గుంటూరు

దూర ప్రయాణికులకు 100 బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుంటూరు రీజియన్ పరిధిలో వరుస సెలవలు రావడంతో దూరప్రాంతాల నుండి వచ్చిన ప్రయాణికుల సౌకర్యార్ధం ఆర్టీసీ 100 ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసినట్లు ఆర్టీసీ ఆర్ ఎం జ్ఞానంగారి శ్రీహరి తెలిపారు. సోమవారం ప్రాంతీయ కార్యాలయంలో మాట్లాడుతూ గుంటూరు నుండి బెంగళూరు, చెన్నై, తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం, కెపిహెచ్‌బి కాలనీలకు వెళ్లే ప్రయాణికులకు నగరంలోని కొరిటెపాడు, గుజ్జనగుండ్ల, ఎస్‌వి ఎన్ కాలనీ, లక్ష్మీపురం, బృందావనగార్డెన్స్, లక్ష్మీపురం, గోరంట్ల, ఆటోనగర్, సంగడిగుంట, ఎన్ టి ఆర్ బస్‌స్టేషన్, ఎలైటింగ్ పాయింట్ల నుండి బస్సులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రయాణికులు టిక్కెట్లు తీసుకొనుటకు ఆర్టీసీ అధీకృత ఏజంట్ల ద్వారా ఆన్‌లైన్ రిజర్వేషన్ పద్ధతిలో కూడా పొందవచ్చన్నారు. గుంటూరు నుండి బెంగళూరుకు 10, గుంటూరు నుండి చెన్నైకు 20, తిరుపతికి 3, నెల్లూరుకు 3, విశాఖపట్నంకు 2, బిహెచ్‌ఇఎల్ 36, కెపిహెచ్‌బి కాలనీకి 26 బస్సులను అదనంగా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరిన్ని సర్వీసులు కూడా నడిపేందుకు సంస్థ సిద్ధంగా ఉందని, వీటితో పాటు రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుండి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు యధావిధిగా కొనసాగుతాయని శ్రీహరి తెలిపారు.
కాచిగూడ-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాచిగూడ నుంచి కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు గుంటూరు రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె ఉమామహేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 07452 నెంబర్ గల కాచిగూడ నుంచి రైలు సాయంత్రం 6.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.40 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుందన్నారు. మల్కాజ్‌గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, సామర్లకోట మీదుగా కాకినాడటౌన్‌కు చేరుకుంటుందన్నారు. అలాగే 07453 నెంబర్ గల కాకినాడ టౌన్ నుండి ప్రారంభమయ్యే సాయంత్రం 18.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కాచిగూడ చేరుకుంటుందన్నారు. ఈనెల 21వ తేదీ నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు పేర్కొన్నారు.

వ్యక్తి దారుణ హత్య
తాడేపల్లి: మండల పరిధిలోని పెనుమాక గ్రామంలో సోమవారం బుల్లా రవి (32) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసులు సమాచారం ప్రకారం కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన బుల్లా రవి పెనుమాక గ్రామానికి చెందిన ఒక రైతు వద్ద పొలం కౌలుకి తీసుకుని బెండసాగు చేస్తున్నాడు. సోమవారం ఉదయం రవి తన భార్యతో కలిసి పొలంలో పని చేస్తుండగా నలుగురు వ్యక్తులు వచ్చి తమకు బెండకాయలు కావాలని, ధర చెప్పాలని రాణిని కోరారు. అపై రాణితో వాగ్వాదం జరగటంతో పొలంలో పని చేస్తున్న రవి వారిని అడ్డుకోవటానికి ప్రయత్నించాడు. దీంతో నలుగురు వ్యక్తులు రవిని కొట్టి పారిపోవటంతో అతను పొలంలోనే చనిపోయాడు. సదరు ఘటనపై రవి భార్య రాణి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం ఇవ్వటంతో గుంటూరు నార్త్‌జోన్ డిఎస్పీ రామాంజనేయులు, సిఐ మధుసూదనరావు, తాడేపల్లి ఎస్సై ప్రతాప్‌కుమార్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు. కాగా వివాహేతర సంభందం నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని కొందరు స్థానికులు భావిస్తున్నారు.
