శ్రీకాకుళం

‘చేనేత పార్కు’ హామీలకే పరిమితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: దేశాన్ని తెల్లదొరలు విడిచివెళ్లాలని సాగించిన స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన పొందూరు ఖాదీకి వనె్న తెచ్చేలా ప్రభుత్వం చేనేత పార్కు హామీలకే పరిమితమైందని ఆ కుటుంబాలు విమర్శిస్తున్నాయి. చేనేత బతుకుల్లో ఈ పార్కు వెలుగులు నింపుతుందని ఆశలు పెంచుకున్న వారంతా తీవ్ర నిరాశకు లోనౌతున్నారు. పార్కు ఏర్పాటుకు రూ.25కోట్లు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ స్థల ఎంపిక మాత్రం అధికారులకు సవాల్‌గా మారింది. పార్కు పనుల్లో పురోగతి లేకపోవడం నేతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొందూరు ఖద్దర్ ప్రపంచ ప్రసిద్ధిగాంచినప్పటికీ వాటిని నమ్ముకుని జీవితాలను నెట్టుకొస్తున్న కుటుంబాలు మాత్రం ఆర్థిక పురోగతి సాధించలేకపోయాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాలక్రమంలో నైపుణ్య కార్మికులు మరుగున పడిపోవడం జీవనభృతి కోసం పొట్ట చేత పట్టుకుని ఇతర వృత్తుల వైపు చూడాల్సిన పరిస్థితులు ఆ కుటుంబాల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చేశాయి. జిల్లా వ్యాప్తంగా చేనేత కార్మికులు ఈ పార్కుపై అనే ఆశలు పెంచుకున్నప్పటికీ స్థల జాప్యం ఆ కుటుంబాలను ఆందోళనకు గురి చేస్తుంది. ముఖ్యంగా చేనేత పార్కు వలన పొందూరు, సమీప ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన కార్మికులకు దీని ద్వారా ఉపాధి దక్కుతుందని పలువురు భావించారు. సుమారు 500మంది కార్మికులకు ఉపయోగపడేలా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేసి ప్రయోగాత్మకంగా ఉత్పత్తిని సాధిస్తే వీటి ఫలితాల ఆధారంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో చేనేత కుటుంబాలకు ఊతమందించేలా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అయితే ఇక్కడ అధికారులు స్థలం గుర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ప్రతీ చేనేత కార్మికుడి గుండె మరింత బరువెక్కుతోంది. ఈ పార్కు కోసం కనీసం 25 ఎకరాలు అవసరమని చేనేత , జౌలి శాఖ అధికారులు ప్రతిపాధనలను రూపొందించినట్లు తెలిసింది. దీనిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ సి ఎం చంద్రబాబుకు కూడా కోరడంతో పనులు మరింత ఊపందుకోవాల్సి ఉన్నప్పటికీ నంద్యాల ఉప ఎన్నికలు అటంకంగా నిలిచాయని తెలుస్తుంది. ఇప్పటికే శ్రీకాకుళం ఆర్డివో బలివాడ దయానిధి, ఏడి రాజారావులు పలు ప్రాంతాలను పరిశీలించారు. ముఖ్యంగా పొందూరు మండలంలోని లోలుగు, కృష్ణాపురం, రాపాక జంక్షన్, పొందూరు పైడితల్లమ్మ ఆలయం సమీపంలో ఈ ప్రాజెక్టు కోసం ప్రాధమికంగా భూమిని పరిశీలించారు. అయితే తుది నిర్ణయం తీసుకోలేదు. ఎక్కడ నిర్మించాలన్న అంశాన్ని పరిశీలిస్తే అందుకు అనుగుణంగా ప్రతిపాధన ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పుకురావడం పలు సందేహాలకు తావిస్తోంది. చేనేత పార్కు ఏర్పాటు త్రిశంకుస్వర్గంలో ఉండటంవలన ఆ రంగాన్ని నమ్ముకున్న కుటుంబాలు గందరగోళంలో పడ్డాయి. ఇప్పటికే అనేకమంది ఆ కుటుంబాలకు చెందిన వారు వృత్తిని వీడి వివిధ రకాల పనులు సాగిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. బొంతలకోడూరు, లావేరు, రాజాం, పలాస, సోంపేట, నరసన్నపేట, మందస, పాతపట్నం, టెక్కలి, జలుమూరు, సారవకోట, శ్రీకాకుళం రూరల్, గార తదితర ప్రాంతాల్లో వేలాది కుటుంబాలు చేనేత రంగాన్ని నమ్ముకుని జీవనాన్ని సాగిస్తున్నాయి. ఖాదీ సంఘాల ద్వారా పత్తిని సరఫరా చేసి తిరిగి మగ్గాల ద్వారా తయారు చేసిన వస్త్రాలను కొనుగోలు చేసేందుకు సంబంధిత అధికారులు చొరవ చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం రోజువారీ కూలి కూడా చేనేత కార్మికులకు మగ్గాల ఆధారంగా దక్కడం లేదన్న ఆవేదన అడుగడుగునా దర్శనమిస్తుంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆదుకుంటామని మాటలు చెప్పడమే తప్ప చేతల్లో లేకపోవడం ఆ కుటుంబాలు ఆర్థికంగా మరింత వెనుకబడుతున్నాయి. పింఛన్లు, అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలని