కడప

విజృంభిస్తున్న జ్వరాలు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: జిల్లాలో గ్రామీణ మంచినీటి సరఫరా, పారిశుద్ద్యశాఖచే సరఫరా అవుతున్న మంచినీరు కలుషితమై విషజ్వరాలతోపాటు ప్రాణాంతకమైన డెంగ్యూ, చికున్‌గున్యా, టైఫాయిడ్, మలేరియా జ్వరాలు, కామెర్లు ప్రబలి వందలాది మంది మంచానపడ్డారు. ఈ మధ్యకాలంలో తొలకరి జల్లులు, మోస్తరు వర్షాలతో వాతావరణంలో భారీ ఎత్తునమార్పులు చోటుచేసుకున్నాయి. రక్షిత మంచినీటి పథకాలు, బహుళగ్రామపథకాలు, ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా, ట్యాంకర్లను శుభ్రం చేయడం కానీ మంచినీటిని క్లోరినేషన్ చేయడం కానీ చివరకు బ్లీచింగ్ పౌడర్ వాడకుండా, సంపులు శుభ్రం చేయని కారణంగా జిల్లాలో డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, విషజ్వరాలు శరవేగంతో వ్యాప్తి చెందుతున్నాయి. ముఖ్యంగా గ్రామాలతోపాటు వివిధ మార్గాల ద్వారా నీటి సరఫరా అవుతున్న పైపులైన్లు, రక్షిత నీటి పథకాల వద్ద పారిశుద్ధ్యం పడకేసింది. ఎగుడుదిగుడు రోడ్లు కారణంగా డ్రైనేజి నీరు, వర్షంనీరు కలిసి తాగునీటి పైపుల్లో చేరి కలుషితవౌతోంది. జిల్లా వ్యాప్తంగా 4451 గ్రామాలు, ఈ గ్రామాల్లో 11148 నీటి పంపులు, 5043 రక్షిత మంచినీటి పథకాలు, 25 బహుళ గ్రామపథకాల ద్వారా నీటి సరఫరా అవుతున్నాయి. ఇక నీటి వనరులు లేని ప్రాంతాల్లో వ్యవసాయ బోర్ల ద్వారా, ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 24 మండలాల్లో ట్యాంకర్ల ద్వారా, 19 మండలాల్లో వ్యవసాయ బోర్ల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్లు, వ్యవసాయ బోర్ల నుంచి సరఫరాచేసే నీటికి టిప్పులకు ఇంతని ప్రభుత్వం ఖర్చు చేస్తుంటే, నీటి వ్యాపారులు ఇదే అదునుగా భావించి ఎక్కడపడితే అక్కడ నీరును తీసుకొచ్చి ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ఆ నీరు అపరిశుభ్రంగా ఉండటం, ట్యాంకర్లను, వ్యవసాయ బావులను ఒక మారు పరిశీలిస్తే ట్యాంకర్లలో చిలుము, పాచి పట్టడంలో వ్యవసాయ బావుల్లో ఎత్తుప్రాంతాల నుంచి వర్షపునీరంతా వ్యవసాయ బావుల్లోకి నీరు చేరుతుంది. గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్యలోపం, సర్పంచ్‌లు, గ్రామకార్యదర్శులు, ఎంపిడివోలు, అంటీ అంటనట్లుగా వ్యవహరించడం, గ్రామపంచాయతీ అధికారుల మధ్య సమన్వయలోపం, గ్రామీణ మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యశాఖ అధికారుల చేతివాటం వెరసి ప్రజలు అంటువ్యాధుల బారినపడుతున్నారు. గ్రామాల్లో నీటి ట్యాంకర్లను, ఏడాది పైబడి కూడా శుభ్రం చేసిన దాఖలాలు లేవు. ప్రతి వేసవిలో నీటి పథకాల మరమ్మతులకు, కొత్తపైపుల ఏర్పాట్లకు ప్రభుత్వం కోట్లాదిరూపాయలు ఖర్చుచేస్తోంది. ఈ ఏడాది కూడా ఇప్పటి వరకు రూ.25కోట్లు పైబడి ఖర్చుచేసినా కలుషిత నీటికి అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి తమ స్వార్థప్రయోజనాలకోసం ధనాపేక్షనే ధ్యేయంగా పెట్టుకుని పనిచేయడం వల్ల జిల్లాలో అంటువ్యాధులు తారాస్థాయికి చేరాయి. ఇక వైద్యులు, వైద్య సిబ్బంది మలేరియా తదితర శాఖలు ముందుచూపులేక ప్రజలను ఆరోగ్యంపై చైతన్యం తీసుకురాకపోవడంపై కూడా వ్యాధులు ప్రజలను వెంటాడుతున్నాయి. ఈ తరుణంలో కలుషిత నీటిని శుభ్రంచేసి ప్రజలను అనారోగ్యంనుంచి కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

స్వాతంత్య్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు..
