తూర్పుగోదావరి

రసకందాయంలో కార్పొరేషన్ రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలలో బిజెపి కార్పొరేటర్ అభ్యర్ధుల వివరాలను సోమవారం ప్రకటించారు. బిజెపి శాసన సభ పక్ష నేత, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు జిల్లా కేంద్రం కాకినాడలో సోమవారం 9 మంది అభ్యర్ధులను ప్రకటించారు. అంతకు ముందు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మంత్రి యనమల రామకృష్ణుడుతో అచ్చంపేటలోని అతిథి గృహంలో భేటీ అయ్యి బిజెపి అభ్యర్ధుల వివరాలను తెలియజేశారు. కాకినాడ కార్పొరేషన్‌లో 4వ డివిజన్‌కు తోట నాగలక్ష్మి, 5వ డివిజన్‌కు ఎన్ సుజాత, 9వ డివిజన్‌కు యెనిమిరెడ్డి మాలకొండయ్య, 29వ డివిజన్‌కు చిట్నీడి శ్రీనివాస్, 53వ డివిజన్‌కు కొండాబత్తుల ప్రసాదరావు, 36కు సాలగ్రామ లక్ష్మీప్రసన్న, 39కి బీర కృష్ణప్రియ, 41కి గోడి సత్యవతి, 47కు జి పద్మను కార్పొరేటర్ అభ్యర్ధులుగా ప్రకటించారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఆదేశాల మేరకు ఈ అభ్యర్ధుల జాబితా ప్రకటించినట్టు చెప్పారు. ఇదిలావుంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే 34 మంది అభ్యర్ధులను ప్రకటించింది. మరో ఐదుగురు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. అలాగే మేయర్ అభ్యర్ధి ఎవరనే ఉత్కంఠ సర్వత్రా కొనసాగుతోంది. మేయర్ పీఠాన్ని కాపు సామాజికవర్గానికి చెందిన మహిళకు టిడిపి ప్రకటించింది. దీంతో ఆ సామాజికవర్గానికి చెందిన ఐదుగురు మహిళలు మేయర్ అభ్యర్ధిత్వం కోసం విశ్వప్రయత్నాలు సాగిస్తున్నారు. మాకినీడి శేషుకుమారి, అడ్డూరి లక్ష్మీశ్రీనివాస్, సుంకర పావని, జ్యోతుల ఇందిర, సుంకర శివప్రసన్నలలో ఎవరో ఒకర్ని మేయర్‌గా సూచించాలని కోరుతూ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఇక వైసిపి విషయానికి వస్తే కార్పొరేటర్ అభ్యర్ధుల జాబితాపై కసరత్తు చేస్తోంది. ఓవైపు జాబితాను సిద్ధం చేస్తూనే ఇంకోవైపు అసమ్మతివాదులను దువ్వే ప్రయత్నాల్లో వైకాపా నేతలున్నారు. అలాగే మేయర్ అభ్యర్ధిని కూడా ఏ సామాజికవర్గానికి ఇచ్చేదీ ఆ పార్టీ ప్రకటించాల్సి ఉంది. అయితే రాగిరెడ్డి కుమార్ (ఫ్రూటీ కుమార్) సతీమణి దీప్తి చంద్రకళను మేయర్ అభ్యర్ధిగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈమెతో పాటు మరో ఇద్దరు అభ్యర్ధులు మేయర్ అభ్యర్ధిత్వం కోసం విశ్వప్రయత్నాలు సాగిస్తున్నారు.
పల్ల వెంకన్న నర్సరీలో మొక్కలతో జాతీయపతాకం
కడియం: పంద్రాగస్టును పురస్కరించుకుని కడియం పల్లా వెంకన్న నర్సరీలో మొక్కలతో రెపరెపలాడే జాతీయ పతాకాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. మహాత్మా గాంధీ రూపాన్ని, త్రివర్ణ పతాకాన్ని పలు రకాల బోర్డర్ మొక్కలతో సొగసుగా తీర్చిదిద్దారు. ప్రతి ఏడాది స్వాతంత్య్ర దినోత్సవానికి స్థానిక నర్సరీ రైతు పల్ల వెంకన్న ఈ విధమైన ఆకృతులతో సందర్శకులకు కనువిందు చేస్తున్నారు.