వినతులు అందిస్తున్నప్పటికీ నేతన్నల దరిచేరడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాంకు రుణాలు రాయితీలు, ఎండ మావుగా మారాయని వారంతా ఏళ్ల తరబడి గొంతు చించుకుంటున్నా ప్రభుత్వాలు మాత్రం పట్టని చందంగా వ్యవహరిస్తున్నాయని చేనేత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులను అధిగమించేలా జిల్లాకు మంజూరు చేసిన చేనేత పార్కు రూపుదిద్దుకోవాలని వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. నేతన్నల తలరాతలు మార్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రూపకల్పన చేసి ఆ కుటుంబాల జీవన స్థితిగతులు మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలని వారంతా కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే చేనేత పార్కును ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నారు.
ప్రజా జీవనంలో తాగునీరు ముఖ్యం
జలుమూరు: గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి అన్నింటికన్న తాగునీరు ముఖ్యమని ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. మండలం అల్లాడ గ్రామంలో అమెరికాలో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రులు లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన శుద్ధతాగునీరు ప్రాజెక్టును సోమవారం సాయంత్రం ఎంపి ప్రారంభించారు. భీమేశ్వర సంఘం తరఫున ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ఎంపి ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ మానవ జీవితానికి తాగునీరు ఎంతో అవసరమని తాగునీటిలో తేడాలు వస్తున్నందున కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని ఇటువంటి సందర్భాల్లో గ్రామీణ ప్రాంత ప్రజానీకం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం అభినందనీయమని స్పష్టంచేశారు. అల్లాడ గ్రామంలో దివంగత ఎర్రన్నాయుడు సమక్షంలో పొందర కులస్తుల కోసం మినీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. టెలిఫోన్ ఎక్సేంజ్‌ను తన తండ్రి ప్రారంభించిన సంఘటనను ఆయన గుర్తు చేశారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నాయన్నారు. మారుమూల గ్రామంలో బృహత్కర కార్యక్రమాలను చేపట్టిన వారికి ఎంపి ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్లాంట్‌ను ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వాలు చేపడుతున్న అనేక పథకాలను ఎంపి ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే రమణమూర్తి మాట్లాడుతూ ఇటీవల తాగునీటి కోసం కోట్లాది రూపాయలు మంజూరు చేశామన్నారు. అనేక గ్రామంలో రక్షిత నీటి పథకాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్థానిక సర్పంచ్ ఆండాలు రమణమూర్తి, తెలుగుదేశం నాయకుడు చంద్రభూసణ, బగ్గు గోవిందరావు, నారాయణరావు, ముద్దాడ శ్రీనివాసరావు, పలువురు కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శోభాయాత్ర
శ్రీకాకుళం(రూరల్): శ్రీ కృష్ణాష్టమి మహోత్సవాల్లో భాగంగా సోమవారం విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో శోభాయాత్రను నిర్వహించారు. కృష్ణం వందే జగద్గురు మందిరం నుంచి ఈ శోభాయాత్ర ప్రారంభమై కళింగరోడ్డు, అరసవల్లి మిల్లు జంక్షన్, మహిళా కళాశాల రోడ్డు మీదుగా సూర్యమహాల్ జంక్షన్, జిటి రోడ్, ఏడు రోడ్ల కూడలి మీదుగా పాతబస్టాండ్, గూనపాలేంకు చేరుకుంది. ఈ శోభాయాత్రలో స్వామిజీలు, పీఠాధిపతులు, పురోహితులు అర్చకులు వివిధ ధర్మిక సంస్థల ప్రముఖులు, భజన బృందాలు ఊరేగింపుగా వచ్చాయి. సాయంత్రం సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు సామూహిక విష్ణు సహాస్తప్రారాయణం, కీర్తనలు, భజనలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణం వందే జగద్గురు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు దుంపా ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి కందర్పు శ్రీనివాస్, రొక్కం సూర్యప్రకాశరావు, టి.బృందం, ఎంవిజి నాయుడు, మజ్జి నర్సింహులు, స్వామిజీలు తదితరులు పాల్గొన్నారు.