కడప: 71వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు పురస్కరించుకుని మంగళవారం నగరంలోని పోలీసుపేరేడ్ మైదానంలో నిర్వహించే స్వాతంత్య్రవేడుకలకు ముఖ్య అతిధిగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ టి.బాబూరావునాయుడు, ఎస్పీ అట్టాడ బాబూజీలతోపాటు జిల్లా అన్నిశాఖల అధికారులతో వేడుకలపై చర్చించారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈమారు వేడుకలు నిర్వహించాలని కలెక్టర్ ఒక్కొక్క విభాగాన్ని ఒక్కొ అధికారికి బాధ్యతలు అప్పగించారు. మంగళవారం ఉదయం 9గంటలకు పోలీసుపేరేడ్ మైదానంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేస్తారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించి జిల్లా ప్రగతి పై వేడుకల్లో పాల్గొనే వారికి వివరిస్తారు. అలాగే వివిధ విభాగాల్లో ప్రతిభను చూపిన సంబంధిత శాఖల్లో కలెక్టర్‌కు సమర్పించిన నివేదిక మేరకు సంబంధిత ఉద్యోగులకు, అధికారులకు వారి సేవలు గుర్తించి ప్రశంసాపత్రాలను ఇన్‌చార్జి మంత్రిచే అందజేయనున్నారు. మంత్రి, కలెక్టర్, ఎస్పీలు టాప్‌లేని వాహనంపై పేరేడ్‌మైదానంలో కలియతిరుగుతారు. వివిధ అభివృద్ధి పథకాలపై ప్రదర్శించే శకటాలను పరిశీలిస్తారు. నృత్యాలు, వివిధ రకాల కార్యక్రమాలు కూడా ప్రదర్శించేందుకు కళాకారులు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేకించి మార్చ్ఫాస్ట్‌కు సంబంధించి ఎస్పీ బాబూజీ నేతృత్వంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు స్వాతంత్య్ర సమరయోధులను పిలిపించి వారిని సన్మానించనున్నారు. అన్ని శాఖల జిల్లా ఉన్నతాధికారులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, ఎమ్మెల్సీలు, నాయకులు, అధికారులు, పాల్గొననున్నారు.

మెట్టరైతుకు ఊరట..
ఎర్రగుంట్ల: ఖరీఫ్‌లో వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితిలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధోణి కారణంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో కురిసిన అరకొర వర్షాలకు మెట్టరైతులు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా జిల్లాలోని పులివెందుల, జమ్మలమడుగు, కమలాపురం, రాయచోటి ,బద్వేలు తదితర నియోజకవర్గాల పరిధిలోని మెట్ట రైతాంగం ఈ ఏడాది ఖరీఫ్‌లో వేరుశెనగ, పత్తి సాగు చేశారు. రైతులు ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి జూన్ ఆఖరున, జూలై మొదటివారంలో కురిసిన ఒక మోస్తరు వర్షానికి పంటలను సాగుచేశారు. చాలా మండలాల్లో ఈ ఏడాది వేరుశెనగ పంటపై మెట్టరైతులు ఆశలు పెట్టుకున్నారు. అయితే సకాలంలో వర్షాలు పడకపోవడంతో వర్షాభావ పరిస్థితుల కారణంగా వేసిన పంటలు ఎండిపోయేస్థితికి ఏర్పడింది. రుతుపవనాల జాడ కూడా కన్పించకపోవడంతో ఈ ఏడాది పంట చేతికొచ్చే పరిస్థితులు లేవన్న నిరాశతో మెట్టరైతు దిగాలు పడ్డాడు. గత మూడు సంవత్సరాలుగా వరుస కరవులతో అల్లాడిపోతున్న మెట్టరైతు ఈ ఏడాది కూడా పంటలు కళ్లముందే ఎండుముఖం పట్టడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డాడు. అయితే గత నాలుగైదు రోజులుగా అక్కడక్కడ కురిసిన ఒక మోస్తరు వర్షాల కారణంగా ఎండిపోతున్న