బిజినెస్

వాటా అమ్మాలి.. ఖజానా నిండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేయడానికిగాను ఓ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటవనుంది. ఈ మేరకు బుధవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతోపాటు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పరిపాలన శాఖ మంత్రి ఉంటారు. వీరు ఆయా ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన అంశాలపై వ్యూహాత్మకంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో జరిగిన కేబినెట్ భేటీ అనంతరం విడుదలైన ఓ అధికారిక ప్రకటన స్పష్టం చేసింది. ఏయే సంస్థలో ఎంతెంత వాటాలు అమ్మాలి? ఎప్పుడు విక్రయించాలి? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? అన్న అంశాలపై ఈ కమిటీ ఓ నిర్ధారణకు వస్తుంది. ఆ తర్వాత ఆయా సంస్థలను స్టాక్ మార్కెట్లలోకి తీసుకొస్తారు. అలాగే వాటాల ఉపసంహరణలకున్న అడ్డంకులనూ పరిశీలించి, వాటిని వేగంగా తొలగించే బాధ్యత కూడా ఈ కమిటీదే.
కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లో నాలుగు రక్షణ రంగ సంస్థల్లోనూ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని చూస్తోంది మోదీ సర్కారు. ఒక్కో సంస్థలో 25 శాతం చొప్పున వాటాను అమ్మేయాలనుకుంటోంది. ఆయా సంస్థలను ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్, మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్, మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ సంస్థల్లో 25 శాతం మేర వాటాలను కేంద్రం అమ్మేయనుంది. ఇందుకు అనుగుణంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (దీపమ్) విభాగం రిజిస్ట్రార్ల నుంచి దరఖాస్తులను ఓ ప్రకటన ద్వారా ఆహ్వానించింది. ఆసక్తి ఉన్న రిజిస్ట్రార్లు ఈ నెల 18 (శుక్రవారం)లోగా ఈ దరఖాస్తులను దీపమ్‌కు సమర్పించాల్సి ఉంది.
నిజానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ నాలుగు సంస్థల్లో ప్రభుత్వ వాటాల విక్రయానికి ఈ ఏడాది ఏప్రిల్‌లోనే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అయతే ఇటీవలే వాటాల విక్రయ నిర్వహణ కోసం మర్చంట్ బ్యాంకర్లు, లీగల్ అడ్వైజర్ల నుంచి దరఖాస్తులను దీపమ్ ఆహ్వానించింది. కాగా, మినీరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌ను 1970లో స్థాపించారు. మినీరత్న హోదా కలిగిన మరో ప్రభుత్వ రంగ సంస్థ అయిన మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌ను 1934లో స్థాపించగా, 1960లో ఇది ప్రభుత్వ అధీనంలోకి వచ్చింది. అలాగే గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్‌నూ 1934లో స్థాపించగా, 1960లో ఇది కూడా ప్రభుత్వ అధీనంలోకి వచ్చింది. మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్‌ను 1973లో స్థాపించారు.
2015-16 ఆర్థిక సంవత్సరంలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ పన్ను అనంతర లాభం 563.24 కోట్ల రూపాయలుగా ఉంటే, ఆదాయం 1,652.23 కోట్ల రూపాయలుగా ఉంది. అలాగే గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ పన్ను అనంతర లాభం 160.72 కోట్ల రూపాయలుగా, ఆదాయం 1,064.41 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ పన్ను అనంతర లాభం 637.82 కోట్ల రూపాయలుగా ఉండగా, ఆదాయం 2,846.23 కోట్ల రూపాయలుగా ఉంది. మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ పన్ను అనంతర లాభం 118.03 కోట్ల రూపాయలుగా, ఆదాయం 576.56 కోట్ల రూపాయలుగా ఉంది.
ఈ ఏడాది జనవరి 31 నాటికి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ 125 కోట్ల రూపాయలుగా ఉంటే, పెయిడ్-అప్ ఈక్విటీ క్యాపిటల్ 122.19 కోట్ల రూపాయలుగా ఉంది. అలాగే గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ 125 కోట్ల రూపాయలుగా, పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్ 123.84 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక 2016 మార్చి 31 నాటికి మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ 323.72 కోట్ల రూపాయలుగా, పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్ 249 కోట్ల రూపాయలుగా ఉంది. మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ ఆథరైజ్డ్ క్యాపిటల్ 200 కోట్ల రూపాయలుగా, పెయిడ్-అప్ క్యాపిటల్ 187.34 కోట్ల రూపాయలుగా ఉంది.
ఇదిలావుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 6 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 8,800 కోట్ల రూపాయల నిధులను పొందింది. స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (సూటి) ద్వారా నిర్మాణ రంగ దిగ్గజం ఎల్‌అండ్‌టిలోనూ వాటాను ప్రభుత్వం అమ్మేసింది.
కాగా, 2017-18 వార్షిక బడ్జెట్‌లో నిర్దేశిత 72,500 కోట్ల రూపాయల నిధుల సమీకరణలో 46,500 కోట్ల రూపాయలను మైనారిటీ వాటాల విక్రయం ద్వారా, 15,000 కోట్ల రూపాయలను వ్యూహాత్మక వాటాల అమ్మకం నుంచి, 11,000 కోట్ల రూపాయలను స్టాక్ మార్కెట్లలో ఉన్న ప్రభుత్వ రంగ బీమా సంస్థల నుంచి అందుకోవాలని మోదీ సర్కారు చూస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు పరుగులు పెడుతున్న ఈ తరుణంలోనే వాటాల ఉపసంహరణ లాభదాయకమని కేంద్రం భావిస్తోంది. అందుకు అనుగుణం గానే వడివడిగా నిర్ణయాలు తీసుకుంటోంది.