మహిళల స్థితిగతులు దయనీయం
గుంటూరు: మహోన్నత పోరాటం సాగించి స్వాతంత్య్ర సముపార్జన జరిగినప్పటికీ సమాజంలో సగభాగంగా ఉన్న మహిళల స్థితిగతులు నేటికీ దయనీయంగా ఉన్నాయని శాసనమండలి సభ్యుడు బొడ్డు నాగేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపంలో 70 ఏళ్ల స్వాతంత్య్రం-మహిళలు అనే అంశంపై సమావేశం జరిగింది. సిఐటియు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డి శివకుమారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి కనీస హక్కులకు దూరమవుతున్నారన్నారు. మహిళలంతా ఈ సౌకర్యాలను పొందగలిగినప్పుడే సమానత్వం సాధ్యమవుతుందని తెలిపారు. ఓటు హక్కుతో ప్రభుత్వాలను మనం ఏర్పర్చుకున్నప్పటికీ ఆ ప్రభుత్వాలే సుస్థిర అభివృద్ధి కోసం ప్రణాళికలను రూపొందించడంలో విఫలమయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రధానవక్తగా హాజరైన గాంధీ హాస్పిటల్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ రమాదేవి మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది అనేక రోగాలకు పరిష్కారాలు కనుగొన్నారని, అవయవాల మార్పిడి కూడా జరుగుతుందని తెలిపారు. అయితే ఆ సౌకర్యాలు ప్రజలందరికీ అందుబాటులోకి రాకపోవడం శోచనీయమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, ఇతర సిబ్బంది కొరత 80 శాతంగా ఉందన్నారు. ప్రతి యేటా మనదేశంలో 2.5 లక్షల మంది మహిళలు రొమ్ము క్యాన్సర్‌తో మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 63 శాతం మంది మహిళలు పౌష్టికాహారలోపం, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడుతున్నారని ఇప్పటికీ సమాజంలో ఆడపిల్ల పుట్టుకపై దురాభిప్రాయం ఉండటం సిగ్గుచేటన్నారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక, సమానత్వ సాధన నేటికీ కలగానే మిగిలిపోయిందన్నారు. విద్య, ఆరోగ్య రంగాల్లో ఆదర్శప్రాయమైన ఫలితాలు సాధించి కేరళ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన నిలిచిందని, దీనికి అక్షరాస్యతే ప్రధాన కారణమన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కె ధనలక్ష్మి, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె సుబ్బరావమ్మ, నాయకులు కెపి మెటివ్లాదేవి, టి రాధ, అన్నమ్మ, కళ్యాణి, అంజలి తదితరులు పాల్గొన్నారు.

సర్వత్రా నిండియున్నది కృష్ణచైతన్యమే...
