పశ్చిమగోదావరి

మావుళ్ళమ్మ అమ్మవారికి బంగారు వడ్డాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం: శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి హైదరాబాద్‌కు చెందిన అజ్ఞాత భక్తుడు కిలో 300 గ్రాముల 40 మిల్లీ గ్రాములు సుమారు రూ.40 లక్షలు విలువ చేసే బంగారు వడ్డాణాన్ని సోమవారం బహూకరించారు. దేవస్థానం అసిస్టెంటు కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు సమక్షంలో ఎమ్మెల్యే రామాంజనేయులు చేతుల మీదుగా అమ్మవారికి అలంకరించారు. విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. ధర్మకర్తల మండలి సభ్యులు హాజరయ్యారు.

చిత్తశుద్ధి లేని ప్రభుత్వం
ఏలూరు: రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయమంటున్న కాపు నాయకుల డిమాండు నెరవేర్చడంపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని ఏలూరు కాపు సంఘ నాయకులు జల్లా హరికృష్ణ ధ్వజమెత్తారు. కాపుల పట్ల ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో కాపు సంఘ నాయకులు సోమవారం చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ కాపుల కోసం నిరంతరం శ్రమిస్తూ పాదయాత్రకు సిద్ధమైన ముద్రగడ పద్మనాభంను చర్చలకు పిలవకుండా వేరే నాయకులతో ప్రభుత్వం చర్చలుజరపడం పట్ల అసహనం వ్యక్తంచేశారు. దీనితో సమస్య పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తేటతెల్లమైందన్నారు. ప్రభుత్వాన్ని తామేమీ డిమాండ్ చేయడం లేదనిఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చమని మాత్రమే అడుగుతున్నామని, అందుకోసం పాదయాత్రకు సిద్ధమైతే ముద్రగడను ఇంటికి పరిమితం చేయడం, పోలీసులను మోహరించడం, పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాపు సంఘ నేత పద్మనాభంతోపాటు ప్రముఖ నాయకులను కూడా సమావేశ పరచి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు బుద్దాల రాము, రాజనాల రామ్మోహనరావు, మంచెం మైబాబు, నారా రామకృష్ణ, బండారు మాధవరావునాయుడు, సిరిపల్లి ప్రసాద్, కె సోమశేఖర్, తూము సత్యనారాయణ, దూసనపూడి విజయకుమార్ నాయుడు, గరుడ చంటి, ఎం ప్రభాకర్, కందెళ్ల నాగు, శ్రీనివాసరావు, నాని, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. కాపులను బిసిల్లో చేర్చాలని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, ముద్రగడ పాదయాత్రకు అనుమతివ్వాలని కోరుతూ నినాదాలతో హోరెత్తించారు.

ప్రోత్సాహకాల్లోను ఉత్సాహం
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు: ఉపాధి హామీ పధకంలో ఉన్నన్ని నిధులు మరే పధకంలోనూ లేవని, దీన్ని పూర్తిస్దాయిలో సద్వినియోగం చేసుకోవాలని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే పిలుపునిచ్చిన నేపధ్యంలో జిల్లా యంత్రాంగం దాన్ని పూర్తిస్దాయిలో అందిపుచ్చుకున్నట్లు కన్పిస్తోంది. జిల్లావ్యాప్తంగానే అంటే అన్ని మండలాల్లోనూ జాబ్‌కార్డులు పొందిన కుటుంబాలకు పూర్తిస్దాయిలో పనిదినాలు కల్పిస్తూ ఆ మేరకు వచ్చిన నిధులతో గ్రామాల్లోనూ, మండలాల్లోనూ వనరుల కల్పనలో ఉత్సాహం చూపుతూ ముందుకు సాగుతున్నట్లు కన్పిస్తోంది. గత ఏడాది జిల్లా రాష్ట్రంలోనే ఉపాధి హామీ పనుల్లో మిగిలిన జిల్లాలతో పోలిస్తే ప్రశంసనీయమైన ప్రగతి కనపర్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆమేరకు వనరుల కల్పనతోపాటు అయా కుటుంబాలకు వరుస పనిదినాలను కల్పించటంతో సరిపెట్టకుండా పధకం లక్ష్యాన్ని