వేరుశెనగ, పత్తిలాంటి పంటలకు ప్రాణం వచ్చిందని చెప్పవచ్చు. దీంతో కనీసం వేసిన పంటలైనా దక్కుతాయన్న ఆశ రైతుల్లో చిగురించింది. అయితే రాబోయే మరో పది 15రోజుల్లో వర్షం పడితే తప్ప పంట చేతికొచ్చే పరిస్థితి కన్పించలేదు. కానీ ఇప్పటికిప్పుడు మాత్రం ఎండిపోతున్న పంట అరకొర వర్షాల కారణంగా చిగురించడంతో మెట్టరైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కేవలం కొన్నిప్రాంతాల్లో మాత్రం వేరుశెనగ, పత్తి లాంటి పంటలు సాగుబడి జరిగింది. మిగతా ప్రాంతాల్లో విత్తనం కూడా పడని భూములు వేలాది ఎకరాల్లో దర్శనమిస్తున్నాయి. విత్తనం కూడా పడని భూముల్లో కూడా అరకొర వర్షాలకు ఏదో ఒక ప్రత్యామ్నాయ పంట వేసేందుకు రైతులు సిద్దపడుతున్నారు. ముఖ్యంగా ప్రొద్దుతిరుగుడు, కంది, జొన్న, శెనగ, దనియాలు తదితర ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు చాలా ప్రాంతాల్లో మెట్టరైతులు తగు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే వేలాది రూపాయలు ఖర్చుచేసి విత్తనం కోసం ఎదురుచూసిన రైతులకు ఖరీఫ్‌పై ఆశలు వదులుకున్నాడు. అప్పు సప్పుచేసి సిద్ధం చేసుకున్న పొలాలను తిరిగి భూమిని సాగు చేసుకునేందుకు ఖర్చుకోసం వెనుకాడుతున్నారు. అయితే పంటలుసాగుచేస్తే తప్ప రైతుకు అప్పు దొరికే పరిస్థితులు కన్పించకపోవడంతో ఏదో ఒక పంటను విత్తనం వేసేందుకు రైతులు సిద్దపడుతున్నారు. వరుస కరవులతో అల్లాడుతున్న మెట్టరైతాంగానికి ప్రతి ఏడాది ఇదే పరిస్థితులు దాపురించడం గత నాలుగేళ్లుగా ఎదురౌతూనే ఉంది. రైతులను ఆదుకుంటున్నామని చెప్పుకుంటున్న పాలక పక్షాలు మాత్రం రైతులపట్ల చిత్తశుద్ధితో చేస్తున్న కృషి ఏమీలేదన్న భావన రైతాంగంలో ప్రస్పుటంగా కన్పిస్తోంది. దేశానికి రైతే వెన్నుముక అని చెప్పుకుంటున్న పాలకవర్గాలు రైతాంగ పరిస్థితిని అర్థంచేసుకుని తగు సహాయ సహకారాలు అందిస్తే తప్ప రైతుల ఆత్మహత్యలు నిలిచే పరిస్థితులు కన్పించడం లేదు. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

71 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ

నందలూరు: దేశంలోని ప్రతి ఒకరిలో దేశభక్తిని పెంపొందించేందుకు కృషిచేయాలని సమాజ సేవసమితి రాష్ట్ర అధ్యక్షులు వాండ్రాసి పెంచలయ్య అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక గొబ్బిళ్ల మెమోరియల్ హైస్కూల్ విద్యార్థులచే 71 అడుగుల జాతీయ జెండాతో రైల్వేకేంద్రం నుండి బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ జెండాలను నిషేధించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలవద్ద ప్లాస్టిక్ జాతీయ జెండాను వినియోగించడం నిషేధించాలన్నారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన జాతీయ జెండాను వినియోగించడంలో చైతన్యం తీసుకు రావాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ జెండాలు నిషేధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిఎస్‌ఎం హైస్కూల్ ప్రిన్సిపాల్ గొబ్బిళ్ల సుజాతమ్మ, సమితి సభ్యులు జ్యోతి పెంచలయ్య, నాగరాజు, ప్రవీణ్, శివ, నరేష్, సతీష్, సుబ్బరాయుడు, పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తల్లిదండ్రుల చెంతకు బాలిక..