ఉప్పుటేరులో పడి విద్యార్థి గల్లంతు
వజ్రపుకొత్తూరు: నువ్వలరేవు గ్రామానికి చెందిన ఎన్.సందీప్ (14) ఉప్పుటేరు వరద నీటిలో ప్రమాదవశాత్తు జారి పడి సోమవారం గల్లంతు అయ్యాడు. నగరంపల్లి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సందీప్ సెలవులు కావడంతో తోటి విద్యార్థులతో కలిసి ఉప్పుటేరు నూతన వంతెన సమీపంలో వరదనీటిని చూడడానికి వెళ్లా డు. ఈ క్రమంలో వరదనీటిలో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయాడు. గ్రామస్తులు ఉప్పుటేరులో వలలు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం కనిపించ లేదు. సముద్రంలోకి కొట్టుకొనిపోయి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. విద్యార్థి తల్లిదండ్రులు రామారావు, తులసమ్మ ఉపాధి నిమిత్తం మంగళూరులో (మిగతా 2వ పేజీలో)

ఈ హెచ్‌ఎస్ అమలు చేయని ఆసుపత్రుల అనుమతులు రద్దు

శ్రీకాకుళం(రూరల్): ఏపి ఎన్జీవో సంఘం సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి ఉద్యోగుల, ఆరోగ్య సంరక్షణ పథకం కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అమలు చేయడం లేదని వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఈ హెచ్ ఎస్ అమలు చేయని నెట్‌వర్క్ ఆసుపత్రుల అనుమతులను రద్దు చేస్తామని జె ఏ సి నేతలకు భరోసా ఇచ్చారు. ఈనెల 12న కలెక్టర్ బంగ్లాలో జె ఏసి నాయకులు, నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు, ఎన్టీ ఆర్ వైద్య సేవ జిల్లా కో ఆర్డినేటర్, జిల్లా వైద్య ఆరోగ్య శఋ౎కాధికారులతో సమావేశంనిర్వహించారు. ఈ సమావేశంలో ఈ హెచ్ ఎస్ అమలు జరుపుతున్న తీరు తెన్నులపై జిల్లా జె ఏ సి చైర్మన్ హనుమంతు సాయిరాం, రాష్ట్ర ఎన్జీవో సంఘ సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తంనాయుడులు ఏకరువు పెట్టగా ఆయా నెట్ వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలను తప్పకుండా హెల్త్‌కార్డుపై ఉద్యోగులకు క్యాస్‌లెస్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. డాక్టర్ ఎన్టీ ఆర్ వైద్యసేవ కో ఆర్డినేటర్ నమోదు కాబడిన అన్ని నెట్‌వర్క్ ఆసుపత్రులను విధిగా తనిఖీ చేసి ప్రతీ నెల 4వ శనివారం జె ఏ సి నాయకులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి సూచనలు, సలహాలు పాటించాలని సూచించారు. నెట్‌వర్క్ ఆసుపత్రులు కూడా ప్రభుత్వం ఆమోదించిన రేట్లకే ట్రీట్‌మెంట్ జరపాలని అధనంగా ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తే ఉద్యోగులు తన దృష్టికి తీసుకువచ్చినట్లయితే వారి గుర్తింపు రద్దు చేస్తామని తెలియజేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో హనుమంతు సాయిరాం, డి ఎం అండ్ హెచ్ వో ఎస్.తిరుపతిరావు, డాక్టర్ దవళ భాస్కరరావు, డాక్టర్ ప్రకాశ్, రెవెన్యూ సంఘం నుండి జె.రామారావు, వేణుగోపాల్, రవీంద్ర, ఎస్ ఎస్ సుధాకర్, రాధాకృష్ణ తదితరులు ఉన్నారు.