అనుకున్న స్ధాయిలో ముందుకు తీసుకువెళ్లటంలో కృషి చేసిన అధికారులు, సిబ్బందికి ప్రోత్సాహకాలను అందించటం ఈపధకంలో విశేషం. అవిధంగా గత ఆర్ధిక సంవత్సరంలో జిల్లాలోని 48మండలాల్లో కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించటంలో విజయవంతంగా కృషి చేసిన సంబంధిత ఎంపిడిఓ, ఇతర ఉద్యోగులు, సిబ్బందికి రాష్ట్రప్రభుత్వం 31లక్షల రూపాయల మేరకు ప్రోత్సాహకాలను అందిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తాలను అయా ఎంపిడిఓల ఖాతాలకు జమ చేసే ప్రక్రియ కూడా తుదిదశకు చేరుకుంది. ఈ మొత్తాన్ని పధకం అమలులో అయా స్ధాయిల్లో కృషి చేసిన అధికారులు, సిబ్బందికి నిర్దేశిత శాతం ప్రకారం ప్రోత్సాహకాలను అందిస్తారు. గత ఏడాది 31వేల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి వంద రోజుల చొప్పున పనిదినాలను కల్పించినట్లు గుర్తించారు. ఆమేరకు ప్రోత్సాహక మొత్తాలను నిర్ణయించి విడుదల చేయటం జరిగింది. దీనిలో ఎంపిడిఓలకు 15శాతం, సిఓలు, ఎపిఓలు, ఇసిలు, మేట్‌లకు పదిశాతం చొప్పున, ఎఫ్‌ఎలకు 30శాతం చొప్పున, టిఎలకు 25శాతం చొప్పున ఈ మొత్తం ప్రోత్సాహకాల్లో అందజేస్తారు. జిల్లావ్యాప్తంగానే ఈవిధంగా విజయవంతమైన పనితీరును కనపర్చిన మండలాలు అనేకం ఉన్నాయంటే ఆతిశయోక్తి కాదు.
గతంలో డెల్టా మండలాల్లో ఉపాధి పనులకు పెద్దగా ఆస్కారం ఉండదన్న ప్రచారం జరిగినా దానికి భిన్నంగా జిల్లావ్యాప్తంగానే ఆ మండలాల్లోనూ పోటీగానే ఉపాధి పనులను ముందుకు తీసుకువెళ్లారని చెప్పాలి. ఈవిధంగా కుటుంబానికి వంద రోజుల పనిదినాల కల్పనలో అభినందనీయమైన ప్రగతి కనపర్చినవారికి ప్రోత్సాహకాలను అందజేస్తున్నారు. దీనిలో భాగంగా ఆచంట మండలానికి 8325 రూపాయలు, ఆకివీడు మండలానికి 15005, అత్తిలి మండలానికి 11326, భీమవరం మండలానికి 20717, భీమడోలు మండలానికి 72801, బుట్టాయిగూడెం మండలానికి 63604, చాగల్లు మండలానికి 53149, చింతలపూడి మండలానికి 134469 రూపాయలు, దెందులూరు మండలానికి 203592 రూపాయలు, దేవరపల్లి మండలానికి 71252, ద్వారకాతిరుమల మండలానికి 243672, ఏలూరు మండలానికి 245705, గణపవరం మండలానికి 7551, గోపాలపురం మండలానికి 190523, ఇరగవరం మండలానికి 15392, జీలుగుమిల్లి మండలానికి 38433, కామవరపుకోట మండలానికి 122658, కొవ్వూరు మండలానికి 49663, లింగపాలెం మండలానికి 135728, నల్లజర్ల మండలానికి 294304, పెదవేగి మండలానికి 162835, పోలవరం మండలానికి 90130 రూపాయల చొప్పున ప్రోత్సాహకాల కింద కేటాయించారు. అన్ని మండలాలకు ఈమేరకు ప్రోత్సాహకాలు లభించటం గమనార్హం.
కుప్పకూలిన గుడి: మహిళ మృతి
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీ శివారు జొన్నవారిగూడెంలో సోమవారం రాత్రి ఒక ఆలయం కుప్పకూలిన ఘటనలో ఒక మహిళ మృతిచెందింది. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. గ్రామంలోని గొంతేలమ్మ గుడి రాత్రి 9 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నానిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ప్రమాద సమయంలో గుడివద్ద కూర్చునివున్న అందుగుల దుర్గమ్మ (58) శిథిలాలకింద చిక్కుకుని అక్కడికక్కడే మృతిచెందింది. తలపట్ల నాగమణి (45) అనే మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగానేవుందని వైద్యులు తెలిపారు. ప్రమాద సమాచారంతో రెవెన్యూ, పోలీసు అధికార్లు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో గ్రామంలో విషాదం నెలకొంది.