పోరుమామిళ్ల: దాదాపు 18 గంటల పాటు ఒక గ్రామం నిద్ర తిండిలేకుండా చిన్నారి పాపకోసం అడవుల్లో ఆదివారం సాయంత్రం నుంచి పోలీసులు, గ్రామప్రజలు , తల్లిదండ్రులు జల్లెడవేసి వెతుకుతుండగా సోమవారం ఎట్టకేలకు పాపను సురక్షితంగా మైదుకూరు డిఎస్పీ శ్రీనివాసులు, పోరుమామిళ్ల ఎస్‌ఐ పెద్ద ఓబన్నలు తల్లిదండ్రులకు అప్పచెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి...మండలంలోని ముసల్‌రెడ్డిపల్లెకు చెందిన కృష్ణారెడ్డి కుమార్తె ఏడుసంవత్సరాలు హరిత ఆదివారం సాయంత్రం అదృశ్యమైంది. ముసల్‌రెడ్డిపల్లె గ్రామసమీపంలో బోరువేసేందుకు పూజలు తల్లిదండ్రులు నిర్వహిస్తుండగా ఆ సమయంలో అక్కడే తోటి పిల్లలతో ఆట్లాడుకుంటున్న హరిత ఉన్నట్లుండి కన్పించకుండా పోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. గ్రామంలో బంధువులు, స్నేహితులను విచారించినా ఫలితం లేకపోవడంతో ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదుచేసుకుని మైదుకూరు డిఎస్పీ శ్రీనివాసులు, ఎస్సై, సిబ్బందితో గ్రామప్రజలు, తల్లిదండ్రులు అటవీప్రాంతాన్ని జల్లెడపట్టి సోమవారం ఉదయం 10గంటలకు ఎట్టకేలకు చిన్నారి హరితను ఆటవీప్రాంతంలో జాడను కనుగొని తల్లిదండ్రులకు అప్పచెప్పారు. కాగా పాప ఒక్కటే అడవిలో ఉండి భయంతో ఏడుస్తూ సొమ్మసిల్లిపోయింది. పోలీసులకు గ్రామస్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

పట్టపగలు చోరీ..

చక్రాయపేట: మండలంలోని సురభి పంచాయతీ పాయలోపల్లెలో సోమవారం పట్టపగలే రూ.16 వేలు రామమోహన్ ఇంటిలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు బాధితుడు పల్లా రామ్మోహన్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం బాధితుడు రాయచోటికి వెళ్లిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పాయలోపల్లెలో వారు ఎక్కడికి వెళ్లారని పక్కింటివారిని అడిగి ఒకరు లోపల ఉండి ఒకరు కాపలా కాయడంతో అప్పట్లోనే పల్లా రామమోహన్ సోదరుడు సమీపంలోకి రావడంతో ఆ గ్రామస్థులు మీరు వారిని అడిగారు కదా అతని తమ్ముడు వస్తున్నాడని చెప్పడంతో పల్లా రామమోహన్ ఇంట్లో చేరిన వ్యక్తిని బయటికి రప్పించుకొని స్కూటర్‌పైన పరారయ్యారు. అప్పటికే బీరువాలో ఒకపక్క వాకిలి తెరిచి రూ.16 వేలు నగదు చోరీకి గురికాక పక్క డోరులో ఉన్న 30 తులాల బంగారు సేఫ్ సైడ్ ఉందని బాధితులు తెలిపారు. వెంటనే చక్రాయపేట ఎస్‌ఐ గోవిందరెడ్డికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఎస్‌ఐతో పాటు వారి సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి విచారించారు. అప్పటికి వారు రూ.16 వేలు నగదు మాత్రం పోయిందని, చెప్పారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మళ్లీ పెరిగిన టమోట, ఉల్లి ధరలు