రూ. 63కోట్లతో తాగునీటి ప్రాజెక్ట్‌పై సర్వే
ఇచ్ఛాపురం: రానున్న 20 ఏళ్లలో మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు 63 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రూపొందించిన ప్రాజెక్టు అమలుకు బాహుదా నదిలో సర్వే చేపట్టామని ఆంధ్ర విశ్వవిద్యాలయం జియో ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు చెప్పారు. ప్రజారోగ్యశాఖ ఇఇ వెంకటేశ్వరరావుతో కలిసి సోమవారం ఆయన బాహుదా నదీ గర్భాన్ని పరిశీలించారు. నది వాలును, నీరు నిల్వ ఉంటున్న ప్రాంతాలను గుర్తించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ పి.రవిబాబు, ఎఇ ఇమాన్యుయేల్‌తో సమావేశమయ్యారు. ఈ ప్రాంతంలో నది వాలు ఎక్కువగా ఉందని, దీంతో నీరు నిల్వ ఉండకుండా వేగంగా వెళ్లిపోతోందని వివరించారు. నీటిని నిల్వ చేసేందుకు రెండు చోట్ల కాంక్రిట్ గ్యాలరీలు నిర్మిస్తే బాగుంటుందని సూచించారు. తగరపువలస తాగునీటి అవసరాలు తీర్చేందుకు గోస్తని నదిలో 120 మీటర్ల పొడవున 4.5 మీటర్లలోతు, 1.5 మీటర్ల ఎత్తుతో కాంక్రిట్ గ్యాలరీ నిర్మించారని వెల్లడించారు. ఇక్కడ నదికి అడ్డంగా సుమారు 60 మీటర్ల పొడవున 4 మీటర్ల లోతు, 1 మీటరు ఎత్తుతో గ్యాలరీలు నిర్మిస్తే రానున్న 20 ఏళ్లు పట్టణ తాగునీటి అవసరాలను తీర్చవచ్చని వివరించారు. నదిలో ఇసుక, మట్టి లోతును తెలుసుకునేందుకు ఐదారు చోట్ల బోర్లు వేస్తామని, నదిలో నీటి నిల్వకు ఉన్న అవకాశాలను పరిశీలించి నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు. మశాకపురం, పాత రోడ్డు వంతెనల వద్ద గ్యాలరీలు నిర్మిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. బొబ్బిలి, ఆమదాలవలసలకు సంబంధించిన సర్వే పూర్తయిందని, శ్రీకాకుళంలో ప్రాజెక్టు అమలు ప్రారంభమైందని తెలిపారు. పలాసకు నీటి వనరు లేనందున ఇప్పట్లో అమలయ్యే అవకాశం లేదన్నారు. పబ్లిక్ హెల్త్ ఇఇ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇచ్ఛాపురం ప్రజలకు ప్రస్తుతం రోజుకు 30 లక్షల లీటర్ల నీరు అవసరమని, అయితే సుమారు 10 లక్షల లీటర్లే అందుబాటులో ఉంటున్నాయని చెప్పారు. రానున్న 20 ఏళ్లలో కోటి లీటర్లు అవసరమవుతాయని, దీనికి తగినట్టు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డిపిఆర్) ఇప్పటికే పరిపాలన ఆమోదం పొందిందని వివరించారు. ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు నివేదిక ఇచ్చాక రాష్టస్థ్రాయి కమిటీ పరిశీలన జరిపి ఆమోదం తెలుపుతుందని చెప్పారు. అనంతరం ప్రాజెక్ట్ అమలవుతుందన్నారు. పట్టణ ప్రజలకు ప్రస్తుతం తాగునీరు చాలావరకు సరిపోతోందని కమిషనర్ పి.రవిబాబు చెప్పారు. వేసవిలో మాత్రం ఇబ్బంది వస్తోందన్నారు. కొత్త ప్రాజెక్ట్ పూర్తయితే సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు.