గుంటూరు (కల్చరల్): శ్రీకృష్ణుని జీవితం ఎల్లప్పుడూ మహిమల భరితమై సాగిందని, ఆయన అప్పుడూ, ఇప్పుడు, ఎల్లప్పుడూ కూడా యావత్ సృష్టిని నిత్య చైతన్యం చేస్తూనే ఉన్నారని విభిన్న రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు శ్రీకృష్ణమూర్తిని ప్రస్తుతించారు. సోమవారం రాత్రి నగరంలోని హిందూ ఫార్మశీ కళాశాలలో స్వామి వివేకానంద సమావేశ మందిర వేదికపై శ్రీ కృష్ణ గీతాత్రయ గ్రంథావిష్కరణ సభ జరిగింది. ఈ గ్రంథాన్ని హిందూ కళాశాల పాలకమండలి అధ్యక్షుడు ఎస్‌విఎస్ సోమయాజి రచించారు. అధ్యక్షత వహించిన కళాశాల ఛైర్మన్ డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి, విశిష్ఠ అతిథి సీనియర్ ఐపిఎస్ అధికారి బివి రమణకుమార్, గౌరవ అతిథి, సంస్కతాంధ్ర పండితుడు మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి తదితరులు శ్రీకృష్ణ భగవానుడు అవతరిస్తున్న వేళ జయంతి మహోత్సవాలను పురస్కరించుకుని సోమయాజి కృష్ణయ్య పేరిట గీతాత్రయ గ్రంథాన్ని రచించడం, ఈ సందర్భంగా ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందించే సభలో తాను పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం పరిపూర్ణ అవతార స్వరూపుడుగా శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర యుగాన జన్మించారని పేర్కొన్నారు. వేమూరి హేమవతి శతజయంతి ఉత్సవంలో భాగంగా వేమూరి ఆదినారాయణ, సోమయాజులు వారి కుటుంబ సభ్యులు ఈ సభను ఏర్పాటు చేశారు. వక్తలంతా దివంగత వేమూరి హైమావతి చేసిన ఆధ్యాత్మిక, ధార్మిక సేవలను స్మరించుకున్నారు. సభకు ముందు ప్రముఖ తరంగగాన విద్వాంసులు ఘోరకవి సంపత్‌కుమార్ తన బృందంతో సద్గురు శ్రీ నారాయణతీర్ధ యతీంద్రులు రచించి, ఆడిపాడిన శ్రీ కృష్ణ లీలాతరంగిణి భక్తి గీతాలను మనోహరంగా ఆలపించారు. వేమూరి ఆదినారాయణ, సోమయాజులు అతిథులుగా విచ్చేసిన ప్రముఖులు సంపత్‌కుమార్ బృందాన్ని సత్కరించారు.

కనువిందు చేసిన బాలగోకులం
గుంటూరు (కల్చరల్): శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరంలోని బృందావన గార్డెన్స్ వెంకన్న ఆలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణ వేదికపై సంస్కార భారతి గుంటూరు వారి ఆధ్వర్యాన విస్తృతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వీటిలో భాగంగా వివిధ పాఠశాలల నుంచి విచ్చేసిన బాలబాలికలు ప్రదర్శించిన కోలాట నృత్యం నందనందనుడికి నృత్య నీరాజనాలర్పించింది. 200 మందికి పైగా విద్యార్థినీ, విద్యార్థులు కోలాట భజన చేస్తూ గోవిందుని వైభవాన్ని తమ విన్యాసాల ద్వారా ప్రదర్శించి వీక్షకులను ఆకట్టుకున్నారు. భగవద్గీత కంఠస్త పోటీల్లో ఉత్సాహంగా వివిధ వయస్సులకు చెందిన బాల బాలికలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. శ్రీకృష్ణ భగవానుని గళం నుంచి జాలువారిన భగవద్గీతలోని అధ్యాయాలను సంస్కార భారతి ఎంపిక చేసి పోటీలు నిర్వహించగా వాటిలోని శ్లోకాలను పోటీల్లో పాల్గొన్న చిన్నారులంతా పఠించారు. అంతేకాకుండా ఉట్టికొట్టే ఉత్సవం, బాలకృష్ణుని వేషధారణ పోటీల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు, జన్మాష్టమి వేడుకలకు హాజరైన ప్రముఖులందరినీ ఆకట్టుకున్నారు. బృందావన గార్డెన్స్ వెంకన్న ఆలయ అధ్యక్షుడు సిహెచ్ మస్తానయ్య, కార్యవర్గ సభ్యులు సంస్కార భారతి అధ్యక్షుడు ఇండ్ల శ్రీ్ధర్‌బాబు, సభ్యులు అతిథులుగా విచ్చేసిన ప్రముఖులు జన్మాష్టమిని పురస్కరించుకుని నిర్వహించిన భగవద్గీత శ్లోకాల పోటీలు, కోలాట నృత్య పోటీలు, వేషధారణ పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
అన్ని రంగాల్లో భారత్ ముందంజ