కమలాపురం: తగ్గినట్టే తగ్గి మళ్లీ ఆకాశానంటిన కూరగాయల ధరలతో వినియోగదారులు విసిగిపోతున్నారు. పక్షం నాళ్ల క్రితం కిలో రూ. 90 పలికిన టమోట ధర గత వారం కిలో రు.30లకు తగ్గిపోవడంతో సంతోషపడిన మహిళలు మళ్లీ ఆదివారం కిలో ధర రు.70లకు పలకడంతో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం టమోటధరను రైతుబజార్‌లో బహిరంగమార్కెట్‌లో దళారుల నుంచి నియంత్రించడంలో విఫలం కావడంతోనే ధరలు ఆకాశానంటుకున్నాయని మండిపడుతున్నారు. టమోటతో పాటు అన్ని వంటలకు ఉపయోగించే యర్రగడ్డల ధరను సన్నటిరకం కిలోరు.32లు,పెద్దవి కిలోధర రు.42లు పలుకుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వీటి ధరలను కూడా నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.స్టాకు ఉన్నప్పటికి దుకాణదారులు యర్రగడ్డల ధర మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం ఉండడంతో వాటిని దాచివేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గత రెండేళ్ల క్రితం ఏర్పడిన యర్రగడ్డల కొరత తిరిగి పునరావృతమవుతోందని మండి పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం యర్రగడ్డలు విరివిగా లభించేలా చౌకధరకు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

19న గండికి రానున్న మాజీ మిస్ ఇండియా
చక్రాయపేట: జిల్లాలో ప్రసిద్ధిచెందిన శ్రీ గండి వీరాంజనేయస్వామి సన్నిధికి నాల్గో శ్రావణ శనివారం పురష్కరించుకుని ఈనెల 19వ తేదీన 2016లో మిస్ ఇండియాగా గుర్తించబడిన రేష్మియాఠాగూర్ గండి క్షేత్రానికి రానున్నట్లు పాలకమండలి దృష్టికి ఫోన్ ద్వారా సమాచారం అందినట్లు తెలిపారు. ఈమె 2016లో ఇండియాలోనే అందాల రాశిగా గుర్తింపు పొందిందని, ఈమెకు ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉన్నాయని, వాటిలో భాగంగా ఈమె శ్రావణ మాసాన్ని పురష్కరించుకుని నాల్గో శ్రావణ శనివారంగా గండి క్షేత్రానికి వచ్చి ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నట్లు వారు తెలిపారు.

నంద్యాల ఎన్నికల ఫలితంపై జోరుగా బెట్టింగ్.!
కడప: నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలపై జిల్లాలో పోటాపోటీగా రూ.కోట్లలో బెట్టింగ్‌లు కడుతున్నారు. జిల్లాలో ప్రతి ఎన్నికల్లో జూదంలాగా రాజకీయ పందేలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం త్వరలో జరిగే నంద్యాల శాసనసభ ఉపఎన్నికల ఫలితాలపై అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి నేతలు ఊరువాడా కాలు దువ్వుతూ పందేలు కాస్తున్నారు. కొంతమంది ఫలితాల ఓటమి గెలుపుపై మరికొంతమంది మెజార్టీపై పందేలు కాస్తున్నారు. క్రికెట్ బుక్కీల తరహాలో ఒక మధ్యవర్తిని పెట్టుకుని ఇరుపార్టీలకు చెందిన నేతలు పూర్తిస్థాయిలో పందెం నగదును ముట్టచెబుతున్నారు. ఓటమి గెలుపుకంటే మెజార్టీ ఓట్లపైనే అధిక మొత్తాల్లో పందేలు కాస్తున్నారు. జిల్లాలో టీ అంగళ్లవద్ద, హోటళ్ల వద్ద, గ్రామాల్లో రచ్చబండ వద్ద నంద్యాల ఉప ఎన్నికలపై జోరుగా చర్చించుకుంటూ పత్రికల్లో ప్రచారాల ఫోటోలు చూసి మరీ రెచ్చిపోయి పందేలు కాస్తున్నారు. ఇరుపార్టీలకు చెందిన జిల్లానేతలు నంద్యాలలో మకాంవేయడం, వారి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించుకోవడం, పరిస్థితులపై అంచనాలు వేసుకుని పందేలు కాస్తున్నారు. అలాగే స్థానికంగా ఉన్ననేతలు, ఇరుపార్టీలకు