నేడు ‘పురుషోత్తపట్నం’ ప్రారంభం
*ముఖ్యమంత్రి చంద్రబాబు రాక*అంతా సిద్ధం.. వర్షం బెడదతో అధికారుల ఆందోళన*ఆదరాబాదరా రెండో పంపు బిగింపు
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రారంభించేందుకు అంతా రెడీ అయ్యింది..కానీ వానొస్తే ఆ ప్రాంతమంతా చిత్తడి చిత్తడే మరి..అందుకే అధికారులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నారు. అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. పుష్కర ఎత్తిపోతల పథకం నుంచి విద్యుత్ సరఫరాను పురుషోత్తపట్నానికి వినియోగిస్తున్నారు. హంద్రీనివా ఎత్తిపోతల పథకం నుంచి తీసుకొచ్చిన రెండు పంపుల్లోనూ ఇప్పటికి ఒక పైంపు బిగించడం పూర్తయింది. సోమవారం ఉదయం నుంచి రెండో పంపు బిగించడాన్ని మొదలు పెట్టారు. రాత్రికి గానీ ఈ పంపు బిగించడాన్ని పూర్తిచేసి ఆపై తెల్లవారు జామున గానీ ట్రయిల్న్ వేసేందుకు అవకాశం కనిపించడం లేదు. జల వనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, కాంట్రాక్టు సంస్థ సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు అంతా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకం హెడ్ వర్క్సు జరుగుతున్న పురుషోత్తపట్నం వద్దే మకాం వేశారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయురామరాజు, అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి గత రెండు రోజులుగా ఇక్కడి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూనే వున్నారు. వర్షానికి పాడైన రోడ్లను యుద్ధ ప్రాతిపదికన నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఈ పనుల పర్యవేక్షణకు ముగ్గురు తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి హెలీకాప్టర్‌లో సీతానగరం చేరుకుని అక్కడ నుంచి రోడ్డుమార్గం ద్వారా పురుషోత్తపట్నం ఎత్తిపోతలపథకం హెడ్ వర్క్సు వద్దకు చేరుకుని పథకం పంపుహౌస్‌లో పంపులకు స్విచ్ ఆన్‌చేసి పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడే ఫైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం నేలకోట చేరుకుని అక్కడ జలపూజ నిర్వహిస్తారు. అక్కడే భోజన విరామం అనంతరం బయలుదేరి జగ్గంపేట వద్ద స్టేజ్ 2 పంపుహౌస్ వద్దకు చేరుకుని స్విచ్ ఆన్ చేసి అనంతరం జగ్గంపేట బహిరంగ సభలో రైతులనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లను అధికారుల ఆదరాబాదరా పర్యవేక్షిస్తున్నారు. నేలకోట ప్రాంతం కొండకోనల మధ్య ఉండే ప్రాంతం కాబట్టి అత్యధిక భద్రతా చర్యలు చేపట్టారు. నేలకోట వద్ద హెలీప్యాడ్ నిర్మించారు. నేలకోట డిశ్చార్జి పాయింట్ వద్ద యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడే కొద్ది సేపు ఉండి ముఖ్యమంత్రి పథకాన్ని పరిశీలించనున్నారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ఇటు స్టేజ్ 1, స్టేజ్ 2 వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షించేందుకు గత 48 గంటలుగా తిరుగుతూనే ఉన్నారు. జిల్లా యంత్రాంగమంతా ముఖ్యమంత్రి పర్యటన మీదే దృష్టి కేంద్రీకరించింది.
పైపులైన్ పనులు పూర్తయ్యాయి. రోడ్డు క్రాసింగ్ పనులు పూర్తి కాలేదు. పథకం ప్రారంభించేందుకు 24 గంటల ముందు వరకు ఒక పంపు బిగింపు పూర్తికాలేదు. అర్ధరాత్రి దాటినతర్వాత గానీ ట్రయిల్ రన్ వేయనున్నారు. ఒకే ప్రెజర్‌మెయిన్‌కు వెంట వెంటనే వెల్డింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక వైపు పర్యటన ఏర్పాట్లు, హెలీప్యాడ్ సిద్ధం చేయడం, మరో వైపు పంపుహౌస్, ప్రెజర్‌మెయిన్ పనులు సిద్ధం చేయడం అంతా ఆదరాబాదరా పనులు జరుగుతున్నాయి. వర్షం రాకపోతే మాత్రం పర్యటన అంతా సజావుగానే సాగేందుకు అవకాశం ఉంది. వర్షం వస్తే మాత్రం పురుషోత్తపట్నం, నేలకోట, హెడ్ వర్క్సు ప్రాంతం, పైపులైన్ పనులు జరుగుతున్న ప్రాంతాలు చిత్తడి నేలలు కాబట్టి అంతా బురదమయంగా మారిపోతాయి. చినకొండేపూడి, నేలకోట వెళ్లే రహదారి నీట మునిగిపోయే ప్రమాదం ఉంది. నేలకోట వెళ్లేందుకు చీపురుపల్లి మీదుగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ పురుషోత్తపట్నం పర్యటనకు అంతా రెడీ అయ్యింది.