గుంటూరు: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గత ఏడు దశాబ్దాలుగా దేశం ప్రపంచ దేశాల్లో కెల్లా పురోగతి సాధిస్తోందని ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నగరంలోని లాడ్జిసెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు 70 సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డొక్కా మాట్లాడుతూ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రపంచ స్థాయిలో రూపుదిద్దుకోబోతుందని తెలిపారు. రాష్ట్భ్రావృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహరహం శ్రమిస్తున్నారని చెప్పారు. సాంఘిక అసమానతలపై ఉద్యమించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావుపూలే వంటి మహనీయుల త్యాగం మరువరానిదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు రాయపాటి శ్రీనివాస్, మహ్మద్ జాని, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్, షేక్ షౌకత్, టిడిపి జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్‌వలి, పార్టీ నాయకులు కాకుమాను పున్నారావు, క్రాంతికుమార్, వీరమణి, బిక్కూ నాయక్, మాదిగ జనసేవా సమితి నాయకులు దాసరి జాన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ఆటోడ్రైవర్ ఆత్మహత్య
మంగళగిరి: పట్టణంలోని పావురాల కాలనీకి చెందిన కె కిషోర్ అనే ఆటో డ్రైవర్ సోమవారం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కధనం ప్రకారం కిషోర్ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య, కుమారుడు, కుమార్తె కిషోర్‌కు ఉన్నారు. మద్యానికి బానిస కావడంతో కిషోర్ ఆరోగ్యం ఇటీవల క్షీణించింది. ఏడాదిక్రితం పక్షవాతానికి గురై కోలుకున్నాడు. మద్యం తాగితే ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్యులు చెప్పినా తరచుగా మద్యం తాగి వస్తుండటంతో భార్య మందలించింది. సోమవారం కూడా మద్యంతాగి ఇంటికి రావడంతో భర్తపై కోపగించుకుంది. తీవ్ర మనస్థాపానికి గురైన కిషోర్ జీవితంపై విరక్తి చెంది ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసుకుని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంతసేపటికీ కిషోర్ బైటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన భార్య ఇరుగు పొరుగు సాయంతో తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించగా అప్పటికే కిషోర్ మృతిచెందాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పట్టణ ఎస్సై సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇన్‌చార్జి మంత్రి అయ్యన్నపాత్రుడికి ఘన స్వాగతం
గుంటూరు (కొత్తపేట): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి గుంటూరు వచ్చిన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి గుంటూరు రైల్వేస్టేషన్‌లో సోమవారం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పార్టీ నాయకులు దాసరి రాజామాస్టారు, దామచర్ల శ్రీనివాసరావు, మువ్వా వేణుబాబు, నూతలపాటి గోపినాధ్, పమిడి ఆంజనేయులు తదితరులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలందరూ చురుగ్గా పాల్గొని పార్టీ పటిష్టతకు కృషిచేయాలని కోరారు.
రహదారి ఆక్రమిస్తే అపరాధ రుసుం వసూలు చేస్తాం..
తెనాలి: తెనాలి పురపాలక సంఘం పరిధిలోని 40వార్డుల్లో రహదార్లు ఆక్రమించినా, పశువులు కట్టివేసినా, ఇతర కట్టడాలు చేపట్టినా వారిని గుర్తించి అపరాధ రుసుం వసూలు చేయాలని చైర్మన్ పెండేల వెంకట్రావు అధికారులను ఆదేశించారు. వార్డుల పర్యటనలో భాగంగా సోమవారం ఆయన పట్టణంలోని 23వ వార్డులో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, కౌన్సిలర్లతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్లుపై పశువులు కట్టివేయటం, రోడ్డుకు అడ్డుగా మట్టివేయటం, మురుగునీరు