విశాఖ

రాష్ట్రంలో 10 లక్షల గృహాల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాకవరపాలెం: రాష్ట్రంలో వచ్చే రెండేళ్ళలో పేద ప్రజలకు పది లక్షల పక్కా గృహాలు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. తాళ్ళపాలెం- పెదబొడ్డేపల్లి ఫ్రధాన రోడ్డు వెడల్పు చేసేందుకు ప్రభుత్వం రహదారులు, భవనాల శాఖ ద్వారా 31 కోట్ల నిధులు మంజూరు చేసింది. గురువారం మండలంలోని తామరం జంక్షన్‌లో రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేసారు. ఈసందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ తాళ్ళపాలెం, నర్సీపట్నం రోడ్డు 35 సంవత్సరాల నుండి అభివృద్ధికి ఎంతో ప్రయత్నం చేస్తే నేటికి సాకారం అయ్యిందన్నారు. ఈ రోడ్డు వెడల్పు పనులు పూర్తయితే, నర్సీపట్నం , ఏజన్సీ ప్రాంత ప్రజలకు రవాణా విషయంలో ఎంతో మేలు జరుగుతుందన్నారు . నియోజకవర్గంలో 2,200 పక్కా గృహాలు మంజూరు చేసామని, ఒక్కొక్క లబ్దిదారునికి లక్షా 50 వేల రూపాయలు ప్రభుత్వం ఉచితంగా మంజూరు చేసిందన్నారు. మాకవరపాలెం మండలానికి 992 పక్కా గృహాలు మంజూరు చేసామన్నారు. నీరు - చెట్టు కార్యక్రమంలో నియోజకవర్గంలో 13 కోట్లతో కాలువ లైనింగ్ పనులు చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతగానో సహకరించి నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. మండలంలోని లచ్చన్నపాలెంలో ఏడు కోట్లతో 15 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు భారీ తాగునీటి ప్రాజెక్టును నిర్మించామన్నారు. మరో 10 కోట్లతో గిడుతూరులో 18 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు త్వరలో ప్రాజెక్టు పనులు చేపడతామన్నారు. కాంగ్రెస్ ఫ్రభుత్వ హయాంలో ఇల్లు మంజూరై నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్న గృహాలకు ఒక్కొక్క ఇంటికి తమ అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి 25 వేల రూపాయలు మంజూరు చేసారన్నారు. ఇటీవల మండలంలోని రామన్నపాలెం - వెంకయ్యపాలెం రోడ్డుకు 2.50 కోట్ల , చినరాచపల్లి రోడ్డుకు 45 లక్షలు పంచాయతీరాజ్ మంత్రి లోకేష్ నిధులు మంజూరు చేసారన్నారు. రాష్ట్భ్రావృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం ఆహార్నిశలు కష్టించి పని చేస్తుందన్నారు. పోలవరం నుంచి ఎడమ కాలువ నిర్మాణానికి 2,142 కోట్లు ముఖ్యమంత్రి మంజూరు చేసారన్నారు. దీని వలన జిల్లాలో లిప్ట్ ఇరిగేషన్ ద్వారా తాళ్ళపాలెం సమీపంలో జమ్మాదులపాలెం, చోడవరం, బుచ్చియ్యపేటను కలుపుతూ నర్సీపట్నం , కోటవురట్ల, మాకవరపాలెం మండలాలతో పాటు ఎనిమిది మండలాలకు లక్షా 55 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. చంద్రన్న బీమాలో ప్రతీ ఒక్కరూ చేరాలని మంత్రి సూచించారు. తామరంలో తాగునీటి ట్యాంక్ ద్వారా నీరు సరఫరా చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్.డబ్ల్యు. ఎస్. ఎ. ఇ, పంచాయతీకార్యదర్శిని మంత్రి , కలెక్టర్ ఆదేశించారు. అనంతరం చంద్రన్న బీమా చెక్కులు, ఇళ్ళ మంజూరు పత్రాలను మంత్రి పంపిణీ చేసారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎం.వి. ఎస్.మూర్తి, అనకాపల్లి ఎం.పి. ఎం. శ్రీనివాసరావు, అనకాపల్లి ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రసంగించారు. ఈకార్యక్రమంలో ఆర్ .అండ్.బి. ఎస్. ఇ.మూర్తి, ఎం.పి.పి. చిన్నయ్యమ్మ, జెడ్పిటిసి కుమారి, సర్పంచ్ మాణిక్యం, దేశం పార్టీ మండలాధ్యక్షుడు శేషుకుమార్, ఆర్డీవో సూర్యారావు, పలువురు పాల్గొన్నారు.