కలవరపెడుతున్న చిరుతల సంచారం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల మండలంలో గత కొద్ది రోజులుగా చిరుత పులుల సంచారంతో రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తాజాగా సోమవారం జరిగిన ఒక ఘటన మండలంలోని రాజుపాలెంలో కలకలాన్ని రేపింది. వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన తనకు చిరుత పులితోపాటు దాని వెనుక మూడు పిల్లలు కనిపించాయని గ్రామానికి చెందిన యువ రైతు మానికల ప్రశాంత్ చెబుతున్నాడు. దావానలంలా వ్యాపించిన ఈ విషయం తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. స్థానికుల కథనం ప్రకారం.. ప్రశాంత్ ఉదయం సుమారు 11 గంటల సమయంలో గ్రామంలోని తన నిమ్మతోటలోకి వెళ్లాడు. అక్కడ ఒక చిరుతపులి, మూడు పిల్లలు సంచరించడాన్ని గమనించాడు. కంగారుపడుతూ పక్కనే ఉన్న జీడిమామిడి చెట్టెక్కి వాటి కదలికలను పరిశీలించసాగాడు. అయితే గుబురుగా ఉన్న తుప్పల్లోకి అవి వెళ్లిపోయిన తరువాత గ్రామంలోని రైతులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. వెంటనే రైతులు కర్రలతో అక్కడికి చేరుకుని ఆ పొలం పరిసరాలను వెదకనారంభించారు. కొద్దిసేపటికి చిరుత జాడలను గుర్తించారు. సాయంత్రం వరకు వారంతా ఆ ప్రాంతంలోనే ఉన్నారు. ఇటీవల తిరుమలంపాలెంలో గుళికలు తిని ఒక చిరుత మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ గ్రామం రాజుపాలెంకు సమీపంలో ఉండటంతో రైతుల్లో గుబులు మరింత పెరిగింది. చనిపోయిన చిరుత సంతతే ఇవి అయి ఉండొచ్చని రైతులు భావిస్తున్నారు. వెంటనే అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని రైతులు మానికల బుల్లియ్య, మానికల రమణ, పాకిరం సత్యనారాయణ కోరుతున్నారు.
కానిస్టేబుల్ శిక్షణార్ధులకు మెరుగైన సౌకర్యాలు
ఏలూరు : పోలీసు కానిస్టేబుళ్లుగా శిక్షణ పొందుతున్న వారికి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని, వివిధ విభాగాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిస్తామని జిల్లా ఎస్‌పి ఎం రవిప్రకాష్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో పోలీసు కానిస్టేబుళ్లుగా శిక్షణ పొందుతున్న 70 మంది మహిళలు, 164 మంది పురుషుల విభాగాలను సమగ్ర పరిశీలన చేశారు. వారి క్లాస్‌రూమ్స్, కిచెన్ షెడ్స్, వసతి గృహాలు, గ్రౌండ్‌ను సమగ్రంగా పరిశీలించి నిర్వాహకులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. మహిళ అభ్యర్ధులకు ప్రత్యేక వసతి సదుపాయాల గురించి వివరాలు అడిగి తెలుసుకుని కొన్ని మార్పులు చేయాలని సూచించారు. శిక్షణాకాలంలో అభ్యర్ధులకు కంప్యూటర్ పట్ల అవగాహన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వివరణ, చట్టాలపట్ల శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆయన వెంట పోలీసు శిక్షణా కేంద్రం డిటిసి, జిల్లా అదనపు ఎస్‌పి వి రత్న, డిఎస్‌పి రాజేశ్వరరెడ్డి, డిటిసి ఆర్‌ఐ మురళీ తదితరులున్నారు.
అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం
ఏలూరు : ప్రమాద వశాత్తూ అగ్నిప్రమాదం సంభవించి యావత్తూ కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, అందుకు తమ సహకారం పూర్తిగా వుంటుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అన్నారు. సోమవారం దెందులూరు నియోజకవర్గంలోని కొప్పాక గూడెంలో అగ్నిప్రమాద బాధితులకు బియ్యం, నగదు, గృహ సామాగ్రి, వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన గృహాలు నిర్మించేందుకుసిఫార్సు చేస్తామని, ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సహాయ సహకారాలు కూడా త్వరితగతిన వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట పెదవేగి తహశీల్దార్ నజీముల్లా షా, ఎంపిపి దేవరపల్లి బక్కయ్య, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అలరించిన విద్యార్థుల స్వర నీరాజనం
-దేశభక్తి గీతాలతో తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్‌లోకి
పెరవలి: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పెరవలిలో విద్యార్థులు ఆలపించిన దేశ భక్తిగీతాలు సభికులను అలరించాయి. పెరవలిలోని ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలల విద్యార్థు సోమవారం ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహించిన స్వర నీరాజనం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేయనున్నట్టు పరిశీలకులు డాక్టర్ సాయిశ్రీ వెల్లడించారు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగనిరతికి అద్దం పట్టే విధంగా స్వరనీరాజనం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వశిష్టా స్కూలు, రెడ్ రోజ్ స్కూలు, నిర్మల స్కూలుతో బాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు కూడా పాల్గొన్నారు.