చెందిన నేతలు ఒక వర్గం నుంచి మరో వర్గంపై కాలుదువ్వి రెచ్చగొడుతూ పందేలు కాస్తున్నారు. ఇరుపార్టీలకు చెందిన వారు పందెంలో తమది రూ.100లు అయితే ప్రత్యర్థిది రూ.50లు చాలుఅని మరీ రెచ్చగొట్టి పందేలు కాస్తున్నారు. వీరితోపాటు పలువురు వైద్యులు , పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పలువురు పారిశ్రామికవేత్తలు, పలువురు వ్యాపారవేత్తలు, రియల్డర్లు, క్రికెట్‌బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాసేందుకు నంద్యాలకే పరుగులు తీసి కోట్లాదిరూపాయలు పందేలు కాస్తున్నారు. పేకాట, క్రికెట్‌బెట్టింగ్‌ల తరహాలోనే బహిరంగంగా ఈ పందేలు కాస్తున్నారు. పోలీసులు సైతం ఏమీ అంటీ అంటనట్లుగా తమకెందుకనే విధంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లాతో ఇరుపార్టీ పోటీ చేసే నాయకులకు సత్సంబంధాలుండటంతో జిల్లా పొరుగునే నంద్యాల ఉన్నందున జిల్లా నేతలకు ఇంచుమించి ఆ ప్రాంత పార్టీల అభ్యర్థుల బలాబలాలు బాగా తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో జిల్లాలో ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ కట్టే తరహాలోనే బెట్టింగ్‌లు కడుతున్నారు. అక్కడ ప్రచారం నరాలు తెగే విధంగా ఉండగా ఇక్కడ బెట్టింగ్‌లు కూడా అదే తరహాలో పోటీపోటీగా పందేలు కాస్తున్నారు.

స్వాతంత్య్ర ఉద్యమం సందర్భంగా కడప గడపలో గాంధీజీ అడుగులు..
కడప,(కల్చరల్): రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని భారతదేశం నుంచి పారద్రోలి, దేశస్వాతంత్య్ర సాధనకు, శాంతి, అహింసలను ఆయుధాలుగా చేసుకుని ఉద్యమశంఖాన్ని పూరించిన మహామహితాత్ముడు ‘గాంధీ’జీ. ఆయన నడిపిన సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన, ఉప్పుసత్యాగ్రహం, వ్యక్తి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో కడప జిల్లావాసులు భాగస్వాములయ్యారు. స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకుని అలాంటి మహాత్మాగాంధీజీతో కడప జిల్లాకు వున్న అనుబంధం భావి తరాలు మరువలేనివి. స్వాతంత్య్ర సంగ్రామంలో గాంధీ మహాత్ముడు అనేక పర్యాయాలు కడపను సందర్శించారు. జిల్లా ప్రజలకు ఉద్యమ స్ఫూర్తిని అందించారు. గాం ధీజీ పిలుపునందుకుని స్వాతంత్య్ర ఉద్యమంలోకి దుమికిన వారిలో కడ ప జిల్లాకు చెందిన చందన వెంకోబరా వు, గాజులపల్లి వీరభద్రరావు, దేవిరెడ్డి రామసుబ్బారెడ్డి, ఎన్.రంగారెడ్డి, కడప కోటిరెడ్డి, కె.రంగారెడ్డి, భూపాళం సుబ్బరాయుడు, బి.రామశాస్ర్తీ, ఆర్. సీతారామయ్య, పెనిచల బసిరెడ్డి, వడ్డెమాని చిదానందం, ఎం.వి.నారాయణగుప్త, పి.పార్థసారధి, పి.పట్ట్భారామిరెడ్డి, టి.