ఖమ్మం

ఐటిహబ్ నిర్మాణ పనులు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఖమ్మంలో ఐటిహమ్ భవన నిర్మాణ కార్యక్రమం ప్రారంభమైంది. రెండునెలల క్రితం రాష్ట్ర ఐటిశాఖామంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేసిన స్థలంలోనే పనులను సోమవారం ప్రారంభించారు. మంత్రి ప్రారంభించిన నాటినుంచి అది వేరే ప్రాంతానికి బదలాయించబడిందని, సదరు స్థలం ఐటిహబ్‌కు సరిపోదని అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఖమ్మం ఎమ్మెల్యే అజయ్‌కుమార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ప్రభుత్వాన్ని ఒప్పించి, నిధులు మంజూరు చేయించి, టెండర్ల ప్రక్రియను పూర్తిచేయించి పనులను ప్రారంభించారు. సోమవారం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఐటిహబ్ పనులను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కొని ఐటిహబ్‌ను నిర్మించుకునే దశకు చేరుకున్నామన్నారు. ప్రకటనలకే పరిమితమైన అనేక మంది నాయకులు విమర్శలు మాని పనులను చూడాలన్నారు. ఖమ్మంలో పుట్టి పెరిగి, ఖమ్మంలో చదువుకొని ఖమ్మం ఎమ్మెల్యేగా ఉన్న తాను నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఇతర పార్టీల నేతలు విమర్శలు మాని ఖమ్మం అభివృద్ధికి సూచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విధంగా ప్రతిపక్ష నేతలు ఉంటే భవిష్యత్తులో సలహాలను కూడా స్వీకరించే పరిస్థితి ఉండదన్నారు. ఈ స్థలంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాలని కొందరు ప్రయత్నించారని, కాని ఐటిహబ్ నిర్మాణం వల్ల నగరం విస్తరిస్తుందన్నారు. ఆదాయ వనరులు పెరుగుతాయని, అన్ని రంగాల్లో జిల్లాకేంద్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రస్తుతం రెండువేల మందికి ఉపాధి దొరకనుండగా వచ్చే పదేశ్ళలో దానిని 20వేలకు పెంచి చూపిస్తామన్నారు. ఖమ్మం నగరం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నానని, ఇందులో ఎలాంటి స్వార్థం లేదని, నగర స్వరూపానే్న మార్చి చూపిస్తానని స్పష్టం చేశారు. నాడు తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని ఉద్యమించిన నాయకుడే నేడు ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఈ తరహా అభివృద్ధి సాధ్యమవుతున్నదని స్పష్టం చేశారు. అభివృద్ధిని చూపి ఓర్వలేక విమర్శలు చేస్తున్నవారికి ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ఖమ్మం నిలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. కాగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఖమ్మం నగర మేయర్ పాపాలాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, ఇతర ప్రజాప్రతినిధులు, భారీగా విద్యార్థులు హాజరయ్యారు.
స్వాతంత్య్ర వేడుకలకు ప్రకాశం గ్రౌండ్ ముస్తాబు
* వేడుకలకు హాజరుకానున్న మంత్రి పద్మారావుగౌడ్
కొత్తగూడెం: జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకల కోసం మైదానాలను సిద్ధం చేశారు. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే వేడుకలకు స్థానిక ప్రకాశం స్టేడియం గ్రౌండ్‌ను సిద్ధం చేయగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వేడుకలకు మున్సిపల్ గ్రౌండ్ (ప్రగతి మైదానం)ను ముస్తాబు చేశారు. ప్రగతి మైదానంలో నిర్వహించే వేడుకలకు రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, యువజన, క్రీడలశాఖా మంత్రి పద్మారావుగౌడ్ ముఖ్య అతిధిగా హాజరవుతారు. ప్రకాశం స్టేడియం గ్రౌండ్‌లో నిర్వహించే కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఎన్ శ్రీ్ధర్ పాల్గొంటారు. ప్రగతి మైదానంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు చెందిన శకటాలను ప్రదర్శించేందుకు ఆయా శాఖలకు చెందిన అధికారులు ఏర్పాట్లు చేయటంలో నిమగ్నమయ్యారు. కొత్తగూడెం శాసన సభ్యుడు జలగం వెంకటరావు సోమవారం గ్రౌండ్‌ను పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
కొత్తగూడెం: శుభ కార్యానికి కొత్తగూడెం నుంచి హైద్రాబాద్‌కు వెళుతున్న డాక్టర్ మద్దికాయల విజయ కుమార్ కుటుంబం సోమవారం రోడ్డు ప్రమాదానికి గురైంది. నల్లగొండ జిల్లా కట్టంగూర్ సమీపంలో విజయ కుమార్ కుటుంబం ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొనడంతో డాక్టర్ విజయ కుమార్ (58), అత్త దాసరాజు సావిత్రిబాయి(75)లు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, విజయకుమార్ భార్య డాక్టర్ ఝాన్సీ తీవ్ర గాయాల పాలై పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్ ఆసుపత్రికి తరలించారు. కొత్తగూడెం పట్టణంలో పాతికేళ్లకుపైగా గైనకాలజిస్టుగా పేరు పొందిన డాక్టర్ ఝాన్సీ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం, భర్త ప్రముఖ అనస్థీషియన్ డాక్టర్ విజయ కుమార్ మృతి చెందటంతో కొత్తగూడెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అదే కారులో ప్రయాణిస్తున్న శోభ అనే యువతి తీవ్రంగా గాయపడ్డారు. డాక్టర్ విజయ కుమార్ అకాల మరణం పట్ల కొత్తగూడెం శాసన సభ్యులు జలగం వెంకటరావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి కాసాని అయిలయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె సాబీర్‌పాషాలు సంతాపం ప్రకటించారు. విజయ కుమార్ మరణ వార్త తెలుసుకున్న కొత్తగూడెం పట్టణ వైద్యులు డాక్టర్ విజయేంద్రరావు, డాక్టర్ విజయ కుమార్, డాక్టర్ అరకల భాస్కర్, డాక్టర్ కనకరాజు, డాక్టర్ రమేష్‌బాబు తదితరులు హుటాహుటిన హైద్రాబాద్ వెళ్లారు. విజయకుమార్ తండ్రి మద్దికాయల ఓంకార్ వరంగల్ జిల్లా నర్సంపేట శాసనసభ్యునిగా, కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా పనిచేశారు.