ఏలూరు రైల్వేస్టేషను వద్ద ఆర్టీసీ సమాచార కేంద్రం
ఏలూరు : దూర ప్రయాణీకుల సౌకర్యార్ధం ఎపిఎస్ ఆర్‌టిసి ఏలూరు డిపో స్థానిక రైల్వేస్టేషన్ వద్ద గూడ్స్ షెడ్ రోడ్డులో ప్రత్యేక సమాచార కేంద్రాన్ని ఏర్పాటుచేసింది.. ఈ సందర్భంగా డిపో మేనేజర్ అడ్డాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వరుసగా నాలుగు రోజులు ప్రభుత్వ కార్యాలయాలు సెలవులు కావడంతో పండుగలు నేపధ్యంలో దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు ప్రయాణీకులకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక సర్వీసులు నడిపే ఉద్దేశ్యంతో సమాచార కేంద్రాన్ని ఏర్పాటుచేశామని అన్నారు. విశాఖపట్నం, బెంగుళూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాలకు ముఖ్యమైన కూడళ్లకు వెళ్లేందుకు గాను రైళ్ల సౌకర్యం లేక స్టేషన్ల వద్ద ఇబ్బందులు పడుతున్నామని తెలుసుకున్నామన్నారు. ఈ నేపధ్యంలో వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు గాను ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేయాలనే ఉద్దేశ్యంతో సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, అవసరమైతే రైల్వేస్టేషన్‌నుంచే సర్వీసులను నడుపుతామని, ప్రయాణీకుల సంఖ్యను బట్టి కేంద్రాలకు తరలిస్తామన్నారు. ఆర్ ఎం ఎస్ ధనుంజయరావు సూచన మేరకు 17వ తేదీ వరకు ఈ ప్రత్యేకసమాచార కేంద్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆయన వెంట ఆర్‌టిసి సి ఐ జె సత్యనారాయణ, పి ఆర్‌వో నరసింహం, సిబ్బంది కె ఎన్ రావు, ప్రసాద్, రాజేష్, కెవి ఆర్‌టి కుమార్, జి లావణ్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కాపుల వినూత్న నిరసన
ఆకివీడు: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు మద్దతుగా ఆకివీడులో సోమవారం రాధారంగ మిత్రమండలి వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. మాదివాడ రంగా విగ్రహం వద్ద సాంప్రదాయ దుస్తులు ధరించి, నల్లజండాలతో నిరసన తెలిపారు. ముద్రగడ వెంట తాముంటామని కాపు యువకులు స్పష్టంచేశారు. నిమ్మల నాగు, టి రఘురాం, వెంకటరత్నం నాయుడు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
భారీ వర్షంతో నీట మునిగిన వరిచేలు
భీమడోలు : భీమడోలు మండలంలో సోమవారం ఆకస్మికంగా కురిసిన భారీ వర్షానికి వరిక్షేత్రాలు నీటమునిగాయి. 79.2 మిల్లీమీటర్ల వర్షపాతం ఒక్క సోమవారమే నమోదు కావడం విశేషం. భీమడోలు 220 కెవి విద్యుత్ ఉపకేంద్రంలో ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద నీరు నిలచిపోయింది. వ్యవసాయ అధికారుల ప్రాధమిక అంచనాల ప్రకారం 200 హెక్లార్ల విస్తీర్ణంలో వరిపైరు నీటమునిగి, జల దిగ్భందంలో వుంది. పిలకదశలో వున్న పైరు నీట మునగడం వలన పెద్దగా నష్టం ఉండదని అధికారులు చెబుతున్నారు. అయిదు రోజుల్లోగా మళ్లలో వున్న నీటిని తొలగించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రైతులకు సూచించారు.

నంద్యాలలో కొత్తపల్లి ఎన్నికల ప్రచారం
మొగల్తూరు: నంద్యాల ఉప ఎన్నికలలో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం నంద్యాల నియోజకవర్గంలోని పుల్లిమద్ది గ్రామంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బ్రహ్మానందరెడ్డి విజయంతో నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరుగుతుందని వివరించారు. ఆయన వెంట నాయకులు గురుజు శ్రీనివాస్, దేశంశెట్టి శ్రీనివాస్, పాల రాంబాబు, జోగి రాధాకృష్ణ తదితరులున్నారు.