ఫిబ్రవరిలో జివిఎంసి ఎన్నికలు
విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జివిఎంసిని 81 వార్డులుగా విభజించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ ప్రారంభానికి ముందు అధికారులు పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి ఉంటుంది. టౌన్ ప్లానింగ్ విభాగం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి, యుద్ధ ప్రాతిపదికన వార్డుల పునర్విభజన డిసెంబర్ నాటికి పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జివిఎంసి పాలకవర్గం 2012 ఫిబ్రవరి 26వ తేదీన రద్దయింది. తిరిగి అదే తేదీనాటికి కొత్త పాలకవర్గం ఎన్నిక జరగచ్చని జివిఎంసి వర్గాలు భావిస్తున్నాయి.
ఆ రెండు ఎన్నికలపైనే దృష్టి
ఇదిలా ఉండగా జివిఎంసి ఎన్నికలు జరపడం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇప్పటికీ ఇష్టం లేదు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను పరిశీలించిన తరువాతే, జివిఎంసి ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తే బాగుంటుందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ముఖ్యంగా కాకినాడలో అధికార పార్టీకి ప్రతికూల ఫలితాలే వస్తే, ప్రభుత్వం జివిఎంసి ఎన్నికలకు వెళ్లేందుకు కాస్త వెనకడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే మరికొంతమంది ఎమ్మెల్యేలైతే, జివిఎంసి ఎన్నికలు జరిపితే, ఎవరి సత్తా ఏంతన్నది తేలిపోతుందని భావిస్తున్నారు. ఏదియేమైనా జివిఎంసి ఎన్నికలు అధికార, ప్రతిపక్షాలకే కాదు, బిజెపికి కూడా చాలా అవసరమే. ఈ ఎన్నికల్లో బలాబలాను తేలితేనే, 2019 ఎన్నికల్లో పొత్తులు, వ్యూహాలకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి
విశాఖపట్నం: ఉల్లి పంట దిగుబడి గణనీయంగా పడిపోవడం, కర్నూలు నుంచి ఉల్లిపాయ రాకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదని హోల్‌సేల్ వర్తకులు చెబుతున్నారు. ఉల్లి పంట పడిపోవడం, మరోపక్క ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఉల్లిపాయ నిలిచిపోవడం, నగరంలో స్టార్‌హోటళ్ళు, భోజనశాలల అవసరాలకు తరలిస్తున్న పరిస్థితులు దీని డిమాండ్‌కు ప్రధానం కారణమని చెప్పాలి.
కృత్రిమ కొరత
రోజురోజుకీ పెరుగుతున్న ఉల్లి ధరకు కృత్రిమ కొరత మరో కారణంగా చెప్పవచ్చు. నగరంలోని హోల్‌సేల్ ఉల్లి మార్కెట్‌గా పేరున్న జ్ఞానాపురం, అల్లిపురం, పూర్ణామార్కెట్ల ద్వారా తరలిపోతున్న ఉల్లిని అక్రమ నిల్వలు చేస్తున్న పరిస్థితులతో దీనికి కొరత ఏర్పడుతుంది. ఉల్లి ధర కొండెక్కడానికి అక్రమ నిల్వలు, మారు అమ్మకాలు కారణాలుగా నిలుస్తున్నాయి.
బెంబేలెత్తిపోతున్న సామాన్యులు
పెరిగిపోతున్న ఉల్లిపాయను కొనాలంటే సామాన్యులు భయపడుతున్నారు. దీని ప్రభావం చేపలు, మాంసం విక్రయాలపై పడుతోంది. వీటిలో ఉల్లి వినియోగం ఎక్కువుగా ఉన్నందున ఈ మధ్యకాలంలో సామాన్యులు వీటికి దూరంగా ఉంటున్నారు. శ్రావణమాసంతో శాఖాహారులు ఉల్లిని కూరల్లో ఉపయోగించకపోయినా దీని ధర మాత్రం తగ్గడంలేదు. చివరకు రైతుబజార్లలో సైతం ఉల్లిపాయ అందుబాటులోకి రావడంలేదు. మెత్తని, కుల్లిన, మట్టిని కలిగి ఉండే ఉల్లిపాయనే కౌంటర్ల ద్వారా అమ్మేస్తున్నారు. కిలో వంద రూపాయల వరకు చేరుకున్న టమాటో ధర కాస్తంత తగ్గుతుందనుకుంటే ఇపుడు ఉల్లిపాయ ధర ఆకాశన్నంటుతోంది.