చంద్రశేఖర్‌రెడ్డి మొదలైన ప్రముఖులు ఎంతోమంది ఉన్నారు. మొట్ట మొదటిసారిగా 1921లో సెప్టెంబర్ నెల 28వ తేదీన గాంధీజి కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అదేరోజు రాజంపేటలోని జౌళివర్తకులు గాంధీజికి సన్మానపత్రం సమర్పిస్తూ విదేశీ వస్త్ర బహిష్కరణకు, స్వదేశీ ఉద్యమానికి వూతం ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆ మరుసటి రోజు కడప పట్టణంలో నూకల వెంకటసుబ్బయ్య, భూతపురి నారాయణస్వామీలు సమర్పించిన ఆహ్వానపత్రంలో నిర్దందితులైన రాజంపేట కుటుంబాల పట్ల సానుభూతిని కోరగా, గాంధీజి అందుకు ప్రతిస్పందించారు. అదేరోజు కడప వైశ్యసంఘం వారి తరుపున రాచూరి సుబ్బరాయుడు, కడప మండల సహోదర బృందం తరపున నూకల వెంకటసుబ్బరాయుడులు సన్మాన పత్రాలను సమర్పించారు. కొందరు కవులు కవితాగానం చేశారు. ఈ సందర్భంగా గాంధీజి మాట్లాడుతూ అహింస, శాంతి ముఖ్యమైనవని, హింసాప్రవృత్తిని విడనాడాలనీ, స్ర్తి, పురుషులందరూ నూలు వడకడం విధిగా చేయాలని ఉద్భోదించారు. తిరిగి 1929లో రాయలసీమ పర్యటనలో భాగంగా కడప జిల్లా లోని వివిధ ప్రాంతాల్లో గాంధీజీ పర్యటించారు. 1929 మే 17వ తేదీన కడప జిల్లాలో ప్రవేశించి కొండాపురం, మంగపట్నం, ముద్దనూరు, చిలమకూరు, నిడుజివ్వి, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరులను ఆయన సందర్శించారు. జమ్మలమడుగు ప్రజలు 216 రూపాయలు విరాళాన్ని కూడా ఆయనకు అందించారు. చిలమకూరు సభలో 940 మంది కార్యకర్తలు పాల్గొని 348 రూపాయలను, నిడుజవ్విలో 500 మంది ప్రజలు పాల్గొని 116 రూపాయలను ఖద్దరు నిధికి సమర్పించారు. గాంధీజి ఎర్రగుంట్లకు చేరుకోగా ప్రజలు ఆయనపై పుష్పవర్షం కురిపించారు. అక్కడే వెంకటరెడ్డి రూ.1,116లు ఖద్దరు నిధికి విరాళంగా ఇచ్చారు.
అదేరోజు రాత్రి ప్రొద్దుటూరు చేరి అక్కడి కన్యకాపరమేశ్వరీ ఆలయాన్ని తన సతీమణి కస్తూరిబా గాంధీతో కలిసి సందర్శించారు. మరుసటి రోజు ఉదయం వసంతపేట మున్సిపల్ హైస్కూల్‌లో జరిగిన సభలో ప్రసంగించారు. తిరిగి 1933లో గాంధీగారిని కడపకు ఆహ్వానించడానికి ఆహ్వానసంఘం ఏర్పడిన సమయంలో కడప నాయకులు కీలకమైన పాత్రను పోషించారు. 1933లో తిరుపతి నుంచి కడపకు గాంధీజి రైలులో వెళ్తుండగా రాజంపేట రైల్వేస్టేషన్‌లో వేలాదిమంది ప్రజలు గాంధీ దర్శనం కోసం చేరారు. రాజంపేట యూనియన్ బోర్డు వారు గాంధీజికి స్టేషన్లో పూలమాలను వేసి స్వాగతపత్రం సమర్పించి హరిజన నిధికి విరాళాన్ని అందజేశారు. యూనియన్ బోర్డు ఉపాధ్యక్షుడు సుబ్బరాయశెట్టి స్వాగత పత్రాన్ని చదివి వినిపించగా దీనికి గాంధీ మహాత్ముడు సమాధానమిస్తూ హరిజన నిధికి విరాళాన్ని ఇచ్చినందులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వేలాది మంది ప్రజలు గాంధీజి జై అన్న నినాదాలు చేశారు. ఆరోజు రాత్రి కడపకుచేరగా వకీలు సంజీవరెడ్డి గాంధీజికి పూలమాలవేసి ఆహ్వానించగా రైల్వేస్టేషన్ నుంచి త్రివర్ణ పతాకాలతో, తోరణాలతో అందంగా అలంకరించిన కారులో విడిదికి చేరారు. 1934 జనవరి ఒకటి, రెండు తేదీల్లో ఉత్తరాలు రాయడంలోనూ, కడపలోని హరిజన ప్రతినిధులతో చర్చలతోనూ గడిపారు. జనవరి 2వ తేదీన సాయంత్రం స్వదేశీ ఎంపోరియంను ప్రారంభించిన సందర్భంలో బారిష్టర్ (లాయర్) కృష్ణస్వామి గాంధీజికి పూలమాలతో సత్కరించారు. ఇలా మహాత్మాగాంధీకి కడప జిల్లాలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహాత్ముడు మరణించి 7 దశాబ్దాలైనా జిల్లావాసుల మదిలో ఆయనతో జిల్లాకున్న అనుబంధం చిరస్మరణీయంగా నిలచిపోయింది.