ముందుకు పారకుండా కాలువల్లో చెత్తాచెదారం వేయటం వంటి సంఘటనలను ఆయన గుర్తించారు. ఎంపిహెచ్ డాక్టర్ బివి రమణ, కాంట్రాక్టరు, పారిశుద్ధ్య కార్మికులకు తక్షణమే పిలించి ఆక్రమణల తొలగింపు, కాలువల్లో పేరుకుపోయిన మురుగును బయటకు తీయించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ పారిద్ధ్యం విషయంలో అధికారులు, కార్మికులు ప్రజలను చైతన్యపరిచాలని సూచించారు. పలుమార్లు చెప్పినా నిర్లక్ష్యం వహించే ఆక్రమణలు, పశువులను రోడ్లపై కట్టివేసే వారిని గుర్తించి వారిపై అపరాధ రుసుం విధించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ సహాయ కమిషనర్ బి విజయసారధి, వార్డు కౌన్సిలర్ ఆశీర్వాదం, టిడిపి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

వీధుల్లో తిరిగితే పందులను వధిస్తాం:కమిషనర్
మంగళగిరి: పట్టణంలో విచ్చల విడిగా తిరిగే పందుల్ని సంహరించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ ఎన్‌వి నాగేశ్వరరావు అన్నారు. సోమవారం పట్టణంలో ఫ్రీడం ఫ్రం ఓపెన్ డెఫికేషన్ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో పందుల నిర్మూలనకు చర్యలు ప్రారంభించారు. ప్రజారోగ్య సిబ్బందికి కమిషనర్ నాగేశ్వరరావు పందుల నిర్మూలన, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణపై సూచనలు చేశారు. పట్టణణలో సంచరిస్తున్న పందుల వలన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, అనేకమంది అనారోగ్యానికి గురవుతున్నారని, అంటువ్యాధులు రాకుండా పందుల నిర్మూలనకు చర్యలు చేపట్టామని, కొన్ని పందులను సంహరించామని కమిషనర్ నాగేశ్వరరావు తెలిపారు. పందులను ఇళ్లల్లో పెంచుకునే యజమానులు రోడ్లపై విడిచి పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్లపై తిరిగే చర్యలు తీసుకుంటామని ఆయనన్నారు. రాజధాని ప్రాంతం కావడంతో ప్రముఖుల రాకపోకలు పెరిగినందున పందులు తిరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పందుల సంచారం ఎక్కడ ఉన్నా ప్రజలు పురపాలక సంఘానికి తెలియ జేయాలని ఆయన కోరారు.

తరగతి గదులు మంజూరు చేయిస్తా...
* సభాపతి కోడెల శివప్రసాదరావు
సత్తెనపల్లి:శిధిలమైన పాఠశాల తరగతి గదుల స్థానంలో కొత్త తరగతి గదులను మంజూరు చేయిస్తానని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో పార్టీ నాయకులతో అనేక విషయాలను చర్చించారు. సెప్టెంబర్ 5 నుంచి చంద్రన్న బీమా రెన్యూవల్‌ను కార్యకర్తలు దగ్గరుండి పూర్తిచేయించాలని అన్నారు. అందేకాకుండా దమ్ము ట్రాక్టర్లను రోడ్లపై తిరగనీయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తారురోడ్లు పాడైపోతాయని అన్నారు. రైతులు ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనావుందని అన్నారు. నియోజకర్గంలో చెక్ డ్యామ్‌ల గురించి మైనర్ ఇరిగేషన్ ఎస్సీతో కోడెల చరవాణిలో చర్చించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి, ఎపిపి బొర్రా కోటేశ్వరరావు, పార్టీ అధ్యక్షులు మక్కపాటి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
నవులూరులో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
మంగళగిరి: మండల పరిధిలోని నవులూరులో సోమవారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సినీ నటుడు నిఖిల్ సిద్ధార్ధ్ యాదవ్ వేడుకల్లో పాల్గొని అలరించారు. ఉట్టికొట్టే వేడుక నిర్వహించారు. మంగళగిరి పట్టణ శివారునుంచి యాదవసంఘం ఆధ్వర్యాన నిఖిల్‌ను భారీ ర్యాలీగా నవులూరు తీసుకెళ్లారు. పెద్దసంఖ్యలో ద్విచక్ర వాహనాలతో ర్యాలీలో పాల్గొన్నారు. చావలి ఉల్లయ్య, తోట శ్రీనివాసరావు, నల్లగొర్ల శ్రీనివాస్, దానబోయిన సుందరరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.