రూ. 2.17 కోట్లతో గ్రంథాలయాల అభివృద్ధి
జగదాంబ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి రూ.2.17 కోట్ల వెచ్చించినట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ ఇన్‌ఛార్జి, జెసి జి.సృజన నేతృత్వంలో గురువారం జరిగిన జిల్లా గ్రంథాలయ కమీటి సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. గ్రంథాలయాల భవన నిర్మాణాలు, మరమ్మతులు, పుస్తకాలు, ఫర్నిచర్, ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు, అవసరమైన పరిపాలన అనుమతులు పొందేందుకు పౌరగ్రంథాలయ శాఖ సంచాలకులకు వెంటనే ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఉద్యోగుల జీతాలు, పింఛన్ల చెల్లింపు, గ్రంథాలయాల నిర్వహణ, ఇతర ఖర్చులకు గాను రూ.10.95 కోట్లు వెచ్చించేందుకు ఈ కమిటీ ఆమోదం తెలిపింది. మునగపాక గ్రంథాలయానికి అదనపు భవనం, కొయ్యూరు, పెదబయలు, కె.జె.పురం, జి.మాడుగుల, అచ్చుతాపురం, కోటవురట్ల, మునగపాక, అరకువేలి, చింతపల్లి గ్రాంథాలయాలకు నూతన భవనాల నిర్మాణానికి, యలమంచిలి, రోలుగుంట, మాకవరపాలెం గ్రంథాలయ భవనాల మరమ్మతులకు పరిపాలనా అనుమతులు పొందాలని నిర్ణయించారు. జిల్లాలోని 63 శాఖా గ్రంథాలయాలు, 5 గ్రామీణ గ్రంథాలయాల్లో కంటింజెంట్ స్వీపర్లుగా పని చేస్తున్న వారి రెమ్యునరేషన్ పెంచేందుకు తీర్మానించారు.
రూ.47.65 కోట్ల బకాయిలు నెలవారీగా చెల్లించాలి
మహా విశాఖ నగర పాలక సంస్థ జిల్లా గ్రంధాలయానికి చెల్లించాల్సిన పన్ను బకాయిలు రూ.47.65 కోట్లునెల వారీగా చెల్లించాలని జెసి అన్నారు. ప్రతినెలా సెస్ రూపేణా రూ. 20 లక్షలు చెల్లించాలన్నారు. పంచాయతీ శాఖ చెల్లించాల్సిన పన్ను బకాయిలు రెండు కోట్లు కూడి నెల రోజుల గడువు లోగా చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో జివి ఎంసి అదనపు కమీషనర్ వర్మ, వయెజన విద్యాశాఖ ఉప సంచాలకులు కుమార్, జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి పి. ఉదయకుమార్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

దక్షిణాది రాష్ట్రాలపై అధిష్టానం దృష్టి
* కేంద్ర సహకారంతోనే పోలవరం ప్రాజెక్టు
* టిడిపి , బిజెపిల పొత్తు కొనసాగుతుంది
* వైద్య ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్

నర్సీపట్నం: బిజెపి బలోపేతానికి అధిష్టాన వర్గం దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. గురువారం స్థానిక 150 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ దక్షిణాదిలోని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఇప్పటికే పార్టీ బలోపేతమైందన్నారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై అమిత్‌షా ప్రత్యక దృష్టిసారించారన్నారు. దీనిలో భాగంగా ఈనెల 25 నుండి పార్టీ అధినేత అమిత్‌షా ఎ.పి.లో పర్యటిస్తున్నారన్నారు. ఈసందర్భంగా పరిశ్రమలు, విద్యా సంస్థల అధినేతలతో ఆయన సమావేశమవుతారన్నారు. బిజెపి అనుబంధ సంఘాల ప్రతినిధులతో పాటు బూత్ స్థాయి కమిటీల సభ్యులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారన్నారు. బిజెపి సహకారంతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే చంద్రబాబునాయుడు రాష్ట్భ్రావృద్ధికి పాటుపడుతున్నారన్నారు. బిజెపి, టిడిపిల మధ్య సత్ సంబంధాలు ఉన్నాయన్నారు. రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు. టిడిపికి చెందిన ఇద్దరు కేంద్రంలో మంత్రులుగా కొనసాగుతుండగా, బిజెపికి చెందిన ఇద్దరు రాష్ట్ర మంత్రులుగా ఉన్నారన్నారు. భవిష్యత్‌లో కూడా బిజెపి టిడిపికి మిత్ర పక్షంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేసారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే బిజెపికి లాభం చేకూరుతుందన్నారు. మరిన్ని సీట్లు పెరుగుతాయన్నారు. కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు రాజకీయాలకు దూరమైనప్పటికీ ఉప రాష్టప్రతిగా రాష్ట్భ్రావృద్ధికి పాటుపడతారన్నారు. ఈనెల 26న రాష్ట్ర రాజధాని అమరావతిలో వెంకయ్యనాయుడుకి పౌర సన్మానం చేస్తున్నామని మంత్రి కామినేని తెలిపారు. ఏరియా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాసరావుకు స్థానిక బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా మంత్రికి పుష్పగుచ్చం అందజేసారు. అనంతరం మంత్రి స్థానికంగా పార్టీ నాయకులు చేపడుతున్న కార్యక్రమాలు గురించి అడిగి తెలుసుకున్నారు. కామినేనికి స్వాగతం పలికిన వారిలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గాదె శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు కోట్ని రామస్వామినాయుడు, నియోజకవర్గం పార్టీ కన్వీనర్ కాళ్ళ సుబ్బారావు, దళితమోర్చా జిల్లా అధ్యక్షుడు చిందాడ నూకేశ్వరరావు, పట్టణ శాఖ అధ్యక్షుడు అరవింద్‌కుమార్ తదితరలు ఉన్నారు.