సిఎం పర్యటన సాగేదిలా..
రాజమహేంద్రవరం: రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం భారీ బందోబస్తు నడుమ జరగనుంది. పర్యటనకు అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేశారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు వస్తున్న ముఖ్యమంత్రి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సీతానగరం కాలేజి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్‌లో దిగుతారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పంపుహౌస్ వద్దకు చేరుకుని మోటార్లకు స్విచ్ ఆన్ చేసి పథకాన్ని ప్రారంభించి ఫైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అక్కడ నుంచి మళ్లీ రోడ్డు మార్గం ద్వారానే సీతానగరంలోని హెలీప్యాడ్‌కు చేరుకుని అక్కడ నుంచి హెలీకాప్టర్‌లో నేలకోట గ్రామం వద్ద దిగుతారు. అక్కడ నిర్మించిన డిశ్చార్జి పాయింట్‌ను ప్రారంభిస్తారు. విడుదలయ్యే పురుషోత్తపట్నం జలాలకు శుభసూచికంగా జల పూజ నిర్వహిస్తారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడతారు. కొద్ది సేపు భోజన విరామం అనంతరం హెలీకాప్టర్‌లో బయలుదేరి జగ్గంపేట వద్ద రామవరం గ్రామం వద్ద హెలీప్యాడ్‌లో దిగుతారు. అక్కడ పురుషోత్తపట్నం స్టేజ్ 2 పంపుహౌస్‌ను ప్రారంభిస్తారు. అక్కడ కూడా నీటి విడుదల ఉంటుంది. అనంతరం గోకవరం రోడ్డులో జరిగే బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుని రైతులనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం కొద్ది సేపు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, డిప్యూటి సిఎం చిన రాజప్ప నుంచి విషయాలు తెలుసుకుంటారని తెలుస్తోంది. అక్కడ నుంచి బయలుదేరి హెలీకాప్టర్‌లో మధురపూడి విమానాశ్రయానికి చేరుకుని షంషాబాద్ వెళతారు.

కాలువలో స్నానం చేస్తూ ఇద్దరు విద్యార్థులు మృతి
యు కొత్తపల్లి: కాలువలో స్నానం చేసేందుకు దిగిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తూ మునిగి మృత్యువాత పడిన విషాద ఘటన కొత్తపల్లి మండలం యండపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. వాకతిప్ప జడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న కొప్పిశెట్టి మోషే (15), పంపన దుర్గ్భాను (15) యండపల్లిలో ప్రైవేటుకు వెళ్లారు. అయితే సోమవారం ప్రైవేటు లేకపోవడంతో సాయంత్రం ఇళ్లకు బయలుదేరారు. వీరితోపాటు మరో ఇద్దరు విద్యార్థులు కూడా ఉన్నారు. మార్గమధ్యలో యండపల్లి కాలువలో విద్యార్థులకు కలువ పువ్వులు కన్పించాయి. కలువ పవ్వులు కోసుకుని స్నానం చేయాలని విద్యార్థులు భావించారు. కాలువలోకి దుర్గ్భాను, మోషే కాలువలోకి దిగి స్నానం చేయబోయారు. కాలువ మధ్యలో ఊబిలో ఆ ఇరువురూ చిక్కుకుపోయారు. తోటి విద్యార్థులు అరుపులు విని స్థానికుల సాయంతో రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే వారు ప్రాణాలు విడిచారు. ఈ ఘటనతో వాకతిప్ప గ్రామం విషాదంలో మునిగిపోయింది. ప్రైవేటుకు వెళ్లిన విద్యార్థుల రాకకోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు కుమారుల మరణ వార్త విని తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు వర్ణనాతీతం. ఈ ఘటనపై కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
అన్నవరం దేవస్ధానంపై వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
శంఖవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్ధానం రత్నగిరిపై కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రత్నగిరిపై గల కళామందిరంలో కృష్ణాష్టమి పర్వదినమును పురష్కరించుకుని ప్రత్యేకంగా అలంకరించిన సింహాసనంపై వేద పండితుల వేదమంత్రోచ్ఛారణలతో స్వామి, అమ్మవార్లను ఆశీనులు గావించి, ప్రత్యేక పూజలు గావించారు. అనంతరం కళామందిరం ఆవరణలో గోవులను సుంధరంగా అలంకరించగా, దేవస్ధానం ఛైర్మన్ ఐవి రోహిత్, ఇన్‌ఛార్జ్ ఇఓ ఇవి జగన్నాధరావులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు గోవులను పూజించి తరించారు.