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి
* ఊరూరా ఉట్ల పండుగ
ఖమ్మం(కల్చరల్): దుష్టశిక్షణ...శిష్టరక్షణకు మారుపేరైన శ్రీకృష్ణుడి జయంతిని జిల్లా అంతటా భక్తులు సోమవారం ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉదయానే్న లేచి శుభ్రంగా స్నానమాచరించి పగలంతా ఉపవాసదీక్షను చేపట్టారు. సాయంత్రం ఇంటిల్లిపాది భక్తిశ్రద్దల నడుమ కృష్ణుని పూజించారు. పండ్లు, పూలు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, మీగడ స్వామివారికి నైవేధ్యంగా సమర్పించారు. ఇంటి ఆవరణలో ఊయల కట్టి కృష్ణ్భగవాన్ విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ పలు రకాల పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. అనంతరం పలు రకాల ప్రసాదాలను పంచిపెట్టారు. దెగ్గరలోని ఆలయాలుకు వెళ్ళి ప్రత్యేకపూజలు నిర్వహించారు. చివరిగా పుర వీధుల్లో ఏర్పాటు చేసిన ఉట్ల వేడుకలో భక్తులు ఉత్సాహాంగా పాల్గొన్నారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ వేడుకల్లో పాల్గోనేందుకు యువకులు ముందుకు రాగా, వృద్ధులు సైతం ఉట్టి కొట్టేందుకు ముందుకు రావడం విశేషం. జిల్లాలో యాదవులు అధికంగా ఉన్న అనేక ప్రాంతాల్లో ఈ పండుగను సామూహికంగా నిర్వహించారు. కృష్ణుడు అనగానే ప్రత్యేకంగా భక్తులందిరికి యాదవులు గుర్తుకొస్తారు. శ్రీకృష్ణుడ్ని కులదైవంగా కొలుచే యాదవులు ఈ వేడుకల్ని ఒక రోజు ముందునుండే నిర్వహిస్తున్నారు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకొని ఆవు, లేగదూడలను శుభ్రం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులచే శ్రీకృష్ణుడు, గోపికల వేశధారణలు వేయించి ప్రత్యేక ప్రదర్శనలిచ్చారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. నగరంలో ఈ వేడుకల్ని యాదవ సంఘం ఆధ్వర్యంలో అనేక కూడళ్ళ వద్ద ఉట్ల పండుగను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. వేడుకను వీక్షించేందుకు కుల మత బేధం లేకుండా ఆయా ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు. నగరంలోని డాబాలబజారులోని శ్రీకృష్ణ ఆలయం, ప్రకాష్‌నగర్‌లోని గోపాలకృష్ణ ఆలయంతో పాటు అనేక ఆలయాల్లో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.

రామయ్య సేవలో జిల్లా ఎస్పీ
భద్రాచలం టౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా సోమవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు దేవస్థానం ఈవో ప్రభాకర శ్రీనివాస్, అర్చకులు స్వాగతం పలికారు. తొలుత ధ్వజస్తంభం వద్ద నమస్కరించి గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి తీర్ధప్రసాదాలు అందజేశారు. దేవస్థానం ఈవో ప్రభాకర శ్రీనివాస్ జ్ఞాపికలను అందజేశారు. ఆయన వెంట ఏఎస్పీ సునీల్‌దత్, సిఐ బాణాల శ్రీనివాసులు, పట్టణ ఎస్సై కరుణాకర్, ట్రాఫిక్ ఎస్సై అబ్బయ్య ఉన్నారు.
