాలయ చైర్మన్ సంపత్‌గౌడ్, ఎంపిపి ఆసియామొహిద్, జడ్‌పిటిసి శ్రీలత, సర్పంచ్ ఆఫ్రోజ్, తహశీల్దార్ మోతిసింగ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, రైతులు, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

సంక్షేమానికి పెద్దపీట

అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా
కంఠేశ్వర్: రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పెద్దపీఠ వేస్తున్నారని, అందులో భాగంగానే పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా పేర్కొన్నారు. సోమవారం నగరంలోని 22, 23, 24వ డివిజన్లలో ఎమ్మెల్సీ కోటా నిధులతో నిర్మించిన కమ్యూనిటీ భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా మాట్లాడుతూ, రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, గీత కార్మికులకు ఆసరా పెన్షన్లు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు జీవన భృతి పెన్షన్లు, ఎస్సీ, ఎస్టీ, బిసిలకు కల్యాణలక్ష్మి, మైనార్టీలకు షాదీముబారక్ పథకం, రైతులకు రుణమాఫీ, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, వ్యవసాయానికి 9గంటల నిరాంటకంగా విద్యుత్ సరఫరా, గర్భిణీ స్ర్తిలకు 12వేల రూపాయల నగదుతో పాటు కెసిఆర్ కిట్టు తదితర పథకాలను విజయవంతం అమలు చేయడం జరుగుతుందన్నారు. ఇక పేదలు కడుపునిండా భోజనం తినేందుకు కుటుంబంలో ఒక్కొక్కరికి 6కిలోల చొప్పున బియ్యం అందిస్తున్న ఘనత సిఎం కెసిర్‌కే దక్కిందన్నారు. ఇక నగరాభివృద్ధి విషయానికి వస్తే గతంలో నిలిచిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పునఃప్రారంభించడం జరిగిందన్నారు. మిషన్ భగీరథ, యుజిడి పనుల వల్ల రోడ్లు ధ్వంసమై ప్రయాణీకులకు కొంత ఇబ్బంది కలుగుతున్న విషయం వాస్తమేనని, అయితే ఈ పనులు పూర్తయిన వెంటనే నగరంలో రోడ్ల నిర్మాణం పనులను చేపట్టి శరవేగంగా పూర్తి చేయిస్తామని, అప్పటి వరకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. నగరాభివృద్ధికి ఎమ్మెల్యే ఇచ్చినా, ఎమ్మెల్సీ ఇచ్చినా, అవి ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చినట్లేనని బిగాల పేర్కొన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బిసిలు వివాహాలు జరుపుకోవాలంటే రోడ్లపై టెంట్లు వేసుకుని జరుపుకోవాల్సిన పరిస్థితి ఉండేదని, టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఆయా డివిజన్లలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోటా నిధులతో కమ్యూనిటి భవనాలను నిర్మించడం జరిగిందన్నారు. దీంతో వివాహాలతో పాటు సమావేశాలను కూడా ఈ భవనాల్లోనే జరుపుకుంటున్నారని, ఇది ఎంతో శుభపరిణామని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్ మాట్లాడుతూ, సీతారాంనగర్, ఆనంద్‌నగర్, శివాజీనగర్‌ల్లో పేద ఎస్సీ, బిసిలు ఉన్నారని, వీరి పిల్లలు చదువుకునేందుకు, మహిళలు సమావేశాలు నిర్వహించుకునేందుకు తన కోటా నుండి నిధులను కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఆకుల సుజాత, కార్పోరేటర్లు కనకం సుధ, రంగు అపర్ణ, తెరాస నాయకులు సదానంద్, రంగు సీతారాం తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా దుబ్బా ప్రాంతంలోని కృష్ణ ఆలయంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు.

నగరంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
వినాయక్‌నగర్: నిజామాబాద్ నగరంలోని పలు ఆయాల్లో కృష్ణాష్టమి వేడుకలను ప్రజలు సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నగరంలోని భక్త వేదాంత ఇన్సిట్యూట్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో సింధ్ భవన్‌లో కృష్ణాష్టమి వేడుకలను వైభంగా నిర్వహించారు. కృష్ణాష్టమి రోజున బహుళ అష్టమి కలిసి రావడంతో నగరంలోని పలు ఆలయాల్లో సోమవారం వేకువజామున నుండే ఉత్సవ మూర్తులకు డోలారోహణం, నామకరణోత్సవంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాజీనగర్‌లోని శ్రీకృష్ణ గీతభవన్, గుర్బాదిరోడ్, ఆర్మూర్ రోడ్‌లోని మురళీకృష్ణ ఆలయం, రాంగోపాల్‌వీధి, రాధాకృష్ణ దేవాలయంతో పాటు కంఠేశ్వర్, దుబ్బా ప్రాంతాల్లో కృష్ణాష్టమి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అలాగే సాయంత్రం వేళల్లో నిర్వహించిన ఉట్టికొట్టే కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని, తమ ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.