పోలీసు అర్బన్ జిల్లా పరిధిలో ఎల్‌హెచ్‌ఎంఎస్ సేవలు
రాజమహేంద్రవరం: లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ( ఎల్‌హెచ్ ఎం ఎస్) సేవలకు సర్వం సన్నద్ధం చేశామని రాజమహేంద్రవరం పోలీసు అర్బన్ జిల్లా ఎస్పీ బి రాజకుమారి చెప్పారు. రాజమహేంద్రవరం పోలీసు గెస్ట్‌హౌస్‌లో సోమవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఇంటికి తాళం వేసి రెండు మూడు రోజుల పాటు బయటకు వెళ్లే వారికి ఎల్‌హెచ్‌ఎంఎస్ ద్వారా పూర్తి భద్రతా, బాధ్యతను తాము తీసుకుంటామన్నారు. ఈ సేవలు పొందడం కోసం ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఎల్‌హెచ్‌ఎంఎస్ పోలీసు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉందన్నారు. అంతేకాకుండా రెండు మూడు రోజుల పాటు ఊరెళ్లేవారు పోలీసు స్టేషన్‌కు విజ్ఞాపన పంపితే ఇంటిలోపల రహస్య కెమెరాను ఏర్పాటు చేస్తారన్నారు. ఇంటిలో ఎటువంటి కదలికలు ఉన్నా వాటిని కెమెరాలో సెన్సార్‌లు గ్రహించి పోలీసు కంట్రోల్ రూమ్‌కు బజర్ శబ్ధం వినిపిస్తుందన్నారు. దీని వల్ల వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని నేరాన్ని అడ్డుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఈ మేరకు అర్బన్ జిల్లాకు 50 కెమెరాలు అందాయన్నారు. అపార్టుమెంటుదారులు ఒకటి, రెండు కెమెరాలు సొంతంగా ఏర్పాటు చేసుకుని, ఎవరైనా బయటకు వెళ్లేటపుడు పోలీసులకు సమాచారాన్ని అందిస్తే వారి ఇంట్లో కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతుందని ఎస్పీ రాజకుమారి వివరించారు. ఈ సేవలు గురించి ప్రజలకు తెలిసేలా ప్రచారాన్ని చేస్తున్నామన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఆర్ గంగాధర్, డిఎస్పీ అల్లు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పురుషోత్తపట్నంతో ఏలేరు రైతుల కష్టాలు దూరం
*పిఠాపురం ఎమ్మెల్యే వర్మ
పిఠాపురం:ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఏలేరు రైతుల కష్టాలు తీరనున్నాయని పిఠాపురం ఎమ్మెల్యే వర్మ తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, నీటిసంఘాల అధ్యక్షులతో సోమవారం సమావేశమైన ఆయన మంగళవారం జరగనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలని కోరారు. విపక్షంలో ఉండగా పాదయాత్ర సందర్భంగా ఏలేరు శివారు రైతుల కష్టాలను చంద్రబాబు స్వయంగా తెలుసుకున్నారని, ఏలేరు ఆధునికీకరణకు లక్ష సంతకాల సేకరణలో చివరి సంతకంచేసిన ఆయన రైతుల కష్టాలకు ఇప్పుడు అడ్డుకట్ట వేశారన్నారు. రూ.1638 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం ద్వారా ఏలేరు పరిధిలోని 60వేల ఎకరాల ఆయకట్టుకు పూర్తిగా సాగునీరు అందుతుందన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని, ఎంతోమంది పాలకులు హామీలిచ్చినా నెరవేర్చే నాథుడు లేకపోయాడన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా నెరవేర్చిందన్నారు. అందులో ఒకటే ఏలేరు-గోదావరి అనుసంధానమన్నారు. సాగునీటి కోసం