ప్రజా సంక్షేమమే టిడిపి ధ్యేయం
గార: ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలులో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అలాగే ప్రజలకు అండగా ఉంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ప్రాధాన్యతా క్రమంలో మందుకు సాగుతుందని స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. మండలం అంపోలు పంచాయతీ రామక్రిష్ణాపురం గ్రామం వద్ద రూ.12లక్షలు రూపాయలుతో నిర్మింపజేసిన అంగన్‌వాడీ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి, అభివృద్ధి కార్యక్రమాలును ప్రాధాన్యత క్రమంలో నిర్వహింపజేస్తుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధికి మారుపేరని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలు ఆరోగ్యవంతమైన మనుగడ సాగించే దిశగా వివిధ కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ఆయా ప్రాంతాలకు వెళ్లే రహదారులు ముందుగా అభివృద్ధి చెందాలని ఆ దిశగా చేపట్టిన చర్యలు నేపథ్యంలోనే లక్షలాది రూపాయలుతో అవసరం మేరకు సిమెంటు రహదారుల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆమె స్పష్టం చేసారు. బీదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కష్టకాలంలో ఆయా కుటుంబాలకు ఆర్ధిక భరోసా కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమలు చేస్తున్న చంద్రన్న భీమా పథకం ఆయా కుటుంబాలకు ఆర్ధిక భరోసా కల్పిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆగస్టు మాసాంతానికి సంబంధించి 18సాధారణ, 2 ప్రమాదం కారణంగా మరణించిన వారి కుటుంబాలకు చంద్రన్న భీమా పథకం ప్రొసీడింగ్స్‌ను సంబంధిత లబ్ధిదారులకు అందజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచు గొండు వెంకటరమణమూర్తి, మండల పరిషత్ అధికార ప్రతినిధి గుండ భాస్కరరావు, గార సర్పంచు బడగల వెంకటప్పారావు, ఎం.పి.టి.సి. ముసలినాయుడు, గొండు అచ్యుతరావు, గుజ్జల హిమగిరి, శ్రీకూర్మం సర్పంచు బరాటం రామశేషు, ఎం.పి.టి.సి. కోరాడ వెంకటరావు, అంబటి చక్రధరరావు, గోర సురేష్‌లతో పాటు వివిధ విభాగాల అధికారులు, కార్యకర్తలు ఉన్నారు.

వి.హెచ్.పి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు
శ్రీకాకుళం(రూరల్): విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నగరంలోని ఎల్ బి ఎస్ కాలనీలో కృష్ణం వందే జగద్గురుమ్ మందిరంలో సోమవారం కృష్ణాష్టమి మహోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డి ఈవో ఏ.ప్రభాకరరావు హాజరై మాట్లాడుతూ బాలబాలికల భారత, భాగవత కథాశ్రవణం చేయడం ద్వారా వారిలో నైతిక విలువలు పెంపొందుతాయని తద్వారా వారు మంచి పౌరులుగా ఎదుగుతారని ఆయన తెలిపారు. భారతీయ ఇతిహాసాలు ప్రపంచానికే ఆదర్శనమన్నారు. విశిష్ఠ అతిధిగా పాల్గొన్న వి.హెచ్.పి రాష్ట్ర కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మ పరిరక్షణలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు. ధర్మజాగరణతోనే భారతదేశానికి విశ్వగురు స్థానం సాధ్యమన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇటీవల పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన పధ్య, శ్లోక, పఠన పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు డి ఈవో చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుండి శ్రీ కృష్ణ వేషదారణలలతో పాల్గొన్న విద్యార్థులు ముచ్చటగా కొలువుతీరారు. అలాగే విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకం అందరినీ అలరించింది. ప్రముఖ మనోవేద సాధకులు భాస్కరభట్ల శ్రీరామశర్మ డి ఈవోను కండువాతోసత్కరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణం వందే జగద్గురుమ్ వ్యవస్థాపకులు బృందా శ్రీనివాస్, వి.హెచ్.పి జిల్లా అధ్యక్షులు గుంపా శివప్రసాద్, విభాగ్ కార్యదర్శి ఫల్గుణరావు, భజరంగదళ్ అధ్యక్షులు ఎస్.మధుసూధనరావు, మందపల్లి రామకృష్ణారావు. వై.వి రమణారావు, సత్యన్నారాయణ, సూర్యప్రకాశరావు, ఎం బి జి నాయుడు, మజ్జి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా స్థానిక అరవసల్లి కూడలిలో ఉన్న శర్వాణి విద్యాలయంలో సంస్థ అధినేత అందవరపు సూరిబాబు ఆధ్వర్యంలో విద్యార్ధినీ విద్యార్థులు శ్రీ కృష్ణుడు, చెలికత్తెల వేషధారణలలో అలరించారు. ఈసందర్భంగా శ్రీ కృష్ణుడు ఉట్టి కొట్టే సన్నివేశాన్ని కనులవిందుగా ప్రదర్శించారు.