సింగరేణి వ్యాప్తంగా స్వచ్ఛ పక్వాడ్
కొత్తగూడెం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్వచ్ఛ పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సింగరేణి కాలరీస్ జనరల్ మేనేజర్ పర్సనల్ అండ్ సిఎస్‌ఆర్ మసూద్ ముజాహిద్ తెలిపారు. సోమవారం సింగరేణి కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 16వ తేదీ నుంచి 31వరకు నిర్వహించే స్వచ్ఛ పక్వాడ్ కార్యక్రమాన్ని మంగళవారం చైర్మన్ చేతుల మీదుగా ప్రారంభిస్తారని తెలిపారు. సింగరేణి పరిధిలోని 11 ఏరియాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని సింగరేణి అధికారులు, కార్మికులు, సింగరేణీయులంతా కలిసి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో హెచ్‌ఆర్‌డి జిఎం రామలింగేశ్వరుడు, ఎస్‌వోటూ డైరక్టర్ (పా) మురళీ సాగర్ కుమార్, డిజిఎం దీక్షితులు, ఖాదరేంధ్రబాబు, డిజిఎం పర్సనల్ నికోలస్, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
పిల్లలకు వ్యాక్సిన్లు ఇప్పించాలి
భద్రాచలం టౌన్: కేంద్ర ప్రభుత్వం ఈనెల 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు చేపట్టిన మీజిల్స్ రూబెల్లా వ్యాక్సిన్‌ను 9నెలల నుంచి 15 సంవత్సరాల వయస్సున్న పిల్లలందరికీ తప్పక వేయించాలని భద్రాచలం ఐఎంఏ వైద్యులు పేర్కొన్నారు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం మీజిల్స్ రూబెల్లా వ్యాక్సిన్ కార్యక్రమం విజయవంతం కోసం చేపట్టిన ప్రచారంలో భాగంగా పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వైద్యులు నరేష్‌కుమార్, జయభారతి, రవికుమార్, రాజశేఖర్, విజయ్‌రావు మాట్లాడుతూ మిజిల్స్ ప్రాణాంతకమైన వ్యాధి అని, దీని బారిన పడితే జలుబు, జ్వరం, తగ్గు, శరీరంపై దద్దుర్లు వస్తాయని తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల సంభవించే ఈ వ్యాధి సోకకుండా నివారణ ఒక్కటే మార్గమని తెలిపారు. వ్యాధి రాకముందే వ్యాక్సిన్‌తో రూపుమాపేందుకు వీలుందని, ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టిసారించి తమ పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయించాలన్నారు. రుబెల్లా వ్యాధి కూడా ప్రమాదకరమని, ఇది గర్భిణీలకు వస్తే శిశువుపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఈ వ్యాధి మూలంగా కంటి శుక్లాలు దెబ్బతినడం, వినికిడి లోపం, గుండె లోపాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. బుద్ధిమాంధ్యం గల పిల్లలు పుడతారని, ఈ వ్యాక్సిన్ యుక్త వయస్సు ఆడపిల్లలకు ఒక వరంగా భావించాలని సూచించారు. దీనివల్ల మొగ్గలోనే ఈ వ్యాధులను నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని, తద్వారా తమ పిల్లలకు వ్యాధులు రాకుండా చూడాలని కోరారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ కోటిరెడ్డి మాట్లాడుతూ పిల్లల్లో వచ్చే ప్రాణాంతకమైన వ్యాధులను దూరం చేసేందుకు వైద్యఆరోగ్యశాఖ చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఐఎంఏ వైద్యులను కూడా భాగస్వామ్యం చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి పాఠశాలలో, అంగన్‌వాడీ కేంద్రంలో, పీహెచ్‌సీల్లో మీజిల్స్ రూబెల్లా వ్యాక్సిన్‌పై గోడపత్రికల ద్వారా ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. దీనిపై ఏఎన్‌ఎంలకు, పాఠశాలల హెచ్‌ఎంలకు, అంగన్‌వాడీ కార్యకర్తలకు ముందుగానే అవగాహన కల్పించామని తెలిపారు. శిశు మరణాలు తగ్గించే లక్ష్యంగా చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమంపై తల్లిదండ్రులు అవగాహన పెంచుకొని తమ పిల్లలకు వ్యాక్సిన్ అందించేలా చూడాలని కోరారు. విలేఖర్ల సమావేశంలో వైద్యులు సుదర్శన్‌రావు, పవన్‌కుమార్, సీతారామరాజు, రమేష్‌చంద్ర, అజిత్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మీజిల్స్ రూబెల్లా వ్యాక్సిన్ క్యాంపెన్ పోస్టర్లను ఆవిష్కరించారు.
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
ఏన్కూరు: విద్యుద్ఘాతంతో యువకుడు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని అకినాపురంతండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆ గ్రామానికి చెందిన దారావత్ సైదులు(21) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన బాదావత్ సక్రు పొలానికి కూలీపని నిమిత్తం వెళ్ళారు. పొలంలో విద్యుత్‌మోటర్ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌వైర్లు తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. తల్లి యశోద ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నాగరాజు సంఘటనా స్థలానికి వెళ్ళి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.