పిఠాపురం, గొల్లప్రోలు మండలాలకు సంబంధించిన రైతులు నిరంతరం ఇబ్బందులు పడేవారని, ఇకపై ఆ ఇబ్బందులు ఉండబోవన్నారు. ఏలేరు కాలువల ఆధునికీకరణ కూడా పూర్తిగా జరుగుతుందని తద్వారా గొల్లప్రోలు మండలం శివారు ఆయకట్టు వరకు పూర్తిగా నీరందుతుందన్నారు. ఇంత పెద్దఎత్తున నిధులు వెచ్చించి, పురుషోత్తపట్నం సకాలంలో విజయవంతం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు పిఠాపురం నియోజకవర్గంలోని ప్రతీ రైతూ రుణపడివుంటారన్నారు. కేవలం ఏడు నెలల్లో ఈ ప్రాజెక్టును సాకారం చేసేందుకు కృషిచేసిన జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు, ఆ శాఖ అధికార్లకు పిఠాపురం నియోజకవర్గం రైతుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని వర్మ పేర్కొన్నారు.

ఆయన చిత్రాలు సంస్కృతికి నిదర్శనాలు
దర్శకుడు కె విశ్వనాథ్‌కు స్వర్ణకంకణం బహూకరణ
కాకినాడ: కశాతపస్వి కాశీనాధుని విశ్వనాధ్ దర్శకత్వం వహించిన చిత్రాలు సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శమని పలువురు వ్యాఖ్యానించారు. సోమవారం కాకినాడ నగరంలోని సూర్యకళామందిరంలో సరస్వతి సమన్వయ సమితి ఆధ్వర్యంలో కె విశ్వనాధ్‌కు స్వర్ణకంకణాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమానికి ముందుగా డాక్టర్ ఎస్‌వి రామారావు రూపొందించిన వందేళ్ళ సినిమా వైభవం లఘు చిత్రాన్ని ఆవిష్కరించగా సభను బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా చాగంటితో పాటు సభ నిర్వాహకులు చాడ శంకరప్రసాద్, యంగ్మెన్స్ హ్యేపీక్లబ్ అధ్యక్షుడు దంటు సూర్యారావులు మాట్లాడుతూ కళ మనిషిలో సంస్కృతిని పెంపొందిస్తుందన్నారు. సంస్కృతిని అద్దంపట్టే చిత్రాలు తీసి ప్రేక్షకుల మదిలో మరువలేని స్థానాలను ఆయన సొంతం చేసుకున్నారన్నారు. ఈ సందర్భంగా కళాతపస్వి విశ్వనాధ్ మాట్లాడుతూ సంగీత ప్రేక్షకుల ఆదరణతో తాను ఎన్నో విజయవంతమైన చిత్రాలను తీశానన్నారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించి స్వర్ణకంకణాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో కెవిఎస్ ఆంజనేయమూర్తి, మృత్యంజయరావు, బాదం మాధవరావు, వేదుల శిరీషా, పెద్దాడ సూర్యకుమారి, టిక్కూ, ఎల్ శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దిష్టిబొమ్మ దహనం
ఏలేశ్వరం: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక బాలాజీ చౌక్ వద్ద దగ్ధం చేశారు. ఈ సందర్భంగా లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల గోరఖ్‌పూర్ బాబా రాఘవ్‌దాస్ కార్పొరేట్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కారణంగా వారం రోజుల్లో 60 మంది చిన్నారులు మృతి చెందారన్నారు. ఆ వైద్య కళాశాల ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని, చిన్నారుల మరణానికి కారణమైన వారిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎం ధనబాబు, కందుల ప్రసాద్, పిల్లా కాంతం, గమ్మడి పాదాలమ్మ, కందుల వరలక్ష్మి, గండేటి నాగమణి తదితరులు పాల్గొన్నారు.