ఎచ్చర్లలో...
ఎచ్చెర్ల : కృష్ణాష్టమిని పురష్కరించుకుని వేడుకలను ఘనంగా మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించారు. స్థానిక యువత, గ్రామ పెద్దలు ఎంతో భక్తిశ్రద్ధలతో వేడుకను జరుపుకున్నారు. నవభారత్ సమీపంలో ఉన్న ఇస్కాన్ ఆలయంలో సోమవారం ఉదయం నుంచి ఘనంగా శ్రీకృష్ణ జన్మ పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి సంకీర్తన, ప్రత్యేక దర్శనం, మహా ప్రసాద వితరణ, పుస్తక ప్రదర్శన, అభిషేక పూజలు, జన్మాష్టమి పూజలు, నందోత్సవం, విందుభోజనం, వేష పూజ, మహాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. ఇస్కాన్ ఆలయ ఇన్‌చార్జ్ లక్ష్మీకాంత్ పర్యవేక్షణలో ఈ వేడుకలు సాగాయి. అలాగే ఎస్ ఎం పురం యాదవ వీధిలో స్థానిక యువత కృష్ణాష్టమి వేడుకలను కనులపండువగా నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని స్థానిక సర్పంచ్ చౌదరి అవినాష్ ప్రారంభించారు. ఉట్టికొట్టే సంబరాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. కృష్ణపూజలు సాగించారు. ఈ ఉత్సవంలో ఎంపిటిసి గొంటి నర్సింగరావు, నీటిసంఘం అధ్యక్షులు బెండి బాలకృష్ణ, గురుగుబెల్లి గోవిందరావు,మహేష్, గొంటి రామారావు, సింహాచలం, వ్యాయామ ఉపాధ్యాయులు గొంటి మల్లేశ్వరరావు శైలాడ కన్నయ్య, సంపతిరావు నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
సారవకోటలో...
సారవకోట : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్థానిక బ్రాహ్మణ వీధిలో యువకుడు వృత్తిని కొట్టేపండుగ వేడుకగా జరిపారు. ఎంపిటీసీ కోనా వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. యువకులు తొలుత ఉట్టిని కొట్టడానికి ప్రయత్నించే సమయంలో భారీ వర్షం ప్రారంభమైంది. వర్షం కురుస్తుండగానే యువకులు ఉత్సాహంగా ఉట్టిపండుగలో పాల్గొని సందడి చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా బ్రాహ్మణ వీధిలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. స్థానికుడైన నేతెంటి ఢిల్లీశ్వరరావు మొట్టమొదటగా ఉట్టిన కొట్టి విజేతగా నిలిచారు. ఆ తరువాత వరుస క్రమంలో నేతింటి తేజ, విశే్వశ్వరరావు, రావాడ రాఘవ తదితరులు విజేతలుగా నిలిచారు. ఈ ఉత్సవంలో సుమారు 30 మంది యువకులు పాల్గొని భారీ వర్షంలో తడుస్తూ ఒకవైపు మరోవైపు ఉరకలేస్తున్న ఉత్సాహంతో ఉట్టిని కొట్టడానికి ప్రయత్నించడం విశేషం. విజేతలకు ఎంపిటీసీ వెంకటేష్ ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.