మంచి మాట

తపస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశం కర్మభూమి, పుణ్యభూమి, తపోభూమి. ఎందరో దేవతలు, ఋషులు, మహనీయులు నడయాడిన పవిత్రమై భూమి. పూర్వకాలంలో రాజులు, ఋషులు, రాక్షసులు కూడా తపస్సు చేసి తమ కోరికలను సిద్ధింపజేసుకునేవారు. ఆయా యుగ ధర్మాలను అనుసరించి తాము అనుకున్నవి సాధించాలంటే అప్పుడు తపస్సు చేయటమే కర్తవ్యంగా ఉండేది. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే భగవంతుని సాక్షాత్కారం కలిగేది. రాజులు సంతానం కోసం ఎక్కువగా తపస్సు చేస్తే ఋషులు లోకకళ్యాణం కోసం, తమ అభీష్టాలను నెరవేర్చుకోవటానికిగాను చేసేవారు. ఇక ఎందరో రాక్షసులు తపస్సు ద్వార బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మెప్పించి తమ స్వార్థ ప్రయోజనాలకోసం వరాలను పొందేవారు. వరగర్వంతో సాధు సజ్జనులను ఋషి పుంగవులను హింసించేవారు. తరువాత వాళ్ళను సంహరించటం కోసం మహావిష్ణువు వివిధ అవతారాలను ఎత్తవలసి వచ్చింది. ఇటువంటి వాళ్ళలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణుడు మొదలైనవాళ్ళు ముఖ్యమైనవారు.
తీవ్రంగా తపస్సు చేయటం వలన దివ్యమైన తేజస్సు ఉత్పన్నమై ఊర్థ్వలోకాలకు వ్యాపించేది. దానివలన స్వర్గలోకాధిపతి ఇంద్రుడు వాళ్ళకి తపోభంగం కలిగించటానికిగాను రంభ మొదలైన అప్సరసలను పంపుతూ ఉండడం మనం పురాణాల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అనిపించుకోవటానికి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు మార్కండేయుడు తన తపోమహిమ వలన చిరంజీవి అయినాడు. ధ్రువుడు అతి చిన్న వయసులోనే తపస్సులో దృఢ చిత్తుడై భగవంతుని కృపకు పాత్రుడై చరిత్రలో స్థిరంగా నిలిచిపోయాడు.
మనం పురాణాలను పరిశీలిస్తే ఇలా ఎందరో మహనీయులు తమ తపస్సువలన ఎన్నిటినో సాధించగలిగారు. అనవసరంగా ఇతరులపై ఆగ్రహిస్తే తాము చేసిన తపస్సు, సంపాదించిన పుణ్యం వృధా అయిపోతుందని భావించేవారు. ఇది ఈ కాలానికి కూడా వర్తిస్తుంది. ఎన్ని పూజలు చేసినా ఆధ్యాత్మిక గ్రంథాలు చదివినా తీర్థయాలు చేసినా, జపాలు చేసినా మనిషి తనలోని కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోనట్లయితే లభించిన కొద్దిపాటి పుణ్యం కూడా తరిగిపోవటమేగాక పాపాన్ని మూటకట్టుకున్నట్లవుతుంది. అందుకే ఇంద్రియ నిగ్రహం అనేది ప్రధానంగా ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యమైనదిగా భావించాలి. హిమాలయాలవంటి పుణ్యభూములలో నేటికీ ఎందరో మహర్షులు తపస్సు చేసుకుంటూ అదృశ్యంగా సంచరిస్తూ ఉంటారని ప్రసిద్ధి. అహింస, శాంతి, క్షమ, త్యాగం మొదలైనవి తపోలక్షణాలు. తపస్సువలన దివ్యశక్తులు సిద్ధిస్తాయి. దైవానుగ్రహం లభిస్తుంది. ఏకాగ్రత అలవడుతుంది. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. మానవ జన్మ ఎత్తినందుకు సార్థకత ఏర్పడుతుంది.
నేటి కాలంలో తపస్సు అంటే ముక్కు మూసుకుని అడవులలో తపస్సు చేయవలసిన అవసరం లేదు. ఏకాగ్రతతో ఏ పని చేసినా అది తపస్సు అవుతుంది. ఎవరు చేయవలసిన పనిని వారు శ్రద్ధతో, అంకితభావంతో చేయటమే తపస్సు. ఒక ఉద్యోగి కార్యాలయంలో తనకు సంబంధించిన పనిని నిజాయితీగా ఎప్పటి పని అప్పుడు చేయగలగాలి. అప్పుడు ఎందరి పనులలో సకాలలో పూర్తిచేసినవారవుతారు. ఒక గృహిణి ఇంటి పనులను అత్యంత నేర్పుతో ఓర్పుతో చేయటమే తపస్సు. దానివలన ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతారు. ఒక విద్యార్థి తన అధ్యయనాన్ని ఏకాగ్రతతో జరిపినట్లయితే ఉత్తమ ఫలితాలను పొందగలుగుతాడు. నృత్యకళాకారులు, చిత్రకారులు, శిల్పులు, రచయితలు ఇలా లిలతకళలకు సంబంధించినవారు తమ తమ పనులలో లీనమైనట్లయితే తమ ప్రతిభతో అందరినీ అలరించగలుగుతారు. అదే వారి తపస్సు అనిపించుకుంటుంది. తపస్సువలన జ్ఞానం, మోక్షం కలుగుతాయి. ఆధ్యాత్మికంగా మనసును లగ్నం చేసి పూజ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా భగవదనుగ్రహం కలిగి తీరుతుంది.
ఎన్నో జన్మల పుణ్యఫలంగా లభించిన ఈ జన్మను నిశ్చలమైన మనసుతో బుద్ధిని భగవదర్పణం చేసి ఆయన నామాన్ని స్మరించి పూజ చేసి పారాయణలు చేసి సఫలీకృతం చేసుకోవాలి. ఇదే తపస్సుగా భావించి తరించే ప్రయత్నం చేయాలి. ముక్తికోరి సాధనలు చేయాలి. అదే మనం చేయవలసిన తపస్సు.

-అబ్బరాజు జయలక్ష్మి